Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 66 – సార్వజనీనమైన సందేశం అందించిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

పరుగులు తీసే వయసుంటే

~

చిత్రం: స్టేషన్ మాష్టారు.

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల, మనో

~

పాట సాహిత్యం

పల్లవి:
అతడు:
పరుగులు తీసే వయసుంటే
ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలుబండి
సరదాల ప్రయాణమండి

చరణం:
అతడు:
ఆపదవుందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరునవ్వుల దీపం వుంటే చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకుపోవాలి చుక్కలున్న మజిలీ చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలిలోనే నిలపాలి
ఆమె: కరెక్టు..
సందేహించక ముందుకుపోతే గెలుపు చిక్కడం ఖాయం
అతడు: డెఫనెట్
ఆమె: దూసుకుపోయే ధైర్యం ఉంటే ఓడక తప్పదు కాలం ॥పరుగులు॥

చరణం:
అతడు: కొండలు కోనలు అడ్డున్నాయని సాగక మానదు సెలయేరు
గలగల పాటల హుషారు ఉంటే అలసట తలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి ఆనందపు లోతులు చూడాలి
ఆమె: కోరిన స్వర్గం చేరిన నాడే మనషికి విలువని చాటాలి
ఆలోచించక అడుగులువేస్తే అడుసు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే తగలక తప్పదు గాయం ॥పరుగులు॥

అనంతమైన కాల ప్రయాణంలో మన జీవిత ప్రయాణం ఎంతో చిన్నదే కానీ ఎంతో విలువైనది.

నూరేళ్ల ఈ జీవితంలో.. ఎన్ని వేల మైళ్ళ ప్రయాణం సాగుతుందో ఎవరికీ తెలియదు! ప్రపంచంలో అన్నిటికన్నా విచిత్రమైనది, ఊహించని మలుపులతో నిండినది, అద్భుతమైనది మనిషి జీవితం. జీవితం పుట్టుకతో మొదలై, మరణంతో ముగుస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణమే జీవితం. ఈ ప్రయాణంలో స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు ఇంకా ఎందరెందరో పాలుపంచుకొంటారు. ప్రయాణించే వేగం, నిర్ణయించుకొన్న గమ్యాలు, పయనించే దారులు, రకరకాల రూపాలలో మార్గదర్శకులు, మార్గంలో ఒడిదొడుకులు, అడ్డంకులు, మలుపులు, అలుపులు, ఆట పాటలు, ఎప్పటికప్పుడు కొత్తగా.. మన ప్రణాళికతో సంబంధం లేకుండా.. సాగిపోయే.. ఈ ప్రయాణాన్ని గురించి ఎంత చెప్పిన తక్కువే! తరచుగా మనకు వినిపించే ఈ మాటకు సాహిత్యంలో చాలా పెద్ద చోటే ఉంది! జీవనయానాన్ని నదీ ప్రయాణంతో కొందరు పోల్చి చెబితే, రైలు ప్రయాణంతో మరికొందరు పోలుస్తూ ప్రపంచంలోని అన్ని సాహిత్యాలలో మనకూ చాలా ఉపమానాలు కనిపిస్తాయి.

“Life is a journey, and if you fall in love with the journey, you will be in love forever.” – అంటారు Peter Hagert.

Focus on the journey, not the destination. Joy is found not in finishing an activity but in doing it, అన్నది Greg Anderson సందేశం.

రావు గోపాలరావు ప్రధాన భూమిక పోషించిన స్టేషన్ మాస్టర్, చిత్రంలోని ‘పరుగులు తీసే వయసుంటే..’ అనే పాటను మనం ఈ రోజు విశ్లేషించుకుంటున్నాం. విభిన్నమైన గమ్యాలతో, భిన్నమైన ప్రణాళికలతో జీవితాన్ని సాగించాలని ప్రయత్నించే ఇద్దరూ యువకుల జీవిత కథనమే ఈ చిత్ర కథాంశం. రామారావు (రాజేంద్ర ప్రసాద్), చైతన్య (రాజశేఖర్) ఈ చిత్రంలో నాయకులుగా నటించగా, పుష్ప (జీవిత రాజశేఖర్), రాణి (అశ్విని) వారి సరసన కథానాయికల పాత్రను పోషించారు. ఈ హీరోలలో రామారావు ఆనందకరమైన జీవితాన్ని ఆకాంక్షించే వారైతే, చైతన్య హద్దులెరుగని స్థాయి జీవితాన్ని కోరుకునే వ్యక్తి. మనం చర్చించబోతున్న ఈ పాట ఆ రెండు జంటలపై, చిత్రీకరించడం జరిగింది.

ఈ పాట ఒక రైల్వే ట్రాక్‌పై, ఇన్‌స్పెక్షన్ ట్రాలీలో రెండు జంటలు పాట పాడుకుంటూ.. కొండ కోనల మధ్య సాగిపోతూ ఉండడాన్ని చిత్రీకరించారు. ఈ నేపథ్యానికి తగినట్టుగా, ఆ ఇద్దరు హీరోల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ, హీరోయిన్ల అభిప్రాయాలని కూడా వ్యక్తపరిచేలా, సిరివెన్నెల గారు ఈ పాటను వ్రాయడం జరిగింది.

పల్లవి:
పరుగులు తీసే వయసుంటే
ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలుబండి
సరదాల ప్రయాణమండి..

“We travel not to escape life, but for life not to escape us,” అంటారు ఒక unknown writer.. కాలంతోపాటు అడుగు వేయగల వయసు, సత్తా మనకు ఉంటే, ఆ గమ్యాన్ని అందుకోవడానికి ఉరకలు వేసే ఉల్లాసం గల మనసు ఉంటే, మన బ్రతుకే పట్టాలపై సాగిపోయే రైలు బండి అవుతుందని.. మన ప్రయాణం కష్టం, నిష్ఠూరం ఎరుగని.. సరదాల ప్రయాణంగా మారుతుందన్న బలమైన statementను పల్లవిగా చేసుకొని సిరివెన్నెల ఈ పాటను ప్రారంభించారు.

జీవితాన్ని రైలు ప్రయాణంతో పోల్చే.. మనందరికీ బాగా గుర్తొచ్చి ఒక famous English poem..

Robert Louis Stevenson, 1885 లో రచించిన.’From a Railway Carriage’.

Faster than fairies, faster than witches, Bridges and houses, hedges and ditches;
And charging along like troops in a battle,
All through the meadows the horses and cattle:

All of the sights of the hill and the plain Fly as thick as driving rain;
And ever again, in the wink of an eye, Painted stations whistle by..

చరణం:
అతడు:
ఆపదవుందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరునవ్వుల దీపం వుంటే చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకుపోవాలి చుక్కలున్న మజిలీ చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలిలోనే నిలపాలి
ఆమె: కరెక్టు..
సందేహించక ముందుకుపోతే గెలుపు చిక్కడం ఖాయం
అతడు: డెఫనెట్
ఆమె: దూసుకుపోయే ధైర్యం ఉంటే ఓడక తప్పదు కాలం ॥పరుగులు॥

Life is either a daring adventure or nothing అంటారు.. హెలెన్ కెల్లర్. ఈ చరణంలో ఇద్దరు హీరోలకు సంబంధించిన philosophy of life ను సిరివెన్నెల పలికించారు. ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం.. అని దూకుడు మనస్తత్వం గల హీరో, చైతన్య ప్రతిపాదిస్తే.. చిరునవ్వుల దీపంతో చిక్కులన్నీ దూరం చేయవచ్చు, అని సమాధానం ఇస్తాడు, ప్రశాంతమైన ఆనందకరమైన జీవితం జీవించాలని కోరుకునే రామారావు.

దిక్కులన్నీ దాటుకుని, చుక్కల మజిలీ చేరుకొని.. సంపదలన్నీ ముంగిలిలోనే నిలపాలన్న హద్దే లేని ఆశయం కలిగిన చైతన్యకు.. సందేహాలన్నీ పక్కకు పెట్టి ముందుకు దూకితే, తప్పకుండా విజయం సాధించవచ్చనీ, దూసుకుపోయే ధైర్యం మన వెన్నంటి ఉంటే, కాలాన్ని కూడా ఓడించగలమనీ.. వత్తాసు పలుకుతుంది, పుష్ప. రెండు రకాల సిద్ధాంతాలను ఆయా కోణాల్లో justify చేస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
అతడు: కొండలు కోనలు అడ్డున్నాయని సాగక మానదు సెలయేరు
గలగల పాటల హుషారు ఉంటే అలసట తలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి ఆనందపు లోతులు చూడాలి
ఆమె: కోరిన స్వర్గం చేరిన నాడే మనషికి విలువని చాటాలి
ఆలోచించక అడుగులువేస్తే అడుసు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే తగలక తప్పదు గాయం ॥పరుగులు॥

ఇక రెండో చరణానికి వచ్చేసరికి, జీవితాన్ని సెలయేటి పరుగులతో పోలుస్తూ పాటని కొనసాగిస్తారు సిరివెన్నెల. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నట్టే, సెలయేటికి కూడా, కొండలు, కోనలు లాంటి ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ, వాటికి వేటికీ బెదరక, చెదరక తన గమ్యాన్ని చేరే దిశగా ప్రయాణిస్తూనే ఉంటుంది సెలయేరు. అలాంటి ప్రయాణం మనం కూడా కొనసాగించాలని చైతన్య ప్రతిపాదిస్తే, ఆడుతూ పాడుతూ జీవితాన్ని కొనసాగిస్తే, ఆ జోరు హుషారు తగ్గదంటాడు రామారావు.

ఇదే భావాన్ని.. తన శైలిలో వ్యక్తపరుస్తున్నారు Linda May Fox.

My life is like a river free flowing, vast and deep She was born one day, just as I was. She rushed in elemental glee from the Womb of the Mountain who birthed her, Her new waters, crystalline with the promise of the future ..
..
Making my way along the stoney trail
As for a while, together we travel,
I wonder at its destination
Whilst I journey to my own!

ఆకాశపు అంచులు అందుకోవాలనీ, ఆనందపు లోతులు చవి చూడాలనీ.. తన బలీయమైన ఆశయాన్ని చైతన్య ప్రతిపాదించగా, కోరుకున్న స్వర్గం చేరినప్పుడు మాత్రమే, మనిషి బ్రతుకు విలువ ఉంటుందని తనకు మద్దతు పలుకుతుంది, పుష్ప.

అయితే ఏ పని చేసినా, సరియైన, ముందస్తు ఆలోచన ఉండాలనీ.. పొరపాటున బురదలో కాలు వేస్తే.. దాన్ని సరిదిద్దుకోవడానికే జీవితం సరిపోతుందని హెచ్చరిస్తూ.. నేల విడిచి సాము చేయొద్దనీ.. అలా చేస్తే గాయం తప్పదనీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది, రామారావు కథానాయక.. రాణి.

కథాపరంగా ఈ నలుగురు పాత్రల దృష్టి కోణాల్ని ఎంతో balanced గా ప్రతిబింబించారు సిరివెన్నెల. కానీ నన్ను అబ్బురపరిచే విషయం ఏంటంటే.. ఈ సినిమా కథ తెలియకపోయినా.. అందులోని పాత్రల స్వరూప స్వభావాలు అర్థం కాకపోయినా.. ఈ పాట నలుగురిపై చిత్రీకరించడం జరిగిందని తెలియకపోయినా.. పాటను సినిమా నుండి పక్కకు తీసి చూస్తే.. యథాతథంగా.. మనకు సిరివెన్నెల మార్క్.. జీవిత పాఠాలు.. ఇందులో కోకొల్లలుగా కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పాట మనకు సంపూర్ణమైన ఒక దృష్టి కోణాన్ని అందిస్తుంది. ఇటు సినిమా నేపథ్యానికి.. అటు సార్వజనీనమైన సందేశానికి, సమన్యాయం చేయగలిగిన ఇలాంటి రచన శైలి.. మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ పాటలో మనకి కనిపించే.. బలమైన inspirational quotes..

  1. ఆపదవుందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం..
  2. చిరుచిరునవ్వుల దీపం వుంటే చిక్కుల చీకటి మటుమాయం..
  3. సందేహించక ముందుకుపోతే గెలుపు చిక్కడం ఖాయం..
  4. దూసుకుపోయే ధైర్యం ఉంటే ఓడక తప్పదు కాలం..
  5. కొండలు కోసలు అడ్డున్నాయని సాగక మానదు సెలయేరు..
  6. కోరిన స్వర్గం చేరిన నాడే మనషికి విలువని చాటాలి..
  7. ఆలోచించక అడుగులువేస్తే అడుసు తొక్కడం ఖాయం.. నేలను విడిచిన సాములు చేస్తే తగలక తప్పదు గాయం..

ఇంత చక్కటి సందేశాత్మక, ప్రేరణాత్మక.. సాహిత్యం అందించడంతోపాటు.. మంచి పలుకుబళ్ళు, ‘అడుసు తొక్కనేల? కాలు కడగనేల?’.. ‘నేల విడిచి సాము చేయకూడదు..’ వంటి చక్కటి తెలుగు జాతీయాలు.. కూడా ప్రయోగించి, మనకు తీయటి తెలుగు ధారను కూడా అందించారు సిరివెన్నెల. ఏ పాట తీసుకున్నా, అది ఏ నేపథ్యానికి వ్రాయబడినదైనా.. మనసుకు హత్తుకునే సందేశం.. జీవితాన్ని నడిపించే ఒక చక్కటి పాఠం.. ప్రతి పాటలోను అందించడం సిరివెన్నెలకే సాధ్యం!!

Images Source: Internet

Exit mobile version