Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 48 – అమ్మ మనసు కలిమిని వర్ణించిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సిరులొలికించే చిన్నినవ్వులే..

~

చిత్రం: యమలీల

సంగీతం:

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: చిత్ర, ఎస్పీ. బాలసుబ్రమణ్యం.

~

పాట సాహిత్యం

పల్లవి
ఆమె :
సిరులొలికించే చిన్నినవ్వులే మణిమాణిక్యాలు.. చీకటి ఎరగని బాబుకన్నులే మలగని దీపాలు
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి యింతకు యింతై ఈ పసి కూనా
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా..
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లూ

కోరస్: జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ ॥సిరులొలికించే॥

చరణం:
నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరూ-వాడా మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లే కాచుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ
కోరస్ : లాలలలా లలా లలా.. (2)
కోరస్: జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ ॥సిరులొలికించే॥

చరణం- బాబు:
వేశా మొదటి అడుగు అమ్మ వేలే వూతగా
నేర్చా మొదటి పలుకు అమ్మపేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మఋణమే తీరగా తోడుండగా నను దీవించే కన్నప్రేమా
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా
॥సిరులొలికించే॥

లాలిపాటలు అటు సాహిత్యంలోను ఇటు మానవ జీవితంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. లాలిపాటల్లో సంగీతం, సాహిత్యం పరస్పరాశ్రయాలుగా ఉంటాయి. బిడ్డ కోసమే అయినా పాడేది పెద్దవారు కావడంతో లాలిపాటల్లో రామాయణ భాగవతాది కథావస్తువుగా గల కథాగేయాలు, రమణీయమైన పదాల కూర్పుగల ముక్తకాలు, లాలి పాటలకు సాహిత్యంలో పెద్ద పీటే వేస్తున్నాయి. ‘లాలన’ పదం ద్రావిడ భాషా పదం కాదు. ఇది సంస్కృత పదం. లాలించు, ఓదార్చు అనే అర్థంలో ‘లాలన’ పదం నుండి ‘లాలి’ పదం వచ్చినట్లుగా నిర్ణయించవచ్చు.

చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి వారి తల్లులు పాడే పాటలే జోల పాటలు. ఏడ్చే పిల్లలని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు. ఈ పాటల్లో ఉండే లయ, శబ్దాలంకారాలు, గానానికి తగినట్లుగా ఉయ్యాల ఊపడం, వీపుపై తట్టడం వంటి లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లలను మైమరపించి, నిద్రపుచ్చుతాయి. జోలపాటలు, లాలిపాటలూ పిల్లలకే కాక, తల్లికి కూడా లాభమేనని యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకుల పరిశీలనలో తేలింది.

జానపదులు మౌఖికంగా పాడిన లాలిపాటలూ, ఆ జానపద ధోరణులలో రచించి పాడే లాలిపాటలూ ఉన్నాయి.మొత్తం పైన ‘లాలి, జోల, డోల, ఉయ్యాల, తొట్టిలు’ పాటలు అనే పాటలన్నీ ఒక దానికొకటి పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయని తెలుస్తోంది.

బిడ్డకు తల్లి ఒడి మొదటి ఊయల. బిడ్డకు పాలు తాపిన పిమ్మట ఆ బిడ్డను నిద్రబుచ్చడం కోసం బిడ్డను తొడపైన వేసుకొని లేదా భుజంపైన వేసుకొని అటూ యిటూ మృదువుగా తిప్పుతారు. తల్లి ఈ విధంగా బిడ్డను తిప్పేటప్పుడు బిడ్డకు మత్తు వచ్చి క్రమంగా నిద్రిస్తుంది.

ఈ ప్రక్రియలో వేదాంతపరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. బిడ్డను కింది నుండి పైకి ఊపడం ద్వారా, క్రిందికి వచ్చిన జీవి పైకి వెళ్లి, భగవంతునిలో లీనం అవ్వాలి, అని చెప్పే సందేశం ఉందట! లాలి.. జో జో.. ఉళుళ.. వంటి పదాలు భావవ్యక్తీకరణకు వాడేవే కానీ, అవి నిరర్థక పదాలని పరిశోధకులు భావిస్తారు. కానీ ‘చిచ్ ఉళుళ హాయీ..’ అంటే ఈ సంసారం చిచ్చురా, ఇందులో హాయి ఉట్టిదేరా (ఉళుళుళ), అందుకే ఇప్పుడే హాయిగా నిద్రపోరా.. అన్న వేదాంతపరమైన అర్థం ఉందట!

లాలి పాటలలో భక్తి, వాత్సల్యం, కవితా కృతిలో ఉండడం, ప్రబోధాత్మకంగా ఉండడం, వేడుకల కోసం పాడడం, కోలాటంలో లాలి, దశావతారాల లాలి, వివాహ వేడుకలలో పాడడం, సంవాదాత్మకంగా, ఎగతాళిగా.. ఇంకా మోక్షానికి అర్హత కలిగించే తత్త్వము, మొదలైన ఎన్నో రకాల లాలి పాటలు ఉన్నాయట! బిడ్డను నిద్రలోకి జోకొట్టే లాలి పాటలను ప్రతి వాగ్గేయకారుడు, ప్రతి భాషలోనూ వ్రాయడం జరిగింది. ఈ పాటల ద్వారా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఉగ్గుపాలతో రంగరించి పోసే మహద్భాగ్యాన్ని, ఘన సంప్రదాయాన్ని మనకు అందించారు.

లాలి పాటలలో సంగీత ప్రాధాన్యతను ఒకసారి గమనిద్దాం. లాలి అన్న సంస్కృత పదం లాలన అన్న తెలుగు పదానికి సమానార్థకమవుతుంది. ఇలాంటి పాటల వల్ల నరాలకు, మెదడుకు లాలన దొరికి సేద దీరి ప్రశాంతత చేకూరుతుంది. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది. భాష అర్థం అయినా కాకపోయినా, సంస్కారాన్ని ఉగ్గు పాలతోనే నేర్పడం భారతీయ విజ్ఞాన పరంపరకు తార్కాణం.‌ ప్రహ్లాదుడు వంటి వారు గర్భస్థ శిశువు గానే జ్ఞానాన్ని అందుకున్నారు కాబట్టి.. వీలైనంత ఆత్మ జ్ఞానాన్ని తల్లులు శిశువులకు ఈ పాటల ద్వారా అందించేవారు.. అందిస్తున్నారు.

/ఏడ్వకురా లవ కుమార, ఏడ్వకురా పాప..

అయోధ్య పాలకుడా ఏడ్వకురా పాప../

అంటూ సీతమ్మ లవకుశలకు శ్రీరాముని యొక్క రాముని సోదరుల, వంశస్థుల యొక్క వీరత్వాన్ని, ధర్మాన్ని బోధిస్తూ.. అడవిలో ఉన్నామని బాధపడకండి, వీరందరూ వచ్చి మీకు కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తారు.. అని ఊరడిస్తూ పాట పాడడం ద్వారా వంశ గౌరవాన్ని, పౌరుషాన్ని, ప్రతిష్ఠను వారి మనసులో నాటే ప్రయత్నం చేస్తుంది.

మరి కొన్ని సంప్రదాయకమైన లాలి పాటలు:

/కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా శ్రీ రంగ రంగ రంగా నినుబాసి నేనెట్లు మరచుందురా../

~

/చిచ్చొ ఉళుళుళ హాయీ ..

హాయి హాయి హాయి ఆపదలు గాయీ

చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..

చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు

అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు మామ భుజమెక్కి ఏమేమి అడుగు?

పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు

ఆడితే పాడితే అవ్వలకు ముద్దు చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు/..

/జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా..జో జో

తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ నాలుగూ వేదాల గొలుసులమరించీ.. జో జో

బలువైన ఫణిరాజు పానుపమరించీ చెలుల డోలికలలొన చేర్చి లాలించీ.. జో జో/

~

/రామాలాలీ మేఘశ్యామాలాలీ

తామరస నయనా దశరథ తనయా లాలీ

అద్దాల పెట్టెలోన ఆదివిష్ణువు ముద్దు పాపడున్నాడనుచు మురియుచుంటినీ ఎంతో../

~

/లాలనుచు పాడరమ్మా,

ఈబిడ్డ లక్ష్మీవిలాసుడమ్మా

పాదమున చక్రమమ్మా,

ఈ బిడ్డ వేదాంతవేద్యుడమ్మా

వేణునాదంబుతోను, ఈ బిడ్డ వేదములు పాడునమ్మా../

~

నిఘంటువులలో లాలి పదానికి బిడ్డను లాలించుట సముదాయించుట అని ఉంది. లాలి పాటలనగా బిడ్డను లాలించుటకు, సముదాయించుటకు పాడే పాటలని చెప్పబడి ఉంది. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ‘lull’ అను శబ్దానికి ‘to sleep repetition of lulu or similar sounds’

ఇంగ్లీషు భాషలో బహుళ ప్రచారం పొందిన Lullabies అనబడే లాలి పాటలు కొన్ని.. యూరోపియన్ దేశాలలో, బాబిలోనియాలో నాలుగువేల ఏళ్ల క్రిందటి లాలి పాట, ఒక మట్టి పలకపై కనిపించిందట! అదే ఆ దేశాల్లోని అతి పురాతనమైన లాలిపాటట!

నిద్రపోవడమూ, మేలుకొనడమూ అన్నవి మన జీవితంలో అతి సరళమైన క్రియలు. వీటి చుట్టూ వెలిసిన గేయాలే లాలి పాటలు, జోలపాటలు శిశువులనుద్దేశించి వారికోసము పాడేపాటలు. అనాగరికులైన కొండజాతుల నుంచి మహానాగరికులైన వారివరకూ లాలిపాటలు వాడుకలో నున్నవి. వీటిలో సాహిత్యార్థము, గౌణము, సంగీతము, చివరి స్వరాలు మాత్రమే ప్రధానము. ఈ పాటలు బిడ్డలకు విశ్రాంతి నివ్వడానికి నిర్మించినవి కనుక శ్రుతి లలితమైన మాటలనే వీటిలో ఉపయోగిస్తారు. ఏడ్చే పిల్లాడిని బుజ్జగిస్తూ, లాలిస్తూ పాడే పాటలు లాలి పాటలు. నిద్రపుచ్చడానికి జోకొడుతూ పాడే పాటలు జోల పాటలు. జోలపాటల్నీ, లాలిపాటల్నీ పాడేటప్పుడు చరణము పూర్తికాగానే జో, జో అనీ లేదా లా, లీ అనీ చివరవచ్చె అక్షర శబ్దాల్ని రీ, సా అనే (శంకరాభరణ) స్వరాలతో చేర్చి, లాగి పాడుతారు.

లాలిపాటలవల్ల బిడ్డని నిద్ర జోకొట్టడమంటే ‘స’ యొక్క ప్రశాంతిని బిడ్డకి అందించడమే. దీనికి ఒకటే మార్గము, ‘సా’ అనే స్వరాన్నే జోరుగా, నిరంతంరంగా, నెమ్మదిగా వినిపించడమే. ఈ స్వరం విన్నప్పుడు, బిడ్డల నరాలు, మనసు ప్రశాంతంగా సేద తీరుతాయి. ‘లాలీ’ అనడంలో ‘రీ, సా’ స్వరాలు రెండూ బిడ్డని పదిలంగా నిద్రలోకి జార్చడానికి యత్నిస్తాయి. ఇలాగ నాలుగైదు చరణాలు పాడేసరికి పసిబిడ్డ నరాలు ప్రశాంతమైన ‘సా’ తో మేళవించి నిద్రలో మునుగుతాయి. ‘రీసా’ అనే స్వరాలు ‘జో, జో’ అనే సమానక్షర శబ్దాలతో కంటే ‘లాలీ’ అనే భేదాక్షర శబ్దాల్తో చక్కగా అమరిపోతాయి.

పిల్లల పాటలు జానపద సాహిత్యంలో భాగం. సాధారణంగా ఈ పాటలన్నీ మౌఖిక సంప్రదాయంగా వస్తున్నవే. అయితే సినిమాల్లో ప్రత్యేకంగా పిల్లల పాటలను రాయించిన సంఘటనలు ఉన్నాయి. డాక్టర్ పి నారాయణ రెడ్డి.. వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి ఇలాంటి పాటలు రాసారు.

/ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, జగములూపే ముగ్గురు మూర్తులె, చంటి పాపలు కాగా, మా ఇంట ఊయలలూగా లాలీ లాలీ/

/జో లాలీ జో లాలీ.. లాలీ నా  చిట్టి తల్లి, లాలీ ననుగన్న తల్లి, లాలీ బంగారు తల్లి, లాలీ నా కల్పవల్లి/

/లాలీ లాలీ లాలీ లాలీ, వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి../

సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా, కథా చిత్రీకరణకు అనుకూలంగా మనసును సేద తీర్చే లాలి పాటలు వ్రాశారు..

/హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి../అంటూ తారక రాముడు, చిత్రం కోసం చింతలో నిండి ఉన్న ప్రియురాలి కోసం జోల పాడే సందర్భంలో లాలి పాట వ్రాశారు.

/జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా..

జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కల

వయ్యారి వాలు కళ్ళలోన, వరాల వేండి  పూల వాన, స్వరాలు ఊయలూగు వేళ../ అన్నది ఎంతో ప్రఖ్యాతి పొందిన క్షణక్షణం చిత్రంలోని జోల పాట.

అనాథ అనుకున్న తనకు, తండ్రి ఎవరో తెలిసిపోయినప్పుడు, ఉద్వేగంతో, ప్రేమతో తండ్రి కోసం పాడే మరొక లాలి పాట కూడా తారక రాముడు చిత్రంలోనిది.

/సడి చేయకమ్మ గాలి చల్లంగా పాడమ్మలాలి

నాకన్నా తండ్రి నిద్రించు వేళ నా కళ్ళు నిండి వెలిగేటివేళ../.

/చిన్ని తండ్రి నిను చూడగా వేయి కళ్ళయినా సరిపోవు రా.. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టియన్తో తగిలేను రా../ సిసింద్రీ చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఈ పాట కూడా ఒక సూపర్ హిట్ అయింది.

నిజంగా జోల పాట కాకపోయినా, తన పశ్చాత్తాపాన్ని పలికిస్తూ, కథానాయకుడు బిడ్డను సంబోధించి పాడే మరొక జోల పాట మనకు ఇంద్రుడు – చంద్రుడు చిత్రంలో కనిపిస్తుంది.

/లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నా చేయి../

ఇక ప్రస్తుత పాట విశ్లేషణ లోకి వెళ్దాం.. అయినా అతి సామాన్యమైన.. తేలికైన పదాలతో.. తల్లి మమతను.. ఆర్ద్రతను రంగరించిన ఈ పాటకు, ఏ విశ్లేషణ అవసరం లేదు.. సిరివెన్నెల గారి సాహితీ పటిమను గురించి మాట్లాడుకోవడం తప్ప!

పల్లవి

సిరులొలికించే చిన్నినవ్వులే మణిమాణిక్యాలు.. చీకటి ఎరగని బాబుకన్నులే మలగని దీపాలు

బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు

ఎదగాలి యింతకు యింతై ఈ పసి కూనా

ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా..

మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లూ

కోరస్: జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ ॥సిరులొలికించే॥

9 నెలల తన గర్భంలో మోసిన, తన ఆశలకు ఊపిరి పోసిన చంటి బిడ్డ బోసి నవ్వులలోనే తల్లికి అన్ని అందాలు ఆనందాలు దొరుకుతాయి. తప్పటడుగులు వేసిన రోజు పెద్ద పండుగ అవుతుంది.. బుజ్జి బుజ్జి మాటలు మొదలుపెట్టిన రోజు.. తల్లి ఆనందానికి అవధులు ఉండవు. మిలమిల మెరిసే బిడ్డల కళ్ళలో తల్లికి వెన్నెల దీపాలు కనిపిస్తాయి. లాల పోసినా, మంచి బట్టలు వేసినా, బువ్వ తినిపించినా, మనసు నిండా ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటుంది. ఈ జగాలను ఏలే చక్రవర్తి లాగా బిడ్డలను ఊహించుకుంటుంది. ఒక తల్లి మనోభావాలకు అద్భుతంగా అద్దం పట్టిన, సిరివెన్నెలలోని తల్లి మమకారాన్ని, ఈ పాటలో చూడవచ్చు.

చరణం:

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ

లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ

మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ

ఊరూ-వాడా మెచ్చుకుంటే చూడనీ

కలకాలమూ కనుపాపల్లే కాచుకోనీ

నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

కోరస్ : లాలలలా లలా లలా.. (2)

కోరస్: జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ ॥సిరులొలికించే॥

మాతృత్వపు మాధుర్యాన్ని తను తినిపించే ఆహారంలో, స్పర్శలో, చూపులో, లాలనలో.. అన్నింటిలో చూపిస్తుంది తల్లి. అంత మధురమైన భావాలను ఈ చరణంలో పలికించారు సిరివెన్నెల. తన మురిపమంతా పాల బువ్వలో కలిసిపోవాలట, ఆ ఆహారం తిని బిడ్డ ఆనందంగా ఎదగాలట, తన మనసులోని ఆశలన్నీ తీరేలాగా బిడ్డను పెంచుకోవాలట, తన బిడ్డ ఎంత గొప్పవాడో ఊరు వాడ చెప్పుకోవాలట!.. తల్లిలోని ఆశలన్నిటికీ అక్షర రూపం ఇచ్చారు సిరివెన్నెల. అంతేకాకుండా కలకాలం తను బిడ్డను ఇంటికి రెప్పలా కాచుకుంటానని, మలి వయసులో.. బిడ్డ పంచనా ఆనందంగా సేద తీరుతానని.. మొత్తం తన జీవిత చిత్రాన్ని.. పంచుకుంటుంది తల్లి. ఈ భావాలను ఎంతో మనోహరంగా, అలతి అలతి పదాలతో.. సినీ గీతంగా కూర్చారు ఆయన.

చరణం- బాబు:

వేశా మొదటి అడుగు అమ్మ వేలే వూతగా

నేర్చా మొదటి పలుకు అమ్మపేరే ఆదిగా

నాలో అణువు అణువు ఆలయంగా మారగా

నిత్యం కొలుచుకోనా అమ్మఋణమే తీరగా తోడుండగా నను దీవించే కన్నప్రేమా

కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే॥

ఈ పాట, తరువాతి చరణంలో ఎదిగిన కన్న కొడుకు తల్లి పట్ల చూపించే ఆరాధన భావాన్ని, మమకారాన్ని పండించారు సిరివెన్నెల. అమ్మ వేలు పట్టుకొని నడిచిన తాను, మొదటగా అమ్మపేరే పిలచిన తాను, శరీరంలోని ప్రతి అణువు ఆలయంగా మార్చుకొని, దేవతల కొలువు తీర్చి, అమ్మ రుణం తీర్చుకుంటానని.. తన మనసులోని భావాన్ని వెలిబుచ్చుతాడు. అమ్మ దీవెన ఉన్నంతవరకు ఏకీడు జరగదన్న భరోసా కూడా సిరివెన్నెల కలం మనకు అందిస్తుంది.

“తల్లీబిడ్డల అనుబంధాన్ని మమకారపు మాధుర్యంతో రంగరించి రాసిన ఈ పాట శ్రోతల హృదయాల్ని దోచుకుంది. పసివాడి బుడిబుడి నడకలు, ముద్దు ముద్దు పలుకులు మాతృహృదయాన్నెంతగా పరవశింపజేస్తాయో, ఆమె తన మురిపం పాలబువ్వ కావాలని యెలా ఆశిస్తుందో, తన బిడ్డ నిండునూరేళ్లు జీవించాలని యెలా ఆశీర్వదిస్తుందో.. అన్ని కోణాల నుంచి తేనెచినుకుల వంటి పదాలతో అమ్మమనసు కలిమిని వర్ణించారు కవి. అమ్మ వేలు పట్టుకొని నడిచి యెదిగే పసివాడు ఆమెను దేవతగా కొలిచి తల్లి ఋణం తీర్చుకుంటానని స్పందించడం కూడా మనసుల్ని మీటుతుంది. బాల్యానికి సంబంధించిన కుసుమపేశలమైన పదాలతో కూర్చిన ఈ ఆర్థమైన అనుబంధగీతం యెవరినైనా బాల్య సృతులలోనికి తీసుకొని వెళ్తుంది..” అంటారు డాక్టర్ పైడిపాల ఈ పాట గురించి వివరిస్తూ, సిరివెన్నెల రసవాహిని అనే తన పుస్తకంలో.. సిరివెన్నెల లోని మాతృ ప్రేమకు, వాత్సల్యానికి, అక్షర రూపంలో ఆయన చేసిన గీత ఆవిష్కరణకు శతకోటి వందనాలు!

Images Source: Internet

Exit mobile version