Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్నిగ్ధమధుసూదనం-22

అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 22వ భాగం.

వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాయం సంధ్య కాబోతోంది. గుహ బయట రాళ్ళ మీద కూర్చున్నారు వజ్ర నేత్రుడూ, చంద్రహాసినీ. కృష్ణలీలల గురించీ, ఆ జగన్నాధుడి లీలా వినోదాల గురించీ మాట్లాడుకుంటూ పరవశించిపోతున్నారు.

వారి ఎదురుగా ఎర్రపూల చెట్టు, ఆకులు కనపడనంతగా చెట్టు మొత్తం ఎర్రటి ఛత్రాన్ని ధరించినట్టు సొగసుగా నిలబడింది.  గాలికి ఎర్రటి పూలు రాలి వీరి పాదాల వరకూ దొర్లుకుంటూ వస్తున్నాయి.

వీరికి అందనంత దూరంలో మోదుగ పూల చెట్లు, కానుగ పూల చెట్లూ కూడా విరబూసి మనోహరంగా దర్శనమిస్తున్నాయ్. ఇంకా వారికి పేరయినా తెలియని ఎన్నో రకాల పుష్పాలు విరబూసి ఆ ప్రదేశమంతా వింత పరింళంతో శోభిల్లుతోంది.

గాలి ఎక్కువగా వీచడంతో ఆ పరిమళం వీరిద్దరినీ చుట్టేసింది. మాటలు ఆపి ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి హృదయాలు ఎగసిపడుతున్నాయి. ఆ పూల చెట్లతో ప్రకాశిస్తున్న ఆ పరిసరాలు మాధవుడిని పదే పదే తలుచుకునేలా చేస్తున్నాయి. ఇటువంటి స్థితిలో రాధారాణి ఉంటే ఏం చేస్తుంది?

ఇద్దరికీ అదే ఆలోచన వచ్చి నవ్వుకున్నారు.

“లలిత లవంగ లతాపరిశీలన కోమల మలయ సమీరే
మధుకర నికరక రంబిత కోకిల కూజిత కుంజ కుటీరే..”

లవంగ తీగల పూల గుత్తులు, వాటి చుట్టూ తిరుగుతున్న భ్రమరాల గుంపులు… గుహలోని మరో గోడ మీద వర్ణ చిత్రం ప్రారంభం అయింది. వజ్రనేత్రుడి పక్కనే నిలబడి చంద్రహాసిని కూడా మరో కుచ్చుని తీసుకుని లవంగ తీగలను అతను చిత్రించే విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తూ తనూ చిత్రిస్తోంది.

వజ్రనేత్రుడు వారించలేదు. మరింత సంతోషపడ్డాడు.

“ఉన్మద మదన మనోరధ పధికవధూజన జనితవిలాపే..
అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపే….
మృగమద సౌరభ రభసవశంవదనవదళ మాల తమాలే..
యువజన హృదయవిదారణ మనసిజనఖరుచికింశుకజాలే…”

పాడుతున్నారు ఇద్దరూ.. గొంతులు కలిపి. చిత్రిస్తున్నారు మైమరచిపోతూ ఆ పూల సోయగాలనీ, భ్రమరాల గుంపులనీ, కానుగ చెట్లతో, మోదుగ చెట్లతో శోభిల్లుతున్న వనాన్నీ, ఆ వనంలో ఓ అందమైన పూల పొదరింటినీ.

ఆ పొదరింటి స్తంభానికి లవంగ లతలు చుట్టుకున్నట్టుగా చిత్రిస్తోంది చంద్రహాసిని. ఆ స్తంభానికి ఆనుకుని సిగ్గుపడుతూ నిలబడిన రాధ చుబుకాన్ని మధుసూదనుడు తన వేలితో ఎత్తి పట్టుకుని ఆమె కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తున్నట్టుగా చిత్రిస్తున్నాడు వజ్రనేత్రుడు.

ఆమె ఆతని కళ్ళలోకి చూడలేక తన సోగకళ్ళని క్రిందకి వాల్చేసినట్టుగా ఉంది. ఆమె ముఖంలో సిగ్గు, ఆనందం, ప్రియ సమాగమాన్ని పొందబోతున్నందుకు గర్వంతో కూడిన చిరుమందహాసం.. అద్భుతంగా ఆవిష్కరించాడు.

అబ్బురపడుతూ అతని చిత్రకళా నైపుణ్యాన్ని వీక్షిస్తోంది చంద్రహాసిని. తనూ అతనిలా చిత్రించాలని ప్రయత్నిస్తోంది.

కృష్ణుడి ముఖంలో రాధ మీద ఇష్టం, ప్రేమానురాగాలు అద్భుతంగా ప్రకటితమవుతున్నాయి. రెప్ప వేయకుండా ఆ ముఖారవిందాలని వీక్షిస్తూనే ఆ మెళుకువలను గమనిస్తోంది.

నయన మనోహరంగా ఆ చిత్రం పూర్తయింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తృప్తిగా నవ్వుకున్నారు. ఈ చిత్రకళలో, గీతగోవింద చిత్రాల ఆవిష్కరణలో వారిద్దరికీ పగలూ రేయీ తెలియడం లేదు.  ఎప్పుడు నిద్రపోతున్నారో, ఎప్పుడు ఆహారం తీసుకుంటున్నారో కూడా తెలియనంతగా ఆ రాధాకృష్ణుల ప్రేమకి దృశ్య రూపాలు ఇవ్వడంలో యజ్ఞకర్తల్లా లీనమైపోయారు.

గుహ మొత్తం రాధాకృష్ణుల ప్రేమతో నిండిపోయింది. ఆ చిత్రాల నడుమ తమని తాము మరచిపోయి జీవిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ జగన్మోహనుడి ఆరాధనలో గోపగోపికలైపోయారు.

***

తేజకి డాక్టర్ మనోహర్ కౌన్సిలింగ్ మొదలుపెట్టాడు.

ముందుగా అతన్ని ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో డిమ్‌గా నీలం రంగు బల్బు వెలుగుతోంది. అక్కడే ఓ బల్ల మీద విశ్రాంతిగా పడుకోబెట్టాడు తేజని. చాలా నెమ్మదిగా మాట్లాడుతూ అతన్ని హిప్నటైజ్ చేసి మగతలోకి పంపించాడు. మెల్ల మెల్లగా అతన్ని ప్రశ్నిస్తూ తనకు కావలసిన సమాధానాలు రాబట్టుకుంటున్నాడు. తేజ అలా మగతలోనే సమాధానాలు చెబుతున్నాడు.

అతనికి చిన్నప్పటి నుంచీ చిత్రకళ మీద ఉన్న ఆసక్తీ, ముఖ్యంగా రాధాకృష్ణుల వర్ణచిత్రాల మీద ఉన్న ఇష్టమూ, అవి తను అద్భుతంగా చిత్రించాలనుకోవడం.. ఇలాంటివన్నీ తను అప్పటికే డాక్టర్ రఘురాం ద్వారా తెలుసుకున్న సంగతులే తిరిగి తేజ ద్వారా వింటున్నాడు మనోహర్.

అన్నీ విన్నాక మనోహర్ అడిగాడు “తేజా, నీకు బొమ్మలు వెయ్యడం వచ్చు. కానీ, ఎందుకో భయపడుతున్నావు. పేపరు మీద పెన్సిల్తో చిన్న బొమ్మ గీయడానికి కూడా భయపడుతున్నావు. ఎందువల్ల?” అని అడిగాడు.

తేజ సమాధానం చెప్పలేదు.

మనోహర్ మరోసారి తేజ దగ్గరగా జరిగి మెల్లగా అదే ప్రశ్న తిరిగి అడిగాడు.

మూసుకున్న తేజ కనుపాపలు అవిశ్రాంతంగా కదలడం మొదలుపెట్టాయి. మనోహర్ అది గమనిస్తూ “రిలాక్స్ తేజా. రిలాక్స్..” అన్నాడు.

కానీ అది తేజకి వినపడలేదు. మెదడులో సన్నగా నొప్పి మొదలైంది.

“నేను ఎన్నో చిత్రాలు గీశాను. చిన్న బొమ్మలు కాదు. పెద్ద పెద్ద వర్ణ చిత్రాలు గీశాను. రాధాకృష్ణుల చిత్రాలు గీయడం నాకు బాగా వచ్చు…” ఏడూస్తూ అంటున్నాడు తేజ మగతలోనే.

“ఇట్స్ ఓకే తేజా. రిలాక్స్. రిలాక్స్” అన్నాడు మనోహర్.

కానీ తేజ రిలాక్స్ అవలేదు. తలలో నరాలు పగిలిపోతాయన్నంత బాధ అతనిలో. అద్భుతమైన వర్ణ చిత్రాల మధ్య తను నిలబడి ఉన్నాడు. పక్కనే ఓ స్త్రీ మూర్తి. తనకి తోడుగా. తనకి సహాయపడుతూ… ఎక్కడ? అదెక్కడ? అంత అందమైన ప్రశాంతమైన ప్రదేశం ఎక్కడ? ఎప్పుడు వెళ్ళాడు తను? ఎప్పుడు వేశాడు అటువంటి చిత్రాలు? అన్ని చిత్రాలు?

నొప్పి భరించలేక తేజ తల పట్టుకుని గిలగిలలాడటంతో మనోహర్ కుర్చీలోంచి లేచాడు.

అతనికి ఇవ్వవలసిన అత్యవసర వైద్యాన్ని చేసి బయటికి వచ్చి రఘురాంకి ఫోన్ చేశాడు.

మరో రెండు గంటల తరువాత తేజ మామూలు మనిషయ్యాడు. రఘురాం తేజని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కారులో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు తేజ. అతని కళ్ళలోంచి నీరు కారడాన్ని గమనించిన రఘురాం బాధగా నిట్టూర్చాడు.

ఇంటికి చేరిన తరువాత కూడా తేజ తిన్నగా గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనానికి పిలిచినా, ఆకలిగా లేదంటూ క్రిందకి దిగని తేజని తలుచుకుని సుమిత్ర చాలా బాధపడింది.

“ఎందుకొచ్చిన కౌన్సిలింగ్ అండీ. వదిలెయ్యండి. అందువల్ల ఏమైనా ఇంకా రెచ్చగొట్టినట్టు అయిందేమో” అంది భర్తతో.

“లేదు సుమిత్రా. అలా అనకు. ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ మొదటి సెషన్స్‌లో అలాగే ఉంటుంది. మెల్ల మెల్లగా కారణం తెలుస్తుంది. హిప్నటైజ్ చెయ్యడం ద్వారా తన భయాన్ని అధిగమించి వాడు అనుకున్నది సాధించగలుగుతాడు.” అన్నాడు రఘురాం.

కానీ అక్కడే అతని అంచనా తప్పయింది. తేజకి మొదటి కౌన్సిలింగ్ తరువాత విపరీతమైన నిరాశ కలిగింది. వారం రోజులు వ్యవధి ఇచ్చి రెండో సెషన్‌కి రమ్మన్నాడు మనోహర్. కానీ మొదటి సెషన్ అయిన రెండు రోజులకి కూడా తేజ ఎందుకో మామూలు మనిషి కాలేకపోయాడు.

రఘురాంకి కూడా ఇది కంగారు పుట్టించింది. శారీరకంగా ఏ సమస్యా లేదు తేజకి. మానసికంగా కూడా అతనికున్న సమస్య పెద్దదేమీ కాడు. ఒకరకమైన ఫోబియా వల్లనే బొమ్మలు గీయలేకపోతున్నాడని మనోహర్ చెప్పాడు. మామూలుగానే కౌన్సిలింగ్ ఇచ్చి ఆ భయాన్ని పోగొట్టొచ్చని కూడా చెప్పాడు.

మరి తేజ రోజు రోజుకీ ఒక మానసిక రోగిలా ఎందుకు మారిపోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు.

అలా నాలుగు రోజులు గడిచాక సుమిత్ర భార్గవికి ఫోన్ చేసింది. “భార్గవీ, కౌన్సిలింగ్ జరిగి నాలుగు రోజులైనా కూడా తేజ మామూలుగా ఉండటంలేదమ్మా. నాకు భయంగా ఉంది. బంగారంలాంటి పిల్లాడిని కౌన్సిలింగ్ ఇప్పించి మనమే డిప్రెషన్ లోకి తోశామా అని అపరాధ భావన కూడా కలుగుతోంది.” అంది ఏడుస్తూ.

“ఆంటీ, నిజమా. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఇప్పుడే వస్తాను. తేజని చూడాలి” అంటూ భార్గవి ఫోన్ పెట్టేసి మానేజర్‌కి ఎమెర్జెన్సీ అని చెప్పి తన్మయి దగ్గరికి వచ్చింది.

ఆ సమయంలో తన్మయి ముఖ్యమైన రిపోర్ట్స్ తయారు చేస్తోంది. ఆమెతో తేజ విషయం చెప్పింది భార్గవి. “అయ్యో …నేను కూడా రానా భార్గవీ.” అంది తన్మయి కుర్చీలోంచి లేస్తూ.

తన్మయిని వారించింది భార్గవి. “వద్దులే తన్మయీ. ఈ రిపోర్ట్స్ పంపడం ఇంకా ముఖ్యం కదా. నేను తేజని మీ ఇంటికి తీసుకువస్తాను ఇవాళ సాయంత్రమే. ప్లీజ్. ఒకేనా?” అంది అభ్యర్ధనగా.

“తప్పకుండా తీసుకురా భార్గవీ.” అంటూ తన్మయి తనూ లేచి భార్గవితో లిఫ్ట్ వరకూ వెళ్ళింది.

తన స్కూటీ మీదే భార్గవి తేజ ఇంటికి చేరుకునేసరికి మరో గంట సమయం పట్టింది. ఆమెను చూస్తూనే సుమిత్ర ఎదురొచ్చి “తేజ మా ఎవరితోనూ మాట్లాడటం లేదు భార్గవీ. అలా దీనంగా ఉన్నాడు. వాడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నీతో అయితే వాడి బాధలన్నీ చెప్పుకుంటాడు కదా ఎప్పుడూ. అందుకే పిలిచాను, కాస్త వాడిని మాట్లాడించి క్రిందకి తీసుకురామ్మా. నీతో మాట్లాడాక ఇవాళైనా వాడు అన్నం తింటాడేమో” అంది.

భార్గవి వెంటనే మెట్లెక్కి తేజ గదిలోకి వెళ్ళింది.

మంచం పైన పడుకుని దిగులుగా సీలింగ్ చూస్తూ పడుకున్నాడు తేజ.

“తేజా, ఎంటి అలా ఉన్నావ్? అన్నం తిన్నావా?” ఏమీ తెలియనట్టే అడుగుతూ అతని పక్కన కూర్చింది భార్గవి.

తలతిప్పి ఆమె వైపు చూశాడు తేజ. “భార్గవీ, ఈ సమయంలో వచ్చావు? ఆఫీసు లేదా? ”

“తేజా, నిజం చెప్పనా? నీకు వెంటనే ఒక విషయం చెప్పాలనిపించింది. మేనేజర్‌కి మస్కా కొట్టి వచ్చేశాను.” అంది ముఖంలో కుతూహలాన్ని చూపిస్తూ.

తేజ భృకృటి ముడుస్తూ చూశాడామెవైపు.

“తన్మయి మొన్న ఒక కొత్త చిత్రం వేసింది. అది చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంత అద్భుతంగా వేసిందనుకున్నావు? విరహంతో జ్వలించిపోతున్న రాధ చిత్రం అది. ఎంత అధ్బుతంగా వేశావు తన్మయీ అని పొగుడుతుంటే తను దిగులుగా ముఖం పెట్టింది. రాధ ముఖంలో తను అనుకున్న భావాలు పలకలేదుట.”

భార్గవి చెబుతుంటే ఆసక్తిగా లేచి కూర్చున్నాడు తేజ.

“విరహంతో జ్వలించిపోతున్న రాధ….”  మనసులో అనుకోబోయి పైకే అనేశాడు.

“అవును తేజా. ఎంత అందంగా వేసిందో. వెంటనే ఆ చిత్రాన్ని నీకు చూపించాలనిపించింది. కానీ, తను ఫొటో తియ్యనివ్వదుగా. అందుకే నిన్నే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలనిపించింది.” అతని ముఖంలోకి చూస్తూ అంది.

“అందుకని ఆఫీసు మానేసి వచ్చావా?” అడిగాడు తేజ.

“హ్మ్మ్. వారాంతం దాకా ఆగలేకపోయాను. నువ్వు ఆ చిత్రాన్ని చూడాలి. నీకు ఎంతగానో నచ్చుతుంది.”  కళ్ళుమూసుకుని పరవశిస్తూ చెబుతున్న భార్గవి వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు తేజ.

“రా తేజా. ప్లీజ్. ఆకలిగా ఉంది. భోజనం చేసి మనం బయలుదేరితే తన్మయి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయానికే మనమూ వెళ్ళచ్చు. ” అంది తేజ భుజం పట్టుకుని లేపుతూ.

తేజ కాదనలేకపోయాడు. బుధ్ధిగా భార్గవి వెంట క్రిందకి దిగాడు.

***

అప్పటివరకూ తాము చిత్రించిన చిత్రాలన్నిటినీ ఒక్కొక్కటిగా మరోసారి చూసుకుంటూ, ఆ గీతాల్ని పాడుకుంటూ నడుస్తున్నారు వజ్రనేత్రుడూ, చంద్రహాసినీ ఆ గుహలో.

“ఇరువదినాలుగు అష్టపదుల్లో ఎన్నెన్ని శ్లోకాలు. ఒక్కో శ్లోకానికీ ఎన్నో చిత్రాల్ని గీయవచ్చు కదూ. ”  ఓ చిత్రాన్ని పరిశీలిస్తూ అన్నాడు వజ్రనేత్రుడు.

“అవును.” అంది చంద్రహాసిని.

“మీ వల్ల ధ్యాన సమానమయిన ఈ చిత్రకళలో నాకు కొంత ప్రావీణ్యం వచ్చింది. అందుకు ఏ విధంగా నేను మీ రుణం తీర్చుకోగలనో ..”  అంది తనే మళ్ళీ మనస్ఫూర్తిగా.

వజ్రనేత్రుడు నవ్వాడు. “నా వల్ల కాదు. ఆ భక్త హృదయ విహారి దయవల్ల అనండి. ”

నవ్వింది చంద్రహాసిని.

“ఈ రాధ ముఖంలో ఆ హావభావాలు చూశారా? మీలాగా ఆ హావభావాల్ని అంత బాగా నేను ఇంకా తీసుకురాలేకపోతున్నాను నా చిత్రాల్లో.” అంది ఒక చిత్రంలో రాధ ముఖారవిందాన్ని చూపిస్తూ.

వజ్రనేత్రుడు ఆమె చేతిని అలాగే పట్టుకున్నాడు.

“ఇది చూడండి. ముఖకవళికలూ, హావభావాలూ పలికించాలంటే కనుబొమ్మలూ, పెదవి వంపులూ చూసుకోవాలి.” అంటూ ఆమె చేతిని ఆ రాధ ముఖకవళికల్లా తిప్పి అప్పుడే చిత్రాన్ని గీస్తున్నట్టుగా చూపించాడు.

సరిగ్గా అప్పుడే “ఎవర్రా నువ్వు?” అన్న గర్జింపుతో పాటు గుహలో కోలాహలం వినపడింది.

(సశేషం)

Exit mobile version