Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-9

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

న్యాయ్యం కుర్యన్తి శాస్త్రజ్ఞాః కార్యభారం సుధీరతః।
తేభ్యః క్షిప్త్యా చ స్వే ధర్మే తిష్టతేత్యే వమభ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 34)

శాస్త్రాలు తెలిసిన వారిని శాస్త్ర అభ్యాసంలో  నిమగ్నమవమన్నాడు. శాస్త్రాలు తెలిసిన వారే తమ విధులను న్యాయబద్ధంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తారు.

ఎన్నో ఆలోచనలను కలిగించే శ్లోకం ఇది.

శాస్త్రాలు తెలిసిన వారిని వారి వారి విధుల నిర్వహణలో నిమగ్నమవమనటం అర్థం కావటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ శాస్త్రాలు తెలిసిన వారే తమ విధులను న్యాయబద్ధంగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తారనటం ఆలోచనలను కలుగచేస్తుంది.

పై శ్లోకాన్ని బట్టి జైనులాబిదీన్ ఎవరెవరిని వారి శాస్త్రాభ్యాసంలో, శాస్త్ర అధ్యయనంలో కొనసాగనిచ్చాడో తెలుస్తుంది. అంటే, విద్య వ్యవహారాలపై ఎలాంటి ప్రతిబంధకాలను విధించేవాడు కాదన్నమాట. గమనిస్తే, విద్య విషయంలో రాజ్యం జోక్యం చేసుకున్న దాఖలాలు భారతదేశ చరిత్రలోనే కనబడవు. శ్రీరామచంద్రుడు కూడా వశిష్ఠ మహర్షి ఏం చెప్తే అది నేర్చుకున్నాడు. దశరథుడు సిలబస్‍ను నిర్ణయించలేదు. అలాగే, విశ్వామిత్రుడు స్వచ్ఛందంగా నేర్పిన విద్యలను ఇష్టంగా నేర్చుకున్నాడు రాముడు. అంతే తప్ప విశ్వామిత్రుడు నేర్పాల్సిన సిలబస్‍ను ఎవ్వరూ నిర్ణయించలేదు. రాముడే కాదు కృష్ణుడయినా, శివాజీ అయినా, కాళిదాసు అయినా, నన్నయ్య, ఎర్రనలయినా రాజ్యం నిర్ణయించిన సిలబస్ చదవలేదు. ఎవరో నిర్దేశించిన అంశాలను ఆ కాలంలో ఏ గురువూ నేర్పలేదు. శాస్త్రాధ్యయనం ఉండేది. ఏయే శాస్త్రాలు శిష్యుడికి ఇష్టమైతే ఆయా శాస్త్రాలను నేర్పేవారిని వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవారు. ఇలా గురువును వెతుక్కుంటూ వెళ్ళే వారి గాథలు కోకొల్లలు. ఒక్కొక్కరు ఒక్కో శాస్త్రంలో నిష్ణాతులు. ఒక గురువు తర్కం నేర్పితే, మరో గురువు అదే తర్కం లోని ఒక అంశం నేర్పేవాడు. ఇలా శాస్త్రాధ్యయనమే ఆనాటి విద్య. కానీ విద్య పై రాజుకు, రాజ్యానికి ఎటువంటి నియంత్రణ ఉండేది కాదు. ఇందువల్ల, విద్య నేర్చేవారు కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉండేవారు. వారికి రాజు కన్నా గురువు పట్లనే విధేయత. అందుకే గురువు కోరితే, రాజుతో సంబంధం లేకుండా, గురువుకి శత్రువైన రాజును పట్టి బంధించి తెచ్చి గురువు కాళ్ళ మీద పడేసిన కథలెన్నో ఉన్నాయి. విద్య నేర్చిన వారు ఎన్నడూ, ఏ రాజుకూ లొంగి ఉండలేదు. ఎలాగయితే విద్యపై రాజు నియంత్రణ లేదో, అలాగే ఆ విద్య నేర్చిన విద్యార్థులపై కూడా నియంత్రణ ఉండేది కాదు. విదార్థులు కూడా రాజు కన్నా న్యాయం, ధర్మాలకు  ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి దృష్టిలో గురువు, న్యాయం, ధర్మం అత్యున్నతాలు. ఆ తరువాత ఇంకా ఎవరైనా! అందుకే ఎలాంటి కార్యభారాన్నయినా ధైర్యంలో ఎదుర్కుంటారు. స్వధర్మాన్ని పాటించటం వల్ల కలిగే ఆత్మవిశ్వాసంతో వారు అందరికీ న్యాయం చేస్తారు. కాబట్టి వ్యక్తి కర్తవ్య నిర్వహణ, న్యాయ విచారణ. కార్యభార నిర్వహాణలపై ఆయన నేర్చిన శాస్త్రాల ప్రభావం ఉంటుంది. అందుకే శాస్త్రాలు అభ్యసిస్తూ, స్వధర్మాన్ని పాటించే వారు అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం భారత సమాజంలో నెలకొని ఉంది.

శాస్త్రాధ్యయనం అంటే బట్టీ పట్టి వల్లె వేయటం కాదు. సూక్ష్మమైన శాస్త్రాంశాలను విశ్లేషించి, వితర్కించి, విమర్శించి, విజ్ఞానవంతుడవటం. అతడే పండితుడు. అంటే శాస్త్రాలలో నిష్ణాతుడు. అందుకని అతడు శాస్త్రాల మూలాలూ, అవి అందించే మూల విజ్ఞానాన్ని గ్రహిస్తాడు కాబట్టి; ప్రపంచ రీతి, ప్రపంచ గమ్యం, లక్షణాలను ఎరిగి ఉన్నవాడు కాబట్టి న్యాయం చేస్తాడు. ధర్మాన్ని అనుసరిస్తాడు. తాత్కాలిక ప్రలోభాలకు లోంగడు. శాశ్వతాలకే ప్రాధాన్యం ఇస్తాడు.  అందుకే భారతీయ సమాజంలో నాస్తికులకు బాధ్యత కల ఉద్యోగాలను ఇవ్వకూడదన్న పద్ధతి ఉంది. తనని తాను నమ్మని వాడు, పెద్దలను, పూర్వీకులకు గౌరవించని వాడు, శాస్త్రాలను గౌరవించని వాడు, తనకు తోచిందే న్యాయమంటాడు. తాను పాటించినదే ధర్మం అనుకుంటాడు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడు. అందుకని శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడికి, స్వధర్మాన్ని అనుసరించే వాడికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే, విద్య రాజ్య నియంత్రణ లోకి వచ్చి, విద్యార్థి రాజు నేర్పింది నేర్చి, జీవిక కోసం రాజ్యంపై ఆధారపడే పరిస్థితి వచ్చి స్వధర్మం అన్న ఆలోచన అడుగంటితే సమాజం ఎలా ఉంటుందో ప్రస్తుతం మన సమాజాన్ని చూస్తే చాలు, తెలిసిపోతుంది. కాబట్టి శాస్త్ర విషయంలో అధికారం ఉండి కూడా జోక్యం చేసుకోక, స్వేచ్ఛనిచ్చిన జైనులాబిదీన్‌ను శ్రీవరుడే కాదు మనమందరం అభినందించాల్సి ఉంటుంది.

అవార్యవేగైః సతతమాశుగైర్థస్య తాడితాః।
ఆసన్ వనదిగంతేషు మశకా ఇవ శాత్రవః॥
(శ్రీవర రాజతరంగిణి, 35)

జైనులాబిదీన్ బాణాలు వెంబడిస్తుండగా, అతని శత్రువులు అడవుల్లో పురుగుల్లా, సుదూర ప్రాంతాలలో అజ్ఞాతంగా జీవించసాగారు.

తస్య స్వపర వృత్తాంతం నిత్యమన్విష్యతశ్చరైః।
కేవలం స్వప్న వృత్తాన్తో బభూవావిదితో విశ్రామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 36)

జైనులాబిదీన్‍కు చెందిన గూఢచారులు నిత్యం శత్రువుల కదలికలు కార్యకలాపాలను గురించి తెలుసుకుంటూంటారు. రాజ్యం లోని ప్రజలపై కూడా కన్నేసి ఉంటారు. కాబట్టి శత్రువుల గురించి, తన ప్రజల గురించి రాజుకు, ఒక్క వారి కలలు తప్ప మిగతా అన్నిటి గురించి సంపూర్ణంగా తెలుస్తుంది.

గృహం గృహస్య వృత్తస్య ధ్యాయతో నీతిశాలినః।
అన్యాయాన్నశ కద్ధర్తుం కాకినీమపి కశ్చన॥
(శ్రీవర రాజతరంగిణి, 37)

‘కాకిని’ అంటే ధనం లెక్కలలో అతి చిన్నది. ఎవరైతే నీతిశాలురో, శాస్త్రాధ్యయన నిత్య నైమిత్తిక కర్మలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారో, వారి వద్ద నుండి ఒక్క పైసా కూడా అధికంగా పన్ను రూపంలో వసూలు చేసేవాడు కాదు జైనులాబిదీన్. ఇది శాస్త్రాధ్యయనపరులనే కాదు, తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించే వారందరికీ వర్తిస్తుంది. అంటే, సుల్తాన్ రైతులు గూడా చెల్లించాల్సిన పన్నులను తొలగించి వేశాడన్న మాట. దీని వల్ల రైతులను పీడించే అవకాశం రాజ్యాధికారులకు లభించదు. ఈ విషయం ‘తబాకత్ అక్బరీ’లో కూడా రాశారు.

ఆదిశ్య కృష్యేః వాస్తవ్యాన్ శ్వపచాదీన్ స తస్కరాన్।
మృత్కర్మా కారయద్ బద్ధపాదాయః శృంఖలాన్ బలాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 38)

తమ నిర్దిష్ట కర్మ అయిన వ్యవసాయం చేయకుండా దొంగతనాలకు పాల్పడే దొంగలను, చండాలురను శృంఖలా బద్ధులను చేసి, వారితో వ్యవసాయం చేయించాడు సుల్తాన్.

అంటే తమ కర్తవ్యాన్ని పాటించకుండా, ఇతర మార్గాలను అనుసరించే వారి మెడలు వంచి వారితో నిర్దిష్ట కర్తవ్యం నిర్వహింపచేసే వాడన్న మాట సుల్తాన్. సాధారణంగా దొంగతనాలకు పాల్పడే వారికి అంగ నిర్మూలనమో, మరణ దండననో శిక్షగా విధిస్తారు. కానీ జైనులాబిదీన్ అలా చేయలేదు. అప్పటి పద్ధతులకు విరుద్ధంగా వారి కాళ్లకు బేడీలు వేసి, వారితో భవన నిర్మాణం పనులు చేయించాడు. వారి బేడీలు, ప్రతి కదలికకు శబ్దం చేస్తాయి. దాంతో పారిపోయే ప్రయత్నం చేస్తే సులభంగా దొరికిపోయేవారు. ఈ పద్ధతిని తరువాత కాలంలో ఢిల్లీ సుల్తానులు అమలు పరచారు. అక్బర్ కాలం నాటికి ఇది ఆనవాయితీ అయిపోయింది. ‘తబాకత్ అక్బరీ’లో కూడా ఇదే విషయం రాశారు.

ఆనాటి కాలంలో సమాజంలోని సందిగ్ధ పరిస్థితులను ‘చండాలుర’ ప్రసక్తి సూచ్యప్రాయంగా తెలుపుతుంది. జైనులాబిదీన్ కాలం నాటికి  గుప్పెడు పండితులు తప్ప మిగతా భారతీయ సమాజమంతా ఇస్లామీయులుగా మారిపోయారు. కానీ, ఇస్లాం స్వీకరించినా ‘కులాల’ భావనలో మార్పు రాలేదు. పైగా, వారికి గతంలోని వృత్తులతో సంబంధం పోయింది. ఎందుకంటే ఇస్లాం ప్రకారం కొన్ని పనులు చేయకూడనివి. దాంతో వారు పాత వృత్తులు చేయలేక, కొత్తగా సమాజంలో వారికి చేయదగ్గ పని లేక, ఇస్లాం స్వీకరించినా తమ కులం వారితోనే కలిసి ఉండటం, వివాహాది చర్యల వల్ల సమాజంలో సరైన స్థానం అంటూ లేక, అటూ ఇటూ కాకుండా నలిగిపోయేవారు. జీవిక కోసం దొంగతనాలకు పాల్పడేవారు. అలాంటి వారికి ఏదో ఒక పని కల్పించేందుకు జైనులాబిదీన్ వారిని ‘మట్టి పనులకు’ నియమించాడు. కొన్నాళ్లకు అది వారి వృత్తి అయిపోయింది. ప్రస్తుతం మేధావులు చెప్తున్నట్టు భారతీయ సమాజం వేదకాలం నుంచి ఈనాటి వరకూ ఒకేలా లేదు. నిరంతర పరిణామశీలి, చైతన్యశీలి భారతీయ సమాజం. దీని గురించి వ్యాఖ్యానించాలంటే ఎంతో అధ్యయనం అవసరం, ఎంతో అవగాహన అవసరం.

న కః ప్రవర్తతే చౌర్యే నీచో వృత్తికదర్థితః।
ఇతి కారూణికో రాజా తేభ్యో వృత్తిమకల్పయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 39)

జీవిక కోసం దొంగతనాలను పాల్పడని వారెవరు? వారి కోసం రాజు ప్రత్యేకమైన వృత్తులు ఏర్పాటు చేశాడు.

ఆధునిక సామాజిక సిద్ధాంతాలను తలదన్నే సిద్ధాంతాన్ని శ్రీవరుడు రాజతరంగిణిలో ప్రదర్శించాడు. అవసరం మనిషితో ఎలాంటి కార్యమైనా చేయిస్తుంది. కులస్త్రీలు నాట్యగత్తెలవుతారు. పండితుడు పామరుడితో పోటీ పడి నీచకార్యాలకు దిగజారుతాడు. అవసరం వసుదేవుడితో గాడిద కాళ్ళు పట్టిస్తుంది. మానవ మనస్తత్వంలోని ఈ లక్షణాన్ని తెలుసుకున్న రాజు, నీచ కార్యాలకు పాల్పడిన వారికి కూడా వృత్తులు కల్పించాడు. వారికి జీవికను ఏర్పాటు చేశాడు.

కశ్మీరులో ఇప్పటికీ కొనసాగుతున్న అనేక వృత్తులకు కారణం జైనులాబిదీన్! జీవిక కోసం దొంగతనాలకు పాల్పడే వాడిని సమాజం నేరస్థుడిగా పరిగణిస్తుంది. శిక్షిస్తుంది.

కానీ ఒక వ్యక్తి దొంగగా మారటానికి కారణం అతడికి జీవికని కల్పించలేని సమాజ వ్యవస్థలో లోపం. కాబట్టి, సమాజాన్ని మార్చకుండా వ్యక్తిని శిక్షించటం వల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మార్చాల్సింది సమాజాన్ని, వ్యక్తిని కాదు. అందుకని జైనులాదిదీన్ వ్యక్తిని శిక్షించకుండా సామాజిక వ్యవస్థలో మార్పు తెచ్చాడు.

వామపక్ష సిద్ధాంతాలలో ఒకటయిన ఈ సిద్ధాంతాన్ని ఆరు వందల ఏళ్ల క్రితమే శ్రీవరుడు ప్రదర్శించాడనుకుంటే పొరపాటు. ఇదే ఆలోచన మహాభారతంలో శాంతిపర్వంలో కనిపిస్తుంది. మనుస్మృతిలో పొందుపరచి ఉంది. వీటికన్నా మరింత విప్లవాత్మకమైనది యాజ్ఞవల్క్య స్మృతి.

ఎవరికయినా మూడు రోజులు ఆహారం లభించకపోతే, నాలుగో రోజు ఆహారంకోసం  అతడు చేసే నేరం నేరంగా పరిగణించటానికి వీలు లేదు. అతడికి దొంగతనం చేసయినా ఆహారం సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే హక్కు ఉంటుంది. ‘స్మృతిచంద్రిక’లో వ్యాసుడు సైతం భోజనం కోసం చేసే దొంగతనం నేరం కాదని తీర్మానించాడు.

ఇదంతా చూస్తుంటే 18-19వ శతాబ్దాలలో జన్మించి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమానత్వ సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు ప్రపంచానికి కొత్త ఏమో కానీ భారతదేశానికి కొత్త కాదనిపిస్తుంది. తమ పూర్వీకులంతా మూర్ఖులు, తామే తెలివైన వారమన్న నమ్మకంతో, ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు అధ్యయనం చేయకుండా, ఎవరో చెప్పిన పైపై మాటలు నమ్మేసి అంతా తెలుసుకున్నాం అనుకుని తమని తాము మరచిపోయిన వారికే ఇలాంటి సిద్ధాంతాలు కొత్తగా, సర్వజగద్రక్షకులుగా అనిపించవచ్చు. కానీ తమ గురించి తమకు తెలిసిన వారికి ఈ ఆధునిక సర్వజగద్రక్షక సిద్ధాంతాలలో ఎలాంటి కొత్తదనమూ కనబడదు. పైగా సర్వ సంగ పరిత్యాగులు, ముముక్షువులు అయిన ఋషులు నిర్మోహంగా ఏర్పరచిన నియమాల లోని శాంతి, భద్రతలు హ్రస్వ దృష్టితో, అర్ధ విజ్ఞానులు ఏర్పరచిన దుష్ట సిద్ధాంతాలలో ఉండవు. ఇలాంటి సిద్ధాంతాల వల్ల హింస చెలరేగుతుంది. సమాజాలు అల్లకల్లోలమవుతాయి. మనిషి పశువవుతాడు. జీవితం దుర్భరం అవుతుంది. ఇందుకు దృష్టాంతాలు ఎంతో వెతకనవసరం లేదు. ఈ సిద్ధాంతాలను అమలు చేస్తున్న సమాజాల వైపు దృష్టి ప్రసరిస్తే చాలు, విషయాలు తేటతెల్లం అవుతాయి. అందుకు శాస్త్రాధ్యయనం చేసి స్వధర్మాన్ని పాటించేవాడు, కార్యసాధకుడే కాదు, అందరికీ న్యాయం చేయగలుగుతాడంటాడు శ్రీవరుడు. ఇలాంటి పండితుల మాటలు విని పాటించిన జైనులాబిదీన్ ధన్యుడయ్యాడు. తన రాజ్యానికి సుఖశాంతుల నిచ్చిన వాడిగా ఈనాటికీ చిరంజీవిగా నిలిచాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version