[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
ఇత్యాది కుత్సితాచారం భారార్థ ఇవ భూపతిః।
విజ్ఞాప్యోద్యేజితో లోకైర్నిర్గన్తుం నాశకద్ గృహత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 77)
ఆదమ్ఖాన్, అతడి అనుచరులు జరుపుతున్న ఘోర కృత్యాల గురించి, నీచ చర్యల గురించి తెలుసుకున్న రాజు (జైనులాబిదీన్) విషాద భారంతో ఇల్లు దాటి బయటకు రాలేకపోయాడు.
శ్రీవరుడు రాయలేదు కానీ ఫరిష్త రాశాడు. ఆ కాలంలో ప్రజలు ఆదమ్ఖాన్ను ‘ఆద్మీఖాన్’ అని పిలిచేవారట. ప్రజలను హింసించటం, ఆస్తులను దోచుకోవటం, ప్రజలతలలపై దీపాల్లా నూనె పోసి వెలిగించటం వంటి ఘోర క్రూర చర్యల వల్ల అతడిపై ద్వేషంతో, క్రోధంతో ప్రజలు ‘ఆద్మీఖూన్’ అని దూషించేవారు ‘ఆదమ్ఖాన్’ని అని ఫరిష్త రాశాడు.
జైనులాబిదీన్ స్వభావరీత్యా సౌమ్యుడు. హింసకు వ్యతిరేకి. అత్యవసరమైతే హింసకు వెనుకాడడు. కానీ అమాయక ప్రజలను హింసించటం, దోచుకోవటం ఇతర సుల్తానులలా, అతనికి ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు, అధికారం చిక్కగానే, తన తనయుడు ఘోరంగా, రాక్షసుడిలా ప్రవర్తించటం జైనులాబిదీన్కు తీవ్రమైన బాధను కలిగించటం స్వాభావికమే. ఆ బాధ వల్ల ఆయన ఇల్లు వదలి బయటకు రాలేకపోవటం కూడా స్వాభావికమే.
జైనులాబిదీన్ వృద్ధుడవుతున్నాడు. చిన్న వయసులోనే రాజ్యాధికారం చేపట్టాడు జైనులాబిదీన్. రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించి సుస్థిరం చేయటం, ఇస్లాం ఛాందసులను అదుపులో పెట్టి కశ్మీరీ పండితులకు కశ్మీరులో భద్రత కల్పించటం వంటి అనేక ఉద్విగ్నతాపూర్వక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాడు. రాజ్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సరిచేశాడు. ఎక్కడ విప్లవ బావుటాలు ఎగసినా వెంటనే అణచివేశాడు.
తన చుట్టూ ఉన్న పండితుల ప్రభావానికి గురయ్యాడు. అనేక నిర్మాణాలు చేపట్టాడు. పరమత సహనం ప్రదర్శించాడు. తన మతంలో వారి వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళాడు. వయసు మళ్ళుతున్న కొద్దీ గతంలోని ఆవేశం, దూకుడు తగ్గుతుంది. నదీ ప్రవాహంలోని చివరి దశ ఇది. ఇంత కాలం శత్రువుల వ్యతిరేకతను ఎదుర్కున్న జైనులాబిదీన్, ఇప్పుడు, తన సంతానం తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది. హాజీఖాన్ తిరుగుబాటును అణచివేశాడు. ఆదమ్ఖాన్ను యువరాజుగా ప్రకటించాడు. అధికార పోరు అంతం అయినట్టు భావించాడు. కానీ యువరాజుగా నిశ్చయమైన మరుక్షణం నుంచీ ఆదమ్ఖాన్ అసలు రూపు బయటపడింది.ఇప్పుడు ఆదమ్ ఖాన్ తిరుగుబాటును అణచివేయాలి. ఈ బాధను భరించలేకపోయాడు జైనులాబిదీన్.
ఎంతటి భయంకరమైన శత్రువుకయినా తలవంచని రాజు భార్యకు తలవంచుతాడంటారు. భార్యకు కూడా లొంగని వాడు సంతానం ముందు మోకరిల్లుతాడంటారు. జైనులాబిదీన్ విషయంలో ఇదే జరుగుతోంది. అతని సంతానం అతని మెడలు వంచుతున్నారు.
పీడాం మా కురుతేత్యాది రాజదూతే బృహత్యమీ।
అవోచన్నితి తద్భృత్యా రాజా క్రన్ద్రతు పీడితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 78)
‘ప్రజలను హింసించకండి’ అని రాజు తన దూత ద్వారా ఆదమ్ఖాన్కు, అతని అనుచరులకు సందేశం పంపాడు. దానికి వారు సమాధానం ఇచ్చారు.
జైనులాబిదీన్ అలసిపోయాడు. బహుశా వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలేవో వచ్చి ఉంటాయి. అందుకని రాజదూతతో సందేశం పంపాడు, ‘ప్రజలను హింసించకండి’ అని. బెదిరించలేదు.
వైరం యో గురుభిః కరోతి సతతం పుణ్యాత్యలం దుర్జనాం
ల్లోభాత్ సంచయమాతనోత్యనుదినం తద్దాన బోగోజ్ఝితం।
దీనాన్ గ్రామ్యజనాంశ్చ పీడయతి యో నిర్హేతుమత్యాక్షిపం
స్తస్యాసన్న వినాశినః స్యవిభవస్తాపాయ శాపాయ వా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 79)
‘రాజును బాధపడనివ్వండి’ – ఎప్పుడయితే వ్యక్తి గురువుతో శత్రుత్వం వహిస్తాడో, దానం, యోగం వదిలి లోభత్వంతో ప్రతి రోజూ అమాయక ప్రజలను దోచుకుంటాడో, ఎలాంటి కారణం లేకుండా ఆగ్రహం ప్రదర్శించి గ్రామీణులను హింసిస్తాడో, మంచిని అణచి, చెడును పోషిస్తాడో, అతడి అంతం సమీపంలోనే ఉన్నదని అర్థం. అతడు దోచుకుని సంపాదించిన ఐశ్వర్యం అతనికి శాపం అవుతుంది, దురదృష్టాన్ని కొని తెస్తుంది.
కుర్వన్ స్వసైన్య సామగ్రీమ్ కృద్దదేవపురే స్థితః।
ఏకదా జైననగరే భూపాలం సబలోభ్యగాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 80)
ఆదమ్ఖాన్ సైన్యాన్ని ‘కృద్దదేవపుర’ వద్ద కూడగట్టుకున్నాడు. రాజుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జైననగరానికి ససైన్యంగా వచ్చాడు.
‘కృద్దదేవపురం’ వద్ద ఆదమ్ఖాన్ సైన్యాన్ని, యుద్ధానికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నాడు. ససైన్యంగా రాజుపై యుద్ధానికి జైననగరం చేరి విడిది చేశాడు. మొదటి నుంచీ ఆదమ్ఖాన్ పిరికివాడని శ్రీవరుడు చెప్తున్నాడు. ఆదమ్ఖాన్ను హాజీఖాన్ నుంచి రక్షించేందుకు జైనులాబిదీన్ స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. హాజీఖాన్ను ఓడించి కశ్మీరు వెడలనడిపాడు. ఆ సమయంలో ఆదమ్ఖాన్ రాజధానిలో దాక్కున్నాడు. అలాంటి భీరువు అయిన ఆదమ్ఖాన్ సైన్యంతో జైనులాబిదీన్పై యుద్ధానికి వస్తాడని అనుకోవటం కష్టం.
కానీ, కొత్తగా లభించిన అధికారం కళ్ళపై పొరలు క్రమ్మగా, తనను చూసి ప్రజలు భయపడటం అహాన్ని సంతృప్తి పరచగా, చుట్టూ చేరిన సేవకులు, ఆ పెరిగిన అహాగ్నికి ఆజ్యం పోయగా, నిజం మరచి, భ్రమలోకంలో భీరువు వీరుడయి రాజుపై యుద్ధానికి వచ్చినట్టున్నాడు.
‘కృద్దదేవపుర’ అంటే ఇప్పటి కుత్బుద్దీన్పుర. సుల్తాన్ కుతుబుద్దీన్ ఈ నగరాన్ని తన పేర నిర్మింపచేశాడు. ఇది ప్రస్తుతం శ్రీనగర్లో భాగమే. అంటే, ఆదమ్ఖాన్ రాజధానికి ఎంత దగ్గరగా వచ్చాడో ఊహించవచ్చు. ఈ నగరంలోనే సుల్తాన్ కుతుబుద్దీన్ని సమాధి చేశారు. ఇది ఝీలమ్ నది అయిదవ, ఆరవ కాలువల నడుమ ఉంది. ఈ స్థలాన్ని రక్షిత స్థలంగా ప్రకటించారు. ఈ నగరంలో ఆగి, పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాదు ఆదమ్ఖాన్. ఎంత పెద్ద సైన్యం అంటే, జైనులాబిదీన్కు కూడా భయం కలిగించేటంత పెద్ద సైన్యం.
తద్దినే శంకితస్తస్మాత్ పూర్ణకర్ణోం దురుక్తభిః।
స్వసైన్య సంగ్రహం రాజా రాజధాన్యం గతోకరోత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 81)
చారుల వల్ల తెలిసిన విషయాలు, ఇతరులు చెప్పిన విషయాలు రాజుకు భయం కలిగించాయి. రాజు కూడా సైన్యాన్ని సమీకరించటం ఆరంభించాడు.
ఇక్కడ శ్రీవరుడు ‘పూర్ణ కర్ణ’ అన్న పదం వాడేడు. మంచి, చెడు వార్తలతో రాజు చెవి నిండిపోయిందట. దాంతో రాజు సైన్యాన్ని సమీకరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆదమ్ఖాన్ శక్తి గురించిన వార్తలు, అతడు రాజధాని దగ్గరకు వచ్చేసిన వార్తలు విన్న రాజుకు యుద్ధం తప్పదని అర్థమయింది.
వితస్తాంతర్వసద్దారూశైలపూర్ణ చతుర్గృహమ్।
తరదాయామపంవ్త్యశ్వదశకం నగరాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 82)
సేతుబంధం వ్యథాజ్జైనకదలాఖ్యామయం నృహః।
స్వకృతం తం తదాజ్ఞాసీత స్వవిఘ్నమివ భీతిదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 83)
వితస్తపై రాజు ‘జైనకదలి’ అనే వంతెనను నిర్మింపచేశాడు. రాళ్ళతో, చెక్కలతో నిర్మించిన ఆ వంతెనపై నాలుగు బురుజులున్నాయి. దరద గ్రామం నుంచి శ్రీనగరం చేరేందుకు నిర్మించిన పదవ వంతెన అది. ఈ వంతెనల ఆధారంగా తిరుగుబాతు సేనలు అతి సులభంగా నగరంలోకి ప్రవేశిస్తాయి.
నగరోపప్లవాశంకీ సంత్రస్తో యత్నమాస్థితః।
పురాన్నిష్కాసయామాస తం సుతం మన్త్రయోక్తిభిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 84)
నగరంలో ఉపద్రవం జరుగుతున్న శబ్దాలు, కేకలు వినిపించటంతో, రాజు మంత్రుల సలహాతో అతి కష్టం మీద తన సంతానాన్ని నగరం వెలుపలకు నెట్టేశాడు.
శ్రీవరుడు రాసిన దానికి భిన్నంగా రాశారు పర్షియన్ చరిత్రకారులు.
సుల్తాన్ ప్రేమతో, మృదువుగా ఆదమ్ఖాన్ను ఒప్పించి పంపించేశాడని ‘పీర్ హసన్’ రాశాడు.
ఆదమ్ఖాన్కు నచ్చజెప్పి, బుజ్జగించి, క్రామరాజ్యానికి పంపించివేశాడు సుల్తాన్ అని మరో గ్రంథంలో రాశారు.
సుల్తాన్ యుక్తితో ప్రోత్సాహమిచ్చి, ఆదమ్ఖాన్ను క్రామరాజ్యం పంపేశాడని ‘తవాకత్ అక్బరీ’లో రాశారు.
పర్షియన్ చరిత్ర రచయితలు ఆదమ్ఖాన్ క్రామరాజ్యం వెళ్లిపోయాడని రాశారు. కానీ శ్రీవరుడు రాసినది చూస్తే, ఆదమ్ఖన్ రాజధాని నగరం వదిలివెళ్ళాడు తప్పించి యుద్ధం మానేయలేదని అనిపిస్తుంది. జైనులాబిదీన్కు కూడా ఇదే భయం కలిగిందని తరువాత జరిగిన సంఘటనలు సూచిస్తాయి.
సంతాపప్రదముత్తరాయణ మిహాలోచ్యాపి రమ్యం గుణై –
ర్యోం వాంఛత్యథ దక్షిణాయనమముం జ్ఞాత్వా హిమార్తిప్రదమ్।
లోకానామసుఖక్షయార్థముభయోరాధ్యం పునర్థో భజ-
త్యర్థాయైవ పరోపకారనిరతః సూర్యాయ తస్మై నమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 85)
చలితో వణుకుతున్న ఉత్తరప్రాంత ప్రజల కోసం ఉత్తరాయణం సమయంలో ఉత్తర ప్రాంతాలకు వేడినిచ్చి కష్టాలను దూరం చేస్తాడు. అంతలో చలికి కష్టపడుతున్న దక్షిణ ప్రాంత ప్రజల కోసం దక్షిణం వైపుకు వస్తాడు. ఇక్కది ప్రాంత ప్రజల కష్టం దూరం చేస్తాడు. మళ్ళీ బాధపడుతున్న ఉత్తర ప్రాంత ప్రజల కోసం ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు సూర్యుడు. అలాంటి పరోపకార పరాయణుడైన సూర్యుడికి నమస్కారం.
ఇక్కడ హఠాత్తుగా ఈ వర్ణన అప్రస్తుతం అనిపిస్తుంది. ఎందుకంటే, కథ ఒక కీలకమైన స్థితిలో ఉంది. జైనులాబిదీన్ మానసికంగా బలహీనుడవుతున్నాడు. భీరువైన ఆదమ్ఖాంటి వంటి వాడు శ్రీనగరంలోకి చొచ్చుకు వచ్చాడు. పరిస్థితి అంతగా విషమించేంత వరకూ జైనులాబిదీన్ ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయాడు.
ఇప్పుడు జైనులాబిదీన్కు బాహ్య శత్రువులు లేరు. అతనికి శత్రువులుగా ఉన్న వారిద్దరూ అతని పుత్రులే. అంటే అంతఃశత్రువులతోనే ప్రమాదం అన్న మాట. వారు తన సంతానమే అవటం మానసికంగా క్రుంగదీసే అంశం. ఇద్దరు పుత్రులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో గెలవనైతే గెలిచాడు కానీ వయసు మళ్ళుతోంది. భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం జరిగితే గెలవగలడో లేడో? ఇద్దరు పుత్రులను విడివిడిగా ఓడించాడు. ఇద్దరూ చేతులు కలిపి కలిసికట్టుగా యుద్ధానికి వస్తే?
ఇలాంటి ఆలోచనలు వ్యక్తిని మరింతగా బలహీనుడిని చేస్తాయి.
జైనులాబిదీన్ జీవితంలో అత్యంత దుర్భరమైన, దయనీయమైన అంత్య దశ ప్రారంభమయింది.
(ఇంకా ఉంది)