[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
రాజ్ఞో ధాత్రాయపుత్రాద్యాః ప్రమేయైరపి సక్తృతాః।
భూపపక్షం పరిత్యజ్య హాజ్యాఖానముపాగతన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 147)
మునిగే పడవ నుంచి ముందుగా ఎలకలు తప్పించుకుంటాయంటారు. జైనులాబిదీన్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే.
రాజు సేవకులు, రాజు వైపు ఉన్నారనుకున్న వారందరూ హ్యాజీ ఖాన్‌కు తమ విధేయతను ప్రకటించారు.
ఎలకలు పడవను వదలిపోవటం మొదలయింది.
కిమన్యద్ వ్యక్తమే వాహ్ని యే దృష్టా నృపమన్నిధౌ।
అలక్ష్యన్త నిశి స్వైరం తే ఖానాగ్రే గతత్రపాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 148)
అధికంగా చెప్పేదేముంది? ఎవరెవరైతే ఉదయం పూట రాజుకు విధేయులై, రాజు సమక్షంలో కనిపించేవారో, వారు, చీకటి పడగానే స్వేచ్ఛగా ఖాన్ సమక్షంలో కనిపించేవారు.
జైనులాబిదీన్ ఇంకా రాజ్యం కట్టబెట్ట లేదు కాబట్టి, ఆయనకు విధేయులుగా ఉదయం కనిపించేవారు. రాత్రవగానే అతని కొడుకు సమక్షంలో చేరేవారన్నమాట. అధికారానికే పట్టం గట్టే అవకాశవాద పరాన్నజీవుల గురించి చెప్తున్నాడు శ్రీవరుడు.
తాటస్థ్యేన స్థితే రాజ్ఞి తద్భృత్యానాం పరస్పరమ్।
తత్తదాక్షేపతో దేశే కోప్యజృమ్భత విప్లవః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 149)
రాజవ్యవహారాలలో రాజు తటస్థంగా ఉండటంతో, రాజు భృత్యులు పరస్పర ఆరోపణలతో ఒకరితో ఒకరు పోరాడుతుండటంతో రాజ్యం అల్లకల్లోలమవుతోంది.
ప్రజల క్షేమం, రాజ్య సంక్షేమం కోరే జైనులాబిదీన్ తటస్థంగా ఉండటం, రాజ్యానికి దిశనిచ్చే రాజన్నవాడు లేకపోవటం, జైనులాబిదీన్ సంతానం నడుమ అధికారం కోసం పోరు సాగుతుండటం, ఈ పోరులో ఎవరు గెలుస్తారో, ఎవరికి విధేయులుగా ఉండాలో స్పష్టంగా తెలియక పోవటంతో దేశంలో అయోమయం నెలకొంది. అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, భార్య మరణంతో అన్నిటి పట్ల ఆసక్తి నశించిన జైనులాబిదీన్ ఏమీ పట్టనట్టు ఉంటున్నాడు.
భవిష్యన్నివ సామ్రాజ్యస్యార్ఘభాగీ న కస్తదా।
తత్పుత్రేష్వనురక్తోభూన్న తు రాజ్యి సుఖస్థితే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 150)
ఆ సమయంలో, అందరూ రాజు పట్ల విధేయులయి, అతని పుత్రుల పట్ల విధేయతను ప్రదర్శించారు. రాజపుత్రుల పట్ల విధేయలుగా ఉంటే భవిష్యత్తులో లాభాలు ఉంటాయన్న ఆశ వారిది. ఈ ఆశను శ్రీవరుడు అర్ధరాజ్యం లభిస్తుందన్న ఆశ లాంటి ఆశతో వారు రాజకుమారుల పట్ల ఆసక్తులయ్యారని అంటున్నాడు.
ఇదంతా శ్రీవరుడికి అసహ్యం, ఆందోళనలు కలిగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అతని రచన వల్ల.
జైనులాబిదీన్ అంత్య దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయుల పద్ధతి ప్రకారం ముగ్గురు కొడుకులలో పెద్దవాడు రాజవుతాడు. తాము అతడికి సేవ చేయటం తమ ధర్మం భావనతో రాజు అంత్యదశను సుఖశాంతుల మయం చేస్తారు. తండ్రికి సేవ చేస్తూ, ఆయన బదులు ఆయన పేరు మీద రాజవ్యవహారాలు చూస్తారు. రాజ్యం అల్లకల్లోలం కాకుండా చూస్తారు.
రాముడు అరణ్యవాసంలో ఉన్నంత కాలం, భరతుడు రాముడి పేరనే రాజ్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఎంత రాజకీయ చతురుడయినా, బలరాముడి పేరు మీదనే అన్ని రాజకీయాలు చేశాడు. తాను రాజ్యాధికారం కోసం ఎన్నడూ అర్రులు సాచలేదు. ఇతర కాలాలలో కూడా రాజు ధూర్తుడయి, ప్రజలను హింసిస్తుంటే తప్ప రాజును పదవి నుండి తప్పించే ఆలోచనలు చేయలేదు. వందమంది కౌరవులలో కూడా దుర్యోధనుడిదే రాజ్యం అన్న స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే రాక్షసులలో కూడా అగ్రజుడికే అగ్రస్థానం. రావణాసురుడి నిర్ణయాలు ఇష్టం లేకపోయినా, శక్తివంతులయిన సోదరులు అతని మాటకు కట్టుబడి ఉన్నారు తప్ప రాజ్యం ఆక్రమించాలన్న ఆలోచనలు చేయలేదు. విభీషణుడు రావణుడిని వ్యతిరేకించినా, రాజ్యాధికారంపై ఆశతో కాదు. ఇదీ ఇక్కడి పద్ధతి.
అందుకు భిన్నమైన వ్యవహారాలు చూస్తూ, అధికారం కోసం సోదరులు కలహిస్తూ, తండ్రిని విస్మరించి, ఆయన బాధపడతాడన్న కనీసపుటాలోచన లేకుండా అతని మరణం కోసం ఆరాటపడుతున్న సంతానాన్ని చూస్తూండటం, అదీ, శ్రీవరుడు అభిమానించి, గౌరవించే జైనులాబిదీన్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి రావటం పట్ల ఆవేదన, అతని సంతానం జైనులాబిదీన్ అంతటివాడి ఇవరి దశను ప్రశాంతంగా గడవనీయని ప్రవర్తన పట్ల అసహ్యం శ్రీవరుడి రచనలో కనిపిస్తుంది.
చరిత్ర రచయితలు, సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ సమాజాన్ని విమర్శిస్తారు. లోపాలను ఎత్తి చూపించి దూషిస్తారు. కానీ విదేశీ దురాక్రమణదారులు ఈ దేశంపై అధికారం చలాయించినప్పటినుంచి భారతీయ సమాజ పరిణామ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే, ఇక్కడి మేధావులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నదానికి పూర్తిగా భిన్నమైన నిజాలు గ్రహింపునకు వస్తాయి.
ఇత్థం స్వభృత్యసంచారదురాచారవిచారణాత్।
పరివారాన్నిజాత్ సర్వాన్నిర్విణ్ణోభూన్మహీపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 151)
ఈ రకంగా తన భృత్యుల అవిధేయ ప్రవర్తన , వారి విశ్వాసరాహిత్యం గురించి ఆలోచించిన కొద్దీ రాజుకు అందరి పట్ల అసహ్యం కలుగుతోంది.
ఇది సహజం.
అధికారంలో ఉన్నంత కాలమూ, ఆరోగ్యం, ధనం ఉన్నంత కాలమూ వినయం ప్రదర్శిస్తూ, విధేయుడిగా ఉన్నవాడు – అవి లేని మరుక్షణం వదలివెళ్ళి వేరే వాడి పట్ల వినయ విధేయలు ప్రదర్శించటం మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని, దురాశని,స్వార్ధాన్ని, అవిశ్వాసాన్ని జైనులాబిదీన్‌కు ఎత్తిచూపిస్తున్నది. ఎవరిలోనైనా ఇది అసహ్యం కలిగిస్తుంది. విరక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు ఎదురులేని రీతిలో రాజ్యం చేసి, తిరుగులేని రీతిలో సమాజాన్ని ప్రభావితం చేసినవాడికి ఈ నిరాదరణ, నిరాకరణలు తీవ్రమైన విరక్తిని, నిరాశను, అసహ్యాన్ని కలిగిస్తాయి. జైనులాబిదీన్ అలాంటి మానసికి స్థితిని ప్రదరిస్తున్నాడు.
అద్య చే స్వాన్తికే దృష్టాః ప్రాతః ఖానాన్తికే శ్రుతాః।
దాదర్థం కుత్రాపి నో ప్రాపుః సారసా ఇవ సేవకాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 152)
ఈ రోజు రాజు దగ్గర కనిపించిన వారు మరుసటి క్షణం ఖాన్ దగ్గర కనిపించేవారు. ఈ రకంగా సేవకులు ‘సరస్సు కొంగల’ లాగా చంచలంగా, ఒక చోట స్థిరంగా నిలవటం లేదు.
సరస్సు కొంగలు లేక సారస్ క్రేన్స్, వలస వెళ్ళే పక్షులు కావు. కానీ ఇవి చిత్తడి నేలలను ఇష్ట పడతాయి. ఎక్కడ తడి ఉంటే అక్కడికి వెళ్తాయి. అందుకే శ్రీవరుడు ఈ కొంగలతో జైనులాబిదీన్ భృత్యులను పోల్చాడు. వారికి రక్షణ కావాలి. ఎవరికి అధికారం ఉంటే వారి దగ్గరకు వెళ్తారు. ఎవరి వల్ల లాభం ఉంటే వారికి సేవ చేస్తారు. ఇలాంటి సారస పక్షుల్లాంటి వారిని మనం అనేకులనూ చూస్తూనే ఉంటాం.
హృద్రదో వర్ణ్యతే యస్మై తాదృగాశ్వాసభాజనమ్।
తత్కాలం సేవకో భక్తో దృష్టః కోఽపి న భూభుజా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 153)
తన హృదయంలోని బాధను వినేవాడు ఒక్కడు కూడా రాజుకు కనబడలేదు. ఒక్క భృత్యుడు, ఒక్క అభిమాని, ఒక్క సానుభూతిపరుడు కూడా లేడన్న మాట. అంటే రాజు మాటలు విని సానుభూతి చూపి, సాంత్వన నిచ్చేవాడు ఒకడు కూడా లేడన్నమాట.
యన్నోక్తం యచ్చ నో దృష్టం యచ్ఛ్రుతం వా కదాచన।
నిర్యంత్రణో జనః ప్రోచే ప్రత్యహం రాజమందిరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 154)
రాజు మందిరంలోకి ఎలాంటి ప్రతిబంధకం లేకుండా ప్రజల రాకపోకలు సాగుతున్నాయి. గతంలో వినపడని, వినకూడని మాటలు వినిపిస్తున్నాయి. కనబడని, కనబడకూడని దృశ్యాలు కనిపిస్తున్నాయి.
భవిష్యత్తును శ్రీవరుడు చూస్తున్నాడు. చూపిస్తున్నాడు.
ఒక శక్తిమంతమైన రాజు పాలన తరువాత బలహీనుడు, చేతకానివాడు రాజ్యానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకాన్ని విశ్లేషిస్తే చాలు, తెలుస్తుంది. రాజభవనంలోకి అందరికీ స్వేచ్ఛా ప్రవేశం ఉండదు. అనుమతులు కావాలి. వాళ్ల గురించిన వివరాలు పరిశీలించి, అనుమానాలు నిర్ధారించుకుని, కొన్ని నియమాలను అనుసరించిన తరువాతనే రాజభవన ప్రవేశార్హత లభిస్తుంది.
కానీ ఎప్పుడయితే అసమర్థుడు, చేతకానివాడు రాజవుతాడో, రాజు అయ్యే సూచనలు ఉంటాయో, అప్పుడు క్రమశిక్షణ, నియమాలు, రాజప్రాసాదాల పవిత్రత – సర్వం అదృశ్యమవుతాయి.
రాజభవనమైనా , దేశమయినా అంతే!
శత్రువులు, శత్రువుల సమర్థకులు దేశంలోకి సులభంగా ప్రవేశించి, అల్లకల్లోలం సృష్టిస్తూ, భయాందోళనలు కలిగిస్తూ, ఎలాంటి శిక్షను పొందకుండా హాయిగా వెళ్లిపోగలుగుతారో, ఆ దేశం భద్రదేశం కాదు. రాజు సమర్ధకుడు కాడు. శత్రువులు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. అంతర్గత శత్రువులు ఆవలించాలన్నా బెదిరిపోవాలి. అది సమర్థవంతమైన పాలన.
జైనులాబిదీన్ పాలకుడిగా ఉన్నంత కాలం రాజభవనం పవిత్రంగా ఉండేది.
జైనులాబిదీన్ రాజవ్యవహారాలు పట్టించుకోవడం లేదు. దాంతో పాలనా, నియంత్రణా లేకుండా పోయింది. రాజభవనం అంటే లెక్క లేకుండా పోయింది. అందుకే ఎవరుబడితే వారు రాగలుగుతున్నారు. ఏది పడితే అది మాట్లాడగలుగుతున్నారు. చేయగలుగుతున్నారు.
గతంలో రాజభవనంలో వినబడని మాటలు వినబడుతున్నాయి. కనబడని దృశ్యాలు కనిపిస్తున్నాయని శ్రీవరుడు చెప్పటం అర్థం కావాలంటే, జైనులాబిదీన్ మరణం తరువాత జరిగిన సంఘటనలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
స్వభ్రాతృ కలహకాగ్ర స్తత్త త్యై పశు న్య కర్మణా।
బహ్రామఖానోనర్థానాం కర్ణో మూలమివాభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 155)
తన సోదరుల నడుమ కుట్రలు కుతంత్రాలతో కలహాలు కలిగించటంలో బహ్రామ్ ఖాన్ ఉత్సాహంగా వ్యవహరించాడు. ఇందులో అతడు కర్ణుడి లాంటి దుష్టుడు. సోదరుల నడుమ గొడవలు సృష్టించి వారిలో వారు కలహించేట్టు చేస్తూ తన శక్తిని పెంచుకుంటున్నాడు బహ్రామ్ ఖాన్.
శ్రీవరుడు, బహ్రామ్ ఖాన్‌ను కర్ణుడితో ‘దౌష్ట్యం’ విషయంలో పోల్చటం గమనార్హం. కర్ణుడు గొప్ప దాత. కుంతి అతనికి అన్యాయం చేసింది పుట్టగానే వదలివేసి. అతడు సూతపుత్రుడని అవమానాలు అనుభవించాడు. దుర్యోధనుడు అతడిని మిత్రుడిగా స్వీకరించటంతో దుర్యోధనుడికి విధేయుడిగా ఉన్నాడని, కర్ణుడి లోని మంచి లక్షణాలను పొగడుతూ కర్ణుడిని పాండవుల కన్నా గొప్పగా భావించేట్టు చేస్తారు. ద్రౌపది కర్ణుడిని మోహించిందని, ద్రౌపది పాత్రను చులకన చేసి కర్ణుడిని గొప్పవాడిని చేస్తారు. ఇలా చెప్తూపోతే కర్ణుడు గొప్ప హీరోగా నిలబడేందుకు ఎంత చేయాలో అంత చేస్తారు. కర్ణుడి పాత్ర ప్రధాన హీరోగా సినిమాలూ వచ్చాయి. గ్రంథాలు వచ్చాయి. కానీ శ్రీవరుడు కర్ణుడిని ‘దుష్టుడు’ అన్నాడు. దుష్ట కర్మలు చేసేవాడన్నాడు. కర్ణుడు ఇంత గొప్పవాడయితే, శ్రీవరుడు కర్ణుడిని ‘దుష్టుడ’ని ఎందుకన్నాడో తెలుసుకోవాలంటే భారతీయ ధర్మం తెలియాలి.
కర్ణుడు దుర్యోధనుడికి విధేయుడిగా ఉన్నాడు. దుర్యోధనుడి కోసం సర్వం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు కర్ణుడికి నిజం చెప్పి, పాండవులను చేరి రాజ్యాధికారం అనుభవించమన్నా లొంగలేదు కర్ణుడు. కానీ, యుద్ధం కావాలని దుర్యోధనుడిని ప్రోత్సహించటం, శ్రీకృష్ణుడిని కాదనటం వంటి వాటన్నిటి వెనుక దుర్యోధనుడి పట్ల విధేయత, కృతజ్ఞత కన్నా, అహంకారం అధికంగా కనిపిస్తుంది. అందుకే అన్నదమ్ముల నడుమ కలహం సృష్టించేవాడిని దౌష్ట్యాన్ని కర్ణుడి దౌష్ట్యంతో పోల్చాడు శ్రీవరుడు.
శకుని, దుశ్శాసనులతో పాటు దుర్యోధనుడిని యుద్ధానికి ప్రోత్సహించి వినాశనం వైపు నెట్టినవాడు కర్ణుడు. శాంతి, సంధి పట్ల మొగ్గు చూపిన పెద్దలు – భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి గౌరవించదగ్గ వారి మాటలు త్రోసిరాజని, వారిని అవమానించి ‘యుద్ధం’ కోరిన వారిలో కర్ణుడు కూడా ఒకడు.
ఆరంభం నుంచీ దౌత్యం కన్నా యుద్ధంతోనే సమస్యను పరిష్కరించమనే వారిలో ఒకడు కర్ణుడు.
తన శక్తిపై అమిత విశ్వాసం కలవాడు కర్ణుడు. కర్ణుడి భరోసాతోనే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. పెద్దల సలహాలను త్రోసిరాజన్నాడు. కానీ తీరా యుద్ధం వచ్చేసరికి చిన్న కారణాన్ని సాకుగా చూపి యుద్ధం ఆరంభం నుంచీ యుద్ధంలో పాల్గొనలేదు కర్ణుడు. దుర్యోధనుడి మేలు కోరేవాడయితే, యుద్ధం వద్దనేవాడు. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు అహంకారాన్ని పక్కనబెట్టి, మిత్రుడి కోసం ఎవరేమన్నా పట్టించుకోకుండా యుద్ధంలో ఆరంభం నుంచే పాల్గొనేవాడు. అందరూ ఒకటిగా యుద్ధంలో పాల్గొనేవారు. అతడిని నమ్మి దుర్యోధనుడు యుద్ధంలో దిగాడన్న నిజాన్ని, తన అహంకారం, స్వార్ధాలవల్ల విస్మరించాడు కర్ణుడు.
ఇలాంటి దౌష్ట్యం మనకళ్ళముందే ఇప్పుడు కనిపిస్తోంది. అమెరికా అండ చూసుకుని యుక్రెయిన్ లాంటి చిన్న దేశం పొరుగున ఉన్న పెద్ద దేశం రష్యాతో యుద్ధానికి సిధ్దమయింది. రష్యాకూడా అమెరికా అండవున్నదని ఆరంభంలో దూకుడు ప్రదర్శించలేదు. ఏ అమెరికాను చూసుకుని యుక్రేయిన్ రష్యాతో కయ్యానికి కాలు దువ్విందో, ఇప్పుడు ఆ అమెరికా యుక్రేయిన్ మద్దతుకు రాకపోవటంతో అల్లల్లాడుతోంది యుక్రేయిన్. ఎవరి భరోసా చూసుకుని దుర్యోధనుడు యుధ్ధానికి దిగాడో, అతడు ఓ సాకు చూసుకుని యుధ్ధంలో పాల్గొనకపోవటం అందుకే దౌష్ట్యం. అందుకే, కర్ణుడు దుర్యోధనుడికి విధేయుడు అని తీర్మానించటం పొరపాటు. కర్ణుడు స్వార్ధపరుడు, అహంకారి. దుర్యోధనుపట్ల అంత విధేయతేవుంటె, ఇంద్రుడు వచ్చి అడిగినా కవచకుండలాలు ఇచ్చేవాడు కాదు. అవి తనను బలహీనుడిని చేస్తాయని తెలిసినా, దాన కర్ణుడిగా తన పేరు పోతుందన్న స్వార్ధంతో దుర్యోధనుడికి అన్యాయం చేశాడు.
కర్ణుడు అంత మంచివాడయితే ద్రౌపదితో అనుచితంగా ప్రవర్తించేవాడు కాదు. ద్రౌపదికి అంత ఆగ్రహం కల్గించేవాడు కాదు. స్త్రీని అవమానించిన వారెవ్వరూ బాగు పడరన్న సత్యాన్ని విస్మరించేవాడు కాదు. దుర్యోధనుడికి బుద్ధి చెప్పేవాడు. కానీ ద్రౌపది విషయంలో కర్ణుడి ప్రవర్తన, పాండవుల పట్లు కసి, క్రోధం, ద్వేషాలను ప్రతిఫలిస్తుంది. అంటే వ్యక్తిగత ప్రతీకారానికి దుర్యోధనుడు బలయ్యే వీలును కల్పించాడన్న మాట కర్ణుడు.
ఈ రకంగా కర్ణుడి పాత్ర వ్యక్తిత్వాన్ని, మనస్తత్త్వాన్ని విశ్లేషిస్తూపోతే, ఎందౌకని కర్ణుడు ‘దుష్ట చతుష్టయం’లో ఒకడో, ఎందుకు కర్ణుడు దుష్టుడో బోధ పడుతుంది. శ్రీవరుడు సైతం కర్ణుడిని దుష్టుడని ఎందుకన్నాడో తెలుస్తుంది.
అన్నదమ్ముల నడుమ పోరును పెంచే రీతిలో ప్రవర్తిస్తున్నాడు బహ్రామ్ ఖాన్. అలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నాడు. ఈ పోరు వల్ల ఎవరికీ లాభం లేదు. కర్ణుడు చేసిందదే. తన అహంకారం కోసం దుర్యోధనుడని వాడుకున్నాడు. యుద్ధానికి ప్రోత్సహించాడు. అతడు, అతడి వంద మంది సోదరులతో పాటు కౌరవ సేన, పెద్దలతో సహా నశించటానికి ప్రధాన కారకుడయ్యాడు. కాబట్టి కర్ణుడు దుష్టుడే!
కర్ణుడు దుష్టుడి నుంచి ‘హీరో’గా రూపాంతరం చెందటం వెనుక భారతీయ ధర్మాన్ని సంపూర్ణంగా దెబ్బతీయాలన్న కుట్రల వికృత కేళీవిలాసాలున్నాయి. అవి ప్రస్తుతం, ఈ వ్యాఖ్యాన సహిత అనువాద పరిధి బాహిరం. కాబట్టి ఈ చర్చను ఇక్కడే వదిలి ముందుకు సాగాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
