Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేక్షకులను నిరాశపరచని ‘సింగ్ గీతం’

[సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ‘సింగ్ గీతం’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

‘సింగ్ గీతం’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతూ ఉంది. ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫ్లాంలో విడుదల అవలేదు.

వృక్షో రక్షతి రక్షితః. ఇది నేటి తరం తెలుసుకోవాల్సినటువంటి ఒక చక్కటి సందేశం.

‘వృక్షో రక్షతి రక్షితః’ అని ఒకే ఒక వాక్యంలో వ్రాసేసి చేతులు దులిపేసుకోవచ్చు. కానీ అది మన మెదడులోకి బలంగా చొచ్చుకుపోదు. అదేదో ఒక వాక్యంలాగా చదివి వదిలేస్తాము. అలా కాకుండా బలమైన మాధ్యమమైన చలన చిత్రం ద్వారా ఆకట్టుకొనేలాగా చెప్పామనుకోండి దాని ప్రభావం మన మీద ఉంటుంది. చిన్ని కొమ్మని తుంచాలంటే కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాము. అది ఈ మాధ్యమం యొక్క ప్రభావం.

అలాగని ఏదో నీతి వాక్యం చెప్పినట్టో ఏదో డాక్యుమెంటరీ తీసినట్టో తీయలేదు ఈ చిత్రాన్ని. దీన్ని ఒక చక్కటి దృశ్యకావ్యంలాగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన సినిమానే సింగ్ గీతం.

మనందరికీ తెలుసు, ప్రస్తుతం జీవించి ఉన్న దర్శకులు అందరిలో సింగీతం శ్రీనివాసరావు గారు సీనియర్. కాకపోతే ఆయన నిత్యయవ్వనుడు. నిత్యబాలుడని కూడా చెప్పవచ్చు. ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు. ఈ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన చక్కగా జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీ-షర్ట్ వేసుకొని కనిపిస్తారు. ఆయన అభిరుచులు కూడా ఉత్సాహంగా ఉంటాయి.

మొదటినుంచీ కూడా సింగీతం శ్రీనివాసరావుగారిది ఒక విభిన్నమైన శైలి. అందరూ నడిచే బాటలో సాధారణమైన సినిమా తీయటం ఆయన పద్ధతి కాదు. కుటుంబకథా చిత్రం తీసినా, లేదా ఒక సైన్స్ ఫిక్షన్ తీసినా, లేదా మరేదైనా తీసినా ఆయనదైన బలమైన ముద్ర ఉంటుంది. ఆ ముద్రను కాపాడుకుంటూనే ఆయన ఈ సింగ్ గీతం సినిమాకు కూడా దర్శకత్వం వహించడం జరిగింది.

మాయాబజార్ సినిమా నిర్మాణంలో పాల్గొన్న సాంకేతిక నిపుణుల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్న అతితక్కువ మందిలో ఇప్పటికీ ఉత్సాహంగా పని చేసుకుపోతున్న వారిలో ఒకరు దర్శకుడు సింగీతం గారు.

ఆయన ఇదివరకటి సినిమాలను మనం పరికించి చూస్తే, అపూర్వ సోదరులు సినిమాలో కమలహాసన్ చేత మరుగుజ్జు పాత్రను ఆయన ఎవరు తీయలేనటువంటి విధంగా తీసి అందరినీ విస్మయపరిచారు. మయూరిలో ఆయన చేసిన ప్రయత్నం మరొక ఎత్తు. భైరవద్వీపంలో చేసిన ప్రయత్నం ఇంకొక ఎత్తు. సో ఆయన ప్రయోగాలకు మారుపేరు. అమావాస్య చంద్రుడు , పుష్పక విమానం, ఆదిత్య 369, మైకేల్ మదనకామ రాజ్, వెల్కం ఒబామా, ఘటోత్కచ్ (ఆనిమేషన్ మూవీ) ఇలాగా ఏ సినిమా తీసుకున్నా ఆయన ఏదో ఒక విభిన్నమైన ప్రయత్నం చేస్తారు.

కమలహాసన్‌తో ఆయన జోడి గట్టారంటే ప్రేక్షకులకు కన్నుల పండుగే. అమావాస్య చంద్రుడులో కమలహాసన్ గుడ్డివాడు. కానీ ఆ పాత్ర ప్రపంచాన్ని ఎట్లా చూస్తుందో అనేది ప్రేక్షకులకు ఆయన చూపించిన విధానం అద్భుతం.

ప్రస్తుతం సింగ్ గీతం సినిమా విషయానికి వస్తే, మొదట స్థూలంగా కథ చెప్పుకుందాం. ఇది ఒక సోషియో ఫాంటసీ అని చెప్పొచ్చు. ఈ కథలో మాయలు, శాపాలు, దేవతల అనుగ్రహాలు, దేవతల ఆగ్రహాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఒక బలమైన సందేశం ఉంటుంది.

ఇందులో ఒక అమాయకమైన పల్లెటూరి అమ్మాయి, ఒక చెట్టునే తన తల్లిగా భావించి ప్రేమిస్తూ ఉంటుంది. మానవుల స్వార్థం కారణంగా ఆ గ్రామంలో యావత్తూ అటవీ సంపద నశించిపోయి ఉంటుంది. ఆ ఊరి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేరా ఎడారికన్నా అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఒకే ఒక పెద్ద వృక్షం మిగిలి ఉంటుంది. ఆ వృక్షాన్నే తన తల్లిగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది ఆ అమాయకమైన పల్లెటూరి అమ్మాయి.

కానీ ఆ చెట్టును సైతం బంగారు గనుల కోసం కొంతమంది స్వార్థపరులు కొట్టేస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఆ గ్రామానికి తగిలిన శాపం ఏంటి? దానివల్ల ఏర్పడిన విపరీతాలు ఏంటి? ఆ గ్రామం దాని నుంచి ఎలా బయటపడింది? ఆ తర్వాత ఈ సంఘటన నుంచి ఆ గ్రామం నేర్చుకున్న పాఠం ఏంటి? ఆ పాఠం మన ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

ఈ అంశాలన్నీ మనం తెరమీదే చూసి తెలుసుకోవాల్సిందే.

ఇవన్నీ ఒక ఎత్తైతే, సినిమాలో పాత్రలు ముప్పాతిక భాగం సంభాషణలను మాట్లాడే రూపంలో కాకుండా పాటల రూపంలో వ్యక్తం చేస్తుంటాయి. ఇది ఒక విధమైన వైవిధ్యమైన ప్రయోగం. ఇలాంటి ప్రయోగం చేయాలనే భావన ఆయనకు నలభై ఏళ్ల క్రితమే కలిగింది. కమలహాసన్‌తో చర్చించారు.

ఆయన మెదడులో పురుడుపోసుకున్న ఆలోచనలే, అనేకానేక ప్రయోగాత్మకచిత్రాలుగా తెరకెక్కాయి, కానీ ఈ చిత్రం మాత్రం గత నలభై ఏళ్ళుగా ఆయన మెదడు పొత్తిళ్ళలోనే ఉండిపోయింది. ఇటీవల కమల్‌హాసన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. దాదాపు ఒకటే సారి ఈ చిత్రానికి, పుష్పకవిమానానికి కథా చర్చలు చేసుకున్నారట కమల్‌హాసన్, సింగీతం గారు. పుష్పక విమానానికి మొదట అనుకున్న పేరు ‘అద్వైతం’ అట.

మాటలు కాకుండా పాత్రలన్నీ పాటల ద్వారానే తమ భావాలు వెల్లడి చేసుకుంటూ ఉండాలి అనే ప్రయోగాత్మక ఆలోచనతో కూడిన చిత్రం తెరకెక్కనేలేదు. ఈ ప్రయోగం అలాగే ఉండిపోయింది

‘కల్కి’ సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్, అనేక సాంకేతిక అంశాల విషయంలో సింగీతం శ్రీనివాసరావుగారి సలహాలు స్వీకరించారట. ఆయన యథావిధిగా ఉత్సాహంతో, ఒక నవయువకుడు ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో అంత ఉత్సాహంగా కల్కి సినిమా సమయంలో సలహాలు ఇస్తూ సహాయం చేశారట. ఆ కృతజ్ఞతాభావంతో నాగ్ అశ్విన్ తనే నిర్మాతగా మారి నిర్మించిన సినిమా ఈ సింగ్ గీతం.

ఈ సినిమాకు ప్రధాన ఆయువు పట్టు సంగీతం. సింగీతం శ్రీనివాసరావుగారు ఒకే మాట చెప్పారు. “దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఈ సినిమాకు వేరే ఎవరినైనా సంగీత దర్శకుడిగా ఊహించడం కష్టం” అని. ఆయన యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ దేవిశ్రీ ప్రసాద్ చాలా బాధ్యతగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఈ సంభాషణలన్నీ కూడా పాటల రూపంలోనే ఉండటం కొత్త ప్రయోగమని నేను మొదట చదివినప్పుడు, ‘అబ్బా! బోర్‌గా ఉంటుందేమో ఈ సినిమా. ఇదేం పిచ్చిపని – ప్రయోగాల పేరిట మన సహనాన్ని పరీక్షిస్తున్నారేమో’ అని అనుకున్నాను. కానీ ఎక్కడా కూడా ఆ ఇబ్బంది తలెత్తలేదు మనకి ఈ సినిమాని చూస్తున్నంతసేపు. ఆ ప్రయోగం కథలో కలిసిపోయింది. దాన్ని కూడా కథకు అనుగుణంగా ఇమిడించగలిగారు. అది ఏదో ప్రయోగం చేస్తున్నామన్నట్టుగా కాకుండా, ఎందుకు వాళ్లు పాటలు పాడాల్సి వస్తుంది అనేది కూడా కథలో భాగంగానే చక్కగా ఇమడ్చగలిగారు.

ఆ విధంగా చూసినప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడనే చెప్పాలి.

ఇక ఫోటోగ్రఫీ, ఇతర సాంకేతిక అంశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నూతన నటీనటులు హీరో హీరోయిన్లుగా నటించారు. వాళ్లు కూడా తమ పాత్రల పరిమితి మేరకు చక్కగా నటించారు. సీనియర్ నటి తులసి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఆమె కూడా తన పాత్రను చాలా చక్కగా పోషించింది.

అన్ని విషయాల్లో కూడా ఓపెన్ మైండ్‌తో వెళ్లి కూర్చున్న ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశపరచదు. సింగీతం శ్రీనివాసరావుగారి ఇదివరకటి సినిమాల స్థాయిలోనే ఇది కూడా ఉంది.

అందరూ కూడా ఒకసారి వెళ్లి చూసి రావచ్చు. కాకపోతే కమర్షియల్‌గా ఈ సినిమా అంత హిట్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. మాకు మాత్రం నిన్న థియేటర్ మొత్తం నిండిపోయి ఉంది. చాలా మంది పిల్లలను కూడా తీసుకొచ్చారు. యాక్చువల్‌గా ఈ సినిమా చూడాల్సింది ముందు తరాల పౌరులే. అంటే చెట్లను పెంచాలి, చెట్లు లేకుంటే భూమి ఎలా నాశనం అయిపోతుంది అనేటువంటి సందేశాన్ని పిల్లలు తెలుసుకుంటే, వాళ్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా తీసుకున్నా కూడా దర్శకుడి గోల్ అఛీవ్ అయిందనే చెప్పచ్చు.

చిన్న పిల్లలతో సినిమా థియేటర్ కళకళలాడుతూ ఉంటే భలే ఉత్సాహంగా అనిపించింది.

తొంభై నాలుగవ ఏట సినిమా దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా భారతీయ దర్శకుల్లో ఒక అరుదైన రికార్డు సృష్టించారు సింగీతం శ్రీనివాసరావుగారు.

ప్రస్తుతం చురుగ్గా సినిమాలు తీస్తూ జీవించి ఉన్న దర్శకులలో వయోధికుడిగా సింగీతం శ్రీనివాసరావ్ గారి పేరు మీద రికార్డులు తిరగవ్రాయబడ్డాయి.

‘అత్యంత వృద్ధ వయస్కుడై’న చలనచిత్ర దర్శకుడిగా అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోర్చుగీస్ ఫిల్మ్‌మేకర్ మనోయెల్ డి ఒలివేరా పేరిట ఉంది. ఆయన 2007లో ‘క్రిస్టోవావ్ కొలంబో – ఓ ఎనిగ్మా’ అనే సినిమాను దర్శకత్వం వహించి విడుదల చేశారు.

సింగీతం శ్రీనివాసరావ్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే మనల్ని అలరిస్తూ, రంజింపజేస్తూ ఉండాలని మనసారా కోరుకుందాం.

మీరు,మీ పిల్లలు ఈ ఆదివారం లేకుంటే మీకు వీలైనప్పుడు, వీలైనంత త్వరగా వెళ్లి ఈ సినిమా చూసి, ఈ సినిమాను ప్రోత్సహించాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.

మా చిన్నప్పుడు బెనిఫిట్ షో (ఎవరికి బెనిఫిట్టో?) అని చెప్పి స్కూలు పిల్లల్ని థియేటర్లకి తీసుకువెళ్ళి మంచి సినిమాలు అని వాళ్ళు అనుకున్నవి చూపించేవారు. అలా నేను ఒకట్రెండు సినిమాలు చూడటం జరిగింది.

ఈ తరం స్కూలు పిల్లలని ఖచ్చితంగా అలా తీసుకువెళ్ళీ చూపాల్సిన సినిమా ఈ ‘సింగ్ గీతం’ చిత్రం. స్కూలు యాజమాన్యాలు ఈ కోణంలో ఆలోచించాలి.

సాంకేతిక వివరాలు:

సినిమా: సింగ్ గీతం

దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు

నిర్మాత: నాగ్ అశ్విన్

నిర్మాణ సంస్థలు: వైజయంతి మూవీస్, స్వప్న సినిమా

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: అనుకుర్ C

ప్రధాన తారాగణం: అయాన్ ఖాన్, షాలిని కొండేపూడి, అహిల్యా బమ్రూ, తులసి, బెనర్జీ తదితరులు.

Exit mobile version