Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-43

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

పూజార్య ప్రస్ఫురత్ పారదత్తదీపావళిచ్ఛలాత్।
వితస్తాంతరమాయాతా తీర్థకోటిరివాధ్యు తత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 55)

వితస్త జన్మదిన సందర్భంగా పురవాసులు సమర్పించే దీపాల తతులు ఎలా ప్రకాశిస్తున్నాయంటే, వితస్తను ప్రస్తుతించేందుకు కోట్లకొలది తీర్థస్థానాలు వితస్త వద్ద ప్రకాశితమతున్నట్టున్నాయి.

అతి చక్కటి వర్ణన ఇది. అతి గొప్ప వర్ణన ఇది. ఎంతో లోతైన ఆలోచన కల వర్ణన ఇది. ‘తీర్థం’ అన్నది భారతీయ ధర్మంలో అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మక భావాన్ని సూచించే పదం. ‘తీర్థం’ అంటే ‘రేవు’ అన్న అర్థం వస్తుంది. మార్పు చెందే స్థలం అన్న అర్థం వస్తుంది. రూపాంతరం చెందే కూడలి అన్న అర్థం కూడా ఉంది. ‘తీర్థం’ అంటే భౌతిక, ఆభౌతికతల నడుమ ఉండే ‘సంధి’ ప్రదేశం అన్న అర్థం కూడా ఉంది. అందుకే ‘తీర్థాలు’ అత్యంత పవిత్ర స్థలాలు. వాటి దర్శనార్థం చేసే ప్రయాణం తీర్థయాత్ర అయింది. భౌతికత నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణించేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది తీర్థం అంటాయి శాస్త్రాలు. అందుకే హిమాలయాలు, నదులు, ఋషుల నివాసాలు, మందిరాలు, అరణ్యాలు, సముద్రాలు  అన్నీ పవిత్ర తీర్థాలే. పురాణాలు తీర్థ మాహాత్మ్యాలను  తప్పనిసరిగా చెప్తాయి. ఈ నేపథ్యంలో చూస్తే గుళ్ళలో అందుకునే తీర్థం వెనుక దాగిన పరమార్ధాన్ని అర్ధం అవుతుంది.

వారణాసి, రామేశ్వరం, కాంచీపురం, ద్వారక, పూరి, హరిద్వార్ వంటివి అతి పవిత్రమైన తీర్థాలుగా ప్రత్యేంగా ప్రస్తావిస్తాయి పురాణాలు.

‘మార్పు’ స్థలాలు కాబట్టి ప్రాయశ్చిత్తాలు, శ్రాద్ధకర్మలు, సన్యాస స్వీకారం వంటి ‘మార్పు’ ను సూచించే   కర్మలను తీర్థాలలో చేస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాలు, కోటి సంఖ్యలో, వితస్త ఒడ్డుకు వచ్చి అంజలి ఘటిస్తున్నట్టున్నాయట పురవాసులు వితస్త తీరాన వెలిగించిన దీపావళులు.

అంత పవిత్రంగా, అద్భుతంగా, కన్నుల పండువగా జరిగేవన్న మాట వితస్త జన్మదినోత్సవాలు కశ్మీరులో ఒకప్పుడు.

అలా కోటి తీర్థాలు అక్కడికి వచ్చాయని చెప్పటం ఉత్సవాల పవిత్రతను, ప్రాధాన్యాన్ని చెప్తుంది.

భారతదేశంలో ‘గోకర్ణం’ను కోటితీర్థంగా భావిస్తారు. శతశృంగుడి వద్ద ఉన్న రెండు కోట్ల తీర్థ భూముల తీర్థాలను తీసుకుని, గరుడుడు  సముద్రంలో విడిచాడు. ఆ తీర్థాలు సగం సముద్రంలో, సగం భూమిపై ఉండిపోయాయి. అలా భూమిపై మిగిలిపోయిన కోటి తీర్థాలు, ‘గోకర్ణం’ దగ్గరలో ఉన్న ‘కోటితీర్థం’లో ఉండిపోయాయని అన్నది పురాణ గాథ. అందుకే ఈ తీర్థంలో స్నానం కోటితీర్థాల స్నాన పుణ్యాన్ని ఇస్తుందన్నది విశ్వాసం.

అలాంటి కోటి తీర్థాలు కశ్మీరంలో వితస్త ఒడ్డున దీపాల రూపంలో వచ్చి వితస్తకు అంజలి ఘటిస్తున్నాయి అంటేనే, వితస్త ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రాధాన్యం కలదో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి శ్లోకాలు, సుందరమైన ఊహలు, నిర్జీవమై చరిత్రకు వర్ణనల ఆభరణాలు తొడుగుతాయి.

పారావారతటప్రత్తా దీపమాలాస్తదా దధుః।
అర్చనాప్తసురోన్ముక్త సువర్ణకుసుమశ్రియమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 56)

పురప్రజలు భక్తితో వితస్తకు అర్పించిన దీపాలు, అర్చనలందుకుంటున్న దేవతలు సంతుష్టులై, వితస్త అర్చన కోసం పంపిన బంగారు పుష్పాలలాగా ఉన్నాయి. అద్భుతమైన వర్ణన.

కళ్ల ముందు పవిత్రమైన వితస్త నది నీరు కోటి కోటి దీపాల ప్రభలతో ధగధగలాడుతున్న దృశ్యం నిలుస్తుంది.

వితస్తాబలిపూజాప్తనాగరీముఖనిర్జితః।
లజ్జాయా కంపతేవేన్దుః సేవాప్తః ప్రతిమాచ్ఛలాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 57)

వితస్తకు  బలులు అర్పించి పూజించేందుకు వచ్చిన మహిళల అద్భుత అందం  చూసి వితస్త నీటిలో ప్రతిబింబిస్తున్న చంద్రుడు సిగ్గుతో వణికిపోతున్నాడు.

మరో ఆహ్లాదకరమైన వర్ణన.

కశ్మీరీ స్త్రీల అందం చూసి నీటిలో ప్రతిఫలిస్తున్న చంద్రుడు సిగ్గుతో వణికిపోతున్నాడట. ఔచితీవంతమైన వర్ణన.

స్త్రీలు  బలిపూజ చేసేందుకు వితస్తకు వచ్చారు.

వారు నది ఒడ్డున నిలబడి, నదిలోకి దిగి బలి అర్పిస్తారు. చంద్రుడు ప్రతిఫలిస్తున్నది నీటిలో. అంటే వారి సౌందర్యాన్ని అతి దగ్గరగా చూడగలుగుతాడు చంద్రుడు. సాధారణంగా చంద్రుడు అత్యంత సౌందర్యవంతుడు. అలాంటి వాడు తనని మించిన సౌందర్యాన్ని చూశాడు. సిగ్గుతో వణికిపోతున్నాడు. సాధారణంగా నీళ్ళల్లో అలలు వస్తాయి. చంద్రబింబం కదలుతుంది. వణుకుతున్నట్టు కనిపిస్తుంది. బలులు అర్పించేందుకు వచ్చిన స్త్రీల సౌందర్యం చూసి సిగ్గుతో వణికిపోతున్నట్టు చంద్రుడిని ఊహించటం అతి సుందరమైన సృజన.

ఇక్కడ ‘బలి’ అనే పదాన్ని పలువురు అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ‘బలి’ అంటే మనకు జంతుబలి మాత్రమే అన్నట్టు అర్థమయ్యే విధంగా సమాజం బ్రెయిన్‍వాష్‌కి గురయింది.

అందుకే వితస్తకు బలిపూజ అర్పించేందుకు మహిళలు వచ్చారనగానే, అదుగో, ఆ కాలంలో మహిళలు కూడా జంతుబలులు ఇచ్చేవారని, తీర్మానించే ‘చరిత్ర వ్యాఖ్యాతలు’ ఎంతోమంది ఉన్నారు. అందుకే ఇక్కడ ‘బలి’ పదం గూర్చి కొంచం చర్చించాల్సి ఉంటుంది. ‘బలి’ అంటే ఆహుతినివ్వటం. బలి అన్నది దైనందిన జీవితంలో నిత్యం ఇవ్వవలసిన పంచబలులలో ఒక బలి.

పూజ, ఆరాధన, తండులం (బియ్యం), ధాన్యం, నెయ్యి, పాలు వంటి వాటిని దేవత, నది, సరోవరం, శ్రోతస్విని, నాగులకు అర్పించటాన్ని ‘బలిపూజ’ అంటారు. దేవతలకు నైవేద్యం, అర్పణం చేయటం బలి. జీవ,  జంతువులకు భోజనాన్ని సమర్పించటం కూడా బలి క్రిందకు వస్తుంది.

గృహస్థు చేయవలసిన పంచమహాయజ్ఞాలు: బ్రహ్మయజ్ఞం, పిత్రుయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. వీటినే అహుతమ్, హుతమ్, ప్రపుహుతమ్, బ్రహ్మహుతమ్, ప్రహుతమ్ అంటారు.

వేదాధ్యయనం, వేద పఠనం, వేద బోధనలు, బ్రహ్మయజ్ఞం,. పూర్వీకులకు, పితృదేవతలకు శ్రాద్ధకర్మల ద్వారా ఆహారాన్ని అందించటం పితృయజ్ఞం. హోమాలు, యజ్ఞాల ద్వారా దేవతలను సంతృప్తి పరచటం దేవయజ్ఞం. జంతువులకు, కాకులకు, పక్షులకు బలి ద్వారా ఆహారాన్ని అందించటం భూతయజ్ఞం. మానవులకు ఆహరాన్ని అందివ్వటం మానుషయజ్ఞం. దాన్ని ఇప్పుడు అన్నదానం అంటున్నాం.

దేవయజ్ఞం, పితృయజ్ఞం, మానుషయజ్ఞాలలో ‘బలి’ ప్రసక్తి వస్తుంది.

మనుస్మృతి ప్రకారం పాఠం, హోమం, అతిథి సేవ, తర్పణం, బలి వంటివి పంచయజ్ఞాలు.

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్।
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో’తిథిపూజనమ్॥
(3.70)

అమరకోశం ప్రకారం బలి అంటే భూతయజ్ఞం.

పాఠో హోమశ్చాతిథీనాం సపర్యా తర్పణం బలిః।
ఏతే పంచమహాయజ్ఞా బ్రహ్మయజ్ఞాది నామకాః॥
(అమరం, బ్రహ్మవర్గః 2.7.14)

‘భూతయజ్ఞం’ అంటే పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించటం. ఇక్కడ పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించటం ఉంది కానీ జంతుబలి ప్రసక్తి లేదు.

అథర్వణవేదంలో ‘బలి’ అన్న పదం భౌతిక, నైతిక, మానసిక, భావనాత్మక శక్తిని సూచిస్తుంది. విష్ణుసహస్రనామాలలో విష్ణువు ఒక పేరు ‘బలి’. శ్రీకృష్ణుడి 108 నామాలలో ఒక పేరు ‘బలి’. బలరాముడి మరో పేరు ‘బలి’. రాక్షసరాజు పేరు ‘మహాబలి’. అంటే మహాశక్తిమంతుడని అర్థం, ‘మహా’ను బలి ఇచ్చినవాడు అని కాదు.  కానీ ఎలాగైతే సంస్కృత పదాల అర్థాలు దుష్టార్థంలో సమాజంలో ప్రచారంలోకి వచ్చి స్థిరపడ్డాయో అలాగే ‘బలి’ అనగానే జంతువు బలి అన్న అర్థం స్థిరపడింది. సంస్కృతం తెలియని, శాస్త్రాలతో పరిచయం లేని మేధావి పండితులంతా ‘బలి’ అనగానే జంతుబలి అని తీర్మానించేస్తారు.

ర్వఖర్వీకృతారాతిః సుపర్ణ ఇవ లీలయా।
సర్వా రాత్రీం స గాంధర్వచర్వణైరానయత్ సుఖమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 58)

శత్రువుల గర్వమణచిన గరుడుడిలా, శత్రువుల మదమణచిన రాజు రాత్రంతా గాంధర్వ చర్వణపూర్వక సుఖాన్ని అనుభవిస్తూ గడిపాడు.

‘చర్వణము’ అంటే ఆనందాన్ని అనుభవించాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గాంధర్వ చర్వణం అంటే నృత్యం, గానం, శ్రవణం ద్వారా ఆనంద సౌఖ్యాన్ని అనుభవించాడు అన్న అర్థం వస్తుంది. ఇక్కడ గరుడుడికి బదులుగా ‘సుపర్ణ’ అన్న పదం వాడాడు శ్రీవరుడు. అమృతాన్ని సాధించిన గరుడుడు ఒక్క చుక్క కూడా తాను తాగకుండా నిస్వార్థంగా దాన్ని తీసుకుపోవటం చూసి మెచ్చిన విష్ణువు గరుడుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు. చిరంజీవత్వంతో పాటుగా, విష్ణుధ్వజంపై తానుండాలని కోరుకుంటాడు గరుడుడు. వరాలు పొంది వెళ్తున్న గరుడుడి పైన వజ్రాయుధాన్ని విసురుతాడు ఇంద్రుడు. వజ్రాయుధం గరుడుడిని ఏమీ చేయలేదు. కానీ, వజ్రాయుధం ఋషి దధీచి ఎముకలతో తయారయింది కాబట్టి ఆ దధీచి మహర్షి పైనున్న గౌరవంతో తన శరీరంపైని ఒక ఈకను క్రిందకు జారవిడుస్తాడు గరుడుడు. అందమైన ఈకను జారవిడిచిన పక్షిని ‘సుపర్ణ’ అనటం ఆరంభించారు. అలా గరుడుడికి ‘సుపర్ణ’ అన్న పేరు వచ్చింది!

ఎలాగయితే గరుడుడు శత్రువుల గర్వాన్ని అణచాడో, అలాగే, సుల్తాన్ కూడా శత్రువుల గర్వాన్ని అణచాడు. కాబట్టి సంతృప్తిగా, చీకూచింతా లేకుండా హాయిగా రాత్రంతా గంధర్వ గానం వింటూ, నృత్యాలను దర్శిస్తూ మహదానంద సుఖం అనుభవించాడు.

గమనిస్తే, కల్హణుడు, జోనరాజుల రాజతరంగిణిల కన్నా, తక్కువ కాలాన్ని తన రాజతరంగిణిలో పొందుపరిచినా, శ్రీవరుడు తన రాజతరంగిణిని అత్యంత అద్భుతమైన వర్ణనలతో, పౌరాణిక ప్రతీకలతో నింపేశాడనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version