[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
స్నిగ్ధోయమిత్యవగతే యది కాష్ఠఖండే
దత్తప్రదీపపదవీపరిదీపితాశే।
కిం స జ్వలన్నపి కరోతి చిర ప్రకాశం
దోషం న క వితనునే నిజకజ్జ్వలౌథైః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 156)
కాస్త నూనె ఉన్న చెక్క కాలితే హఠాత్తుగా పెద్ద వెలుతురిస్తుంది. కానీ అది దీపం కాదు. కాబట్టి ఆ వెలుతురు ఎక్కువ కాలం ఉండదు. కానీ అది నలువైపులా పొగతో అంధకారాన్ని నింపదా?
చక్కటి పోలిక.
కాస్త నూనె ఉండటం వల్ల పెద్ద వెలుగును నలుదిశల విస్తరించినంత మాత్రాన అది చిరకాలం వెలిగే దీపం కాదు. దీపశిఖ తగ్గగానే చుట్టు పొగ విస్తరిస్తుంది. ఆ కాలంలో కశ్మీరులో నెలకొని ఉన్న పరిస్థితుల పట్ల శ్రీవరుడి వ్యాఖ్య ఇది.
ప్రాప్నర్లుణాయ రాజ్ఞోసావిత్యారా యన్నివేశితా।
అభూదాదమఖానః మ విత్రాణోప్యాత్మరక్షణే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 157)
రక్షణ కోసం రాజు దగ్గరకు వచ్చాడు అదమ్ ఖాన్. తనకే రక్షణ లేదనీ సుల్తాన్ చెప్పాడు.
భ్రాత్రా సమం జిఘాంసుర్మాం బహ్రామో ద్వైధ నిష్ఠురః।
అహమేకో బలస్తన్మే గతిః కాన్యా త్వయా వినా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 158)
నాస్త్యస్మాన్మే స్వజీవాశా తత్ స్వాత్మా రక్ష్యతాం విభో।
త్వయి జీవతి రాజ్యస్థే భయం మమ న విద్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 159)
కర్వన్త్యన్యే తదాస్కన్దమద్యాన్యోన్యరణోద్యతాః।
ఇత్యాదివార్తాం శృణ్వన్ స బభూవ భయవిహ్వలః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 160)
బహ్రామ్ ఖాన్, హ్యాజీఖాన్‌లు ఇద్దరూ తనను కుట్రలతో చంపివేయాలని ప్రయత్నిస్తున్నారని సుల్తాన్ తో చెప్పాడు ఆదమ్ ఖాన్ ఒక రోజు. రాజు రక్షణ కోరటం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని విన్నవించాడు. బహ్రామ్ ఖాన్ నుంచి తనను రక్షించమని, తనను చంపకుండా బహ్రామ్ ఖాన్ వదలడని తన ప్రాణాలు కాపాడమని రాజును వేడుకున్నాడు ఆదమ్ ఖాన్. రాజ్యంపై రాజు అధికారం ఉన్నంత కాలం తనకు ఎలాంటి ప్రమాదం ఉండదని నమ్ముతున్నాడు ఆదమ్ ఖాన్.
“నాకు నా జీవితం పై ఆశ లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి” అని అన్నాడు . “మా మధ్య చిచ్చు పెట్టి మేము పోరాడుకుంటుంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఇతరులు ప్రయత్నిస్తున్నారు.” అని జైనులాబిదీన్‌కి చెప్పాడు ఆదమ్‌ఖాన్. తనని చంపాలని ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వింటూ భయభీతుడయ్యాడు ఆదమ్ ఖాన్.
ఇత్థమాదమఖానేన కదాచిజ్జ్ఞాపితో నృపః।
ఊచే తం నాస్తి మే లోభో రాజ్యే వా నిజజీవితే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 161)
గచ్ఛ కాపురుషావ స్వం విఘ్నార్థ కిమిహాగతః।
ఇత్య నిర్భర్త్సితః పిత్రా కృద్దీనపురీం గతః।
అనుజాస్కన్దభీతో భూత్ స్వరక్షణ కృతక్షణః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 162)
ఇదంతా విన్న రాజు తనకు రాజ్యాధికారం పట్ల కానీ తన జీవితం పట్ల కానీ ఎలాంటి అనుబంధం లేదన్నాడు.
“పిరికివాడా, పో, నిన్ను నువ్వు రక్షించుకో. నీ రక్షణ కోసం నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు.” అన్నాడు.
తండ్రి పలుకులు విన్న ఆదమ్ ఖాన్ కుతుబుద్దీన్‌పూర్ వెళ్లాడు. తన రక్షణ కోసం సైన్యం సిద్ధం చేసుకుని సోదరులు తనపై దాడి చేయటం కోసం ఎదురుచూశాడు.
పీర్ హసన్ ప్రకారం ఆదమ్ ఖాన్ ‘కుతుబుద్దీన్‌పూర్’ వెళ్లి యుద్ధం కోసం అన్ని తయారీలు చేసుకున్నాడు.
ఫరిష్తా ప్రకారం రాజ్య పరిస్థితి దిగజారటం చూసి రాజ్యంలోని అమీర్లు ఆదమ్ ఖాన్‌కు రహస్యంగా సందేశం పంపించి కశ్మీరు పిలిచారు. కానీ సుల్తాన్ గతంలోని అతడి అనుచిత ప్రవర్తనను క్షమించలేదు.
జరిగినది ఒక సంఘటన. శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. మిగతా వారు సంఘటన జరిగిన వందల సంవత్సరాల తరువాత చరిత్ర రాశారు. తమ అభిప్రాయం ప్రకారం తమకు అనువుగా చరిత్ర రచించారు. వారి రచనలను ప్రామాణికంగా తీసుకుని చరిత్రను నిర్మించటం కుదరదని శ్రీవరుడి రాజతరంగిణి చదవుతూ ఇతర ఇస్లామీయులు రచించిన చరిత్రతో పోలిస్తే తెలుస్తుంది. భారతదేశ చరిత్రగా ఇప్పుడు మనకు అందుబాటులో వస్తున్న దాన్ని ప్రామాణికంగా భావించటం సమంజసం కాదనిపిస్తుంది.
ఎవరికి వారు తమ తమ అహాలను తృప్తి పరచుకోవటం కోసం, తమ అవగాహనను అనుసరించి చరిత్రను రచించారు. అలాంటప్పుడు ఏ ఒక్క రచనను సంపూర్ణంగా ప్రామాణికంగా భావించం కష్టం. ఇలాంటి పరిస్థితులలో ఇతరుల రచనలకన్నా ప్రత్యక్ష సాక్షి కథనానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కశ్మీరు ప్రాచీన చరిత్ర ప్రత్యక్ష సాక్షి కథనం కేవలం వివిధ రాజతరంగిణులు మాత్రమే! మిగతావన్నీ వందల సంవత్సరాల తరువాత రాసినవే. ఇతరుల నుంచి గ్రహించి రాసినవే, secondary sources.
లబ్ధే ముష్మిన్ భవతి హి సుఖం సర్వదైవేతి బుద్ధయా
య సంహితుం రిపుకృతభియో రక్షణీయోవభాతి।
తత్ తన్త్రస్థో యది భవతి స స్వాత్మరక్షా స్వశక్తో
భాండత్రాసాదివ తురగతః ప్రత్యుతోపద్రవ స్యాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 163)
ఆదమ్ ఖాన్‌ను రక్షించాల్సిన అవసరం ఉందని రాజు ఒకప్పుడు భావించాడు. అతడు తనకు శత్రుభయం తొలగిస్తాడని ఆశించాడు. తాను సుఖంగా ఉండవచ్చని అనుకున్నాడు. కానీ ఆదమ్ ఖాన్ స్వయంగా శత్రువులను చూసి భయపడుతున్నాడు. అతడు జీనును చూసి భయపడే గుర్రంలా ఉన్నాడు.
గమ్మత్తయిన పోలిక.
‘జీను’ వేసిన తరువాతనే గుర్రపు సవారీ ఆరంభమవుతుంది. అది లేకుండా గుర్రపు సవారీ చేస్తే చర్మం ఒరుసుకుపోతుంది. కానీ ‘జీను’ ను చూసి గుర్రం భయపడితే ఇక ఆ గుర్రం ఎందుకూ పనికిరాదు.
జీనును చూసి భయపడే గుర్రం లాంటి వాడయిన ఆదమ్ ఖాన్ ఏవో కుట్రలు కుతంత్రాలతో అధికారాన్ని ఎలాగోలా చేపట్టడం దేశానికి ఘోరమైన ఉపద్రవం అన్నాడు జైనులాబిదీన్.
జైనులాబిదీన్‌కు తన ఏ కొడుకు పై కూడా సదభిప్రాయం లేదు. రాజయ్యే అర్హత ఎవ్వరికీ లేదన్నది ఆయనకు తెలుసు. కాని యుద్ధానికి భయపడేవాడు, శత్రువులను చూసి పారిపోయేవాడు రాజు అయితే, అంతకు మించి ప్రమాదకరమైనది ఇంకొకటి లేదన్నది జైనలాబిదీన్‌కు తెలుసు. తన సంతానామే అయినా వారి గుణగుణాలను నిక్కచ్చిగా విశ్లేషించాడు జైనులాబిదీన్ . వారి బలహీనతలను అర్థం చేసుకున్నాడు.
పిత్రాస్మదర్థమానీతో జ్యేష్ఠో ద్విష్టో భయాయ నౌ।
ఇతి క్రుద్ధౌ సుతో శ్రుత్వా చకితః స నృపో భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 164)
‘మనల్ని భయపెట్టటానికి తండ్రి పెద్దవాడిని కశ్మీరు రప్పించాడ’ని తన మిగతా ఇద్దరు పుత్రులు ఆగ్రహిస్తున్నరని తెలుసుకున్న రాజు చకితడయ్యాడు. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం లేక భద్రతా భావం లేని పరిస్థితులలో ప్రతీదీ అనుమానానికి దారి తీస్తుంది. అవేశాలకు దారి తీస్తుంది. సుల్తాన్ పెద్ద కొడుకు భీరుత్వాన్ని నిరసించి పొమ్మన్నాడు. కానీ మిగతా వారు తమని భయపెట్టేందుకు సుల్తాన్ ఆదమ్ ఖాన్‌ని చేరదీస్తున్నాడని అపార్థం చేసుకున్నారు. కుపితులయ్యారు.
రాజా చ రాజపుత్రాశ్చ తదమాత్యపురోగమాః।
అన్యోన్యాశంకితాః సర్వే న నిద్రాముపలేభిరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 165)
రాజు, రాజ పుత్రులు, మంత్రులు తమ తమ ఆందోళనలతో, భయాలతో నిద్రకు దూరమయ్యారు.
భోగోపచార సంత్యజ్య తత్కాలం తేషు సేవకాః।
తత్తజ్జిహ్వోపకారేణారంజయన్ స్వామినో నిజాన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 166)
కర్తవ్య మాదిశాత్ కించిద్యత్ స భృత్యాన్ క్షణాన్తరే।
అవోచత్ కృతకర్తవ్యాన్ కిముక్త న స్మరామ్యహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 167)
స్వహస్తాక్షర సంపన్నాం త్యక్త్వా రీతిం పురాతనీమ్।
జ్ఞాత్వా ప్రకృతివైగుణ్య చక్రే తంత్రం స మన్త్రిసాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 168)
సేవకులు, అధికారి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం సేవ చేసే బదులు, కేవలం మాటలతో తమ యజమానులను సంతోషపెట్టాలని ప్రయత్నించారు. రాజాజ్ఞ ప్రకారం సేవకులు ప్రవర్తించరు. రాజు తాను ఇచ్చిన ఆజ్ఞలను మరచిపోయేవాడు. అతడికి తానేం ఆజ్ఞాపించాడో గుర్తుండేది కాదు. తన మనస్సు సరిగ్గా లేదని గ్రహించిన రాజు, ఆజ్ఞలపై సంతకం చేసే పాత పద్ధతిని వదలి వేశాడు. భారం అంతా మంత్రుల పై ఉంచాడు.
జైనులాబిదీన్‌కు తాను సరిగ్గా ఆలోచించే స్థితిలో లేడని తెలుసు. అందుకని బాధ్యతలన్నీ మంత్రులపై వదిలేశాడు.
యైరస్మత్సదనే క్షిప్తః సోయం వైరానలః ఖలైః।
తచ్ఛమాయ కృతీపేక్షా తైస్తైరుభయవేతనైః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 169)
మద్దర్థితాస్తే నశ్యన్తు మన్త్రిణస్తనయాశ్చ మే।
యే మన్నాశేన తుష్యన్తి రాజ్యలుబ్ధా జిఘాంసవః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 170)
ఇత్యుద్విగ్నో మహీపాలః శ్వసన జపపరాయణః।
ప్రాప్తదుఃఖోశపత్ సర్వం యాస్యతి స్మృతిశేషతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 171)
‘మా గృహానికి నిప్పు పెట్టిన దుష్టులు, ఈ వైరాగ్నిని రగిలిస్తూ రెండు వైపుల నుండి ధన లబ్ది పొందుతుండవచ్చు. అందుకే ఈ వైరాగ్నిని చల్లార్చాలని వారెవరూ ప్రయత్నాలు చేయటం లేదు.
నా వల్ల లాభం పొందారు. నా సహాయంతో ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు వాళ్లు నేను సర్వనాశనం అవుతుంటే సంతోషిస్తూ నా రాజ్యాన్ని కబళించాలని చూస్తున్నారు. నన్ను మోసం చేసి దెబ్బ తీసిన మంత్రులు, నా సంతానం సర్వనాశనం అయిపోతారు’. ఈ రకంగా ఉద్నిగ్న మనస్కుడయిన రాజు జపతప పరాయణుడై దీర్ఘ శ్వాస తీస్తూ శపించాడు – ‘వారి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి’.
‘అయిన్-ఇ-అక్బరీ’ ప్రకారం జైనులాబీదీన్ భవిష్యత్తు వాణిని పలికాడు. తనను మోసం చేసిన వారు, క్షోభకు గురి చేసిన సంతానం సర్వం నాశనమైపోవాలని, కేవలం వారు జ్ఞాపకాలలాగే మిగలాలనీ శపించాడు. ఇది నిజమైంది.
జైనులాబిదీన్ తరువాత అతని సంతానం రాజ్యాన్ని నిలుపుకోలేకపోయారు. కుట్రలు కుతంత్రాలు చేస్తూ ‘చాక్’లు అధికారానికొచ్చారు. కానీ వారూ ఎక్కవ కాలం పాలించలేదు. ఢిల్లీ సుల్తానులు కశ్మీరును హస్తగతం చేసుకున్నారు. జైనులాబిదీన్ తరువాత రాజుల గురించి, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శుకుడు ‘రాజతరంగిణి’ రచించక పోతే ఎవరికీ తెలిసేది కాదు. వారు కాలగర్భంలో కలసిపోయి ఉండేవారు. జైనులాబిదీన్ శపించినట్టే వారి పేర్లు స్మృతిలో మిగిలేవి. వారి గురించి తెలిసేది కాదు. కాబట్టి జైనులాబిదీన్ శాపం భవిష్యవాణి లాంటిదని వ్యాఖ్యానిస్తాడు అబుల్ ఫజల్.
స్వామీ విరక్తస్తత్పుత్రా మిథో వైరపరాయణాః।
కిముజ్జీవ విధేయం నః కష్టమాపతితం మహత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 172)
ఇత్యం పౌరజనః సర్వశ్చుక్రోశాంతితర తదా।
యవనన్రతమాసాప్తౌ త్యక్తమాంసాశానో నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 173)
‘రాజు విరక్తుడు. రాజకుమారులు పరస్పర వైరంతో అల్లకల్లోలం చేస్తున్నారు. మేము ఇప్పుడు ఏం చేయాలి? మనం కష్టపడే రోజులు వచ్చాయి.’ ఇలా ఆలోచిస్తూ పురజనలందరూ రోదించారు.
జైనులాబిదీన్ యాభై ఏళ్ల పాలనలో కశ్మీరం స్థిరత్వాన్ని సాధించింది. ప్రజలు భద్రతను అనుభవించారు. ఐశ్వర్యవంతులయ్యారు. జైనులాబిదీన్ వారందరికీ వృత్తులు ఏర్పాటు చేశాడు. ప్రజలు శాంతిని అనుభవించారు.
ఇప్పుడు చివరి దశలో రాజు విరక్తుడయ్యాడు. జపతపాలతో సమయం గడుపుతున్నాడు. అతడి సంతానం రాజ్యాధికార పోరాటంలో నిమగ్నులు. ప్రజలు పరిస్థితుల దుష్పఫలితాలను అనుభవించగలరు తప్ప స్వయంగా వారేమీ చేయలేరు. అందుకే దుర్దినాలు ప్రాప్తించాయి అని వాపోతున్నాడు.
ఒక దయనీయమైన దుర్భర స్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు శ్రీవరుడు. రాజు విరక్తుడై జపతపాలు చేస్తున్నాడు. జైనులాబిదీన్ రుద్రాక్ష మాలలతో జపం చేసేవాడు. ప్రాణం పోయే సమయంలో కూడా జపం చేస్తూ అతడి పెదవులు కదులుతూనే ఉన్నాయి. అలాంటి వాడిని మోసం చేసి అధికారం కోసం కొడుకుల నడుమ చిచ్చుపెట్టారు. జైనులాబిదీన్ తరవాత అసమర్థులయిన అతని సంతానాన్ని పక్కకు నెట్టి అధికారం సాధించాలన్నది మంత్రుల దురాశ. జైనులాబిదీన్‍కు వారి కుట్రలు తెలుసు. రాజకుమారులు అది గ్రహించలేకపోయారు. అందుకని అందరినీ శపించేంత నిస్పృహ కలిగింది జైనులాబిదీన్‌కు. రాజుకే అంత క్రోధం కలిగితే, నిస్సహాయులయిన ప్రజలలో ఎంత నిరాశ నిస్పృహ వేదనలు కలగాలి?
వాటికి దర్పణం పడుతుందీ శ్లోకం.
ప్రపంచం ఆరంభం నుంచీ కొందరి దురాశ, కొందరి అహం, కొందరి పట్టుదలల దుష్పరిణామాలను, దుష్పలితాలను తమ ప్రమేయం లేకుండా నిస్సహాయంగా అనుభవిస్తునే ఉన్నారు సామాన్య ప్రజలు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
