Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్మార్ట్ ఫోన్ – మమ్మల్ని బ్రతకనీ

[ఆధునిక ప్రపంచాన్ని ఏలుతున్న‘స్మార్ట్ ఫోన్’ ప్రయోజనాలు ఎన్నున్నా మనం పోగొట్టుకొంటున్నవి కూడ చాల ఎక్కువే. ఆ దృక్కోణంలో మనసులోని ఉదయించిన ఓ భావనని కవితగా అందిస్తున్నారు శ్రీ కరణం నారాయణ స్వామి పిళ్లై.]

చేతిలో ఫోనే లోకమైపోయే
కన్నవాళ్ళు పిలిచినా వినబడకపోయే!
పుస్తకం చదివితే నిదరొస్తదాయే
రాత్రి రీల్స్ చూస్తే కళ్ళు మెరిసిపోతవాయే!
పలకరింపులే కలవరింపులాయే
స్టేటస్, మెసేజీలే అలవాటైపోయే!
పెళ్ళాం పిల్లలతో మాటలే భారమైపోయే
గ్రూపుల్లో పోజులివ్వడం ఎక్కువై పోయే!
బుర్రలేమో బూజుపట్టుకుపోయే
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కే దాసోహమాయే!
కన్నతల్లి ముఖమైనా చూడకపోయే
కన్నబంధమే కనుమరుగైపోయే!
స్పెల్లింగులేమో రాకపోయే
ఆటో కరెక్టుకే అంగీకారమాయే!
రోడ్డుమీద ఆక్సిడెంట్లే ఎక్కువైపోయే
సాయంచేసే చేతులే కరువైపోయే!
ఆటపాటలన్నీ మాయమైపోయే
స్క్రీన్ల ముందు బాల్యమే కరిగిపోయే!
కంటికేమో నిద్ర లేకుండాపోయే
కళ్ళద్దాలే మనకు దర్శనమాయే!
డాక్టర్ల దగ్గర ఓపికలే కరువైపోయే
గూగుల్, యూట్యూబ్‌ల విషయమే నిజమైపోయే!
చిన్న విషయానికైనా గూగుల్‌కు మ్రొక్కులాయే
టెక్నాలజీకే మెదడు బానిసైపోయే!
చార్జ్ంగు తగ్గితే గుండె ఆగిపోయే
ఫోన్ క్రింద పడితే ప్రాణమే పైకిపోయే!
టెక్నాలజీ ఎంతో ఎత్తుకెదిగి పోయే
మనుష్యుల మధ్య గోడలే నిర్మితమాయే!
~
“ఓ స్మార్ట్ ఫోన్ – మాయాజాలంతో ఆపు
నీ వికటాట్టహాస్యమైన విశ్వరూపం
మమ్మల్ని మనుష్యులుగా బ్రతుకనీ”

Exit mobile version