Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-15

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

కాలేనాదమఖానేథ భుట్టాన్ జిత్వా సమాగతే।
హాజ్యఖానోకరోద్యాత్రాం లోహోరాద్రౌ నృపాజ్ఞయా॥
(శ్రీవర రాజతరంగిణి, 82)

‘భౌట్ట’ రాజ్యాన్ని గెలిచి కొద్దికాలానికి ఆదమ్‍ఖాన్ కశ్మీరు తిరిగి  వచ్చాడు. అతను కశ్మీరుకు తిరిగి రావటం తోటే మహారాజు హాజీఖాన్‌ను ‘లోహారాద్రి’కి యాత్రకు పంపాడు.

అంటే, జైనులాబిదీన్ తన ఇద్దరు కొడుకులను కశ్మీరులో ఉండనివ్వటం లేదన్న మాట. ఒకరు వెనక్కి వస్తూంటే మరొకడిని ఏదో పని మీద కశ్మీరు బయటకు పంపుతున్నాడు.

‘భౌట్ట’ రాజ్యం విషయంలో పలు భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు భట్టరాజ్యం అంటే ‘తిబ్బత్తు’ అని భావిస్తారు. ఫరిష్త అలాగే రాశాడు. కానీ చరిత్ర పరిశోధకులు భౌట్ట రాజ్యాన్ని ప్రస్తుతం ‘బాల్టిస్తాన్’గా గుర్తిస్తున్న భూభాగంగా భావిస్తారు. ప్రాచీన కాలంలో ‘బాల్టిస్తాన్’ను ‘చిన్న తిబ్బత్తు’ అనేవారు. ఏది ఏమైనా ఇద్దరు కొడుకులను కశ్మీరులో ఏక సమయంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జైనులాబిదీన్.

కథం హి చ్చురికా యుగ్మమేక్కుంభుని స్థాప్యతే।
ఇతి జ్ఞాత్వా సుతౌ రాజ్ఞా కారితౌ నిర్గమాగమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 83)

ఒక ఒరలో రెండు కత్తులు ఎలా ఇముడుతాయి? కాబట్టి రాజు ఒకరు వస్తే, మరొకరిని బయటకు పంపాడు. ‘నిర్గమ ఆగమమ్’ చక్కని పదం వాడాడు శ్రీవరుడు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్టే తన ఇద్దరు కొడుకులు కశ్మీరంలో కలసి ఉండటం ప్రమాదకరం అని గ్రహించాడు జైనులాబిదీన్. సుల్తానులకు సోదరుల నడుమ అధికార పోరు ఓ పెద్ద తలనొప్పి. ఎంత గొప్ప రాజయినా ఈ కొడుకుల బెడద నుండి తప్పించుకోలేకపోయేవాడు.

జనకస్త్యాత్మికే స్నానపానలీలోత్సావాదికమ్।
ఆదమ్‍ఖానః సత్రణో విదధేనుదినం తతః॥
(శ్రీవర రాజతరంగిణి, 84)

కశ్మీరు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆదమ్‌ఖాన్ ప్రతి రోజు స్నానం, పానం, ఆటలు అన్నీ తండ్రి సమక్షంలోనే చేసేవాడు.

అంటే, కొడుకును కనుమరుగు కానీయలేదన్న మాట జైనులాబిదీన్. దీనికి ఒక కారణం ఆదమ్‌ఖాన్‌  ఎవరూ దాడి చేసి హాని చేయకుండా చూడటం అయితే, మరో కారణం ఆదమ్‍ఖాన్ తనకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేయకుండా జాగ్రత్త పడటం కూడా.

దృష్టా సతీసరసి యేన సుఖస్థితః సా
భీతః స యద్యపి గతో ఘనకాల దోషాత్।
యావన్న నాశముపయాతి కిరాతి ఘాతౌ
స్తావత్ కథం తదవ ముంచితి రాజహంస॥
(శ్రీవర రాజతరంగిణి, 85)

సతీ సరోవరంలో సుఖంగా ఉన్న హంస, వర్షాకాలంలో కూడా ఆ సరోవరాన్ని వదలదు. కిరాతుడి (వేటగాడి) దెబ్బతో నాశనమయ్యే వరకూ అది ఆ సుఖస్థానాన్ని వదలదు.

భవిష్యత్తును సూచ్యప్రాయంగా చెప్తున్నాడు శ్రీవరుడు. సతీ సరోవరం కశ్మీరు మరో పేరు. ఒకప్పుడు కశ్మీరంతా సతీసరోవరం నీటితో నిండి ఉండేది. ఆ నీటి అడుగున దాగిన జలోద్భవుడనే రాక్షసుడి సంహారం తరువాత, సరోవరం లోని నీటిని వెడలనడపటంతో కశ్మీరు భూమి ఏర్పడింది. ఈ విషయం ‘నీలమత పురాణం’ చెప్తుంది. ఇప్పుడు ఆ సరస్సు లేకున్నా కశ్మీరును ‘సతీసరోవరం’ అని అంటారు. అలాంటి సరోవరంలో సుఖంగా ఉన్న హంస, వేటగాడి బాణంతో చస్తే తప్ప సరోవరాన్ని వదిలి వెళ్ళదు అంటున్నాడు శ్రీవరుడు. హాజీఖాన్ కశ్మీరు వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఆదమ్‌ఖాన్ కశ్మీరును వదిలి వెళ్ళే ప్రసక్తి లేదంటున్నాడు శ్రీవరుడు. వేటకాడు హాజీఖాన్ దెబ్బకొట్టేవరకూ ఆదమ్ ఖాన్ కశ్మీరులోనే సుఖంగా వుంటాడు, అన్నీ మరచి.

అథాష్టావిశ్వవర్షేపి రావత్రలవలాదిభిః।
ఇతీరితోకరోత్ ఖానః కశ్మీరాగమనన స్పష్టమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 86)

28వ సంవత్సరంలో అంటే క్రీ.శ. 1452 సంవత్సరంలో ‘రావత్ర లవల’ ప్రోద్బలంతో ఖాన్ కశ్మీరు తిరిగి రావాలని నిశ్చయించాడు.

రావత్ర లవల లేక ‘రావన్నలవల’ అన్న పేరు శ్రీవరుడి రాజతరంగిణి లోనే కాదు, శుకుడి రాజతరంగిణి లో కూడా వినిపిస్తుంది. ఇది వ్యక్తి పేరా? జాతి పేరా అన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఇది ‘రావత్ర్’ నా, ‘రావత్’ నా అన్న విషయంలో వాదోపవాదాలున్నాయి.

‘రావత్’ అన్నది పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని బ్రాహ్మణుల ఇంటి పేరు. ఈ ‘రావత్’నే శ్రీవరుడు ‘రావత్ర్’ అన్నాడని పలువురి అభిప్రాయం. ‘రావత్’ అన్న పదానికి పలు అర్థాలున్నాయి. సర్దార్, వీరుడు, శూరుడు, సేనాపతి వంటి అర్థాలున్నాయి. రాజపుత్రులలో కూడా ‘రావత్’ అన్న పదం ఉంది.

అయితే, ‘రావత్’ అన్నది పదవిని కూడా సూచించే పదం అని క్షేమేంద్రుడి ప్రయోగం ద్వారా తెలుస్తుంది. ధనుర్విద్యలో నిష్ణాతుడిని కూడా ‘రావత్’ అంటారని కశ్మీరు ప్రాచీన  గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి, శ్రీవరుడు వాడిన ‘రావత్ర్’ పదం సుల్తాన్ కుమారుడు హాజీఖాన్ వద్ద నున్న సేనాపతిని సూచిస్తుందన్న విషయం పలువురి ఆమోదం పొందింది.

ఈ శ్లోకం వల్ల తెలిసేది ఏమిటంటే, సుల్తాన్ కుమారుడిని దేశం బయటకు పంపినా, రాజకుమారుడి వెంట ఉన్నవారు అతడిని ‘తిరుగుబాటు’కే ప్రోత్సహిస్తున్నారన్నది. ఇలా ప్రోత్సహించటంలో మరో కోణాన్ని కశ్మీరు పండితులు సూచిస్తారు.

‘రావత్ర్’ అన్న పదం బ్రాహ్మణుడిని సూచిస్తుంది. హాజీఖాన్ మనసులో రాజ్యాధికారం ఆశను నింపి, సుల్తానుకు వ్యతిరేకంగా అతని మనసులో విషం నింపటం వల్ల తండ్రీకొడుకుల నడుమ, సోదరుల నడుమ రాజ్యాధికారం కోసం పోరాటాన్ని ప్రోత్సహించటం ఓ రకంగా కశ్మీరీ బ్రాహ్మణులు సుల్తానుల నడుమ పోరు పెట్టి అవకాశం లభిస్తే అధికారాన్ని చేపట్టాలన్న ప్రయత్నంలో భాగం అని వీరు వ్యాఖ్యానిస్తారు.

అంటే, కశ్మీరు ఇస్లామీయుల వశం అయినా, తిరిగి, కశ్మీరుపై పట్టు సాధించాలన్న భారతీయుల ప్రయత్నాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయన్న మాట. ప్రత్యక్ష యుద్ధం కుదరని పని. కాబట్టి పరోక్షంగా కలహాలు పెట్టి, సందు దొరికితే అధికారాన్ని సాధించాలన్న దిశలో ఆలోచనలు సాగుతూనే ఉన్నాయన్న మాట.

స్వామింస్త్పదగ్రజీయాస్తే కశ్మీర సుఖ భాగినః।
క్లిష్యామః పరదేశోత్ర వయమేవ గృహోజ్జితాః॥
(శ్రీవర రాజతరంగిణి, 87)

స్వామీ, మీ అగ్రజుడు, అతడి అనుచరులు కశ్మీరులో సకల భోగాలు అనుభవిస్తున్నారు. మీరు, మేము ఇళ్లకు, మనవారందరికీ దూరమై, పరదేశంలో కష్టాలను అనుభవిస్తున్నాము. మనం కష్టాలను అనుభవిస్తున్నాము అన్న దానికన్నా వారు భోగాలను అనుభవిస్తున్నరన్నది ఎక్కువ ప్రభావం చూపించే ఆలోచన.

రాజాన కప్రతీ హర మూర్దేశకుల జాదయః।
అస్మాత్ ప్రతీక్షణః సర్వే తత్ర వీరా బలోద్ధతాః॥
(శ్రీవర రాజతరంగిణి, 88)

రాజానకుడు, ప్రతీహారుడు, మూర్దేశకుడు వంటి శక్తిమంతులయిన వీరులంతా మన కోసం కశ్మీరులో ఎదురు చూస్తున్నారు.

రాజానకుడు అన్నది ఒక పదవి. సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. కాలక్రమేణా ఇది ‘రైనా’గా రూపాంతరం చెందింది. జోనరాజును కూడా ‘రాజానకుడు’ అనేవారు. ‘రాణా’ పదం కూడా రాజానక పదానికి రూపాంతరంగా భావిస్తారు. అంటే, ఒకే పదం అటు బ్రాహ్మణుడిని సూచిస్తోంది, క్షత్రియులను సూచిస్తోంది, రాజపుత్రులకూ వర్తిస్తోంది. భారతీయ సామాజిక పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసేవారు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముక్కు నిడివి, పెదాల వంపు ఆధారంగా జాతులు, ఉపజాతులను  నిర్ణయిస్తే, అనర్థాలు వాటిల్లుతాయి.

ప్రాచీన కాలంలో హిమగిరి పరగణాలలో ‘రాజానక్’ అన్నది జమీందార్లను సూచించే పదం. వారి కులం, జాతితో ప్రమేయం లేకుండా జమీందార్లందరికీ ఈ పదం వాడేవారు. ఇంకా ముందుకు వెళ్తే, ‘రాజు’ స్థాయి లేకున్నా, దాదాపుగా రాజు అంత శక్తివంతుడయిన వాడిని ‘రాజాన్య’ పదంతో సూచించేవారు. పాణిని ‘రాజన్య’ శబ్దం వాడేడు. అమరకోశంలో కూడా ‘రాజన్య’ శబ్దం ఉంది. అలాగే ‘ముల్తాన్’ ప్రాంతంలో, ‘జాగీర్దార్’ లను ‘రాజన్య’ అనే ఆనవాయితీ ఉంది. అయితే, కశ్మీరులో మాత్రం ‘రాజనకుడు’ అన్న పదం ప్రధానంగా బ్రాహ్మణులను సూచించేందుకు వాడతారు.

ప్రతీహారు అంటే ‘ద్వారపాలకులు’ అన్న అర్థం వస్తుంది. కానీ కాలక్రమేణా రాజుకు సన్నిహితుడయ్యే ఉద్యోగిని కశ్మీరులో ప్రతీహారులనటం ఆనవాయితీ అయింది. వీరు రాజుకు సమాచారాన్ని అందించేవారుగా స్థిరపడ్డారు. పండితులు, విజ్ఞులు, అనుభవం కలవారిని ప్రతీహారులుగా ఎంచుకునేవారు. రాజుల దగ్గర మహా ప్రతీహారులుండేవారు.

రాజపుత్రులలో ప్రతీహారులది ఒక గోత్రం. ‘మాలవ’ ప్రాంతంపై ప్రతీహారులు 8వ శతాబ్దంలో రాజ్యం చేశారు. వీరు బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులైన ప్రతీహారులు క్షత్రియ స్త్రీలను వివాహమాడటం వల్ల కాలక్రమేణా ‘ప్రతీహార’ పదం క్షత్రియులను సూచించే పదంగా మారింది. ‘నాగభటుడు’ గొప్ప ప్రతీహార రాజు. గూర్ఝర రాజ్యాన్ని గెలుచుకున్న ‘వత్సరాజు’ ప్రతీహార వంశానికి చెందినవాడు. ప్రతీహర వంశజులలో గొప్ప పేరు సంపాదించిన వాడు ‘భోజరాజు’. మహేంద్రపాలుడు, మహీపాలుడు కూడా ఈ వంశానికి చెందినవారే. ఈ వంశానికి చెందిన చివరి రాజు త్రిలోచనపాలుడు.

మహమ్మద్ ఘోరీ దాడుల వల్ల ప్రతీహారులు చెల్లాచెదరయిపోయారు. మహారాష్ట్రలోని పర్వత ప్రాంతాలకు పారిపోయారు. కొందరు కశ్మీరు వచ్చి చేరారు. కశ్మీరంలో కాలక్రమేణా వీరు ఇస్లాం మతం స్వీకరించారు. వీరిని ముస్లిం చరిత్ర రచయితలు ‘పడర్’లుగా రాశారు. ఇంకా లోతుగా వెళ్తే, కశ్మీరులో లలితాదిత్యుడు 23 ప్రతీహార వర్గాలను ఏర్పాటు చేశాడు. అయితే, అదంతా చర్చిస్తూపోతే, ఒక ఉద్గ్రంథం అవుతుంది. కానీ ఈ చర్చ వల్ల గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రస్తుతం మేధావులు ప్రచారం చేస్తున్నట్టు భారతీయ సమాజం వేదకాలం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు లేకుండా అలాగే లేదు. అలాగే  ఉందనటం అజ్ఞానాన్ని, కుట్రపూరిత ఆలోచనలను సూచిస్తుంది.

‘మార్గేశుడు ’ అన్న పదవి, కశ్మీరులో మార్గాలపై   అధికారాన్ని సూచిస్తుంది. సైనికుల గుడారాలపై అధికారాన్ని సూచిస్తుంది.

వీరంతా తమ కోసం కశ్మీరులో ఎదురు చూస్తూన్నారంటే అర్థం, వీరంతా మన సమర్థకులు, మనల్ని కశ్మీరుకు ఆహ్వానిస్తున్నారని చెప్పటం అన్నమాట. దారులపై అధికారం కలవారు, ద్వారాలపై అధికారం కలవారు, యుద్ధవీరులు అంతా మనం కశ్మీరులో అడుగు పెట్టటం కోసం వేచి ఉన్నారు. వారంతా మన సమర్థకులు అని హాజీఖాన్‍ను కశ్మీరుపై దాడికి సిద్ధం చేస్తున్నారు. సిద్ధపరస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version