[శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు రచించిన ‘సూర్యుడు’ అనే కవితని అందిస్తున్నాము.]
అన్ని లోకాలకధిపతైన ఆ అమ్మ
ఏ పూవ్వత్తినో వెల్గించి పెట్టిన
అఖండ దివ్య దీపం లాగ
సింహాచలం కొండ సిగ పై
నామాల వాకిటి ముంగిట గుమ్మరించిన
పచ్చ సంపంగి పూమాలల గంపలాగ
ఏడేడు వర్ణాల ఏకఛత్రాధిపత్యానికై
శిఖరం మొనల, గోపురం కొనల పై
ఏకదృష్టితో భాసించే ఏలిక లాగ
గోరింట చిగుర్లు దూసి, మేసిన
ఏడు గుర్రాల వేదాంతి లాగ
బండ ఎరుపెక్కిన బంతి లాగ
తెల్ల పావురాల గుంపున్న ఆకాశాన
మల్లెల వాల్జడలో పొదిగిన
ఒంటరి పగడం బిళ్ళ లాగ
ప్రభాత ప్రకాశ గమన వికాసాన
పైపైకెగిసే పరిక్రమణల ఆరంభాన
విఘ్న నాశనానికై విత్తిన పసుపుముద్ద లాగ
భుగభుగమని జూలు విదిలిస్తూ
సరిహద్దు లంఘనలలో ఉత్తీర్ణుడౌతూ
వితీర్ణమైన నారింజరంగు నరహరి లాగ
కరిగించిన మంచు తెరలకు
కోనేటి నీటిలో కుంకుమ పూలద్ది
తల్లికై పదిల పరుస్తున్న తనయుడి లాగ
తళుక్కున,తుపుక్కున, చురుక్కున తేలి
కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలను
కాంతి జలంతో కడుగుతున్న కర్మసాక్షి లాగ
చరచరా, గబగబా చోద్యాల ఏకరువుతో
వైశాఖ మాసాన వేడి పండు లాగ
వద్దన్నా దాడి చేస్తున్న వెల్తురు దండు లాగ.. సూర్యుడే!!!
