[సుగుణ అల్లాణి గారు రచించిన ‘శిశిరగీతం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ మనసా..!
నీకిక సమయం లేదు,
జీవితపు పయనంలో-
ఎప్పుడు నీ పాదం ఆగుతుందో,
ఎక్కడ నీ గమనం ముగుస్తుందో,
ఎవరికి తెలుసు?
అయినా ఎన్నాళ్లుండాలని?
నాలుగడుగులు వేయడానికి నడుము సహకరించదు..
నీ పని చేయటానికే
నీకు చేతులు రావు..
ఏదీ స్పష్టంగా కనిపించదు..
ఏమీ వినిపించదు..
నీ పంచేంద్రియాలే నీ మాట వినవు!
నీకెందుకు,
ఈ అకారణ కోపాలు,
అర్థం లేని అలకలు,
దూరం పెంచే చేతలు,
మనుసును విరిచే మాటలు!
తరాలు తరిగిపోతున్నాయి,
అంతరాలు పెరిగి పోతున్నాయి,
అంతరంగాలు మారిపోతున్నాయి,
బాంధవ్యాలు మరుగవుతున్నాయి,
ఆత్మీయతలు అంతరిస్తున్నాయి,
ఇక నీకోసం ఓ మనిషిని వెతుక్కో
ఓ మనసా..!
ఎప్పుడో ఏదో అన్నారనో,
నీకు ద్రోహం చేసారనో,
నిన్ను అవమానించారనో,
నీకు సహాయ పడలేదనో,
నిన్ను అర్థం చేసుకోలేదనో,
ఇప్పుడు సాధింపులెందుకు?
గతమంటేనే మరుపు కదా!
చేసిన తప్పులు –
తెలుసుకునే రోజొకటి ఉంది,
క్షమాగుణంతో చక్కటి నవ్వు నవ్వు
ఆదరించి నీ మమతను పంచు..!
పరిచయమున్న ముఖం కనిపిస్తే-
బీరపువ్వుల్లా నీ కళ్లు విచ్చుకోనివ్వు,
చల్లని గాలి తెమ్మెరలా –
నీ చేతులును చుట్టుకోనివ్వు,
వెన్నుతట్టి నేనున్నానే ధైర్యాన్నివ్వు!
నిన్ను కావాలనుకునే వాళ్లను వెతుకు,
నిన్ను వద్దనుకునే వారిని వదిలేయి,
నిన్ను యిష్టపడే వారిని దగ్గరవు,
అవసరానికి వాడుకునే వారిని గమనించు,
అనవసరంగా నిందవేసే వారికి భయపడకు,
అవమానించడం అనుమానించడం-
లోకసహజమని తెలుసుకో..!
నీడలా నిలువెత్తు స్వార్థం,
పరుగులు పెడుతున్న లోకంలో,
నిస్వార్థ ప్రేమ కై తపించు..!
నీ తపస్సు ఫలించే రోజు –
ఎప్పుడో ఒకప్పుడు
రాక మానదు ఓ.. మనసా..!!
శ్రీమతి అల్లాణి సుగుణ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. అత్తవారిల్లు కూడా హైదరాబాదే! పదవ తరగతి పూర్తవుతూనే పదహారేళ్లకు పెళ్లైతే, ఆ తర్వాత MA B.Ed వరకు చేయగలిగారు.
వారి శ్రీవారు మడుపు శ్రీకృష్ణారావు గారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆర్కిటెక్ట్. చదువు మీద అత్యంత ఆసక్తి, ప్రీతి కలిగిన రచయిత్రి అత్తగారు శ్రీమతి లక్ష్మీబాయి గారు సుగుణగారిని కాలేజీకి పంపి చదివించారు. ఆ ప్రోత్సాహమే ఈనాడు తాను రచయిత్రి/కవయిత్రిగా పరిచయం చేసుకొనే అవకాశం కలిగిందని చెప్పడానికి గర్విస్తారు.
ముప్పై సంవత్సరాలు వివిధ పాఠశాలలలో తెలుగు అధ్యాపకురాలిగా చేసి ప్రస్తుతం మనుమలతో ఆడుకుంటున్న అదృష్టవంతురాలినని అంటారు సుగుణ. ఈ విశ్రాంత జీవనంలో అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ iPad లో కథలు చదువుతూ చిన్న చిన్న కవితలు కథలూ రాస్తూ TV లో సినిమాలు చూస్తూ స్నేహితులను కలుస్తూ కావలిసినంత సంతోషాన్ని పంచుతూ ఆనందపడుతూ కాలం గడుపుతూ ఉంటారు.