Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-97

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

కామీవ వ్యసనం నిత్యముపాలవ్ధోపి భూభుజా।
య త్యక్తు నాశకద్రాజా సంస్తవాద్ధృదయంగమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 34)

వ్యసనలోలులు ఎంతగా ప్రయత్నించినా చెడు అలవాట్లును వదలి వేయలేనట్టు, జైనులాబిదీన్ ఎంతగా ప్రతి రోజూ దూషిస్తూ వచ్చినా సరే ప్రస్తుత రాజు తన స్నేహితుడిని దూరం చేసుకోలేకపోయాడు.

సంచితార్థః ప్రజాయాసైర్ముద్రాదానాదికర్మభిః।
ఆసీత్ స్వకార్యకుశలః ఖ్యాతో ధూర్తః స నాపితః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 35)

రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడయిన ఆ క్షురకుడు, ప్రజలను దోచుకుని, కష్ట పెట్టి అధిక ధనాన్ని ఆర్జించాడు. తాననుకున్న కార్యాన్ని సాధించటంలో ప్రవీణుడయిన అతడు ‘లంచగొండి’గా ప్రఖ్యాతి పొందాడు.

రుద్ధం చిత్తేన కాఠిన్యం మాధుర్యం జిహ్వయా ధృతమ్।
శఠస్య యస్య సతతం లోకోద్దేజన కారకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 36)

కుటిలుడయిన ఈ క్షురకుడు తీపి మాటలతో, అందరినీ సంతోష పరచేవాడు. కానీ కఠిన చిత్తంతో నిరంతరం ప్రజలను బాధించేవాడు.

యేనాధికారాద్ దేశేస్మిన్ ప్రజాః కుకర్మభిః కృతాః।
దుఃఖితా రక్షితాః పూర్వ పుత్రవచ్ఛ్రీమహీభుజా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 37)

కుటిల రీతిలో అధికారాన్ని సాధించిన వాడు, పూర్వరాజు కన్న బిడ్డలుగా చూసుకున్న ప్రజలను వేధించసాగాడు.

మేరభోఖారనామాపి బుద్ధిమాన్ ప్రథితో భువి।
నితరామపకో పాగ్నే రాజ్ఞః సాచివ్యమాదధే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 38)

ప్రపంచంలో ప్రసిద్ధిపొందిన బుద్ధిమంతుడు మీరభోఖారుడు రాజుకు మంత్రి అయ్యాడు. అతడు కోపరహితుడు.

శ్రీవరుడు ‘మీరభోఖార్’ అన్నాడు. ఇతని పేరు మీర్ భోకర్ లేక మీర్ ఇఫ్తిఖార్  అన్న విషయంలో వాద ప్రతివాదాలున్నాయి. మరి కొందరు ఇతను ‘మీర్ ఖుర్’ అంటారు. అధికులు ఇతని పేరు ‘మీర్ ఇఫ్తఖార్’గా భావిస్తున్నారు.

వాత్సల్యాద్ విహితో రాజ్ఞా స చుటగణనాపతిః।
సమస్త కార్యస్థానేభ్యో భుంక్తే రాజీపజీవికామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 39)

తనకు అభిమానం ఉండటం వల్ల రాజు మచ్చర్య(చుట్)ను గణనాపతిగా నియమించాడు. అతడు రాజుకు చెందిన అన్ని కార్యలయాల నుంచి ధనాన్ని కాజేశాడు.

‘గణన పతి’ అంటే జమాఖర్చుల లెక్కలు చూసేవాడు. Accountant. అలా నియమించినందుకు అర్హత కేవలం రాజుకు ప్రీతిపాత్రుడు కావటమే. జమాఖర్చుల లెక్కలు చూసేవాడు కాబట్టి, అన్ని కార్యాలయాలకు అందిన ధనం వివరాలు అతనికి తెలుస్తాయి. రాజుకు ప్రీతిపాత్రుడు కాబట్టి ధనం అంతా ‘స్వాహా’ అన్నాడు.

భారతీయ సమాజంలో ‘పదవి’ అన్నది ‘బాధ్యత’. రాజు ‘విష్ణువు’తో సమానం.  కాబట్టి, ధనం అక్రమంగా సంపాదించటం అన్నది దైవాన్ని మోసం చేయటం క్రిందకు వస్తుంది. అందుకని అధికారులు అక్రమ ధనార్జనపై  ఆసక్తి చూపేవారు కారు. పైగా ‘దైవ భావన’ ఎలాగో ఉండనే ఉంది. కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసు. అయినా సరే, ‘అవినీతి’ అన్నది మానవ స్వభావంలోనే ఉంటుంది. కాబట్టి ‘అవినీతి’ సంభవించేది. కానీ పట్టుబడితే శిక్షలు భయంకరంగా ఉండేవి. అది కూడా అధికులలోని  అవినీతి భావనను అణిచి పెట్టి ఉంచేది.

‘అర్థశాస్త్రం’లో కౌటిల్యుడు రాజ ద్రవ్యాన్ని అధికారులు కాజేసే 40 రకాలను వివరించాడు. నాలిక అంచున ఉన్న తేనె బిందువును ఎలాగ రుచి చూడకుండా ఉండటం సాధ్యం కాదో, అలాగ, పన్నులు వసూలు చేసే పనిలో ఉన్న వారు రాజధనాన్ని కాజేయక పోవటం అసంభవం అన్నాడు.

అశోకుడి శాసనాలలోనూ ‘అవినీతి’ ప్రస్తావన కనిపిస్తుంది. క్షేమేంద్రుడు, ‘నర్మమాల’లో అవినీతి అంటువ్యాధిలా వ్యాపిస్తున్నదంటాడు. అయితే, ఎప్పుడెప్పుడు పాలన సక్రమంగా ఉండదో అప్పుడప్పుడు ‘అవినీతి’ విచ్చలవిడి అవుతుంది. కశ్మీరులో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

రాజుకు ఇష్టం కాబట్టి అతడికి జమాఖర్చుల బాధ్యత అప్పచెప్పాడు. రాజు అంటే అందరికీ భయం కాబట్టి, రాజుకు ఇష్టడయిన వాడంటే కూడా భయపడాల్సి ఉంటుంది. కాబట్టి వాడేం చేసినా ఎదురు చెప్పటం కుదరదు. అదీ ధైర్యం అవినీతిపరులకు. అనాడూ, ఈనాడూ, ఏ దేశంలోనయినా, ఏ కాలంలోనయినా ఇంతే. అప్పుడు రాజుకు ఇష్టుడయినవాడికి భయపడాల్సివచ్చేది. ఇప్పుడు అధికారులకి ఇష్టులకు భయపడాల్సివస్తున్నది.

యో వర్షణైకనిరతః శిఖిహ హేతుః
సదర్శితాతులఫలః కృతకర్షణేషు।
జాతోపి యః ప్రతిదిన హృతసర్వతాపః
సోయ ఘనస్తుదతి దుఃసహవజ్రపాతైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 40)

ఏ మేఘమైతే నెమలికి సంతోషం కలిగిస్తుందో, అదే మేఘం జలం కురిసి పంటలు పండేట్టు చేసి రైతుకు ఆనందం కలిగిస్తుంది. వేడిని తరిమి వేసి సుఖం కలిగిస్తుంది. అదే మేఘం మెరుపుతో  సహస్ర వజ్రాయుధాల తాకిడిలా సర్వనాశనం చేస్తుంది.

దుర్మన్త్రి ప్రేరితో రాజా వ్యధాన్మదవిచేతనః।
ప్రజాభాగ్యవిపర్యాసాద్ వివేకవిగుణాః క్రియాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 41)

దుష్ట మంత్రుల చేత ప్రేరేపితుడై, మద్యం మత్తులో మునిగి రాజు, ప్రజల దౌర్భాగ్యం వల్ల అనేక అతి నీచమైన పనులు చేశాడు.

ఇదే పద్దతి జోనరాజులో కూడా చూడవచ్చు.

ఎట్టి పరిస్థితులలో వారు సుల్తాన్ దుష్టుడు అని అనరు. నిజానికి సుల్తాన్, దుష్టుడు, క్రూరుడు, నికృష్టుడూ  అయినా సరే అందరూ, నేరం,  చుట్టు ఉన్న వారి పైనో, సలహాలిచ్చే మంత్రుల పైనో నెట్టి వేస్తారు తప్ప రాజు దుష్టుడు అనరు. కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని ప్రజల దౌర్భాగ్యం అనేస్తారు తప్ప సుల్తాన్‌ను దోషిగా నిలపరు. ఎందుకంటే ‘సుల్తాన్’ను ఏమీ అనకున్నా, ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతురుల ప్రాణాలు నిరంతరం ప్రమాదంలో ఉంటాయి. ‘దిన దిన గండం నూరేళ్లాయుష్టు’ లాంటి జీవితం గడుపుతారు వారు. అలాంటి పరిస్థితులలో, సుల్తాన్ ను  ఎట్టి పరిస్థితులలో ‘దోషి’గా నిలపటం కుదరదు. అందుకని జోనరాజు సికందర్ బుత్‌‌షికన్ అకృత్యాలన్నింటికీ, మతం మారిన ‘సూహభట్టు’పై నేరం మోపాడు. అన్ని అకృత్యాలు అతనివే అన్నాడు. ఇప్పుడు శ్రీవరుడు అదే చేస్తున్నాడు. పైగా, ఇప్పుడు అధికారంలో ఉన్న సుల్తాన్, జైనులాబిదీన్ లాంటి వాడు కూడా కాదు. జైనులాబిదీన్ కాలం లోనే జోనరాజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు శ్రీవరుడు ఇంకెంత జాగ్రత్తగా రచించాలో అర్థమవుతుంది.

గమనిస్తే, ఈ భావన భారతీయ సమాజంలో నరనరాన జీర్ణించుకు పోయిందనిపిస్తుంది. ఆ కాలంలోనే కాదు, తరువాత కూడా ఈ భావన సమాజంలో కొనసాగింది. ఇస్లామీయులు తాము పాలకులుగానే భావిచుకున్నారు. భారతీయులు తాము పరాజితులుగానే ప్రవర్తించారు. అందుకే ఒక బిచ్చగాడిని ‘ఫో.. ఏమి లేదు పోయిరా పో’, ‘దుండుముక్కలా ఉన్నావు అడుక్కుంటున్నావు. పని చేసుకో పో’ అని తరిమే వాళ్లే , ఫకీరు సాంబ్రాణి, నెమలి ఈకలతో ఇంటి ముందుకు రాగానే ‘మాఫ్ కరో భాయ్.. జాకర్ ఆవో’ అని మర్యాదగా భయంగా అంటారు. స్వాతంత్రం తరువాత కూడా ఈ భావన కొనసాగటం వల్ల ఈనాడు ‘appeasement’ లాంటి భావనలు సమాజాన్ని పట్టుకుని ‘భూతం’లా పీడిస్తున్నాయి. అందరూ సమానమైన ప్రజాస్వామ్య  సమాజాన్ని మైనారిటీలు, మెజారిటీలు, అధికార భావనలు, అణచివేత భావనలు వంటివి పట్టి పీడిస్తున్నాయి. భారతీయులలోని ఈ న్యూనతా భావన, ‘భయం’ ఎంతటి స్థాయికి చేరిందంటే ఈనాడు ‘ఇస్లామీయులను’ ఎవరయినా విమర్శిస్తే హిందువులకు  వాడో హీరో అయిపోయే స్థాయికి చేరింది.

ఈనాడు మన సమాజంలో మనం అనుభవిస్తున్న ఉద్విగ్నతలు, అభద్రతా భావాలు ఈనాటివి కావు. వాటికి మూలం మధ్యయుగంలో ఉంది. భారతీయ సమాజ మానసిక వ్యవస్థను అర్థం చేసుకోవాలనుకునేవారు, అనాటి నుంచి  అధ్యయనం చేసి, విశ్లేషించాల్సి ఉంటుంది.

సేకన్థరపురీపార్శ్వ సనిర్మాణ చికీర్షయా।
అమృతోపవనే ప్రాంశుతరుచ్ఛేదనమాదిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 42)

ఛిన్నాంస్తాన్ పుష్పితాన్ వృక్షాన్ సమీక్ష్యైతత్మముత్థితాః।
తచ్ఛుచైవ వ్యధుస్తత్ర రోలంబా రోదన ధ్వనిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 43)

తన్నిర్మాణగ్రహోన్యేషాం న కేషాం ప్రత్యభాద్వృది।
అగ్నే దిన పతేర్దీపత్రకాద్యనరసోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 44)

సేకన్థరపురంలో ఒక పెద్ద నిర్మాణం చేయాలన్ని ఉద్దేశ్యంతో అమృత ఉపవనంలో ఉన్నతమైన వృక్షాలను నరికేయమని ఆజ్ఞాపించాడు రాజు. పుష్పాలతో నిండి ఉన్న వృక్షాలు చిన్నాభిన్నమవటం చూసి, ఆ పూలపై నున్న భ్రమరాలు గాలికెగిరినప్పుడు చేసిన నాదాలు, అవి శోకంతో రోదిస్తున్నట్టున్నాయి. సూర్యుడి ముందు దివిటీల్ని వెలిగించినట్టు, అక్కడ నిర్మాణం, ఎవరికీ నచ్చలేదు.

‘సేకన్థరపురి’ అంటే శ్రీనగరం. శ్రీనగరంలో ‘అమృత ఉపవనం’ ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే, శ్రీవరుడు తప్ప ఈ వనం ప్రస్తావన మరెవరూ చేయలేదు. శ్రీవరుడు కూడా మరెక్కడా ఈ వనాన్ని ప్రస్తావించలేదు.

తద్ బ్రూమః క్షీవ ఏవం కరోతీతి వినిశ్చతమ్।
స్వాహితాపక్రియాహేతీ చూర్ణిత వ నృప వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 45)

అమృత ఉపవనంలోని వృక్షాలను నరికేయమని రాజు అజ్ఞాపించినప్పుడు అతడు మద్యం మత్తులో ఉండి ఉంటాడు. ఇంత నిశ్చయంగా ఎలా చెప్తున్నానంటే, మద్యం  మత్తులో రాజు ఇలాంటి స్వీయహాని కలిగించే అనేక నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి.

బహూనామథ లోకానాం నాపితోవయవచ్ఛిద్రామ్।
భూపాలాదాప్తనిర్దేశః క్షీబతోపి తథాకరోత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 46)

రాజు మత్తులో ఉన్నప్పుడు అతని నుండి అజ్ఞలను సంపాదించి, రాజుకు ప్రియుడైన క్షురకుడు, ఎంతో మంది అవయవాలను కత్తిరింప చేశాడు.

దీన్ని బట్టి ఆ క్షురకుడికి సుల్తాన్‌పై ఎంత పట్టు ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజు మత్తులో ఉన్నప్పుడు ఆజ్ఞలు తీసుకని తనకు నచ్చని వారిని హింసించేవాడు. అవయవాలు కత్తిరింప చేసేవాడు. ఈ విషయాన్ని పర్షియన్ రచయితలు మరో రకంగా చెప్పారు.

రాజు అవినీతిని సహించేవాడు కాదు కాబట్టి కఠినంగా వ్యవహరించేవాడు. అలాంటి వారికి రాజు విధించే శిక్షల్లో అవయవ ఛేదన అధికంగా ఉండేదని రాశారు పర్షియన్ రచయితలు.

చరిత్ర రచనలో మనం ఆధారంగా తీసుకునే అంశాలను బట్టి చరిత్ర గురించి ఏర్పాటుచేసే తీర్మానాలు ఆధారపడివుంటాయి. పెర్షియన్ రచయితల రచనలు ఆధారం చేసుకునేవారికి రాజు అవినీతిని సహించేవాడుకాడు. శ్రీవరుడిని ఆధారం చేసుకునేవారికి, రాజు మద్యం మత్తులో వుండేవాడు. అతనికి సన్నిహితుడుగా వుండే క్షురకుడు, ఆ మత్తులో రాజుతో తనకు కావాల్సిన అజ్ఞ్నలను ఇప్పించుకుని కక్ష సాదించుకునేవాడు. విచ్చలవిడిగా ప్రజలను హింసించేవాడు. రాజు కూడా అలాంటివాడేనని ముందరి పద్యాలలో చెప్పాడు. కానీ, దోషం మాత్రం క్షురకుడిపైకి నెట్టేస్తున్నాడు శ్రీవరుడు. ఈ రెండింటినీ ఆధారంగా తీసుకునేవాడు, శ్రీవరుడేం చెప్పాడో, ఎందుకు చెప్పాడో, పెర్షియన్ రచయితలు ఏం చెప్పారో, ఎందుకు చెప్పారో ఆలోచించి నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయానికి తన స్వపైత్యం జోడించకూడదు. కానీ, భారతదేశ  చరిత్ర రచనలో ఆధారాల కన్నా పైత్యం ఎక్కువగా కనిపిస్తుంది.

నాపితో నిర్ధృణః పాపీ క్రోధీ క్రకచపాటితాన్।
పైతృకాంష్ఠ కక్కరాదీంశ్చ కారయామాస భూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 47)

పాపి, నిర్దయి, క్రోధి అయిన ఆ క్షురకుడు రాజుకు పితృ సంబంధీకులయిన థక్కురాలను రంపంతో కోసి చంపేయించాడు.

చదువుతుంటేనే వళ్లు భయంతో కంపిస్తుంది. రాజు బంధువులకు కూడా రక్షణ లేదు కశ్మీరంలో.

శ్రీవరుడు ప్రస్తావించిన ‘థక్కురాలు’ జమ్ము ప్రాంతానికి చెందినవారు. వీరిని ఠాకుర్లని కూడా అంటారు. జైనులాబిదీన్ రాజ్యం సంపాదించటంలో ఠాకుర్లు సహాయం చేశారు. జైనులాబిదీన్ కు  ‘హిందూ’ భార్య ఉండేది. అందుకే పితృవుల తరఫు బంధువులు అని అన్నాడు శ్రీవరుడు. ఆనాడు, ఈనాడు అవే భయాలు, అవే అభద్రతా భావాలు, చలామణీలో ఉన్నాయని శ్రీవరుడు రచించిన పద్దతి తెలుపుతుంది.

చలితానగ్రజభ్రాతుః స్వావనాయాన్తికం పథి।
రుద్ధవా శూలేధిరోప్యాన్యాన్ పంచషానప్య ధాతయత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 48)

రక్షణ కోసం పెద్దన్న దగ్గరకు పారిపోతున్న అయిదారుగురిని మార్గంలోనే పట్టి బంధించి, శూలారోహణం చేయించి చంపేశాడు.

‘శూలారోహణం’ అన్నది అతి ఘోరమైన, క్రూరమైన శిక్ష. శూలంపై దోషిని కూర్చుండబెట్టేవారు. గుదం నుంచి శూలం శరీరంలో పైపైకి పోతున్న కొద్దీ కొన్ని రోజులు చావురాక, బ్రతకలేక,  నరకయాతనను అనుభవిస్తూ ప్రాణాలు వదిలేవాడు వ్యక్తి. మరణం అంత తొందరగా రాదు శూలారోహణంలో. అలాంటి శిక్షను విధించాడప్పుడు,  ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోతున్న వాళ్ళకు.

జీవన్తో గణరాత్ర తే స్వకుటుమ్వోక్తవేదనాః।
పౌరైః సానుజలైర్దృష్టాః శూలపృష్ఠే పురాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 49)

నగరంలో పురవాసులు కన్నీళ్లతో, కొన్ని రోజులు నరక యాతనను అనుభవిస్తున్న పురవాసులను చూస్తూ బాధపడ్డారు. శూలారోహణ శిక్షను అనుభవించిన వారి కుటుంబాలవారు, తాము బాధపడుతూ, శూలారోహణ శిక్షను అనుభవిస్తున్న వారి బాధలను చూస్తూ, వారి బాధలు వింటూ తీవ్రమైన వేదనను అనుభవించారు.

ఆ దృశ్యం ఊహించుకుంటేనే బాధతో మనసు నిండిపోతుంది. ఆ కాలంలో ఇలాంటి హింసలు సర్వ సాధారణం. ఇప్పటికీ, తాలిబన్ పాలిస్తున్న అఫ్ఘనిస్తాన్ లో ఇలాంటి బహిరంగ హింసలు సాధారణమే!

(ఇంకా ఉంది)

Exit mobile version