Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 27- భర్తకు తనను తాను అర్పించుకున్న ఒక భార్య పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

బంటు రీతి కొలువు..

~

చిత్రం: కథానాయకుడు

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం : కె. ఎస్. చిత్ర, శ్రీనిధి, తిరుమల

~

పాట సాహిత్యం

పల్లవి:
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా॥ 3 ॥
కంటపడని నీడై వెంటనడచు తోడై ॥2॥
నీ సేవలన్నీ నిర్వహించగలిగే బంటురీతి కొలువు ॥ బంటురీతి కొలువు ॥

చరణం:
నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
గుండెలోన కొలువై కంటజూడ కరువై ॥2॥
ప్రాణవల్లభునిగా పలకరించవేమి ॥ నిన్ను తలచువారి ॥ బంటురీతి కొలువు ॥

చరణం:
ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావో ॥ 2 ॥
బతుకు బరువులెన్ని తలను దాల్చినావో
సేద తీరు నెలవు ఇక్కడుంది స్వామి
సేద తీర్చు నెలవు ఇక్కడుంది స్వామి
అర్థభాగమైన నీ వంతు సైతం || 2 ||
నిర్వహించగలిగే, నిర్వహించగలిగే
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా ॥ బంటురీతి కొలువు ॥

అయోధ్యలో రామ మందిరం అత్యద్భుతంగా నిర్మాణం అవుతూ, తుది మెరుగులు దిద్దుకుంటూ ఉంది. ఎన్నో ఘర్షణలు, ఉద్రిక్తతలు, కోర్టు కేసులు – తీర్పుల అనంతరం, ఎంతోకాలం తర్వాత శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్ఠాత్మకమైన రామజన్మభూమిలో, సరికొత్త ఆలయంలో, జరగబోతోంది. అంతా రామమయమై, ప్రపంచమంతా అయోధ్యపై దృష్టి సారించి, త్రేతా యుగం నాటి రామయ్య కొలువు తీరడం కోసం ఎదురు చూస్తూ ఉంది. శ్రీరాముని ఘనతను ఈ తరం వరకు అందించడానికి రామాయణం/ రామాయణాలు.. ఎంత శక్తివంతంగా ఉపకరించాయో, త్యాగయ్య రామదాసు వంటి సంగీతకారుల భక్తి గీతాలు కూడా అంతే గొప్పగా రామ భక్తి సారాన్ని మనకు అందించాయి.

96 కోట్ల రామనామం జపించిన త్యాగరాజు, రామకథామృతాన్ని తాళ సమన్వయంతో, నాద సుధారస ప్రవాహంలా, పాడుకుని ధన్యుడైనాడు.

భక్తి సంగీత సామ్రాజ్యంలో, శిఖర సమానుడు త్యాగయ్య. రామ భక్తే త్యాగయ్య శక్తి. ధర్మమూర్తి, ఆదర్శమూర్తి అయిన రామచంద్రమూర్తి భక్తుడు త్యాగయ్య. ఆయన నరనరాల్లో రామ భక్తిసారం నిండి పోయింది. మెలుకువలోనైనా, కలలోనైనా ఒక్క ఘడియ కూడా ఆయన రాముడిని విడువలేదు. రాముడే శ్వాసగా జీవిస్తూ, రామకీర్తనలలోనే, రామకీర్తనల తోనే, జీవితాన్ని గడిపాడు. మాటల్లో వర్ణించలేని భావాలన్నీ తనివితీరా పాడుకుని పరవశించాడు. త్యాగరాజనుత అనే నామ ముద్రతో, 24 వేల కీర్తనలు (వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్యకూడా 24 వేలే) వ్రాసుకొన్నాడని పరిశోధకులు తేల్చినా, ప్రస్తుతం 7,500 కీర్తనల వరకు లభ్యమవుతున్నాయని తెలుస్తూ ఉంది. త్యాగరాజు నాదోపాసనతో రామార్చన చేసి, తన జీవితాన్నే రామార్పణం చేసి.. పర(రా)మ పథాన్ని చేరుకున్నాడు. త్యాగరాజస్వామి కృతులలో విద్వాంసులచే ఉత్తమమైనవిగా నిర్ణయింపబడిన ఐదు కీర్తనలు పంచరత్న కీర్తనలుగా ప్రసిద్ధికెక్కాయి… (జగదానందకారకా/..దుడుకుగల../సాధించెనే../కనకనరుచిరా../ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు..) వీటిని త్యాగరాయ ఉత్సవాలలో ప్రతి సంవత్సరం, సంప్రదాయ సంగీత విద్వాంసులందరూ పాడతారు.

చాలా తెలుగు చిత్రాలలో త్యాగరాయ కృతులను, రామదాసు కీర్తనలను, అన్నమయ్య పదాలను, అనుకరిస్తూ, సినిమా పాటలు రాయడం జరిగింది.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..
నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి
జనకుని కూతురా జననీ జానకమ్మ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళా..
అనే రామదాసు కీర్తనలోని భావం పలికేలాగా, ‘రంగులరాట్నం’ చిత్రంలో ‘నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో..’ అనే గీతాన్ని దాశరథి రచించారు.

~

ప్రసిద్ధమైన త్యాగరాయకృతి ‘ఎందరో.. మహానుభావులు..’ అనుకరణతో, ఆనాడు త్యాగరాజు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నానంటూ… ‘అశోక చక్రవర్తి’ సినిమా కోసం, వేటూరి సుందరరామ్మూర్తి ఒక గీతం రాశారు.

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము

ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ

ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము ఎదలా ఎదుటే మెరిసి.. వలపై.. ఇలపై.. నిలిచే.. వేళ

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము..

~

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ పాట బాణీలోనే, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రం కోసం వేటూరి గారు చేసిన మరో ప్రయోగం..

పరహింస పారాయణ చంద్రశ్రీ
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ

ఆచారమా సంప్రదాయమా
ఆచారమా సంప్రదాయమా
ఆడపిల్లలకే అపచారమా
పరహింస పారాయణ చంద్రశ్రీ

కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలకగా..

~

ఇదే రాగంలో ‘యమహా నగరి కలకత్తాపురి..’ పాటని కూడా వేటూరి రాస్తూ.. ‘చిరు త్యాగరాజు..’ అనే ముక్తాయింపుని కూడా ఇచ్చారు.

‘అల వైకుంఠపురం’ చిత్రంలో… ‘సామజ వరగమనా..’ అనే పదంతో మొదలైన సిరివెన్నెల గీతం కూడా ఎంతో వైరల్ అయింది. ‘సామజవర గమనా.. సామజవరగమనా.. ఎన్నియల్లో… ఎన్నియల్లో.. ఎన్నియల్లో.. ఎన్నియల్లో’ ..అనే పాట ‘టాప్ హీరో’, చిత్రంలో కూడా పాపులర్ అయింది. శతాబ్దాల క్రితం నాటి మహానుభావుల రచనలను, అనుకరించడం.. ఆ పాటలు బాగా ప్రజా బహుళ్యంలో నిలిచిపోవడం గొప్ప విషయమే.

ఇక్కడ మనం సిరివెన్నెల సాహిత్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం. ‘శృతిలయలు’ సినిమా కోసం ‘తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునకలో అలసిన దేవేరి.. అలమేలు మంగకు తెలవారదేమో స్వామి..’ అన్న గీతం అన్నమాచార్య కీర్తనేమో అన్న సంశయం కలిగించి, పండితులను కూడా ఆశ్చర్యపరచిందట. ఈ పాట పల్లవిలో మొదటి పంక్తి దర్శకుడు విశ్వనాథ్ ఇచ్చిందట. దానిని చూడగానే అది పాడబోయే బాలమురళీకృష్ణగారు సైతం అన్నమయ్య కీర్తన అనుకోవాలనే చిలిపి ఆలోచనతో సిరివెన్నెల అన్నమయ్య బాణీలో ఈ పాట రాశారట. కారణాంతరాల వల్ల బాలమురళీకృష్ణకు బదులుగా ఈ పాట పాడిన జేసుదాసు కూడా యిది అన్నమాచార్య కీర్తనే అనుకున్నారట. అనుకోవడమే కాదు – చాలా కచేరీల్లో దీనిని అన్నమయ్య ఖాతాలోనే జమచేసి పాడారట! ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి – ఇదే చిత్రంలోని అన్నమాచార్య కీర్తన ‘ఇన్ని రాశుల యునికి ఇంతి చెలువపురాశి..’ అనేది సిరివెన్నెల రచన గాను, ‘తెలవారదేమో స్వామీ..’ అన్నమయ్య కీర్తన గాను పొరబడి చాలమంది పందాలు కూడా కాయడం! ఏకంగా అన్నమయ్య సరసనే సిరివెన్నెలను నిలిపితే తనెంత మురిసిపోవాలి? గర్వపడాలి? అని తన ‘సిరివెన్నెల రసవాహిని’ గ్రంథంలో డా. పైడిపాల కితాబిచ్చారు.

కొసమెరుపేమిటంటే 1987 నంది పురస్కారాల కమిటీ న్యాయనిర్ణేతగా వున్న సి.యస్.రావు ‘తెలవారదేమో స్వామీ..’ అన్నమయ్య కీర్తన అనుకొని పక్కనపెట్టి, ఆ తర్వాత అది సిరివెన్నెల రచనే అని తెలుసుకొని దానికి ఆ సంవత్సరం ఉత్తమ సినీగేయంగా నంది పురస్కారమిచ్చారట! అన్నమయ్య శైలి, పదాల పోహళింపుతో నడిచిన సిరివెన్నెల కవన ప్రతిభ ఈ పాట గురించి యింతమంది పొరబడ్డానికి కారణమైందని పైడిపాల వివరించారు.

ఇక పాట నేపథ్యంలోకి వస్తే, ‘నీకు సేవకుడిగా ఉండేటువంటి గొప్ప ఉద్యోగాన్ని నాకు ప్రసాదించు తండ్రీ రామచంద్రా!..’ అంటూ మొదలుపెట్టి..

‘అరిషడ్వార్గాలన్నింటినీ పడగొట్టి నశింపచేసేటువంటి సేవకుడిగా నీ సన్నిధిలో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ప్రశాదించు స్వామీ! అనీ, శరీరాన్ని కాపాడే మేలైన, గట్టిదైన కవచాన్ని, నేను నీ భక్తుడననే చిహ్నాన్ని, రామ నామము అనే విలువైన కత్తిని ఇచ్చి, నీ సేవకుడిగా విరాజిల్లే శాశ్వతమైన వరాన్ని నాకు ప్రసాదించు తండ్రీ!’, అనీ మనసారా రామచంద్రుని కోరుకునే.. ‘బంటు రీతి కొలువియ్యవయ్య రామా!..’ అనే కీర్తన ఎంతో ప్రసిద్ధమైనది. అదే భావాన్ని తీసుకొని, ఎన్టీఆర్ జీవిత కథపై రూపొందిన ‘కథానాయకుడు’, చిత్రంలో సేవలందించే భార్య పాడుకునే పాటలాగా, సిరివెన్నెల ఈ గీతాన్ని రూపుదిద్దారు.

400కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన నందమూరి తారక రామారావు, తెలుగువారి మనసుల్లో ‘నటరత్న’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా ఎదిగి, తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచి కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడైన ‘అన్నగారు’, ఆయన. ఎన్టీఆర్ అని తెలుగువారు ఆత్మీయంగా పిలుచుకునే, ఆయన జీవిత చరిత్రను, నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో తెరకెక్కించారు. ఎన్టీఆర్ తన మామ కూతురైన బసవతారకాన్ని వివాహం చేసుకుంటాడు.

అత్యంత ప్రేమతో, శ్రద్ధతో, ఆయనను కనిపెట్టుకొని, సేవలందిస్తుంది తారకం. వారిద్దరి మధ్య అనుబంధాన్ని చూపిస్తూ నేపథ్యగీతంగా సాగుతుంది ఈ ‘బంటు రీతి కొలువియ్యవయ్య రామా!’ అనే పాట.

బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా॥ 3 ॥
కంటపడని నీడై వెంటనడచు తోడై ॥2॥
నీ సేవలన్నీ నిర్వహించగలిగే బంటురీతి కొలువు ॥ బంటురీతి కొలువు ॥

రామారావును రామా! అని సంబోధిస్తూ, నీ సన్నిహితమైన బంటులాగా ఉంటూ, నీకు నీడలాగా తోడై, నీ సేవలన్నీ చేసే భాగ్యాన్ని నాకివ్వు! అని భార్య చేసే విన్నపం లాగా ఉంటుంది, పల్లవి.

నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
గుండెలోన కొలువై కంటజూడ కరువై ॥2॥
ప్రాణవల్లభునిగా పలకరించవేమి ॥ నిన్ను తలచువారి ॥
॥ బంటురీతి కొలువు॥

ఇటు సినీ రంగంలోనూ, తరువాత తరువాత, రాజకీయరంగంలోనూ తీరికలేని పనులతో, కావలసిన వారందరికీ, కావలసిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతారు అన్నగారు. మనసు నిండా ఆయననే నింపుకొని, సేవలు చేసుకుంటూ ఉండే బసవతారకానికి కనులారా ఆయనను చూసుకోవడానికి కూడా సమయం కేటాయించలేక, భర్తగా మాత్రం ఆమెకు పూర్తి సహకారాన్ని అందించలేక పోతాడు నందమూరి. నేపథ్యంలో ఆ కథను చూపిస్తూ, ఆ భావాన్నంతా చరణంలో పలికిస్తారు సిరివెన్నెల.

ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావో ॥ 2 ॥
బతుకు బరువులెన్ని తలను దాల్చినావో
సేద తీరు నెలవు ఇక్కడుంది స్వామి
సేద తీర్చు నెలవు ఇక్కడుంది స్వామి
అర్థభాగమైన నీ వంతు సైతం || 2 ||
నిర్వహించగలిగే, నిర్వహించగలిగే
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా ॥ బంటురీతి కొలువు ॥

అన్నదమ్ములు, స్నేహితులు, అందరికీ తగిన సహకారాన్ని అందిస్తూ, ఎన్నో రకాల పాత్రలలో ఒదిగిపోయి, వాటికి న్యాయం చేస్తూ, సజీవ పాత్రలలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అలుపెరుగకుండా ముందుకు సాగే నందమూరి జీవితాన్ని రెండు వాక్యాల్లో పలికించడం సిరివెన్నెలకే సాధ్యమేమో! అంత అలసిపోయిన మనసుకు సేదతీరే అవకాశం, సేద తీర్చే స్థానం తన దగ్గరే ఉందంటుంది బసవతారకం. కుటుంబం విషయంలో, పిల్లల పెంపకం విషయంలో కూడా అర్ధాంగిగా భర్త వంతు కూడా సేవలు అందించగలిగే శక్తిని ఇవ్వమని, ఒక బంటు లాగా సేవించుకునే భాగ్యాన్ని అందివ్వమని, బసవతారకం భర్తను వేడుకుంటుంది.. అన్న భావాన్ని ఈ రెండవ చరణంలో ముచ్చటగా ఇమిడించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అదే ‘కథానాయకుడు’ చిత్రంలో..

‘అన్నా రమ్మంటూ ఎన్ని చేతులో
కొత్త రాత రాయమంటూ ఎన్ని గీతలో
రానున్న శకం రామన్న శకం అంటున్న రథం చైతన్య రథం
సరికొత్త పథం జన చిత్తరథం నెరవేర్చుటకై ఉరిమే శపథం
జనజాగృతికై శంఖారావమై ఎలుగెత్తిన కదన కుతూహల నాదం..’

అనే పాటలు ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యాన్ని చిత్రిస్తూ సిరివెన్నెల రాసిన పాట పల్లవి ఎంతో అర్థవంతంగా, ప్రేక్షకులను ఉర్రూతలూపేలాగా ఉంది.

శ్రీరామచంద్రునికి తనను తాను అర్పించుకున్న త్యాగయ్య భక్తి రసాత్మకమైన ‘బంటు రీతి కొలువియ్యవయ్య రామా!’ అనే కృతిని, హృదయపూర్వకంగా భర్తకు తనను తాను అర్పించుకున్న ఒక భార్య పాడుకునే పాట పోకడలోకి మలిచిన సిరివెన్నెల ప్రతిభను, కవితా శైలిని అనుభవించి ఆనందిద్దాం! ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!!

Images Courtesy: Internet

Exit mobile version