Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 79 – దృక్కోణాన్ని సంపూర్తిగా మార్చే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

తెలిసింది కదా నేడు

~

చిత్రం: గౌతమ్ యస్.యస్.సి

సంగీతం: అనూప్ రూబెన్స్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: రంజీత్ & కోరస్

~

పాట సాహిత్యం

పల్లవి:
అతడు: తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుతనం పదును గుణం తెలిసినవాడు ఇక తనను తనే ఎదురుకునే పొగరవుతాడు
॥తెలిసింది కదా ॥

చరణం:
ఆమె: తధిగిణతో
అతడు: అని చిలిపి చిటికె వేద్దాం
ఆమె: కథకళితో
అతడు: మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం పకపకతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంటే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం పీడకలే వేడుకలా మార్చుకోగలం
॥తెలిసింది కదా॥

చరణం:
ఆమె: పరిగెడితే
అతడు: ఎటు అనదు పడుచు ప్రాయం
ఆమె: పనిపడితే
అతడు: మన మనసే మనకు సాయం
పడగొడితే కనపడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం
ఓడాలంతే ప్రతి విజయ
వెనక తరం చదువుకునే కథ మనమవుదాం
॥ తెలిసింది కదా॥

‘లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్
నెవర్ నెవర్ మేక్ ఇట్ సారోఫుల్
ఎక్కడ ఉందో ఏమో నీ మంజిల్
అట్టే ఆలోచించక ఆగే చల్,
ఓరి దేవుడో ఎలాగనీ, ఊరుకోకురో ఉసూరని,
ఆటపాటగా ప్రతీ పనీ, సాధించెయ్ ఏమైనా కానీ..’

అని భుజం తట్టినా..

‘ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి..
ఎన్నడూ కోలుపోవద్దురా ఓరిమి..
…………
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది, నీకె నువ్వు బాసటయ్యితే..’

అంటూ భయాన్ని తరిమేసే అభయంలా, మన ప్రతి శ్వాసలో ఆశని నింపినా..

‘ఒకే ఒక క్షణం చాలుగా.. ప్రతి కల నిజం చేయగా..’ అని సానుకూల దృక్పథాన్ని నూరిపోసినా..

‘అడిలిపోతే అణిచివేసే అశ్వమే కాలము.. ఎగిరి దూఁకే తెగువ ఉంటే వెయ్యి నీ కళ్ళెము!’, అనే ప్రబోధంతో ఉత్సాహాన్ని ఉరకలెత్తించినా.. ఎదుటివారిలో స్ఫూర్తిదాయకమైన శక్తి విస్ఫోటనాన్ని కలిగించగల సిరివెన్నెల కలానికే చెల్లు! బాధల్లో మునిగిపోయి, నిస్తేజంగా మారిపోయిన వాళ్ళకి ప్రేరణనివ్వడానికీ, ఎంత నలిగిపోయినా, చితికిపోయినా, కింద పడిపోయినా.. ఒక ఆశతో.. దృఢ సంకల్పంతో తిరిగి పైకి లేవగలమని నమ్మకాన్ని కలిగించేలా.. దిశా నిర్దేశం చేసే.. చేయగల.. సీతారామశాస్త్రి గారి పాటలు కోకొల్లలు! మనిషితనాన్నీ, ఆశావాహ దృక్పథాన్ని చాటి చెప్పడమే జీవిత పరమార్థమన్నట్టు సాగింది ఆయన ప్రస్థానం. అలాంటి కవివర్యునికి ఒక మోటివేషనల్ సాంగ్ వ్రాయమంటే, అంతకంటే గొప్ప ఆనందం వేరే ఏమైనా ఉంటుందా?

జీవితాన్ని సరదాగా గడిపేస్తూ, అప్రయోజకుడుగా ఉన్న ఒక వ్యక్తి, ప్రయోజకుడుగా ఎలా మారాడన్న నేపథ్యంతో తెరకెక్కిన కథ ‘గౌతమ్ యస్.యస్.సి’. గౌతమ్ (నవదీప్) జిల్లా కలెక్టర్ (నాజర్) మూడో కొడుకు. ఇంట్లో అందరూ ఉన్నత స్థాయి చదువులు చదివి, ఉన్నత స్థాయిలో ఉన్నా డిగ్రీ పాస్ అవ్వడానికి కూడా తంటాలు పడుతుంటాడు గౌతమ్. ఆవారాగా తిరిగే గౌతమ్ అంటే ఇంట్లో తలిదండ్రులతో సహా అందరికీ చిన్న చూపు. పదో తరగతి పాస్ కావడానికే ఎంతో శ్రమపడిన, గౌతమ్‌ని, రెచ్చగొట్టేటట్టుగా, ‘గౌతమ్ యస్.యస్.సి’. అన్న బోర్డును తయారు చేయించి పెడతాడు వాళ్ళ నాన్న. కానీ ఎదురింట్లో ఉన్న భాను (భానుప్రియ), పృథ్వి దంపతులు గౌతమ్ మిత్రబృందాన్ని ఆదరిస్తూ ఉంటారు. తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసే అలవాటున్న గౌతమ్ తనకు తెలియకుండా, తండ్రిని ఒక స్కాంలో ఇరికిస్తాడు. దానితో తండ్రి అతడిని ఇంటి నుంచి గెంటివేస్తాడు. తమ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వచ్చే జానకి (సింధు తులానీ) ఇంట్లో సెటిలవుతాడు గౌతమ్. తనకు వచ్చిన మెకానిక్ పనిచేసుకుంటూ ఐఎఎస్ పరీక్షకు ప్రిపేరవుతాడు. మరో వైపు తన కుటుంబానికి వచ్చిన సమస్యలను తానే పరిష్కరిస్తూ, సివిల్స్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి, తండ్రి ప్రేమను తిరిగి ఎలా చూరగొన్నాడన్నది మిగతా కథ.

థర్డ్ ర్యాంకులో డిగ్రీ ఉత్తీర్ణుడైన గౌతమ్‌ని, తల్లి కూడా ఈసడించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు చులకనగా మాట్లాడతారు. అప్పుడు, భాను దంపతులు ఒక క్లబ్బులో పార్టీ ఏర్పాటు చేసి, congratulations to the winner – అన్న caption తో కేక్‌ని కట్ చేయిస్తారు. ఎంత చిన్న విజయానికైనా తగిన ప్రోత్సాహం ఇస్తే, వారి జీవితం మలుపు తిరుగుతుందని భావం వచ్చేలా, ఆ సందర్భానికి తగినట్లుగా ఈ పాటను సిరివెన్నెల వ్రాయడం జరిగింది.

పల్లవి:
అతడు: తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుతనం పదును గుణం తెలిసినవాడు ఇక తనను తనే ఎదురుకునే పొగరవుతాడు
॥తెలిసింది కదా॥

ఈ పాట చిత్రీకరణలో విభిన్న పాత్రలు కనిపించినా, పాట సాహిత్యాన్ని సంపూర్ణంగా యథాతథంగా చదివినప్పుడు, దాంట్లో మనకి కావలసినంత సారం, స్ఫూర్తి దొరుకుతాయి. బైబిల్లోని పాత నిబంధనలో మనకు David and Goliath అనే స్ఫూర్తిదాయకమైన కథ కనిపిస్తుంది. దాదాపుగా పది అడుగుల, క్రూరమైన గోలియత్ అనే యోధుడితో తలపడి, అతి చిన్న వయస్కుడైన, ఏమాత్రం యుద్ధ అనుభవం లేని డేవిడ్ పోరాడి, తమ రాజ్యానికి గెలుపును సాధించి పెడతాడు. ఆ రాజు అతన్ని యుద్ధానికి వెళ్లకుండా వారించినప్పుడు, ‘I have tasted success several times..’ అంటూ, పులి నోటి నుండి తన గొర్రెలను ఎలా కాపాడుకున్నాడో, తన అనుభవాలను చెప్పి.. అందువల్లే, తనకి పోరాటం అంటే భయం లేదని, తాను గెలుపును సాధించగలనని చెప్తాడు.

అందుకే గెలుపు రుచిని చవి చూసినప్పుడు, ముందు-ముందు గెలుపులను సాధించే ఆత్మ విశ్వాసము మనకు కలుగుతుంది.

ఇలాంటి భావాలనే పలికిస్తూ, పాటను ప్రారంభించారు సిరివెన్నెల. తెలివి లేని మూర్ఖుడే సమస్యలకు తలవొగ్గి ఓటమిని ఒప్పుకుంటాడని ఆయన చురకలు అంటిస్తున్నారు. శరీరంలో యువ రక్తం పొంగుతున్నప్పుడు, ఆ శక్తి యొక్క వాడిని, వేడిని అర్థం చేసుకొని, ‘తనను తనే ఎదురుకునే పొగరవుతాడు’.. అంటారు సిరివెన్నెల. అంటే, తనలోని బలహీనతలను గుర్తించి, తన ఆత్మవిశ్వాసంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాడని, గెలుపు సాధిస్తాడని బలమైన భరోసా ఇస్తున్నారు.

Don’t be distracted by criticism. Remember, the only taste of success some people get is to take a bite out of you. – అంటారు Zig Ziglar.

“If you want to taste the flavour of success, then dare to taste the flavour of failure, crisis and countless stormy times.” పోరాటాలు ఎదురీతలు లేకుండా విజయపు రుచి తెలుసుకోలేమంటారు Itayi Garande.

చరణం:
ఆమె: తధిగిణతో
అతడు: అని చిలిపి చిటికె వేద్దాం
ఆమె: కథకళితో
అతడు: మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం పకపకతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంటే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం పీడకలే వేడుకలా మార్చుకోగలం
॥తెలిసింది కదా॥

సరదాగా సాగే ఒక ఆటలాగా, పాటలాగా, లయబద్ధంగా సాగే ఒక నృత్యం లాగా బ్రతుకుని కొనసాగించాలని అందమైన సందేశం ఇస్తున్నారు సిరివెన్నెల. ఎందుకు బడికి వెళ్తున్నామో అర్థం కాక, ఏం చదువుతున్నామో తెలియక, అయోమయంగనే బడి చదువులను మనం కొనసాగిస్తామన్న సార్వజనీనమైన సత్యాన్ని సత్యాన్ని – తికమకతో బడి చదువు బరువు మోద్దాం.. పకపకతో శృతి కలిపి సులువు చేద్దాం, అనే వాక్యాల్లో చెబుతూ.. హాయిగా మనసారా నవ్వుకుంటూ మన బరువును మోసేద్దాం, అని సలహా ఇస్తున్నారాయన.

ఆ తర్వాతి వాక్యాలు చూస్తే.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి కూడా.. ఏదో ఒకటి సాధిద్దాం అన్న ఆశ పుట్టేలా ఉంటాయి. ఒకవేళ మన దారి గోదారైతే.. దాన్ని ఈదటం తప్ప మనకు మరో మార్గం లేదంటే, ఏం చేయాలి? అని అడిగితే, మనం చినుకంత చిన్న స్వరాలమైనా.. ఉరుమే ఉలికిపడేలా గర్జిస్తూ.. ముందుకు సాగమంటూ.. ఎదురులేని స్ఫూర్తినిస్తున్నారు సిరివెన్నెల.

మనల్ని హడలెత్తించి, వెన్నులో వణుకు పుట్టించే పీడ కలలాగా జీవితం ఉన్నా.. ఆనందకరమైన వేడుకలాగా మార్చుకోవడంలోనే జీవిత సారం ఉందన్నది, ఆయన కలం ఒలికించిన మరో వేద వాక్యం.

చరణం:
ఆమె: పరిగెడితే
అతడు: ఎటు అనదు పడుచు ప్రాయం
ఆమె: పనిపడితే
అతడు: మన మనసే మనకు సాయం
పడగొడితే కనపడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం
ఓడాలంతే ప్రతి విజయం
వెనక తరం చదువుకునే కథ మనమవుదాం

మన గమ్యాన్ని నిర్ణయించుకున్న తరువాత, ఎలా పరిగెట్టినా, ఎటు పరుగెట్టినా మనకు తోడు నిలుస్తుంది ప్రాయం. దాని సత్తా అలాంటిది మరి!

మరి పనిలోకి దిగితే? మన ఆత్మశక్తే మనకు బలం. Where there is a will, there is a way.. అన్నట్టు.. మన మనసే మనకు మిత్రుడు అవుతుంది, సాయపడుతుంది. మనకు కావలసినది సంకల్పబలం మాత్రమే.

ఒకవేళ, మన మనసులో ఎప్పుడైనా ఒక బలహీనతో, ఒక పిరికి ఆలోచన వస్తే, ఆ ‘సమయం’, మనల్ని ఓడించాలని ప్రయత్నిస్తే, ఆ ఓటమి గాయాలే మనల్ని ఆ చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాయన్నది తిరుగులేని సిరివెన్నెల సిద్ధాంతం.

‘కయ్యం కోరిందంటే కాలం..
ఓడాలంతే ప్రతి విజయం’

కాలమే మనతో పందెం వేస్తే? మనతో కయ్యానికి కాలు దువ్వితే? విజయమే ఓడిపోవాలట! ఎంత సాటిలేని ప్రేరణ!

నిరాశకే నిరాశ పుట్టడం, ఓటమే ఓడిపోవడం, విజయం కూడా ఓడిపోవడం! మన దృక్కోణాన్ని సంపూర్తిగా మార్చి బలమైన పాశుపతాస్త్రాలు.

కాలంతో పోటీ పడుతూ, నిరాశను జయిస్తూ, దుడ సంకల్పంతో ముందుకు సాగితే, మనం సృష్టించే చరిత్ర భావితరాలకు బాసటవుతుంది, అనే ముగింపు వాక్యాలు, పాటలోని core concept ని మరోసారి ధ్రువీకరిస్తున్నాయి.

సిరివెన్నెల motivational songs జాబితాలో ఎంతో ఆదరణ పొందవలసిన ఈ పాట అనుకున్నంత popular అవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. సిరివెన్నెల అందించిన ప్రేరణాత్మక, ప్రబోధాత్మక గీతరత్నాలని వీలున్నన్ని దాచుకుని, వాటి నుండి నిత్యం స్ఫూర్తిని పొందుతూ, జీవితాన్ని చూసే దృక్కోణాన్ని సరైన దిశలోకి మార్చుకొని, సిరివెన్నెలను ఆరాధిస్తూ జీవితంలో మన్ముందుకు సాగిపోదాం!

Images Source: Internet

Exit mobile version