[బాలబాలికల కోసం ‘శునకం చేసిన మేలు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
కిరణ్ కి కుక్కలు, పిల్లులు వంటి జంతువులు అస్సలు ఇష్టంలేదు!
ఒకరోజు కిరణ్ పార్క్ కి వెళ్ళాడు. పూలచెట్లు దూరంగా బెంచీల మీద కూర్చున్న మనుషుల్ని చూస్తూ తాను తెచ్చుకున్న బిస్కెట్లు తింటుండగా ఓ కుక్క అమాయక మొహంతో కిరణ్ ని చూస్తూ తోక ఆడించడం మొదలు పెట్టింది.
జంతువులంటే ఇష్టం లేక పోయినా ఆ కుక్క అమాయక మొహం చూసే సరికి కిరణ్ కి జాలేసింది.
వెంటనే ఓ రెండు బిస్కెట్లు తీసి దాని ముందు వేసాడు. అది ఆవురావురుమని తిని కిరణ్ ని చూసి కృతజ్ఞతతో తోక ఊపింది. ఆ దృశ్యం చూసిన కిరణ్ లో ఏదో కదలిక వచ్చింది! దానికి మరి కొన్ని బిస్కెట్లు వేసాడు.అది సంతోషంతో తిని తోక ఊపింది..
అలా కొంచెం సేపు కూర్చున్నాక కిరణ్ మెల్లగా లేచి ఇంటికి పోవడానికి పార్కు గేటు వద్దకు వచ్చాడు. ఆ గేటు వద్ద ఎవ్వరూ లేరు! ఉన్నట్టుండి కిరణ్ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి కత్తి చూపించి, “నీ దగ్గర డబ్బు, చేతి ఉంగరం, ఫోను ఇవ్వు” అని కర్కశంగా అన్నాడు.
కిరణ్ వెనకే వస్తున్న కుక్క దొంగ చేతిలో కత్తి, కిరణ్ మొహంలో భయాన్ని గమనించింది. దొంగ కిరణ్ కి ఏదో హాని తలబెట్ట బోతున్నాడని అది గ్రహించి వాడి మీదకు ఒక్క దూకు దూకింది! అంతే దొంగ భయపడి పోయి పరుగెత్తి పోయాడు. కుక్క చేసిన మేలుకు కిరణ్ ఆశ్చర్యపోయాడు.
‘కొన్ని బిస్కెట్లు వేస్తేనే ఈ కుక్క ఎంతో కృతజ్ఞత చూపి నన్ను ఆదుకుని దొంగను తరిమింది. దీని మనసు ఎంతో మంచిది’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కుక్క మెల్లగా అతని వెంట వచ్చింది. ఆ విధంగా కిరణ్ తో దానికి స్నేహబంధం ఏర్పడింది. కిరణ్ దానికి రోజూ పాలన్నం, బిస్కెట్లు పెట్టేవాడు. అది రాత్రుళ్ళు గుమ్మం దగ్గర పడుకుని ఎవరైనా వస్తే అరిచేది. కానీ వారిని కరిచేది కాదు!
ఒకరోజు కిరణ్ స్నేహితుడు గోపీ వచ్చాడు. కిరణ్ ఇంట్లో కుక్కను చూసి గోపీ ఆశ్చర్యపోయి, “ఏమిటి నీకు కుక్కలు, పిల్లులు ఇష్టం లేదు కదా! మరి కుక్కను నీవు పెంచడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు.
“అవునురా ఈ కుక్క నాకు చేసిన మేలు నేను మరచిపోలేను. అందుకే దానికి తిండి పెట్టి చూసుకుంటున్నాను” అని పార్కులో జరిగిన విషయాన్ని వివరించాడు కిరణ్.
“అందుకే కుక్కకున్న విశ్వాసం మనిషికుండదంటారు. దీన్ని తీసుకొచ్చి మంచి పని చేసావు. నీవు దానిని బాగా చూసుకో. అది మీ ఇంట్లో ఒకరిగా మారి నిన్ను ఇంటిని రక్షిస్తుంది.”
“అవునురా నీవు చెప్పింది నిజమే, దానికి ‘విశ్వా’ అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకోవలనుకుంటున్నాను” అన్నాడు కిరణ్.
కిరణ్ మాటలకు గోపి ఎంతో సంతోషించాడు.
