Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-40

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

సుధాసితగృహా యత్ర సన్నాగార వసుంధరమ్।
జయాపీడపురమ్ జీర్ణం హసన్తీవ రుచిబ్భలాత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 37)

తెల్లటి గృహాలతో నూతన నగరం, జీర్ణమైన జయాపీడపురాన్ని చూసి నవ్వుతున్నట్లు ఉంది.

ఎన్నో ఆలోచనలు రేకెత్తించే వర్ణన ఇది.

జైనులాబిదీన్ కొత్త నగరాన్ని నిర్మింపచేశాడు. అందమైన నగరం అది. శివుడిపై అలిగి కైలాసం దిగి వచ్చిందన్నట్టనిపించే నగరం అది.

కానీ జైనులాబిదీన్ నూతనంగా నిర్మించిన నగరం, జీర్ణమై, శిధిలమైన ఇళ్లతో ఉన్న జయాపీడపురాన్ని పరిహసిస్తున్నట్లు ఉన్నదనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వర్ణన వెనక ఏదైనా ఆలోచన ఉన్నదేమో అనిపిస్తుంది.

జైనులాబిదీన్ ఈ నగరాన్ని జయాపీడపురం దగ్గరలో నిర్మించాడు. జయాపీడపురాన్ని కర్కాట వంశం దాదాపుగా 230 సంవత్సరాలు పాలించింది. ఇందులో జయాపీడుడు 21 సంవత్సరాలు పాలించాడు. మార్తాండ మందిరాన్ని కర్కట వంశానికి చెందిన లలితాదిత్యుడు నిర్మించాడు. విష్ణు మందిరాలు, చైత్యాలు, స్తూపాలు, విహారులు విరివిగా నిర్మించారు ఈ వంశానికి చెందిన రాజులు.

వీరిలో జయాపీడుడు విశిష్టమైన స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఈయన పాలన ఆరంభంలో దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా, దక్షిణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను రప్పించాడు. వారికి సర్వ సౌఖ్యాలు సమకూర్చి స్థిరనివాసాలు ఏర్పాటు చేశాడు. పాలన చివరి దశలో బ్రాహ్మణలను క్రూరంగా హింసించాడు. వారిపై క్రూరమైన పన్నులను విధించాడు. దాదాపుగా కశ్మీరు నుంచి తరిమివేశాడు. అలాంటి జయాపీడుడు నిర్మించిన నగరం ‘జయాపీడపురం’. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని అనుభవించింది. కశ్మీరులోని నగరాలన్నిటికన్నా సుందరమైన నగరంగా పరిగణనకు గురయింది. కాలక్రమేణా ఆ నగరం శిధిలమయింది. ఆ శిధిలమైన నగరాన్ని చూసి, జైనులాబిదీన్ నూతనంగా నిర్మించిన నగరంలోని ఈ ఇళ్ళు నవ్వుతున్నట్టుంది అంటున్నాడు శ్రీవరుడు.

ఈ నవ్వు తన ఆధిక్యతను ప్రదర్శించటమా లేక ఒకప్పుడు వెలిగిన నువ్వు, ఇప్పడు నేలమట్టమయ్యావు, ఇప్పుడు వెలుగులో ఉన్న ఈ నా గతీ భవిష్యత్తులో ఇంతే అన్న భావనతో నవ్వుతోందా అన్నది ఆలోచించాల్సిన విషయం.

తలద్వారోత్సుకస్యాస్య రాజ్ఞః ప్రత్యక్షతాం గతమ్।
మాయాసురపురం కిమ్ వా యద్ దృష్టేవేత్యవదన్ బుధాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 38)

ఈ నూతన నగరాన్ని చూసిన వారు రాజు మయసభను నిర్మించాడా అని ఆశ్చర్యపోతున్నారు.

‘మయసభ’ ఒక అద్భుతమైన నిర్మాణం. ఆనందాశ్చర్యాలను కలిగించే కట్టడం. జైనులాబిదీన్ నిర్మించిన నగరం ఆ మయసభను తలపింప చేస్తున్నది.

యద్ వారికాంతం సంక్రాన్తం పరితాః సరితస్తటాత్।
ద్వారికాం హసతీవాస్య ద్వారి కాన్త్యా సుధాసితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 39)

నగరం చుట్టూ ప్రవహించే అతి సుందరమైన జలం, తన అందాన్ని గ్రహించి గర్విస్తూ, ద్వారక నగరిని చూసి నవ్వుతున్నట్లుంది.

భారతీయ ధర్మం ప్రకారం ఏడు పవిత్ర నగరాలున్నాయి. అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, పూరి, ద్వారకలు. వీటిల్లో ద్వారకను చూసి నవ్వుతూన్నట్లుందట జైనులాబిదీన్ నిర్మించిన నూతన నగరం.

ద్వారకను నిర్మించింది విశ్వకర్మ. భూతల స్వర్గం లాంటిదీ నగరం. శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత ద్వారకను సముద్రం ముంచెత్తింది.

ఇంతకు ముందు జయాపీడాపురాన్ని చూసి నవ్వుతున్న శ్లోకం, ఇప్పుడు ద్వారకను చూసి నవ్వుతున్న శ్లోకం చదివితే శ్రీవరుడి అంతరంగాన్ని గ్రహించే వీలు చిక్కుతుంది. నూతన నగరం నవ్వుతున్న రెండు పురాతన నగరాలూ  కాలక్రమేణా దెబ్బతిన్నవే. జయాపీడపురం శిధిల రూపంలో ఉంటే, ద్వారక సముద్ర గర్భంలోకి అదృశ్యం అయింది. ఈ రెంటిని చూసి నవ్వుతున్నట్టుంది అని శ్రీవరుడు చెప్పటం వెనుక పరమార్థం ఏదో ఉన్నట్టనిపిస్తుంది.

జయాపీడపురం శిధిలమయింది. శ్రీకృష్ణ నిర్యాణం తరువాత ద్వారక నీట మునిగింది. జైనులాబిదీన్ మరణం తరువాత ఆయన నిర్మించిన నూతన నగరం శిధిలమయింది. కొన్నాళ్లకు వరదల వల్ల సర్వనాశనమై అదృశ్యం అయింది.

తత్ర రాజపురీయాయ జయసింహాయా భూపతిః।
ప్రదదౌ రాజ్యతిలకం నిజ జన్మ దినోత్సవే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 40)

రాజపురి రాజు జన్మదినోత్సవం సమయంలో రాజపురి రాజు జయసింహుడికి రాజ తిలకాన్ని ప్రదానం చేశారు.

జైనులాబిదీన్ పాలనకు వచ్చిన కొత్తల్లో రాజపురి రాజు రణసింహుడు. అతడిపై జైనులాబిదీన్ విజయం సాధించాడు. అతడి తరువాత జయసింహుడు రాజు అయి ఉంటాడు. అతడికి రాజతిలకాన్ని ప్రదానం చేశాడు జైనులాబిదీన్. రాజపురి అంటే ఇప్పటి రాజౌరి. రాజతిలకం ప్రదానం చేయటమంటే, రాజపురికి రాజుగా అతడిని గుర్తించటం. ఇది తరువాత శ్లోకంలో స్పష్టం చేస్తాడు.

తత్రోపవిష్టః సంతుష్టః సేవయా మే మహీపతిః।
భట్ట తంత్రాధికారం చ ప్రదదౌ బ్రాహ్మణప్రియః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 41)

బ్రాహ్మణప్రియుడైన రాజు అతడు చేసిన సేవలకు మెచ్చి అతడికి భట్టతంత్రాధికారం కూడా ప్రదానం చేశాడు.

‘తంత్రాధికారం’ అన్నది ‘పాలనాధికారి’ పదవి. తంత్ర అధికారినే తంత్రాధ్యక్షుడు అని కూడా అంటారు. తంత్రపాలుడన్నది మరో పేరు. తంత్రపాలుడన్నా, తంత్రాధ్యక్షుడన్నా, పాలనాధికారి అని అర్థం. రాజపురి పై పాలనాధికారాన్ని జయసింహుడికి అప్పజెప్పి ఉంటాడు జైనులాబిదీన్.

శ్రీవరుడు జైనులాబిదీన్‍ను ‘బ్రాహ్మణప్రియ’ అని సంబోధించాడు. ఇప్పుడు బ్రాహ్మణ అన్న పదం కుల సూచీ అయింది కానీ, శ్రీవరుడు ‘బ్రాహ్మణ’ అన్న పదాన్ని కులం అన్న అర్థంలో కాక ఏదో ఓ రంగంలో నిష్ణాతుడు, విజ్ఞానవంతుడు అన్న అర్థంలో వాడినట్టు అనిపిస్తుంది. జైనులాబిదీన్ కేవలం బ్రాహ్మణులను మాత్రమే ఆదరించలేదు. ఆయన నిపుణులను, పండితులను, విజ్ఞానవంతులను అందరినీ ఆదరించాడు. కాబట్టి శ్రీవరుడు ‘బ్రాహ్మణప్రియ’ అని అనడం విజ్ఞానవంతులంటే ఇష్టపడిన వాడు జైనులాబిదీన్ అంటున్నట్టవుతుంది.

కశ్మీరకాద్య దేశీయ సర్వగీతాంకింతాంకనే।
తస్మిన్ సంవత్సరే రాజ్ఞా చక్రే కనకవర్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 42)

కశ్మీరుతో సహా ఇతర దేశాల సంగీతాన్ని కశ్మీరులో గానం చేసిన ప్రాంగణంలో రాజు కనకవర్షాన్ని కురిపించాడు.

కశ్మీరుతో సహా పలు ఇతర దేశాల సంగీతాన్ని కశ్మీరంలో గానం చేసేవారన్న మాట. వారందరినీ జైనులాబిదీన్ ఆదరించాడు. వరాలు కురిపించాడు.

జైనులాబిదీన్ లలితకళలు మాత్రమే కాదు, ఎలాంటి నైపుణ్యం అవసరమైన విషయమైనా ఆదరించాడు. ఆయన మధ్య ఆసియా దేశాల నుంచి నిపుణులను  కశ్మీరుకు రప్పించి పలు రంగాలలో కశ్మీరీయులకు శిక్షణనిప్పించాడు. టిబెట్ నుంచి వచ్చిన కళాకారులతో కశ్మీరీ షాల్ తయారీ నేర్పించాడు. తివాచీల తయారీ, చెక్కలతో బొమ్మలు తయారు చేయటం వంటి వాటినీ విదేశీ నిపుణులను ఆహ్వానించి కశ్మీరీయులకు శిక్షణనిప్పించాడు.

సంగీతం అంటే జైనులాబిదీన్‍కు ఎంతో ఇష్టం. ఆయన తన రాజ్యంలో సంగీత విద్వాంసులను ఎంతో గౌరవించాడు. వారిపై కనక వర్షం కురిపించాడు. సంగీతం పట్ల సుల్తాన్‍కి ఉన్న ఆసక్తి తెలుసుకున్న సంగీత కళాకారులు, పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కశ్మీరు వచ్చి చేరారు. రాజును మెప్పించి వరాలు పొంది కశ్మీరంలో స్థిరపడ్డారు. కశ్మీరుకు ప్రత్యేకమైన సంగీత సంస్కృతిని ఏర్పరచారు. ‘ఖారసాన్’ నుంచి ముల్లాఉడి, ముల్లా జమాత్ వంటి వారు కశ్మీరు వచ్చిన తరువాత సంగీత ప్రతిభను ప్రదర్శించి సుల్తాన్ మెప్పు పొందారు. కశ్మీరు సుల్తానుకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన గ్వాలియర్ రాజు, జైనులాబిదీన్ కోసం ‘సంగీత చూడామణి’ గ్రంథాన్ని కశ్మీరుకు పంపాడు. అంటే, ఆ కాలంలో మతంతో సంబంధం లేకుండా, రాజుల నడుమ స్నేహ సౌహార్ద్రభావాలుండేవన్నమాట. ముఖ్యగా జైనులాబిదీన్ వంటి పరమతసహనం ప్రదర్శించే రాజు అంటే, ఇతర రాజులు కూడా గౌరవాభిమానాలు ప్రదర్శించారు.

జైనులాబిదీన్‌కు నాటకాలు, నృత్యం అన్నా ఇష్టం. సుల్తాన్ నిర్వహించిన సంగీత, నృత్య సభల గురించి శ్రీవరుడు వర్ణించాడు. పంపోర్, బిజ్‌బెహరా, అనంతనాగ్, బారాముల్లా వంటి ప్రాంతాలలో సుల్తాన్ నిర్వహించిన సంగీత, నృత్య ఉత్సవాలను శ్రీవరుడు వర్ణించాడు. కాబట్టి సంగీత కళాకారులపై జైనులాబిదీన్ కనకవర్షాన్ని కురిపించటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు [Budshah-Lover of Art, Symbol of Secularism, by Predman Krishen Dhar]

తత్రోపకంఠే భూపాలః స్మృత్యై కంఠీరవద్విషః।
హేలాలనామ్నో దాసస్య హేలాలపురకం వ్యాధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 43)

ఈ నగరానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో హేలాలుడనే వాడు, మదమెక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఏనుగును సంహరించాడు. ఈ ఘటన స్మృతి చిహ్నంగా రాజు హేలాలపురాన్ని నిర్మించాడు.

‘హేలాల’ అన్నది ‘హిలాల్’ అనే అరబిక్ నామాన్ని శ్రీవరుడు ప్రకటించిన విధం. రాజు నిర్మించిన హేలాలపురాన్ని పరిశోధకులు కనుగొనలేకపోయారు ఇంతవరకూ.

శైలపీఠం విధాయోచ్ఛైర్జయాపీడపురాన్తరే।
సరస్తీర్థే మనోహారి రాజవాసం స్వక్ వ్యఘాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 44)

జయాపీడపురంలో ఎత్తైన స్థానంలో శైలపీఠం నిర్మించి, సరోవర తీరం వద్ద తన మనోహరమైన నివాస స్థలాన్ని నిర్మించాడు రాజు.

ఉదీపబృడితం జీర్ణం నిర్లుంద్యోపసరోవరమ్।
మహాప్రజ్ఞో నృపశ్చక్రే తద్దద్ రాజగృహావలిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 45)

సరోవర తీరంలో వరద నీటిలో మునిగి జీర్ణమైన కట్టడాలను విరగగొట్టించి, ఆ ప్రాంతంలో రాజగృహాల వరుసను నిర్మించాడు.

సరోవరం నుంచి నీటిని వెడలనడిపి ఆ ప్రాంతంలో రాజగృహాలను నిర్మించాడన్న అనువాదం కూడా ఉంది. సరోవరం నీటిని తోడేసి, అక్కడ రాజగృహాల వరుసను నిర్మించటం అంటే, ఆ కాలంలోనే చెరువు ప్రాంతాలను ఆక్రమించి ఇళ్ళు కట్టినట్టవుతుంది. కాబట్టి, చెరువులో గృహాలు నిర్మించటం కన్నా, చెరువు నీటిలో మునిగి శిధిలమైన గృహాల స్థానంలో రాజగృహాలు నిర్మించాడునుకోవటమే ఔచితీమంతంగా ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version