[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
ముఖం నిద్రావృతస్యైవ దృష్ట్వా సౌభాగ్యసుందరమ్।
హాజ్యిఖానో కరోత్ పిత్రే మస్తకం స్వమరాన్నికామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 236)
నిద్రిస్తున్నట్టున తండ్రి వదనంలోని సౌభాగ్య సుందర భావాన్ని దర్శించి హ్యాజీఖాన్ నతమస్తకుడై నీరాజనం అర్పించాడు.
అపరాధం మయా తాత బహుశః పాపబుద్ధినా।
మన్యే తేనైవ రుష్టస్త్వమసహాయో గతో దివమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 237)
నేను విషబుద్ది వాడను, అపరాధము చేశాను. అందుకని కోపంతో నువ్వు నన్ను వదలి ఒంటరిగా స్వర్గానికి వెళ్లిపోయావు.
సేకంధర నృపే ధన్యో యస్త్వాం పశ్యతి నాకగః।
ధింగ్మా యో వంచితో రాజన్ దర్శనామృతవర్షణైః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 238)
సుల్తాన్ సికందర్ ధన్యుడు. స్వర్గం వెళ్లాడు. నిన్ను చూడగలుతున్నాడు. నేను నిన్ను ప్రాణాలతో దర్శించలేక పోతున్నాను.
విహృతం క్యాపి నో తాత మాం వినా ఖోత్సవక్షణే।
వాదాద్య కథమేకాకీ భజసే స్వర్గసంపదః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 239)
నువ్వు ఉత్సవాల సమయంలో కూడా నన్ను వదలి ఒంటరిగా ఆనందం అనుభవించ లేదు. నన్ను వెంటనే ఉంచుకున్నావు. ఇప్పుడు స్వర్గంలో భోగాలను ఒక్కడివే ఎలా అనుభవిస్తావు?
యస్త్వం కోమలశయ్యాసు నాగా నిద్రాం గణావృతః।
స కథం భూగణస్యాన్తస్తిష్ఠస్యేకః సశర్కరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 240)
రాజు చుట్టు సేవకులు ఉంటారు. అలాంటి గణపరివేష్టితుడవై కోమలమైన శయ్యపై కూడా నిద్రించటం కష్టమయ్యేది. ఇప్పుడు ఒంటరిగా, భూమిలో కంకరరాళ్ళు నిండిన మట్టిపై ఎలా నిద్రిస్తున్నావు?
ప్రతిముచ్య భవన్తం మే ప్రాప్తస్య స్వగృహ న కః।
ఆశ పన్మాస్తు మేలాపో భూయో వామితి కోపితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 241)
మిమ్మల్ని వదలి నేను ఇంటికి చేరేలోగా, మనమిక మాట్లాడలేమని శాపం ఎవరిచ్చారు?
ఔన్నిద్రయం కారితోస్మాభిః కుపుత్రైః సతతం భవాన్।
అద్యై వావసరం ప్రాప్య దీర్ఘనిద్రాం కరోషి కిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 242)
మేము కుపుత్రులం. నిరంతరం పోట్లాటల వల్ల మిమ్మల్ని నిద్ర పోనివ్వలేదు. ఇప్పుడు మీరు అవకాశం దొరకగానే నిద్రిస్తున్నారా?
జ్వలితాభూత్ తనుర్నిత్య సతతోదితయా యమా।
సాద్య కిం చలితా రాజం చింతా తే మానసాన్తరామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 243)
నిరంతరం ఏ చింత అయితే మీ శరీరాన్ని నిత్యం కాల్చివేసేదో ఆ చింత మీ మనసు నుంచి దూరమైపోయిందా?
చిత్రే వాప్యథ సంకల్పే పశ్యామి వదనాంబుజమ్।
శృణోమి తాః కథాః కుత్ర తాత తే బహుపాతకీ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 244)
తండ్రీ! నిన్ను చిత్తర్వులలో చూస్తాను. ఊహల్లో చూస్తాను. మీ పదాంబుజాలను ఊహించుకుంటాను. కానీ చెప్పండి, మీరు చెప్పే ఆ కథలను ఎక్కడ వినగలుగుతాను?
రాజ్యం విపద్ దిన రాత్రిః సూద్యాం పితృకాననమ్।
జీవనం మరణం నాథ త్వాం వినా మమ సాంప్రతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 245)
తండ్రీ! నువ్వు లేని రాజ్యం నాకు ప్రమాదకరం. పగలు రాత్రితో సమానం.పూలతోట కూడా స్మశానం లాంటిదే. జీవితం మరణం లాంటిది.
కుపితో వా ప్రసన్నో వా కుతోప్యాగత్య తాత మే।
దర్శనం దేహి నో సోఢుం క్షమో విరహవైశసమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 246)
తండ్రీ! కోపంగానో, ప్రసన్నంగానో, ఎటునుంచయినా సరే వచ్చి నాకు దర్శనం ఇవ్వండి. విరహ వేదన సహించే సామర్థ్యం నాకు లేదు.
విహాయ క్వ ను మాం తాత గతః పాదైకసేవకమ్।
ద్యుతిం న లభతే పద్మకోరకో భాస్కరం వినా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 247)
నీ పాద సేవకుడిని త్యజించి ఎటు వెళ్లిపోయావు? సూర్యుడి కాంతి లేకుండా కమలం వికసిస్తుందా? సూర్యుడు లేకపోతే కమలానికి కాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది?
కిం రుష్టోసి మహీపతేత్వమధునా దాసోస్మి సేవాపరో
మౌన మా భజ దేహి వాక్యమధునాప్యేక మమాత్యాదరాత్।
నో జీవామి వినా త్వయేతి విలపన్ కుర్వన్ భుజారాన్నికాం
సౌక్రంన్దం రుదిత చకార సుచిర దృష్ట్వా ముఖ భూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 248)
రాజు వదనం చూస్తూ “ఓ రాజా! నా మీద కినుక వహించావా? నేను ఇప్పటికీ నీ సేవాపరాయణుడను. మీ దాసుడను. ఇప్పుడయినా నాతో కనీసం ప్రేమగా ఒక్క మాటయినా మాట్లాడండి. మీరు లేకుండా నేను జీవించలేను” అంటూ పలు రకాలుగా విలపిస్తూ, చాలా సేపు అరుస్తూ, ఏడ్చాడు హ్యజీఖాన్.
ఇతి ప్రలాపముఖర హాజ్యఖానం శుచార్దితమ్।
రాజధానీం తతో నిన్యుర్దినాన్తే మంత్రిణో బలాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 249)
శోకపీడితుడయి విలపిస్తున్న హ్యాజీఖాన్‌ను మంత్రులు సాయంకాలానికి బలవంతాన రాజధానికి తీసుకుని వెళ్లారు.
సాయంకాలానికి తీసుకువెళ్లారని చెప్పటం వల్ల మధ్యాహ్నాని కల్లా శవాన్ని పాతిపెట్టటం తదుపరి జరిగే కార్యక్రమాలు పూర్తయిపోయాయని అర్థం చేసుకోవచ్చు.
పితుర్లోకాన్తరస్థస్య ప్రీత్యర్థం తత్క్షణం సుతః।
సాలోరగ్రామమాత్మీయం న్యధాత్ తత్ర శవాజిరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 250)
గ్రీష్మపానీయదానేన తృప్త్యర్థం తత్ప్రదాయినామ్।
బహూనాం ప్రదదౌ క్షోణీమహార్యాం ధర్మసాత్కృతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 251)
ఇలా తండ్రి శవం శ్మశానంలో ఉండగానే, తండ్రికి సద్గతి కలగాలన్న కోరికతో అతడు తనకు చెందిన సాలోర గ్రామాన్ని ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చేందుకు నీటి సరఫరాకు దానం చేశాడు. ప్రజలకు నీరు అందించే సేవాకార్యక్రమం చేసే వారి కోసం, ధర్మం కోసం ఆ గ్రామంలో భూములను దానం చేశాడు.
రాజ్ఞానేన వినా శూన్యాం నాస్మి క్ష్మామీక్షితుం క్షమః।
ఇతీవ దుఃఖాత్ తత్కాలం స్వమబ్ధౌ రవిరక్షిపత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 252)
జైనులాబిదీన్ వంటి రాజు లేని శూన్య భూమి వైపు చూడలేన్న దుఃఖంతో సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు.
సూర్యాస్తమయాన్ని అతి సుందరంగా, రాజు మరణించిన దుఃఖంతో ముడిపెట్టి చూపిస్తున్నాడు శ్రీవరుడు.
సంధ్యాభశాటీముత్సృజ్య రోదనార్థమివేశితుః।
శుచేవ విస్తృతం చక్రే తమః కచచయం క్షితిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 253)
రాజు ఇక లేడన్న శోకంతో కాబోలు పృథ్వి సంధ్యాకాలం నాటి వెలుగు చీరను త్యజించి, అంధకారం లాంటి కేశపాశాన్ని జగతిపై కప్పింది.
ఆశాప్రకాశకే వంద్య దర్శనే గుణిబాంధవే।
పరలోకం గతే తస్మిన్ మండలే ప్రోదభూత్ తమః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 254)
రాజు మరణంతో సామ్రాజ్యంపై అంధకారం వహించింది.
ఇది కాస్త క్లిష్టమైన శ్లోకం.
రాజుకు విశేషణాలుగా ఆశాప్రకాశ వంద్య దర్శనం, గుణీ బాంధువుడు వంటి పదాలు వాడేడు శ్రీవరుడు. అలాంటి రాజు వెళ్లిపోయినందుకు జగతి చీకటి మయమయిందన్న అర్థం ఇస్తుందీ శ్లోకం.
ఆశాకు దిశ అన్న అర్థం ఉంది. సూర్యుడు దిశలను ప్రకాశవంతం చేస్తాడు. అలాగే ప్రజల ఆశలను పూర్తి చేసేది రాజు. అలాగే ‘గుణి’ అంటే విద్యావంతులు, పండితులు, నిష్ణాతులు అన్న అర్థాలున్నాయి. రాజు పండితులను ఆదరించేవాడు. ‘గుణ’ అంటే ‘కమలం’ అన్న అర్థం కూడా వస్తుంది. కమల బాంధవుడు సూర్యుడు. కాబట్టి రాజు సూర్యుడితో సమానం. ప్రజల ఆశలు తీర్చేవాడు, సూర్యుడి లాంటి వాడు ఆయిన రాజు వెళ్ళిపోయినందుకు దేశం చీకటిమయం అయిపోయింది. రెండు వైపుల పదునైన కత్తుల లాంటి విశేషణాలు వాడేడు శ్రీవరుడు.
తద్దినే రంధనాభావాద్ గృహధూమవివర్జితా।
శోకముకా నిరుచ్ఛ్వాసా నిర్జీవేవాభవత్ పురీ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 255)
ఆ రోజు ఎవరింట్లో పొయ్యి వెలగలేదు. ఏ ఇంటి నుంచి పొగ రాలేదు. శోకవిషాదాలతో మౌనంగా ఉండిపోయారు ప్రజలు. తమ రాజు లేకపోవటం వల్ల నగరం నిర్జనంగా అయిపోయినట్టనిపించింది.
శవాగారోపరి శిలా స్ఫాటికీం రచనోజ్జ్వలామ్।
దీర్ఘా సర్వోన్నతాం రాజ్ఞో మూర్తి పరిణతామివ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 256)
రాజు సమాధిపై దీర్ఘమైన స్పటిక శిలనుంచారు. రాజు సమాధి, రాజు మూర్తి లాగా అపించింది.
ఘనోత్కంఠ దిదృక్షాప్తరుదల్లోకాశ్రుబిందుభిః।
యత్ర ముక్తాఫలైః పూజా లసతీవోపరి ప్రభోః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 257)
రాజుపై ప్రేమతో శోకతప్తులైన ప్రజలు ఆ సమాధిని చూడటానికి వచ్చేవారు. వారి కన్నీళ్లు ముత్యాల్లా రాలి, రాజును ముత్యాలతో పూజిస్తున్నట్టు అనిపించింది.
ఇక్కడి శ్రీవరుడు ఇస్లామీయులు సమాధిని నిర్మించటాన్ని వర్ణించాడు.
శవాన్ని పూడ్చి పెట్టిన తరువాత దానిపై మట్టిని నేల కన్నా ఒక అడుగు ఎత్తు వరకూ కప్పుతారు. శవం తల భాగంలో ఒక శిలను ఉంచుతారు. దాన్ని ‘మజార్’ అంటారు. ఆ శిలపై మృతుడి పేరు రాస్తారు. దాన్నే శ్రీవరుడు ‘శవాగారోపరి శిలా స్ఫాటికీం రచనోజ్జ్వలామ్’ అన్నాడు. దీన్ని ‘ఖత్‌బా’ అంటారు. దానిపై రంధ్రం చేస్తారు. అక్కడ దీపం ఉంచుతారు. ఆ శిలపై మరణించిన వారి పేరు రాస్తారు. ఇతర వివరాలు రాస్తారు.
తన సమాధి వద్ది దీపం వెలిగించే వారే లేరని వాపోతూ, బహదుర్ షాహ జఫర్ ‘కోయి ఆకె శమ్మ జలాయె క్యూఁ?’ అంటూ వాపోయాడు. సమాధిపై శిలను ఉంచటం ఎందుకంటే ఆ సమాధి ఎవరిదో గుర్తించటం కోసం. జైనులాబిదీన్ సమాధి ‘మజార్-ఎ-సలాతిన్’, శ్రీనగర్ లోని ‘జైనకడల్’ ప్రాంతంలో ఉంది.
అయితే ‘మజర్’ల నిర్మాణం సమాధుల నిర్మాణం విషయంలో ఇస్లామీయులలో విభేదాలున్నాయి. ఇస్లాంలో సమాధుల నిర్మాణం, వాటిపై భవనాల నిర్మాణాన్ని ‘బిదాహ్’గా భావిస్తారు. అలాంటి చర్యలను నిషేధిస్తారు. ‘హదిత్’ ప్రకారం సమాధి భూమి స్థాయిలోనే ఉండాలి. దానిపై ఎలాంటి గుర్తింపు నిర్మాణం ఉండకూడదు. అలాంటి నిర్మాణాలుంటే, పూజలు, అరాధనలు మొదలై వ్యక్తిని దైవంలా భావించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి కట్టడాలు నిషేధం. చివరికి శిలాఫలకాన్ని ఉంచటం, పేర్లు రాయటం, దీపం వెలిగించటం కూడా నిషేధం.
కాని షియాలు, సూఫీలు మజర్లు, దర్గాలు, ఔలియాల సమాధులపై నిర్మిస్తారు. దీన్ని కొందరు ఇస్లామీయులు వ్యతిరేకిస్తారు. శ్రీవరుడి వర్ణన ప్రకారం జైనులాబిదీన్ సమాధిని నిర్మించారు. దానిపై స్పటిక శిలను ఉంచి పేరు ఇతర వివరాలు రాశారు. సమాధి పై నిర్మాణాలు జరిగాయని, లభ్యమవుతున్న జైనులాబిదీన్ సమాధి నిరూపిస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
