[శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారు రచించిన ‘శివస్య కులం’ అనే పుస్తకం సమీక్ష అందిస్తున్నాము.]
మైలవరపు సుధా మోహన్ రచించిన ‘శివస్య కులం’ లాంటి పరిశోధనాత్మకమూ, విశ్లేషణాత్మకమూ అయిన పుస్తకం కులం గురించి తెలుగులో అతి అరుదు అనటం అనృతం కాదు. అతిశయోక్తి కూడా కాదు. పుస్తకం అడుగడుగునా, ప్రతి అక్షరంలో, ప్రతి వాక్యంలో రచయిత నిజాయితీ, దీక్ష, సత్యాన్ని పాఠకులకు చేరువచేయటం ద్వారా సమాజానికి నిజానిజాలు తెలియచెప్పాలన్న తపనలు స్పష్టంగా తెలుస్తూంటాయి. అసత్యాన్ని సత్యంగా భావించి అల్లకల్లోలం సృష్టిస్తూ, సమాజంలో వ్యక్తుల నడుమ కుల విద్వేషాల అడ్డుగోడలు నిర్మించటం పట్ల రచయిత ఆవేశం, ఆవేదనలూ అడుగడుగునా కనిపిస్తూంటుంది.
ఈ పుస్తకం ముందుమాటలోనే రచయిత తన ఉద్దేశాన్నీ, లక్ష్యాన్నీ స్పష్టం చేస్తారు.
‘The progeny of Bharata must realize that, so far, they heard only one side of the story, a side that paints Hinduism in the worst possible light’ అంటూ ‘ఇంతకాలం వేటగాడు తన కథ చెప్పాడని ఇప్పుడు సింహం తన కథ చెప్పాల్సిన అవసరం ఉంద’నీ, ‘Many scholars and great people have already started this journey. I am trying to follow in their footsteps like a child trying to follow his/her father’s steps’ అని స్పష్టం చేస్తారు.
సాధారణంగా విదేశీ పాలనలో గడిపి స్వతంత్రం సాధించిన దేశాలలో ఇది సర్వసాధారణం. ఒక జాతి మరొక జాతిపై ఆధిక్యం సాధించినప్పుడు, తాను గెలచిన జాతిని చులకనగా చూస్తుంది. ఆ జాతి తన చెప్పుచేతల్లో వుండాలనీ, ఆ జాతికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వంటివి వుండకూడదు, వున్నా, అవి తన ఉనికికి భంగం కలిగించే రీతిలో వుండకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అప్పుడే మరో జాతిపై తన ఆధిక్యాన్ని నెరపగలుగుతుంది. అంటే, ఓడిన జాతి తన అసలు రూపును, గుణగణాలను మరచి తనను గెలిచిన జాతి ఆధిక్యాన్ని స్వీకరించి, తనను తాను బానిసగా భావిస్తూ, ఆత్మవిశాస రాహిత్యంతో, ఆత్మన్యూనతా భావంతో విజేతకు ఒదిగివుంటేనే వారిపై ఆధిక్యం సాధ్యం అవుతుందన్నమాట.
ప్రపంచవ్యాప్తంగా, విజేత జాతి, పరాజితుల అస్తిత్వాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టి, వారికి తామివ్వాలనుకున్న నూతన అస్తిత్వాన్నిచ్చి రూపాంతరం చెందించటంలో విజయం సాధించినవారే అధిక కాలం పాలకులలా మనగలగటం చూడవచ్చు. అయితే, ఎంతగా ఏమార్చినా, అస్తిత్వాన్ని రూపుమాపి నూతన గుర్తింపునిచ్చినా, ప్రపంచవ్యాప్తంగా బానిసలుగా అయిన జాతులు ఏదో ఒక రీతిలో తమను తాము పునర్నిర్విచించుకుని, నూతన అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుని స్వతంత్ర పోరాటం చేయటం మానవ సమాజాలన్నిటిలో కనిపిస్తుంది. ఏయే జాతులు తమ అస్తిత్వాన్ని సంపూర్ణంగా కోల్పోయాయో, నూతన అస్తిత్వాన్ని ఏర్పాటుచేసుకోలేకపోయాయో, ఆయా జాతుల నాగరికతలు ప్రపంచంనుంచి అదృశ్యం అయ్యాయి. చరిత్ర పుస్తకాలలో మిగిలాయి. గ్రీకులు, రోమన్ల నుంచి, అరబ్బులు, స్పెయిన్, పోర్చుగల్ ద్వారా ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాల చరిత్రలు ఇందుకు ఉదాహరణలు.
భారతదేశ చరిత్ర ఇతర దేశాల చరిత్రలన్నిటికన్నా భిన్నం.
భారతదేశంపై జరిగినన్ని విదేశీయుల దాడులు బహుశా ప్రపంచంలో ఇతర ఏ నాగరికతపై జరగలేదు. అయితే, భారతీయ నాగరికతలా ప్రపంచంలో ఇతర ఏ నాగరికత కూడా, తనపై దాడులు చేసినవారిని సైతం తన జీవన స్రవంతిలో మిళితం చేసుకుని ముందుకు సాగలేదు. ఇతర నాగరికతలను రూపుమాపిన వారు కూడా భారతదేశంలో ప్రవేశించిన తరువాత ప్రధాన నదిలో మిళితమైపోయే ఉపనదుల్లా ఒదిగిపోయారు. తమ అస్తిత్వాన్నీ, ప్రత్యేకతనూ కోల్పోయారు.
కానీ, ఇస్లామీయులు భారతదేశంలో అధిక భాగాలపై ఆధిక్యాన్ని సాధించినా, ప్రపంచంలోని ఇతర నాగరికతలను రూపుమాపినట్టు భారతీయ నాగరికతను రూపుమాపలేకపోయారు సరికదా, నెమ్మదిగా, గతంలోని అసంఖ్యాకుల్లా, భారతీయ జీవన స్రవంతిలో ఒక భాగమయి అస్తిత్వాన్ని కోల్పోయే స్థితిని ఎదుర్కునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇంతలో బ్రిటీష్ వారు రంగ ప్రవేశం చేశారు. అంటే, ఒక ఎగసిపడే అల తాకిడికి గురై, ఉక్కిరిబిక్కిరయి తేరుకునేలోగా మరో మహా తరంగం వచ్చిపడిందన్నమాట..
ఇస్లామీయులు చంపటమో, మతం మార్చటమో చేసినా, భారతీయుల వ్యక్తిగత, ధార్మిక విషయాల జోలికి వారు పోలేదు. విగ్రహారాధకులు, కాఫిర్లు అని ఈసడించినా ఒక దశలో భారతీయులతో కలసి బ్రతకక తప్పదన్న గ్రహింపు కలిగింది ఇస్లామీయులకు. భారతీయులను సంపూర్ణంగా అణచివేయటం కుదరదని వారు అర్థం చేసుకున్నారు. కానీ, బ్రిటీష్ వారు ఇందుకు భిన్నం.
సంపూర్ణమయిన ఆధిక్యభావనతో, ఇతరులందరినీ తామే ఉద్ధరించాలన్న అచంచలమైన విశ్వాసంతో, భారతీయ సమాజాన్ని నాగరీకం చేయాల్సిన బాధ్యత తమదే అన్న నమ్మకంతో వారు ప్రవర్తించారు. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయటం కష్టమని అర్థం చేసుకుని ఈ సమాజ పటిష్టతకు, ఐక్యతకు కారణమయిన అంశాల ఆయువుపట్టుపై దెబ్బ తీయాలని నిశ్చయించుకున్నారు. ఆ దిశగా భారత దేశ సాంఘిక, ఆర్థిక, ధార్మిక, రాజకీయ చరిత్రను రూపాంతరం చెందించారు. సామాజిక బలహీనతలను, వ్యక్తుల దౌర్బల్యాలనూ, మానవ మనస్తత్వంలోని లోభత్వాన్ని, అభద్రతాభావాలను, ద్వేషాసూయలను ఆధారం చేసుకుని అఖండ వృక్షాన్ని మొదలునుంచి తొలిచివేసే చెదపురుగులా ప్రవర్తించారు. చాప క్రింద నీరులా భారతీయ సమాజంలో ఒకరి వేలితో మరొకరి కన్ను పోడుచుకునేట్టు చేసి, సమాజాన్ని ఆత్మవిహీనం చేసి తమ చెప్పుచేతల్లో వుండే బానిసల్లా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈనాడు మనం అనుభవిస్తున్న అనేక దౌర్బల్యాలకు, వికారాలకు, ద్వేషాలకు, మూర్ఖత్వాలకు, సంకుచితాలకు బీజాలు వెతికితే, ఈ గతంలో లభిస్తాయి.
ఇస్లామీయుల పాలన, ఆపై బ్రిటీషువారి అధికారాలలో ఒదిగివుండటం వల్ల భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నిజానికి బానిసత్వానికి గురయిన ప్రతి సమాజం, ఏదో ఒక దశలో బానిస భావాలను వ్యతిరేకించి, తమను బానిసత్వంలో కట్టివుంచుతున్న వాటన్నిటినీ తృణీకరించి తమ అస్తిత్వాన్ని చాటిచెప్పాలని ప్రయత్నిస్తాయి.
బానిస వాతావరణంలో పుట్టి పెరిగిన అల్బెర్ట్ చినువాలుమోగు అచెబె, తనను మానసిక బానిసత్వంలో ఉంచుతున్నవాటన్నిటిపై తిరుగుబాటు ప్రకటించి, తన పూర్వీకులయిన ఇగ్బో తెగ సంస్కృతి సాంప్రదాయాలను దైవాలను స్వీకరించి తన పేరును సైతం సాంప్రదాయిన పేరుకు మార్చుకుని తన దేశ చరిత్రను తన ప్రజల దృక్కోణంలో రచించాడు. ఇది తమ అస్తిత్వాన్ని నిలుపోకోవాలనుకున్న ప్రతి సమాజంలోనూ జరుగుతుంది. భారతదేశంలోనూ జరిగింది.
అయితే, ఇతర దేశాలకు భిన్నంగా, ఇక్కడ, బానిస మనస్తత్వం ఎంత లోతుగా పాతుకుని పోయిందంటే, మనమూ మనదను మాట చెల్లదని, మనం పనికిరానివారమని, మన గురించి మనకన్నా విదేశీయులకే ఎక్కువ తెలుసని వారు చెప్పినదాన్నే ప్రామాణికంగా తీసుకుని మనదన్న ప్రతిదాన్నీ, చులకన చేస్తూ, పనికిరానిదని తీసిపారేసే వారి మాటలే చెల్లే పరిస్థితులు ఈనాటికీ నెలకొని వున్నాయి. దాంతో మన చరిత్రను, మన సమాజాన్ని, మన దృక్కోణంలో చూసి విశ్లేషించేవారు ఛాందసులయ్యారు. వారిని జాతీయభావాల వారని ఈసడించటం, వారిని హేళన చేయటం, వెక్కిరించి వారు చెప్తున్న విషయాలను సామాన్యులకు చేరనివ్వకపోవటం, ఇంకా మనం పనికిరానివారమనే న్యూనతభావాన్ని మెదళ్ళకెక్కించే వారే పెద్దగొంతుతో ఈనాటికీ వినబడుతూండటం మన సమాజంలో చూడవచ్చు. అయినా సరే, నిజానిజాలు వెల్లడించటం తమ కర్తవ్యంగా భావిస్తూ, ఫలితం కోసం ఎదురుచూడకుండా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించేవారు నిర్వహిస్తూనే వున్నారు. ఎప్పుడెప్పుడు భారతీయత పరాయి ప్రభావానికి గురవుతూన్నా అప్పుడప్పుడు భారతీయతను సజీవంగా నిలిపేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అందుకనే, ఇస్లామ్, క్రిస్టియానిటీల ప్రభావానికి గురయిన నాగరికతలన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోయి చరితలో ఒక వాక్యంలా మిగిలిపోగా, భారతీయ నాగరికత మాత్రం సజీవనది నిరంతరం ప్రవహించేట్టు సజీవంగా నిలుస్తూనే వుంది. భారతీయ నాగరికతను సజీవంగా నిలిపేందుకు భారతీయులు తరతరాలుగా నిరంతరం కొనసాగిస్తూ వస్తున్న ప్రయత్నాలలో భాగంగానే మైలవరపు సుధా మోహన్ రచించిన ‘శివస్య కులం’ పుస్తకాన్ని చూడాల్సి వుంటుంది.
ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకం మొత్తం రెండు భాగాలుగా విభాజితమై వుంది. మొదటి భాగంలో మొత్తం ఎనిమిది అధ్యాయాలలో కులం గురించి కూలంకషమూ, సమగ్రమూ అయిన చర్చ వుంది. రెండవ భాగంలో ద్రావిడియనిజం గురించి ఏడు అధ్యాయలలో లోతయిన చర్చవుంది.
కులం అన్న పదం గురించి ఎవరికీ సరయిన అవగాహన కానీ, ఆలోచన కానీ లేదని కులం అన్న పదానికి ప్రాచీన కాలం నుంచీ వున్న అర్థాలను వివరిస్తూ, ఆ పదానికున్న విస్తృతార్థాన్ని ఉదాహరణలతో, రిఫరెన్సులతో నిరూపిస్తూ, కులం అన్న పదం caste అన్న పదానికి సమానార్థకం కాదని వివరిస్తూ, మూలాల్లోకి వెళ్ళి శోధించి ప్రదర్శిస్తుందీ పుస్తకం మొదటి భాగం ఎనిమిది అధ్యాయాలలో.
కులాన్ని పాశ్చాత్యులు ఎలా పొరబాటుగా అర్థం చేసుకున్నారో, భారతీయుల దృష్టిలో వర్ణం, కులం వంటి పదాలకు చారిత్రికంగా వున్న అవగాహన ఏమిటి అన్నదాన్ని వివరిస్తూ ఏ రకంగా విదేశీపాలకులు ఈ పదాలను, అర్థాలను అపార్ధం చేసుకున్నరో విపులీకరించి, అందువల్ల కలుగుతున్న అనర్థాలను వివరిస్తుంది మొదటి అధ్యాయం.
19th century missionaries in India were apparently selectively blind and unreasonably determined to find faults with Hinduism. In that pursuit, they used anything and everything that suited their convenience. Propagating partial information on caste happened to fit in that category. The objective of the desperate attempt to compare the Hindu Varna and Kula system with the European caste or estate system was not to understand the underlying concepts but to attack oppressive caste system and then attach caste to Hinduism. The key element to remember is that the European version of Indian caste was also heavily leaning on race theory.( పేజీ 29)
ఇది ఈ పుస్తకం మొత్తానికి ఆధారమైన వాదన. ఈ వాదనకు ఋజువులూ, నిరూపణలు అందిస్తూ, కులం భావనకు కారణమయి అంతర్గతంగా ఒదిగివున్న తాంత్రిక సైద్ధాంతిక నేపథ్యాన్ని వివరిస్తూ, కులం, అస్పృశ్యతా భావన వంటి విషయాలను సప్రామాణికంగా నిరూపిస్తారు రచయిత మొదటి నాలుగు అధ్యాయాలలో. అతి గహనము, నిగూఢమయిన కుల భావనను పైపైన చూసి బ్రిటీష్ వారు చేసిన అకాండతాండవాన్ని,శైవం, శాక్తం వల్ల సమాజంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆచార భేదాలు, వర్ణాశ్రమ ధర్మాలను విశ్లేషిస్తూ, అస్పృశ్యతను తొలగించేందుకు తరతరాలుగా జరిగిన ప్రయత్నాలను సోదాహరణంగా వివరిస్తారు రచయిత మిగతా అధ్యాయాలలో. ముఖ్యంగా శక్తి పూజ, ఆచార దురాచారాల నడుమ సంఘర్షణ ఏ రకంగా అస్పృశ్యతకు దారి తీసిందో వివరిస్తూ, ఈ సంఘర్షణలను, సమాజంలో కాలక్రమేణా పలు కారణాలవల్ల కలుగుతున్న మార్పులను విస్మరించి ఏర్పాటు చేసిన ఏ సిధ్ధాంతమయినా అసమగ్రమూ, అసంపూర్ణమూ మాత్రమే కాదు, అనర్థదాయకము కూడా అని రచయిత నిరూపిస్తారు.
అసంపూర్ణమయిన పరిజ్ఞానమూ, అసమగ్రమయిన పరిశోధన, అవగాహనలతో పాశ్చాత్యులు భారతీయ సమాజం గురించి తీర్మానాలు చేసేసి సమాజంలో చిచ్చుపెట్టటం వెనుక కారణాలను రచయిత స్పష్టంగా వివరించారు.
“19th century Europeans of India did not have all the facts before them. The episode on Bhairava sects suggests that the missionaries and the colonial rulers ignored and perhaps also concealed the real reasons for the untouchability. It helped them immensely to do so and enabled the economic loot of Hindus, which it turn, paved the way to conversion” (page 163-64)
ద్రావిడ భావనను యూరోపియన్లు అర్థం చేసుకున్న విధానాన్ని, వారి లక్ష్యాలనూ రెండవ భాగం వివరిస్తుంది.
“the European theories are heavily influenced by their own experiences in various countries such as North and South America.” అని వివరిస్తూ, ఏ రకంగా క్రీస్టియానిటీని స్థానిక మతాల స్థానంలో ప్రత్యామ్నాయంగా అందించి అణచివేయటంవల్ల స్థానికులను సంపూర్ణంగా రూపాంతరమొందించారో వివరిస్తూ, అదే పధ్ధతిని భారతదేశంలోనూ ప్రయోగించారని నిరూపిస్తారు రచయిత వివిధ వాదనలు, ఉదాహరణల ద్వారా. ఆర్య ద్రావిడ విభజనలో భాగంగా ఏ రకంగా గ్రామదేవతల ఆరాధనను దయ్యాలు, భూతాలు, క్షుద్రపూజలతో ముడిపెట్టి , ఏ రకంగా సంస్కృతం బ్రాహ్మణులది అంటే, ఆర్యులది, ఇతర భాషలు అనార్యులవి, అంటే, ద్రావిడులవి అన్న అభిప్రాయాలను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా స్థిరపరచారో వివరిస్తారు రచయిత.
“But none of these Europeans could back their arguments by quoting any textual or scriptural or inscriptional authority or such prominent evidence. The only authority they had was the Christian missionary ruler/colonizer status. Many of their conclusions were mere assumptions based on biases. It appears from their writings that they did not understand Hinduism or Hindu society. They simply abused missionary power backed by colonial power to colonize Hinduism intellectually”( page No. 193)
ఈనాటికీ మేధావులుగా గుర్తింపు పొందే అనేకులు అడ్డదిడ్డంగా, ఆధారాలు, నిరూపణలు లేని విదేశీ రచయితల రచనలను ప్రామాణికంగా తీసుకుని అసంబధ్ధ, విధ్వంసకర, న్యూనతాభావన కారక తీర్మానాలు చేసేయటం కనిపిస్తుంది. ఆధారాలు నిరూపణలు నిలదీసి అడిగితే, ‘ఇది నా నమ్మకం’, ‘నా భావన’ అంటూ కప్పదాట్లు వేయటం, అదీ కుదరకపోతే, బ్రాహ్మణిజం, ఆరెస్సెస్, బీజేపీ, రైట్ వింగ్ అని పడికట్టు పదాల వాడకంతో వాదనను తప్పుదారి పట్టించటం గమనించవచ్చు. ఇలాంటి కుహనా దురర్ధక నిరర్ధక నిరాధార వాదనలు చేసేవారే మేధావులుగా గుర్తింపు పొంది సన్మానాలు పొందటం, వేదికలెక్కి మాట్లాడిందల్లా ప్రామాణికంగా పరిగణించటం అర్థం చేసుకుంటే రచయిత వాదనలోని సత్యం బోధపడుతుంది.
భారతదేశంలో సామాజిక సంస్కరణల పేరిట సంభవించినవన్నీ భారతీయులను అనాగరికులుగా చిత్రించి వారిని తామే సంస్కరిస్తున్నామన్న ఆధిక్య భావనను స్థిరపరచటం ద్వారా, భారతీయ సమాజాన్ని న్యూనతాభావానికి గురిచేసి తమకు విధేయులుగా చేసుకోవటంలో భాగమే అంటారు రచయిత. సతి నిషేధం ద్వారా, భారతీయ మహిళలపట్ల తమ సానుభూతిని చాటుకున్న బ్రిటీష్ వారు భారతీయ మహిళలను లైంగిక బానిసలుగా, ఎలాంటి గౌరవం లేకుండా వాడుకున్న విధానాలను ఎత్తి చూపించి మరీ సంస్కరణల్లో నిజాయితీని ప్రశ్నిస్తారు రచయిత.
“Missionaries did an extensive propaganda to justify their presence in India, on the other hand colonial atrocities on Indian women were either denied, ignored or downplayed.” (page No. 200)
ఈ పుస్తకంలో భూతవిద్య, తంత్ర, గ్రామ దేవతపూజ వంటి విషయాల గురించి ఎంతో లోతుగా చర్చ వుంది. ఎన్నెన్నో ఆలోచనలు కలిగిస్తూ, ఆశ్చర్యకరమైన సత్యాలను ఆవిష్కరిస్తాయి ఈ అధ్యాయాలు. ఈ అంశాలకు సంబంధించి రచయిత ఎంతో లోతయిన పరిశోధన అధ్యయనాలు చేశారన్నది ఈ అధ్యాయాలు చదువుతూంటే స్పష్టమవుతుంది. భారతీయాత్మ గురించి తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేయాల్సినట్టే, భారతీయ సామాజిక మనస్తత్వాన్ని, సామాజిక పరిణామక్రమాన్ని గురించి అవగాహన సాధించాలంటే, నాలుగు విదేశీ పుస్తకాలు చదివితే సరిపోదు. శైవం, వైశ్ణవం, తంత్రం, పలు విభిన్నమయిన ఆచారాలు, వీరగల్లులు, గ్రామదేవతారాధనలు, భూత పూజలు, ఇతర పద్ధతులు, కాళీపూజ, మాతృభావనలతో సహా అనేకానేక అంశాలను సూక్ష్మంగా, లోతుగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఈ పరిజ్ఞానానికి వేదాలు, ఉపనిషత్తులు పురాణాలకూ నడుమ అన్వయం సాధించాల్సివుంటుంది. అప్పుడే భారతీయ సామాజిక పరిణామక్రమం గురించి అణువంతయినా ఆలోచించే అర్హత కలుగుతుంది. అలాకాక, నోటికెంతొస్తే అంత, మెదడుకేది తోస్తే అదే పరమసత్యం అన్నట్టు ప్రకటించి పదిమందినీ కూడగట్టుకుని అదే నిజమని అరచి గోల చేస్తే తామున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులు కూడా వీరిని చూసి సిగ్గుపడతారు. అందుకే, ఎంతో పరిశోధనచేసి, నిరూపణలతో తన వాదాన్ని, ఆలోచనలను అందించిన ‘శివస్య కులం’ రచయితను మనస్ఫూర్తిగా అభినందించాల్సి వుంటుంది.
ఈ నిజం గ్రహించేవారికి మనసుంది. లేనివారికి నాలిక వుండనే వుంది.
అయితే, ఈ పుస్తకం సామాన్య పాఠకుడు చదివి ఆనందించటం కొంచం కష్టం. తాను తెలుసుకొన్న విషయాలనన్నిటినీ పుస్తకంలో పొందుపరచి పాఠకుడిని ఒప్పించాలన్న తపనతో రచయిత ఎంతో సమాచారాన్ని అందించారు. అయితే, ఒక వాదన ఆరంభించి, ఉదాహరణలిస్తూ, మరో వైపు మళ్ళి, మళ్ళీ ఈ వైపు రాకపోవటంతో, అనేక సందర్భాలలో రచయిత చెప్పే విషయాలు గొప్పగా అనిపిస్తున్నా పాఠకుడిలో అయోమయం మిగిలిపోతుంది. ఈ పుస్తకంలో ఒక రీసెర్చ్ పేపర్‌లా, విపరీతంగా ఫుట్ నోటులు, రిఫరెన్సులూ అందించటం వల్ల పుస్తకాన్ని చదవటం కష్టమవుతుంది. అందువల్ల, ఈ పుస్తకం సామాన్య పాఠకుడిని చేరక కొందరికి మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం వుంది. రచయిత టార్గెట్ పాఠకులెవరో స్పష్టంగా నిశ్చయించుకోవాల్సి వుంది. ఎందుకంటే, మేధావులమెదళ్ళన్నీ తాళాలుపడ్డ మెదళ్ళు. వారి మెదళ్ళ ద్వారాలు తెరచుకోవు. తెరచిన మెదళ్ళతో ఆలోచనలను ఆహ్వానించేది సామాన్యుడే.
ఈ పుస్తకంలోని అంశాలనే మరింత సరళతరం చేసి, సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందించటం ఆవశ్యకమయిన విషయం. ఎందుకంటే, మన ధర్మం గురించి, ధర్మంపై జరుగుతున్న దాడి, దుర్వ్యాఖ్యానాల గురించి సామాన్యుడికి అవగాహన కలిగించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతో వుంది. సామాన్యుడిని నమ్మించి, తన స్వీయధర్మంపై వైముఖ్యాన్ని కలిగించి పరధర్మానికి ఆకర్షించటం అధికంగా సాగుతోంది. కాబట్టి, ఈ పుస్తకంలోని అంశాలు సామాన్యుడిని చేరాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. అలాగే, ఈ పుస్తకాన్ని తెలుగులోనూ, యథాతథంగా కాక సరళీకృతం చేసి అందించాల్సిన అవసరమూ వుంది.
***
Author: Mylavarapu VNL Sudha Mohan
Publisher: Samvit Prakashan
Pages: 342
Price: ₹ 599
For copies:
Ajeyam Strategy & Marketing Pvt. Ltd.
91-8248281150.
https://www.amazon.in/Sivasya-Kulam/dp/819504865X
~
శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ లింక్:
https://sanchika.com/special-interview-with-mr-mvln-sudhamohan/