Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-96

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

హృత్వా జ్యాంశరమార్గేశాత్య జ్యాహంగిర మార్గపే।
బాంగిలం ప్రదదౌ రాజా తదనుగుణా కృష్టమానసః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 22)

జ్యాంసార మార్గపతి కొడుకు హంగీరాను చంపించి ‘వాంగీలా’ను మీర్జాహసన్‌కు కట్టబెట్టాడు.

చక్రే కృతాపకారాణామప్యనుగ్రహమేవ సః।
ప్రణమ్య సింహః పూర్వం హి హన్తి దన్తిగణం తతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 23)

తమకు అపకారం చేసిన వారిపై కూడా రాజు అనుగ్రహం వర్షించాడు. సింహాం ఏనుగుల సమూహాన్ని చంపే ముందు ప్రణామం చేస్తుంది.

కవులు చమత్కారులు. వారి కలం అన్ని వైపులా పదునైనది. శ్రీవరుడు కొత్తగా కశ్మీరు సామ్రాజాన్ని అధిష్టించిన రాజును పొగడుతున్నాడో, విమర్శిస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది.

పైకి చూస్తే రాజును  సింహంతో పోలుస్తున్నాడని అనిపిస్తుంది. పొగుడుతున్నట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, రాజును మోసగాడు అని అంటున్నట్టు అర్థమవుతుంది.

కొత్త రాజు హైదర్ షాహ శ్రీవరుడి శిష్యుడు. అతడి గురించి శ్రీవరుడికి తెలుసు. ఎట్టి పరిస్థితులలో జైనులాబిదీన్ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయలేడని తెలుసు. అతని చుట్టు మత ఛాందసవాదులు చేరి ఉన్నారనీ తెలుసు. తాను అతడికి బాల్యంలో పాఠాలు చెప్పాడు కాబట్టి తాత్కాలికంగా తనకు ప్రమాదం లేదనీ తెలుసు. కానీ ఏ చిన్న పొరపాటయినా నిర్దాక్షిణ్యంగా శిక్షను విధిస్తారనీ తెలుసు. అందుకే ఎంతో జాగ్రత్తగా రాజు గురించి చెప్పే చెడును పొగడ్త అనిపించే రీతిలో  రచించాడు. ఏనుగు గుంపుకు నమస్కారం చేసి వాటిని చంపుతుంది సింహం అంటున్నాడు. దానికి ముందు తనకు అపకారం చేసిన వారిపై కూడా అనుగ్రహం కురిపిస్తాడని అన్నాడు. అంటే, అపకారం చేసిన వారిపై అనుగ్రహం కురిపించి, వారిని నమ్మించి, హతమారుస్తాడన్న మాట . ‘నమ్మించి మోసం చేస్తాడు రాజు’ అని ఎంతో అందంగా చెప్తున్నాడు.

గూఢభావో మహీపాలస్తతచ్చేష్టాం చరైద్విందన్।
తదా హస్సనకోశేశం సంమాన్యాధికృతం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 24)

తన మనుస్సులోని ఆలోచనలను గూఢంగా ఉంచుతాడు రాజు. గూఢచారుల ద్వారా హస్సన్ కదలికలను, చర్యలను గురించి తెలుసుకునేవాడు. అతడికి అనేక బహుమతులను ఇవ్వటం ద్వారా తన అదుపులోకి తెచ్చుకున్నాడు.

ప్రతాపతాపితారాతిశ్ఛన్నకోపో మహీపతిః।
భస్మాంతరగతో వహ్నిరివాసీత్ పరమృత్యుదః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 25)

భస్మం (బూడిద) క్రింద నిప్పు కప్పి ఉన్నట్టు, రాజు ప్రతాపం వల్ల శత్రువులు మాడిపోయారు. కోపాన్ని ప్రచ్ఛన్నంగా దాచి ఉంచి, శత్రువుల పాలిట మృత్యువు అయ్యాడు రాజు.

అంటే, రాజు కోపం చూపించేవాడు కాదన్న మాట. నివురు  కప్పిన నిప్పులా అవకాశం లభించినప్పుడు దహించి వేసేవాడన్నమాట. ఇందులో పొగడ్త ఉంది. దూషణ ఉంది.

కాంశ్చిత్ సన్నభయాన్ కాంశ్చిత్ సఘాయ ప్రతిపాలయన్।
కాంశ్చిదున్మూలయన్ నీత్యా నానావృత్తిరభూన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 26)

రాజు నీతి ఏమిటో ఎవరూ గ్రహించలేకపోయేవారు. కొందరి భయం దూరం చేసి, వారితో స్నేహం చేసి, చంపేవాడు. కొందరిని అత్యంత గౌరవించి బహుమతులు ఇచ్చేవాడు. రాజు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరూ గ్రహించలేకపోయేవారు.

రాజు ఈ లక్షణాన్ని, భయం తొలగించి, నమ్మకం కలిగించి అవకాశం లభించగానే చంపటమన్న దాన్ని, సద్గుణంలా చెప్తున్నాడు శ్రీవరుడు. రాజు మనసులో మాట ఎవరికీ తెలియనివ్వడు, అది రాజు లక్షణం అంటున్నాడు.

ప్రసాదకృత్ స భృత్యానామభూద్ వైశ్రవణోపమః।
మనాగప్యపరాధేన బభూవాన్తకసంనిభః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 27)

కుబేరుడిలా భృత్యులపై అనుగ్రహ వర్షం కురిపించేవాడు. కానీ కొద్దిగా పొరపాటు జరిగితే యమరాజులాగా అయిపోయేవాడు.

పయః పితృసుతామాత్య ఫిర్యడామరకాదయః।
విచార్యాసన కోపే వభూవువృతయన్త్రణాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 28)

మంత్రులు, ఫియదామరుడు వంటి వారందరికీ రాజు తీవ్రవైన అగ్రహం గురించి తెలుసు. వాళ్లు లోలోపలే భయపడుతూ ఉండేవారు.

నెమ్మది నెమ్మదిగా రాజు లక్షణాలను బయట పెడుతున్నాడు శ్రీవరుడు. చెప్పటం గొప్పగా చెప్తున్నాడు.

చౌరా జారాశ్చ రిపవో భృత్యా దుర్ణయకారిణః।
అహ్నీవ జంబుకాశ్చేరు స్తద్రాజ్యే భయవిహ్వలాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 29)

పగటి పూట తోడేళ్లు, దొంగలు, అవినీతిపరులు, శత్రువులు, అణచివేసే రాజు సేవకులు- అందరినీ భయభ్రాంతులను చేస్తూ తిరుగుతున్నారు.

ఇప్పుడీ వర్ణన బట్టి కశ్మీరులో రాజ్య పరిస్థితిని ఊహించవచ్చు. కశ్మీరు ప్రజల దుర్గతిని అర్థం చేసుకోవచ్చు. తోడేళ్లు ఉదయం పూట తిరగవు. అవి భయం లేకుండా ఉదయం పూట తిరుగుతున్నాయంటేనే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.

శ్రీజైన నృపతౌ శాన్తే మూర్ధారూఢ శిలోపమే।
అబాధన్త పునర్లోకం వ్యాలా ఇవ నియోగినః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 30)

తలపై వున్న బరువైన శిల తొలగినట్టు రాజు జైనులాబిదీన్ శాశ్వత విశ్రాంతి తీసుకున్న తరువాత కశ్మీరులో పాముల్లా అధికారులు ప్రజలను బాధించటం ఆరంభించారు.

ఈ శ్లోకంలో శ్రీవరుడు ‘పాముల్లాంటి నియోగులు’ అని వాడాడు.  ‘నియోగి’ అంటే సంస్కృతంలో అధికారి, ఉద్యోగి, కర్తవ్యనిర్వాహకుడు అన్న అర్ధాలున్నాయి.

కశ్మీరు ఇస్లాం రాజ్యంగా మారిన తరువాత రాజు నియమించిన ఉద్యోగులు ప్రజలపై అనేక దాష్టికాలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా జరిగిన విషయం.

అంతకు ముందు రాజ్యాధికారాన్ని ‘బాధ్యత’గా భావించే ధార్మిక వ్యవస్థ ఉండేది. దాంతో ప్రజలను పీడించటం అన్నది ఎవరో దుష్ట రాజుల పాలనలో జరిగేది. ‘రాజతరంగిణి’ లో కూడా పలు సందర్భాలలో దుష్ట రాజులపై ప్రజలు తిరుగుబాటు చేసిన కథలు కనిపిస్తాయి.

ఇస్లామీయులు రాజ్యాధికారం చేపట్టిన తరువాత ఈ పరిస్థితి మారింది. ముఖ్యంగా మతపరమైన అంశాలు వేదిక పైకి రావటంతో  అధికారుల దృష్టి మారింది. గతంలోని మానవత్వం, అవగాహనల స్థానంలో అసహనం, పీడించటం, హింసించటం వంటివి పైకి వచ్చాయి. పైగా బయటనుంచి వచ్చిన వారు అధికారులయితే, వారికి ఈ దేశం పట్ల ప్రేమ వుండకపోవటంతో  పాటుగా, ఇక్కడి ప్రజలంటే గౌరవాభిమానాలూ వుండవు. పైగా, వారు కాఫిర్లయితే, ఇక వారిని కరుణించే ప్రసక్తే వుండదు. కొత్తగా మతం మారినవారయితే, ఇంకా తమ పాత మతాన్ని పట్టుకుని వ్రేలాడేవారిపైన కసి వుంటుంది. మతం మార్చటంద్వారా వారూ బలహీనులేనని నిరూపించాలన్న పట్టుదల వుంటుంది.

ఇస్లామీయుల కాలంలో భూమి పన్ను (ఖరజ్) జిజియా (ముస్లిమేతరులపై పన్ను) జకత్ (ముస్లింల ఆస్తి పన్ను) వంటి వాటితో పాటు చారాయి పన్ను (పశువుల మేతకు పన్ను) ఘరి పన్ను(ఇంటి పన్ను) వంటి పన్నులుండేవి. పన్నులు కూడా హిందువులపై అధికంగా ఉండేవి. ముఖ్యంగా జిజియా పన్ను ఇంత అని నిర్దుష్టంగా వుండేది కాదు. వసూలు చేసేవారి ఇష్టాన్ని బట్టి వుండేది.  అనేక సందర్భాలలో పన్నులు నిర్ధాక్షిణ్యంగా వసూలు చేసేవారు. పన్నులు తప్పించుకునేందుకు మతం మారేవారు. పన్నులు కట్టలేక ఇళ్లు వాకిళ్లు అమ్మి పేదరికంలో దిగజేరేవారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎలాగయితే ‘పన్నుల’ ద్వారా అన్ని దేశాల మెడలు వంచి తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నాడో, అప్పుడు అధికారులూ పన్నులను ఆయుధంలా వాడి ప్రజలను హింసించేవారు. అప్పుడు అధికారులకు  పన్నుల విషయంలో నిర్ణయాధికారాలుండేవి. పన్నుల వసూలును ఒక హింసాత్మక ఆయుధంలా వాడేవారు. అది పలు రూపాలుగా మార్పులు చెందుతూ, జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, పటేల్ పట్వారీ దేశముఖ్‌ల వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఒక ధార్మిక బాధ్యత స్వార్ధపూరిత అణచివేతకు ఆయుధంలా  దిగజారింది.

జైనులాబిదీన్ పాలనలో ఇలాంటి పన్నులను, వాటి వసూళ్లను నిషేధించాడు. ముస్లింలు అయినా, ఇతర మతస్థులయినా పన్నులు సమానంగా విధించాడని శ్రీవరుడి రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది.

దీన్ని బట్టి, జైనులాబిదీన్ మరణం తరువాత మళ్లీ పాత పద్ధతులు అమలులోకి వచ్చాయని గ్రహించవచ్చు. జైనులాబిదీన్ జీవిత కాలంలో ఆయన కాఫిర్‍లకు ప్రాధాన్యం ఇస్తున్నాడని నిరసించిన శక్తులన్నీ ఇప్పుడు తలలెత్తి విజృభిస్తున్నాయని గ్రహించవచ్చు. అందుకే తోడేళ్లు ఉదయం పూట తిరుగుతున్నయన్నాడు శ్రీవరుడు. పాము తలపై బరువు తొలగి అది తల ఎత్తిందని అంటున్నాడు.

అధికారులను సూచించేందుకు శ్రీవరుడు ‘నియోగి’ అన్న పదం వాడేడు. నియోగి అనగానే మనకు బ్రాహ్మణులలో ఓ శాఖ గుర్తుకు వస్తుంది.  ‘నియోగి’ ప్రధానంగా తెలుగు ప్రాంతాలలో బ్రాహ్మణుల శాఖను సూచించేందుకు వాడుకలో ఉన్న పదం.

‘నియోగి’ అన్న పదం 7, 8 శతాబ్దాలలో తూర్పు చాళుక్యుల హయాంలో అధికారికంగా కనిపించిందంటారు. క్రీ.శ. 1000-700 నడుమ నియోగి అన్నది బ్రాహ్మణుల శాఖగా స్థిరపడిందంటారు. అందుకే శ్రీవరుడు ‘నియోగి’ అన్న పదం వాడగానే దక్షిణాది వాళ్లకు బ్రాహ్మణులు గుర్తుకు వస్తారు. కానీ శ్రీవరుడు  ‘నియోగి’ అన్న పదం  ‘అధికారి’ అన్న అర్థం లోనే వాడేడు. అది కూడా ఇస్లామేతరులను సూచించేందుకు కాదు.

విశుద్ధపక్షీ రుచిరంజితాశః
కలాకలాపో విబుధోపజీవ్యః।
పూర్ణేందునానేన సమోస్తి కోన్యః
కలంక ఏకో యది నాస్య దోషః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 31)

అన్ని దిశలను చల్లని వెలుగుతో శోభోయమానం చేసే వెన్నెల వెలుగులను దేవతలు కూడా ఆనందిస్తారు. అయినా పూర్ణచంద్రుడిలో కూడా మచ్చ ఉంది. అలానే రాజు వ్యక్తిత్వంలో కూడా మచ్చ ఉంది.

శృత్వాస్మద్రూపణాః సోయం సర్వాన్ హన్తీతి కద్వియాః।
ఐక్యం పురప్రవేశార్థం మిథస్తదూషకా వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 32)

తమ దోషాల ఆధారంగా  రాజు తమని చంపేస్తాడేమోన్న భయంతో, తమ దోషాల నుంచి రాజు దృష్టిని మరల్చేందుకు వారు కొత్త వ్యక్తిని రాజుకు పరిచయం చేశారు.

కుకృత్యప్రేరకః పాపశ్చాన్యాయోత్కోచహారకః।
ప్రియోభవద్దివాకీర్తీ రాజ్ఞో రిక్తేతరాభిధః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 33)

దుష్టకార్యాలను ప్రేరేపించేవాడు, పాపి, అన్యాయపూర్వక చర్యలు చేసేవాడు, అవినీతి చేసేవాడు, లంచం తీసుకునేవాడు అయిన  ‘పూర్ల’ అన్న పేరున్న వాడు రాజుకు సన్నిహితుడయ్యాడు.

శ్రీవరుడు ‘పూర్ణ’ అన్నాడు కానీ పర్షియన్ చరిత్ర రచయితలంతా  ‘లూలీ’ అన్న పేరున్న వాడు సుల్తాను సన్నిహితుడని అన్నారు.

తవాకత్-అక్బరీ ప్రకారం ‘వోలీ’ అనేవాడు సుల్తాన్‌కు విశ్వాస పాత్రుడయ్యాడు. అతని చేతిలో సుల్తాన్ తోలుబొమ్మలాంటి వాడయ్యాడు. అతను ఏం చెప్తే అదే చేసేవాడు. ఫరిష్తా ప్రకారం ‘బూవీ’ అనేవాడు సుల్తాన్‌కు ఎంత సన్నిహితుడయ్యాడంటే, అతను సుల్తాన్‌కు ప్రజలకు నడుమ వారధిలా ఉండేవాడు. ప్రజల నివేదనలు సుల్తాన్ దాకా తీసుకు వెళ్లేందుకు, సుల్తాన్‌కు చెప్పి వాళ్ల కోరికలు తీర్చేందుకు డబ్బులు తీసుకునేవాడు.

భారతదేశ చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఏ రకంగా అంచలంచెలు సమాజంలో కలుషితాలు చేరుతూ వచ్చాయో గమనిస్తే, ఈనాడు మన ధర్మంలో,  జీవన విధానంలో,  ఆలోచనల్లో దోషాలుగా ఎంచుతున్న అనేకానేక అంశాలు   ఈ దేశానికి, ఈ ధర్మానికి  చెందినవి కావనీ, పరాయి దేశాల నుంచి వచ్చిన వారి సంపర్కంతో సంక్రమించినవని గ్రహింపు వస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version