Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

అనిత్యతాన్ధాకారేస్మిన్ స్వామిశూన్యే మహీతలే।
కావ్యదీపం వినా కః స్యాదూ భూతవస్తుప్రకాశకః॥
(శ్రీవర రాజతరంగిణి, 4)

నిత్య రూపంలో ఉన్న ఈ అంధకారంలో, అధికారి (స్వామి) శూన్యమైన ఈ ప్రపంచంలో, గతించిన కాలానిపై వెలుతురు ప్రసరించగలిగేది కేవలం కావ్యదీపమే. కావ్యదీపం కాక ఇంకేదీ అనిత్యమైన అంధకార ప్రపంచంలో గతించిన కాలం పై వెలుతురు ప్రసరింపచేయగలది?

ఈ శ్లోకం శ్రీవరుడికి తాను రచిస్తున్న రచన ప్రాధాన్యం స్పష్టంగా తెలుసున్న సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ముఖ్యంగా గతం ఆనవాళ్లన్నీ చెరిగిపోతూ, సంపూర్ణంగా గతంతో సంబంధం త్రెంచుకంటున్న సమాజాన్ని కళ్లారా చూస్తున్న శ్రీవరుడిని  మించి – కావ్యదీపం ఏ రకంగా అంధకారంలో మునిగిన  గత వస్తువులన్నింటి పైనా వెలుతురు ప్రసరించగలదో ఇంకెవరికీ తెలియదు.

శ్రీవరుడు తన జీవితకాలంలో జైనులాబిదీన్, హైదర్ షాహ, హసన్ షాహ, మహమ్మద్ షాహల పాలనను అనుభవించాడు. అధికారంలో ఉన్న వాడిని బట్టి రాజ్యంలో పరిస్థితులు మారటం అనుభవించాడు. ముఖ్యంగా, జైనులాబిదీన్ అణచిపెట్టిన ఇస్లాం మతమౌఢ్యం అడ్డు తొలగిన వరదనీటిలా ఇస్లామేతరులను  ముంచెత్తటం గమనించాడు. ఏ రకంగా వర్తమాన సమాజం గతంతో సంపూర్ణంగా సంబంధం త్రెంచుకుని, తనను తాను పూర్తిగా మరచిపోయి నూతన అవతారం ఎత్తుతోందో అర్థం చేసుకున్నాడు. ఒక శరీరం వదలి వేరొక శరీరాన్ని ధరించిన ఆత్మకు ఎలా గత జన్మ స్మృతులుండవో, అలాగే మతం మారటంతో మనుషులు పునర్జన్మ ఎత్తినవాళ్ళలా అయిపోవటం గమనించాడు. అయితే, పునర్జన్మకూ, మతం మారటానికీ తేడా అల్లా పునర్జన్మలో గత స్మృతులుండవు.కానీ మతం మారిన వారికిమాత్రం తమ పూర్వ ధర్మంపై ద్వేష భావనలు ఉంటాయి. ఆ ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలన్న కసి ఉంటుంది. శ్రీవరుడు ఈ కసి, ద్వేష  భావనలను అనుభవించాడు.

ఈ విషయన్ని శ్రీవరుడు తాను కొనసాగించిన రాజతరంగిణిలో విపులంగా రాశాడు.

సుల్తాన్ జైనులాబిదీన్ కాలంలో శౌర్యభట్టు సత్కర్మల మొక్కను నాటాడు. ఆ మొక్కను సద్బ్రాహ్మణుడు నిర్మలకాంతుడు (కాంతభట్టు) నీరు పోసి పెంచాడు. మ్లేచ్ఛులు అణచివేస్తున్న కాలంలో (శమ్సుద్దీన్ ఇరాకీ) నిర్మలకాంతుడు జనులను కూడగట్టుకుని మతఛాందసుడి వల్ల ఒనగూడే అనర్థాన్నుంచి తప్పించాడు. ‘కాచి చాక్’కు విధేయుడిగా ఉన్న ఖ్వాజా మీర్ మహమ్మదా (శమ్సుద్దీన్ ఇరాకీ) కాచి చాక్‍కు ధనమిచ్చి నిర్మలకాంతను, ఇతరులను అణచివేయమని కోరాడు. ఆ మ్లేచ్ఛుడు వీరందరి మరణానికి కారకుడయ్యాడు. ముసల్మానులు అణచివేయడం సయ్యద్‍ల కాలంలో ఆరంభమయింది. మూసా చంద్ర దీన్ని ఉచ్చస్థాయికి చేర్చాడు. కాచి చాక్ ఈ అణచివేతను తారాస్థాయికి చేర్చాడు. ఇది 94వ సంవత్సరంలో (క్రీ.శ.1518) శ్రావణ మాసంలో జరిగింది.

శ్రీవరుడు రాసిన ఇది అర్థం కావాలంటే, జైనులాబిదీన్ తరువాత అధికారం కోసం జరిగిన పోరు గురించి తెలుసుకోవాలి.

‘ఫాత్ షాహ’ 1505లో రెండవ సారి ‘శమ్స్ చాక్’ తో సహా ఇతరుల సహాయంతో కశ్మీరుపై అధికారాన్ని సాధించాడు. తనను అవమానానికి గురిచేసి, వ్యతిరేకించిన వారందరిపై ‘శమ్స్ చాక్’ క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. తనకు వ్యతిరేకంగా సయ్యద్‌లతో చేతులు కలిపినందుకు మొత్తం దాంగార్లు (దార్‍లు)ను సమూలంగా నాశనం చేయ సంకల్పించాడు. శమ్స్ చాక్ క్రౌర్యాన్ని అతని అనూయాయులే భరించలేకపోయారు. మూసా రైనా, ఇబ్రహీం మాగ్రేలు అతడిని జైల్లోనే చంపించారు. ఇదంతా క్రీ.శ. 1505లో జరిగింది.

మూసా రైనా, శమ్సుద్దీన్ ఇరాకీ భక్తుడు. కశ్మీరులో ముస్లింల నడుమ చిచ్చు పెట్టినవాడు శమ్సుద్దీన్ ఇరాకీ. ఆనాడు ఆయన పెట్టిన చిచ్చు 1872 వరకూ కశ్మీరులో సున్ని, షియాల నడుమ రగులూనే ఉంది. 1872లో మహారాజా రంజిత్ సింగ్, వీరిద్దరి నడుమ రాజీ కుదిర్చాడు.

“He (Mir Shams-ud-din), laid the germs of implacable and lasting hostility among the Muslims of Kashmir. From this time, the Sunnis and Shias began to distinguish themselves openly as two different sects, and continued to remain at loggerheads. They continued to behave like two uncompromising brothers, fighting like cats and dogs whenever an occasion arose among themselves until 1872, when Maharaja Ranjit sigh, the Second Dogra Ruler of Kashmir was able to affect rapprochement between them. Yet, in their heart of hearts, old sores remained unhealed.”

(A History of Muslim Rule in Kashmir, by R.K. Parmu. P 214.)

మీర్ శమ్సుద్దీన్ ఇరాకీ 1484లో ఖారసాన్ గవర్నర్  హుస్సేన్ మీర్జా దూతగా కశ్మీర్ వచ్చాడు. ఈయన సయ్యద్ మహమ్మద్ నూర్ బక్ష్ శిష్యుడు. కశ్మీరు రావటంలో ఈయన ప్రధాన ఉద్దేశం కశ్మీరు ప్రజలలో నూర్‌బక్షియా సిద్ధాంతాలు ప్రచారం చేయటం. తన సిద్ధాంతాలను ప్రచారం చేయమని శమ్సుద్దీన్ మహమ్మద్ బిన్ యాహ్యా-అల్-లహ్జానీ-అల్-గిలానీని ‘నూర్ బక్ష్’ స్వయంగా ఆదేశించాడు. మళ్ళీ 1505లో ఫాత్ షాహ్ కాలంలో శమ్సుద్దీన్ ఇరాకీ, కశ్మీరు వచ్చి స్థిరపడ్డాడు.

‘ఐన్-ఇ-అక్బరీ’ లో కూడా నూర్‍బక్షియా సిద్ధాంతాలను  ఫతాహ్ శాహ’ పాలనా కాలంలో శమ్స్-ఉద్-దీన్ ప్రచారం చేశాడని స్పష్టంగా రాశాడు అబుల్ ఫజల్. ఈ ‘నూర్‍బక్షియా’లను కశ్మీరుపై ‘జహంగీర్’ పాలనా కాలంలో సంపూర్ణంగా అంతం చేశారు. అనేకులు ప్రాణాలు అరచేత పట్టుకుని బాల్టిస్తాన్ పారిపోయారు. పారిపోలేని వారు ‘షియా’ లతో కలసి పోయారు.

రెండవ సారి కశ్మీరు వచ్చిన శమ్సుద్దీన్ ఇరాకీ, మూసా రైనాతో చేతులు కలిపాడు. కశ్మీరులో హిందువులందరినీ మతం మార్చే యుద్ధం ప్రారంభించాడు. దేవాలయాలను కూలగొట్టి మసీదులు నిర్మించాడు. ఇతడి క్రౌర్యాన్ని తట్టుకోలేక ఇరవై నాలుగు వేల మంది హిందువులు మతం మారిపోయారు. ఈ నిజాలను కప్పిపుచ్చి చరిత్ర రచయితలు ఓ కొత్త కథను సృష్టించారు. హిందూ ధర్మం లోని సామాజిక అణచివేతలను వ్యతిరేకిస్తూ హిందువులు స్వచ్ఛందంగా, విశాల భావాలు కల ఇస్లాంను స్వీకరించారని పదే పదే ప్రకటిస్తూ, చరిత్ర పుస్తకాలలో రాస్తూ, అబద్ధాన్ని నిజంలా స్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఆధునిక సమాజంలో అసలు నిజాన్ని కప్పిపుచ్చి తమ వ్యక్తిగత స్వార్థం కోసం, తాత్కాలిక లాభాల కోసం పలువురు మేధావులు, ఉద్యమకారులు ఈ అబద్ధాన్ని నిజంగా స్థిరపరచి సమాజాన్ని తప్పుదారి పట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి అబద్ధాల ప్రచారాన్ని భారతీయులే చేస్తుండటం – ఆనాడు బలవంతంగా మతం మారినవారు, ప్రాణాలు కోల్పోయినవారు, ప్రాణాలను పణంగా పెట్టి ధర్మాన్ని నిలుపుకుని భావితరాలకు సజీవంగా అందించిన వారి ఆత్మలను ఎంతగా క్షోభను గురిచేస్తాయో! భవిష్యత్తులో ఈ దేశంలో ఇలాంటి ఓ తరం వస్తుందని చెప్పినా వారు అంతే పట్టుదలగా ధర్మాన్ని నిలుపుకునే వారన్నది వేరే సంగతి! భవిష్యత్తు తరాలు ఎలాంటి వారయినా తమ కర్తవ్య నిర్వహణకు, ధర్మ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వటమే భారతీయ ధర్మం. ఫలితం దైవానిదే!

ఈ విషయాలను ప్రత్యక్షంగా చూశాడు, అనుభవించాడు శ్రీవరుడు. ముఖ్యంగా, ముస్లింల నడుమ వైషమ్యాల పోరును అదనుగా తీసుకుని పండిత్ కాంతభట్టు ‘ఘర్ వాపసీ” కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించటం  అనుభవించాడు.  ‘సికందర్ లోడి’ సహాయంతో మహమ్మద్ షాహ కశ్మీర్ సుల్తాన్ కావటంతో కాచి చాక్, శమ్స్-ఉద్-దీన్ ప్రోద్బలంతో ఇస్లాంను వీడిన వారందరినీ శిక్షించేందుకు కంకణం కట్టుకోవటంతో 1518లో హిందువులపై మారణ హోమం అత్యంత తీవ్రమైత స్థాయిలో జరిగింది. ఎనిమిది వందల మంది హిందు నాయకులను క్రూరంగా చంపారు. చావు భయంతో గొర్రెల్లా హిందువులు ఇస్లామ్‍ను స్వీకరించారు.

“And he (Shams-ud-din) advised Kachi chak to extirpate Hinduism, once for all. Accordingly, in 1518, some eight hundred Hindu leaders were gruesomely massacred; and fear of death compelled their followers to walk into the Muslim fold like dumb driven cattle.”

(A History of Muslim Rule in Kashmir by R.K. Parmu, P 222)

‘fear of death’ ను వదిలి, ‘walk into the Muslim fold’ స్వచ్ఛందంగా మతం మారటంగా అన్వయించి, దీనికి సామాజిక అసమానతలను జోడించి, హిందువులు ఇస్లాంను స్వీకరించటానికి దోషం ఇస్లామీయుల క్రౌర్యం, దౌష్ట్యం, అమానుషత్వాలు కావు, హిందూ ధర్మం లోని అసమానతలు, అణచివేతలు మాత్రమే అన్న తీర్మానం చేసి సమస్త భారత జాతి తమ గతం పట్ల నేర భావనతో క్రుంగిపోయేట్టు చేసే ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో శ్రీవరుడు రచించిన నాలుగో శ్లోకంలోని ‘కావ్యదీపం వినా కః స్యాదూ భూతవస్తుప్రకాశకః’ అన్న పాదం ప్రాధాన్యం స్పష్టం అవుతుంది. శ్రీవరుడు, శుకుడు రాసిన రాజతరంగిణిలు లభ్యం కాకపోయినా, వారు రాజతరంగిణి రచన ద్వారా కావ్యదీపాన్ని ప్రజ్వలితం చేయకపోయినా, ఈనాడు ఈ దుష్ప్రచారం జోరులో, అబద్ధ కథనాల తుఫానుల్లో, ఆధారం లేకున్నా అబద్ధాన్ని పదే పదే ప్రకటించి నిజంగా స్థిరపరిచి జాతి మొత్తాన్ని దోషిగా నిలిపి నేర భావనతో, న్యూనతా భావంతో, కుచించుకుపోయేలా చేయాలన్న ప్రయత్నాల హోరులో, అంధకారంలో మగ్గుతున్న అసలు నిజంపై వెలుతురు ప్రసరించేది కాదు. నిజాన్ని నిజంగా నిరూపించే ఆధారాలు లభిచేవీ కావు.  శ్రీవరుడు, శుకుడు రచించిన రాజతరంగిణి కావ్యదీపాలు చరిత్ర కాదని ఎవరెంతగా కొట్టివేయాలని ప్రయత్నిస్తూన్నా నిజంపై వెలుతురు ప్రసరిస్తూనే వుంటాయి. ఇవి లేకపోతే బహరిస్తాన్‍లో ఇస్లామీయుల దృక్కోణంలో ప్రకటించిన విషయాలు సత్యాలుగా స్థిరపడేవి.

“The great task that Kachi Chak performed at the bidding of Mir Shams-ud-din Muhammad Iraqi was the massacre of the idolaters. It happened thus: during his government Musa Raina had converted most of the Hindus to Islam. Subsequently many of them had abjured the faith under the influence of their leaders and once more continued to worship Hindu idols; some concealed them behind the Holy Quran. Viewing this, Shams-ud-din Iraqi sent for Kachi Chak and argued with him that the people who had once embraced Islam could not thereafter continue to behave as Hindus, and if they were not compelled to conduct themselves as true Muslims, he had better leave Kashmir. Accordingly, Kachi Chak got some eight hundred Hindu leaders massacred, in the month of Asura, in the year 924 a.h. (1518), which corresponds to 94 years of the Kashmiris; and the Hindus of Kashmir were converted to Islam by the sword.”

బహరిస్తాన్ సైతం ‘the Hindus of Kashmir were converted to Islam by the sword’ అంటోంది. కానీ మన మేధావులు, ఉద్యమకారులు మాత్రం భారతీయ ధర్మంలోని సాంఘిక అసమానతల వల్ల స్వచ్ఛందంగా ఇస్లాంను స్వీకరించారంటున్నారు.

శ్రీవరుడి కాలానికే ‘గతం’ అంధకారంలోకి జారుకుంటున్నది. గతం గుర్తులు చెరిగిపోతున్నాయి. గతం జ్ఞాపకాలు మరుగున పడుతున్నాయి. ఎటు చూసినా ఇస్లాం చిహ్నాలతో నిండిన కశ్మీరులో ఒకప్పుడు అడుగడుగునా మందిరం ఉండేదని, ప్రజలు విధ్యుక్త కర్మలను  పాటించేవారని, దేవతలు వైభవంతో వెలుగుతూ పూజలందుకునేవారని, రాజులు ధర్మబద్ధంగా పాలించేవారనీ, ప్రజలు నీతివర్తనులై ధార్మిక జీవం సాగించేవారినీ, పండితుల చర్చలతో, వారు సృజించిన కావ్య పఠనాలతో  కశ్మీరు లోని హిమాలయాలు ప్రతిధ్వనించేవని ఊహించటం కుదరదు. కానీ ఆ ఊహనిచ్చి, దానికి ఆధారం ఇచ్చింది కల్హణుడి రాజతరంగిణి. ఆ సత్యాన్ని స్థిరపరుస్తూ, ఈనాటి దుస్థితికి దారి తీసిన పరిస్థితులను వివరించింది జోనరాజ రాజతరంగిణి. వీరి రచనలు లేకుంటే కశ్మీరు అనుభవించిన వైభవం, కోల్పోయిన ఔన్నత్యం, దిగజారిన లోతులు శ్రీవరుడికి తెలిసివి కావు. శ్రీవరుడికే కాదు, భావితరాలకూ తెలిసేవి కావు. అలా తెలిసే వీలు కల్పించి, గతాన్ని కప్పి ఉంచిన చీకటిని పారద్రోలేది కావ్యదీపం. తాను రాస్తున్న రాజతరంగిణి కూడా భావితరాలకు గతం గురించి తెలుపుతుందన్న నిజం శ్రీవరుడికి తెలుసు. విధి తనపై ఉంచిన గురుతర బాధ్యత తెలుసు. అయితే, ఇతరులు వ్రాసినది ‘చరిత్ర’ ఐతే, తాను రాస్తున్నది ‘నడుస్తున్న చరిత్ర’ అని శ్రీవరుడికి తెలుసు.

పలువురు చరిత్ర విశ్లేషకులు శ్రీవరుడి రచనను ‘చరిత్ర’గా పరిగణించక, జైనులాబిదీన్ జీవితచరిత్రగా ప్రకటించారు. శ్రీవరుడి రచనను ‘జైన రాజతరంగిణి’గా పరిగణించారు. ఇంకొందరు మొదటి భాగాన్ని జైన రాజతరంగిణిగా, రెండవ భాగాన్ని రాజతరంగిణిగా పరిగణిస్తారు. మరికొందరు ఈ రెండు భాగాలను కలిపి తృతీయ రాజతరంగిణిగా పరిగణిస్తారు.

శ్రీవరుడు రాసింది తాను చూసిన నడుస్తున్న చరిత్ర అయినా, పరిశోధన అవసరం లేకుండా, సుల్తానుల ఆస్థానంలో ఉండి సుల్తానుల రోజూవారీ కార్యకలాపాలను గ్రంథస్థం చేసే ఆస్థాన వ్రాయసకాండ్రు చేసే పనే చేసినా, శ్రీవరుడు గ్రంథస్థం చేయడం వల్ల ఈనాడు కశ్మీరు చరిత్రను భారతీయుల దృక్కోణం లో తెలుసుకునే వీలు మనకు కలిగింది. అయితే, తెలుస్తున్న విషయాలు కూడా ఇస్లాం కత్తుల నీడలో ఒదుగుతూ, బిక్కుబిక్కు మంటూ, అప్రియమైన సత్యాలను వీలయినంత ప్రియంగా చెప్తూ, అలా చెప్పే వీలు లేనివి అణచిపెట్టి ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తూ రచించిన చరిత్ర ద్వారా తెలుస్తున్నాయి. అలా తెలుస్తున్న దాని నుంచి అసలైన చరిత్రను నిర్మించుకోవాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version