[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
అత్రాంతరే సుయ్యసిద్ధకృతం సుయ్యపురం మహత్।
సమస్తం వహ్నినా దగ్ధం శూన్యారణ్యమివాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 34)
ఇంతలో సుయ్యపురం సంపూర్ణంగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ నగర ప్రాంతం మొత్తం అరణ్యంలా అయిపోయింది.
ఈ శ్లోకంలో సుయ్య నిర్మితమైన ‘సుయ్యపురం’ అని ఉంది. ‘సుయ్య’ అనేవాడు అవంతి వర్మకు మంత్రి. ఆయన సింధునది, వితస్త సంగమ స్థలి మారే విధంగా వితస్త నీటిని మళ్లించి మరీ ‘సుయ్యపురం’ నిర్మింప చేశాడు. ప్రస్తుతం ఈ సుయ్యపురిని ‘సోపోర్’ అంటున్నారు.
తోకచుక్క కనిపించింది. ఏ అనర్థం వస్తుందోనని ప్రజలు, రాజు భయపడుతున్నారు. విపత్తులు, అనర్థాలు మొదలయ్యాయి. ఇకపై నుంచి ఒకటొకటిగా జైనులాబిదీన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది.
క్రమరాజ్య స్ఫురత్ప్రాజ్యరాజ్యతన్త్ర క్రియాంకితమ్।
భూర్జభాండాది తత్రస్థం సమస్తం భస్మసాదభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 35)
క్రమరాజ్య పాలనకు సంబంధించిన వివరాలున్న భూర్జపత్రాల భాండాగారాలన్నీ బూడిద అయిపోయాయి.
శ్రీవరుడు ‘సుయ్యాపురం’ అగ్నిలో దగ్ధమయినట్టు చెప్పాడు కానీ కారణం చెప్పలేదు. బహరిస్తాన్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. మొత్తం పాలనకు సంబంధించిన పత్రలు, భాండాగారాలు అగ్నికి దగ్ధమయి పోయాయి. ఒక నగరం మొత్తం బూడిదయి అరణ్యంలా మారిపోయింది. కానీ, దాని ప్రస్తావన శ్రీవరుడు తప్ప మరెవరూ చేయలేదు. శ్రీవరుడు కూడా దగ్ధమయిందని చెప్పాడు కానీ, కారణం చెప్పలేదు. ఇది పలు ఊహలకు తావిస్తుంది. ఈ సంఘటన తరువాత కశ్మీరంలో జరిగిన సంఘటనలను గమనిస్తూ, ఈ నగరం దగ్ధమవటం వెనుక ఉన్న సంఘర్షణలను ఊహించే వీలుంటంది. కానీ అవన్నీ ఊహలే తప్ప నిజాలని నిర్ధారించలేము.
గ్రాహ్యో జైనగిరిక్షేత్రే సప్తమాంశోన్న భావిభిః।
ఇతి తామ్రమయే పట్టే కల్పం యస్యాం వ్యథాన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 36)
శ్రీమాన్ జైనోల్లాభదీనో నరేశో
యాచి భూపాన్ భావినో జైనగిర్యామ్।
కృష్టోత్పాట్య స్వైర్థనైర్భూర్మయాత్ర
తస్యా గ్రాహ్యః సప్తమాంశో భవద్ధిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 37)
ఈ జనగిరి క్షేత్రం భావి ప్రభువుల కోసం తామ్ర పత్రం పై రాజు శాసనం రాయించాడు. భావి తరాల రాజులు ప్రజల ఆదాయం నుంచి ఏడవ వంతు మాత్రమే గ్రహించాలని సూచిస్తున్న, ఆ శాసనం ఇలా ఉంది:
శ్రీమాన్ జైనులాబిదీన్, భావి నృపులకు సూచించిదేమిటంటే, ఈ జైనపురిని నేను ఎంతో శ్రమించ సుసంపన్నంగా చేశాను. ఈ జైనపురి ప్రజల ఆదాయంలో ఏడవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలని మనవి.
సోపోర్ సమీపంలో ఉంటుంది జైనగిరి. ఇది క్రామరాజ్య పరగణా పరిధిలోకి వస్తుంది. జైనులాబిదీన్‌కు కశ్మీరు కానీ, కశ్మీరీ ప్రజలు కానీ ఎంత ఇష్టమో ఈ సూచన ప్రతిబింబింస్తుంది. తానే కాదు, భవిష్యత్తులో రాజులు కూడా ప్రజలపై పన్నుల భారం వేసి హింసించకుండా చేయాలన్న తపన కనిపిస్తుంది. ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేట్టు చేయాలన్న ఆలోచన కనిపిస్తుంది. ఇదెలాంటిదంటే తన తరువాత తన సంతానం ఎలాంటి కష్టాలను అనుభవించకూడదని తల్లిదండ్రులు పడే తపన లాంటిది.
జలావరణం కృత్వా గిరీనుల్లంఘ్య మత్కృతః।
పుణ్యకేతురయం సేతువర్ధనీయః శుభేచ్ఛయా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 38)
నీటి లోతులలో దిగి, పర్వత శిఖరాలను అధిరోహించి మరీ నేను ఈ పుణ్యసేతువును నిర్మించాను. మీరు మీ మంచితనంతో ఈ సేతువును వర్ధిల్ల చేయండి.
నిజంగానే ఒక తండ్రి సంతానానికి ఆస్తిని అప్పగిస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడి పెంచండి, నాశనం చేయకండి అని నచ్చచెప్తున్నట్టుంది. తామెంతో కష్టపడి నిర్మించిన ఈ కశ్మీరాన్ని అభివృద్ధి చేయండి, నాశనం చేయకండి.
ఇక్కడ ‘సేతు’ అన్న పదం వంతెన అనే అర్థాన్నిస్తుంది మామూలుగా. కానీ పుణ్యసేతు అనటం జైనులాబిదీన్ అసలు ఉద్దేశం స్పష్టం చేస్తుంది.
ఇస్లాంలో ఆరంభంలో ‘సుల్తాన్’ అన్న పదానికి అర్థం వేరు.
‘సుల్తాన్’ అంటే ముస్లిం పాలకుడు. ఎలాంటి పాలకుడు అంటే, నైతిక, ఆధ్యాత్మిక విషయాల పాలకుడు. కానీ అతనికి మతపరమైన అధికారం లేదు. ఆ అధికారం ఖలీఫాది. అంటే, ‘సుల్తాన్’ అన్న పదానికి రాజు, అన్న అర్థం లేదన్న మాట. ‘ఖురాన్’ ప్రకారం ‘సుల్తాన్’ అన్న వాడు నైతిక విలువలు, ఆధ్యాత్మిక ఆలోచనల పాలకుడు మాత్రమే. కానీ 11వ శతాబ్దంలో ‘మహమ్మద్ ఘజనీ’ రాజుకు ‘సుల్తాన్’ అన్న పదం వాడటంతో, సుల్తాన్ అంటే రాజ్యాధికారి అన్న అర్థం వాడకంలోకి వచ్చింది. అంత వరకూ రాజకీయంలో ‘సుల్తాన్’ అన్న పదం వాడటం లేదు.
పండితుల సంపర్కం వల్ల, శాస్త్రాల పఠనం వల్ల జైనులాబిదీన్ ‘సుల్తాన్’ అసలు అర్థం గ్రహించి ఉంటాడు. దానికి భారతీయ ధర్మంలో రాజు పాలకుడు, అంటే, విష్ణువు అవతారం అనీ, రాచరికం, ఒక బాధ్యత అనీ, ప్రజలను సక్రమంగా, కన్నబిడ్డల్లా పాలించటం పుణ్యకార్యం అనీ తెలిసి ఉంటుంది. అందుకని ప్రజల సేవ ఆరంభించాడు జైనులాబిదీన్. ప్రజలను పీడించకుండా రాజ్యపాలనకు అవసరమైనంత మేరకే పన్నులు విధించటం, ప్రజలను సుఖపెట్టటం పుణ్య కార్యంగా భావించిఉంటాడు. ఇదీ ఆయన నిర్మించిన ‘పుణ్యసేతువు’. భావి రాజులను కూడా ఈ పుణ్యసేతువును అభివృద్ధి చేసి ముక్తిని పొందమంటున్నాడు.
ఇత్యం తామ్రమయే పట్టే శ్రీవికాశీష నిర్మితా।
ప్రశస్తి రాసీత్తం రాజధానీవహ్నీ రరక్ష చ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 39)
ఈ సద్వాక్యాలను ‘శ్రీవికాశీష’ అనేవాడు తామ్ర పత్రాలపై లిఖించాడు. అగ్నిలో రాజధాని సర్వం నాశనమయినా ఈ తామ్ర పత్రాలు మాత్రం చెక్కు చెదరలేదు.
ప్రదీప్తః సుకృతోత్కర్ష ఇవస్యైవ మహీపతేః।
అరక్షద్ రాజధానీం తాం మధ్యస్థామపి పావకః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 40)
రాజు పుణ్యంలా జ్వాలలు ఎగసినా, ఈ మంచి కావ్యాలను రక్షించాయి. రాజధానిని రక్షించాయి.
శుత్వా దగ్ధం పురం రాజాశుచా దగ్ధో విదగ్ధధీః।
అచీకరన్నవం తూర్ణ చారు దారుమయైగృహైః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 41)
నగరం దగ్ధమయిందని తెలుసుకుని రాజు ఎంతో బాధపడ్డాడు. వెంటనే దారువులతో ఆ స్థానంలో అందమైన నగరాన్ని నిర్మించాడు.
రాజా వరాహమూలీయాం రాజధానీం పురా కృతమ్।
ఆనీయ విదధే తత్ర రాజావాసం నవం మహత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 42)
గతంలో రాజు వరాహమూల (బారాముల్లా)లో అందమైన నగరం నిర్మించాడు. ఎక్కడో నుంచి వస్తువులు తెప్పించి ఇక్కడ రాజనివాసం లాంటి భవనాలను నిర్మించాడు.
తంత్రాయన్ నృపాగారం సేతుమత్తోంభతం నవమ్।
క్రమరాజ్యశ్రియో హారం సుయ్యపురం వ్యథాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 43)
రాజు ఒక ఊగే వంతెన (ఝూలా)ను నిర్మించాడు. అది క్రమ రాజ్యం చుట్టూ అదృష్ట దేవత గొలుసులా ఉంది.
సేతుమత్తోంభితే తత్ర గృహశ్రేణిమణివ్రజే।
రాజధానీ స్ఫురచ్ఛత్రా ధత్తే మధ్యమణిశ్రియమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 44)
ఉయ్యాల వంతెన చుట్టూ మణుల్లా గృహాలున్నాయి. వాటి నడుమ రాజభవనం ఒక ఛత్రంలా అందంగా ఉంది. అది రత్నాల గొలుసు నడుమ ఉన్న మణిలా ధగద్ధగాయమానంగా ఉంది.
మానుష్యకం నవవసన్తభి వాహ్య హృద్యం
లోకా లతా ఇవ లసన్తి నవే వనేస్మిన్।
తద్బాంధవా రుచికరా ఇవ పుష్కపూగాః
స్థిత్వా దినాని కవి బిచ్చతురం ప్రయాన్తి॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 45)
వసంతం రావటంతోటే లతలు విస్తృతమయినట్టు ఆ నూతన నరగంలో ప్రజలు సంతోషంగా నివసించారు. అనేక పుష్పాలలా వారి మిత్రులు ఆ నగరానికి వచ్చి వారితో కొన్ని రోజులు ఆనందంగా నివసించి వెళ్లిపోయేవారు.
విహగేష్యివ జాత పక్షపూగః
పురుషేషు ప్రభవేత్ కుటుంబవర్గః।
సుఖగత్యుచితోపి తత్రుతిష్ఠో
న చిరం తిష్ఠతి కాయకష్టదాయీ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 46)
పక్షికులంలో నూతన పక్షులు వస్తే ఎలా ఉంటుందో అలా మనుషుల కుటుంబాలు పక్షికులాల్లా సుఖ పూర్వకంగా జీవించాయి. అయితే ఎల్ల కాలం ఎవ్వరూ సుఖంగా ఉండలేరు.
అత్రాంతరే దివం యాతా సా బోధాఖాతోనాభిధా।
శ్రీమత్సైదాన్వయోదన్వచ్చంద్రికా నృపతి ప్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 47)
ఇంతలో రాణి బోధాఖాతున్ మరణించింది. ఆమె సయ్యద్ వంశానికి చంద్రిక లాంటి దామె.
జోనరాజు కానీ శ్రీవరుడు కానీ జైనులాబిదీన్ కుటుంబిక జీవనం గురంచి అధికంగా ప్రస్తావిచలేదు. సాధారణంగా జైనులాబిదీన్ ఒకే భార్య ఉన్నదన్న అభిప్రాయం కనిపిస్తుంది.
కేంబ్రిడ్జ్ చరిత్ర పుస్తకంలో ఇలాగే రాయటంతో అది ప్రచారానికి వచ్చింది. జైనులాబిదీన్ వివాహాలన్నీ అవసరార్థం పరిస్తితులను బట్టి జరిగాయి. జోనరాజు ప్రకారం జమ్ము రాజు కూతుళ్లిద్దరినీ జైనులాబిదీన్ వివాహం చేసుకున్నాడు. శ్రీవరుడు కూడా ఓ జమ్ము రాజు (మాద్రరాజ్యం) కూతుళ్లను జైనులాబిదీన్ వివాహమాడేడని వారి వల్ల నలుగురు సంతానం కలిగేరని రాశాడు. ఆదమ్ ఖాన్, హ్యాజీఖాన్, జరథ్ ఖాన్, బహరామ్ ఖాన్ అనే నలుగురిలో చరిత్ర రచయితలు ముగ్గురి పేర్లే ప్రస్తావిస్తారు. బహుశా జస్రథ్ ఖాన్ బాల్యంలోనే మరణించటంతో వారు అతని పేరును అంతగా పట్టించుకోలేదేమో!
శ్రీవరుడు కానీ, జోనరాజు కానీ జమ్ము రాజు అన్నారు కానీ ఆ రాజు పేరు చెప్పలేదు. అయితే రాజభీమదేవ్ జైనులాబిదీన్‌తో శతృత్వం వహించాడు. అతడు వీరితో యుద్ధంలో మరణించాడు. కాబట్టి, అతని తరువాత రాజ్యభారం వహించిన మలదేవుడు జైనులాబిదీన్‌తో శాశ్వత శాంతి కోసం వివాహాన్ని వాడుకున్నారని భావించవచ్చు.
సయ్యద్ కుటుంబానికి చెందిన మఖ్దూమాహ ఖాతూన్ ను జైనులాబిదీన్ తరువాత వివాహమాడాడు. ఆమె తండ్రి మహమ్మద్ బైహఖీ. ఈయన బైహఖీ సయ్యద్‌ల నాయకుడు.
బైహఖీ సయ్యద్‌లు ఇరాన్ లోని ఖురాసాన్ ప్రాంతంలోని బైహఖ్ (సజ్జవార్) ప్రాంతం నుండి సయ్యద్ మహమ్మద్ హమదానీతో పాటు సుల్తాన్ సికందర్ బుత్‌షికన్ కాలంలో కశ్మీరుకు వచ్చారు. కొన్నాళ్లకి సయ్యద్ మహమ్మద్ బైహఖీకి సుల్తాన్ అలీషాహతో విభేదాలు వచ్చాయి. దాంతో వీరంతా కశ్మీరు వదలి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో స్థిరపడ్డారు. కశ్మీరు వదలి వెళ్లిన వారిని తిరిగి కశ్మీరుకు రప్పించే జైనులాబిదీన్ ప్రయత్నాలలో భాగంగా వీరికి కశ్మీరుతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. బైహఖీల నాయకుడు తన కొడుకు సయ్యద్ హసన్‌ను జైనులాబిదీన్ కు అప్పగించాడు. సుల్తాన్ ఇతడిని ఆదరించాడు. ‘అమీర్’గా నియమించాడు. సయ్యద్ హసన్ కూతురు మఖ్దూమహ ఖాతూన్. తారిఖ్-ఇ-హసన్, బహరిస్తాన్‍లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాయి. ఆమె సయ్యద్‌ల వంశాని చెందినదని శ్రీవరుడు ఈ విషయాన్ని ధృవపరుస్తాడు.
‘సయ్యిదాఖాతూన్’ పేరు విషయంలో వివాదం ఉంది. శ్రీవరుడు ఆమెను ‘బోధాఖాతూన్’ అన్నాడు. కశ్మీరి ముస్లిం చరిత్ర రచయితలు ఆమెను ‘బైహాఖీ బేగమ్’ అన్నారు. శ్రీనగర్ లోని ‘మజార్-ఇ-ఊద్-దీన్’ స్మశానంలో ఉన్న సమాధి పైన మాత్రం ఆమె పేరు ‘ముఖ్దూమహా ఖాతూన్’ అని ఉంది.
ఆ సమాధి పై ఆమె క్రీ.శ.1465 లో మరణించినట్టు ఉంది.
శ్రీవరుడు ఆమె ‘బోధా’ ఖాతూన్ అని అనటం ఎందుకంటే, కశ్మీరీలో ‘బోధా’ అంటే ‘బడా’, అంటే పెద్ద అని అర్థం. ‘బాద్ షాహ’ అంటే సుల్తాన్, ‘పెద్ద రాజు’ అని అర్థం. ఆమె పెద్ద రాణి కాబట్టి ఆమెకు ‘బోధ్’ అంటే అంటే ‘బడీ’ అన్న అర్థంలో వాడి ఉండవచ్చు. ‘ఖాతూన్’ అంటే ‘స్త్రీ’. ‘బోడా ఖాతూన్’ అంటే ‘పెద్ద రాణి’ అన్న అర్థంలో వాడి ఉండవచ్చు. ఆమె సయ్యద్ కుటుంబానికి చెందినదని చెప్పటంతో, జైనులాబిదీన్ వివాహమాడిన ముగ్గురిలో ఇస్లాంకు చెందినది ఈమె ఒక్కర్తే కావటంతో శ్రీవరుడు ఎవరిని ప్రస్తావిస్తున్నాడో సందేహం లేకుండా తెలుస్తుంది.
ఈమెను శ్రీవరుడు ‘నృపతి ప్రియ’ అన్నాడు. ఆమె జైనులాబిదీన్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆమె మరణం జైనులాబిదీన్‌ను కృగదీసింది. జైనులాబిదీన్ జీవితంలో అత్యంత దయనీయమైన దుర్భరమైన అంత్య దశ ఆరంభమయింది.
యత్సంయోగసుఖం ప్రాప్య సోజ్ఞాసీత్ సఫలం వయః।
తద్వియోగాద్దిదగద్ధాంగః సర్వం శూన్యమివావిదత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 48)
ఆమె కలయక వల్ల తనను తాను అదృష్టవంతుడని భావించిన రాజు ఆమె వియోగం వల్ల శరీరం మనస్సు దగ్ధమైనవాడిలా అయ్యాడు. అన్నీ అతడికి శ్యూన్య సదృశంగా అనిపిస్తున్నాయి.
రాణు లెందరున్నా రాజులకు ఒక రాణి అతి ప్రియమైనదయి ఉంటుంది. ఆమె ఎడబాటును సహించలేరు. అలాంటి రాణి ఈమె. ఆమె మరణంతో తన శరీరం, మనస్సు దగ్ధమైనట్టు భావించాడు జైనులాబిదీన్. అతనికి సర్వం శూన్యంగా అనిపించసాగాయి. ప్రపంచం అర్థవిహీనమైపోయింది. జీవితేచ్ఛ నశించింది.
ఇకపై జైనులాబిదీన్ మనస్సు పై ఒక దెబ్బ తరువాత మరో దెబ్బ పడుతుంది. మరణం అతనికి శాంతినిస్తుంది. అంత వరకూ దుర్భరమైన వేదనను, అశాంతిని అనుభవిస్తాడు జైనులాబిదీన్.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
