Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-95

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

వందే విశ్వమయ దేవ సర్వవాఙ్మన్త్రనాయకమ్।
యదశవర్ణనస్తుత్యా తత్పూజాఫలభాగం న కః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 1)

సమస్త వాఙ్మంత్రాలకు నాయకుడు, విశ్వమంతా వ్యాపించినవాడు అయిన మహాశివుడికి వందనం చేస్తాను. అతని స్తుతి వర్ణన మాత్రంతో కోరిన కోరికలు లభించే ఫలం పొందనివారు ఎవరున్నారు? ఎవరూ లేరు.

శ్రీవరుడు జైనులాబిదీన్ మరణం తరువాత చరిత్రను చెప్పటం ఆరంభిస్తున్నాడు. ఇంత వరకూ ఆయన చెప్పిన దాన్ని  ‘జైనరాజతరంగిణి’ అన్నాడు శ్రీవరుడు.  ‘జైన’ అన్నది జైనులాబిదీన్‍ను సూచిస్తుంది. అందుకే పలువురు శ్రీవరుడు రచించిన రాజతరంగిణిని తృతీయ రాజతరంగిణిగా పరిగణిస్తారు. ‘ద్వితీయ తరంగం’ను శాస్త్రోక్తంగా, సంప్రదాయకంగా దైవ ప్రార్థనతో ఆరంభించాడు శ్రీవరుడు.

పాదో దక్షిణ ఏష యచ్ఛతి పద యత్రైవ నాట్యేచ్ఛయా
తత్రైవేచ్ఛతి నామ వామచరణః సంచారసంస్కారతః।
ఇత్థం మండలమండితాం సమపదాం చారోం నరీనర్తి యః
సంధ్యాయాం స సదా దదాతు సుఖితాం దేవోర్ధనారీశ్వరః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 2)

నేలపై ఆని దక్షిణ పాదం ఆధారం ఇస్తుండగా, వామ పాదం వృత్తాకారంలో సరళరేఖపై తిరుగుతూంటుంది. ఇలా నడకనే నర్తనంగా కల ఆ దైవం అర్ధనారీశ్వరుడు, మాకు సుఖశాంతులు ప్రసాదించు గాక.

అథ హైదరశాహాఖ్యాం ఖ్యాపయన్ ముద్రికార్పణైః।
హాజ్యఖానోగ్రహీద్ రాజ్యం స జ్యైష్ఠ ప్రతిపద్దినే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 3)

జ్యేష్ఠమాసం తొలి రోజున తన పేరును ‘హైదర్ షాహ్’గా ప్రకటించుకుని ఆ పేరుపై రాజముద్రలను వేయించాడు హ్యాజీఖాన్. రాజ్యంపై అధికారం సాధించాడు.

ఒక సుల్తాన్ రాజ్యాధికారం స్వీకరిస్తూనే తన అసలు పేరును వదలివేస్తాడు. సింహాసనాన్ని అధిరోహిస్తూనే నూతన నామం స్వీకరిస్తారు.

ఔరంగజేబ్ అసలు పేరు ముహీఊద్ దీన్ మహామ్మద్.

అక్బర్ అసలు పేరు అబుల్-ప్రత్ జలాల్-ఉద్-దీన్ మహమ్మద్ అక్బర్.

జహంగీర్ అసలు పేరు మీర్జా మార్-ఉద్-దీన్ బేగ్ మహమ్మద్ ఖాన్ సలీమ్.

ఇలా, అధికారం చేజిక్కించుకోగానే నూతన నామం స్వీకరిస్తారు. తమ పేరు మీద రాజముద్రలు వేయిస్తారు. మసీదులో ఖుత్‌బా తమ పేరు మీద చదివిస్తారు.

అగ్ర యార్చ దక్షిణానన్దీ తత్తత్సుకృతసూచకః।
బభావర్ధి జనానన్దీ స రాజ్యగ్రహణోత్సవః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 4)

శుద్ధాంశు కచిత రాజవల్లభైః సుఖశాలిభిః।
బభౌ శేకన్ధరపురీ పూర్ణా ద్యౌరివ తారకైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 5)

రాజ్యగ్రహణ ఉత్సవం గొప్పగా జరిగింది. ఉత్తమ జనులకు సన్మానం జరిగింది. దక్షిణలతో ఆనందకరమైంది. ఎవరెవరి సుకృతాలను బట్టి వారికి బహుమతులు అందేయి.  యాచకులకు అనందకరమయింది. ఈ ఉత్సవం సుశోభితంగా జరిగింది.

శుభ్రవ్రస్త్రాలతో ప్రజలు కనిపించారు. రాజు సమర్థకులతో సంబరాలు నిండిపోయాయి. ఆ రోజు సికందర్‌పురి తారకలతో సుశోభితమైన ఆకాశంలా తోచింది.

రాజధాన్యంగనే హేమ సింహాసనమశిశ్రియత్।
అతితీక్షణో నయో రాజా మేరోస్తటమివాంశుమాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 6)

సూర్యుడు మేరు శిఖరంపై ఆసీనుడయినట్టు, రాజు సింహాసనంపై ఆసీనుడయ్యాడు.

బభతుర్భూపతేరయే స్థితో తస్యానుజాత్మజౌ।
ఇందోః పురస్తాదుద్యన్తావివ శుక్రబృహస్పతీ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 7)

రాజ సమక్షంలో ఉన్న అతని తనయుడు, సోదరుడు, చంద్రుడి ముందుండే శుక్ర బృహస్పతులలా శోభితులయ్యారు.

రాజ్ఞో హస్సనకోశేశస్తద్రాజ్యతిలక దదౌ।
సౌవర్ణ పుష్పపూజాఢ్యం యదృచ్ఛావిహితవ్యయః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 8)

బంగారం, పుష్పాలను అర్పిస్తూ రాజు నుదుటన తిలకం ఉంచాడు. స్వేచ్ఛానుసారం వ్యయం చేయమన్న ఆదేశాలను అనుసరించాడు. అందరికీ బంగారం పంచాడు.

స హాజ్య హైదరనృపో ఘనకాలోర్జితప్రభః।
ధరాధవ ఇవ ధరాం దధార ధరణీధరః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 9)

వర్షాకాలంలో మేఘాలు ఉరుములు మెరుపులతో ప్రపంచాన్ని పాలించేట్టు, హజ్యహైదర రాజు దేశపాలనను ఆరంభించాడు.

సోనుజం స్వసమం భూమినాయకః సుక్షితే రసాత్।
బహ్లామఖాన నాగ్రామదేశే తం స్వామినం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 10)

నాగ్రామ దేశంలో సుందరమైన ప్రాంతానికి తన సోదరుడు బహ్రిమ్ ఖాన్‌ను ప్రేమతో అధిపతిగా ప్రకటించాడు సుల్తాన్.

అప్పటి నాగ్రమ్ ప్రస్తుతం ‘నౌగాంవ్’ పరగణా.

క్రమరాజ్యేక్షికాదేశే స్వామిన స్వసుతం వ్యధాత్।
చిరాన్నిజసుతప్రాప్త్యా యౌవరాజ్యసుఖాదపి।
పితృశోకహతోప్యన్తర్నిశ్రాన్తిమభజన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 11)

తనను రాజ్యానికి వారసుడిగా ప్రకటించినప్పటికన్నా అధికమైన ఆనందాన్ని అతడు తన కుమారుడిని కలసినప్పుడు అనుభవించాడు. తండ్రి మరణ దుఃఖాన్ని మరపించే సౌఖ్యాన్ని తనయుడి సాంగత్యంలో అనుభవించాడతడు.

తస్మాద్ విహితసేవాస్తు దేశాధీశత్వరాజితాః।
ప్రసాదమతులం ప్రాపూ రావత్రలావకాదయః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 12)

లావకుడు, రావత్ర వంటి వారు తమ సేవ ద్వారా రాజుకు ప్రీతిపాత్రమయ్యారు. వారు శక్తిమంతమైన అధికారాలు బహుమతులుగా పొందారు.

అన్యేప్యుంచావచాన్ గ్రామాన్ సేవకా నవభూపతేః।
పూర్వ సేవానుసారేణ ప్రసాద ప్రతిపేదిరే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 13)

ఇతర సేవకులు కూడా రాజను మెప్పించే రీతిలో సేవలు చేసినందుకు ప్రతిఫలంగా పెద్ద చిన్న గ్రామాలను బహుమతులుగా పొందారు.

ఇక్కడి నుంచే తప్పుటడుగులు పడటం గమనించవచ్చు.

రాజు తమ సహాయం చేసిన వారిని, సేవలు చేసిన వారిని మెచ్చుకోవచ్చు. ప్రశంసించవచ్చు. బహుమతులు ఇవ్వచ్చు. కానీ ఎప్పుడయితే రాజు వారికి అధికారాన్ని కీలకమైన పదవులను కట్టబెడతాడో అప్పుడు తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నట్టవుతుంది. అది రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా, అర్హులకు అధికారాలు, కీలకమైన పదవులు కట్టబెడితే సత్ఫలితాలుంటాయి. అర్హతతో సంబంధం లేకుండా ఇతరాంశాల ఆధారంగా  అధికారాన్ని కట్టబెడితే అనర్థాలు సంభవిస్తాయి.

అర్హత ఉన్న వాడిలో విశ్వాసం ఉంటుంది. దాంతో అతడు  అర్హత కలవారిని ప్రోత్సహిస్తాడు. తనకు చెందిన దాన్ని ఎవరో దోచుకుంటారన్న భయం అతడికి ఉండదు. అదే అర్హత లేని వాడికి  అవిశ్వాసం ఉంటుంది. తనకన్నా తెలికైన వాడిని చేరదీస్తే తనకే ముప్పుగా పరిణమించవచ్చన్న భయం ఉంటుంది. దాంతో తనకు ప్రమాదం లేదనిపించిన వారిని చేరదీస్తాడు. అర్హత ఉన్నదనిపించిన వారిని అణచివేస్తాడు. తన అధికారానికి ముప్పురాకుండా  తన పై అధికారిని మెప్పించటం కోసమే పని చేస్తాడు. నిజాన్ని, అప్రియమైన సత్యాన్ని విస్మరిస్తాడు.  దాంతో పాలన దెబ్బ తింటుంది. నిరసన పెరుగుతుంది.

అధికారానికి రాగానే హ్యజీఖాన్ తనకు విధేయులుగా ఉన్న వారికి,  సేవలు చేసిన వారికి పదవులు కట్టబెడుతున్నాడు. తన పతనానికి సామాన్లు ఆయనే తయారు చేసుకుంటున్నాడు.

రాజా రాజపురీసింధుపత్యాదీన్ దర్శనాగతాన్।
ప్రత్యముంద్యదలంకృత్య పార్థివోచితయా శ్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 14)

తన దర్శనార్ధం వచ్చిన రాజపురిసింధుపతి వంటి రాజులను సముచిత రీతితో సత్కరించాడు.

సౌవర్ణకర్తరీబన్ధసున్దరా నృపమందిరే।
ననందుర్మన్త్రిసామన్తసేనాపతిపురోగమాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 15)

పితృశోకార్పితానర్ఘపట్టాంశుకవిభూషణాః।
విచేరు సేరకాస్తస్య తదన్తికగతాః సదా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 16)

రాజమందిరంలో ఖరీదైన దుస్తులు ధరించి మంత్రులు, సామంతులు, సేనాపతులతో పాటు రాజు నుంచి  విలువైన బహుమతులు అందుకున్న సేవకులు కూడా కలిసి మెలిసి తిరగసాగారు.

ఆసీద్రాజా చ సతతం ప్రకామ దోషనిష్క్రియః।
స్వపక్షపాలనే సక్తః సంధ్యాక్షణ ఇవోడ్రుపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 17)

సంధ్యాకాలం నాటి చంద్రుడిలా రాజు నిరంతరం తన సమర్ధకులకు లాభం కలిగించటం లోనే నిమగ్నమై ఉండేవాడు.

‘స్వపక్ష పాలనే సక్తః’ – రాజు ఆసక్తి అంతా తన పక్షం వారి మంచి చూడటమేనన్న మాట.

పక్షపాతోక్షణాపత్యప్రతిపాలనతత్పరః।
లోభక్రోధవిరక్తాత్మా మోహాన్ధక్షపణక్షమః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 18)

పక్షపాత పూర్వకంగా సంతానాన్ని పాలించటంలో తత్పరుడై లోభక్రోధాల పట్ల విరక్తి కలిగి, మోహంధకారానికి దూరం చేసే సమర్థుడు.

సైదనాసిరపుత్రో యః సమెయ్యాహస్సనాభిధః।
అహో తత్పితృవత్ పూజ్యో బహురూపాదిరాష్ట్రభాక్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 19)

అలాంటి సయ్యద్ నాసిర్ పుత్రుడు మెయ్యు హస్సన్ బహురూప వంటి రాష్ట్రాలకు అధిపతి. అతడికి తన తండ్రి స్థానం ఇచ్చి పూజించాడు రాజు.

పీర్ పంజాల్ ప్రాంతంలో ఉంటుంది బహురూప పరగణా.

ఉత్సవాది సదాచార సత్కారేషు సభాన్తరే।
త ఏవ ప్రథమ మాన్యాస్తద్రాజ్యే సర్వదాభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 20)

వారి రాజ్యంలో ఉత్సవాలలో, సత్కారాలలో, సభలలో ప్రధమంగా మీర్జా హుస్సేనా, అతనికి చెందిన వారినే గౌరవించారు.

ఏతాన్యక్షాశ్రయాన్మహద్భావ్యయం బలవానితి।
మెయ్యా హస్సనపుత్ర్యాః స పాణిం పుత్రమజిగ్రహత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 21)

శక్తిమంతుడయిన మెయ్య హస్సన్న పుత్రికతో తన  పుత్రుడికి వివాహం జరిపిస్తే తాను మరింత శక్తివంతుడవుతానని భావించి రాజు తన కొడుకు వివాహం మెయ్య హస్సన్న పుత్రికతో జరిపించాడు.

జైనులాబిదీన్ వంటి రాజు తరువాత బలహీనుడు, ఆత్మవిశ్వాసం లేనివాడు అధికారానికి వచ్చాడు. వస్తూనే తనవారికి, తనకు సహాయం చేసిన వారందరికీ పదవులు కట్టబెట్టాడు. గ్రామాలు బహుకరించాడు. కానీ ఎక్కడో ‘భయం’ అతడిని వదలలేదు. అందుకని తను మరింత శక్తివంతుడు కావాలని శక్తివంతుడిగా అనిపించి అందరి గౌరవం అందుకుంటున్న మెయ్య హస్సన్న కూతురితో కొడుకు వివాహం చేశాడు.

‘రాజుల వివాహాలన్నీ రాజకీయ వివాహాలే’ అంటారు.

(ఇంకా ఉంది)

Exit mobile version