Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-92

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

కర్ణీరథశవప్రోద్యచ్ఛత్రచామరకైతవాత్।
శుచేవ పతితౌ నూనం సూర్యాచంద్రమ సౌ దివః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 222)

‘కర్ణీరథం’లో శవాన్ని ఉంచారు. ఛత్ర చామరాలను రెండువైపులా  ఉంచారు. శోకంతో సూర్యచంద్రులు భూమికి దిగి వచ్చినట్టున్నాయి ఛత్ర చామరాలు.

జైనలాబిదీన్ మరణాన్ని అతి సన్నిహితంగా చూశాడు శ్రీవరుడు. ఇప్పుడిక ప్రజల దుఃఖం, శవయాత్రలను విపులంగా వర్ణించటం ఆరంభించాడు.

శ్రీవరుడు వర్ణనను శవాన్ని శవవాహనం (కర్ణీరథం)లో ఉంచటం నుంచి ఆరంభించాడు. ఇస్లాం ధర్మం ప్రకారం శవాన్ని పాతిపెట్టే ముందు శుభ్రం చేస్తారు. స్నానం చేయిస్తారు.  ఇస్లామీయులు ప్రార్ధనకు ముందు శరీరాన్ని శుభ్రం చేసే పద్ధతిలోనే శవాన్ని శుభ్రం చేస్తారు. ఒక్క నోటిని, ముక్కును శుభ్రం చేయటం తప్ప మిగతా పద్ధతులను పాటిస్తారు. అయితే ఈ కర్మకాండను ఇస్లామీయులు బహిరంగంగా చేయరు. అందుకని శ్రీవరుడు అయా పద్ధతులను వర్ణించలేదు. శవాన్ని శవపేటికలో  ఉంచటం  నుంచి వర్ణిస్తున్నాడు.

ఇస్లామీయుల శవయాత్రలలో ఛత్ర చామరాలుండవు. కానీ భారత్ వచ్చిన సుల్తానులు ఇక్కడి పద్ధతులు కొన్ని పాటించటం ప్రారంభించారు. హైదర్ షాహ నుంచి ఈ పద్ధతి పాటించటం ప్రారంభించారు. ఇతర ప్రాంతాలలోని సుల్తానులు కూడా ఇక్కడి పద్ధతులను కొన్నిటిని అవలంబించారు. దాన్ని శ్రీవరుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఈ వర్ణనలో కాస్త కవిత్వం కూడా చిలికించాడు. ఛత్ర చామరాలు శోకంతో భూమికి దిగి వచ్చిన సూర్యచంద్రుల్లా ఉన్నాయన్నాడు.

తత్కాలం మంత్రిణో భృత్యా దాసా జనపదాశ్చ యే।
రుదితా సుస్తృతివ్యాజాన్నివా పాంజలిమక్షిపన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 223)

ఆ సమయంలో మంత్రులు, సేవకులు, దాసులు ప్రజలందరూ మరణించిన రాజుకు కన్నీళ్లతో అంజలి ఘటించారు.

రాజ్యం పణ్ణవతే వర్షే జ్యేష్ఠే మాస్యగ్రహీన్నృపః।
ఉత్తరాయణకాలాన్తే తేనైవాన్తర్ధి మాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 224)

రాజు జ్యేష్ఠ మాసాంతంలో ఉత్తరాయణ కాలంలో 96వ సంవత్సరంలో రాజ్యాధికారం చేపట్టాడు. అదే మాసంలో అతని పాలనకాలం అంతమయింది.

ఉత్తరాయణం అని శ్రీవరుడు నొక్కి చెప్పటం ఎందుకంటే భారతీయ ధర్మం ప్రకారం ఉత్తరాయణంలో పుణ్యాత్ములు మరణిస్తారు. మహాభారతంలో భీష్ముడు ఎదురు చూసి మరీ ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచాడు.

అతీత గణితైకోనసప్తత్యబ్దాయుపం నృపమ్।
బదనావగతప్రోద్యత్క్రష్ణకూర్చకచచ్ఛటమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 225)

శవీభూతం శివీభూతం శివికాయాం శవాజిరమ్।
రుదన్తో మన్త్రిణో నిన్యుశ్ఛత్రచామరరాజితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 226)

మరణించిన రాజు వయస్సు 69. నల్లటి గడ్డంతో శోభిస్తున్న రాజు శవ రూపం దాల్చాడంటే శివమయమైనట్టే. దుఃఖిస్తూ ఛత్రచామరాలతో అలంకరించి శిబికలో రాజును శవాజిరామ్(కబ్రిస్తాన్, శ్మశానం) కు తీసుకు వెళ్లారు మంత్రులు.

గమనిస్తే సుల్తానులందరికీ గడ్డం ఉంటుంది. ఒక్క జహంగీర్ చిత్రం మాత్రం గడ్డం లేకుండా ఉంటుంది. గడ్డం లేకపోవటాన్ని నేరంగా, అవమానంగా భావిస్తారు. శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వాహనాన్ని ‘శివిక’ అంటారు. ప్రాచీన కాలంలో శవం శివ స్వరూపం అనీ, వ్యక్తి మహాదేవుడవుతాడని నమ్మేవారు. ముస్లింల ‘కబ్రిస్తాన్’ను ‘శవాజిరమ్’ అన్నాడు శ్రీవరుడు.

యత్ర సుప్తా ఇవైకత్ర భాన్తి పూర్వే మహీభుజః।
భర్తృప్రేమ్ణా ధరణ్యేవ నిహితా హృదయాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 227)

శ్మశానంలో, ఇతర రాజులు నిద్రిస్తున్నట్టు, అందంగా అనిపిస్తన్నారు. స్వామి మీద ప్రేమ వల్ల భూమి వారిని తన హృదయంలో భాగం చేసుకున్నట్టు తోస్తున్నది.

రుదత్పౌరజనప్రోద్యత్తారరోదననిఃస్వనైః।
బభ్రువుస్తచ్ఛుచేవారం సాక్రన్దముఖగ దిశః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 228)

పురవాసుల రోదనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, వారి రోదనల ధ్వనులు అత్యంత తీవ్రంగా అధిక శోకంతో ఉండటంతో దిశలు ఆక్రందనలతో దద్దరిల్లి పోయాయి.

క్య ప్రయాస ప్రజాస్త్యక్త్వా హా దేవ నరజీవిత।
ఇత్యస్మాదపరః శబ్దో నాథావి నగరాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 229)

నగరంలో ‘హా రాజా, దేవా, ప్రజల ప్రాణమా! ప్రజలను వదలి ఎక్కడకు వెళ్తున్నావు?’ అన్న రోదనల ధ్వనులు తప్ప మరో శబ్దం వినబడలేదు.

తత్తదాక్రందితైః శశ్వత్కర్ణ సంజాత సంస్తవాః।
శూన్యే ప్య నృణ్వంల్లో కానామాక్రన్దితమథామకృత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 230)

ప్రజల చెవులలో ఈ ఆక్రందనలు ఎంతగా నిండిపోయాయాంటే, నిశ్శబ్దంలో కూడా వారి చెవులలో ఈ రోదన ప్రతిఫలిస్తూనే ఉన్నాయి.

కర్ణీరథాదయో ధోక్షిస్య్ర పితుః పార్శ్వే నరేశ్వరమ్।
కృత్వా పటై కసం వీతం భూగర్భాభ్యంతరే న్యాధుః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 231)

శవపేటిక నుండి రాజును వెలుపలికి తీసి, తమ భుజాల పై మోస్తూ, రాజుకు ఒక వస్త్రం కప్పి, అతని తండ్రి పక్కనే భూగర్భంలో ఉంచారు.

శ్రీవరుడు తాను చూసింది వర్ణించాడు.

ఇస్లామీయుల పద్ధతి ప్రకారం శవాన్ని శుభ్రం చేసిన తరువాత కుట్టని తెల్లని గుడ్డ (కఫన్) తో కప్పుతారు. దాన్లో పురుషులకు మూడు వస్త్రాలు, స్త్రీలకు అయిదు వస్త్రాలు కప్పుతారు.

అయితే  ఈ పద్ధతి కశ్మీరులో మారినట్టుంది. శ్రీవరుడు హైదర్ షాహ శవఖననాన్ని వర్ణించినప్పుడు కూడా ‘ఏకవస్త్రం’నే ప్రస్తావించాడు. ఇప్పుడు కూడా ఏకవస్త్రం అంటున్నాడు. ఒక వస్త్రంతోనే శవాన్ని చుట్టటం బహుశా కశ్మీర్‌లో అవలంబించే వారేమో!

‘భూగర్భం’ అన్న పదాన్ని శవాన్ని పాతిపెట్టేందుకు త్రవ్వే గుంటను సూచించేందుకు శ్రీవరుడు వాడేడు. ఇంతకు ముందరి శ్లోకంలో ‘భూమి హృదయంలో దాచుకుంది’ అన్నాడు. దాన్ని  కొనసాగిస్తూ ‘భూగర్భభ్యంతరే’ అన్నాడు ప్రతీకాత్మకంగా.

నేత్ర నాలస్ర వద్ధాష్ప ధారా స్వాచారకారణాత్।
ముఖావలోకన కృత్వా సర్వే మృన్ముష్టికా జహుః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 232)

ప్రజల కళ్ల నుండి అశృవులు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. వారి ఆచారం ప్రకారం వారంతా రాజు ముఖాన్ని దర్శించి పిడికిలి మట్టి శవం పై వేశారు.

ఇంత వరకూ రాజును విష్ణు అవతారం అన్నాడు. రాముడన్నాడు శ్రీవరుడు. కానీ ఇప్పుడు వారి ఆచారం ప్రకారం అన్నాడు. ఒక రకంగా ఇది ప్రతీకాత్మకం. జీవం ఉన్నంత వరకూ రాజు అందరినీ సమానంగా చూశాడు. తమ వాడన్న  భావన అందరిలో కలిగించాడు. కానీ మరణం భేదం చూపింది.

‘కబీర్’ మరణం తరువాత అతని భక్తులు హిందూ పద్ధతిలో అంతిమ సంస్కారాలు జరపాలి, ఇస్లామీయులు తమ పద్ధతిలో జరపాలని వాదిచుకున్నారు. కానీ జైనులాబిదీన్ ఎంతగా అందరినీ సమానంగా చూసినా, ఎంతగా ప్రజలంతా తన వాళ్లేనని భావించినా, అలాగే పాలించినా జైనులాబిదీన్ మరణం ‘తేడా’ ను చూపింది. ఇస్లాం ఛాందసవాదం   జైనులాబిదీన్ వల్ల అణిగి ఉంది. ఇప్పుడిక దానికి అడ్డులేదు. అందుకే,  చివరికి శ్రీవరుడికి ‘వారి పద్ధతి’ అనాల్సి వచ్చింది. దీన్లో ఎవరు మాత్రం ఏమీ చేయలేరు. రాజు సుల్తాన్ . వారి పద్దతి ప్రకారం అంత్యక్రియలు జరిపించటమే న్యాయం. శ్రీవరుడే కాదు ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిన సత్యం ఇది.

భూపతిర్భవితా నాన్యస్త్వత్సమో భూరియ గతా।
ఇతీయ భావనాం చక్రుమృన్మృష్టిగ్రహణచ్ఛలాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 233)

‘నీ వంటి పాలకుడు మరొకడు లేడు. ఇకపై రాబోడు. నీతో భూమి కూడా వెళ్లిపోయింది’ అన్న భావన పిడికిలి నిండా మట్టి నింపుకుని ప్రజలు రాజుపై వేస్తున్నప్పుడు ప్రజల భావిస్తున్నట్టనిపిస్తుంది.

శ్రీవరుడిలో కవి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాడు.

‘ఆచారం’ ప్రకారం ప్రజలు పిడికిలి మట్టిని శవంపై వేస్తున్నారు. రాజు పట్ల ఉన్న ప్రేమాభిమానాల వల్ల వారు రోదిస్తున్నారు. ఆక్రందనలతో ప్రాంతం దద్దరిల్లుతోంది.

కానీ,  భవిష్యత్తు గురించి ఎలాంటి అపోహలు లేని శ్రీవరుడికి పిడికిలి  నిండా మట్టిని నింపుకుని శవంపై వేయటం మరో రకంగా అర్థమయింది.

రాజుతో పాటు భూమి కూడా వెళ్లిపోతోందంటున్నాడు.

శ్రీవరుడికి తెలుసు, కశ్మీరులో  ‘పరమత సహనం’ అన్న పదం అంతమయింది జైనులాబిదీన్  మరణంతో అని.

ఇంతవరకూ జైనులాబిదీన్ అదిమిపెట్టి ఉంచిన మత ఛాందసంపై అడ్డుతొలగింది.   అడ్డు తొలిగిన వరదలా కశ్మీరులో ఇస్లామేతరులను ముంచెత్తుతుందని తెలుసు. జైనులాబిదీన్ కన్నా ముందు లాంటి పరిస్థితులు మళ్లీ కశ్మీరులో నెలకొంటాయన్న నిజం శ్రీవరుడికి తెలుసు.

రాజ్యాధికారం కోసం పోరాడుతున్న జైనులాబిదీన్ కుమారులందరూ శ్రీవరుడి శిష్యులు. కానీ వారు మత ఛాందసవాదుల ప్రభావంలో పడ్డారు తండ్రికి వ్యతిరేకంగా రాజ్యం కోసం యుద్ధం చేశారు.

మానసిక శాస్త్రంలో ఓ సిద్ధాంతం ఉంది. బాల్యంలో తల్లిదండ్రులు ఎలాంటి వాతావరణం కల్పించినా, ఏవేం నేర్పించినా యవ్వనంలో వ్యక్తి పై అతని జన్యు సంబంధిత లక్షణాల ప్రభావం ఆధిక్యం సాధిస్తుంది. అందుకే బాల్యంలో తల్లిదండ్రులు ఎంత మంచి బాటను ఏర్పరచినా, వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించేది యవ్వన కాలమే!   జైనులాబిదీన్ సంస్కారం అతని సంతానానికి రాలేదు. శ్రీవరుడు నేర్పించిన విద్య ప్రభావం వారి పై లేదు.

అందుకే శవంపై మట్టి వేస్తుంటే శ్రీవరుడికి భూమి జైనులాబిదీన్‌తో వెళ్లిపోతున్నట్టు అనిపించింది. కశ్మీరు భూమిపై తమకు రోజులు చెల్లాయని, తాము జీవించిన భూమి వెళ్ళిపోతోందని శ్రీవరుడికి తెలుసు. దాన్ని తన శ్లోకంలో ప్రదర్శించాడు శ్రీవరుడు. అర్థం చేసుకన్న వారికి, అర్థం అయినంత!

జిత్వారీన ప్రబలాన్ రణే క్షితిమిమాం వృత్వా ధనైః సర్వతో
దత్త్వా కోశమశేషదేశవిదితాః కృత్వా పురీః స్వాభిఘాః।
సప్తాంగోర్జిత భంగిసంగిసుభగంకృత్వాపి రాజ్య చిరం
హిత్వా సర్వమహో పటైకరచనామన్తే లభన్తే నృపాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 234)

వాహ్!

అతి చక్కటి శ్లోకం.

నిజాని మనం ‘ఓజిమాండియస్’ కవిత చదివి  ‘ఆహా’, ‘ఓహో’ అంటాం. ఈ శ్లోకం ముందు ఓజిమాండియస్ తేలిపోతుంది. ‘ఓజిమాండియస్’ లో హేళన ఉంది. తూష్ణీంభావం ఉంది. ఈ శ్లోకంలో అవగాహన ఉంది. అర్ద్రత ఉంది. ఆలోచన ఉంది.  దుఃఖం అవగాహనలున్నాయి.

యుద్ధ భూమిలో ప్రబల శత్రువులను జయించి, భూమిని నలువైపుల ఐశ్వర్యమంతం చేసి, కోశాగారాన్ని నింపి (ప్రజలకు ఐశ్వర్యం అందించి) సకల దేశాలలో పేరు ప్రఖ్యాతులు పొంది, తన పేరు మీద నగరాన్ని నిర్మించి, సస్తాంగాలను సంపాదించి, సుశోభితమైన రాజ్యాన్ని చిరకాలం భోగించి, చివరికి విషాదం ఏమిటంటే, రాజు అన్నింటినీ వదలి చివరలో ఒక వస్త్రాన్ని మాత్రం పొందాడు.

‘ఓజిమాండియస్’లో నియంతల పై నిరసన ఉంది. వ్యంగ్యం ఉంది. మూర్ఖత్వం చూసి నవ్వటం ఉంది.

కానీ ఈ శ్లోకంలో మానవత్వం ఉంది. జీవిత సత్యం ఉంది. విశ్వజనీన భావన ఉంది. ముఖ్యంగా బుద్బుదప్రాయమైన మానవ జీవితం పట్ల అవగాహన ఉంది. జననం నుంచి మరణం వరకూ మానవ ప్రయాణం పట్ల సానుభూతి ఉంది. ‘ఇంత చేసిన వాడు చివరికి ఒక వస్త్రం మాత్రం వెంట తీసుకెళ్లాడు, ఇన్నింటి బదులుగా’ అన్న విషాదం ఉంది. నిజానికి ఈ శ్లోకంలో శ్రీవరుడు పొందుపరిచిన భావనలు, భావనలలోని అనుభూతుల ఆలోచనల గురించి ఎంతో లోతుగా చర్చించాల్సి ఉంటుంది. భారతీయ వేదాంత సారాన్ని ప్రతిబింబింస్తుందీ శ్లోకం.

స వైరరాజ్యదావాగ్నిసన్తప్త ఇవ శీతలామ్।
తద్ గుహాన్తరమాసాద్య సుఖనిద్రామివా భజత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 235)

శత్రు దేశ దావాగ్నిలో దగ్ధమైనట్టు, రాజు శీతలమైన గుహలో (సమాధి)లో ప్రశాంతంగా సుఖంగా నిద్రిస్తున్నాడు.

‘శత్రుదేశ దావాగ్ని’ పదాల్ని గమనించాలి. రాజు స్వదేశంలోనే మరణించాడు. కానీ అప్పటికే సంతానం నడుమ అధికారం కోసం పోరు స్వరాజ్యాన్ని శత్రుదేశంలా మలచింది. ఈ గొడవలు, ఆరాటాలు, అశాంతులు.. అన్నింటికీ దూరంగా శీతల గుహలో హాయిగా నిద్రించాడు రాజు అంటున్నాడు శ్రీవరుడు.

భూమిలో త్రవ్విన గుంటలో చల్లగా ఉంటుంది. ‘శీతల గుహ’ అన్నాడు శ్రీవరుడు. ‘గుంట’ను ‘గుహ’తో పోల్చాడు. గుహలో కూడా చల్లగానే ఉంటుంది!

(ఇంకా ఉంది)

Exit mobile version