Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సింధు గామిని

[డా. కొర్లగుంట సాయి ప్రసాద్ రచించిన ‘సింధు గామిని’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]


~
సీసపద్యమాలిక:
పెద్ద పులికయున పిల్ల జింకకయిన
మధురాంబువులిచ్చి మనగజేయు;
కర్మకాండైనను కార్తీకమైనను
స్థితప్రజ్ఞ, స్థిరచిత్త, చిద్విలాస
ఈత వచ్చిన వాళ్లు, ఈత రాని వాళ్లు
వలపక్షమే లేదు ఒక్క విధమే
ప్రవహించు ప్రతి చోట పల్లవించు గనుక
ప్రకృతి తోషించి పరవశించు;
ఏరు పారిన చోట ఊరు నిర్మితమయ్యె
ఊరు కబ్జా సేయ ఏరు పోయె;
అభిసారిణి రీతి అందాల పయస్విని
ఉరవళ్ల ఉరుకును ఉదధిచేర;
ఒక్కచో చంచల, ఒక కడ గంభీర
వరదలా ఒక్కెడ, వాగు ఒకచొ;
మంద్రగమనమైన ముందుకే నడకలు
లక్ష్యమొక్కటె ఇక లాతి లేదు;
అడ్డంకులెన్నైన అతిలాఘవమ్ముతో
అవలీలగా దాటి అధిగమించు;
పుట్టింట తనపేరు పుణ్య నదమయినా
మేరు సాగరమౌను మెట్టినింట;
సహనదులెన్నియో సవతులైన గాని
సాహసించె గలియ సాగరములొ

తేటగీతి:
కూలములనెల్ల ఉధృతిన్ కోసుకుంటు
కుసుమ సౌరభములను తా మోసుకుంటు,
గిరుల చుట్టూర గిరికీలు గింగిరీలు
ఎన్ని వంపులు, సొంపులు యెన్నలేము

సీసం:
నిస్తుల నిర్లిప్త, నిమ్నగ, నిర్ఝరి
స్థిర బుద్ది యోగిని సింధు గమని
ఉత్కర్షయైనది, ఉరికి విన్పించింది
విజయాభిలాషిణి విజయ ఘోష
ఉత్కృష్ట దృశ్యమ్ము ఉద్విగ్న ఘటనమ్ము
జీవాత్మ పరమాత్మ జేరు ఘడియ
కడలి కౌగిలి చేరి కైవల్యమందింది
ఆత్మ జేరె పరమాత్మ తోడ

తేటగీతి:
నదులు జలభార గరిమతో తేజరిలుతు
అవని హలధారు లెల్లెరన్ హ్లాదపరచు,
ఔర! ఏమి నిస్స్వార్థమ్ము! ఎంత ఓర్మి!
మౌన గురువులు నదములు మానవులకు

Exit mobile version