Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 35 – శివస్తుతిగా సాగిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

భరత వేదమున నిరత నాట్యమున

~

చిత్రం: పౌర్ణమి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: చిత్ర, బృందం

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

~

పాట సాహిత్యం

సాకీ:
హర హర మహాదేవ! హర హర మహాదేవ!
శంభో శంకరా హర హర మహాదేవ హర హర మహాదేవ
తధీమ్ తాధీమ్ థీమ్ ధిమి ధ్వనుల తాండవకేళీ తత్పరా
గౌరీ మంజుల సింజినీ జతుల లాస్యవినోదవ శంకరా
పల్లవి:
భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివనివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా ॥ భరతవేదముగ ॥ హర హర ॥
చరణం:
అంత కాంత నీ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ
ఆది శక్తి ఆకృతి అత్రిజాత పార్వతీ స్థాణువైన ప్రాణధవుని చెంతకి చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణీ లీలా యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ
జంగమ స్థావర గంగాంచితశిర మృగమండితకర పురహరా
భక్త శుభంకర భవనా శంకర స్మరహర దక్షాధ్వరహరా ఫాలవిలోచన పాలిత జనగణ కాలకాల విశ్వేశ్వరా ఆశుతోష అఘనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా ॥ భరతవేదముగ ॥ ॥ హర హర మహాదేవ ॥
చరణం:
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలవంగా
యోగివేష నీ మనసున కలగదా రాగలేశమైన హేమహేశ నీ భయదపదహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన నమకచమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధ ప్రధమనాద శ్రుతి వినరా ॥ భరతవేదముగ ॥ ॥ హర హర మహాదేవ ॥

ఏమానందము
భూమీతలమున!
శివతాండవమట!
శివలాస్యంబట!
తలపైనిఁ జదలేటి యలలు దాండవమాడ నలలత్రోపుడులఁ గొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగుఱులు చెఱలాడఁ గనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ గనుపాపలో గౌరి కసినవ్వు బింబింపఁ గనుచూపులను తరుణకౌతుకము జుంబింపఁ గడఁగి మూడవకంటఁ గటికనిప్పులు రాలఁ గడుఁబేర్చి పెదవిపైఁ గటికనవ్వులు వ్రేల ధిమిధిమిధ్వని సరిద్దిరి గర్భములు తూఁగ నమిత సంరంభ హాహాకారములు రేగ ఆడెనమ్మా! శివుఁడు, పాడెనమ్మా! భవుఁడు..

నటరాజు పదం కదిపి నాట్యం చేస్తూ ఉంటే, జటాజూటంలోని అలలు, నుదుటిపైన ముంగురులు, అలా.. ఏవేవి ఎగసిపడుతూ.. ధిమిధిమి ధ్యానాలు చేస్తూ, ఉప్పొంగిన సంబరంతో హాహాకారాలు చేస్తున్నాయో వర్ణిస్తూ, సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు.. శివతాండవ వైభవాన్ని, మనోహరంగా వర్ణిస్తారు. అర్ధనారీశ్వరుడైన శివుడు పరవశించి తాండవం చేస్తుండగా, పార్వతీదేవి మమేకమై లాస్యాన్ని ఒలికిస్తున్నదట. ఆ తాండవ కేళీ విలాసానికి భూమీతలమంతా ఆనందంతో ఉప్పొంగిపోయిందట! ఎందుకు ఉప్పొంగదు? శివుడంటేనే నాట్యం, శివుడంటేనే నాదం, శివుడంటేనే లాస్యం. ఆయనే మరి నటరాజు కదా!

శివుడిని స్తుతిస్తూ గానం చేసినా, ఆయనను స్తుతిస్తూ నర్తించినా, గంగ వెర్రులెత్తుడం సహజం.

రావణ కృత శివతాండవ స్తోత్రం, కాలభైరవాష్టకం వంటి స్తోత్రాల నుండి, సాహిత్యంలో కనిపించే అన్ని ప్రక్రియలలో, శివ నామావళి, శివ తత్వం, రౌద్రం.. దేన్ని వర్ణించినా ఒక ఉద్వేగ స్థితిని సృష్టిస్తుంది. ఉదాహరణకు, రావణ కృత శివతాండవ స్తోత్రం గమనిద్దాం.

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గళే వలంబ్య లంబితాం భుజఙ్గతుఙ్గ మాలికామ్।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః॥
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్జరీ
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచ న్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ॥

…..

దీన్ని వింటున్నా, కనీసం వచనంలో చదివినా మనకు ఒళ్ళు పులకరిస్తుంది, మనసు తన్మయంతో నాట్యం చేస్తుంది. అలాగే ఏ పాట తీసుకున్నా, మనం ఆ అనుభూతిలోనవుతాం. ‘అడ్డబొట్టు శంకరురుడా’ అని మంగ్లీ ఉల్లాసంగా పాడుతుంటే, మనకు తెలియకుండానే తాళం వేస్తూ పదం కదుపుతాం. పూనకం వచ్చినట్టు ఊగిపోతాం.

ఇక చిత్ర సీమ విషయానికి వస్తే, బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుండి, నృత్య ప్రధాన గీతాలు, సంగీత సాహిత్య సమ్మిళిత గీతాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. నాట్య సంగీతాల పట్ల ప్రేక్షకుల ఆదరణను గమనించిన నిర్మాతలు క్రమక్రమంగా తమ చిత్రాలలో అలాంటి వాటిని పొందుపరచడం ప్రారంభించారు. కొందరు దర్శకులు ఉత్తమ ప్రమాణాలు గల చిత్రాలను తీసినప్పుడు, వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. శంకరాభరణం, సప్తపది, సిరిసిరిమువ్వ, సాగర సంగమం వంటి చిత్రాలు సాధించిన ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ దిశను మార్చాయి. ఎందరో గేయ రచయితలు నృత్య ప్రధాన చిత్రాలకు వ్రాసిన పాటలతో కొత్త చరిత్రలు సృష్టించారు.

ఈ నేపథ్యంలో సిరివెన్నెల కూడా, తాను ఎంతో అభిమానించే భారతీయ కళలకు, భారతీయతకు వన్నెల దిద్దేలాగా, అనేక నృత్య గీతాలను వ్రాసే అవకాశాన్ని అందుకొని, శృతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం, శుభసంకల్పం, పౌర్ణమి వంటి చిత్రాలలో, అద్భుతమైన రీతిలో తన రచనా శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శించారు.

శివుడికి సంబంధించిన గీతాల గురించి చెప్పనవసరమే లేదు. శివయ్య పేరు చెపితేనే.. సిరివెన్నెల గారు శివాలెత్తుతారట! స్వర్ణకమలం చిత్రంలో.. ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్ళు.. శివ పూజ చివరించిన సిరిసిరిమువ్వ, అందెల రవమిది పదములదా.. వంటి పాటలలో కావ్యాల స్థాయి సాహిత్యంతో, శాస్త్రీయతను, పరమశివునిపై ఆయనకున్న మక్కువను అద్వితీయంగా ప్రదర్శించారు.

ఇక మనం ప్రస్తుతం విశ్లేషిస్తున్న ‘పౌర్ణమి’ చిత్రంలోని పాట విషయానికి వస్తే, ఈ పాటలో పైకి మనకు, దక్షయజ్ఞం తర్వాత, యోగాగ్నిలో దాక్షాయిణీ దేవి దగ్ధమైన ఘట్టం, కోపోద్రిక్తుడైన శివుడు చేసిన మహా రుద్ర తాండవం వంటి ఘట్టాల వివరణ కనిపిస్తుంది. స్థాణువులా నిలిచిపోయిన పరమేశ్వరుని, ప్రసన్నం చేసుకొని, ఆయనలో స్పందన కలిగించి, యోగిగా ఉన్న శివయ్యను నాట్యరతునిగా చేయగలిగిన సతీదేవి ప్రయత్నం ఈ పాటలో వివరించడం జరిగింది.

సిరివెన్నెల గారికి గల పౌరాణిక, వైదిక, ఐతిహాసిక జ్ఞానానికి, భాషా సంపదకు, ఈ పాట అద్దం పడుతుంది.

శివతాండవం గురించి చర్చించే ముందు శివారాధనలో ఉన్న రెండు సంప్రదాయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆనంద భైరవ సంప్రదాయంలో జతులతో కూడిన తాండవం ప్రధానమైతే, దక్షిణామూర్తి సంప్రదాయంలో అమ్మవారితో కలిసి చేసే లాస్యం ప్రధానమట. తాండవాలలో కూడా ఆనందతాండవాలు, ఉగ్ర తాండవాలు అని రెండు రకాలుగా ఉన్నాయి.

అజబ తాండవం, భ్రమర తాండవం, హంస తాండవం, కమల తాండవం, ఉన్మత్త తాండవం, భుజంగ తాండవం, అజపా హంస తాండవం, అనేవి ఆనందతాండవాలు.

కాల సంహార తాండవం,కబల సంహార తాండవం, త్రిపుర సంహార తాండవం,గజ సంహార తాండవం, మయూర సంహార తాండవం,జలాంతర సంహార తాండవం, అనేవి ఉగ్రతాండవాలు.

ఇక కథా పరంగా ఆలోచిస్తే, పౌర్ణమి చిత్రంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన కథానాయిక, పౌర్ణమి, తన ప్రాణాలను అర్పించి, కథానాయకుడిలో లీనమైనదన్న సందేశాన్ని సింబాలిక్‌గా అందిస్తున్నారు. హర హర మహాదేవ అంటూ మొదలయ్యే సాకీలో, తాండవ కేళి తత్పరుడైన నటరాజును స్తుతి, గౌరీ దేవితో కలిసి ఆయన చేసే నృత్యంలోని లాస్య ప్రియత్వాన్ని కూడా సిరివెన్నెల వివరించారు.

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివనివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా..

తరతరాలుగా (450 ఏండ్లుగా) ఆ ఊరి శివాలయంలో నాట్య నివేదన చేసే కుటుంబంలో పౌర్ణమి జన్మిస్తుంది.  పుష్కరానికి ఒకసారి ఆ కుటుంబం నుండి ఒకరు నాట్య నివేదన చేయడం వారి ఆనవాయితీ. కారణాంతరాల వల్ల ఆమె ఊరికి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఆమె నాట్యం చేయకపోతే ఆ ఊరు కరువు కాటకాలతో తల్లడిల్లవలసి వస్తుంది కాబట్టి, ఆమె చెల్లెలు చంద్రకళను నాట్య నివేదనకు సమాయత్తం చేసి, దుర్మార్గుడైన ఆ ఊరి జమీందారు కామవాంఛ నుండి ఆమెను కాపాడి, పౌర్ణమికి ఇచ్చిన మాటను హీరో నిలబెట్టుకోవడం, కథా నేపథ్యం. ఆ పతాకం సన్నివేశంలో ‌చాలా ఉద్వేగ భరితమైన నాట్య ప్రదర్శన కోసం ఈ పాట వ్రాయడం జరిగింది.

భరత వేదమున.. అనే పదంతో భరతుని నాట్య శాస్త్రం గురించి సిరివెన్నెల ప్రస్తావిస్తారు. ఈశ్వరుడు ఆదిప్రవక్త. నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యాన్ని గ్రహించి, శివుని ఆజ్ఞపై బ్రహ్మకు ఉపదేసించాడు. బ్రహ్మ నుండి భరతుడు దానిని గ్రహించి నాట్యశాస్త్రం రచించాడు. ఋగ్వేదం నుండి పదాలు, సామవేదం నుండి సంగీతం, యజుర్వేదం నుండి సంజ్ఞలు మరియు అథర్వవేదం నుండి భావాలను తీసుకొని ఉద్భవించినందున నాట్యం శాస్త్రాన్ని ఐదవ వేదంగా కూడా పిలుస్తారు. ఇంత సమాచారాన్ని ఒక్క సమాసంలో పొందుపరచటం ఆయన జ్ఞానానికి, భాషా పటిమకు తార్కాణం. నిరతనాట్యమనేది వారి వంశ ఆచారాన్ని సూచిస్తుంది. నీలకంథరుడిని నేలకందమన్న అందమైన ప్రాసలతో, వర్షం కురిపించి అవని వేదనను తీర్చమనే ప్రార్థన పల్లవిలో మనకు కనిపిస్తుంది. నాగజా మనోజ.. వంటి పరి పరి పర్యాయపదాలతో శివుడిని స్తుతించడం జరిగింది.

అంత కాంత నీ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ
ఆది శక్తి ఆకృతి అత్రిజాత పార్వతీ స్థాణువైన ప్రాణధవుని చెంతకి చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణీ లీలా యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ
జంగమ స్థావర గంగాంచితశిర మృగమండితకర పురహరా
భక్త శుభంకర భవనా శంకర స్మరహర దక్షాధ్వరహరా ఫాలవిలోచన పాలిత జనగణ కాలకాల విశ్వేశ్వరా ఆశుతోష అఘనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా..

పౌర్ణమి ప్రాణ త్యాగం చేసి, నాయకుడిలో తాను లీనమై, స్థాణువులా నిలిచిపోయిన తన ప్రియునిలో ఒక కర్తవ్యాన్ని రగిలిస్తుంది. చంద్రకళతో శివాలయంలో నాట్యం చేయించడం ద్వారా, ఆ భవుడిని ఈ భూమి మీదికి తరలించి, ఆ యోగి పుంగవుడిని నటరాజుగా నర్తింపజేసి, స్థావర, జంగమాలన్నిటిలోనూ నిండిన, ఆ పశుపతి దీవెనలు అందుకునేలా చేయమన్న భావన, ఈ చరణములో, అంతస్సూత్రంగా పలికిస్తారు సిరివెన్నెల.

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలవంగా
యోగివేష నీ మనసున కలగదా రాగలేశమైన హేమహేశ నీ భయదపదహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన నమకచమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధ ప్రధమనాద శ్రుతి వినరా..

వ్యోమకేశా.. పార్వతి దేవి తన ప్రేమ పాశంతో, నీకోసం ఎంత తపించినా, యోగివేషధారీ, నీ మనసు కరగదా? నీ ప్రమథ గణాలు, వీరభద్రుడు రాక్షసులను చంపుతుండగా.. (కథానాయకుడు, జమీందారు పంపిన రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు) భోగభూషా! నీ ఉగ్రత్వాన్ని, కోపాన్ని ఉపసంహరించుకొని, అభయముద్రతో ఈ భువనాళిని కాపాడలేవా? నమక చమకాల స్తుతి మధ్య, యమక గమకాల జతులతో సాగే నాట్యయోగంలో  ప్రాణమే నీ ధ్యానంగా ఉప్పొంగుతున్న ఓంకార నాద శృతిని, నీవు వినిపించుకొని, కరిగి, కరుణించవయ్యా! అనే విన్నపాన్ని, నాట్య కళాకారిణి అయిన చంద్రకళ మనసు చేసే ప్రార్థన లాగా, రెండో చరణాన్ని తీర్చిదిద్దారు సిరివెన్నెల. ఇందులో, భోగభూష అన్న పదం మనల్ని ఎంతో ఆలోచింప చేస్తుంది. పాములను మెడలో భూషణాల లాగా వేసుకున్న వాడు, అని ఒక అర్థం వస్తే, తల పైన గంగమ్మ, నుదుటిపై చంద్రుడు, మెడలో సర్పాలు, మూడవ నేత్రంలో అగ్ని, కంటి వెలుగులో సూర్య చంద్రులు, ఇన్ని సజీవభూషణాలు స్వామి చుట్టూ ఉన్నాయి కదా అనిపిస్తుంది.

శివయ్యను ఇదే విధంగా ముద్దు ముద్దు పదాలతో, తన శివతాండవంలో పుట్టపర్తి వారు ఇలా అంటారు.

“మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురుబొట్టు పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెలపట్టు నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు,
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటలరట్టు”

నాట్య శాస్త్రంలోని రససిద్ధిని, ఆత్మానందాన్ని వర్ణిస్తూ, భవ్యమైన ఆత్మభావం,రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిలజగతి మూలం అంటారు సిరివెన్నెల (పౌర్ణమి చిత్రంలో).

శివునికి గల పర్యాయపదాలతో శివస్తుతిగా, శబ్దాలను చిందులు తొక్కిస్తూ, సాగుతుంది మొత్తం పాట. నాట్య ముద్రలకు, గతులకు అనుగుణంగా సీతారామశాస్త్రి ఈ పాటను కూర్చారు. శివ నివేదనగా, అవని వేదనగా/నీలకంధరా.. నేలకందరా/అని ప్రాస పదాలతో పాటు, శివుని పర్యాయపదాలలో కూడా.. వ్యోమకేశ, యోగివేష, హే మహేశా!, భోగభూష వంటి చక్కటి ప్రాస పదాలను ఏర్చి కూర్చి, అమర్చడం పదాలు ఎంపికలో కూడా ఆయన ఎంత సెలెక్టివ్గా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఒక పాటలో ఎంత మేరకు సమాచారాన్ని అందించాలో, ఏ విధంగా అందించాలో చక్కటి బ్యాలెన్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకే పాటలో అటు పౌరాణిక నేపథ్యాన్నీ, ఇటు కథకు సంబంధించిన అంశాల్ని చక్కగా జోడించడం, ఆయన కవితా శిల్పంలో దాగి ఉన్న అతి గొప్ప రహస్యం. సుమధురమైన చిత్ర గానం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, అధ్యంతం హర మహాదేవ! అన్న జయ ఘోషల మధ్య, ఈ పాట నిస్సందేహంగా మనందరి మానస సరోవరాల్ని ఆ కైలాసవాసుని అభిషేకించడానికి, ఆయన కరుణామృత ధారాలలో తడిసిపోవడానికి సిద్ధం చేస్తుంది.

Images Courtesy: Internet

Exit mobile version