[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
చతుర్థ సర్గ
పంకాతంక కళంకితా జలమయా యె భోగిదేహార్తిదా
స్త్వద్దేశే విలసన్త్యు పాత్త విషయాః సన్మార్గ విఘ్నద్వతాః।
తే యాతాః స్వయమేవదేవ విలయం శ్రీమత్ప్రతాపోదయా
దస్మిన్ హర్షమయే వసన్త సమయే ప్రాలయపురా యథా॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 48)
బురదతో కళంకితమైన శరీరం, సన్మార్గంలో అడ్డంకులు దాటుకుని జాలాపుర దేశంలో వచ్చి వికసిస్తాయి. సూర్యరశ్మికి మంచుతో కప్పిన నగరం ఎలా ప్రకటితవుతుందో అలా, మహారాజు ప్రతాపం ప్రకటితమవటంతో జలప్రళయం స్వయంగా ఆగిపోతుంది.
అంటే, మహారాజు ప్రతాపం వల్ల – దేశాన్ని జలమయం చేసి, బురదమయం చేసి, ప్రజలను ఇబ్బందుల పాలు చేసే వరద నీరు జలాశయాలకే పరిమితం అవుతోంది. నగరం సుందరంగా అగుపిస్తోంది.
శృత్వేతి భూపతిర్హష్టో హాజ్యఖానాయ సత్వరమ్।
సౌవర్ణకర్తరీబంధం సప్రమేయం సమార్పిపత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 49)
ఇది విని రాజు సంతోషించాడు. హ్యాజీఖాన్కు జాగీర్లు, బంగారు ఛురికను బహుమతిగా ఇచ్చాడు.
పీర్ హసన్ ప్రకారం బాద్షాహకు తన పిల్లలందరిలోకీ హజీఖాన్ అంటే ఎక్కువ ఇష్టం. హజీఖాన్కు రత్నఖచిత ఖడ్గంతో పాటు ‘ముల్తాన్’ జాగీరులను ఇచ్చాడు. ‘జాగీర్ ముకర్రర్ నమూద్’ అంటే జాగీర్లను నమోదు చేశాడు.
ఆ కాలంలో, జైనులాబిదీన్, హజీఖాన్కు ఇచ్చిన మాన్యములు, జాగీర్లు ముల్తాన్ లోనివి. ఆ ముల్తాన్ ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన పంజాబ్‌లో ఒక ప్రధాన నగరం. పాకిస్తాన్ లోని అయిదు పెద్ద నగరాలలో ఒకటి. చీనాబ్ నది ఒడ్డున ఉంది. పాకిస్తాన్ పంజాబ్ లో ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక మత కేంద్రం. ముల్తాన్ నగరాన్ని కశ్యపుడు నిర్మించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో త్రిగర్త రాజధాని ముల్తాన్.
8వ శతాబ్దంలో రాజు ‘దాహిర్’ నుంచి ఈ రాజ్యం మహమద్ బిన్ ఖాసిమ్ గెలుచుకున్నాడు. పదవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజపుత్ర రాజు జయపాలుడికి ఘజ్నీపై దాడిలో సహకరించాడు. కానీ ఆ దాడి విఫలమయింది. ఆ తరువాత రాజ్యం సంపూర్ణంగా ఇస్లాం పరమయింది.
కానీ ‘ముల్తాన్’లో ప్రాంతాలను జైనులాబిదీన్ హజీఖాన్కు రాసిచ్చాడని రాసిన పర్షియన్ రచయితలు ఏయే ప్రాంతాలో చెప్పకపోవటంతో చరిత్ర పరిశోధకులలో సందిగ్ధాలు నెలకొన్నాయి.
రాజతరంగిణిలో హాజిఖాన్కు ‘జాగీర్’లు రాసిచ్చిన సమయానికి ముల్తాన్‌పై ఢిల్లీ సుల్తానుల పట్టు తప్పింది. క్రీ.శ.1437లో సింధుకు చెందిన ‘బుధక్ ఖాన్’ ముల్తాన్‌పై అధికారాన్ని సాధించాడు. ముల్తాన్ స్వతంత్రమైన రాజ్యంగా ఎదిగింది. క్రీ.శ. 1420 – 1470 వరకూ కశ్మీరును జైనులాబిదీన్ పాలించాడు. ఈ దానం అతని పాలన చివరి రోజుల్లో ఇచ్చాడు. ఆ సమయానికి ‘ముల్తాన్’ స్వతంత్ర రాజ్యంగా ఎదిగింది. కాబట్టి పీర్ హసన్ చెప్పినట్టు హజీఖాన్కు ముల్తాన్‌లో సుల్తాన్ జాగీర్లు రాసిచ్చి వీలు లేదని పలువురి అభిప్రాయం. శ్రీవరుడు జాగీర్లు రాసి ఇచ్చాడన్నాడు, కానీ ఎక్కడో చెప్పలేదు.
యైయైః సేవా కృతా తస్య బాహ్యదేశే విచార్య తాన్।
పుత్ర స్నేహేన భూపాలో ఘోష రాష్ట్రధిపాన్ వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 50)
గతంలో హ్యజీఖాన్కు సేవ చేసిన వారందరి గురించి కనుక్కుని రాజు, తన పుత్రుడి స్నేహితులకు ఘోష దేశం భూములిచ్చాడు.
శ్రీవరుడు ‘బాహ్యదేశం’ అన్నది, కొన్ని ప్రతులలో ‘షాహ’దేశం అని ఉంది. అంటే, కశ్మీరు కాక, మన భారతదేశంలో ఇతర భాగంగా భావించవచ్చు. ‘ఘోష’ దేశం ఏమిటో అదెక్కడుందో తెలియలేదు. ఎందుకంటే శ్రీవరుడు తప్ప ఎవ్వరూ ఆ దేశం ప్రస్తావన ఎక్కడా చేయలేదు.
ప్రేష్యాద్యాక్షే పసిన్ద్వౌధ మగ్నాంస్తాన్ సేవక వ్రజాన్।
ప్రసాదపట్టపోతేన సుముతీర్ణాన్ వ్యధాన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 51)
ఇప్పుడు రాజు భూములు ఇచ్చిన వారంతా ఒకప్పుడు రాజాగ్రహం చవి చూచినవారే. కానీ ఇప్పుడు రాజు వారికి చక్కని దుస్తులిచ్చాడు. తన అనుగ్రహామనే నావలో వారిని నది దాటించాడు.
విద్వద్గీతాంగిభృత్య భ్యస్తస్మిన్నవసరకే నృపః।
సుతాక్త్యౌ నంద బాష్పాఢ్యో వ్యధాత్ కనకర్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 52)
తన కొడుకు తిరిగి తన దగ్గరకు వచ్చిన సంతోషంతో రాజు ఆనందబాష్పాలు రాల్చాడు. పండితులు, గాయకులు, భృత్యులందరిపై కనకవర్షం కురిపించాడు.
తన కొడుకు తిరిగి లభించిన ఆనందంతో రాజు కనకవర్షం కురిపించాడని శ్రీవరుడు రాశాడు. తన కొడుకు స్నేహితులందిరికీ జాగీర్లుచ్చాడని రాశాడు. కానీ ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం రాజును పొగడి తన వైపు ప్రసన్నడిని చేసుకున్న హ్యజీఖాన్, తన మిత్రులందరికీ బహుమతులివ్వాలని సుల్తాన్‌ను ఒప్పించి అందరికి భూములు ఇప్పించాడు .
దత్తమార్గోపచారార్థా రాష్ట్రియా దర్శనాగతాః।
ప్రాప్తపట్ట పరీధాన మానతుష్టా న కేభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 53)
దీపోత్సవం సందర్భంగా నృత్య ప్రదర్శనల కోసం వచ్చిన వారందరికీ దారి ఖర్చులిచ్చాడు రాజు. వారందరికీ ఖరీదైన పట్టుబట్టలిచ్చాడు. ఇంతగా గౌరవం పొందిన తరువాత సంతృప్తి చెందని వారెవరు?
నిజంగా, జైనులాబిదీన్ పాలనా కాలం కశ్మీరుకు స్వర్ణయుగం లాంటిదే. ఉత్సవాలలో పాల్గొన్న పండితులు, కళాకారులకు సన్మానాలే కాక, దారి ప్రయాణ ఖర్చులు, పట్టుబట్టలు.. ఇలా అందరినీ ఆదరించి, గౌరవించి, సంతోషపరచి, సంతృప్తిని కలిగించే రాజు ఆనాటి కశ్మీరు ప్రజల అదృష్టం.
తాన్ విలోక్య భవనోపమాదీన్
పుష్పరాగ పరిపూరిత నౌకః।
సంస్తువన్ మడవ రాజ్య నివాసన్
ప్రాప జైన నృప తిర్నగరం స్వమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 54)
రాజు జైనులాబిదీన్ ఇళ్లు చూశాడు. వనాలు చూశాడు. పూలతో నిండి ఉన్న తన నౌకను చూశాడు. మాడవ రాజ్య నివాసులను మెచ్చుకున్నాడు. తన రాజ్య రాజధానికి చేరుకున్నాడు.
శ్రీవరుడు చేసిన వర్ణన మనల్ని స్థలకాలదులను మరపింపచేస్తుంది. ఏదో లోకానికి తీసుకువెళ్తుంది. పండగలు, నృత్యాలు, గీతాలు, సాహిత్యం వర్ణనతో కళ్ల ముందు ఒక మహాద్భుతమైన సుందరము, మనోహరమైన ఆనంద సందోహాల ప్రపంచాన్ని నిలుపుతాడు.
ఇదే సత్యమైన, నిత్యమైన ప్రపంచం అనిపిస్తుంది. అంతలో రాజు రాజధాని చేరుకున్నాడు. మళ్లీ మామూలు ప్రపంచానికి వచ్చి పడతాం.
ఇతి జైనరాజతరంగిణ్యాం పుష్పలీలావర్ణనం నామ
చతుర్థః సర్గః॥
దీనితో జైనరాజతరంగిణి రచనలో పుష్పలీలా వర్ణనం అన్న నాలుగవ సర్గ సంపూర్ణం అవుతుంది.
పంచమ సర్గతో వచ్చే వారం మళ్లీ శ్రీవర విరచిత తృతీయ రాజతరంగిణి వ్యాఖ్య సహిత అనువాదం కొనసాగుతుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
