[బాలబాలికల కోసం ‘సూక్ష్మజీవులను తొలిసారి చూసిన వాన్ లీవెన్‌హాక్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
మీరు ‘ఏక కణ జీవి అంటే ఏమిటి?’ అని అడగ్గానే అమీబా అని ఠక్కున జవాబు చెప్పేస్తారు కదూ! అసలు ఈ అమీబా ఉన్నదని మనకెలా తెలిసిందీ? ఇది కంటికి కనిపించని సూక్ష్మజీవి అనీ, దీనివల్ల ప్రమాదకరమైన అమీబియాసిస్ అనే వ్యాధి వస్తుందనీ ఎలా కనుక్కున్నారు? ఇవన్నీ తెలియాలంటే మనం లీవెన్‌హాక్ గురించి తెలుసుకోవాల్సిందే!
లీవెన్‌హాక్ 1632వ సంవత్సరం అక్టోబరు 24వ తేదీన హాలెండ్ లోని ‘డెల్ఫ్’ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి బుట్టలు అల్లే పనిచేసేవాడు. బాల్యంలో పెద్దగా చదువుకోలేదు. అతనికి 22 ఏళ్ల వయసులో వివాహమయింది. డెల్స్ లోనే ఓ బట్టలషాపు పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో బట్టల నాణ్యతను పరిశీలించటానికి కటకాలను ఉపయోగించే వారు. లీవెన్ హక్ మంచి గాజుపలకలను సానపట్టి కటకాలుగా తయారుచేసేవాడు. ఆయనకున్న ఈ అలవాటు వలననే మనకు సూక్ష్మక్రిములు అనేవి ఉంటాయనీ, వాటివలన జబ్బులు వస్తాయనీ తెలిసింది.
లీవెన్‌హక్ కటకాలతో వస్త్రాల నాణ్యతను పరిశీలిస్తుండగా ఆకులు, పువ్వులు, మొగ్గలు చూస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అలా చెట్లను పరిశీలించడంతోపాటు చర్మాన్ని, రక్తాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. సూక్ష్మకేశ నాళికల ద్వారా రక్తం ఎలా ప్రవహిస్తుందో గమనించాడు. లీవెన్ హక్ మొదటిసారిగా 1674లో సూక్ష్మదర్శిని ద్వారా బాక్టీరియాను, ప్రోటో జోవన్లను చూశాడు. వీటికి ఈయన “వెరీ లిటిల్ యానిమల్ క్యూల్స్” అని పేరు పెట్టాడు.
ఆ తరువాత లీవెన్‌హాక్ నీటినీ, గాలినీ కూడా సూక్ష్మదర్శిని సహాయంతో చూసినపుడు కొన్ని సూక్ష్మజీవులు కనిపించాయి. కంటికి కనిపించకుండా కొన్ని జీవులు ఉంటాయని ప్రపంచానికి అప్పుడే తెలిసింది. ఈ క్రమంలోనే ఏక కణజీవి అయిన అమీబా ఆవిష్కరింపబడింది.
1673వ సంవత్సరంలో రిగ్నైర్ డేగ్రాఫ్ అనే ఫిజిక్స్ సైంటిస్ట్ మొదటిసారిగా లీవెన్‌హాక్ గొప్పదనాన్ని గమనించి రాయల్ సోసైటీ ఆఫ్ లండన్ కు తెలియజేశాడు. లీవెన్‌హాక్ జరిపిన పరిశోధనాంశాల్ని రాయల్ సోసైటీ ప్రపంచానికి తెలియచేసింది. 1680లో రాయల్ సోసైటీ లీవెన్హక్కు సభ్యత్వమిచ్చింది. సుమారు 50 సంవత్సరాల పాటు లీవెన్‌హాక్ రాయల్ సోసైటీతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ‘17వ శతాబ్దపు అత్యుత్తమ అమెచ్యూర్ సైంటిస్ట్’ అని హాక్ ప్రపంచమంతా గౌరవింపబడ్డాడు.
చీమల నోట్లోని తెల్లని పదార్థాలను అందరూ ఆహార పదార్థాలని భావించేవారు. కానీ హాక్ వలన అవి ప్యూపాలని తెలిసింది. బియ్యం మరియు ధాన్యాలలో ఉండే పురుగులు అందులోనే పుడతాయని అనుకునేవారు అప్పటిదాకా. లీవెన్‌హాక్ బాక్టీరియాల మీదా, ప్రోటోజోవన్ల మీదా పరిశోధనలు జరిపి ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
లీవెన్‌హాక్ ఏమీ చదువుకోకుండానే శాస్త్రవేత్త అయ్యాడు. ఇల్లు తప్ప ఏ ప్రయోగశాలలోనూ పరిశోధనలు చేయలేదు. అయినప్పటికీ ఆయన పరిశోధనలకు ప్రపంచమంతా తలవంచింది. లీవెన్‌హక్ నూ ఆయన తయారుచేసిన సూక్ష్మదర్శినిలనూ చూడటానికి ‘రష్యా చక్రవర్తి ఒకటో పీటర్, పర్షియా రాజు ఫ్రెడరిక్ గ్రేట్, ఇంగ్లాండ్ చక్రవర్తి రెండో జేమ్స్’ వంటి ప్రముఖులు వచ్చారు. ఆయన తయారుచేసిన మైక్రోస్కోపులన్నింటినీ రాయల్ సోసైటీకి ఇచ్చేశారు. సూక్ష్మక్రిములనేవి ఉన్నాయని కనుక్కోబట్టే కదా ఆ సూక్ష్మక్రిముల వలన జీవులకు జబ్బులు వస్తాయని తెలుసుకోవటం, ఆ తరువాత ఆ జబ్బులకు మందులు కనుక్కోవటం ఇవన్నీ జరిగాయి. మానవాళికి ఎంతో ఉపయోగకరమైన పరిశోధనల్ని జరిపిన లీవెన్‌హాక్ 1723వ సంవత్సరంలో ఆయనకు 91వ సంవత్సరంలో కన్నుమూశాడు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
