Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-16

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యద్యప్య వచనగ్రాహీ భూభుజో నిశ్చితో భవాన్।
తావతైవ స కిం కృద్ధో హన్త్యస్మాన్ కరుణా పరః॥
(శ్రీవర రాజతరంగిణి, 89)

మనం రాజు మాట వినక రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, కోపోద్రిక్తుడైనా  రాజు మనల్ని చంపడు. కరుణతో మనల్ని విడిచి పెడతాడు.

యుద్ధానికి ఖాన్‍ను  ప్రోత్సహిస్తున్న అతని అనుచరులు అన్ని విధాలుగా ఖాన్‍కు నచ్చ చెప్తున్నారు. వారు తిరుగుబాటు చేస్తున్నది తండ్రికి వ్యతిరేకంగా. ఆదమ్ ఖాన్ కశ్మీరంలో ఉండి అన్ని భోగాలు అనుభవిస్తూంటే, తాము తమ వారందరికీ దూరమై జీవించాల్సి వస్తోందన్న బాధతో కశ్మీరుపై.. అంటే స్వంత తండ్రిపై దాడి చేసేందుకు  ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, గెలిస్తే, నిర్మోహమాటంగా సుల్తాన్‌ను ఖైదులోని తోసి సింహాసనం అధిష్ఠిస్తాడు. ఓడితే, ఎంత సుల్తానయినా,  తండ్రి  కాబట్టి, కరుణతో క్షమించి వదివేస్తాడు. కాబట్టి యుద్ధాని కెళ్లటం వల్ల నష్టం లేదన్న మాట.

చరిత్రలో పలు మార్లు జరిగింది ఇదే. తండ్రి మరణం తరువాత రాజ్యం కోసం సోదరులతో పోరాడి, అందరినీ చంపి అధికారానికి వచ్సిన  షాజహాన్ అధికారం కోసం తన సంతానం ఒకరినొకరు చంపుకోవటం చూశాడు. పోరులో గెలిచిన తరువాత ఔరంగజేబు తండ్రిని జైలులో బంధించాడు. ఇలా చెప్తూ పోతే, సోదరులు, తండ్రుల హత్యలతో రక్తసిక్తమైన సుల్తానుల చరిత్రలు ఎడతెగవు. కొడుకులు – తండ్రులూ, సోదరులతో క్రూరంగా వ్యవహరించారు కానీ,  సుల్తానులు మాత్రం తమ సంతానంతో అధిక సందర్భాలలో దయతో వ్యవహరించారు. క్షమాభిక్ష పెట్టి తమ ప్రాణాలకు కొని తెచ్చుకున్నారు. అందుకే, ఖాన్‌కు అతని సహచరులు ఇస్తున్న సలహాలో ఎంతో నిజం ఉన్నది. పోయేదేమీ లేదు. గెలిస్తే రాజ్యం, లేకపోతే, భవిష్యత్తులో రాజ్యం దక్కే అవకాశం ఉంటుంది.

యుద్ధాయాదమఖానశ్చ నిర్యాతః స్వబలాన్వితః।
త్వత్వః స నశ్యతి క్షిప్రం శ్యేనాగ్రాదివపోతకః॥
(శ్రీవర రాజతరంగిణి, 90)

ఆదమ్ ఖాన్ కనుక తన సైన్యంతో మీతో యుద్ధాన్ని వస్తే, గ్రద్దను చూసి  పారిపోయే  పిట్ట పిల్లలా అతడు పారిపోవాల్సి ఉంటుంది.

ఆదమ్ ఖాన్ వీరత్వం గురించి, అతని సైన్యం శక్తి గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయం ఈ వ్యాఖ్య వల్ల తెలుస్తుంది. రాజ్యం కోసం పోరు ఆదమ్ ఖాన్, హాజీఖాన్‍ల నడుమ జరుగుతోంది. ఆదమ్ ఖాన్ బలహీనుడు, భీరువు అని సుల్తాన్‍తో సహా అందరికీ తెలుసు. హాజీఖాన్ క్రూరుడు. అందుకే, హాజీఖాను నుండి ఆదమ్ ఖాన్‍ను రక్షించేందుకు జైనులాబిదీన్, ఆదమ్‍ ఖాన్‌ను తన కళ్ళెదురుగా ఉంచుకున్నాడు. హాజీఖాన్‌ను కశ్మీరు బయటకు పంపించాడు.

అమీ రాజపురీయాద్యాః సర్వే అస్మ చ్ఛుభ కాంక్షిణః।
తత్ తేనైవాధునా యామో న కిం సిద్ధ్యతి సాహసాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 91)

రాజపురిలోని అందరూ మన శుభాన్ని కాంక్షించేవారే. మన సమర్థకులే. కాబట్టి వెంటనే బయలుదేరుదాం. సాహసం వల్ల సాధించలేనిదేముంది? హాజీఖాన్‌ను యుద్ధం వైపు నెడుతున్నారు. సాహసం వల్ల సాధించలేనిదేముంది? అని రెచ్చగొడుతున్నారు. ఇదంతా ఎందుకంటే, సుల్తానుకు ఆదమ్ ఖాన్ అంటే ఇష్టం లేకున్నా, అతని ప్రతిభ పట్ల విశ్వాసం లేకున్నా, పెద్ద కొడుకు అయిన కారణాన అతడిని యవరాజుగా ప్రకటించాడు. అంటే, హాజీఖాన్‌కు రాజ్యం దక్కే వీలు లేదన్నమాట. మామూలుగా రాజ్యం లభించకపోతే, పోరాడి సాధించుకోవాలని బోధిస్తున్నారు. కశ్మీరులో తమ సమర్థకులున్నారు. రాజపురి (రాజౌరి) లోనూ తమ సమర్థకులున్నారు. కాబట్టి ఓడిపోయే వీలు లేదు. ఓడిపోతే సుల్తాన్ క్షమించి వదిలేస్తాడు. మళ్ళీ రాజ్యం కోసం ప్రయత్నించే వీలుంటుంది.

మృతే రిగ ప్రతీహారే వీరాః కే సన్తి తత్పురే।
ఇతి త్వత్పైత్తుకపదం హర్తుం గమ్తు తవోచితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 92)

రిగ ప్రతీహరుడి మరణం తరువాత వారి దళంలో వీరుడన్నవాడు ఎవరున్నారు? మీ తండి రాజ్యం మీకు సంక్రమించాలంటే మీరు పోరాడక తప్పదు. పోరాటంలో గెలిచి సింహాసనం మనది చేసుకుందాం.

‘రిగ’ అనే ప్రతీహర వీరుడుండే వాడు. అతడు మరణించిన తరువాత ఆదమ్ ఖాన్ దళంలో పెద్ద వీరుడెవరూ లేడని అర్థమవుతోంది ఈ మాటల వల్ల. చరిత్ర పరిశోధకులు  ఈ ‘రిగ’ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ, పర్షియన్ రచయితల రచనల్లో ఇతని ప్రస్తావన లేకపోవడంతో, స్థానికంగా కూడా ఈ పేరు ప్రచారంలో లేకపోవటంతో ఆ వీరుడి గురించి ఏమీ తెలియటం లేదు.

శిష్యాస్తేమీ వయం భృత్యా వీరాస్త్వ త్పైత్రుకైః సహ।
యోత్స్యామః కీదృశ్యం శౌర్యమేకదా ద్రష్టు మర్హసి॥
(శ్రీవర రాజతరంగిణి, 93)

మేము వీరులము, మా శిష్యులు, సేవకులు అంతా మీ తండ్రి సైన్యంతో వీరోచితంగా పోరాడుతాము. ఒక్కసారి మా శౌర్య ప్రతాపాల ప్రదర్శనను కూడా దర్శించండి. ‘మీ ముందు మా వీరత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వండి’ అని ప్రార్థిస్తున్నారు. ఆదమ్ ఖాన్‍కు సహాయంగా సుల్తాన్ వస్తే, ఆ సైన్యంతో కూడా పోరాడుతామని చెప్తున్నారు.

యుద్ధానికి వెళ్లి ముందు అన్ని కోణాలలోంచి ఆలోచించాల్సి ఉంటుంది. అన్ని రకాల పరిణామాలను గురించి చర్చించాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఎవరెవరు సహాయంగా వస్తారు, ఎవరెవరితో ఎలా పోరాడాలన్నది కూడా ఊహించి అన్ని పరిణామాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఆదమ్ ఖాన్‍తో యుద్ధం అంటే పరోక్షంగా సుల్తాన్‌తో యుద్ధం. ఆదమ్ ఖాన్ ఓడిపోతున్న పక్షంలో అతడికి అండగా సుల్తాన్ సైన్యం వస్తే, ఆ సైన్యం తోనూ పోరాడటానికి తాము సిద్ధమేనని ధైర్యం చెప్తున్నారు హాజీఖాన్‍కు.

సథేత్యుక్త్వాథ్ ఖానేన పుష్టౌ తన్మన్త్రిణౌ మతమ్।
స ఫిర్యాడామరస్తా జతన్త్రేశ చైత్య వోచతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 94)

“సరే అలాగే కానీ” అన్నాడు ఖాన్. కానీ తన మంత్రులు ‘సఫిర్య డామర’, ‘తజతంత్రీషా’ ల అభిప్రాయాన్ని అడిగాడు. అంటే, చుట్టూ ఉన్న వారు ఎంతగా ఎగదోసినా తొందర పడటం లేదు హాజీఖాన్. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. ముఖ్యంగా మంత్రుల ఆలోచనలను కూడా పరిగణిస్తున్నాడు.

ఈ శ్లోకంలో చరిత్ర పరిశోధకులకు ఆసక్తి కలిగించే రెండు నామవాచకాలను వాడేడు శ్రీవరుడు. సఫిర్యా డామర, తజతంత్రీషా.

డామరుల ప్రస్తావన కశ్మీరులో అధికంగా వస్తుంది. కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు, శుకుడు అంతా తమ రాజతరంగిణిల్లో  డామరులను ప్రస్తావిస్తారు. కల్హణుడి కన్నా ముందున్న క్షేమేంద్రుడు కూడా డామరుల గురించి ప్రస్తావించాడు. వారు సకల ఐశ్వర్యాలు, భోగాలు అనుభవిస్తారని రాశాడు. చరిత్ర రచయితలు డామరులను  ‘డోగ్రే’ అన్న పేరుతో గుర్తిస్తారు. ‘సెయింట్ పీటర్స్ బర్గ్’ నిఘంటువులో ‘డామరు’లను ద్రోహులుగా, యుద్ధానికి సిద్ధంగా ఉండి కయ్యానికి కాలుదువ్వే వారిలా వర్ణించారు. పర్షియన్ చరిత్ర రచయితలు, ఈశాన్య దిశలో ఉండే రాజ్యాలలో ఉంటారు డామరులని అభిప్రాయపడ్డారు. కశ్మీరు దగ్గర ఉండే దేశాధినేతలు డామరులని అల్‍బెరూనీ రాశాడు. అయితే, కశ్మీరు రచయితల గ్రంథాలలో డామరులు ఏ దేశాధినేతలు కారు. వారు భూస్వాములు. భూమిపై అధికారం చలాయించేవారు డామరులు. వారిని సామంతులుగా ప్రస్తావిస్తారు. డామరులు రాజవంశజులను వివాహమాడేవారు. అంటే, చరిత్ర రచయితలు ‘డామరుల’ను ఒక జాతిగా గుర్తిస్తే, రాజతరంగిణిల ప్రకారం కశ్మీరులో భూమి పై అధికారం కలిగిన వారెవరైనా డామరులుగా గుర్తింపు పొందవచ్చు.

భూస్వాములు, ధనవంతులు అవటంతో వారు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యుద్ధ విద్యలు నేర్చారు. వీరులయ్యారు. వీరు యుద్ధంలో మరణిస్తే వీరి భార్యలు ‘సహగమనం’ చేసేవారు.  వీరిని అగ్ర కులంగా పరిగణించేవారు. కశ్మీరులో ఇస్లాం విస్తరించిన తరువాత  ఇస్లాం మతం స్వీకరించారు. రానురాను కశ్మీరులో డామరులెంత శక్తిమంతులయ్యారంటే, కశ్మీరు సింహాసనంపై కూర్చున్న రాజు ఎవరయినా, డామరుల అనుగ్రహం పొందవలసి ఉండేది. వీరు, లావణ్యులు కలసి కశ్మీరుపై నియంత్రణ సాధించారు. అయితే, వీరంతా ఇస్లాం మతం స్వీకరించారు. డామరుల చరిత్రను బట్టి చూస్తే, ఆధునిక మేధావులు ప్రచారం చేసినట్టు, ఇస్లాం స్వీకరించటంలో, అగ్రవర్గాల అణచివేత ఎలాంటి పాత్ర పోషించలేదు. వీరులు, జమీందార్లు, అగ్రవర్ణాల వారు అయిన డామరులంతా ఇస్లాం కరవాల ధారకు తలవంచి ఇస్లాంను స్వీకరించారు. అగ్రవర్ణాల దౌష్ట్యం నుంచి తప్పించుకునేందుకు ఇస్లాం స్వీకరించారన్న వాదన శుష్కమైనదని కశ్మీరు చరిత్ర అడుగడుగునా ప్రదర్శిస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే మతం మారినా వీరు పాత పద్ధతులను అనుసరించటం; ఇస్లాం పద్ధతులకు తమ పాత ధర్మ పద్ధతులను జతపరచటం. విదేశాల నుంచి కశ్మీరు వచ్చిన మత ప్రచారకులు వీరి పద్ధతులను నిరసించి, పాత పద్ధతులను అనుసరిస్తున్న కొత్త ఇస్లామీయుల పట్ల పెద్ద యుద్ధం ప్రకటించారు. ఈ విషయాలన్నీ పర్షియన్ రచయితల రచనల వల్ల తెలుస్తాయి.

తంత్ర అంటే సైనికుడు. సేనకు చెందినవాడు. సైన్యంలో ముఖ్య పదవిలో ఉన్నవాడు అని అర్థాలున్నాయి. శాసనాధికారి, రాజుకు సన్నిహితుడు, వార్తలందించే వాడు అన్న అర్థాలూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో తంత్రపాలుడిని సర్వాధికారిగా గుర్తించారు. ముఖ్య సైన్యాధికారిగా కూడా తంత్రపాలురు వ్యవహరించారు. మహాతంత్రాధ్యక్షుడు, తంత్రపతి, మహాతంత్రాధికారి వంటి  పదవులు కూడా ఉన్నాయి. కల్హణ రాజతరంగిణిలో ‘తంత్రపతి’ అన్న శబ్దాన్ని ‘ధర్మాధికారి’ అన్న పదవికి పర్యాయపదంలా వాడటం కనిపిస్తుంది.

కశ్మీరులో ఇస్లాం వేళ్ళూనుకున్న తరువాత ఈ తంత్రాధ్యక్షులను సుల్తానులు  ముఖ్య న్యాయపతులుగా, రాజకీయ దాన విభాగ ప్రముఖులుగా నియమించారు. ‘తంత్రావయ’ అన్న పదాన్ని ‘జులాషా’ అన్న పదవికి సమానార్థకంగా వాడారు.

రాణీ సుగంధా దేవి కాలంలో ‘తంత్రి’ అన్న పదం తొలిసారిగా వినిపిస్తుంది. ఆ కాలంలో శక్తిమంతులయిన తంత్రులంతా ఒక సమూహంలా ఏర్పాడ్డారు. తరువాత కాలంలో వీరు రాజుకు అంగరక్షకులుగా వ్యవహరించారు. వీరిని రోమన్ సామ్రాజ్యం లోని ‘ప్రేటోరియన్ గార్డ్’లతో పోల్చారు ఇంగ్లీషు చరిత్ర రచయితలు.

తంత్రులలో పలు వర్గాలున్నాయి. కానీ వీరంతా ఇస్లామ్ స్వీకరించిన తరువాత తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. కొన్నాళ్ళు రాజకీయాల్లో వీరులుగా చలామణీ అయ్యారు. కాలక్రమేణా  వీరు ఆధికంగా వ్యవసాయంలో స్థిరపడ్డారు. తమ మూలాలు మరచిపోయారు. ఆంగ్ల చరిత్ర పరిశోధకుడు లారెన్స్ అనే ఆయన తంత్రుల గురించి విశేష పరిశోధన చేశాడు. వీరికి వివాహా విషయాలలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకపోవటంతో ఎవరినయినా వివాహం చేసుకునేవారు. దాంతో కాలక్రమేణా  తంత్రులు తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. అయితే, కొందరు మాత్రం వివాహం విషయంలో, కర్షకుడి తోనే వివాహం కావాలన్న నియమం పాటించారు. అందువల్ల కర్షకులలో అధికులకు తంత్రీ మూలాలున్నాయని భావించే వీలు చిక్కింది. కానీ నిర్ధారణగా చెప్పే వీలు లేదు. అందుకే 16వ శతాబ్దం తరువాత వీరి జాడలు ఇస్లాం సముద్రంలో కలసి అదృశ్యమయిపోయాయి.

డామరులు, తంత్రులతో సహా కశ్మీరు సామాజిక పరిణామ క్రమంలో సంభవిస్తున్న మార్పులను గమనిస్తే భారతదేశ చరిత్రను రచించటం ఎంత కష్టమైన పనో అర్థమవుతుంది. భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్ర చైతన్యవంతమైనది. నిత్య పరిణామశీలి అయినది. ఇది ఏనాడూ నిశ్చలంగా లేదు. ఒక సజీవ నది ఎలాగయితే భౌగోళిక పరిస్థితులను అనుసరిస్తూ తన గమనాన్ని, గతిని మార్చుకుంటుందో, అలాగ భారతదేశ సామాజిక స్రవంతి ప్రయాణించింది. బ్రిటీష్ వారు సంపూర్ణంగా అధికారం సాధించి, భారతీయ సామాజిక పరిణామక్రమాన్ని నిర్దేశించి, ముళ్లకంచెల్లో బంధించిన తరువాత ఈ పరిణామ గతిలోని స్వేచ్ఛ తగ్గింది. నిశ్చలమైన నీటిలో హానికారక క్రిములు ప్రవేశించి అనారోగ్యం కలిగించేట్టు, అనారోగ్యకరమైన ధోరణులు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. దుర్గంధభూయిష్టం చేసి అనారోగ్య ధోరణులకు దారితీశాయి. అయితే, ఇదంతా ప్రత్యేకమైన అధ్యయన విషయం.

రాజతరంగిణి అధ్యయనం అనేక విషయాలపై దృష్టిని ప్రసరింపచేస్తుంది. ఇలాంటి చారిత్రక కావ్యాలు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా సృజించి ఉంటే, అవి లభ్యమయి ఉంటే, భారతీయ సమాజంలో జరిగిన అల్లకల్లోలాలతో పాటు సమాజ ఆవిర్భావ పరిణామ క్రమం తెలిసే వీలుండేది. ఏ రకంగా తమ అస్తిత్వం నిలుపుకునేందుకు, తమ ధర్మాన్నిసజీవంగా భవిష్యత్తు తరాలకు అందించేందుకు, సమాజం పోరాటం జరిపిందో, ఎన్ని సంఘర్షణలను, ఒత్తిళ్ళను, అక్రమాలను, అణచివేతలను ఎదుర్కుంటూ భారతీయ సమాజం తలెత్తుకు నిలబడిందో తెలుసుకునే వీలు లభించేది. ఇప్పటికీ ఈ పోరాటపు ఆనవాళ్ళు లభిస్తున్నా వాటికి చరిత్రలో సరైన ప్రాధాన్యం లభించటం లేదు. అందుకు తిరుగులేని నిదర్శనం  జోనరాజు, శ్రీవరుల రాజతరంగిణులకు ప్రచారం లభించకపోవటం, సరయిన అధ్యయనాలు జరగకపోవటం.

(ఇంకా ఉంది)

Exit mobile version