Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-78

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

దాతా భవేత్ క్షితిపతిర్యది సాదరోయం
లోకోపి దర్శయతి తత్ స్వకలాకలాపమ్।
వర్షాసు వర్షతి ఘనో యది చాతకోపి
నృత్యన్ ముదా భవతి తజ్జనరంజనాయ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 1)

రాజు అందరినీ సాదరంగా గౌరవించి, ఆదరించే వాడయితే ప్రజలు కూడా స్వేచ్ఛగా తమ కళాకలాపాలను ప్రదర్శిస్తారు. ఎలాగయితే మేఘాలు వర్షిస్తే చాతక పక్షి ఆనందంతో నృత్యం చేస్తూ ప్రజలకు మనోరంజంకం కలిగిస్తుందో అలాగ.

చక్కని శ్లోకం ఇది.

రాజును వర్షించే మేఘంతో, కళాకారులను చాతక పక్షితో పోల్చటం ఎంతో ఔచితీవంతం మాత్రమే కాదు అత్యంత ఆనందకరం కూడా.

రాజు వర్షించే మేఘం. మేఘం ప్రపంచానికి జలాన్ని ఇస్తుంది. జీవాన్ని నిలుపుతుంది. వర్షం వల్ల పంటలు పండుతాయి. ఆహారం లభిస్తుంది. రాజు కనుక మేఘం లాంటి వాడయితే ఎంతో ఆనందం. ఇందుకు భిన్నంగా రాజు వర్షించని మేఘం లాంటి వాడయితే, ఏమీ ఇవ్వని వాడయితే క్షామమే.

కళాకారులు చాతక పక్షులలాంటి వారు. చాతక పక్షుల గురించి పలు విభిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. చాతక పక్షులకు మేఘజీవన్, పపీహా వంటి పేర్లున్నాయి. ఆ పక్షులు నదులు, సరోవరంతో సహా భూమి మీది నీటిని తాగవు. అవి తలఎత్తి ఆకాశం వైపు చూస్తూంటాయి. మేఘ నుండి జాలు వారే నీటి బిందువులు భూమిని తాకకముందే తాగుతాయి. స్వాతి నక్షత్రం కనిపించే సమయంలో మేఘాలు వర్షించే నీటి బిందువులను మాత్రమే సేవిస్తాయని కొందరంటారు. మరి కొందరు ఇవి వెన్నెలను మాత్రమే తాగుతాయంటారు. ఏది ఏమైనా, చాతక పక్షులు వర్షించే మేఘం నుండి వెలువడే నీటి బిందువులను మాత్రమే పీలుస్తాయి కాబట్టి వీటి పేరు ‘మేఘ జీవన్’ అంటే ప్రాణాలు పోయినా పరవాలేదు కానీ మేఘం నీరే కావాలి.

కళాకారులు కూడా అలాంటి వారే. వారిని గౌరవించి అభిమానించే వారుంటే వారు ఇష్టంగా కళను సృజిస్తారు. లేకపోతే ముడుచుకుపోతారు. ఇష్టం లేని వారి ముందు కళా ప్రదర్శనకు వారు ఇష్టపడరు. ఎన్ని కష్టాలయినా సహిస్తారు కానీ నచ్చనివారి ముందు వారి కళ పురివిప్పదు. మనకు పోతన ఉదాహరణ ఉండనే ఉంది. కాబట్టి, మేఘంలా సాదరంగా ఆహ్వానించి వరాల వర్షాలు కురిపించే రాజుంటే, చాతక పక్షులు వర్షపు మేఘం చూసి నృత్యం చేసేట్టు ఆనందంగా తమ సృజనాత్మక కళా ప్రదర్శనతో కవులు కదం తొక్కుతారు.

అథోత్తర పథాద్ దానఖ్యాతికీర్తేర్మహీపతేః।
రజ్జుభ్రమణశిల్పజ్ఞః కోప్యాగాత్ యవనోన్తికమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 2)

దానాలివ్వటంలో రాజు ప్రసిద్ధి విని ఉత్తర పథం నుంచి తాడు పై నడవ గలిగిన ఓ యవనుడు   వచ్చాడు.

‘నట’,‘నటులు’ అన్న పదం ప్రాచీన కాలంలో తాళ్లపై విన్యాసాలు చేసే వారిని సూచించేందుకు వాడేవారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో తాళ్లపై విన్యాసాలు చేయటం ఒక కళ. పండుగలకు జరిగే సంబరాలు, జాతరల్లో వీరు పలు ప్రదర్శనలిచ్చి ప్రజల మెప్పు పొంది ధనం సంపాదించుకునేవారు. కానీ వీరంతా ఇస్లాం దండయాత్రల వల్ల ఇస్లామీయులుగా మారిపోయారు. కానీ తమ వృత్తిలో కొనసాగారు. అంటే, అధిక శాతం ఇలాంటి వృత్తుల వారు ఇస్లామీయులయ్యారన్న మాట. అలాంటి వారిలో ఒక యువకుడు, జైనులాబిదీన్ గొప్పతనం, దాన గుణం తెలిసి కశ్మీరు వచ్చాడు, తన విద్యా ప్రదర్శనకు.

వింశప్రస్థాభిదే స్థానే కదాచిద్ యవనోత్సవే।
తం ద్రష్టుమాగమద్ రాజా పరివార విభూషితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 3)

‘వింశప్రస్థం’ అనే ప్రదేశంలో యవనోత్సవం సందర్భంగా అతని ప్రదర్శన చూసేందుకు రాజు పరివార సమేతంగా విచ్చేశాడు.

‘బహరిస్తాన్’ ప్రకారం ‘వింశప్రస్థ’ అనేది  శ్రీనగరంలోని ‘ఈద్గాహ’ మైదానం.

‘యవనోత్సావం’ అంటే ‘ఈద్గాహ’ మైదానంలో యవనులు జరుగుకునే ఏదో ఉత్సవం అయి ఉంటుంది. ఆ ఉత్సవ సమయంలో అతని ప్రదర్శన చూసేందుకు రాజు సపరివార సమేతంగా వచ్చి ఉంటాడు.

ధనుర్దండ శతాయామాన్తర స్థాన్ దీర్ఘరజ్జుభిః।
ఉచ్చాన్ స్తంభానబద్రాత్ స స్వశిల్పప్రథనోద్యతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 4)

వంద ధనుస్సుల దూరంలో ఉన్న రెండు స్థంభాల నడుమ తాడును లాగి కట్టాడు. అతడు తన కళను ప్రదర్శించాలని ఉత్సాహంగా ఉన్నాడు.

అథో భూభాగలగ్నైకరజ్జు మార్గేణ నిర్భయః।
ఆరోహమకరోత్తత్ర పతత్రీవ నభన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 5)

అక్కడ ఉన్న నాగులు తమ భూపాలుడికి ఏమైనా విపత్తు సంభవిస్తుందేమోనన్న భయంతో ఉన్నాయి.

నిపాతాస్థలితాం తత్ర లోకచిత్తానురంజితామ్।
కవితామివ అల్పేజ్యశ్చిత్రాం పదగతిం వ్యథాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 6)

అనీచవర్తినస్తస్య గ్రహస్యేవ ఫలప్రదా।
సుర్సశ్మిరాశిగస్యాలం బభూవాశ్చర్య భూర్నృణామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 7)

ఒక చక్కటి కవిత వింటే ఎంత ఆనందం కలుగుతుందో, ఆ వ్యక్తి పక్షిలాగా తాడు పైకి ఎక్కి అడుగులు వేయటం, అంత ఆనందం కలిగించింది. ఒక గ్రహంలా అతడు ఆ రెండు స్తంభాల నడుమ నడిచాడు. ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాడు.

కృత్వా సుఖం సురుచిరం సుచిరం విధాతా
దుఃఖం పునర్జనపదే ఓజయత్య సహ్యమ్।
వర్షం ప్రదర్శ్య జలదః కృషిహర్ష హేతుమ్
నేతుం ఫలం వితనుతే కరకావికారమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 8,9)

చిరకాలం సుఖాన్ని ప్రదానం చేసిన విధాతే, ప్రజలకు హఠాత్తుగా దుఃఖాన్ని ఇస్తాడు. వర్షం కురిపించి రైతులను సంతోషపెట్టిన మేఘమే, ఆకాల వర్షంతో ఫలం వారికి దక్కకుండా చేస్తుంది.

ఇది లోక రీతి. సుఖం ఎల్లప్పుడూ ఉండదు. కష్టం ఎల్లకాలం ఉండదు. కానీ కానీ విధాత సృష్టి ఇంతే.

సౌరాజ్య సుఖిత దేశే నరేశే నిరుపద్రవే।
అకస్మాద్ దుఃసహాన్ జాతానుత్పాతాన్ దదృశుర్జనాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 10)

సుపరిపాలనతో సుఖంగా ఉన్న ప్రజలు, ఉపద్రవరహితంగా ఉండటం  అలవాటయిన ప్రజలు అకస్మాత్తుగా ఉత్పాతాలు ఉత్పన్నమవటం చూశారు.

ఈత్సాతం కాగమె సేతుర్హేతుః సర్వజనక్షయే।
అథోత్తర దిశా రాత్రౌ ధూమకేతురదృశ్యత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 11)

రాత్రి ఉత్తర దిశలో అతివృష్టి అనావృష్టిని సూచిస్తూ, మానవ ప్రాణనష్టాన్ని సూచిస్తూ ‘తోకచుక్క’ ఆకాశంలో కనిపించింది.

తోకచుక్కను ‘ధూమకేతువు’ అంటారు. తోకచుక్క ఆకాశంలో కనిపించటం గురించి శుభ అశుభ ఆలోచనలున్నాయి. ‘బాబర్’, ‘అక్బర్’లు మరణించే ముందు తోకచుక్క కనిపించిందని  పర్షియన్ చరిత్రకారులు వర్ణించారు. ఇస్లామీయులలో తోకచుక్క కనబడటం నష్టదాయకం అన్న నమ్మకం ఉంది.

శ్రీవరుడు తోకచుక్క వర్ణన ఆరంభించక ముందే ప్రజలకు దేశంలో అరిష్టం వచ్చే సూచనలు కనిపించాయన్న శ్లోకం రచించాడు. అతివృష్టి, అనావృష్టికి సూచన అన్నాడు. మానవ ప్రాణనష్టం అన్నాడు. కానీ తోకచుక్కల వల్ల పాలకులకు కూడా ప్రమాదం.

శ్రీవరుడు తోకచుక్క కనిపించిన సంవత్సరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ చరిత్రకారులు విశ్లేషించి, పరిశోధించి ఇది 15వ శతాబ్దంలో కనబడిన ‘హెలీ’ తోకచుక్క అని నిర్ధారించారు.

దీర్ఘపుచ్ఛోచ్ఛలత్కాన్తితత్కతుకపటాద్ ధృవమ్।
కాలేన దృఘణం క్షిప్తం క్షాయామేవ మహీక్షితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 12)

తోకచుక్క తోక తేజోవంతమయమై అందంగా ఉంది. దాన్ని చూస్తుంటే రాజులను నాశనం చేసేందుకు యముడు విసిరిన యమపాశంలా ఉంది. శ్రీవరుడు యముడు పంపిన ‘గొడ్డలి’లా ఉంది, తేజోమయమైన ధూమకేతు తోక అన్నాడు.

మాసాద్వయం స్ఫురన్నాసీత్ స వ్యోమ్ని విమలే సదా।
సదయే హృదయే రాజ్ఞాశ్చింతౌఘోఅనిష్ట శంకయా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 13)

రెండు మాసాల పాటు నిర్మలమైన ఆకాశంలో ఆ తోకచుక్క ప్రజ్వలిస్తూ ధర్శనమిస్తూనే ఉంది. ఆ తోకచుక్క రాక వల్ల ఎలాంటి ఉపద్రవం సంభవిస్తుందో, ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోనని రాజు ఆందోళనాంతరంగుడయ్యాడు.

దృశ్యన్త సదా శ్వానో విక్రోశన్తః పురాన్తరే।
శుచేవ రుదితాక్రన్దా భావివిఘ్నేక్షణాదివ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 14)

రాబోయే సర్వనాశనాన్ని దర్శిస్తున్నట్టు కుక్కలు రోజంతా అరుస్తూ ఉండేవి. విషాదంగా రోదిస్తూండేవి.

జంతువులతో పోలిస్తే మనుషుల ఇంద్రియాల శక్తి పరిమితం. కాబట్టి మనుషుల ఇంద్రియాలకు అందనివి జంతువులు పసిగడతాయి. భూకంపాల రాకడ జంతువులు ముందే గ్రహిస్తాయి. సునామీ రావటం వాటికి ముందే తెలుస్తుంది. అలాగే, ఇప్పుడు తోకచుక్క రావటంతో భవిష్యత్తులో జరిగే అనర్థాలను పసిగట్టిన కుక్కలు విహ్వలంగా అరవటం, ఏడవటం చేస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా రాజు మానసిక స్థితి పై ప్రబావం చూపిస్తుండవచ్చు.

ఏకపక్షేఅభవశ్చంద్రసూర్యగ్రహణసంస్థితిః।
ఏకపక్షమివాదాతుం రాజ్యం విపర్యయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 15)

ఒకే పక్షంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించాయి. ఇంత వరకూ ఎలాంటి విపత్తు, విభజనల్లేని సామ్రాజ్యం నాశనం అయ్యేందుకు సూచనగా ఆ రెండూ రావటం రాజు హృదయంలో ఆవేదనను, భయాన్ని పెంచింది.

సాధారణంగా చంద్రగహణం పౌర్ణమి నాడు, సూర్యగ్రహణం అమావాస్య నాడు సంభవిస్తాయి. సంవత్సరంలో అధికంగా 7 మార్లు గ్రహణాలు సంభవించే వీలుంటుంది. వీటిల్లో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల కన్నా అధికంగా ఉంటాయి. సగటున 4 సూర్య గ్రహణాలు 3 చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. ఏదైనా సంవత్సరంలో రెండే గ్రహణాలు ఉంటే ఆ రెండూ సూర్యగ్రహణాలే అవుతాయి. అందుకే ఒక పక్షంలో రెండు గ్రహణాలు, ఒకటి సూర్య గ్రహణం, మరొకటి చంద్రగ్రహణం రావటం ఆందోళన కలిగించటం సహజం. ఆపై, రెండు నెలల నుంచీ తోకచుక్క ఒకటి బాధిస్తునే ఉంది. ఇవన్నీ మూఢనమ్మకాలు, అమాయకత్వం, తెలియనితనం అని కొట్టిపారేసే వారికి ఓ నమస్కారం. కానీ కశ్మీరులో తరువాత సంభవించిన సంఘటనలను తెలుసుకుంటే ఈ భయాలు, ఆందోళనలు నిర్హేతుకాలు కావేమోననిపిస్తుంది. ఎవరి నమ్మకం వారిది. ఎవరి అపనమ్మకం వారిది. ఎవరి నమ్మకాలు, అపనమ్మకాలతో పని లేకుండా సృష్టి తన పని తాను నిర్ధిష్ట సూత్రాల ప్రకారం చేసుకుంటూ పోతుంది.  అదే ఋతం!

(ఇంకా ఉంది)

Exit mobile version