[శ్రీమతి షేక్ కాశింబి గారు రచించిన ‘స్మరణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రద్దీ రహదారి.. నిర్జనమైన అడవి దారి
ప్రదేశమేదైనా.. నిలదీసేవారు లేరనే
పేరుకున్న అహం.. ఒంటిని ఉసిగొలుపుతుంటే..
బుడిబుడి నడకల బుజ్జాయి.. స్కూలు కెళ్లే అమ్మాయి
నరాల్లో పారే మాదకత.. ఎదుటి వారి దుర్బలత
వెరసి తెంపరిదనమై.. ధీమా నెగదోస్తుంటే..
బుద్ధి మాంద్యపు దివ్యాంగురాలో.. కదల్లేని వృద్ధురాలో
వేడి చల్లార్చుకోడానికో,. ఆడ శరీరమన్న
కక్కుర్తి కుడితిలో బడి.. కొట్టుకుంటుంటే..
కరగని నిర్దయ.. కరడుగట్టిన వాంఛా మాయ
ఆడవాళ్ళున్నది అనుభవించడానికన్న.. తరాల అభిజాత్యంతో
మర్యాద మరిచి.. వారి మాన ప్రాణాలను హరిస్తుంటే..
అదిరేటి గుండెల్లో మోగే గంటలు.. వేగవంతమైన మనోస్పందనలు
తరగని ప్రశ్నలు తూటాల్ని పేలుస్తున్నాయి.. స్త్రీజాతి భవిష్యత్తేమిటని
తన్నుకొస్తున్న కన్నీళ్లు నిప్పులయి నిలేస్తున్నాయి.. దేశమెందుకింత దిగజారిందని?
గౌతముని త్యాగం.. గాంధీ చూపిన శాంతం
చిత్త చాంచల్యపు మంటల్లో.. కాలిపోయాయా?
బరితెగింపు గాలి వాలుకు.. కొట్టుకుపోయాయా?
రక్షణ కల్పించే శౌర్య ధనులు.. శరణునిచ్చే కరుణామయులు
ఉదాసీనతా ఉక్కు సంకెళ్లలో.. బందీలయ్యారా?
స్తబ్ధతా నేల మాళిగలో.. చిక్కుకు పోయారా?
హింస, కాఠిన్యాల వైపు మొగ్గుతున్న.. నేటితరాన్ని నియంత్రించాలంటే
విచక్షణని నిదురబుచ్చే.. మత్తుమందుల సేవనాన్ని నిరోధించాలంటే
ప్రబలుతున్న హత్యాచార విష సంస్కృతిని.. సమూలంగా పేకలించాలంటే..
చల్లని నవ్వుల చెల్లిని.. అమ్మలోని సగం అనురాగం పంచే అక్కని
నీడలా వెన్నంటి ఆప్యాయాతనే.. అన్నంగా తినిపించే ప్రేమమయి అమ్మని
మనసారా స్మరించుకుని.. అనర్థపు ఆలోచనలపై అదుపు సంపాదించండి!
