Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సూర్యోదయం..!!

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘సూర్యోదయం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

కాశం ఎప్పుడూ ఆశ్చర్యమే,
ప్రతిఫలించే రంగులెన్నో..!
సూర్యుడు ఉదయించినపుడు
ఆనందోత్సాహాలు..
ఉల్లాసాల రంగుల వర్ణ చిత్రాలు!
సాయం సంధ్య వేళ..
నారింజ ఎరుపు వర్ణ శోభితం
మరచిపోలేని సువర్ణ కలశం!
ఒక్కోసారి ఆకాశంలో..
పత్తి పోగు —
చెల్లాచెదిరిపోయినట్టు,
తెల తెల్లటి మేఘపు తునకలు!
అప్పుడు చూడాలి
పిల్ల మేఘాలు..
పెద్ద మేఘాలు అన్నీ
ఒకటే హడావిడి..!
కొన్ని తెల్ల మేఘాలు
ఉయ్యాలలూగుతాయి
కొన్ని బుద్ధిమంతుల్లా..
ప్రకాశవంతంగా..
నిర్మలంగా.. చెదిరినట్టుగా
సాగిపోతుంటాయి..
మేఘాలన్నీ కలిసి సూర్యుణ్ణి
దాచేస్తాయి..!
అవి సూర్య మండలంలోకి
వెళ్లగలవో.. లేవో గానీ..
సూర్యుడు మాత్రం –
మేఘాలను తప్పించుకుని ,
ఉరికురికి వచ్చేస్తాడు!
వీటన్నింటికీ అతగాడు
అతీతుడు కదా..
నల్లని ఆకాశంలో..
చంచలమైన మేఘాలను
దాటి ఉదయిస్తాడు..!
ఎందుకంటే ఈ సమస్త విశ్వాన్ని
వెలిగించాలి కదామరి..!!

Exit mobile version