Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శిశిర పల్లవం!!

[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘శిశిర పల్లవం!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఈ నా శిశిరపు ఏకాంతంలో
నా మానసమందిర ద్వారంలో
అపుడపుడూ సాక్షాత్కారం
నవనవోత్సాహంతో ఓ సుందర రూపం
అడుగిడనా వద్దా అన్న సందేహంలో
అడగనా, వద్దా అనే డోలాయమానంలో!

గంపెడు పేరు, ఇష్టంగా మోస్తున్న కవిని కదూ
నా చూపు నే పేర్చిన నా యశో కారణాలపైనే
ఆ చూపు నే వ్రాసిన కబ్బాల దొంతరల పైనే
దృష్టి, ఆకారం దాల్చని ఆ పదచిత్రాల మీదే
రూపు దిద్దుకుంటున్న ఆ భావవల్లరుల పైనే
క్రీగంట చూసీ, చూడనట్టే నేను
పడమటి రవినే అయినా, నా బింకం నాది!

మొన్నొకసారి హఠాత్తుగ అడిగేసింది
అక్షరాలతో వెన్నెల నింపావు
కానీ నీ వారి కెందుకు చీకటి పంచావని
స్వర్గానికి నిచ్చెన లేశావు
కానీ వారినెందుకు అడుగుకు తోశావని
కల్ల పలుకులు, డొల్ల మాటలేనా నీవని
వ్రాసిన దానికి, నీకూ ఏ సంబంధం లేదా అని!

అవాక్కయ్యాను ఆ సూటిదనానికి
లోనికి రమ్మన్నాను, వణికే గొంతుకతో
ఆసనమిచ్చాను, ఆదరించాను
ఇద్దరమూ మౌనమే వహించాము
నా భ్రమల తెరలు తొలుగుతూ నేను,
నా స్పందనల అంచనాలతో ఆ రూపం!

నా రచనలు, నా ఖ్యాతి, నా గౌరవం, నా సన్మానం
ఇవేగా నా లోకం ఇన్నాళ్ళూ, యిన్నేళ్ళూ
అక్షరాల ప్రేమతో, సజీవాలను మరిచాను
నా వారినే, నా మనుషులనే దూరం ఉంచాను
ఎంతగా నలిగారో, ఈ కర్కశ కళా స్రష్ట గూటిలో
ఎంత సర్దుకుపోయారో నా మెచ్చుకోళ్ళ వేటలో
ఎన్నడు, ఎన్నడూ ఇది మదిలో మెదలలేదే!?
హుమ్మని అంతా ‘నేను’ ఆక్రమిస్తే,
‘మన’, కట్లు తెంచుకుని మరీ పారిపోదూ?!

నిజమే, నే చేసిందేమిటి నా వారికి
చూసి చూసి వెళ్ళిపోయారందరు
నా ఆనందానికి నన్నొదిలేస్తున్నట్లు
అసామాన్యుణ్ణని వెర్రిగ మురిసిపోయాను

లోకానికి పాఠం చెపుతూ,
తానే పరీక్ష తప్పిన ఒజ్జను నేను!

ఈ శిశిరంలో, ఈ శిబిరంలో ఒంటిగ మిగిలాను
ఏవీ ఆ చప్పట్లు, ఆ సన్మానాలు, ఆ కితాబులు
నా భుజాన స్నేహంగా చేయి వేయవేఁ ఒక్కటీ?!
ఒక్క సాంత్వన వాక్యం పలుకవేఁ?!
కవిగ గెలిచానేమో, మనిషిగ ఓడినట్లున్నాను!

ఆ సుందర రూపం నా ‘జ్ఞాపకమే’,
హత్తుకున్నాను
తెలుపు నలుసంత, నలుపు ఎంతో ఇచ్చినందుకు
మన్నించమన్నాను
శిశిరంలో బుద్ధిని పల్లవింప చేసినందుకు
ధన్యవాదాలన్నాను
అక్షరాని కంటే మనిషిని ప్రేమిస్తానిక
ఇది నా హామీ అన్నాను
అవకాశం ఉంటే
మరుజన్మలో కలుద్దామన్నాను
నా లోని మనిషి నపుడు అభినందిస్తావులే
అని నే నవ్వాను!

నా జ్ఞాపకాలబాల మందహాసంతో మాయమైంది,
వచ్చింది వచ్చినట్టే – తళుక్కున మెరుపులా!

Exit mobile version