[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
తత్ శ్రుత్వా నృపతిః కృద్ధస్తాన్ సమానీయ పైతృకాన్।
అవోచత్ కిం ను కర్తవ్యం తే తమిత్యూచురుత్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 69)
పెద్దన్నయ్య సైన్యంతో పర్ణోత్స వద్దకు చేరుకున్నాడన్న వార్త విన్న రాజు కృద్ధుడై పెద్దలను పిలిచాడు. “ఇప్పుడేం చేయమంటారు” అని ప్రశ్నించాడు.
ఇక్కడ ‘పైత్రుకాన్’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. ఈ పదాన్ని తన తండ్రికి ప్రియులైనవాళ్ళు అనుకోవచ్చు. తండ్రికి సంబంధించినవాళ్ళు అనుకోవచ్చు. కులంలో పెద్దలుగా కూడా భావించవచ్చు. సాధారణంగా రాజులు పెద్దల నుంచి, సన్నిహితుల నుంచి, నమ్మకస్తుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు. ఇక్కడ, సుల్తాన్ కూడా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పెద్దలను పిలిచి వారి సలహా తీసుకున్నాడు.
తరికాసేతుబంధం తం ఛేత్తుం యామోస్య తిష్ఠుతః।
అన్యథా దుఃసహః ప్రాప్తస్తదాజ్ఞా దీయతాం విభో॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 70)
“మీరు ఆజ్ఞ ఇస్తే మేము నదిపై ఉన్న వంతెనను నాశనం చేస్తాం. లేకపోతే, మీ అన్న ఇక్కడికి కనుక చేరుకుంటే సర్వనాశనం చేస్తాడు”, అన్నారు.
శృత్వేతు కాతరం వాక్యం తేషాం దుర్లక్ష్యచేష్టితాం।
తత్పక్ష్యపాతినో జ్ఞాత్వా తథేతి ప్రత్యపద్యత॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 71)
వాళ్ళ ఆ సలహాను పక్షపాతపూరితమయినదిగా అపార్థం చేసుకున్నాడు రాజు. “సరే అలాగే కానీయండి” అన్నాడు.
ప్రతిముచ్య నృపస్తాన్ స రాత్రావిత్యబ్రవీన్నిజాన్।
ఆనీయ ఫిర్యడారాదీన్ మంత్రిణః కార్యనిష్ఠురాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 72)
రాజు వారిని వదిలి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఫిర్యాడామర్‌ను ఇతర మంత్రులను పిలిచాడు. వాళ్ళతో ఇలా అన్నాడు.
ఫిర్యాడామర్ అన్నది హిందూ నామం. డామరుల గురించి కల్హణుడు, జోనరాజులు ప్రస్తావించారు. వీరినే ఇప్పుడు ధర్, డార్, దార్ అన్న పేర్లతో పిలుస్తున్నరు. ఇస్లామ్ స్వీకరించిన తరువాత కూడా పేర్ల చివర డార్, ధర్, దార్ ఉంటుంది. హిందువులలో వీరు శివ భక్తులు. వీరిలో యోగ డామరులు, శివ డామరులు, దుర్గా డామరులు, సారస్వత డామరులు, బ్రహ్మ డామరులు, గంధర్వ డామరులు అని పలురకాల డామరులున్నారు. డామరులు అంటే ఆడంబరులు అని అర్థం. క్షేత్రపాలురు అన్నది మరో అర్థం.
ఇయం హస్సనకోశేశచక్రికా యత్ సమాగతః।
ఏతధ్వధేన నష్టః స్యాదన్యథాభ్యంతరం విషేత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 73)
రాజు పిలిచిన మంత్రులు, ఇదంతా కోశాధికారి హస్సన్న చేసిన ద్రోహమని చెప్పారు. హస్సన్నను చంపితే, పెద్దన్న సైన్యంతో వెనక్కివెళ్ళిపోతాడనీ, లేకపోతే, హస్సన్న సహాయంతో నగరంలోకి చొరబడతాడనీ చెప్పారు.
ఇది సర్వసాధారణంగా జరిగేదే. ఏదైనా ప్రమాదం సమయంలో, ప్రమాద నివారణ గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాల్సినవారు, ప్రమాద నివారణ వదిలి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటంవైపు దృష్టి పెడతారు. అందువల్ల, వారి వ్యక్తిగత కక్షలు తీరతాయి కానీ, ప్రమాదం తప్పిపోదు. ఇది ఆనాడేకాదు, ఈనాడూ జరుగుతున్న కథే.
తత్ప్రాతరేతే హంతవ్యా యుత్తయానీయేతి తాన్నృపః।
ఛన్నకోపః సేవకాన్ స్వానకరోత్ కృతసంవిదః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 74)
ఉదయం ఏదో ఒక కారణంతో హస్సన్నను పిలిపించి చంపించాలని రాజు నిర్ణయించాడు. తన కోపాన్ని పైకి కనబడనీయకుండా రాజు సేవకులకు ఆజ్ఞనిచ్చాడు.
రాజ్ఞా ప్రాతః సమాహ్వాయ విసృష్టానుచరా గృహాత్।
సర్వే హస్సనకోశేషుముఖ్యాస్తూర్ణం సమాయయుః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 75)
ఉదయమే రాజు వారిని తీసుకుని వచ్చేందుకు సేవకులను పంపించాడు. రాజు ఆజ్ఞ విన్న కోశాధికారి హస్సన్న, ఇతరులు ఇల్లు వదలి బయలుదేరారు.
కంపతే తురగస్త్రస్తో జ్ఞాతవృత్ ఇవాచలః।
తాడనైర్వహుశః సాస్తృః ప్రాప కష్టాన్నృపాంగనం॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 76)
జరగబోయే ఘోరం గ్రహించినట్టు అశ్వం కంపిస్తూ, కదలకుండా వుండిపోయింది. దానిని ఎంతో కొట్టిన తరువాత అయిష్టంగా కదిలింది. రాజప్రాంగణం చేరింది.
మహార్హాస్తరణస్థాంస్తాన్ రాజకర్తవ్యతాకులాన్।
కోశేశహస్సనమేరకాకాదీన్ పంచశాన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 77)
రాజకార్యం తెలుసుకోవటం కోసం హస్సన, మేరకాక్ వంటివారు రాజాస్థానం చేరారు. వారితో రాజు ఇలా అన్నాడు.
‘కాక్’ అన్నది కశ్మీరీ బ్రాహ్మణుల పేరు. వీరు కశ్మీరీ సారస్వత బ్రాహ్మణులు. ముసల్మానులుగా మారిన తరువాత కూడా వీరు తమ పేర్ల చివరన ‘కాక్’ ను ఉంచుకున్నారు. ముసల్మానులయిన తరువాత కూడా వీరు తమ పదవిని వదలకుండా వుండేందుకు కూడా ‘కాక్’ అన్న పేరును వదలలేదు. అందుకే ‘మీర్ కాక్’ అన్న పేరు ప్రస్తావించాడు శ్రీవరుడు. మీర్ కాక్ ముసల్మానుగా మారిన తరువాత అతని ప్రోద్బలంతో అతని అనుచరులు, బంధువులు కూడా ఇస్లామ్ స్వీకరించారు.
చరిత్రలో ఇది ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. ఇస్లామ్ రాజ్యాలలో ఇస్లామేతరులపై రకరకాల పన్నులు విధించటంద్వారా, ఇస్లామీయులకు పెద్దపీట వేసి, ఇస్లామేతరుల వైపు న్యాయం ఉన్నా, ఇస్లామీయులనే సమర్థించటం ద్వారా, ఇస్లామేతరుల ఆత్మగౌరవాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తారు. దాంతో జీవించటం కోసం కుటుంబంలో ఒక్కరు మతం మారతారు. ఇతరులు తమ ధర్మాన్నే అనుసరిస్తారు. కానీ, కొన్నాళ్ళకు ఇతరులు కూడా స్వధర్మం వదలి ఇస్లాం స్వీకరిస్తారు. ఈరకంగా మొత్తం కుటుంబాలు, వంశాలు మతం మారిపోయాయి.
భృత్యైః సంజ్యరమేరాద్యౌరాజ్ఞప్తైర్మండపాంతరే।
ఛలాద్విశ్వాసముత్పాద్య రాజధాన్యంతరేవధీత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 78)
రాజాజ్ఞననుసరించి జంసారా, ఇతర అనుచరులు వారి విశ్వాసం చూరగొన్నారు, తమ అస్లలు ఉద్దేశ్యాన్ని దాచి, ఆ తరువాత వారిని వధించారు.
జంసర్ అన్నది జంశేర్ అనే ముస్లిం పేరు.
కిం ద్రోహ ఇతి యావత్ స కోశేశోభ్యుత్థితోబ్రవీత్।
ద్రుఘణైకప్రహారేణ తావత్ ప్రాణైర్వ్యయుజ్యత॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 79)
క్రిందపడి లేచి ‘ఇదేమి ద్రోహం’ అని అనేలోగా పడిన గొడ్డలి వేటుతో ప్రాణాలు విడిచాడు కోశాధికారి.
శాస్త్రాఘాతైర్ముమూర్శ్ సన్నుత్థితో మేరకాకకః।
రాజ్ఞ ఎవాశిష్ కుర్వన్ పునః పరశునా హతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 80)
ఆయుధాఘాతం తగిలి కొనఊపిరితో మేరకాక్ అతిప్రయాసతో లేచి రాజును ఆశీర్వదించాడు. మళ్ళీ తగిలిన గొడ్డలి దెబ్బకు ప్రాణాలు విడిచాడు.
లిఖన్నహ్మదమేరాఖ్యః స విద్యావ్యసనీ గుణీ।
హతో జనమనఃకాంతో యయౌ కస్య న శోచ్యతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 81)
విద్యపట్ల ఆసక్తి కలవాడు, పండితుడు, ప్రజలకు ఆనందాన్నిచ్చి వారి అభిమానం పొందినవాడు, రచయిత అయిన అహ్మద్ మేరను రచన చేస్తున్న సమయంలోనే చంపేశారు. అతని మరణానికి ప్రజలంతా దుఃఖించారు.
శ్రీవరుడి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒకపక్క, జైనులాబిదీన్‌కు సన్నిహితులందరినీ, స్నేహితులందరినీ, సమర్థకులందరినీ ఏరి ఏరి చంపుతున్నారు. శ్రీవరుడు వాటన్నిటినీ తన రచనలో పొందుపరుస్తూ తన వంతెప్పుడో అని ఎదురుచూస్తున్నట్టున్నాడు, ఈ కాలం నాటి యుద్ధభూమి నుండి ప్రత్యక్షప్రసారం చేసే జర్నలిస్టుల్లాగా (embedded journalist).
జీవతాం మనసా చైక్యం తేషాం నిత్యమభూద్యథా।
శస్త్రకృత్తతనూద్రచ్ఛఛ్చోణితైక్యమభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 82)
జీవంతో ఉన్నప్పుడు వీరంతా ఐక్యంగా వున్నారు. మరణంలో కూడా వాళ్ళ రక్తాలన్నీ ఒకటిగా కలసిపోయాయి.
శ్రీవరుడి మనస్సు ఇక్కడ తెలుస్తుంది. నిజానికి జరుగుతున్నది వివరిస్తూ పోవచ్చు. లేదా వర్ణించవచ్చు. కానీ, జీవనంలోనే కాదు, మరణంలోనూ వారొక్కటే అని చెప్పటంలో వారి పట్ల శ్రీవరుడి సానుభూతి, సహానుభూతులు తెలుస్తాయి.
వీరంతా జైనులాబిదీన్ పట్ల విధేయత విషయంలో ఒక్కటయ్యారు. ఇప్పుడు వారి మరణానికి కారణం కూడా, జైనులాబిదీన్ పట్ల వారి విధేయత వల్ల కలిగిన అనుమానం. జైనులాబిదీన్ పట్ల వీరి విధేయత తెలిసినవారు, వీరు మరొక రాజు పట్ల విధేయత ప్రదర్శించగలరని నమ్మలేరు. అందుకని, వీరి గురించి ఎవరేమి చెప్పినా నమ్ముతారు. కానీ, వీరంతా జైనులాబిదీన్ పట్ల విధేయులు కాబట్టి అతడి మీది గౌరవంతో అతని సంతానాన్నీ అభిమానిస్తారు. కానీ, సంతానానికేమో అనుమానాలు. చుట్టూ ఉన్నవారు అనుమానాగ్నికి ఆజ్యం పోస్తారు. ఎందుకంటే, ఈ అనుభవజ్ఞులముందు వారి ఆటలు సాగవు కాబట్టి. ఈ అధికార పోరు ఫలితంగా సమర్థులు నశిస్తారు. కుట్రలు, కుతంత్రాలు చేసే అసమర్థులకు అధికార పగ్గాలు అందుతాయి. ప్రజలు ఇబ్బందులు పడతారు. దేశం దెబ్బతింటుంది.
వర్ణకంబలపృష్ఠస్థా జీవంతస్తే యథాభవన్।
నిద్రాణా ఇవ తే తత్ర మృతా అపి తథేక్షితాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 83)
జీవించినప్పుడు ఎలా వారు రంగుల కంబళ్ళపై కూర్చుని కనిపించేవారో, మరణించిన తరువాత కూడా వారు రంగుల కంబళ్ళపై శయనించినట్టు కనిపిస్తున్నారు.
చరిత్ర పుస్తకాలలో భారతదేశంలో కార్పెట్ల తయారీ పదహారవ శతాబ్దంలో ఆరంభమయిందని ఉంటుంది. కానీ, సింధు నాగరికతనుంచీ కార్పెట్లు మన దేశంలో వాడకంలో వుండేవనేందుకు ఆధారాలున్నాయి.
కశ్మీరులో జైనులాబిదీన్ కాలంలో, మతం మారిన వారు తిరిగి పాత వృత్తులలోకి పోలేక, కొత్త వృత్తి నేర్చుకోలేక జీవిక కోసం ఇబ్బందులు పడుతూండేవారు. ఇది గమనించిన జైనులాబిదీన్ పెర్షియా నుంచి కళాకారులను రప్పించి, అనేక వృత్తులలో స్థానికులకు శిక్షణనిప్పించి ప్రత్యామ్నాయ వృత్తులను ఏర్పాటుచేశాడు. కార్పెట్ తయారీ అలా కశ్మీరులో ప్రవేశించింది. వ్రేళ్ళూనుకుంది. అంతకు ముందు తయారయ్యే కార్పెట్లకు భిన్నంగా లతలు, అల్లికలతో కార్పెట్లు తయారు చేసేవారు. ఈనాటికీ ఇతరులు తయారుచేసే కార్పెట్లకు భిన్నంగా వుంటాయి కశ్మీరీ కార్పెట్లు. చరిత్ర పుస్తకాలు ముఘలులు కార్పెట్ల తయారీకి కారణం అని చెప్తాయి. కానీ, ఆ ముఘలులు కశ్మీరుపై ఆధిక్యం సాధించిన తరువాతనే కార్పెట్ల తయారీలో అభివృద్ధి సాధించారన్న నిజాన్ని విస్మరిస్తాయి.
శ్రీవరుడి ఈ శ్లోకం వల్ల మరొక విషయం తెలుస్తుంది.
కశ్మీరులో గతంలో రాజు సింహాసనంపైన కూర్చునేవాడు. మంత్రులకు ఆసనాలుండేవి. కానీ, ఇప్పుడు కార్పెట్లపైన కూర్చుని సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. గతంలో కార్పెట్ పై కూర్చుని వుండేవారు ఇప్పుడు శయనించారు అంటున్నాడు శ్రీవరుడు. అంటే, క్రింద కూర్చుని చర్చించుకునేవారన్న మాట. ఇది ఇస్లామ్ సాంప్రదాయం. వారు మధ్యలో తిండి పదార్ధాలు వుంచుకుని, దాని చుట్టూ కూర్చుని ఒకరొకరూ తీసుకుంటూ, తింటూ మాట్లాడుకుంటారు. దాన్ని ప్రస్తావిస్తున్నాడు శ్రీవరుడు.
క్షణమాత్రాత్ తథా శస్త్రైర్మరణం రాజవేశ్మని।
అనన్యసులభం తత్ర తేషాం శ్లాఘార్హతామగాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 84)
క్షణ కాలంలో, ఇతరులెవరికీ సాధ్యం కాని సులభ మరణం వారికి లభించింది. వారు ఖ్యాతిమంతులయ్యారు.
భారతీయ ధర్మంలో సులభమరణం పుణ్యాత్ములకు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ అనాయాస మరణం వాంఛిస్తారు. కానీ, అది లభించేది కొందరికే. ఇక్కడ, మరణం పొందుతున్నవారంతా అనాయాస మరణం పొందుతున్నారు. ఒక్క గొడ్డలి దెబ్బకు క్షణకాలంలో ప్రాణాలు విడిచేస్తున్నారు. ఇలాంటి మరణం దొరకాలంటే ఎంతో పుణ్యం కావాలంటున్నాడు శ్రీవరుడు.
న విత్తం న చ దారాస్తే న భృత్యా న శవాజిరమ్।
తేషాం తథా ప్రమీతానాం యయావంతోపకారితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 85)
ఇలా అనేకులు మరణించారు. ఆ మరణించిన వారికి, ఐశ్వర్యం, కళత్రం, సేవకగణం, చివరికి సమాధులు కూడా ఎందుకూ ఉపయోగపడలేదు.
నిజపరిభవభీత్యా బంధవో యాంతి దూరం
త్యజతి చ నిజపత్నీ కా కథా సేవకానామ్।
ప్రతిదినంఋణాహేతోస్తాడనం బంధనం వా
భవతి హి యమభంగాద్ రాజభంగోతికష్టః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 86)
డబ్బు చెల్లించనందుకు దూషణలు, దెబ్బలు భరించాల్సివస్తున్నది. కారాగారవాసం చేయాల్సివస్తున్నది. అప్పులు చెల్లించలేని వారి మిత్రులు కూడా ఎక్కడ ఆ అప్పు తమకు చుట్టుకుంటుందో అని దూరం అవుతున్నారు. అలాంటి సందర్భాల్లో భార్య కూడా వదలిపోతున్నది. ఇక సేవకుల సంగతి చెప్పనవసరంలేదు. ఇలా ఋణం కోసం అవమానాలు భరిస్తున్నారు ప్రజలు. వారికి యమ దండన కన్నా రాజ దండన భయంగొల్పుతున్నది.
ఇక్కడ శ్రీవరుడు ప్రజలు అని చెప్తున్నాడు. కానీ, ఈ దండన అధిక శాతం ఇస్లామేతరులకే అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఇస్లాంలో బాకీ తీర్చకపోవటమన్నది ఘోరమైన నేరం. బాకీ తీర్చనివాడికి స్వర్గంలో ప్రవేశం లభించదు. కట్టాల్సిన బాకీ వెనక్కి లాగుతూంటుంది. కాబట్టి అప్పు తీర్చటం తప్పని సరి. అందుకని అప్పు చెల్లించి తీరాల్సిందే. ఒకవేళ అప్పుకట్టాల్సింది ఇస్లామేతరుడయితే కఠినమైన శిక్ష విధించేవారు. సుల్తానుల పాలనలో అప్పుకట్టకపోవటం, పన్నులు చెల్లించకపోవటం మతమార్పిడికి తిరుగులేని ఆయుధం. పన్నులు కట్టలేకపోవటాన్ని కూడా అప్పు చెల్లించలేకపోవటంలాగా భావించి శిక్షించేవారు.
ఔరంగజేబ్ కాలంలో పన్నుల వసూలు ఒక కక్ష సాధింపు చర్యగా సాగేది. అప్పు చెల్లించలేనివాడిని అవమానించి, హింసించి చంపేవారు. అతడి కుటుంబాన్ని జైలుపాలు చేసేవారు. ఎవరికి అప్పుచెల్లించలేదో అతడికి బానిసలుగా అప్పు చెల్లించలేని కుటుంబంలో ఆడవారిని పంపేవారు. ఒకవేళ ఆ కుటుంబం ఇస్లామ్ మతం స్వీకరిస్తే, వారికి స్వేచ్చనివ్వటమే కాదు, ధనం కూడా ఇచ్చేవారు. దానితో అనేకులు ఈ అవమానాలు, శిక్షలు తప్పించుకునేందుకు ఇస్లామ్ స్వీకరించేవారు.
శ్రీవరుడు తన శ్లోకంలో స్నేహితులు దూరమవుతారు, భార్య దూరమవుతుంది, సేవకులు దూరమవుతారు అని చెప్పటం వెనుక ఉన్న అర్థం ఇది. అతడికి దూరం కాకపోతే, స్నేహితులు డబ్బు చెల్లించాల్సివుంటుంది. లేకపోతే, జైలు పాలు, బానిసత్వం తప్పదు.
అంటే, ఔరంగజేబ్ అయినా, సుల్తాన్ హైదర్ శాహ అయినా ఒకటే పద్ధతి. ఇలా శిక్షించటం ఇస్లామ్ ఆధిక్యాన్ని నిరూపించటంతో పాటూ, ఇస్లామేతరులను అవమానపరచి వారిలో న్యూనతాభావాన్ని కలిగించటం కోసం. అందుకని, డబ్బు వసూలును, చెల్లించలేనివారిని శిక్షించటాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించేవారు సుల్తాన్‌లు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
