Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనుభవాలను అక్షరాలుగా మలిచిన కవితా సంపుటి ‘స్నేహ గానం’

[డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి గారి ‘స్నేహ గానం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు నరేంద్ర సందినేని.]

డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి గారి తొలి కవితా సంపుటి ‘స్నేహ గానం’. కవయిత్రికి మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు బోధించిన అనుభవం ఉంది. విస్తృత అధ్యయనం ఉంది. ఇది కవయిత్రి తొలి కవితా సంపుటికి ఎంతగానో ఉపయోగపడ్డది. రామలక్ష్మికి అనుభవాలను అక్షరాలుగా మలిచే విద్య ఉంది. కవితా రచనలో ఒక్కో రచయితకు ఒక్కో శైలి ఉంటుంది. రామలక్ష్మిది భిన్నమైన శైలి. రామలక్ష్మి కవితలు సహజంగా ఉన్నాయి. సులభంగా చదవచ్చు. తెలంగాణ మాండలికంలో కొన్ని కవితలు రాశారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఎక్కువ కవితలు రాశారు. తెలంగాణ ఉద్యమం గురించి కవితలు ఎక్కువగా ఉన్నాయి.

~

“రామ లక్ష్మి కవిత్వం చాలా సాదా సీదాగా, చిన్న చిన్న వాక్యాలతో చదివే వారికి వెంటనే అర్థమయ్యేలా ఉంటుంది. ప్రయోగాల పేరుతో సామాన్య పాఠకులకు అర్థం కాని కవిత్వం రాయటం ఆమె తత్వం కాదు. చదవగానే ఆకట్టుకునే కవిత్వాన్ని రామలక్ష్మి రాసింది. మంచి భవిష్యత్తు ఉన్న కవయిత్రి కొమర్రాజు రామలక్ష్మి. ఆమె ఇలాగే సామాజిక ప్రయోజనం కలిగే కవితల్ని రాయాలని కోరుకుంటూ ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అన్నారు అంపశయ్య నవీన్ తమ ముందుమాటలో.

~

“కవి రాసేదంతా కవిత్వం కావడం అరుదు. కవిత మొత్తంలో ఎక్కడో కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు కవిత్వమై పలకరిస్తాయి. చాలా సార్లు కవితా రచనకు కవులు కవితా కర్మాగారం ఏర్పర్చుకుని కార్మిక కర్షకులై చెమటోడ్చాల్సి ఉంటుంది. స్నేహపూర్వకమైన సూచనలను రామలక్ష్మీ పాటిస్తూ మునుముందు కవిత్వ సేద్యం చేయాలని ఆశిస్తున్నాను” అన్నారు అనిశెట్టి రజిత తమ ముందుమాటలో.

~

‘అనుభూతి’ కవితలో అల్లిబిల్లిగా అల్లుకుంటున్న ఆలోచనల హోరు/మనసు నిండా ముసురుకుంటున్న ఊహల జోరు/విచ్చుకుంటున్న భావాలు/ముభావంగా ఎలా ఉండగలను/అందుకే/ ఆలోచనలకు అక్షర రూపమిచ్చి/ఊహలకు ఊపిరి పోసి/కవిగా మారి కవితలల్లాను/అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యాను అని తన మనసులో కలిగే అనుభూతులను పంచుకున్న తీరు చక్కగా ఉంది.

‘నేస్తమంటే..’ కవితలో ఒక్క ఆత్మీయ పలకరింత/హాయి నిచ్చే చిరునవ్వు/ బాధ తీర్చే/ ఒక్క ఓదార్పు మాటతో/ అన్నింటిని పంచుకునే/ మనసున్న/ ఒక్క నేస్తముంటే చాలు/ జీవితం వసంత గీతం కాదా! అని నేస్తం యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.

‘ప్రజాస్వామ్యం!’ కవితలో ప్రజాస్వామ్యం ముసుగులో/అసమస్వామ్యం రాజ్యమేలుతున్నది/ బలవంతుడు బలహీనుడిని/ధనవంతుడు ధనహీనుడిని/పీడించే భావజాలం కొనసాగుతూనే ఉన్నది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత పాలింపబడే రాజ్యం అంటారు.ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరు సమానమే అంటారు. ప్రజాస్వామ్య దేశం అని పేరుపొందిన భారతదేశంలో పేదలు, ధనికుల మధ్య అంతు లేని అగాధం కొనసాగుతుంది. సామ్యవాదం ఒక నినాదమేనా అని ప్రశ్నిస్తు ప్రజాస్వామ్యంలో విలువలు లుప్తమయ్యాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘స్నేహం’ కవితలో స్నేహంలో../ఉండకూడనిది అసూయ/చెయ్యకూడనిది మోసం/ఉండాల్సింది నమ్మకం/చెయ్యాల్సింది సహవాసం/అసూయ అపోహలు ఉంటే/అది స్నేహమెలా అవుతుంది/ శత్రుత్వ సంబంధమే గాని/ అని స్నేహంలో అసూయ, మోసం అనే  పదాలకు తావే ఉండకూడదని, అలా ఉంటే స్నేహం కాదు, అది శత్రుత్వం అనే భావన చక్కగా ఉంది.

‘కాలం’ కవితలో కాలం అనుకూలమైతే/ఆనందం స్వంతమవుతుంది/రేపటి గురించి/ఆశను చిగురింపజేస్తుంది/ కాలం ప్రతికూలమైతే/ కన్నీళ్ళకూ కారణమవుతుంది/ భావి జీవితం పట్ల/భయాన్నీ కలిగిస్తుంది/ కాలం కష్టాలలో ఉన్న వ్యక్తికి తోడై నడిపిస్తుంది! అని చెప్పిన తీరు బాగుంది.

‘చెలిమి’ కవితలో అప్పుడెప్పుడో/మా ఇంటి ముందు/నేను నాటిన గులాబీ మొక్క/ఇప్పుడు ఏపుగా ఎదిగి/ గుబురుగా పెరిగి/నిండుగా మొగ్గలేసింది/నా చేయి తాకితే పులకిస్తూ/అందమైన పువ్వులను నాకందిస్తూ/ఆహ్లాదంగా నవ్వుతూ/స్నేహ గానం చేస్తుందని అన్నారు. ప్రకృతిని మనం  ప్రేమించాలి, ప్రకృతిలో భాగమైన పూల చెట్లతో చెలిమి చెయ్యాలి అని కవయిత్రి చెప్పిన తీరు బాగుంది.

‘జీతం – జీవితం’ కవితలో ప్రతి నెల వచ్చేదే అయినా/ఎప్పటికప్పుడు నీకోసం/మా నిరీక్షణ/అదనంగా తాయిలమేదైనా/తెస్తావేమోనన్న ఆశ అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరినాయి. ధరలను నేల మీదికి దించడం సాధ్యం కాదు. సామాన్యులైన ఉద్యోగుల జీతాలు ఎదుగు బొదుగు లేక గొర్రె తోక బెత్తెడులాగా అలానే ఉంటున్నాయి. ప్రభుత్వం అప్పుడప్పుడు డి.ఏ.ప్రకటిస్తుంది. పెరిగిన ధరలకు ప్రభుత్వం ప్రకటించిన డి.ఏ. ఏ మూలకు సరిపోతుంది? సగటు మనిషి జీతంతోనే జీవితం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘అమ్మంటే’ కవితలో బతుకు బడిలో/ఓనమాలు దిద్దించేది/అనుభవాల్లోంచి/జీవిత పాఠాలను నేర్పించేది/ ఆత్మీయానుభూతులను/ అందించేది/ అనురాగామృతాన్ని కురిపించేది/ అంటున్నారు. అమ్మలేని జీవితం లేదు. అమ్మను దైవంగా పూజించే సంస్కారం మనది. అమ్మ గురించి చెప్పిన భావాల్లో ఎంతో అనురాగం వ్యక్తమవుతున్నది.

‘ప్రియనేస్తం’ కవితలో అనేకానేక/ భావ వీచికలతో/నా హృదయాన్ని స్పృశించి/మనసును పరవశింపజేసే/ పుస్తకం నా ప్రియ నేస్తం అంటున్నారు. చినిగిన చొక్కా నైనా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని ఓ మహనీయుడు అన్నారు. పుస్తకం వ్యక్తి వికాసానికి దోహదం చేస్తుంది. పుస్తకాలు చదివి ఎందరో మహానుభావులు తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. పుస్తకాన్ని ప్రియనేస్తంగా భావిస్తూ కవితలో కవయిత్రి వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.

‘చిరు దివ్వెనై..’ కవితలో చీకట్లను పారద్రోలే/చిరుదివ్వెనై వెలుగునిస్తూ/సమరం కాదు సామరస్యమే సదా/అనుసరణీయమని నినదిస్తూ/కల్మషాలను కడిగేయాలనుంది/శాంతి విత్తనాలను నాటాలనుంది/మార్పును మతాబులా వెలిగించాలనుంది అన్నారు. అంధకారం అలుముకున్నప్పుడు చిన్న దీపం వెలిగిస్తే ఆ కాంతి వల్ల పరిసరాలు కనిపిస్తాయి. ఇవ్వాళ సమాజంలో ఎక్కడ చూసినా సంక్షోభం నెలకొంది. సమరం వద్దు. సామరస్యం కావాలి. మనుషుల మనసుల్లో నెలకొన్న కల్మషాలను తుడిచి శాంతి విత్తనాలు నాటి మార్పును మతాబులా వెలిగించాలని ఉంది అంటూ కవయిత్రి కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.

‘నిరసన’ కవితలో అసమానతలు, లింగ వివక్ష, కుల వివక్షల అంతరాలు తరాలు మారుతున్నా కొనసాగుతున్నాయి. స్త్రీలను అనునిత్యం అవమానిస్తూ అడుగడుగునా అత్యాచారాలతో వారి  జీవించే హక్కును హరిస్తున్న పురుషుల దౌర్జన్యాలపై, సమాజంలో ఆనాదిగా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయాలపై కవయిత్రి నిరసన వ్యక్తం చేయడం చక్కగా ఉంది.

చదువు ‘కొనడానికి’ కవితలో తండ్రి నెత్తి మీద ట్రంకు పెట్టె/తల్లి చేతుల్లో బరువైన సంచులు/కొడుకు భుజాన పుస్తకాల బస్తా../కూలీనాలీ చేసి/కూడబెట్టింది చాలక/అప్పు చేసి సమకూర్చుకున్న/ నోట్ల కట్టలతో/ఇంతకూ ఆ కష్టజీవుల/ ప్రయాణం ఎటు?/ కార్పోరేట్ కళాశాలలో/ అబ్బాయిని చేర్చడానికి/చదువును ‘కొనడానికి’.. అంటున్నారు. పురాతన కాలంలో చదువును ఉచితంగా బోధించే వారు. ఇవ్వాళ చదువు అంగట్లో సరుకు అయిపోయింది. విద్య, వైద్యం ఉచితంగా అందించాలి అని రాజ్యాంగంలో రాసి ఉంది. కానీ రాజ్యాంగంలోని రాతలు అమలు కావడం లేదు. ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేసింది. కార్పొరేట్ కళాశాలలు లాభాల బాటను నడుస్తున్నాయి.

‘శ్రమశక్తి’ కవితలో కర్షకుడూ, కార్మికుడూ/ఉద్యోగీ వ్యాపారీ/ అందరొక్కటై/ శ్రమైక జీవన సౌందర్యాన్ని/ ఆస్వాదించాలి/సంఘటితశక్తిగా రూపొంది/ సమస్యలతో పోరాడాలి/సహజీవనం సాగించాలి అంటూ శ్రమశక్తి విలువను తెలియజేశారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్నారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అనే స్ఫూర్తిని కవయిత్రి  కలిగిస్తున్నారు.

‘కడలి కల్లోలం’ కవితలో మనమంతా మనుషులుగా/ ఆలోచించాల్సిన తరుణమిది/ హృదయమున్న వ్యక్తులుగా/ చేయూత నివ్వాల్సిన/ ఆపత్కాలమిది/అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తుఫాను బీభత్సాలు ఏర్పడుతుంటాయి. అంతటా భయానక వాతావరణం, గూడు చెదిరిన పక్షుల వలె చెట్టుకొకరు పుట్టకొకరు బతుకు చెదిరిన జీవన చిత్రాలు, గుండెలు పిండేసే సన్నివేశాలు, అయిన వారి ఆచూకీ కోసం రోదనలు వెల్లువెత్తుతుంటాయి. ప్రకృతి పెనుభూతాలు, సునామీలు, కొండ చరియలు విరిగి పడటం మొదలైన విపత్తులు సంభవిస్తున్నాయి. విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం అందించాలని కవయిత్రి వెలిబుచ్చిన భావాలు చక్కగా ఉన్నాయి.

‘ఐడెంటిటి క్రైసిస్’ కవితలో ఐడెంటిటీ కోసం పరుగులు తీస్తూ/ ఆత్మీయతానుభూతులను కోల్పోతున్నాం/అసహజ వాతావరణానికి కారణమవుతున్నాం/ఈ విపత్తులో నుండి బయటపడి/మట్టి బంధాన్ని గుర్తించి/ మనసారా/ మమకారపు పరిమళాలు వెదజల్లితే/ మానవ జన్మకు/సార్థకతే కదా! అంటున్నారు. ఇవ్వాళ మనుషుల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. మనుషుల్లో మానవత్వం పరిమళించాలనే ఆకాంక్ష కవయిత్రి భావాల్లో మనకు స్పష్టంగా గోచరమవుతుంది.

‘సమతా పథం’ కవితలో మతం పేరుతో సాగే మారణ హోమాలను నిరసిస్తున్నాం/దిక్కుతోచక/ భీతిల్లుతున్న ప్రజానీకానికి/కలాలతో గళాలతో/ ధైర్యాన్నిస్తూ/ స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వాలను/ పంచుతూ/సమతా పథాన పయనిస్తూ/స్నేహ గీతాన్ని ఆలపిద్దాం! అంటున్నారు. సమతా పథం కవితలోని భావనలు సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తున్నాయి.

‘మనసు కలం’ కవితలో నేనొక కవిని/ కవిత్వం నా ఊపిరి/మనసు కలంతో మంచిని పెంచాలనుంది/ మానవతను పరిరక్షించాలనుంది! అంటున్నారు. కవులు, కళాకారులు తమ కలాలను గళాలను సంధించి మంచిని మానవత్వపు కాంతులను పంచుతున్న తీరు ఆనందం కలిగిస్తుంది.

‘మట్టి వాసన’ కవితలో ఆకుపచ్చని చిరునామాతో/ అలరారే పంట పొలాలు/చక్కనైన వనాలు/పక్షుల కిలకిలారావాలు/కోయిల పాటల కమ్మదనాలు/ముగ్గులతో తీర్చిదిద్దిన ముచ్చటైన లోగిళ్లు/కలిమిలేములను భరించే/సహన గుణంతో/ మట్టి వాసనను వెదజల్లుతూ/ఆత్మీయ భావాలను/ రేకెత్తించే పల్లెటూరు/అచ్చమైన సిరి సంపదలతో/ విలసిల్లే/ ఒకనాటి మా ఊరు.. అంటున్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లె జనాలు ఆత్మీయానుభూతులను కలబోస్తూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. మట్టి బంధంలో పెనవేసుకున్న పల్లెవాసులు ఒకనాటి మా ఊరు అని కవయిత్రి తను పుట్టి పెరిగిన పల్లె పట్ల గల అవ్యాజమైన ప్రేమను చక్కగా తెలిపారు.

‘చేయూతనిద్దాం..!’ కవితలో వాళ్లు సృష్టికర్తలు/రంగు రంగుల/రకరకాల/జిలుగు వెలుగుల/చేనేత వస్త్రాల నేతగాళ్ళు/ఏ నేతలూ వాళ్ళ తల రాతలు/మార్చడం లేదు/పథకాలేవి వాళ్ళ స్థితిగతులను/ మెరుగుపరచనూ లేదు/వాళ్ళ కళ్ళల్లో కనిపించే దైన్యం/ఆత్మహత్యలు శరణ్యమంటున్న/వాళ్ళ వేదన/మనసామాజిక బాధ్యతను/ గుర్తెరగమంటున్నది. చేనేత కార్మికులు యంత్రాలు వచ్చిన తర్వాత మరమగ్గాలు మూతపడ్డాయి. కార్మికుల బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. పాలకులు చేనేత కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు. పేదరికం వల్ల  తినడానికి తిండిగింజలు కూడా లేకపోవడం చేత  చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. కవయిత్రి చేనేత కార్మికుల పట్ల సానుభూతితో చేయూత నివ్వాలి అనే సామాజిక బాధ్యతను గుర్తుజేసి పాలకుల కళ్ళను తెరిపించారు.

‘ఇంకానా..?’ కవితలో అమ్మ కడుపులో ఉండి/అన్నీ వింటుంటే/ఇంకా లొకంలోకి రాని నాకు/ దుఃఖంగా ఉంది/ఇంత మోసపూరిత ప్రపంచంలోకి/వస్తే బతకడమెట్లా అని/భయంగా ఉంది/కడుపులో ఉన్న నేను/ ఆడపిల్లనని తెలిస్తే/అమ్మకు అబార్షనేనట అంటూ సాగుతుంది కవిత. భ్రూణ హత్యలు తలుచుకుంటేనే గుండె చెరువు అవుతుంది. ఆడపిల్లల పెంపకంలో వివక్ష, పసిగుడ్డు నుండి పండు ముదుసలి వరకు అత్యాచారాలు కొనసాగుతున్నాయి. స్త్రీ ఆకాశంలో సగం, స్త్రీ అవనిలో సగం అంటూ కుటిల నీతులు వల్లిస్తారు. స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలు, అసమాన వ్యవస్థను నిలదీయాలనుంది అంటూ కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘ఊరోల్లం!’ కవితలో బతికి చితికినోల్లం/ చితికి బతికినోల్లం/మేం నేల తల్లిని నమ్ముకున్నోల్లం/ కూలినాలి చేసుకుంట/కాలం గడిపెటోల్లం/ఇప్పుడు పని కోసం/ఊర్లన్ని తిరుగుతున్నం/ఏం జెయ్యమంటరు?/మాఊరోల్లను/గీ పేదోల్లను జరంత యాదుంచుండ్రి అని అంటున్నారు. ఊరోల్ల  బతుకులను గురించి తెలంగాణ మాండలికంలో రాసినది ఈ కవిత.

‘సల్లంగ జూ సే అమ్మలై..’ కవితలో ఉద్యమ స్ఫూర్తిని ఊపిరియై/ఆత్మ గౌరవానికి ప్రతీకయై/శౌర్య పరాక్రమాలకు పెట్టింది పేరై/చిలుకల గుట్ట చిరునామాతో/ ఆధిపత్యాలను ఎదిరించే పులిబిడ్డలై/అందరినీ సల్లంగ చూసే అమ్మలై/చరిత్ర సృష్టించిన/మా సమ్మక్కా సారక్కలు ఆదివాసీ వీరవనితలు/ అంటూ కవిత సాగుతుంది. తెలంగాణలో కోట్లాది మంది ప్రజలు సమ్మక్క సారక్క జాతరలో పాల్గొంటారు. మొక్కులను తీర్చుకుంటారు. అదొక వేడుక.

‘మనమేం చెయ్యాలి?’ కవితలో ప్రపంచీకరణ నేపథ్యంలో/ వేగవంతమవుతున్న జీవన విధానం/పెరుగుతున్న జనం/పారిశ్రామికీకరణ ప్రభావం/విస్తరిస్తున్న పట్టణీకరణ క్రమం/చెట్లను కూల్చేయడం/ అడవులను నరికేయడం/అభివృద్ధి పేరుతో/ప్రాజెక్టుల నిర్మాణం/అంతరిస్తున్న క్రిమి కీటక జంతుజాలం/క్షీణిస్తున్న మానవ వనరులకు సంకేతం అంటూ ప్రకృతి విధ్వంసాన్ని తెలియజేస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం. భావి తరాలను కాపాడుతాం అనే స్ఫూర్తిని కవయిత్రి  కలిగిస్తుంది.

‘మాతృ వందనం’ కవితలో మాతృదేశం రక్షణకై/సరిహద్దులో నిలుచున్న/బాధ్యతాయుతమైన సైనికుడిని/ప్రజల కోసం ప్రాణాలర్పించే/దేశ ప్రేమికుడిని/మాతృ వందనం చేస్తూ ముందుకు సాగుతా/వీర జవానునై/ విజయమో వీర స్వర్గమో/ ఇక్కడే పొందుతా! అంటున్నారు. మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల కోసం జై జవాన్ అనే నినాదం ఉంది. సైనికుల వల్లనే మన దేశ ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారు. సైనికులు తమ కుటుంబాలను వదిలి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నారు. సైనికులు చేస్తున్న సేవలు ఎనలేనివి. వారికి దేశ ప్రజలు ఎంతో ఋణపడి ఉన్నారు.

‘బతుకు పోరాటం’ కవితలో మా భాష మాది/మా ‘యాస’ మాది/వలసాధిపత్యం వద్దంటా/మా వనరులు మాకుంటే/మా బాధలు తీరునంటు/ పట్టలేని ఆవేదన/పెల్లుబికిన నిరసన/నాలుగు కోట్ల ప్రజల/గుండె చప్పుడీ రణం/అలుపెరుగని త్యాగాలతో/అంతులేని గాయాలతో/ క్షణక్షణం తల్లడిల్లె తెలంగాణ అంటూ ఈ కవిత సాగుతుంది. తెలంగాణ కొరకు సకల జనులు పోరుబాటలో సాగినారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.

‘ధీరవనిత నాగమ్మ!’ కవితలో సకల విద్యా పారంగతురాలై/ప్రజల మనిషిగా పేరు పొందిన/తొలి మహిళా మంత్రి/ మన వీరనారి నాగమ్మ! ఆమె ధీశక్తి ప్రజల అస్తిత్వం/నాయకత్వమంటే నాగమ్మ!/మన పౌరుషం నాగమ్మ!/మన ఆత్మగౌరవం నాగమ్మ/అంటూ నాయకురాలు నాగమ్మ గురించి వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.

‘పరివర్తన’ కోసం కవితలో తల్లిదండ్రుల్లో ఆడపిల్ల అనగానే ఒక రకమైన భయం నెలకొంటుంది. భయాలను అధిగమించి ఆడపిల్లగా చదువులోను ఉద్యోగంలోను విజయం సాధిస్తాను. అమ్మా నాన్నలను కనుపాపల్లా చూసుకుంటాను. అసమానతల బీజాలను కూకటివేళ్లతో పెకిలిస్తాను.సరి కొత్త సమాజ నిర్మాణానికి పునాదిని అవుతాను అనే సంకల్పం, ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో పలికినట్లుగా ఉంది.

‘తేటతేనియల ఊట బావి’ కవితలో అమ్మ చూపులోని చల్లదనం/అమ్మ స్పర్శలోని వెచ్చదనం/అమ్మ పిలుపులోని తీయదనం/అమ్మ నవ్వులోని హాయిదనం/అమ్మ ప్రేమలోని కమ్మదనం/అందించే అచ్చ తెలుగు/మన మాతృభాష/అంటున్నారు. అమ్మ వలె మన భాష గొప్పది అని వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.

‘వీరనారి రుద్రమ్మ’ కవితలో గణపతి దేవుని కుమార్తెగా/ఓరుగల్లును పాలించి/కాకతీయుల కీర్తి ప్రతిష్టలను/జగద్విఖ్యాతి గావించిన ఆడబిడ్డ/ సుపరిపాలనకు నిదర్శనం రుద్రమ్మ/చరిత్రలో చిరస్థాయి ఘన కీర్తి రుద్రమ్మ అంటున్నారు. రుద్రమ్మ కాకతీయ సామ్రాజ్యాన్ని శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా తీర్చిదిద్దిన ప్రతిభాశాలి అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘పడిలేచే కెరటం’ కవితలో జీవిత పాఠాలు నేర్పించి/నాలోన విజ్ఞాన జ్యోతిని వెలిగించి/నన్ను మనిషిగా తీర్చిదిద్దిన/ కనిపించే ఆ దేవుడి పాదాలకు/ సదా నా సాష్టాంగ నమస్కారం. ఈ కవితలో పడి లేచే కెరటం నాన్న. నాన్నను గుర్తు చేస్తూ పితృదేవోభవ అనే భావానికి సార్థకత చేకూర్చారు. కవయిత్రికి నాన్నంటే అవ్యాజమైన ప్రేమ ఉన్నట్లుగా అర్థమవుతుంది.

‘మా గుండెల్లో నీవు’ కవితలో ప్రజా కవీ! కాళోజీ! జనస్వామ్యవాదివై/జనం వైపు నడిపిస్తివి/పేదోళ్ళ బాధలు గాధలన్నీ నీవంటివి/పౌర హక్కుల కోసం పోరాటం జేస్తివి/ప్రశ్నించేటోడు అసలైన మనిషంటివి/మానవతకు నిలువెత్తు సాక్ష్యమయితివి/ప్రజా కవివై మా గుండెల్లో నిలిస్తివి. ప్రజా కవి కాళోజిని గురించి నీవు మా గుండెల్లో ఉన్నావని స్మరించుకోవడం బాగుంది.

‘అగ్ని ధార తెలంగాణ’ కవితలో భావోద్వేగాలతో రగులుతున్న తెలంగాణ/ఉద్యమ బాటలో/పట్టిన పట్టువీడని/ నాలుగు కోట్ల ప్రజలు/న్యాయం కోసం జ్వాలాముఖులైన/అగ్ని ధార తెలంగాణా. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రజలు పోరాటంలో పాల్గొని సమిధల్లా అగ్ని ధారలు అయ్యారని కవయిత్రి తెలిపిన భావాలు చక్కగా ఉన్నాయి.

‘మహనీయురాలు’ కవితలో బాలికా విద్యకు/ బలమైన పునాది వేసిన/తొలి ఉపాధ్యాయురాలు/ బడులెన్నింటినో నెలకొల్పి/బతుకునిచ్చిన/ మహనీయురాలు/సావిత్రిబాయి పూలే ఆమె పేరు/ కర్తవ్య దీక్షలో ఆమెకెవరు సాటి రారు అని అంటున్నారు.సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య కొరకు పాటుపడిన గొప్ప వ్యక్తిగా వర్ణించిన కవయిత్రిని అభినందిస్తున్నాను.

‘బతుకు స్వేచ్ఛనివ్వమ్మా!’ కవితలో మా జనజీవన సంస్కృతికి ప్రతీక/బతుకమ్మ పండుగ/తరతరాలుగా కొనసాగుతున్న/జీవన సంప్రదాయమీ వేడుక/అక్క చెల్లెండ్లను ఆదరించే/ఆత్మీయానుభూతుల కలయిక/మాకు బతుకు స్వేచ్ఛ నివ్వమ్మా అని మనసారా కొలిచి మొక్కే గౌరమ్మ! తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక వేడుకగా సాగుతుంది. కవయిత్రి బతుకమ్మ పండుగలోని విశిష్టతను మరియు బతుకు విలువను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.

‘అన్నింటా ఆమె’ కవితలో సృష్టికి మూలమై/ విశ్వమంతా విస్తరించిన ఆమె/ఆకాశంలో సగమై/ అవనిలో అర్ధ భాగమైన/నిత్య చైతన్య శీలి/ఆది నుండి ఆధునికత వరకు/భిన్న రంగాలలో/బహు పాత్రలను నిర్వర్తిస్తూ/ అద్భుతాలను/సృష్టిస్తున్నది. పురుషులతో సమానంగా అన్నింటా ఆమె నిలిచింది అనేది వాస్తవం. స్త్రీ అంతరిక్షంలోకి కూడా ప్రయాణించింది. స్త్రీ శక్తికి సాటి ఎవరు రారు అని కూడా నిరూపించుకుంది. ఒక సినిమాలోని పాట ఎప్పటికీ గుర్తుంటుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ/త్యాగంలో అనురాగంలో సాటి లేనిది మహిళ అని.

‘సకల జనుల చైతన్యం’ కవితలో నాలుగున్నర కోట్ల ప్రజల/ఆశలు ఆశయాలకు ప్రతిరూపాన్ని/అరవై ఏళ్ల చీకట్లను చీల్చుకొని/దూసుకొచ్చిన స్వేచ్ఛా గీతాన్ని/వలస పాలనా సంకెళ్లను తెంచ/ప్రాణాలొడ్డి/కోట్ల గొంతుకల నొక్కటిగా జేసి/తరతరాల వివక్షను రూపుమాప/ పౌరుషాన్ని రగిల్చిన ధిక్కారాన్ని అంటూ సాగుతుంది కవిత. ఈ కవితలో తెలంగాణ రాష్ట్రం కొరకు సకల జనుల చైతన్యం వెల్లి విరిసిన విధానం చక్కగా వ్యక్తమైంది.

‘చివరి మజిలీ’ కవితలో దేశమేదైనా/ప్రాంతాలు వేరైనా/మహిళలందరి స్థితిగతులొక్కటే/ వేదన రోదన ఒక్కటే/సాధింపులు వేధింపులు భరించడం/సర్వసాధారణమే/అంతటా అసమానతలే/ఆమెకు హక్కులు మృగ్యమేనా/తన వాళ్ళందరి కోసం పరితపించే/ఆ పిచ్చి తల్లి కిప్పుడు కావాల్సింది/ చేయూతనందించే/ఒక ఆసరా/ అందరూ ఆమెను/అర్థం చేసుకోగలిగితే/ఆమె కళ్ళల్లో/ కోటి దీపాల కాంతులు ప్రజ్వరిల్లుతయ్/ఈ జన్మకీ తృప్తి చాలనే విశ్వాసంతో.. అంటున్నారు. కవయిత్రి సాటి మహిళలకు కావలసిన హక్కుల వివరాలను చక్కగా వ్యక్తం చేశారు.

‘వాళ్ళే.. వాళ్ళే..’ కవితలో అక్షరాలు నేర్పించే వాళ్ళు/ అమ్మలాగా ప్రేమించే వాళ్ళు/సుద్ధముక్కతో సుద్దులు చెప్పే వాళ్ళు/సుశిక్షణతో పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళు/జ్ఞాన జ్యోతులు వెలిగించే వాళ్ళు/విద్యార్థుల మనసుల్లో/మానవతా విత్తనాలు నాటే వాళ్ళు/ వికసించిన విద్యా కుసుమాలను చూసి/పరవశించే వాళ్ళు/ వాళ్ళే.. వాళ్ళే../మన ఉపాధ్యాయులు/ మన అధ్యాపకులు అంటూ చదువు నేర్పే గురువులను కవితలో అద్భుతంగా చిత్రించారు. కవయిత్రి డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేశారు. అందుకే అంత గొప్పగా రాయగలిగారు.

‘అనుభవాల కావ్యం’ కవితలో అంతులేని అనురాగం ఆమెది/అలవికాని మమకారం ఆమెది/ఇంటి బరువు బాధ్యతలకు/అంకితమయ్యే ఆ తల్లి/కంటిపాపల్లా బిడ్డలను/ పెంచి పెద్ద చేసే కల్పవల్లి/ఆ అమృతమూర్తికి/శిరస్సు వంచి/ పాదాభివందనం చేస్తా/సదా ఆమె ఆశీస్సుల కోసం/ప్రణమిల్లుతా. కవయిత్రి కన్నతల్లి పట్ల గల ప్రేమను అనుభవాల కావ్యం కవిత ద్వారా వ్యక్తం చేయడం సంతోషం కలిగిస్తుంది.

‘ఆమె తిరగబడితే..?’ కవితలో సృష్టికి మూలమై/మానవ మనుగడకు క్షేత్రమై/త్యాగానికి నిర్వచనమై/ ప్రేమకు ప్రతిరూపమై/జాతికి జీవమిచ్చే/మహోన్నత మానవ రూపం ఆమె/భూమి తల్లి గుండెల్లోంచి/కొత్త మొక్క చొచ్చుకొచ్చినట్లు/ బిడ్డకు జన్మనిచ్చే ఆమెకెందుకు/అన్నింటా అవమానం/సహనం నశించి/ఆగ్రహంతో/ఆమె తిరగబడితే/మీ మనుగడ ప్రశ్నార్ధకమే/ మగాళ్ళూ ఆలోచించండి అని పురుష సమాజానికి సవాలు విసిరారు. ప్రకృతి పురుషుడు అంటారు. ఆడ,మగ జంట అనురాగంతో కలిసిమెలిసి ఉంటేనే జీవితం నందనవనం అవుతుంది. ఆమె లేని మగాడి జీవితం ఎడారితో సమానం అవుతుంది. ఆమె భూమాత వలె సహనంతో మెలుగుతుంది. ఆమె సహనం కోల్పోతే సృష్టి తలకిందులు అవుతుంది. ఆమె లేని మగాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆడ తోడు లేని మగవాడి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? అని సమాజానికి సవాలు విసిరిన తీరు అద్భుతంగా ఉంది.

‘మాటే కావాలి’ కవితలో మాట పంచుకుంటే మనసంతా ఉగాది/మమతను అల్లుకోవడమే ఉగాదికి పునాది/ఘడి యొక గండంలా/ గడుపుతున్న మనిషికిప్పుడు/మాట అనే మందు కావాలి/ ఒకరికొకరం/మనసు పెట్టి మాట్లాడుకుందాం/పలకరింపుల చిరు జల్లులు కురిపించుకుందాం అంటున్నారు. మాటతోనే మనిషి బతుకు సుఖవంతం అవుతుంది. మాటకున్న మహిమను తెలిసికొందాం. మాట తోటి మనసులను గెలుచుకుందాం అని మాట యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.

‘జ్ఞాపకాల చిరుజల్లులు’ కవితలో నా బాల్యం/చిన్ననాటి ముచ్చట్లను తలపించే/మరపురాని/ మధురానుభూతుల కావ్యం/గుండె లోతుల్లో పదిలపరుచుకున్న/ఓ అపురూప స్మృతి గీతం అంటూ బంగారు బాల్యాన్ని గురించి కవయిత్రి వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. బాల్యంలో ఎవరికైనా మధురానుభూతులు ఉంటాయి. బాల్యంలోని మధురానుభూతులను మర్చిపోవడం ఎవరికి సాధ్యం కాదు. మరపురాని బాల్యం తలుచుకుంటే గుండెల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాల్యం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది.

‘పండుగంటే’ కవితలో పది మందితో కలిసి బతకడం/పలకరింపుల పరిమళాలను వెదజల్లడం/మమకారపు మాధుర్యాన్ని/మనసారా పంచడం/పగ ప్రతీకారాలను/దూరం నెట్టడం/ స్నేహభావంతో/కష్టసుఖాలను కలబోసుకోవడం/ మనసున్న మనిషిగా/మనుగడ సాగించడం/మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవడం అంటూ పండుగలోని గొప్పతనాన్ని కలిసిమెలిసి ఉండడంలోని అనురాగం, ఆనందాన్ని, అనుభూతులను వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.

‘బస్సుతో బంధం’ కవితలో రోజూ ఎన్నెన్నో/ బాధ్యతా బరువులను మోస్తూ/పల్లెలు పట్టణాలకు దూసుకుపోయే/మన రవాణా సాధనం/సామాన్య ప్రజలతో మమేకమై/జనావళిని భద్రంగా/గమ్యం చేర్చే వాహనం అంటున్నారు. సామాన్య ప్రజల ప్రయాణం బస్సులోనే సాగుతుందని తెలుపుతూ బస్సును నడుపుతున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే సందేశంతో కవితను రాసిన తీరు అద్భుతంగా ఉంది.

‘సంబరాల సంతకం’ కవితలో నాన్న ప్రేమ/ సృష్టిలో అమూల్యం/నాన్న మనసు/ఉప్పొంగే సముద్రం/ కష్టసుఖాల కలబోత నాన్న/కలిమిలేముల కలనేత మా నాన్న/ బతుకు బాటన పయనించే బాటసారి/బరువు బాధ్యతలకు వెరవని శ్రమ జీవి/మనిషి తనానికి/ఆ నిలువెత్తు సాక్ష్యానికి/ ప్రేమతో వందనాలు/నాన్న పట్ల గల ప్రేమను కవితలో వ్యక్తికరించిన భావం చక్కగా ఉంది.

‘తెలంగాణ స్వాప్నికుడు’ కవితలో సిద్ధాంతకర్తయై/ ఉద్యమ బాట/చూపిన యోధుడు/ ప్రజల గుండెల్లో/ గుడి కట్టించుకున్న/ తెలంగాణా స్వాప్నికుడు/ చరిత్రలో చిరస్థాయిగా/ నిలిచిపోయే/ మన జయ శంకరుడు అంటున్నారు.తెలంగాణ కొరకు పాటుపడిన ప్రొఫెసర్ జయశంకర్‌ను స్మరిస్తూ కవిత రాయడం చక్కగా ఉంది.

‘నవ్వుల పువ్వులు’ కవితలో చిన్ని చిన్ని పాపలు మీరు/ చిట్టి పొట్టి బాలలు మీరు/చిరు చిరు నవ్వుల పువ్వులు మీరు/ బుడిబుడి మాటల బుడతలు మీరు/ స్వచ్ఛమైన మనసులు మీవి/ అమ్మానాన్నల ఆశలు తీర్చండి/గురువులను గౌరవించండి/ పేదవారిని ఆదరించండి/లక్ష్యం కోసం శ్రమించండి/దేశాన్ని ప్రేమించండి అంటూ కవయిత్రి రాసిన ఈ కవిత బాల సాహిత్యంలో చేర్చదగినది. ఈనాటి బాలలే రేపటి పౌరులు. బాలలకు సందేశాన్ని అందించేలా కవితను మలిచిన తీరు చక్కగా ఉంది.

‘ధైర్యమే వాళ్ల ఊపిరి’ కవితలో వాళ్లు దివ్యాంగులు/అయితేనేం? వైకల్యానికి వెరవని వాళ్ళు/వెతలకే మాత్రం కృంగని వాళ్ళు/ధైర్యమే ఊపిరిగా బతుకుతున్న వాళ్ళు/ నిరంతర జీవన పోరాట యోధులు! కవయిత్రికి దివ్యాంగుల పట్ల సానుభూతి ఉంది. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేటట్లు కవితను రాసినారు. దివ్యాంగులు సమాజంలో భాగం. దివ్యాంగులను గౌరవించాలి. దివ్యాంగులకు తోడ్పాటును అందించాలి. ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలి అని సూచించడం బాగుంది.

‘తమ్ముడికో ఉత్తరం’ కవితలో ప్రియమైన తమ్ముడూ! ఒక్క మాటైనా/మాతో చెప్పకుండా/ఎందుకురా అకస్మాత్తుగా/ మమ్మల్ని వదిలి వెళ్లావు/నీ జ్ఞాపకాలు/ గుండెల్లో కదులుతూనే ఉన్నాయి/ నిన్నెప్పటికీ మా గుండెల్లో/ పదిలంగా నిలుపుకుంటాం/ నీ ఆశలు ఆశయాలను గౌరవిస్తూ/ముందుకు సాగుతాం/ జోహార్లు!! తమ్ముడూ.. జోహార్లు! అంటున్నారు. తమ్ముడికో ఉత్తరం అంటూ స్మృతి కవిత రాసి కవయిత్రి తమ్ముడిని సజీవం చేశారు. తమ్ముడి జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి. తమ్ముడి జ్ఞాపకాలతో ఆమె బతుకుతుంది. అర్ధాంతరంగా తమ్ముడు ఈ లోకం నుండి వీడిపోయాడు. తమ్ముడిని కోల్పోయిన ఆ బాధ చెప్పనలవి కాదు. తమ్ముడు ఎప్పటికీ కానరాని ఆ లోకాలలో చిరంజీవిగా ఉంటాడు.

రామలక్ష్మి కవితను తడబాటు లేకుండా చక్కగా ప్రారంభించారు. మధ్యలో కవితలోని భావాల పట్ల శ్రద్ధ చూపితే గొప్ప కవితలుగా మలచబడేవి. అక్కడక్కడ కవితలోని పంక్తులను సాగదీసారు. కవితల ముగింపు కూడా బాగుంది.

స్నేహ గానంలోని మిగతా కవితలు, కలల ప్రపంచం, మార్పు కోసం, అగ్గి రవ్వలం, మనుగడ, విభజించి పాలించే, ఘన కీర్తి, మంచి రోజులొచ్చు, ఈ విదేశం, అందరి వాడు, ఊరంతా ఉగాది, చైతన్య వారసులం, ఉన్మాదం, ఔన్నత్యం,ఆకాంక్ష, ఆత్మగౌరవ చేతన, అశ్రు నివాళులు, బతుకు వెతలు, స్వీడన్ అందాలు, తరిమి కొడతాం, కాలానికి లోబడని కాళోజీ, శాలువా, కాదేది కవిత కనర్హం అన్నట్లుగా అన్ని అంశాలపై కవితలను రాశారు. కవయిత్రి మలి కవితా సంపుటిలో మరి కొన్ని గొప్ప కవితలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

***

స్నేహ గానం (కవిత్వం),
రచన:  డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి,
ప్రచురణ: సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు,హైదరాబాద్.
వెల : ₹ 125/-
ప్రతులకు:
డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి,
ఇంటి. నెం. 5-10- 84,
కిషన్‌పుర,
హన్మకొండ,వరంగల్,
పిన్ కోడ్ నం.506001.
సెల్  నెంబర్: 9849234725.
మెయిల్ ఐడి: ramalakshmi.asm@gmail.com

 


కవయిత్రి పరిచయం:

డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి 02-01-1959 తేదిన పరకాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శకుంతల, కృష్ణారావు. వీరి తండ్రి వరంగల్ లోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

రామ లక్ష్మి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పరకాల గ్రామంలో  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ వరంగల్ లోని కృష్ణ కళాశాలలోనూ, డిగ్రీ వరంగల్ లోని పింగిలి ఉమెన్స్ కళాశాలలోనూ చదివారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‍లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి పట్టా పొందారు.

రామ లక్ష్మి 1990లో ఏ.ఎస్.యమ్. మహిళా డిగ్రీ & పి.జి. కళాశాలలో లెక్చరర్‌గా నియమితులయ్యారు. 31-01-2017 నాడు అదే కళాశాల నుండి అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు. పుస్తక పఠనం వ్యాపకం. సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాల్లో వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version