Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 83 – పసితనపు ఆనందాలకు పెద్దపీట వేసిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఎన్నో ఎన్నో ఏళ్లుగా

~

చిత్రం: అంకుల్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: ఎస్పీ బాలసుబ్రమణ్యం.

~

పాట సాహిత్యం

పల్లవి:
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా,
అడగాలనుంది ఓ వరం..
ఆడే పాడే పాపగా,
గడపాలనుంది జీవితం!
ఏ దైవం ఇస్తాడో ఆ వరం,
ఏ దీపం చూపేనో ఆ వనం,
వెదికి, వెదికి వేసారినా!

చరణం:
తెలివెందుకు, ౘదువెందుకు, బలిమెందుకు, కలిమెందుకు – పసితనమును కరిగిస్తుంటే!
పాపాయిలుగా పుట్టి, పాపాలుగ మాఱే – పయనం పేరా పెఱగడం అంటే!
తిరిగిరాని ఆ పెన్నిధి,
ఏ సంపదా కొనలేనిది!
చేజాఱిన నా బాల్యమె వస్తానంటే,
ఇన్నాళ్ళుగ నన్నల్లిన దారాన్నిట్టే,
వదిలి తనతో వెళ్ళాలని!
॥ఎన్నో ఎన్నో ఏళ్ళుగా॥

చరణం:
చినుకమ్మకు పడవాటలు,
చిలుకమ్మకు పొడిమాటలు,
నేర్పించే చిన్నారులతో..
చిగురమ్మకు విరిపూతలు,
వెలుఁగమ్మకు తొలిజోతలు,
అనిపించే చిఱునవ్వులతో
ప్రతి క్షణం సంతోషమే!
ప్రతి స్వరం సంగీతమే!
దివిజాబిలి దిగలేదని చిఱుకోపాలా?
తియతియ్యగ ఉంటుంది కన్నీరైనా!
అలకా సొగసే ఆ ప్రాయాన!
॥ఎన్నో ఎన్నో ఏళ్ళుగా॥

‘The child is father of the man;
And I could wish my days to be
Bound each to each by natural piety’

అంటారు William Wordsworth, ‘My Heart Leaps Up’ అనే poemలో.

బాల్యం మీద తనకున్న ప్రేమనంత చూపిస్తూ Intimations of Immortality from Recollections of Early Childhood అనే titleతో Ode, అంటే ఒక స్తుతి గీతాన్ని కూడా వ్రాసుకున్నారు. వర్డ్స్‌వర్త్ మాస్టర్ పీసెస్‌లో ఒకటి, ఈ పద్యం. వర్డ్స్‌వర్త్‌ను అతని జీవితమంతా వెంటాడే బాల్యం, జ్ఞాపకాలు, ప్రకృతి మరియు మానవ ఆత్మ; వీటిలోని కొన్ని ఇతివృత్తాలను ఈ Ode విశ్లేషిస్తుంది. అందుకే ఇది Great Ode అన్న ప్రశంసలు కూడా అందుకుంది. తన చిన్నతనంలో, ప్రపంచమంతా స్వర్గము వంటి అందంతో మెరిసిపోతుండేదని Wordsworth గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు పెద్దయ్యాక ఆ అందం ఎక్కడికి మాయమై పోయిందో అని ఆశ్చర్యపోతాడు. అతను ఆ రకమైన దృష్టిని ఎప్పటికీ తిరిగి పొందలేనప్పటికీ, అతను ఇప్పటికీ దాని జ్ఞాపకాలపై తన విశ్వాసాన్ని పెంచుకోగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు.

ఆ మాటకొస్తే, బాల్య స్మృతులను స్పృశిస్తూ, సాహిత్యం వెలువరించని కవులు ఏ భాషలోనూ ఉండరంటే అతిశయోక్తి కాదు. తీపి జ్ఞాపకాలలోకి తిరిగి వెళ్లాలని.. తరిగిపోని ఊసులలో కరిగిపోవాలని ఆశపడుతూ.. చిన్ననాటి తీపి గుర్తులను కలకాలం మోసేస్తూ.. ఎవరైనా బ్రతుకు గడిపేయగలం. పెరిగి పెద్దయిన తర్వాత, మరి ముఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితానికి విశ్రాంతినిచ్చే, జీవన సంధ్యలో.. వెనక్కి తిరిగి, గత జీవితాన్ని తలపోసుకుంటే.. మధురాతి మధురమయిన స్మృతులన్నీ బాల్యానికి చెందినవే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ బాల్యంలో అనుభవించినవి, ఆ సమయానికి కష్టాలుగా అనిపించినా, తరువాత నెమరువేసినప్పుడు అవన్నీ ముచ్చటలుగా మురిపిస్తాయి. అబ్బా! మళ్లీ ఒక్కసారి చిన్నారిగా మారిపోతే, ఎంత హాయిగా ఉంటుందో కదా! నిష్కల్మషంగా, అమాయకంగా, స్వచ్ఛంగా మళ్లీ అలా ఎప్పుడూ ఉండగలం? అని ప్రతివారికి అనిపిస్తుంది.

Childhood అనే మనసుకు హత్తుకునే కవితలో Markus Natten బాల్యపు జాడల వెతుకులాట మనకు కనిపిస్తుంది. When did my childhood go?.. అంటూ మొదలుపెట్టి, అందమైన ఆ బాల్యం ఎక్కడికి పోయిందనీ, ఎప్పుడు తన నుండి దూరమైందనీ.. అర్థం కాలేదని ఆవేదనను వ్యక్తం చేస్తారు. తాను ఒక individual గా ఎదిగిన తరువాత, ప్రపంచ జ్ఞానం తెలిసిన తర్వాత, మెదడు స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత.. బాల్యం దూరమైపోయింది అని గ్రహించి, చివరిగా కరిగిపోయిన బాల్యాన్ని వెతుక్కుంటూ.. ఈ ముగింపునిస్తారు.

Where did my childhood go?
It went to some forgotten place,
That’s hidden in an infant’s face,
That’s all I know.

తనకు గుర్తురాని ఏదో ప్రదేశానికి బాల్యం తరలిపోయిందని, పసిబిడ్డల అమాయకపు ముఖంలో అది దాక్కుని ఉందన్న విషయం మాత్రమే తనకు తెలుసని అంటారు.. మార్కస్.

‘అంకుల్’ సినిమా ప్రధాన పాత్ర ఏవీఎస్ గారు. అనాథగా పెరగడం వల్ల బాల్య స్మృతులకు, ఆ మధురిమలకు తన జీవితంలో చోటు లేదని వేదన చెందుతూ.. ఆ ఆనందాలను తిరిగి పొందాలని మనసారా కోరుకుంటూ పాడుకొనే పాట ‘ఎన్నో ఎన్నో ఏళ్ళుగా, అడగాలనుంది ఓ వరం..’ ఈ పాట backgroundలో సాగుతుంది.

చిన్న పిల్లలతో కలిసి, ఆడుతూ పాడుతూ, కోల్పోయిన తన బాల్యాన్ని, కొంతైనా అందుకునే ప్రయత్నం చేస్తుంటాడు అంకుల్. సహజంగా పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేసే సిరివెన్నెలగారు, అంకుల్ పాత్రలో లీనమై, చేజారిన ఆ వరం తనకు తిరిగి అందాలని కోరుకుంటూ.. ఆ అనుభూతులకు హత్తుకునే అక్షర రూపం అందించారు. ఆ పాట సాహిత్యాన్ని చర్చిద్దాం.

పల్లవి:
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా,
అడగాలనుంది ఓ వరం..
ఆడే పాడే పాపగా,
గడపాలనుంది జీవితం!
ఏ దైవం ఇస్తాడో ఆ వరం,
ఏ దీపం చూపేనో ఆ వనం,
వెదికి, వెదికి వేసారినా!

భగవంతుడు ప్రత్యక్షమై, మనల్ని ఏదైనా వరం కోరుకోమంటే.. మనలో ఎంత శాతం మంది బాల్యాన్ని తిరిగి పొందే వరాన్ని కోరుకుంటారో ఒకసారి ఊహించండి! అమ్మానాన్నల ప్రేమలతో, హాయినిచ్చే ఆటపాటలతో, చుట్టూ అద్భుతంగా అనిపించే ప్రపంచంతో, భవిష్యత్తు భయమెరుగని గుండె ధైర్యంతో, అబ్బురపరిచే ఆనందంతో.. జీవితాన్ని గడపడం ఎవరికిష్టం ఉండదు? ఇదే భావాన్ని సిరివెన్నెల పల్లవిలో మనకు పలికిస్తున్నారు. ఆ బాల్యపు ఆనందాలను వెతికి వెతికి వేసారిపోయిన అంకుల్ మనోభావాలకు అద్దం పడుతూ, ఆడే పాడే పాపగా, గడపాలనుంది జీవితం, ఏ దైవం ఇస్తాడు ఆ వరం అనీ, ఏ దీపపు కాంతిలో ఆ అందమైన వనాన్ని వెతకాలో తెలియడం లేదని అంకుల్ మనోవేదనను పల్లవిలో పలికిస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
తెలివెందుకు, ౘదువెందుకు, బలిమెందుకు, కలిమెందుకు – పసితనమును కరిగిస్తుంటే!
పాపాయిలుగా పుట్టి, పాపాలుగ మాఱే – పయనం పేరా పెఱగడం అంటే!
తిరిగిరాని ఆ పెన్నిధి,
ఏ సంపదా కొనలేనిది!
చేజాఱిన నా బాల్యమె వస్తానంటే,
ఇన్నాళ్ళుగ నన్నల్లిన దారాన్నిట్టే,
వదిలి తనతో వెళ్ళాలని!
॥ఎన్నో ఎన్నో ఏళ్ళుగా॥

ఎంతో ఇష్టంగా మనం తింటూ, చేతిలో పట్టుకున్న ఐస్ క్రీమ్ క్యాండీ లాగా, మనకు తెలియకుండానే కరిగిపోతూ, ఆ ఐస్ క్రీమ్ పుల్ల మాత్రమే చేతిలో మిగిలినప్పుడు, మనకు కలిగే బాధే, బాల్యం కరిగిపోయింది అని గుర్తించినప్పుడు కూడా కలుగుతుంది. ఈ సందర్భంగా తటపర్తి రాజగోపాలన్ రచించగా, గజల్ శ్రీనివాస్ ఆలపించి, ఎంతో ప్రాచుర్యం పొందిన, ‘నా బాల్యం నాకిచ్చేయ్’ గజల్ గుర్తుకొస్తుంది.

‘ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్ సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చెయ్
అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి ఆదమరచి నిదరోయే.. ఆ సౌఖ్యం నాకిచ్చెయ్

కేరింతలతో కుదిపి బుల్లిబొంతలు తడిపి
ఊయల కొలువులు ఏలే ఆ రాజ్యం నాకిచ్చెయ్
చెత్తను వేసే బుట్ట ఆట సామాను పుట్ట విరిగినవన్నీ నావే.. నా మాన్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలుబందు ముక్తికేలనే మనసా బాల్యంకోసం తపస్సుచెయ్
చూచినవన్నీ కోరుతూ ఏడుస్తుంటే రాజా
అమ్మ పెట్టిన తాయిలం.. ఆ భాగ్యం నాకిచ్చెయ్!’

~

అంత హృద్యమైన గజల్లో పలికిన సున్నితమైన భావం సిరివెన్నెల, చరణంలోని‌ మొదటి రెండు వాక్యాల్లోనే నిక్షిప్తం చేశారు. పసితనాన్ని కరిగించే, చదువు కానీ తెలివితేటలు కానీ, సంపదలు కానీ, తనకు అవసరం లేదని, అవేవీ లేనప్పుడే ఎంతో హాయిగా ఉన్నాననే సార్వజనీనమైన భావనను సిరివెన్నెల ఆ వాక్యాల్లో వెలుబుచ్చారు.

/పాపాయిలుగా పుట్టి, పాపాలుగ మాఱే / పయనం పేరా పెఱగడం అంటే!/ పాపాయి చక్కగా ఎదగాలని ప్రతివారు కోరుకుంటారు. కానీ ఆ ఎదుగుదల ఎలా ఉండాలి- qualitative గానా quantitative గానా? అన్న ఘాటైన ప్రశ్నను ఆయన సంధిస్తున్నారు. స్త్రీలు సమాన హక్కులు కావాలంటే.. మనసారా నవ్వుతూ… సృష్టిలో మీకు మాత్రమే దక్కిన గొప్ప వరం అమ్మదనం.. మీరు పురుషులతో సమానం కావాలంటే, పది మెట్లు కిందికి దిగి రావాలి! అని సమాధానం ఇచ్చిన సిరివెన్నెల గారు, కల్మషం ఎరుగని స్వచ్ఛమైన పాపలుగా పుట్టిన వారు, పాపాల పుట్టలుగా మారే జీవన ప్రమాణం ఎదుగుదల అవుతుందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అర్థం లేని అలాంటి ఎదుగుదల వ్యర్థమని ఆయన భావం. ఏ సంపద అయినా, తిరిగిరాని ఆ పెన్నిధిని సాధించలేదని.. ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు.

ఒక వ్యక్తిగా మనం వ్యక్తీకరించడం మొదలుపెట్టినప్పుడు, స్వతంత్రంగా ఆలోచించినప్పుడు, మన చర్యల ఫలితాలే మనల్ని బందీగా చేసినప్పుడు, మనం పెంచుకున్న బంధాల్లో మనం ఇరుక్కున్నప్పుడు, పసితనపు నీడలు, జాడలు అల్లంత దూరం పారిపోతాయి. అందుకే సిరివెన్నెల అంటారు.

/చేజాఱిన నా బాల్యమె వస్తానంటే,
ఇన్నాళ్ళుగ నన్నల్లిన దారాన్నిట్టే,
వదిలి తనతో వెళ్ళాలని! /

చేజారిపోయిన నా బాల్యం తిరిగి వచ్చే అవకాశం ఉంటే.. నేను అల్లానని భ్రమపడుతూ, నన్ను అల్లుకున్న సంకెళ్ల నుండి స్వేచ్ఛగా బయటపడి.. ఆనందంగా పసితనపు మధురిమలలోకి జారుకోవాలని, సిరివెన్నెల భగవంతుని కోరుకుంటున్నారు.

చిన్నతనంలో చేతిలో దారం పట్టుకుని, గాలిపటాన్ని ఎగరవేసినప్పుడు అది పైపైకి ఎగురుతుంటే, మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. కానీ అత్యాశ అనే దారాన్ని పట్టుకొని, అంతస్తు అనే గాలిపటాన్ని ఎంత దూరం ఎగరవేసినా.. సంతృప్తి కలగనే కలగదు.

ఎన్ని material possessions పోగేసినా సంతృప్తి లేని జీవితం, నిరర్థకమైనది. అందుకే, పసితనపు ఆనందాలకే అందరూ పెద్దపీట వేస్తారు.

చరణం:
చినుకమ్మకు పడవాటలు,
చిలుకమ్మకు పొడిమాటలు,
నేర్పించే చిన్నారులతో..
చిగురమ్మకు విరిపూతలు,
వెలుఁగమ్మకు తొలిజోతలు,
అనిపించే చిఱునవ్వులతో
ప్రతి క్షణం సంతోషమే!
ప్రతి స్వరం సంగీతమే!
దివిజాబిలి దిగలేదని చిఱుకోపాలా?
తియతియ్యగ ఉంటుంది కన్నీరైనా!
అలకా సొగసే ఆ ప్రాయాన!
॥ఎన్నో ఎన్నో ఏళ్ళుగా॥

కథలో భాగంగా, అంకుల్‌కి ఒక చిన్నారి పరిచయం దొరుకుతుంది. ఆ పాపతో ఆడుతూ పాడుతూ, తన జీవితాన్ని వీలైనంత సరదాగా గడుపుతుంటాడు. ఈ రెండవ చరణంలో పసిపిల్లల ఆటపాటలను ఎంతో ముచ్చటగా ప్రస్తావిస్తారు సిరివెన్నెల. చినుకమ్మకు వీరు పడవాటలు నేర్పిస్తారట, వీళ్ళకి వచ్చిన ఆ పొడి మాటలేవో చిలకమ్మకు నేర్పడానికి ప్రయత్నిస్తారట! పేరీ పేరని పెరుగు, వచ్చీరాని మాటలు ఎంతో కమ్మగా ఉంటాయి. వీళ్లు కూడా పెద్ద ఆరిందాల్లాగా చిలుకకి మాటలు నేర్పడానికి ప్రయత్నిస్తారట. స్వచ్ఛంగా, హాయిగా, అందరినీ మురిపించే వీరి నవ్వులు – చిగురమ్మకు మొగ్గలు పూయిస్తాయట, వెలుగమ్మకు పసి మనసులు అందించే తొలి జోతల్లా వుంటాయట! ఏమి ఉపమానాలో కదా! ఆయన expressions ఎప్పుడూ నాకు భావాతీతంగానే అనిపిస్తాయి.

పిల్లలు ఎలా మాట్లాడినా, సంగీతంలానే అనిపిస్తుందట, వారి అలకలు కూడా ముచ్చటగానే ఉంటాయి. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పిలిస్తే, ఆకాశంలోని చందమామ దిగి రాలేదని కూడా వారు అలకలు పోవచ్చు. అమాయకంగా, చిన్న చిన్న వాటికే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే.. దానికి కూడా.. మనం ముసిముసిగా నవ్వుకుంటాం.. అందుకే సిరివెన్నెల తియ్య, తియ్యగా ఉంటుంది కన్నీరైనా! అంటారు. ప్రతిక్షణం వారు ఆనందంలోనే ఓలలాడుతుంటారు; ఎందుకంటే సహజత్వానికి దగ్గరగా ఉన్నది ఏదైనా ప్రకృతి లాగా సచ్చిదానందంగానే ఉంటుంది.

పసితనాలు, బడి క్షణాలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు.. తలుచుకున్నప్పుడు ఎవరైనా nostalgic అయిపోతారు. ఆ nostalgia ఎన్నో సృజనాత్మక కళలకు దారితీస్తుంది. ఆ కళారూపాల్లో అవి అందంగా నిక్షిప్తం అవుతాయి. ఇలాంటి వాటిలో, పాటలు, పద్యాలు, సాహిత్యం వంటివి ప్రతి వారి తలపులకు తలుపుల్లాగా పనిచేస్తూ, అవును నా భావాన్ని కవి చెప్పాడు! చాలా అందంగా చెప్పాడు! మరపురాని విధంగా చెప్పాడు! అని అనిపిస్తూ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి. అలాంటి lyrical miracles సృష్టించడంలో, సిరివెన్నెలది అందెవేసిన చేయి.

Exit mobile version