[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]
~
సౌదామినీ పరిణయము భాగం 9
81 – కం॥
ఆతడు భువనత్రయ వి
ఖ్యాతాభ్రంకష యశో వికాసుం డూహా
తీతుడు సకల ప్రాణి
త్రాతనతాభీష్ట సంప్రదాతయు మఱియున్॥
పదార్థాలు:
ఆతడు = ఆయన;
భువనత్రయ =మూడు లోకాల్లో (భూ, భువః, స్వః); విఖ్యాత అభ్రంకష యశో వికాసుడు = ఆకాశాన్ని తాకేంత విస్తరించిన కీర్తి గలవాడు;
అభ్రం = ఆకాశం
కష = తాకుట
ఊహాతీతుడు = మన ఊహలకు అందనివాడు;
సకల ప్రాణి త్రాత =సమస్త జీవులను రక్షించేవాడు;
తా అభీష్ట సంప్రదాత =వారి కోరికలను నెరవేర్చే వాడు;మఱియున్ = అంతేకాక;
భావం:
ఆయన మూడు లోకాలలోనూ ప్రసిద్ధుడై, ఆకాశాన్నే తాకేంత విస్తరించిన కీర్తిని కలవాడు,మన ఊహలకు అందనంత మహిమగలవాడు, సమస్త ప్రాణులకు రక్షకుడు;వారి అభీష్టాలను ప్రసాదించే వరదాత కూడా..
మహిమా వర్ణన:
“అభ్రంకష యశోవికాసుడు” అనే పదప్రయోగం ద్వారా కీర్తి ఆకాశమును తాకుతున్నదని చెప్పి, అతిశయోక్తి అలంకారం వ్యక్తమైంది. విశ్వరక్షకత్వం “సకల ప్రాణి త్రాత” అంటే ఆయన కేవలం ఒక వర్గానికే కాదు; సమస్త జీవులకు రక్షకుడు. వరప్రదత్వంఅంటే రక్షణ మాత్రమే కాదు, కోరికలను కూడా నెరవేర్చే కరుణామూర్తి.
ఈ పద్యం భగవంతుని గొప్పదనాన్ని చెప్పే స్తుతి.
కవివర్ణించింది విశ్వవ్యాప్తుడైన పరమాత్మ స్వరూపం.. సాధారణంగా ఈ లక్షణాలు శ్రీకృష్ణుడు లేదా విష్ణు తత్త్వ స్వరూపానికి వర్తిస్తాయి.
82 – సీ॥
మంజుదోస్తేష్ఠీయ మాన పంచాయుధు
డతి వేల రారాజదసిత తనుడు
మౌనిదృగంభ్రమ్యమాణ స్వరూపుడు
శ్రుతి శీరోనానటచ్ఛుభచరణుడు
రోరుచ్యమాన గాధా రసోపేతుడు
దిగ్దశజోఘుత్కీర్తి మహితు
డని శజంజన్య మానాను కంపా మతి
బాభా మదమలసువర్ణ చేలు
తే॥
డానతా వితు కాముడు యాతుహంతు
కాముడు భ వార్తి పరిహర్తు కాముడఖిల
వల్ల వీరంతు కాముడు పావ మంష్టు
కాము డబ్జాల యా మనః కాముడతడు.
ఈ అద్భుతమైన పద్యం శ్రీకృష్ణుని వైభవాన్ని, ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని వర్ణిస్తోంది. సంస్కృత భూయిష్టమైన పదజాలంతో, యజంత రూపాలను (జన్యమాన, రోరుచ్యమాన వంటివి) ఉపయోగిస్తూ సాగిన ఈ సీస పద్యం అత్యంత గంభీరంగా ఉంది.
పద్య భావం:
మంజుదోస్తేష్ఠీయ మాన పంచాయుధుడు: తన అందమైన బాహువుల శక్తితో మన్మథుని సైతం జయించినవాడు (లేదా మన్మథుని వంటి సౌందర్యం కలవాడు).
అతి వేల రారాజదసిత తనుడు: హద్దులు లేని కాంతితో ప్రకాశించే నల్లని (మేఘశ్యామల) శరీరం కలవాడు.
మౌనిదృగంభ్రమ్యమాణ స్వరూపుడు: మునుల కళ్ళముందే కదలాడుతూ, వారి ధ్యానంలో నిరంతరం నిలిచే స్వరూపం కలవాడు.
శృతి శీరోనానటచ్ఛుభచరణుడు: వేదాంతాల (ఉపనిషత్తుల) శిఖరాలపై నాట్యం చేసే శుభప్రదమైన పాదములు కలవాడు.
రోరుచ్యమాన గాధా రసోపేతుడు: మిక్కిలి ప్రకాశించే, భక్తి రసంతో నిండిన గాథలు (కథలు) కలవాడు.
దిగ్దశజోఘుత్కీర్తి మహితుడు: పది దిక్కులా మారుమోగుతున్న గొప్ప కీర్తి గలవాడు.
అనిశ జంజన్యమా నానుకంపా మతి: ఎల్లప్పుడూ తన మనస్సులో భక్తుల పట్ల అమితమైన జాలిని, కరుణను కలిగి ఉండేవాడు.
బాభా మదమల సువర్ణ చేలుడు: మిక్కిలి ప్రకాశించే నిర్మలమైన పచ్చని వస్త్రములు (పీతాంబరము) ధరించినవాడు.
*ఆనతావితు కాముడు: తల వంచి నమస్కరించిన భక్తులను రక్షించాలని కోరుకునేవాడు.
యాతుహంతు కాముడు: రాక్షసులను సంహరించాలని అనుకునేవాడు.
భవార్తిపరిహర్తు కాముడు: సంసార దుఃఖాలను (జన్మ మృత్యు భయాలను) తొలగించాలనుకునేవాడు.
అఖిల వల్లవీరంతు కాముడు: గోపికలందరినీ అలరింపజేయాలని (ఆనందింపజేయాలని) కోరుకునేవాడు.
పావమంష్టు కాముడు: భక్తుల పాపాలను దహించివేయాలని కోరుకునేవాడు.
అబ్జాలయా మనః కాముడు: లక్ష్మీదేవి మనస్సులో నిరంతరం విహరించేవాడు.
ఈ పద్యంలోని విశేషం ఏమిటంటే..
ఈ పద్యంలో “కాముడు” అనే పదం చివరలో పదే పదే వస్తుంది. ఇక్కడ కాముడు అంటే కోరిక గలవాడు అని అర్థం. అంటే భక్తులను రక్షించడం, పాపాలను పోగొట్టడం అనేవి ఆయన నిరంతరం కోరుకునే పనులని కవి చాలా చక్కగా వర్ణించారు.
నిజంగా ఇది పండితరంజకమైన, భక్తిరసభరితమైన పద్యం!
సరళ అనువాదం:
“ఆ శ్రీకృష్ణుడు ఎటువంటివాడంటే – మన్మథుడిని సైతం తన అందంతో ఓడించగలవాడు. మేఘం లాంటి నల్లని మేని ఛాయతో మెరిసిపోయేవాడు. మునులు తమ ధ్యానంలో నిరంతరం దర్శించే రూపం ఆయనది. వేదాల సారమంతా ఆయన పాదాల చెంతనే ఉంది. లోకంలోని భక్తుల బాధలను పోగొట్టడం, దుష్టులను తుదముట్టించడం, తనను నమ్మిన వారిని కరుణతో కాపాడటమే ఆయన నిరంతర సంకల్పం. అటువంటి పరమాత్ముడు భక్తుల పాపాలను హరిస్తూ, లక్ష్మీదేవి మనసులో కొలువై ఉన్నాడు.”
షష్ఠ్యంతములు:
సౌదామినీ పరిణయం లోని “షష్ఠ్యంతములు” అనే శీర్షిక కింద రాసిన పద్యాలలో కవి షష్ఠీ విభక్తి (యొక్క భావాన్ని) కవితాత్మకంగాఒక పద్ధతిలో అమర్చారు. ఈ పద్యాలన్నింటిలోనూ ప్రతి పదబంధం ఒకదానితో ఒకటి సంబంధాన్ని సూచిస్తూ “ఎవరిది?” అనే ఆలోచన కలిగిస్తుంది.
ఈ భాగంలో కవి ప్రధానంగా శ్రీకృష్ణుని గుణాలను, మహిమను, దైవస్వరూపాన్ని వివరిస్తూ.. ఆయనను గుణాలకు నిలయంగాను, కరుణకు ఆభరణంగాను, భక్తుల పాలిటి రక్షకుడుగాను, దేవతల పూజలందుకునే వాడిగా చిత్రించాడు. ప్రతి పద్యంలో అనేక పదాలు షష్ఠీ విభక్తి రూపాలలో ఉండటం వల్ల, వాక్యరచన అంతటా ఒక సంబంధబద్ధమైన భావప్రవాహం వలె ఉంది. కవి వినియోగించిన ఈ శైలి ద్వారా వ్యాకరణాంశమైన “షష్ఠ్యంతములు” కేవలం నియమంగా కాకుండా, అలంకారమయమైన కవిత్వంగా రూపాంతరం చెందాయి. పద్యాలలోని పదబంధాలు పరస్పర అనుబంధాన్ని తెలియజేస్తూ, దైవ గుణాల పరంపరను సుందరంగా ప్రతిపాదించాయి. చివరగా ఈ “షష్ఠ్యంతములు” ద్వారా కవి సంబంధమే సృష్టి యొక్క మూలం అనే భావాన్ని ప్రతిపాదిస్తూ, వ్యాకరణ సౌందర్యాన్ని సాహిత్య మాధుర్యంతో మేళవించారు.
“షష్ఠ్యంతములు” అంటే తెలుగు కావ్యాల్లో గానీ, పురాణాల్లో గానీ కథా ప్రారంభానికి ముందు ఇష్టదేవతాస్తుతి లేదా కృతిభర్త స్తుతి కోసం షష్ఠీ విభక్తి (యొక్క, లోన్, లోపలన్, కిన్, కున్) ప్రత్యయాలతో ముగిసే పద్యాలను ‘షష్ఠ్యంతములు’ అంటారు. ఇవి ఆరుపద్యాలతో కూడి ఉంటాయి . ఇవి భక్తిని, కృతిభర్త గొప్పతనాన్ని తెలుపుతూ, పదాల చివర ‘న్’ కారంతో ముగుస్తాయి.
వ్యాకరణంలో షష్ఠీ విభక్తి అంటే “యొక్క” అనే అర్థాన్ని తెలుపుతుంది.
ఈ పద్యాలలో కవి ప్రతి పాదంలో లేదా పద్యంలో షష్ఠీవిభక్తి భావాన్ని వ్యక్తపరచే పదాలను (షష్ఠ్యంతములు) చమత్కారంగా ఉపయోగించారు.
నాయిక–నాయకుల మధ్య ఉన్న సంబంధం, అనుబంధాన్ని చూపించడానికి షష్ఠీ విభక్తి ఉపయోగించాడు. ఒక వ్యక్తి, వస్తువు, లక్షణం.. ఇవన్నీ ఎవరికి చెందినవి? అనే భావంతో పద్యరచన చేస్తారు. పద్యాల్లో అలంకార శోభ పెంచేందుకు వరుసగా షష్ఠ్యంతములు రాసారు. వాటిని చూద్దాం.
83 – కం॥
ఏవం విధాద్వితీయ గు
ణావరణ ప్రాభనకు స్వాంఘ్రిద్వంద్వ
శ్రీ విన్యాస నివర్తిత
పీవీర కాళియ ఫణాత్త పృథుగర్వునకున్.
ఈ పద్యంలో ఏవం విధాద్వితీయ గు
ణం వరణ ప్రాభనకున్,
కాళియ ఫణాత్త పృథు గర్వునకున్.
షష్ఠీ విభక్త్యతంతో రాసారు.
అద్వితీయ గుణాల కల వానికి,
అతడు కాళియ సర్పుని ఫణాల గర్వాన్ని తొలగించిన వానికి అనే అర్థంలో ఉపయోగించారు.
84-కం॥
శ్రీ వరులకు రూపజిత ర
తీవరునకు మౌనిచిత్త దివ్యాబ్జ చ్ఛా
యువకులకు కరుణా తటి
నీ వరులకు దలిత యాత్వ నీరుకున్.
ఈ పద్యంలో కవి ఒక మహోన్నతుడైన కృష్ణుడిని ఇలా వర్ణిస్తున్నాడు: శ్రీవరుల యొక్క రూపాన్ని జయించినవానికి ,అందంలో మన్మథుని కన్నా అందగానికి, మునుల హృదయ కమలాలో సదా నివసించేవానికి, కరుణా సముద్రం యొక్క తీరంలాంటి వానికి.
ఈ పద్యంలో కనిపించే షష్ఠీ భావ పదాలు:
శ్రీ వరులకున్, రూపజిత రతీవరునకున్, మౌనిచిత్త దివ్యాబ్జ చ్ఛాయువకులకున్, కరుణా తటి
నీ వరులకున్, దలిత యా త్వ నీరుకున్.
ఇవన్నీ “ఎవరివి గుణాలు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పే షష్ఠ్యంతములు.
కృష్ణుడు అందం, కరుణ, మహిమల యొక్క నిలయం అని కవి తెలియజేస్తున్నాడు.
85- కం॥
పతికిన్ పృథు కరుణాన్విత
మతికిన్ నిగమాంత గీత మహిత గుణగణో
న్నతికిన్ రక్షిత యతిజన
తతికిన్ స్థాపిత సమస్త ధర్మ వితతికిన్.
ఇందులో కూడా కవి వరుసగా షష్ఠీ విభక్తి భావాన్ని అందంగా ప్రయోగించాడు. కృష్ణుడి గుణాలను వర్ణిస్తూ..
పతికిన్ — ప్రభువుకు,
మతికిన్ — కరుణ కలిగిన వానికి
అతడు వేదాంత గీతలచే స్తుతించబడిన గుణగణాల యొక్క ఉన్నతుడైన వానికి
యతిజన తతికి — యతుల సమూహాలను రక్షించేవాడికి
సమస్త ధర్మ వితతికి → అన్ని ధర్మాల యొక్క విస్తరణకు మూలమైన వానికి
ఈ పద్యంలో ప్రధానంగా కనిపించే షష్ఠీ భావ పదాలు:
పతికిన్ –
మతికిన్ –
ఉన్నతికిన్ –
తతికిన్ –
వితతికిన్ –
ఇవన్నీ షష్ఠీ భావాన్ని సూచించే షష్ఠ్యంతములు.
అతడు కరుణ, జ్ఞానం, ధర్మం వంటి అన్ని శ్రేష్ఠ గుణాలకు ఆధారమైనవాడు. యతులను రక్షించి ధర్మాన్ని స్థాపించేవాడని అర్థం.
86 – కం॥
కరుణా రస భరితాంతః
కరుణాభరణునకు గోపికాజారునకున్
శరణాగత జన తారణ
తరుణారుణ చరణునకు వితరణాత్మునకున్.
ఈ పద్యంలో కవి శ్రీకృష్ణుని మహిమను వర్ణిస్తూ..
అతడు దయారసంతో నిండిన హృదయంకల వాడు,కరుణను ఆభరణంగా ధరించినవాడు,
గోపికల ప్రియుడు,శరణాగతుల రక్షకుడు
ఉదయసూర్యుని వంటి ఎఱుపురంగు పాదాలుకల వాడు.దానగుణం యొక్క స్వరూపుడు
కరుణాభరణునకు – కరుణ అనే ఆభరణం కలిగిన వానికి
గోపికాజారునకున్ -గోపికల యొక్క ప్రియుడైన వానికి
శరణాగత జన – శరణు కోరి వచ్చిన జనులు కొలిచేటి
చరణునకు – పాదాలకు
వితరణాత్మునకున్ – దాన స్వభావం కలిగిన వానికి
ఇవన్నీ “ఎవరివి?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పే షష్ఠ్యంతములు.
శ్రీకృష్ణుడు కరుణ, దానం, రక్షణ వంటి గుణాల యొక్క నిలయం; శరణాగతులను కాపాడే దయామయుడు.
87 – కం॥
సుందర తర నందవ్రజ
కుంద మరందావదాత గోవిందునకున్
క్రందత్పర విందద్భుధ
నందత్సుర చిత్రఖేలనాశీలునకున్.
కవి శ్రీకృష్ణుని మహిమను షష్ఠీ భావంతో వర్ణిస్తున్నాడు.
అతడు అత్యంత సుందరమైన నందవ్రజనివాసి
పువ్వుల మకరందం ఇచ్చే ఆనందం వంటి ఆనందాన్ని ఇచ్చే గోవిందుడు,దుఃఖితులైన భక్తుల యొక్క బాధలను తొలగించేవాడు,దేవతల ఆనందానికి కారణభూతుడు, అతని లీలలన్నీఆశ్చర్యకరమైనవే
దీనిలో షష్ఠ్యంత పదాలు..
గోవిందునకున్
చిత్రఖేలనాశీలునకున్.
88-కం॥
నాకధిపముఖదేవా
నీక శిరోమకుటఖచిత నిర్ణిద్ర సుశో
భాకలిత దివ్యరత్నా
నీక సుమసమర్పితాంఘ్రి నీరేజునకున్.
ఈ పద్యంలో కవి శ్రీకృష్ణుని ఇలా వర్ణిస్తున్నాడు.
దివ్య కాంతితో వెలిగిపోతున్న పాదాలను స్వర్గాధిపతి ఇంద్రుడు మొదలైన దేవతలే తమ తలలు వంచి కిరీటాలనే పూలతోపూజించేంత గొప్పవాడు శ్రీకృష్ణుడు.
దీనిలో షష్ఠ్యంత పదాలు..
నీరేజునకున్.. తామరలు వంటి కన్నులు కలవానికి.
(సశేషం)
శ్రీమతి రంగరాజు పద్మజ ప్రముఖ రచయిత్రి. కీ.శే. ఒద్దిరాజు కమలాదేవి, కీ.శే. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు వీరి తల్లిదండ్రులు. జన్మస్థలం ఇనుగుర్తి, కేసముద్రం మండలం. పద్మజ గారు సుమారు 100 కథలు, 300 కవితలు, సుమారు 100 మ్యూజింగ్స్ వ్రాశారు. మనసే కోవెల (కథాసంపుటి), చిత్రకవితలు (కవితా సంపుటి), హరిదాసి (అనుసృజన – నవల), గుండెల్లోతుల్లోంచి (కథా సంపుటి), నాటి నుండి నేటి వరకు (గ్రామ చరిత్ర), వ్యాస వితతి (వ్యాస సంపుటి), భక్తి భండారి (జీవిత చరిత్ర) వంటి పుస్తకాలు వెలువరించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి రుద్రమదేవి నవలను సరళీకృతం చేశారు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి చారిత్రక పద్యకావ్యం ‘ఖడ్గతిక్కన’ను పరిష్కృతం చేసి పాఠకులకు అందించారు. ఒద్దిరాజు సోదరుల ‘కృష్ణస్తవః, వైభవస్తవః’ కావ్యాలను, మరియు సర్వలోకేశ్వర శతకంను పరిష్కరించారు.
ఒద్దిరాజు సోదరులు, రాణి శంకరమ్మ , సమ్మక్క.. సారలమ్మ, పారిజాతాపహరణం వంటి బుర్రకథలు రచించారు.
సనాతన ధర్మం ఆవాసాలు (దేవాలయాలు), నాయన, ఇంద్రధనుస్సు (కవితా సంకలనం), వ్యాసాలు మరియు రేడియో ప్రసంగాలు అముద్రితాలు
భక్త్యామృతం, మయూఖ, తరుణి, నెచ్చెలి, నేడు, ప్రజాతంత్ర పత్రికలో వ్యాసాలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణా సారస్వత పరిషత్తు వారి వరిష్ఠ పురస్కారం, మహిళా సేవా భక్తి పురస్కారం,
వెల్లుల్లి ఫౌండేషన్ వారిచే మహిళా సాధికారత విశిష్ట పురస్కారం, తెలుగు సాహిత్య అకాడమీ మరియు అక్షరయాన్ మహిళా రచయిత్రుల సంఘం వారిచే వెంగమాంబ పురస్కారం, వరంగల్ మహానగర పాలక సంస్థ రాష్ట్ర మహిళా విభాగము వారిచే విశిష్ట మహిళా పురస్కారం వంటి పురస్కారాలు స్వీకరించారు.
రామం భజే శ్యామలమ్ వారిచే ఆర్ష ధర్మ ప్రదీపిక, మల్లినాథసూరి కళాపీఠం వారిచే వ్యాఖ్యాన సామ్రాజ్ఞి, మేకా రవీంద్ర వారిచే సహస్ర పద్యం కంఠీరవ అనే బిరుదులు పొందరు. చరవాణి: 99897 58144
