[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
ఇత్థం త్రిత్రింశమే వర్షే జ్యేష్ఠం నిష్కాస్య యుక్తితః।
హాజ్యఖానాన్వితస్తుష్టో నగరం ప్రాప భూపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 115)
ఈ రకంగా 33వ సంవత్సరంలో కుట్రపూరితమైన పెద్ద కొడుకును రాజ్యం నుంచి వెడలనడిపి, సంతోషంగా, హ్యాజీఖాన్తో కలిసి నగర ప్రవేశం చేశాడు సుల్తాన్.
మొత్తానికి, ఆదమ్ఖాన్ తిరుగుబాటు ఫలితంగా హాజీఖాన్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది.
తనకు వ్యతిరేకంగా సైన్యాన్ని తీసుకువచ్చాడని హాజీఖాన్ని దూరం పెట్టి, ఆదమ్ఖాన్ను యువరాజుగా ప్రకటించాడు జైనులాబిదీన్. కానీ, ఆదమ్ఖాన్ క్రూరుడని, ప్రజలను క్రూరంగా హింసించి దోచుకుంటాడని, పరమత సహనం లేనివాడని గ్రహించాడు జైనులాబిదీన్. దాంతో తండ్రి ఎక్కడ తనకు రాజ్యం ఇవ్వడో అన్న భయంతో ఆదమ్ఖాన్ తిరుగుబాటు చేశాడు. ఇందువల్ల జైనులాబిదీన్కు ఆదమ్ఖాన్ కన్నా, హాజీఖాన్ మెరుగు అనిపించాడు. ఇప్పుడు హాజీఖాన్ను సులభంగా రాజ్యలక్ష్మి వరించింది, ఆదమ్ఖాన్ మూర్ఖత్వం వల్ల, తొందరపాటు వల్ల.
శిశిర సమయే యోభూత్ క్లిష్టశ్చిరం హతపక్షతిర్ఘరణి కుహరేశ్వన్తః
కాలం నినాయ శుచాకులః।
కుసుమ సమయే ప్రాప్యోద్యానం వికాసిలతోజ్జ్వలం
కిసలయరతః సోయం భృంగం సుఖం రమతే పునః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 116)
శిశిర ఋతువులో ఆహారం లభించక విలవిలలాడే తుమ్మెద, గ్రీష్మ ఋతువులో బాధతో భూమిలో ఏదో ఓ కుహరంలో తల దాచుకుని కాలం గడుపుతుంది. పూలు వికసించే కాలం రావటం తోటే, సంతోషంతో, పట్టరాని ఆనందంతో రెక్కలల్లారుస్తూ రంగు రంగుల పూల నడుమ ఉద్యానవనంలో సుఖంగా విహరిస్తుంది.
హాజీఖాన్ను భ్రమరంతో పోలుస్తున్నాడు శ్రీవరుడు. ఇన్నాళ్ళు సుల్తాన్ కోపాగ్నిని అనుభవించాడు హాజీఖాన్, చలికాలం, ఎండాకాలంలో భ్రమరంలా. ఇప్పుడు సుల్తాన్ కరుణ తనపై ప్రసరించటంతో, పూలు వికసించే కాలంలో, విరబూసిన తోటలోని భ్రమరంలా అయింది అతని పరిస్థితి.
అస్మిన్నవసరె తుష్టాద్హాజ్యఖానో ధృతం చిరాత్।
యౌవరాజ్యాపదం ప్రాపజ్జనకాజ్జనకోపమాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 117)
ఒకప్పుడు తాను అనుభవించిన యువరాజ పదవిని, చాలా కాలం తరువాత మళ్ళీ పొందగలిగాడు హాజీఖాన్.
పితుః ప్రేమమణిం ప్రాప్య స్వచ్ఛం భక్తిపరాయణః।
హృదయాన్నాన్యజ్జాతు శ్రీమాన్ శార్గింవ కౌస్తుభమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 118)
శ్రీమహావిష్ణువు ఎలాగయితే కౌస్తుభ మణిని తన హృదయాన్నే ఉంచుకుని, దూరం పోనియడో, అలాగే తండ్రి ప్రేమ అనే మణిని పొందిన హాజీఖాన్ ఆ మణిని తన హృదయానికి అట్టిపెట్టుకున్నాడు. ఎప్పుడూ దూరం చేయలేదు.
వినయక్షిప్త దేవాగ్రజానుసకు చితాకృతిః।
హకార ఇవ సద్వర్ణః సోష్మా సర్వావధిర్యభౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 119)
దేవతలు అగ్రజుల వెనుక వినయపూర్వకంగా ఒదిగి కూర్చుంటాడు. సుందరుడు, ముఖంలో తేజస్సు కలవాడు, తన పూర్వ ప్రవర్తనకు పశ్చాత్తాప పడుతున్నట్లు ప్రవర్తించాడు హాజీఖాన్.
తన కన్నా ముందున్న దేవతల వంటి అక్షరాల ముందు ‘హ’కారంలా తల వంచుకుని కూర్చున్నాడు.
‘హ’కారం అనటం వెనుక ఓ అర్థం ఉంది. ‘హఠ’యోగం ప్రకారం ‘హ’ సూర్యుడు, ‘ఠ’ చంద్రుడు. సూర్యుడు ప్రాణవాయువు, చంద్రుడు అపానవాయువు. ఈ రెంటిని ఏకం చేసేది ప్రాణాయామం. ఇదే హఠయోగం. ‘హ’ అక్షరం శివుడు, జలం, ఆకాశాలను సూచిస్తుంది.
న తత్తీర్థం వ సా యాత్రో న సా లీలా న చోత్సవః।
తదాభూన్నైవ యత్రాగాద్హాజ్యఖానాన్వితో నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 120)
రాజు హాజీఖాన్ని వెంట తీసుకెళ్ళని తీర్థం లేదు, చేయని యాత్ర లేదు, కలసి వెళ్ళని ప్రదర్శన (నాటకం) లేదు.
హాజీఖాన్ను వెంట తీసుకుని జైనులాబిదీన్ తీర్థాలు, నగరాలు, నదులు – ఇలా అన్నీ తిరగటం, బలహీనమైన జైనులాబిదీన్ మనస్తత్వాన్ని సూచిస్తుంది. వృద్ధాప్యం వల్లనో, అనారోగ్యం వల్లనో జైనులాబిదీన్ శారీరికంగా బలహీనపడ్డాడు. అది మనసుపై ప్రభావం చూపిస్తుంది. కొడుకుల నడుమ అధికారం కోసం పోరు అతడిని మరింత దెబ్బతీసి ఉంటుంది. అందువల్ల తిరిగి వచ్చిన కొడుకు హాజీఖాన్ను వదిలేందుకు ఇష్టపడటం లేదు. వదిలితే ఎక్కడ దూరమైపోతాడో అన్న అభద్రతా భావం వల్ల కావచ్చు.. ఎటు వెళ్ళినా, హాజీఖాన్ను వెంట తీసుకుని వెళ్తున్నాడు.
యో నిత్యం పఠితో కృతో గణశతైరత్యర్థ భక్త్యజ్జ్వలైః
పుత్రోభ్యాం సహితో హితస్త్రిజగతాం నానా విలాసాన్ భజన్।
కాలో గచ్ఛతి యస్య లాస్యలలితం గీతం చ సంశృణ్యతః
శస్యః కస్య న తన్నమస్య విభవః కైలాసవాసో భవః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 121)
ఇద్దరు పుత్రులు వెంట ఉండగా, ప్రపంచానికి హితైషి, వందమంది ప్రమథగణాలు వెంట ఉండగా, సకల ఆనందాలు అనుభవిస్తూ, నృత్యంతో కూడిన గీతాలను వింటూ చూస్తూ ఆనందిస్తున్న మహాదేవుడిని, కైలాసవాసుడిని ప్రార్థించనిదెవరు?
ఈ శ్లోకంలో శ్రీవరుడు ‘లాస్యలలితం గీతం’ అన్న పదబంధం వాడేడు. ‘లాస్యం’ అన్నది నృత్య సంబంధి. సాధారణంగా ‘లాస్యం’ శృంగార భరిత స్త్రీ పురుష నృత్యాన్ని సూచిస్తుంది. ఇందులో ప్రేమ భావనలు – విభిన్న హావభావాల అంగవిన్యాసాల ద్వారా ప్రకటితమవుతాయి.
ఇతి జైనరాజతరంగిణ్యామ ఆదమ్ఖాన నిర్వాసనం/హాజ్యఖాన సంయోగ వర్ణన నామ తృతీయ సర్గః
వచ్చే వారం నుంచి శ్రీవర రాజతరంగిణి నాలుగవ సర్గ ఆరంభం.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
