[శ్రీ కె. వి. శాస్త్రి గారు రచించిన ‘సిగ్నల్ దగ్గర ఒక జీవితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎర్రటి సిగ్నల్ వెలిగింది..
వాహనాలన్నీ ఆగిపోయాయి.
కానీ..
ఒక జీవితం మాత్రం ఆగలేదు.
వేగంగా దూసుకెళ్లే చక్రాల మధ్య,
మరణాన్ని ప్రతి అడుగులో తప్పించుకుంటూ,
భుజాన ప్లాస్టిక్ బొమ్మల ప్రపంచాన్ని,
చేతిలో పీచు మిఠాయి తీపిని మోస్తూ,
ఆ మనిషి పరుగెడుతున్నాడు..
ఆశను అమ్ముకునే మనుషులు కనిపిస్తారు.
అతను అమ్మేది బొమ్మలు కావు..
తన పిల్లల ఆకలిని.
అతను అందించేది పీచు మిఠాయి కాదు..
రేపటిపై మిగిలిన చిన్న ఆశ.
మనం అద్దాలు మూసుకుంటాం..
దుమ్ము లోపలికి రాకూడదని.
కానీ,
వాళ్లు గుండెను తెరిచి తిరుగుతారు..
ఆకలి ఇంట్లోకి రాకూడదని.
ఒక చిన్నారి నవ్వు కోసం
ఎన్ని ప్రమాదాలనో దాటుతాడు.
ఒక నాణెం కోసం
ఎన్ని అవమానాలనో మింగేస్తాడు.
ప్రతి సిగ్నల్ అతనికి
ఒక పరీక్ష.
ప్రతి పచ్చబత్తి
ఒక నిరాశ.
ఎందుకంటే..
వాహనాలు కదిలిపోతాయి,
కానీ అతని బతుకు
అదే కూడలిలో నిలిచిపోతుంది.
అతన్ని చూసిన ప్రతిసారి
నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది..
“బతకడం కోసం ఇంత పోరాటమా?
పోరాడటానికే ఈ బతుకా?
దేవుడా..
బతుకు అంటే ఇంత భారమా?
ఒక పూట అన్నం కోసం
ప్రాణాన్ని పందెంగా పెట్టాల్సిందేనా?
మనిషి బతుకుతున్నాడా..
లేక బతుకు మనిషిని నెమ్మదిగా
అమ్ముకుంటోందా?”
ఆ ట్రాఫిక్ శబ్దాల్లో
ఎవరికీ వినిపించని
ఒక నిశ్శబ్ద అరుపు ఉంది..
ట్రాఫిక్‌లో ఆగిపోయేది మన వాహనం మాత్రమే
వాళ్ల పోరాటం మాత్రం ఒక్క క్షణం కూడా ఆగదు.
అది హారన్ శబ్దం కాదు..
ఆకలి చేసే శబ్దం.
