Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-89

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

యవనవ్రతమాసాప్తౌ త్యక్తమాంసాశానో నృపః।
సందధ్యౌ చ కుపుత్రోయం యైవానీతో దిగన్తరాత్।
తైః స్వాత్మరక్షిభిః సర్వ రాజ్య మే బత నాశితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 173)

యవనుల (ముసల్మానులు) పవిత్ర మాసం ఆరంభమవటంతో రాజు మాంసం సేవనం త్యజించాడు. తన పరిస్థితి గురించి చింతించాడు. ‘దూర దేశంలో ఉన్న నా కొడుకుని కశ్మీరుకు రప్పించిన వారు వారి స్వార్ధం కోసం నా సమస్త సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు.’

‘రంజాన్’ మాసం వచ్చిందని కాదు కానీ, పరిస్థితుల వల్ల విరక్తుడై ఎప్పటినుంచో రాజు మాంసాహారం మానేశాడు. తన జీవితం చివరి దశలో జైనులాబిదీన్ సాత్వికుడు అయిపోయాడు. నిరాశలో కూరుకుపోయాడు.

‘సుల్తాన్ మాంసం తినటం ఎప్పటి నుంచో మానేశాడ’ని ‘అయిన్-ఇ-అక్బరీ’లో రాశారు. ‘రంజాన్ మాసంలో సుల్తాన్ మాంసం  తినేవాడు కాడ’ని ‘తవ్వకల్-ఎ-అక్బరీ’లో రాశారు. అంతకు ముందే వేటాడటం మానేశాడు సుల్తాన్. రంజాన్ మాసంలో మాంసం ముట్టడం మానేశాడని ‘కేంబ్రిడ్జి హిస్టరీ’లో రాశారు.

ఇక తన పుత్రుల ప్రవర్తనకు రాజు బాధపడటం, నిరాశ చెందటం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఏకతః సవలో పుత్రౌ నగరే మిలితౌ మిథః।
ఏకతః పుత్ర ఏకాకీ తన్నిష్ఠా మన్త్రిణః శఠాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 174)

రాజ్యంలో ఓ వైపు ఇద్దరు కొడుకుల సంయుక్త సైన్యం ఉంది. మరో వైపు దుష్ట మంత్రులు, దుష్టులు చుట్టూ ఉన్న ఒక కొడుకు ఉన్నాడు.

పుత్రా యుద్ధ కరిష్యన్తి కష్టమాపతితం మహత్।
కింతు దూయే పురీ సేయ పాల్యా కులవధూరివ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 175)

గొప్ప నాశనం సంభవిస్తుంది. పుత్రులు యుద్ధం చేస్తారు. నాకు దుఃఖం ఎందుకంటే – భార్యలా కాపాడలసిన ఈ నగరం నష్టం పాలవుతుంది.

మయి జీవతి నశ్యేచ్చేత్ కిం కార్యం జీవితేన మే।
భక్తాః శక్తా గతా భృత్యాః కిం పృచ్ఛామి కరోమి కిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 176)

నేను జీవించి ఉండగా, నా ముందే నా నగరం నష్టమవుతుంటే నేను జీవించి ఉండి ప్రయోజనం ఏమిటి? నాకు విధేయులుగా ఉండే నా సేవకులంతా అదృశ్యమైపోయారు. ఇప్పుడు నేను సలహా ఎవరిని అడగాలి? నేనేం చేయాలి? ఇదీ జైనులాబిదీన్ బాధ.

తాను ఎంతో ప్రేమతో నిర్మించి ఉచ్చస్థాయికి తీసుకెళ్లిన నగరం, కన్న సంతానం కన్నా మిన్నగా ప్రేమించిన ప్రజలు సర్వం కష్టాల పాలవుతుంటే తాను నిర్వీర్యుడయి చూస్తుండటం వల్ల ఏం లాభం? తాను జీవించి ఉండి ఏం లాభం? ఇలాంటి ఆలోచనలతో నిరాశకు గురవుతున్నాడు జైనులాబిదీన్. దుఃఖితుడవుతున్నాడు.

ఇత్యాదిచింతా సంతాపజాతాధివ్యాధిబాధితః।
విముక్తరాజ్యనిర్బంధః స నిఃస్పన్ద ఇవాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 177)

ఇలాంటి పలు దుఃఖభరితమైన ఆలోచనలతో చింతాక్రాంతుడయిన రాజు, తీవ్రమైన విషాదంతో వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఈ నిరాశ నిస్పృహలతో దుఃఖంతో రాజు రాజ్యం విషయంలో స్పందించటం మానేసి దాదాపుగా నిర్జీవంగా మిగిలిపోయాడు. అత్యంత విషాదభరితం జైనులాబిదీన్ అంత్య దశ!

సబాలవృద్ధం నగర క్షుఛ్యత్ తత్ త్కు వార్తయా।
సోభూద్ బ్దిమివోద్ వృత్తం సమాస్థాపయితు క్షమః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 178)

నగరంలోని యువకులు వృద్ధులు అందరూ రోజూ వినిపిస్తున్న చెడు  వార్తలతో బాధపడుతున్నారు. ఇదంతా చూస్తున్న రాజు, ఉప్పొంగుతున్న సాగరాన్ని నియంత్రించలేని అసమర్థుడయ్యాడు.

భోక్తవ్యం యన్మయా భుక్తం కిం భోక్ష్యేద్య నయ దృతమ్।
ఆనీతభోజ్యమన్యేద్యుః శివభట్టం కృషాత్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 179)

మరుసటి రోజు భోజనం తెచ్చిన శివభట్టుతో రాజు కోపంగా ‘నేనంత భోజనం చేయాలో అంతే చేసేశాను. ఇదనవసరం. తీసుకువెళ్లిపో’ అన్నాడు.

‘తినే ప్రతి మెతుకుపై తినేవాడి పేరు రాసి ఉంటుంది’ అంటారు. దాని అర్థం ఏమిటంటే వ్యక్తి పుడుతూనే ఈ భూమి మీద ఎంత ఆహారం సేవిస్తాడో అన్నది నిర్ణయం అవుతంది. అతడు తినాల్సిన ఆహారం పూర్తవగానే అతని జీవితం సమాప్తమవుతుందని ‘తాను తినవలసిన ఆహారం తినేశాడనీ, ఇక తినాల్సిన అవసరం లేద’ని ఆహారాన్ని వెనక్కు పంపేయటం వెనుక ఉన్న ఆలోచన ఇది. రాజులో జీవితేచ్ఛ నశించింది. ఆహార సేవనం కూడా అయిష్టం అయిపోయింది.

అతి చింతాకులో రాజా ఛాయాయామప్యవిశ్వమన్।
దుధుక్షూన్ సచివాన్ శ్రుత్వా శ్రద్దధే న స్వజీవితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 180)

అతి చింతాక్రాంతుడయిన రాజు నీడను కూడా నమ్మలేకపోతున్నాడు. తనను సంహరించేందుకు మంత్రులు కుట్రలు పన్నుతున్నారని తెలిసి కూడా ఉదాసీనుడిగా ఉండిపోయాడు. ఆ విషయం పట్ల శ్రద్ద పెట్టలేదు.

గత సంవిదివ స్థిత్వా దినాని కతిచిన్నిజైః।
స పృష్టోప్యుత్తరం రాజా న కస్మా అప్యుదైరయత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 181)

కొన్ని రోజులు రాజు చైతన్యరహితులా ఉండిపోయాడు. ఆత్మీయులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు.

పృష్టః ప్రకృతిభిః కార్యం మమాప్యానర్థక వచః।
రుజార్తా పశుస్యాయాం స ముష్వాపకదామః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 182)

ఒకరోజు మంత్రులు ఏదో ప్రశ్నిస్తే, అర్థం లేని మాటలు మాట్లాడి, రోగ పీడితుడిలా ఓపిక లేనట్టు మంచం మీదే పరుండి ఉన్నాడు.

నావిదంస్తద్రుజో హేతు లక్షణ వా చికిత్మకాః।
జానేవాచ్యాం శుచం హర్తు బభృవాననవతీ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 183)

వైద్యులకు రాజు రోగం కానీ, రోగ లక్షణాలు కానీ తెలియటం లేదు. కానీ తన రోగం నుంచి విముక్తుడయ్యేందుకే రాజు ఉపవాసం ఉంటున్నాడని నాకు అనిపిస్తుంది.

శ్రీవరుడికి అంతా తెలుసు. రాజుకు సన్నిహితుడు. ప్రస్తుత పరిస్థితులలో రాజుకి నమ్మకస్తుడయిన ఏకైక వ్యక్తి శ్రీవరుడు.

అత్యున్నతాన్ సుఫలదాన్ వితతోంచ శాఖాన్
ఖ్యాతాన్ ద్విజప్రియతయా శుభమార్గ సంస్థాన్।
ఘాతా నిపాతయతి సర్వజనోపయోగ్యాన్
పృథ్వీధరాంస్తరువరానివ దుష్టవాతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 184)

అత్యున్నతము, ఫలప్రదము, విస్తృతము ఉన్నతమైన శాఖలతో కూడినది, పక్షులకు ఆలవాలము, ప్రియము, సర్వజనోపయోగము అయిన వృక్షాలు కూడా భయంకరమైన దుష్టగాలి తాకిడికి విరిగి పడిపోయేట్టు దుష్ట విధి గొప్ప రాజులను కూడా దెబ్బతీస్తుంది. నష్ట పరుస్తుంది.

శ్రీవరుడిలోని కవి బాధతో విజృంభించాడు.

రాజును చెట్టుతో పోల్చటం చాలా చక్కటి పోలిక. చెట్టు స్థిరంగా ఉండటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శక్తవంతమై దశదిశల విస్తరించటం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అందులో, శాఖోపశాఖలతో, ఫలప్రదమై, పక్షులకు ప్రియమైన వృక్షం సర్వజనోపయోగమైనది. అందరికీ ఉపయోగరకమైన ఆ వృక్షాన్ని కూడా తుఫాను గాలి వదలదు. అందరికీ ఉపయోగపడుతుందని జాలి చూపదు. అలాగే అందరికీ ఉపయోగ పడే గొప్ప రాజును కూడా విధి వదలదు అని చెప్తున్నాడు శ్రీవరుడు.

జైనులాబిదీన్ బాధను, వేదనను అతి దగ్గర నుంచి చూస్తున్న శ్రీవరుడు కూడా విషాద హృదయుడవటంలో ఆశ్చర్యం లేదు.

అత్రాన్తరే త్రయః పుత్రా దోషా ఇవ మహోల్వణాః।
ఘాతువద్ దూషయామాసుర్దేశే ప్రకృతి సప్తకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 185)

ఈ సమయంలో శరీరంలో దోషం (రోగం) లాంటి ముగ్గరు పుత్రులు, ధాతువులను సప్త ప్రకృతి కల దేశాన్ని వ్యాధితో బలహీనం చేసినట్టు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించారు.

గతంలో శ్రీవరుడు రాజ్యాన్ని మానవ శరీరంతో, పుత్రులను ఆ శరీరాన్ని ధ్వంసం చేసే ‘రోగం’ గానూ వర్ణించాడు. దానికి కొనసాగింపు ఈ శ్లోకం.

మూకప్రాయం నృపం తాదృగవస్థ ద్రష్టుమన్వహమ్।
సశంకాస్తముపాజగ్మూ రాజపుత్రా భటోల్వణాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 186)

మౌనంగా పడి ఉన్న రాజును చూసేందుకు రాజ పుత్రులు భటులతో ప్రతి రోజూ రాజు దగ్గరకు వచ్చేవారు.

‘మూక ప్రాయం నృపం’ జైనులాబిదీన్ గురించి ఈ విశేషణం చదువుతుంటే బాధ అనిపిస్తుంది.

ఆలోచిస్తే ఒకోసారి మనిషి ఎలా బ్రతికాడు అన్నదాని కన్నా ఎలా మరణించాడన్నదే ప్రాధాన్యం అనిపిస్తుంది. జీవితంలో అన్ని అనుభవాల కన్నా ‘మరణ అనుభవం’ మనిషి జీవితానికి అద్దం పడుతుందనిపిస్తుంది. మనకు తెలియని ఏదో అదృశ్య శక్తి వ్యక్తి గతజన్మల మంచి చెడులను బేరీజు వేసి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి జీవుడు అనుభవించవలసి కర్మ శేషాన్ని చివరి దశలో ‘మరణ వేదన’గా పరిణమింప చేస్తుందేమో అనిపిస్తుంది.

అందుకేనేమో, ఉత్తములుగా పరిగణకు గురయ్యేవారు దర్భర వేదనను అనుభవిస్తారు. చివరి దశలో దుష్టులు అనాయాస మరణం పొందుతారు. కారణాలు స్పష్టంగా తెలియని విషయం ఇది. ఇలాంటప్పుడే విధి, కర్మ వంటి వివరణలపై నమ్మకం కలుగుతుంది.

తన జీవిత కాలంలో శత్రువులందరినీ జయించి, అతని పేరు చెప్తేనే శత్రువులు, దుష్టులు పారిపోయే రీతిలో వ్యవహరించి, ప్రజలకు సర్వసౌఖ్యాలు అందచేసి, విజ్ఞానాన్ని గౌరవించి, అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేసిన జైనులాబిదీన్ లాంటి రాజు, చివరి దశలో విరక్తుడై, తన సంతానం తనకు దర్శించేందుకు వస్తుంటేనే భయంతో వణకిపోయేంత ‘దుర్దశ’ను అనుభవించటానికి మరో కారణం కనిపించదు. ఎప్పుడు చావొస్తుందా అని ఎదురుచూస్తూ, ఆహారం మానేసి మరీ ప్రాణత్యాగం చేసే స్థితి అనుభవిస్తాడన్న ఆలోచనకూడా అతని జీవితాన్ని చూస్తున్న వారికి కలగదు.

గొంతెత్తి ‘గీతాగోవిందాన్ని’ హిమాలయ పర్వత పంక్తులలో ప్రతిధ్వనించే రీతిలో గానం చేసిన జైనులాబిదీన్ గురించి ‘మూక ప్రాయం’ అని చదవటమే బాధగా ఉంటే, అతడిని ప్రత్యక్షంగా చూస్తున్న శ్రీవరుడు ఎంతగా బాధపడి ఉంటాడో, ఆ పదం వాడేందుకు. నిజంగా అవసాన దశ ఎంత నిర్దయ కదా!

రాజాంతరంగాస్తత్పుత్రభీత్యై తాదృగ్దశం నృపమ్।
ద్వారాగ్నే స్థాపయామాసుః సర్వదర్శన దిత్సయా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 187)

తన పుత్రుల భయం వల్ల, రాజు ధర్శనం చేసుకోవాలన్న అందరి ఆత్రం వల్ల, రాజు ఆంతరంగికులు రాజును భవనం బయట అందరి దర్శనం కోసం ఉంచారు.

సాధారణంగా, ప్రముఖ వ్యక్తి మరణిస్తే, అతని శవ దర్శనం అందరికే సులభంగా ఉండేందుకు ఓ పెద్ద హాలులో ఉంచుతారు. కానీ, జైనులాబిదీన్ పరిస్థితి దుర్భరమైనది. తరువాత జరిగిన సంఘటనలు చూస్తే, రాజు అవసానదశలో ఉన్నాడని తెలిసి అతడిని రాజభవనం బయట పెట్టేసారనిపిస్తుంది.

రాజు సజీవంగానే ఉన్నాడు. అతడిని చూసేందుకు పుత్రులు భటులను వెంట పెట్టుకుని వస్తున్నారు. వారు ఎప్పుడు ఏం చేస్తారోన్న భయం రాజు పై ఇంకా అభిమానం ఉన్నవారికి ఉంది. అందుకని రాజు క్షేమం కోరి వారు, అందరూ రాజును దర్శనం చేసుకోవచ్చని రాజభవనం బయట రాజును ఉంచారు. ప్రజలందరూ చూస్తుండగా రాజుకు హాని ఎవరూ తల పెట్టరన్నది ఆలోచన.

అత్యంత దయనీయమైన స్థితి. కానీ ఆ తరువాత జరిగినది తెలుసుకుంటే బాధ మరింత అధికమవుతుంది. ఇలాంటి దుస్థితి ఎవ్వరికీ కలగకూడదని ప్రార్థించాలనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version