[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
వైడూర్యభిషజం జ్ఞాత్వా దూషకం పరపక్షగమ్।
అముంచద్ బంధనాత్ కృత్తభుజనాసోష్టపల్లవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 50)
క్షురకుడికి వైద్యుడు వైడూర్య తెలుసు. అతడిని ఇతరులపై అనవసరంగా నిందలు మోపేవాడిగా, శత్రువుల సమర్ధకుడిగా ఆరోపించి, అతడి చేతులు, ముక్కు, పెదిమలను కత్తిరింపచేశాడు.
ఇస్లామ్ షరియా చట్టం ప్రకారం ఎదుటివారిపై అనవసర ఆరోపణలు చేసేవారికి ఎనభై కొరడాదెబ్బలు శిక్ష. నిజానికి, శత్రువుల సమర్థకుడికి అంతిమ తీర్పు రోజున శిక్ష వుంటుంది. కానీ, శత్రువును సమర్థించేవారికి, చేతులు కత్తిరించటం, ముక్కు కోయటం వంటి శిక్షలు విధించటం ఆనవాయితీ. ఇప్పుడు కొత్తగా పెదిమలు కత్తిరించటం ఆరంభించాడు కశ్మీరులో క్షురకుడు. ఇది అతని క్రౌర్యాన్ని చూపుతుంది.
తథైవ నోనడెవాదీన్ శిఖజాదాదిసంయుతాన్।
పంచాషానకరోత్ కృత్తఝ్వానాసైకహస్తకాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 51)
అలాగే, శిఖజాదా, నోనదేవ వంటి అయిదారుగురి నాలుకలను, ముక్కులను, ఒక చేయిని కత్తిరింపచేశాడు.
శిఖజాదా, నోనదేవ వంటివి కశ్మీరీ పండితుల పేర్లు. నోనదేవుడి ప్రసక్తి జోనరాజు రాజతరంగిణిలోకూడా వస్తుంది. జోనరాజు తండ్రి పేరు కూడా నోనదేవుడు. ఈ నోనదేవుడు వేరేవారనుకోవచ్చు. కానీ, ఈ వివరాలు శ్రీవరుడు ఇవ్వటం వెనుక, జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీర్‌లో నివసిస్తున్న పండితులపై జరిగిన అత్యాచారాలను భావి తరాలకు తెలపటం అన్న ఉద్దేశం ఉండి వుంటుంది. ఎందుకంటే, వీరెవరి గురించీ ఇంతకు ముందు ఎక్కడా ప్రస్తావించలేదు. వారు ప్రముఖులా? కాదా? తెలియదు. వారి శిక్ష ప్రాధాన్యం తెలియదు. అయినా వారి గురించి ప్రస్తావించాడంటే, భావి తరాలవారికి, తమ పూర్వీకులపై జరిగిన అత్యాచారాలు తెలియాలన్న లక్ష్యం తప్ప మరో కారణం కనబడదు.
ఈ విషయంలో శ్రీవరుడు అభినందనీయుడు. కానీ, ఆయన చెప్పిన విషయాలను భావి తరాలు ఎంతగా పట్టించుకున్నాయన్న విషయాన్ని వదిలేస్తే, భారతీయులపై సుల్తానులు ఎలాంటి అత్యాచారాలు చేయలేదని, మత సామరస్యానికి వారు పెట్టింది పేరనీ జరుగుతున్న ప్రచారాలు చూస్తూంటే, తమ పూర్వీకుల త్యాగాలను గుర్తించలేనివారికి వారి త్యాగ ఫలితాలను అనుభవించే అర్హత లేదనిపిస్తుంది. ఇస్లాం లోని సర్వ మానవ సమానత్వం చూసి, సనాతన ధర్మంలోని వివక్ష బంధనాలను వదుల్చుకుని స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించారని నమ్మించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయులపై జరిగిన అత్యాచారాలు, అన్యాయాలను ప్రత్యక్షంగా చూసి అనుభవించిన జోనరాజు, శ్రీవరుల రాజతరంగిణి రచనలు అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తాయి. కానీ, అకాడెమిక్ పరిథిలో తప్ప సామాన్య ప్రజలకు కల్హణుడు తప్ప మరొక రాజతరంగిణి రచయిత, వారి రచనలు తెలియకపోవటం, ప్రాణాలను పణంగా పెట్టి భవిష్యత్తు తరాలవారికి నిజాలను అందించిన వారికి అన్యాయం, అవమానం.
విరుద్ధావయవచ్ఛేదశూలారోపణకర్మణా।
స పూర్ణనాపితః పాపీబభూవ నరశౌనికః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 52)
అవయవాలను ఖండింపచేయటం, శూలారోహణం చేయించటం వంటి శిక్షలను అమలు చేయటంవల్ల క్షురకుడు పూర్ణను అందరికి కసాయివాడయిపోయాడు. మానవహంతకుడయ్యాడు.
ఆచార్యపుత్రో జ్యాఖ్యస్థథా భీమాభిధో ద్విజః।
ఛిన్నాంగౌ స్వం యథాశక్తౌ వితస్తాయాం సమౌజ్ఝతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 53)
ఆచార్యుడి పుత్రుడు జయ, బ్రాహ్మణుడు భీమల అంగాలను విఛిన్నం చేశాడు. ఇక యుద్ధంలో అసమర్థులమని గ్రహించి వారు వితస్తలో దూకి ప్రాణత్యాగం చేశారు.
చదువుతోంటే, ఒక పక్క ఒళ్ళు జలదరిస్తుంది భయంతో. మరోవైపు, ఆగ్రహంతో రక్తం మరగిపోతుంది. ఇంతకాలం జైనులాబిదీన్ అడ్డుపడి ఆపిన మత మౌఢ్యం విచ్చలవిడిగా కరాళ నర్తనం చేస్తోంది.
కశ్మీరులో ఇస్లామేతరులపై అత్యాచారాల పర్వం ఆరంభమయింది. శ్రీవరుడు బహుశా ఆకాలంలో కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్నాడు. ప్రముఖులపైనే ఇలాంటి అత్యాచారాలు సంభవిస్తూంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరంలేదు.
శ్రీవరుడు జజ్జ అన్నాడు. కానీ, అసలుపేరు జయ అని నిర్ధారించారు. జయాపీడుడి బంధువు ఇతడు. ఆచార్య పుత్రుడు. భీమ్ బ్రాహ్మణుడని శ్రీవరుడు స్పష్టంగా చెప్పాడు. అంటే, రాజకుటుంబీకులను, వారి వెంట ఉండేవారినీ వదలకుండా హతమారుస్తున్నారన్నమాట.
ఒక ప్రతిపాదన ప్రకారం, జైనులాబిదీన్ ఆదరించిన ఇస్లామేతరులందరినీ ఏరివేసే ప్రక్రియ జరుగుతున్నది. అందులో భాగంగా ఈ హత్యలు, హింసలు చెలరేగుతున్నాయి. ఇస్లామేతరుడిని శిక్షించటంలో భాగంగా అతడి ఆస్తులను ఇస్లామీయులు కాజేస్తారు.
ఈ పద్ధతి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అమలవుతున్నది.
అయితే, చుట్టూ ఇంత హింస చెలరేగుతూంటే, శ్రీవరుడు ఎలా సురక్షితంగా వుండి కావ్యం రాయగలిగేడన్న ప్రశ్న వస్తుంది.
శ్రీవరుడు జైనులాబిదీన్ కు అత్యంత సన్నిహితుడు. రాజకీయాలకు దూరం. అతడు జైనులాబిదీన్ సంతానానికి గురువు. అన్ని కుట్రలు, కుతంత్రాలకు దూరంగా వుంటూ, తన రచనలు, తన అధ్యయనానికి పరిమితమవటం అతడిని అందరివాడినీ చేసింది. అయినా సరే, దాదాపుగా పదిహేనేళ్ళు అతనేమయ్యాడో, ఎలా ఉన్నాడో తెలియదు. అదృశ్యమయిపోయాడు, రాజతరంగిణి రచన తరువాత. మళ్ళీ పదిహేనేళ్ళ తరువాత, ‘కథాకౌతుకమ్’ రచన వల్ల అతను ఇన్నేళ్ళూ బ్రతికేవున్నాడని తెలిసింది.
మద్యలీలావ్యసనతస్తద్రాజ్యే బాహ్యదేశవత్।
ఆసీన్మాద్రీకవద్రోడీ దెశేత్ర ప్రచురా సురా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 54)
మద్యపాన వ్యసనం రాజ్యంలో అధికం కావటం వల్ల, ఇతర దేశాల్లో లాగే, ఈ రాజ్యంలో కూడా అంగూరుతో తయారయిన మద్యంతో సమానంగా ఇక్షుసారం (molasses) తో చేసిన మద్యం ప్రాచుర్యం పొందింది.
తన్మద్యరసికే రాజ్ఞి సర్వభోగపరాన్ముఖే।
ఖండదీక్షువికారాస్తే సులభా న గుడోభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 55)
రాజు ఇక్షుసారంతో చేసిన మద్యానికి అలవాటుపడి ఇతర రకాల మద్యం పట్ల విముఖుడవటంతో, చెరకు రసంతో తయారయ్యే ఇతర వస్తువులు లభించటం కష్టం అయింది.
ఖుజ్యాబ్దుల్కాదిర్యస్యాంతెవాసీ గీతగుణాంబుధేః।
మల్లాడోదకనామాసీత్ తంత్రీవాద్యగురుర్నృపే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 56)
కూర్మవీణాదివాద్యానాం ప్రాప్యాస్మాద్ గీతకౌశలమ్।
ఆజీవం క్షణమప్యాసీన్న తంత్రీవాదనమ్ వినా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 57)
గుణాల సాగరం వంటి ఖుజ్యాబ్దుల్ కాదిర్ అంతేవాసి మల్లాడోదక్ అనేవాడు రాజుకు వీణ నేర్పిన గురువు. ఈ వీణవాదన రాజుకు ఎంతగా ఇష్టమయిందంటే, ఆ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించిన రాజు, జీవితాంతం ఒక్క క్షణం కూడా ఆ వాయిద్యం లేకుండా ఉండలేదు.
శ్రీవరుడు అబ్దుల్ కాదిర్ సుజ్యా అన్నాడు. ఖ్వాజా కు బదులుగా సుజ్యా అన్నాడు. ఖ్వాజా అంటే, స్వామి, యజమాని అని అర్థం. ఇస్లామ్‌లో వీణావాదన లేదు. బహుశా ఈ ఖ్వాజా ఒకప్పటి వాయిద్యకారుడేమో, మతం మారి అబ్దుల్ కాదిర్ ఖ్వాజా అయ్యాడేమో!
మల్లా దోదక్ అన్నది, శ్రీవరుడు రాసిన పేరు. అతని అసలు పేరు ముల్లా దావూద్. ఈయన ఖ్వాజా అబ్దుల్ కాదిర్ శిష్యుడు.
కూర్మవీణ (కచ్ఛపి వీణ) అన్న పదం వాడేడు శ్రీవరుడు. ముల్లా జాద్ కూర్మవీణ ప్రవీణుడు. ఖ్వాజా అబ్దుల్ కాదిర్ వీణవాదన ప్రవీణుడు. పెర్షియన్ రచయితల ప్రకారం ఖురాసాన్ నుంచి ముల్లా ఉదీ అనే సంగీతకారుడు కశ్మీర్ వచ్చాడు. కానీ, శ్రీవరుడు అతని ప్రస్తావన తేలేదు. బహుషా ఆతడు వాయించే వాయిద్యం పూర్తిగా భారతీయేతర వాయిద్యంగా భావించి వదిలేసివుండవచ్చు.
కానీ, మొత్తానికి భారతీయ సంగీతం, ఇస్లామీయుల సంగీతంతో మిళితమై హిందుస్తానీ సంగీతం రూపుదిద్దుకోవటం గమనించవచ్చు. వేర్వేరు నాగరికతల వారు కలవటం వల్ల మిశ్ర సంస్కృతి ఏర్పాటవటం తెలుస్తుంది.
అందుకే పలువురు కర్ణాటక సంగీతాన్ని శుద్ధ భారతీయ సంగీతంగా, హిందుస్తానీ సంగీతాన్ని కలుషిత సంగీతంగా భావిస్తారు. ఇస్లామీయుల కలయికతో కలుషితమయిన సంగీతం అన్నమాట.
భారతీయ సంస్కృతిలో సంగీతం కూడా భగవంతుడిని చేరుకోవటంలో ఒక మార్గం. అందుకే, అన్ని రాగాలూ ఏదో ఒక దైవంతో సంబంధం కలిగి వుంటాయి. వాటికి సంబంధింన గీతాలూ భగంతుడినే స్మరిస్తాయి. ఇందుకు భిన్నంగా, హిందుస్తానీ రాగాల బందిష్ లన్నీ, ప్రేయసీ, ప్రియుల విరహ గీతాలు, ప్రేమ గీతాలు. ఇందుకు కారణం ఏమిటంటే, సుల్తానుల ముందు భగవంతుడి ప్రార్థనారాగాలు పాడటం కుదరదు. అందుకని, ఇస్లామీయులకు ప్రియమయిన ప్రేమ గీతాల రాగాలే పాడేవారు అధికంగా. అందుకని, హిందుస్తానీ సంగీతం మనుషులను రంజింప చేసే లాలిత్యంతో వుంటుంది, కర్ణాటక సంగీతం ఇందుకు భిన్నంగా కఠినంగా వుంటుంది.
మొత్తానికి సుల్తాన్ అటు మద్యానికి, ఇటు సంగీతానికి అంకితమయ్యాడన్నమాట.
శ్రీవరుడు చాలా మర్యాదగా రాశాడు. పెర్షియన్ రచయితలు సుల్తాన్, మద్యానికి, నృత్య సంగీతాలకు, నృత్యగత్తెలకు బానిస అయ్యాడనీ, నిరంతరం మత్తులో తూలుతూ, ఆటపాటల్లోనే గడిపేవాడు, పాలనను పట్టించుకునేవాడు కాడనీ రాశారు.
తంత్రీవాద విశేషజ్ఞో రాజా వ్యంజనధాతుభిః।
స్వయం వాదననిష్ణాతో వైణికానప్యశిక్షయత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 58)
ఖ్వాజా అబ్దుల్ కాదిర్ వద్ద వీణ నేర్చిన రాజు వీణవాదనలో నిష్ణాతుడయ్యాడు. ఎంతగా అంటే, వీణా విద్వాంసులకు సైతం వీణలో శిక్షణ ఇచ్చేవాడు.
రబావాద్యరచనైర్బహ్లోలాద్యశ్చ గాయనైః।
రాజ్ఞః ప్రసాదాత్ కిమ్ నాప్తం తత్తత్కనకవర్షిణః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 59)
రబాబ్ నిర్మాణకర్త బహ్లాల్‍తో సహా ఇతర గాయకులు రాజును మెప్పించారు. రాజు వారిపై కనకవర్షం కురిపించాడు. రాజు కృపతో వారింకేమేమి పొందలేదు?
రబాబ్‌ను ఇరానీ వాద్యంగా భావిస్తారు. కానీ, ఈ వాయిద్యాన్ని బహ్లోల్ నిర్మించాడని అంటారు. రబాబ్ వాయిద్య నిర్మాణం, అభివృద్ధి కశ్మీరులోనే జరిగేయి. తాన్సేన్ ఈ వాయిద్యాన్ని తన స్వంత వాయిద్యంగా చేసుకున్నాడు. ఈ వాయిద్యంతో అతను సుల్తానుల దర్బారును గెలుచుకున్నాడు.
రబాబ్ సారంగిలాంటి వాయిద్యం. ఈనాటికీ కశ్మీరులో ప్రసిధ్ధమయిన వాద్యం రబాబ్. సుల్తాను వీణ, రబాబ్‌ల వాయిద్యాలకు పరవశించేవాడని ‘తవాకత్-ఎ- అక్బరి’లో రాశారు. సుల్తానుకు వాదన నచ్చితే, వాయిద్యాన్ని రత్నాలతో నింపేసేవాడు. అందుకే శ్రీవరుడు కనకవర్షం అన్నాడు, రాజు కృపతో వారేమేమి పొందలేదు? అని ప్రశ్నించాడు. ఫరిష్తా ప్రకారం సుల్తాన్‌కు రబాబ్, తంబూరాలు ఇష్టం. ఆయన వీణను ప్రస్తావించలేదు. ఆదరణ పొందేవారందరూ ఇస్లామీయులే అవటం కూడా శ్రీవరుడి నిర్లిప్తతకు కారణం అయివుండవచ్చు. ఇంతకాలం శ్రీవరుడి గానం మెచ్చాడు జైనులాబిదీన్. ఇప్పుడు కొత్త సుల్తాన్ పూర్తిగా ఇస్లామీయులకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. శ్రీవరుడు తన ప్రాధాన్యం కోల్పోయాడు. ఇది తరువాత శ్లోకం స్పష్టం చేస్తుంది.
శౌచాలయస్థైః సురతాలయస్థైర్భూతైరివాంతశ్ఛలనప్రవీణైః।
వశీకృతో యః పిశునైర్నరేశో బిభేతి తస్మాన్నను కో న మర్త్యః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 60)
రాజంటే ప్రతి ఒక్కరూ భయపడేవారు. ఆయన ఎల్లప్పుడూ దుష్టుల ప్రభావంలోనే ఉండేవాడు. ఆయన శౌచాలయంలో ఉన్నా, అంతఃపురంలో మహిళలతో ఉన్నా దుష్టులు దయ్యాల్లా ఆయన వెంటనే ఉండేవారు. ఇలాంటివారికి రాజు వశీకృతుడయిన తరువాత వారంటే భయపడనిదెవరు?
రహఃస్థితం నృపం జాతు పిశునః పూర్ణానాపితః।
అపృచ్ఛత్ ప్రేరితోమాత్యైఃశ్చికీర్షాం పూర్వమంత్రిశు॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 61)
అమాత్యుల ప్రేరణతో పూర్ణ రాజుతో ఏకాంతంగా ఉన్న సమయంలో పూర్వ మంత్రులతో ఎలా వ్యవహరించాలో ప్రశ్నించాడు.
పూర్వ మంత్రుల విషయం రాజుకు పట్టలేదు. కానీ, రాజును రెచ్చగొట్టి పూర్వ మంత్రుల అడ్డు తొలగించుకోవాలన్న కుట్ర ఇది. పూర్వమంత్రుల పట్ల ప్రజలలో ఏమాత్రం అభిమానమున్నా తమకు ప్రమాదం అన్న అభద్రతాభావం ఇది.
భవత్పక్ష వినాశో యైః కృతస్త్వత్పితృమంత్రిభిః।
ప్రాప్తరాజ్యేన భవతా త ఏవ ప్రబలీకృతాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 62)
మీ తండ్రిగారి మంత్రులు మీ పక్షాన్ని నాశనం చేసినవారు. అధికారం సాధించిన తరువాత మీరు వారిని శక్తిమంతులుగానే ఉండనిస్తున్నారు.
రెచ్చగొట్టటం అంటే ఇది. జైనులాబిదీన్ మంత్రులు జైనులాబిదీన్‌నే సమర్థిస్తారు. అతని శత్రువుకు వ్యతిరేకంగా పోరాడతారు. ఇది, ప్రస్తుత సమాజంలో ప్రభుత్వోద్యోగుల పరిస్థితి. ప్రభుత్వంలో ఎవరున్నారన్నది వారికి సంబంధం లేదు. ప్రభుత్వంలో ఉన్నవారేమి చెప్తే అది చేయటమే వారి పని. అది వారి ఉద్యోగం. వారి ధర్మం. వారి ఉద్యోగ బాధ్యతను నిర్వహించినందుకు వారిని బాధ్యులను చేసి శిక్షించటం అన్యాయం. కానీ, కక్ష సాధింపు చర్యలలో ముందుగా నష్టపోయేది ఉద్యోగులే!
అమీ హస్సనకోశేషుముఖ్యాస్త్వదనుజాదృతాః।
సోపిధూర్తే ధియా తత్తద్వశీకారసముద్యతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 63)
కోశాధికారి హస్సనా, ఇతరులు మీ తమ్ముడి (బహెరామ్ ఖాన్) సమర్థకులు. అతడిప్పుడు వీరిని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
అసమర్ధశరీరస్త్వం భ్రాత్రార్పితభరః సదా।
తత్తే సపుత్రభృత్యస్య న నాశో భవితా చిరాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 64)
మీరు బలహీనులు. భారమంతా మీ సోదరుడి మీదే వేస్తారు. అతడిని నమ్ముతారు. మిమ్మల్ని, మీ సంతానాన్ని, మీ సేవకులను ఏదో ఒకనాడు అతడు నాశనం చేస్తాడు.
విషం ఎక్కిస్తున్నారు. రాజు బలహీనుడై, దుష్టులను నమ్మితే, రాజుకూ, రాజ కుటుంబానికీ, అతని సేవకులకే కాదు, రాజ్యానికీ ప్రమాదమే. ప్రజలకు ఇక్కట్లు తప్పవు.
శృత్వేత్యవోచన్మత్పుత్రః సత్యం మదనుజాప్రియః।
కిం తు వీమి యేనాయం రక్ష్యతే కుటిలాశయః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 65)
ఉగ్రే మదగ్రజస్తీక్ష్ణో మత్పదాక్రాంతిసూద్యతః।
అనేన క్రష్టుమిచ్ఛామి కంటాకేనేవ కంటాకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 66)
కార్యాపేక్షావశాదేతం రక్షామి న తు గౌరవామ్।
శృత్వేతి ద్విత్రాన్ మహతో వ్యధాజ్జ్ఞాతచికీర్షితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 67)
అతని మాటలు విన్న తరువాత రాజు ఇలా అన్నాడు- నా తమ్ముడికి నా కొడుకంటే ఇష్టం లేదని నాకు తెలుసు. అయినా నేను ఎందుకని అతడికి రక్షణనిస్తున్నానో చెప్తాను. నా సోదరుడికి త్వరగా కోపం వస్తుంది. నా పెద్దన్న నా రాజ్యాధికారాన్ని కబళించాలని పథకాలు వేస్తున్నాడు. కుట్రలు చేస్తున్నాడు. నా తమ్ముడిని అన్నను అదుపులో పెట్టేందుకు వాడుకుంటాను. అందుకే అతడికి రక్షణనిచ్చి భరిస్తున్నాను. అతడిపై ప్రేమతో కాదు.
ఈ విషయాన్ని ఆ క్షురకుడు కొందరికి రాజు ఆలోచనల గురించి చెప్పాడు.
అత్రాంతరేగ్రజో రాజ్ఞో మద్రదేశాద్ బలాన్వితః।
భ్రాతృరాజ్యజిహీర్షాయైః పర్ణోత్సం ప్రాప దర్పితః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 68)
ఇంతలో రాజు పెద్దన్నయ్య కశ్మీర రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మాద్ర రాజ్యం నుంచి సేనతో పర్ణోత్స వద్దకు వచ్చి చేరాడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
