Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-20

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఆసిన్నవసరే శృత్వా సపుత్రం సహసాగతమ్।
గృహీత్వా స్వబలం తూర్ణ నగరాన్నిరగాన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, 109)

ఇంతలో తన కొడుకు  ససైన్యంగా కశ్మీరు వస్తున్నాడన్న వార్త రాజుకు తెలిసింది. దాంతో ఆయన తన సైన్యంతో శ్రీనగరం నుంచి బయలుదేరాడు.

జైనులాబిదీన్ ఏది వద్దనుకున్నాడో అదే జరుగుతోంది.

సంతానం నడుమ సింహాసనం కోసం పోరు వద్దనుకున్నాడు. కానీ ఆదమ్ ఖాన్, హాజీఖాన్‌ల నడుమ సింహాసనం కోసం వైరం మొదలయింది.

ఆదమ్ ఖాన్ బలహీనుడు కాబట్టి తన దగ్గర ఉంచుకుని, హాజీఖాన్‌ను  కశ్మీరు బయటకు పంపించాడు.

ఆదమ్ ఖాన్‌కు ఎక్కడ సుల్తాన్ సింహాసనం కట్టబెడతాడో అని హాజీఖాన్ సైన్యంతో కశ్మీరు బయలుదేరటంతో హాజీఖాన్, సుల్తాన్ జైనులాబిదీన్ అధికారాన్ని సవాలు చేసినట్టయింది. దాంతో సుల్తాన్‍కు రంగంలో దిగకతప్పలేదు. ఆదమ్ ఖాన్ తరఫున కత్తి పట్టక తప్పటంలేదు.  అంటే, సోదరుల నడుమ పోరు ఇప్పుడు సుల్తాన్‍కూ తిరుగుబాటుదారుకూ నడుమ పోరులా పరిణమించించిందన్న మాట. తండ్రికీ, కొడుకుకూ నడుమ యుధ్ధం రూపు ధరించిందన్న మాట.

గచ్ఛన్ సకటకో రాజా మరణే కృతనిశ్చయః।
స దుఃఖో నిః శ్వసన్ శ్లోకమిమమేకమ పాఠయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 110)

విజయమో వీరస్వర్గమో అనుకున్నాడు సుల్తాన్. మరణం నిశ్చయమనుకున్నాడు సుల్తాన్. దుఃఖంతో, నిశ్వసిస్తూ ఒక శ్లోకం చెప్పాడు.

రాజ్యేపి హి మహత్ కష్టం సంధి విగ్రహ చింతయా।
పుత్రాదపి భయం యత్ర తత్ర సౌఖ్యస్య కా కథ॥
(శ్రీవర రాజతరంగిణి, 111)

యుద్ధము, సంధి అన్న మాటలు సాధారణంగానే భయాందోళనలను, అనిశ్చింత పరిస్థితిని కలిగిస్తాయి. కానీ యుద్ధ భయానికి కారణం పుత్రుడే అయితే, ఇక సుఖ శాంతుల ప్రసక్తే లేదు.

తన సంతానంతో యుద్ధానికి వెళ్తూ జైనులాబిదీన్ ఎంతగా మానసిక వ్యథను అనుభవిస్తున్నాడో ఈ శ్లోకం చెస్తుంది.

జైనులాబిదీన్‍కు సంస్కృతం తెలుసు. ఈ శ్లోకం ఆయనే చెప్పి ఉండవచ్చు. లేదా తన బాధను శ్రీవరడి ముందు వ్యక్తపరిస్తే శ్రీవరుడు ఆ బాధను శ్లోకం రూపంలో రచించి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ శ్లోకం జైనులాబిదీన్ మానసిక వేదనను సృష్టం చేస్తుంది. ఈ కోణంలో చూస్తే అనేక సుల్తానుల కన్నా జైనులాబిదీన్ ఎంతో సున్నిత మనస్కుడిగా కనిపిస్తాడు.

అధర్మ శంకా దూరేస్తూ యుద్ధే జనక పీడయా।
వైధేయాతి విధేయేన యేన స్నేహోపి విస్మృతః॥
(శ్రీవర రాజతరంగిణి, 112)

యుద్ధం వల్ల కలిగే బాధకు అధర్మం అన్న భావన దూరం ఉండాలి. స్నేహాన్ని విస్మరించి మూర్ఖపు పనులు చేస్తున్నారు.

రాజు సైన్యం వెంట తీసుకుని కొడుకుతో యుద్ధానికి బయలుదేరాడు. తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం రాజ ధర్మం. అది శత్రువు నుంచి కావచ్చు, తన స్వంత సంతానం నుంచి కావచ్చు. రాజ్యాన్ని రక్షించుకోవటం రాజు ధర్మం. కానీ కొడుకుపై యుద్ధానికి బయలుదేరటం జైనులాబిదీన్‍ను బాధిస్తున్నది. యుద్ధం ఒక పెద్ద బాధ. దాన్లో తన కొడుకుతోనే యుద్ధం చేయాల్సి రావటం ఇంకా బాధ. ఈ బాధతో యుద్ధానికి వెళ్తున్న రాజును దారికి ఇరువైపులా నిలబడిన ప్రజలు ఓదారుస్తూ అతనిని విజయం కలగాలని కాంక్షిస్తూ అంటున్న మాటలివి.

త్వయి కుర్వతి సామ్రాజ్య యః ఖేదాయ సమాగత్।
స యాతు సఫలః క్షిప్రం త్వద్ద్యీర్యాగ్నిపతంగతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 113)

త్వమేవా కంటకం రాజ్యం క్రియా ధర్మక్రియా భజన్।
వైరిణో విముఖా యాన్తు రణే లబ్ధ పరాభవాః॥
(శ్రీవర రాజతరంగిణి, 114)

మీరు రాజ్యం చేస్తున్న సమయంలో, మీకు దుఃఖం కలిగించేందుకు ఎవరయితే యుద్ధానికి వస్తున్నారో, సేనతో సహా వారు మీ పరాక్రమ శౌర్యాగ్నిలో శలభాల్లా మాడిపోతారు. తండ్రికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తారు. రాజు రాజ్యం చేస్తుండగా, ఆయన తమపై చూపిన ప్రేమను  మరిచి రాజ్యంపై దాడి చేస్తున్నారు. రాజు తిరిగి తన రాజ్యాన్ని శాంతి యుతంగా పాలించాలి. అతని శత్రువులు యుద్ధంలో ఓడి వెనుతిరిగిపోవాలి.

దారి పొడుగునా ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం విన్న జైనులాబిదీన్ మనస్సు ఇంకెంతగా బాధపడి ఉంటుందో గ్రహించవచ్చు. ఎందుకంటే ప్రజలు రాజు పట్ల అభిమానం చూపించటం సంతోషకరమే అయినా, వాళ్ళు దూషిస్తున్నదీ, నాశనం అవ్వాలని ఆకాంక్షిస్తున్నదీ అతని సంతానమే! అదీ బాధ!

శత్రువు పరాయివాడయితే, ప్రజలు అతని నాశనం కోరుకోవటం రాజును సంతోషపరుస్తుంది. ఉత్సాహాన్నిస్తుంది. కానీ వారు నాశనం కోరుతున్నది అతని సంతానం నాశనం అవటం  అన్నది తీవ్రమైన బాధ కలిగిస్తుంది. తను సంతానాన్ని తాను తిట్టుకోవటం వేరు. వేరేవారు దూషిచటం వేరు! అందుకే సుల్తాన్ తన మరణం నిశ్చయం అని అనుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు.

రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం యుద్ధం తప్పదు. కానీ ఈసారి యుద్ధంలో గెలవటం అంటే సంతానం మరణం. ఓడిపోవటం అంటే తన మరణం. అంటే, మనసులో సుల్తానుకు తాను మరణించి, తన కొడుకు జీవించాలన్న ఆకాంక్ష ఉంది. అందుకే తాను మరణిస్తాడని నిశ్చయించుకున్నాడు. కానీ ఓడిపోవాలని చేసే యుద్ధం యుద్ధం కాదు. గెలిస్తే సంతానం ఓడుతుంది. కాబట్టి ఈ సంకటం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. తాను మరణించాలి. ఈ ఆలోచనలకు  ఆవేదనకు తోడు, ప్రజలు తన సంతానాన్ని దూషించటం మరింతగా ఆవేదనను కలిగించి ఉంటుంది.

ఆలోచిస్తే జైనులాబిదీన్ పట్ల  జాలి కలుగుతుంది. కశ్మీరు అల్లకల్లోలమై, మత విద్వేషంతో రగులుతూన్న పరిస్థితులలో రాజ్యానికి వచ్చి పరిస్థితులను చక్కబరిచాడు. కశ్మీరు వదిలిపోయిన పండితులను కశ్మీరుకు రప్పించాడు. రక్షణ కల్పించాడు. పరమత సహనం పాటించాడు. కొత్త కొత్త ఉద్యోగాలు కల్పించాడు. ఈనాడు కశ్మీరు ఏయే ఉత్పత్తులకు, తయారీలకు పేరు పొందిందో అవన్నీ జైనులాబిదీన్ ఏర్పాటు చేసినవే. కళలను ప్రోత్సహించాడు. సాహిత్యానికి ఊపునిచ్చాడు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాడు. కానీ సంతానంతో రాజ్యం కోసం పోరును తప్పించుకోలేకపోయాడు.

గ్రామేశ్విత్యధికాస్తాస్తాః శృణ్యర్దన పదాశిషః।
ప్రాపత్ సకటకో రాజా స సప్రశమనాభిధమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 115)

ఈ రకంగా గ్రామాలలో ప్రజల ఆశీర్వదాలందుకుంటూ రాజు ‘సప్రశమన్’ అనే ప్రాంతం చేరుకున్నాడు. ‘సప్రశమన్” అన్నది ప్రస్తుతం ‘షోపియాన్’ అనే ప్రాంతంలోని ఒక జిల్లా.  ఈ ప్రాంతానికి దగ్గరగా ‘రామవయార్’ నది ప్రవహిస్తుంది. అక్బర్ కాలం నాటికి కూడా ‘సప్రశమన్’ అన్న ప్రాంతం ఉందని తెలుస్తుంది. ‘షోపియాన్’ అన్న పదం ‘సప్రశమన్’ అన్న పదం రూపాంతరం.

అథ మల్లశిలా స్థానౌ పితాపుత్ర బలద్ధయే।
సన్నద్ధే నృపతిర్దూతం విప్రవేకం వ్యసర్జయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 116)

మల్లశిల దగ్గర సుల్తాన్ ఆగాడు. తండ్రి కొడుకులు యుద్ధాని సిద్ధం అయ్యాక అప్పుడు రాజు ఒక విప్రుడిని దూతగా పంపాడు.

కొడుకుతో యుద్ధం తప్పించాలన్న చివరి ప్రయత్నం అన్నమాట. సుల్తాన్ తన కొడుకు దగ్గరకు యుద్ధం తప్పించేందుకు దూతగా ఒక బ్రాహ్మణుడిని పంపాడు. అంటే, ఎంతగా దేశం ఇస్లాం మయం అయినా, పాత పద్ధతులు, సంస్కారాలు దేశాన్ని సంపూర్ణంగా వదలలేదన్న మాట.

ఈ విషయం గమనిస్తే, ప్రస్తుతం సమాజంలో విద్వేషం వెదజల్లుతున్నవారి పట్ల జాలి కలుగుతుంది. రాజు ఇస్లామీయుడు. కానీ బ్రాహ్మణులను గౌరవించాడు. ఆ గౌరవం వారి కులాన్ని బట్టి కాదు, వారి విద్వత్తు ఆధారంగా.

కొడుకును యుద్ధవిముక్తుడిని చేసేందుకు బ్రాహ్మణుడిని పంపాడు. బహుశా, సుల్తాన్ మనస్సులో తన సంతానం తనకు వ్యతిరేకగా పోరు జరపటంలో ‘మతం’ కూడా ఒక పాత్ర పోషిస్తున్నదన్న భావన ఉన్నదని కనిపిస్తుంది..

పర్షియన్ రచయితల రచనలు చదివితే వారు జైనులాబిదీన్‍ను గొప్ప రాజు అని పొగుడుతూనే, ఆయన కాఫిర్ల పక్షం వహించాడని, వారిని గౌరవించాడనీ, కాఫిర్ల లాగా పూజలు చేశాడు, వారి సంబరాలలో పాల్గొన్నాడు, మందిరాలు నిర్మించాడని తీవ్రంగా ఆక్షిపించటం కనిపిస్తుంది. అంటే జైనులాబిదీన్ ఇస్లామేతరులకు ప్రాధాన్యాన్ని ఇవ్వటం, రక్షణ ఇవ్వటం ఇస్లాం ఛాందసవాదులకు కంటగింపుగా ఉందన్న మాట. సుల్తాన్‌కు ఇది తెలుసు. అందుకని ఇస్లామీయుడిని దూతగా పంపితే, అతను ఎక్కడ తన కొడుకును మరింతగా రెచ్చగొడతాడోనన్న భయం ఉండి ఉంటుంది. అదీ గాక సుల్తాన్ సంతానం ముగ్గురికీ గురువు శ్రీవరుడు. బ్రాహ్మణుడు.  కాబట్టి నిజానిజాలు వివరించి యుద్ధవిముఖుడిని చేయటం వల్ల బ్రాహ్మణులకు ఎక్కువ లాభం ఉంటుంది. అందుకని కూడా సంప్రదాయాన్ని అనుసరించి విప్రుడిని దూతగా పంపి ఉంటాడు. శ్రీవరుడికే కాదు, కశ్మీరు లోని ఇస్లామేతరులందరికీ తెలుసు – తమ అదృష్టం జైనులాబిదీన్ జీవించి ఉన్నంత కాలమేననీ, తరువాత ఎవరు రాజ్యానికి వచ్చినా జైనులాబిదీన్ కాలంలోని శాంతి కానీ, భద్రత కానీ తమకు ఉండవని వారికే తెలుసు. కాబట్టి అనిశ్చిత ఫలితం ఇచ్చే యుద్ధం కన్నా శాంతి సాధన ద్వారా  జైనులాబిదీన్ కొనసాగటమే అందరికీ,  ముఖ్యంగా ఇస్లామేతరులకు క్షేమకరం.

అదీగాక, కశ్మీరు పూర్తిగా ఇస్లాంమయం అయిన కాలంలో కూడా విప్రులను దూతగా పంపే సంప్రదాయం కొనసాగింది. జోనరాజు కూడా బ్రాహ్మణ దూతను పంపటాన్ని ప్రస్తావించాడు. లోహార దుర్గాధిపతి సుల్తాన్ ఖుతుబ్ ఉద్-దీన్  సేనానాయకుడు డామరుడు లోలక్ దగ్గరకు బ్రాహ్మణ దూతను పంపాడు.

భారత రాజనీతిలో దూతలు మూడు రకాలు. విశిష్టార్థ దూత, పరిమితార్థ దూత. శాసనహర దూత.

విశిష్టార్థ దూతలు సర్వస్వతంత్రులు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. మహాభారతంలో పాండవుల తరఫున దూతగా వెళ్లిన శ్రీకృష్ణుడు విశిష్టార్థ దూత.  పరిమితార్థ దూతలు నిర్దిష్టమైన వ్యవహారం కోసం వెళ్తారు. శాసనహర దూతలు కేవలం సందేశం ఇచ్చేందుకో, ఏదైనా పత్రం అందించేందుకు మాత్రమే నియమితులవుతారు. జైనులాబిదీన్ తన కొడుకు వద్దకు పంపిన దూత మూడవ వర్గానికి చెందినవాడు. భారతీయ రాజధర్మంలో దూత ఎలాంటి వాడైనా అతడిని బంధించేవారు కాదు. శిక్షించటం, చంపటం చేసేవారు కాదు. రామాయణంలో  శిబిరంలో గూఢచారి పని చేస్తున్న దూత దొరికితే, అతడు దూత కాబట్టి హాని చేయకుండా వదిలేస్తారు. కానీ ఇస్లామీయులు ఇలాంటి నియమ నిబంధనలను త్రోసిరాజన్నారు. జోనరాజ రాజతరంగిణిలో కుతుబుద్దీన్ పంపిన బ్రాహ్మణ దూతను బంధీ చేయటం కనిపిస్తుంది. కాబట్టి ఇస్లామీయుల కాలంలో దూతగా వెళ్లటం కూడా ఒక ప్రమాదకరమైన పని అన్నమాట.

జైనులాబిదీన్ సైన్యంతో ఆగిన స్థానాన్ని శ్రీవరుడు ‘మల్లశిలాపురం’ అన్నాడు. హాజీఖాన్ సైతం శూరపురం దగ్గర పీర్ పంజాల్ పర్వతాలను దాటి మల్లశిలాపురం చేరాడు. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు, ‘మారహిల్ల’ అంటున్నారు. ఈ యుద్ధం క్రీ.శ. 1452లో జరిగిందని శ్రీవరుడు రాశాడు.

స గత్వా నృప సందేశ మబ్రవీదితి నిర్భయ।
కిం వక్తీతి క్షణం కృద్ధైస్తత్వజ్ఞైః పరివేష్టితః॥
(శ్రీవర రాజతరంగిణి, 117)

జైనులాబిదీన్ సందేశం వినిపించటానికి వచ్చిన విప్రుడిని కోపోద్రిక్తులైన ప్రజలు చుట్టుముట్టారు. రాజు పంపిన సందేశం తమకు వినిపించాలని పట్టుబట్టారు. అందరూ కోపంగా తనని చుట్టుముట్టి హింస నెరపేందుకు సిద్దంగా ఉన్నా తొణకక ధైర్యంగా ఆ బ్రాహ్మణుడు రాజు సందేశం వినిపించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version