[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ప్రియ రాగాలనే పలికించావులే
~
చిత్రం: కల
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: ధర్మతేజ
గానం : బాలు, చిత్ర
~
పాట సాహిత్యం
పల్లవి:
అతడు : ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే ॥ 2 ॥
మల్లెపువ్వల్లే విచ్చావులే నువ్వు నాకెంతో నచ్చావులే ॥ ప్రియరాగాలనే ॥
ఆమె : ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే
నిండు మనసంతా ఇచ్చావులే
అందుకే నిన్ను మెచ్చానులే ॥ ప్రియరాగాలనే ॥
చరణం:
అతడు : చినుకంత స్నేహం కోరిందని గగనాల మేఘం ఇల చేరదా
ఆమె: ఇన్నాళ్ళ దాహం తీరిందని చిగురాకు ప్రాణం పులకించదా
అతడు : కలల్లోని ఆ స్వర్గం ఇలా చేతికందింది
ఆమె : నిజంలోని ఆనందం మనస్సంతా నిండింది
అతడు: నీకు తోడుండిపొమ్మన్నది
ఆమె : నన్ను నీ వెంట రమ్మన్నది
॥ ప్రియరాగాలనే ॥
చరణం:
ఆమె : బతుకంటే అర్థం చెబుతావని నడిపింది హృదయం నీ దారిని
అతడు : ఈ గాలి పయనం ఎన్నాళ్ళని నీ ప్రేమ బంధం నన్నాపనీ
ఆమె : ఋణం ఏదో మిగిలింది అదే నిన్ను కలిపింది
అతడు : మరీ ఆశ కలిగింది మరో జన్మ అడిగింది
ఆమె : నిన్ను ప్రేమించుకోమన్నది
అతడు: ప్రేమనే పంచుకోమన్నది
॥ ప్రియరాగాలనే ॥
♠
విశ్వమంతా నిండివున్న అనంత శక్తి, ప్రేమ. మనిషిని మనిషిగా గెలిపించే అద్భుత శక్తి, ప్రాణం పోసే మహత్తరశక్తి, ప్రేమ. ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై.. అంటూ ప్రేమ తత్వాన్ని వివరించారు బసవరాజు అప్పారావు గారు.. ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం? ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం? అని ప్రశ్నిస్తూనే ‘శంకరుడైనా కింకరుడైనా లొంగాలి లవ్ ధాటికి’ అని, ప్రేమ గొప్పదనాన్ని ప్రతిపాదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
All thoughts, all passions, all delights,
Whatever stirs this mortal frame,
All are but ministers of Love,
And feed his sacred flame..
అంటూ Love అనే కవితలో అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు Samuel Taylor Coleridge.
ప్రేమ విశ్వజనీయమైనది. మనిషికి ప్రకృతికి కూడా అనుసంధానమైనది ప్రేమే! ఏ బంధమైనా ఒదిగిపోయేది ప్రేమలోనే. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాల నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. ‘ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు అది ఎంతో అవసరం. సమస్త ప్రాణికోటిని ప్రేమించేవారు ఎక్కువ కాలం జీవిస్తారు’ అన్నారు స్వామి వివేకానంద.
అయితే, యువతి యువకుల మధ్య కలిగే పరస్పర ఆకర్షణ, అనురాగం ప్రేమ నిర్వచనంగా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంది. ఇదే భావాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తూ, లెక్కకు మిక్కిలి ప్రేమ గీతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ గీతాలు, యుగళగీతాలు చలనచిత్రాలకు జీవనాడిగా మారిపోయాయి. ముందు తరాల తెలుగు సినీ కవులు అందించిన అనిర్వచనీయమైన ప్రేమ గీతాలు కూడా మన మనసుల్లో శాశ్వత స్థానాన్ని పొంది, ఈనాటికి మనల్ని అలరిస్తూనే ఉన్నాయి.
కానీ, భౌతిక ఆకర్షణలకు.. శరీరం పడే తహతహలకు ప్రేమ అతీతమైందన్న నిర్వచనాలతో, సిరివెన్నెల ఎన్నో ప్రేమ గీతాలు వ్రాశారు. ‘కల’ అనే సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ‘ప్రియరాగాలని పలికించావులే..’ అనే యుగళగీతాన్ని మనము ఈ వారం చర్చిద్దాం.
పల్లవి:
అతడు : ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే ॥ 2 ॥
మల్లెపువ్వల్లే విచ్చావులే నువ్వు నాకెంతో నచ్చావులే ॥ ప్రియరాగాలనే ॥
ఆమె : ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే
నిండు మనసంతా ఇచ్చావులే
అందుకే నిన్ను మెచ్చానులే..
ప్రేమ రాగాలు మనసులో పలికినప్పుడు, ప్రేమ చిగురించినప్పుడు, వసంత మాసపు కోయిలలా గొంతులో ప్రియరాగాలు ఒలుకుతాయి. ప్రియురాలు పలికించిన మధురమైన ప్రేమ స్వరాలు, ఆమె ఒలికించిన సోయగాలు నాయకుడి మనసుకు హత్తుకున్నాయి. ప్రియరాగాలకు.. ప్రాసగా సిరివెన్నెల నయగారాలు, అన్న అందమైన పదాన్ని ప్రయోగించారు,
‘ప్రియమై రమణీయమణీ, మయమై యతిచిత్రమంజుమంజీరములన్,
నయమైన చిలుకపలుకుల, నయగారమునం జెలంగి నయగారమునన్’,
అన్న పద్యాన్ని గుర్తుచేస్తూ.
చిన్నపిల్లలు పసితనంలో పోయేది గారాలు, లేదా ముదిగారాలు (గారాబం). అదే యుక్త వయసులో అయితే, ఒక యువతి ప్రదర్శించే సుకుమారత, లేదా వలపు చేష్టలు ‘నయగారాలు’ అవుతుంది. కాబట్టి ఆమె ప్రదర్శించిన హొయలు, సోయగాలు, మధురమైన మాటలు ప్రియుడ్ని ఆకర్షించాయట. తరువాతి వాక్యంలో, మల్లె పువ్వుల్లే విచ్చావులే, నాకెంతో నచ్చావులే, అంటాడు నాయకుడు. స్వచ్ఛమైన ప్రేమకి, మనసుకి ఉపమానంగా మనం మల్లె పువ్వును వాడడం చూస్తూ ఉంటాం. అంత సహజమైన, భావాలతో హీరోకు కథానాయికపైగల ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు సిరివెన్నెల.
దానికి సమాధానంగా, ‘ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే, నీలి కనుపాపలో నన్ను నిలిపావులే’, అంటుంది హీరోయిన్. హీరో ప్రేమను ఆమె గుర్తించింది అనే భావాన్ని ఈ వాక్యాలు వ్యక్తపరుస్తున్నాయి. మనసులో ఏముందో కళ్ళలో అదే ప్రతిపలిస్తుంది కాబట్టి, నీ మనసులో ఉన్న నన్ను నీ కనుపాపల్లో నిలిపావు, ప్రేమ అనే నా నావకు చుక్కానిగా నీవు నిలిచావు, నీ నిండు ప్రేమను నాకు అందించావు.. నా మనసును గెలిచావు! అని బదులిస్తుంది, కథానాయిక.
చరణం:
అతడు : చినుకంత స్నేహం కోరిందని గగనాల మేఘం ఇల చేరదా
ఆమె : ఇన్నాళ్ళ దాహం తీరిందని చిగురాకు ప్రాణం పులకించదా
అతడు : కలల్లోని ఆ స్వర్గం ఇలా చేతికందింది
ఆమె : నిజంలోని ఆనందం మనస్సంతా నిండింది
అతడు : నీకు తోడుండిపొమ్మన్నది
ఆమె : నన్ను నీ వెంట రమ్మన్నది
సిరివెన్నెల స్టైల్ నిర్వచనం మనకు ఈ చరణంలో ఎంతో గొప్పగా ఆవిష్కరింపబడింది. నిజమైన ప్రేమ కోసం తహతహలాడుతున్న ఇల, గగనాన్ని చినుకంత స్నేహం కోరిందట. ప్రేమను ప్రకృతిలో నిరంతరం కనిపించే గొప్ప స్నేహంలా అభివర్ణించడం ఎంత సముచితంగా ఉందో! ఈ రెండింటి స్నేహాన్ని ఎందరో కవులు ఉపమానాలుగా వాడారు, కానీ, ఆ భూమి అడిగే ‘చినుకంత స్నేహం’, అన్న పదబంధం ఎంత సున్నితమైన భావవ్యక్తీకరణో కదా! ఆ చిరు స్నేహాన్ని అందించడానికి ఎక్కడో గగనాల్లో దాగిన మేఘం, కరిగి, వర్షం రూపంలో ఇలను చేరుతుంది. అప్పుడు పుడమి తల్లికి, అంతకాలంగా ఉన్న దాహం తీరుతుంది. ఇల – గగనాల పవిత్ర సమాగమం జరుగుతుంది. అదే భావాన్ని పలికిస్తూ, Growly Wolfus తన Raindrop అనే poemలో ఇలా అంటారు.
A single raindrop falls from the sky, depressed in its loneliness as it descends.
It lands and drips down a grassy land, alone and forgotten.
అలా, ఆ చినుకు భూమిని చేరడంతో, స్వప్నం లాంటి ఆ స్వర్గం చేతికి అంది వచ్చిందని ప్రియుడు అంటే.. కల నిజమైన వేళ, నిజమైన ఆనందం వెల్లువై మనస్సును అంతా నింపేసిందని, ప్రియురాలు చెబుతుంది. ‘కల, నిజం’ అనే జంట పదాలను వాడుతూ వారి ప్రేమ సఫలమైందని ఋజువు చేస్తున్నారు సిరివెన్నెల. ప్రేమానందాలు నిండిన ఆ క్షణం తనకు తోడుగా ఉండిపొమ్మని ప్రియురాలి మనస్సు కోరుకోగా, నాయకుడి వెంట తనను రమ్మన్నదని, కథానాయకి బదులు పలుకుతుంది. నీకు నేను తోడుగా ఉండిపోనా? అని హీరో అంటే, నేనే నీ వెంట రానా? అని, హీరో హీరోయిన్ల పరస్పర ప్రేమానురాగాలు వ్యక్తపరుస్తున్నారు సిరివెన్నెల. Love is always unconditional కాబట్టి, ఈ ప్రేమలో కూడా ఎటువంటి షరతులు లేవని.. చెప్పకనే చెబుతున్నారాయన.
చరణం:
ఆమె : బతుకంటే అర్థం చెబుతావని నడిపింది హృదయం నీ దారిని
అతడు : ఈ గాలి పయనం ఎన్నాళ్ళని నీ ప్రేమ బంధం నన్నాపనీ
ఆమె : ఋణం ఏదో మిగిలింది అదే నిన్ను కలిపింది
అతడు : మరీ ఆశ కలిగింది మరో జన్మ అడిగింది
ఆమె : నిన్ను ప్రేమించుకోమన్నది
అతడు : ప్రేమనే పంచుకోమన్నది
తమ కలలను అందుకోలేక నిరాశలో ఉన్న వ్యక్తులకు కలలను సాకారం చేసుకునే మార్గాన్ని చూపించడాన్ని వృత్తిగా చేసుకొని, జీవితాన్ని కొనసాగిస్తుంటాడు హీరో. ఆ నేపథ్యంలోనే, అతడు హీరోయిన్ను కలుసుకోవడం తటస్థిస్తుంది. కథాపరమైన నేపథ్యాన్ని మనకు అందిస్తుంది రెండవ చరణం. ‘నా బ్రతుకుకు సరైన అర్థాన్ని వెతుక్కునే దిశగా నా హృదయం నిన్ను ఆశ్రయించింది’, అని హీరోయిన్ అంటే.. ‘గాలివాటుగా కొట్టుకుపోతున్న నా జీవితానికి ఒక ఆలంబనగా నీవు దొరికావు.. నీ ప్రేమ బంధం నన్ను ఒక స్థిరమైన తీరానికి తీసుకు వెళుతుంది’, అన్న ఆశాభావాన్ని నాయకుడు వెలుబుచ్చుతాడు.
నీకు నాకు మధ్య ఏదో జన్మల ఋణానుబంధం ఉంది, ఆ ఋణమే నన్ను నీ దరికి చేర్చి, నిన్ను నన్ను కలిపిందని ప్రియురాలు అన్నప్పుడు, ఉద్వేగ పూరితమైన తన ప్రేమను వ్యక్తపరుస్తూ ‘మరీ ఆశ కలిగింది, మరో జన్మ అడిగింది’ అంటాడు హీరో. ఆ ఆశే నిన్ను ప్రేమించుకోమని చెప్పిందంటాడు ప్రియుడు. ‘ఆ ప్రేమను పంచుకోమంద’ని ప్రియురాలు బదిలిస్తుంది.
ఈ సందర్భంగా నాకు In Every Universe అనే Aren Elvan, poem గుర్తుకు వచ్చింది.
In every world where time takes flight, Where dawns are born in endless night, I search for you through stars unknown, In realms of dream, my heart is sown..
..
In every lifetime, every sphere,
No matter when, no matter where,
I love you still, through all the years,
In every universe, my dear..
అంటూ ప్రేమ, time, space, reality అనే boundaries అన్నింటినీ surpass చేస్తుందనే భావాన్ని, సిరివెన్నెల లాగానే వ్యక్తపరుస్తున్నారు.
ప్రేమకు కొత్త దృష్టాంతాలను ఎన్నుకొని అలౌకికమైన నిర్వచనాన్ని ఇచ్చారు సిరివెన్నెల ఈ పాటలో. ప్రేమకు అన్వయించే సర్వకాలీనమైన ఉదాహరణలను దీనిలో ఎంతో పొందికగా సమకూర్చారు. ప్రేమ గీతాల్లో అంతుచిక్కని, అంతులేని భావాలను అందంగా అక్షరబద్ధం చేశారు. అమృతమయమైన ప్రేమ శాశ్వతత్వాన్ని కూడా సిరివెన్నెల ఈ ప్రేమ గీతం ద్వారా మనకు అందించారు.
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.