[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
పోరాః శుక్రదినే భాన్తి యత్రాన్తః ప్రతిబింబితాః।
రాజ్ఞేవ నికట నీతాః కుతూహలతయాత్మనః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 258)
శుక్రవారం నాడు ప్రజలు సమాధి పై ఉన్న స్పటిక శిలలో ప్రతిబింబితమవుతున్న తమను చూసుకున్నారు. స్పటికంలో ప్రతిబింబిస్తున్న ప్రజల ప్రతిబింబాలను చూస్తుంటే.మహారాజు ప్రేమతో వారిని దగ్గరకు పిల్చుకున్నట్టు తోచింది, స్పటికంలో ప్రతిబింబిస్తున్న ప్రజల ప్రతిబింబాలను చూస్తుంటే.
కవాటవికటం వక్షో ముఖం పూర్ణేందుసుందరమ్।
శుక్రవద్దీర్ఘ నాసాగ్రం నేత్రే కమలకోమలే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 259)
భూలేఖే లోమశే భాల ప్రభాలంభితలక్షణమ్।
సా బుద్ధిస్తే గుణాస్తాశ్చ రాజ్యకార్యారిధానతాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 260)
స్మారం స్మారం జనః సర్వో రాజ్ఞః పుర ఇవ స్థితః ।
పర్యంత నీరసా సారం సంసారం నిందతే న కః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 261)
విశాలమైన వక్షస్థలం, చంద్రుడి లాంటి ముఖం, పక్షి ముక్కులాంటి ముక్కు, కమలం లాంటి నేత్రాలు, రోమాలు దట్టంగా కల కనుబొమలు, ప్రకాశవంతమైన ఫాలభాగం. అతని తెలివితేటలు, రాజ్యకార్య భార నిర్వహణలో నిజాయితీ వంటి వాటివన్నీ రాజు సమాధి ముందు నిలుచుని ప్రజలు మాటి మాటికీ స్మరించుకుంటూనే ఉన్నారు. చివరికి రాజు మరణంతో ప్రపంచం నిస్తేజం, నీరసం అయిందనుకున్నారు. ఈ ప్రపంచాన్ని నిందించని వారు లేరు.
జ్యోత్స్నా పూర్ణసుధాకరస్య కుసుమోత్కర్షో వసంతస్య యత్
సౌభాగ్య శరది ప్రసన్ననభసో నార్యా నవ యౌవనమ్।
రాజ్యే చైవ వివేకినో నరపతేర్యత్ సర్వసౌఖ్యప్రదం
ధాతా తత్ కురుతే స్థిర యది జనే స్వర్గార్జనే న స్పృహా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 262)
పూర్ణ చంద్రుడి వెన్నెల వెలుగు, వసంతం లోని పూల సౌందర్యం, శరత్కాలంలోని నిర్మలత్వపు అందం, నారీ నవయవ్వనము, రాజ్యాన్ని చక్కగా పాలించే రాజు అందరికీ సుఖసంతోషాలు కలిగిస్తారు.ఈ ప్రపంచంలో ఇవి శాశ్వతమైతే, మనిషిలో మహాత్ముడు స్థిరంగా నిలిస్తే, ఇక ఎవ్వరూ స్వర్గాన్ని కోరరు. అందరూ ఇక్కడే ఉండేందుకు ఇష్టపడతారు.
బాల్యే పిత్రా వియోగో వరసచివాభియో భ్రాతృభృత్యైవిరోధః
ప్రాప్తే రాజ్యే ప్రవామో బహిరథ సమరోప్యగ్రజేనాతికష్టః।
ధాత్రేయే యోగ్య చిన్తా తదను నిజసుతైర్యావదాయుశ్చ బాధా
సంమారే సర్వదాసుస్రుతి కృతి భవినాం నిత్యదుఃఖాం స్థితిం ధిక్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 263)
నూనం జాతకయోగేన పుత్రేభ్యో దుఃఖమన్వభూత్।
అభూదస్య సుతస్థానే భౌమో యత్ పాపవీక్షితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 264)
రాజు బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. మంత్రుల వల్ల ప్రాణభయాన్ని అనుభవించాడు. సోదరులు, సేవకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. రాజ్యం సాధించిన తరువాత బయట శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సోదరులతో కఠినమైన యుద్ధాలు చేయాల్సి వచ్చింది. తనను పెంచినామె కొడుకులతో ప్రమాదం ఎదుర్కొన్నాడు. తన స్వంత సంతానంతో యుద్ధాలు చేశాడు. కష్టాలు అనుభవించాడు జీవితాంతం. నిత్యం పోరాటాలు, దుఃఖప్రద స్థితిలో జీవించాడు. సంతానం వల్ల అత్యంత దుఃఖం అనుభవించటం జాతక యోగం వల్ల సంభవించింది. ఎందుకంటే.. అతని జాతకంలో పుత్ర స్థానాన్ని దుష్టగ్రహాలు వీక్షిస్తున్నాయి.
జైనులాబిదీన్ జీవితాన్ని ఈ శ్లోకంలో విహంగ వీక్షణం చేశాడు శ్రీవరుడు. ప్రజలకు సౌఖ్యాన్ని, సౌభాగ్యాలను అందించాడు. కానీ, జైనులాబిదీన్ జీవితం మొత్తం కష్టాలు, సంఘర్షణలు, దుఃఖాలే. చివరి వరకూ అతడు శాంతిని అనుభవించకుండా సంతానం బాధించారు.
అసలు చరిత్ర రచన పద్ధతి ఇది.
ఒక రాజు ఫలానా ఏళ్లు పాలించాడు. ఫలానా ఫలానా కట్టించాడు. వారినీ వీరినీ జయించాడు. సంతానంతో రాజ్యం కోసం యుద్ధం చేశాడు అంటూ రాసేది ఒక నివేదిక తప్ప చరిత్ర రచన కాదు. చరిత్ర రచనలో సాంఘిక సాంస్కృతిక, ధార్మిక, రాజకీయ మానసిక అంశాల విశ్లేషణ ఉంటుంది. అవగాహన, ఆలోచన ఉంటుంది. కానీ, రసహీనమైన చరిత్ర రచననే ప్రామాణికంగా భావించటంతో భారతీయులు సరైన చరిత్ర రచనగా భావించేది, పరాయివారి దృష్టికి దోషభూయిష్టమై, చరిత్ర కాకుండా పోయింది.
పండితాః కవయస్తస్య వాచాలా యే భవన్ సదా।
త ఏవ తం బినా దృష్టాః పౌషే మూకాః పికా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 265)
పుష్యమాసంలో కాకులు మౌనంగా ఉండిపోయేట్టు, రాజు మరణంతో పండితులు, కవులు అందరూ మౌనంగా అయిపోయారు.
యాభూత్ సరస్వతీనేత్రనిభా వికమితా సదా।
గ్రంధ్యా సంకుచితా సాభూద్ బుద్ధపుస్తక సంతతిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 266)
సరస్వతీదేవి నయనాల్లాంటి పండితులు, కవులు, విద్యాంసుల పుస్తకాలు ఇప్పుడు మూతపడ్డాయి.
తర్కవ్యాకరణాదీనాం శస్త్రాణాం యే శ్రమం వ్యధుః।
తే రాజరంజనాయాలం దేశభాషాశ్రమం వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 267)
తర్క వ్యాకరణం వంటి శాస్త్రాలలో పరిశ్రమించిన వారు రాజు మెప్పు కోసం దేశ భాషలలో వాటి ప్రచారం కోసం కృషి చేశారు.
రాజ్ఞా యే బహుమానితా గృహసుసశ్రీమండితాః పండితాః
శాస్త్రాభ్యాసమహర్నిశ ప్రవిదధుర్గ్రంధార్జనాద్యుత్సుకాః।
పృష్టాః కిం పఠితేతి తే ప్రతిజగుః శ్రీజైనభూపం గతే
కుత్ర వ్యాకరణ క్వ తర్కకలహః కుత్రాపి కావ్యశ్రమః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 268)
రాజుతో సమ్మానితులు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు అనుభవించినవారు, నిత్యం శాస్త్రజ్ఞాన సంపాదనలో మునిగినవారు, శాస్త్రగ్రంథాలు వెతికి, సంపాదించి, చదవటం కోసం ఉత్సాహం చూపినవారు ఇప్పుడు ‘జైనులాబిదీన్ మరణం తరువాత వ్యాకరణం ఎటు పోయిందో? తర్కవాద వివాదాలు ఏమైపోయాయో? సాహిత్యం ఎక్కడవుందో’ అని అంటున్నారు.
యోభూత్ సర్వ కలానిధిః శుభవిధిర్దాతాభిగమ్యో గుణీ
కావ్యజ్ఞో బహుభాషయా గుణిరతః కారుణ్యపుణ్యాకులః।
సోయం హన్త సమీక్ష్యతేవనితలే ధిక్ పాపినోస్మాన్ శఠాన్
యే జీవన్తి శుచా న యాన్తి విపినం సంసారతృష్ణాజితాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 269)
సర్వకళానిధి, ప్రజలందరిపై కరుణ వర్షం కురిపించిన వాడు, పండితుడు, కావ్యశాస్త్రాలు తెలిసినవాడు, బహుభాషా కోవిదుడు, కారుణ్యమూర్తి, సద్గుణాలు కలవాడు, ప్రజలందరినీ సమానంగా చూసేవాడైన రాజు మరణించటం చూశాం. ఛీ.. మాలాంటి పాపులు, నీచులు మరొకరుండరు. అంతటి మహారాజు మరణించిన తరువాత కూడా, జీవితంపై ప్రేమతో, అడవులకు వెళ్లిపోకుండా ఇంకా బ్రతికి ఉన్నందుకు సిగ్గు పడుతున్నాము.
హారేణేవ వినాంగనాకుచతటీ శాస్త్రేణ హీనేవ థీ
సూర్యేణైవ వినా ప్రఫుల్లనలినీ తారుణ్యహీనా వభుః।
చంద్రేణైవ వినా యథైవ రజనీ పత్యా వినా భామినీ
యేనైకేన వినా నృపేణ న బభౌ కశ్మీరరాజ్యస్థితిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 270)
హారం లేని స్త్రీ మెడ, శాస్త్రాధ్యయనం లేని బుద్ధి, సూర్యడు లేని కమలాలు, యవ్వనం లేని మానవ శరీరం, చంద్రుడు లేని రాత్రి, భర్తలేని భార్య ఎలా అసంపూర్ణం, అశోభితములో అలాగే రాజు లేని కశ్మీరం కూడా అనిపించింది.
శ్రీమత్చర్కాది విద్యాభ్యసన రసల సద్ధర్వసర్వ ప్రవీణ –
ప్రేక్షోద్యద్దాన మానోచితవిచితయశోభూషితాశేపదేహః।
శ్రీజైనోల్లాభదేనో నరపతితిలకః సర్వశాస్త్రప్రవీణః
కశ్మీరాన యోజయిత్వా దివమపి స గతో యోజనాయేవ నష్టామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 271)
తర్కశాస్త్రం, ఇతర శాస్త్రాలలో విద్యాభ్యాసం చేసినవాడు, స్వాభిమానానికి సంబంధించిన ప్రతి విషయంలో ప్రవీణుడు, ఎదుటి వారి అర్హతను గుర్తించి ఉచితంగా దాన సత్కార్యాలు చేసేవాడు, సర్వ శాస్త్రాలలో ప్రవీణుడు, నరపతితిలకుడు అయిన జైనులాబిదీన్ కశ్మీరును సంఘటిత పరచి సుస్థిరం చేసి ఇలాంటి పండితులందరినీ స్వర్గంలో సంఘటిత పరచి స్వర్గాన్ని చక్కదిద్దేందుకు స్వర్గం వెళ్లాడు.
ఇత్యాది సన్తతం సన్తో వదన్తోత్యన్తచిన్తయా।
నితాన్వతాన్తహృదయా విశ్రాన్తిం నాభజన్త తే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 272)
ఈ రకంగా అనుక్షణం రాజు గురించి ఆలోచిస్తూ, అతని గుణగణాలు స్మరిస్తూ, అత్యంత చింతాక్రాతులయి సజ్జనులు అశాంతితో సుఖరహితంగా జీవితం సాగిస్తున్నారు.
దృష్టో రమ్యశ్చిరముపవనే వంశవాటో జనైర్యో
నానావర్ణైర్నవతుణగణైర్భూషితో భూరిపత్రః।
తత్రాన్యోన్యాహననజననాత్ తాదృగభ్యుత్థితోగ్ని
యేనైకాన్తాదుపవనగతం సర్వమేవ ప్రనష్టమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 273)
చిరకాలం నానా వర్ణ పుష్పాలు, వృక్షాలతో అలంకృతమైన ఉపవనాన్ని చూస్తూ వచ్చారో, అదే, ఇప్పుడు పరస్పర సంఘర్షణల జ్వాలలతో సర్వం నష్టమైపోయింది.
యా కారకసభా భవ్యాభవచ్ఛ్రీజైన భూపతేః।
వర్షేణైకేన తచ్ఛాపాత్ సర్వా స్వప్నోపమాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 274)
జైనభూపతి భవ్యసభ సర్వం, అతని శాప ప్రభావంతో అదృశ్యమైపోయింది కలలోలా.
క్షుబ్ధే రాజ్యమహామ్భోధీ భూపప్రమయవాయునా।
తత్తత్సేవకరత్నౌఘః శతైకీయోవశిష్యత॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 275)
సముద్రం అల్లకల్లోలమయిన తరువాత అందులోని ముత్యాలు చెల్లాచెదురైనట్టు జైనులాబిదీన్ మరణం తరువాత అతని సేవకులలో ఒకరో ఇద్దరో మిగిలారు అక్కడక్కడా.
ప్రభవత ఉత యావత్ స్వప్రభుః సౌఖ్యదాతా
విదఘతి ఖలు తావత్ సేవకాస్తస్య మానమ్।
ఇహ వసతి వసన్తో యావదేవ స్వనన్తో
మధుకరపికమేకాస్తావదేవాద్రియన్తే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 276)
తమ యజమాని సమర్థుడిగా ఉన్నంత కాలమే, సేవకులు అతడిని గౌరవిస్తారు. వసంతకాలం ఉన్నంత వరకే తుమ్మెదలు, పలక్షులు, కప్పలు వసంతాన్ని స్తుతిస్తూ గానం చేస్తాయి.
ఇతి పండిత శ్రీవరి విరచ్యితాయాం జైనరాజతరంగిణ్యాం
జైనశాహి వర్ణనం నామ ప్రథమస్తరంగః॥
ఇంతటితో శ్రీవర పండితుడు రచించిన జైనులాబిదీన్ జీవిత గాథను తెలిపే జైనరాజతరంగిణిలో ప్రథమ తరంగం సమాప్తం.
శ్రీవరుడు రచించిన జైనరాజతరంగిణిలో ప్రథమ తరంగం పూర్తయింది. జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరంలో సంభవించిన పరిణామాలను గురించి, కశ్మీరు చరిత్ర గురించి వచ్చే వారం జైనరాజతంగిణి ద్వితీయ భాగం ద్వారా తెలుసుకుందాం.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
