Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-11

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 10

కథారంభము

​తెలుగుసాహిసతీ వనంలో ప్రబంధం ఒక వికసించిన పారిజాతం. అక్షర లక్షల విలువ చేసే వర్ణనలు, ఉదాత్తమైన నాయకానాయికల చిత్రణ దీని ప్రత్యేకత. అటువంటి ప్రబంధ మార్గంలో, తెలంగాణ వైతాళికులు ‘ఒద్దిరాజు సోదరులు’ తీర్చిదిద్దిన రమ్యకావ్యం ఈ ‘సౌదామినీ పరిణయము’.

​ఈ కథా ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు..

ఒక వైపు ధర్మ రక్షణ కోసం నిరంతరం పరితపించే శ్రీకృష్ణ పరమాత్మ, మరోవైపు భక్తితో, అనురాగంతో ఆయననే పతిగా కోరుకున్న సౌదామిని. వీరిద్దరి కలయిక కేవలం ఒక వివాహం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంగమం. కౌశాంబీ నగర ప్రాశస్త్యం, ఆనాటి సామాజిక వైభవం, ధర్మబద్ధమైన యజ్ఞ నిర్వహణ.. వీటన్నింటినీ ఈ కావ్యం మన కళ్లకు కడుతుంది.

గ్రాంథిక భాషలోని గాంభీర్యం కొంత క్లిష్టంగా అనిపించినా, ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి చదువుతుంటే, అందులోని తీయదనం మీకే అర్థమవుతుంది. ఆనాటి కాలపు తెలుగుదనపు పరిమళాన్ని, కవుల భావనా పటిమను నేటి సరళ శైలిలో మీకు అందిస్తున్నాను. రండి, ద్వాపర యుగపు ఆ రమణీయ ఘట్టంలోకి ప్రవేశిద్దాం!
89. కం॥
అని ప్రథమ పురుష షష్ఠిని
నిను బురుష ప్రథముబాడి నీ కంకితమి
చ్చిన బంధురమౌ సౌదా
మినీ పరిణయ చరిత ప్రమేయమెటులనన్.

ఈ పద్యం చాలా ముఖ్యమైది. ఇది ‘కృతి సమర్పణ’ (పుస్తకాన్ని అంకితం ఇవ్వడం) మరియు కథా ప్రారంభం’మధ్య ఉండే సంధి పద్యం. పెద్దనాయనగారు ఈ పద్యంలో వ్యాకరణ పరమైన చమత్కారాన్ని (ప్రథమ పురుష, షష్ఠి) ఉపయోగిస్తూనే, భక్తిని మరియు కావ్య ఉద్దేశ్యాన్ని చాటి చెప్పారు.

సరళ భావానువాదం:

“ఈ విధంగా” పురాణ పురుషుడవు!, అందరికంటే అగ్రగణ్యుడవు! (పురుషోత్తముడవు)” అయిన నిన్ను ప్రార్థించి, నీ కీర్తిని గానం చేస్తూ, ఈ ‘సౌదామినీ పరిణయము’ అనే గొప్ప కావ్యాన్ని నీకే అంకితం ఇస్తున్నాను. ఇంతటి మనోహరమైన ఈ కథా వృత్తాంతం ఏ విధంగా మొదలైందంటే?

వ్యాకరణ చమత్కారం ఇక్కడ కవి  ‘ప్రథమ పురుష షష్ఠి’ అనే పదాలను వాడారు. సాధారణంగా వ్యాకరణంలో ఇవి విభక్తులు. కానీ ఇక్కడ ‘ప్రథమ పురుషుడు’ అంటే ఆ పరమాత్మ అని అర్థం. ఆ దేవుడిని స్తుతించి, ఈ కావ్యాన్ని ఆయనకు అంకితం ఇస్తూ కథలోకి ప్రవేశిస్తున్నారు.

బంధురము అంటే ఎంతో అందమైనది లేదా దృఢమైనది అని అర్థం. ఈ కావ్యం చాలా రమ్యంగా ఉంటుందని కవి అంటున్నారు.

ప్రమేయమెటులనన్ అంటే “ఇక కథా సందర్భం ఏమిటంటే..” అని అర్థం. ఇక్కడి నుండి అసలు కథ పాఠకులకు విడమర్చి చెప్పబోతున్నారు.

90. కం॥
శ్రీరుక్మిణీ సతీ హృ
త్పా రసనిష్యందమాన తత హార్ధ సుధా
ధారా స్వాదన తుష్ట మ
నోరోలంబ ప్రతీతనుతద కృష్ణా!

హృత్పా రసము = హృదయం అనే పద్మము

నిష్యందమాన= స్రవిస్తున్న

హార్ధ సుధా ధార = ప్రేమ అనే అమృత ధార.

స్వాదన తుష్ట = రుచి చూసి సంతోషించిన.

మనోరోలంబ = మనస్సు అనే తుమ్మెద (రోలంబము అంటే తుమ్మెద).

నుతద = స్తుతించబడిన వాడు.

సరళ భావానువాదం:

“ఓ శ్రీకృష్ణా! నీవు ఎటువంటివాడవంటే.. రుక్మిణీదేవి హృదయం అనే పద్మం నుండి జాలువారుతున్న నిండైన ప్రేమ అనే అమృత ధారను ఆస్వాదించి, పరవశించిపోయే మనస్సు అనే ‘తుమ్మెద’వు నీవు. అటువంటి దివ్యమైన రూపం గల నిన్ను భక్తితో కొలుస్తున్నాను.”

సాధారణంగా తుమ్మెద పద్మంలోని మకరందాన్ని తాగి సంతోషిస్తుంది. ఇక్కడ కవి ఒక అందమైన పోలిక చెప్పారు:

రుక్మిణీదేవి హృదయం = ఒక పద్మం.

ఆమె ప్రేమ  = ఆ పద్మంలోని మకరందం (అమృతం).

శ్రీకృష్ణుని మనస్సు  = ఆ మకరందాన్ని తాగే తుమ్మెద.అంటే, రుక్మిణీకృష్ణుల మధ్య ఉన్న అనంతమైన ప్రేమను, ఒక భౌతికమైన తుమ్మెద-పద్మం ఉదాహరణతో కవి ఇక్కడ అత్యంత రమ్యంగా చిత్రించారు.

ఈ పద్యం అద్భుతమైన రూపకాలంకారంతో, శ్రీకృష్ణుడిని ఒక తుమ్మెదగా వర్ణిస్తూ సాగింది.

నైమిశారణ్యం వర్ణన:
91. తేటగీతి॥
అవధరింపుము పుష్ప ఫలాభిగణ్య
పాదపవరేణ్య నద్ధ లావణ్య లలిత
వల్లరీ పుంజరచిత భా స్వన్ని కుంజ
పుణ్యమై యొప్పు నైమిషారణ్యమందు.

అవధరింపుము=చిత్తగించుము (వినండి అని అర్థం)

పాదప వరేణ్య = శ్రేష్టమైన చెట్లు (పాదపము అంటే చెట్టు);

వల్లరీ పుంజము =  తీగెల సమూహం;

భాస్వన్నికుంజము  =  ప్రకాశించే పొదరిండ్లు;

నైమిషారణ్యము = ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యారణ్యం (పురాణాలన్నీ ఇక్కడే చెప్పబడ్డాయి).

సరళ భావానువాదం:

“ఓ పాఠకులారా! చిత్తగించండి.. రక రకాల పూలతో, పండ్లతో అలరారే గొప్ప గొప్ప వృక్షాలతో ఆ ప్రాంతం విరాజిల్లుతోంది. అందమైన తీగలు అల్లుకొని ఏర్పడిన పొదరిండ్లతో, నిరంతరం వెలుగులీనుతూ, ఎంతో పవిత్రంగా వెలిగిపోతున్న ఆ ‘నైమిశారణ్యం’లో..”

ఈ పద్యం నుండి సౌదామినీ పరిణయము అసలు కథా స్థలపురాణం మొదలవుతున్నది.  పెద్ద నాయనగారు ఈ కావ్యాన్ని పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యం అనే పవిత్ర ప్రదేశాన్ని ప్రబంధ ప్రారంభ ద్వారంగా ఎంచుకుని,అదెలా ఉందో కనులకు కట్టినట్టు చెప్తున్నారు.

నైమిశారణ్యం అంటే కేవలం అడవి కాదు, అది మునులు తపస్సు చేసుకునే పుణ్యభూమి. ఆ అడవిలోని ప్రకృతి సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు.

చెట్లు అంటే కేవలం చెట్లు కాదు, నోరూరించే పండ్లు, కనువిందు చేసే పూలతో నిండిన శ్రేష్టమైన వృక్షాలు, పొదరిండ్లంటే తీగలు అల్లుకొని సహజంగా ఏర్పడిన ఏకాంత ప్రదేశాలు (నికుంజములు). అడవిలోని ఆ ప్రశాంతతను, పవిత్రతను ‘పుణ్యమై యొప్పు’ అని కవి వర్ణించారు.

92. సీ॥
క్షీర పాథోధి సుతా రమణోరువ
క్షముదన్నినట్టి మస్కరి యొకండు
ధాతృ సృష్టికి ప్రతిద్వంద్వ చరాచర
సృష్టిజేసిన తపస్వి మునొకండు
ఖండపరశుకృపాకలితోగ్ర శక్తిచేఁ
గాలు దోలిన పారికాంక్షి యొకడు
ద్రుహిణ శౌరి మహేశ్వరుల నందనులుగా
బడయజాలిన పరి వ్రాట్టొకండు
తే.గీ.॥
కల్పకలశాబ్ధి జానుదఘ్నముగఁ జేసి
మనినయట్టి వాచంయమి మాన్యుడొక్కఁ
డబ్ధివారి సర్వస్వ మాపోశనముగ గొనగఁ
గొనఁగఁ బుడిసిఁటఁ దాల్చిన మునియొకండు.

సరళ భావానువాదం:

ఆ పవిత్రమైన నైమిశారణ్యంలో ఎందరో మహానుభావులైన మునులు ఉన్నారు. ఒకవైపు.. లక్ష్మీదేవికి నిలయమైన శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్నే తన కాలితో తన్నిన భృగు మహర్షి వంటి వారు ఒకరు, మరోవైపు.. బ్రహ్మదేవుని సృష్టికి వ్యతిరేకంగా (త్రిశంకు స్వర్గం వంటి) కొత్త సృష్టినే చేయగలిగిన తపోధనుడు విశ్వామిత్రుడువంటి వారు మరొకరు, పరమశివుని అనుగ్రహంతో పొందిన గొప్ప శక్తితో సాక్షాత్తు యమధర్మరాజునే ఎదిరించి నిలిచిన (మార్కండేయుని కాపాడిన) శ్వేత మునివంటి వారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే తన బిడ్డలుగా పొందిన గొప్ప తపస్విని అత్రి మహర్షి వంటి వారు, సముద్రాన్ని మోకాటి లోతు నీరుగా మార్చి తలచిన చోటికి వెళ్ళగల మౌన మునులు ఒకరుకాగా.. అనంతమైన సముద్ర జలాన్నంతటినీ తన అరచేతిలోకి (బుడిసిట) తీసుకుని ఒక్క గుక్కలో తాగేసిన అగస్త్య మహర్షి వంటి వారు మరొకరు.

ఈ పద్యంలో ఒక్కో పాదంలో ఒక్కో పురాణ ప్రసిద్ధుడైన మునిని గుర్తుచేశారు:

భృగువు విష్ణువును తన్నిన కథ;

విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేసిన కథ;

ముని (శ్వేత/మార్కండేయ నేపథ్యం) యముడిని గెలిచిన కథ; అత్రి త్రిమూర్తులను బిడ్డలుగా పొందిన కథ;అగస్త్యుడు సముద్రాన్ని ఆపోశనం పట్టిన కథలనుమహర్షుల తపోవైభవంగా మలచి, నైమిశారణ్యంలో ఎంతటి శక్తివంతులైన మునులు ఉండేవారో వారి శక్తి సామర్థ్యాలను, వారి తపోబలాన్ని పురాణ కథలతో జతచేసి  కళ్ళకు కట్టినట్లువర్ణించారు.
93. మ॥
అలఘు ప్రాజ్ఞులు సుత్వలుం గృతులు సత్యాఢ్యుల్ తరుత్వగ్వ సా
ను లనాత్యర్ధ విరామ కర్మఠులు మాన్యుల్ ధైవ సాచిత్త వృ
త్తులు సామాన్యుల కృష్ణ పచ్య ఫల సందోహైక నిత్యాశనాఽ
కలన ప్రత్విష దాశితంభవులు సౌఖ్య క్లేశప్యుల్ శృతుల్.

అలఘు ప్రాజ్ఞులు = గొప్ప తెలివితేటలు గలవారు;

తరుత్వగ్వసానులు = చెట్టు బెరడులను

వస్త్రాలుగా ధరించేవారు (నారచీరలు);

అత్యర్ధ విరామ కర్మఠులు =  ఎడతెరిపి లేకుండా యజ్ఞయాగాదులు చేసేవారు;

కృష్ణ పచ్య ఫలములు =  వాటంతట అవే పండి రాలిన పండ్లు (అడవిలో దొరికేవి);

ఆశితంభవులు =  ఆకలిని జయించినవారు;

శృతుల్ =   వేదాలను బాగా తెలిసినవారు.

సరళ భావానువాదం:

“ఆ అరణ్యంలో ఉన్న మునులు సామాన్యులు కారు! వారుగొప్ప జ్ఞానసంపన్నులు, నిత్యం సత్యాన్నే పలికే ధర్మమూర్తులు,విలాసవంతమైన వస్త్రాలకు బదులుగా చెట్టు బెరడులను (నారచీరలను) ధరించే వైరాగ్యవంతులు, ఏమరపాటు లేకుండా నిరంతరం దైవచింతనలో, యజ్ఞ కర్మలలో మునిగి ఉండేవారు; ఎవరో తెచ్చి ఇచ్చే ఆహారం కోసం చూడకుండా, అడవిలో సహజంగా పండి రాలిన పండ్లను మాత్రమే తింటూ ఆకలిని జయించిన తపోధనులు, సుఖదుఃఖాలను సమానంగా చూస్తూ, సాక్షాత్తు వేద స్వరూపులైన ఆ మునులు అక్కడ ఎంతో నిశ్చలమైన చిత్తంతో నివసిస్తున్నారు.”

ఈ పద్యం ద్వారా మునుల బాహ్య రూపం (నారచీరలు) మరియు అంతర్గత స్థితి (దైవచింతన) రెండింటినీ వర్ణించారు. చెట్టు బెరడులు కట్టుకోవడం, అడవి పండ్లు తినడం వారి నిరాడంబరతకు నిదర్శనం. వారి మనస్సు ఎప్పుడూ దేవుని మీదే ఉంటుంది (ధైవ సాచిత్త వృత్తులు),సుఖం వచ్చినా, కష్టం వచ్చినా వారు చలించరు( స్తితప్రజ్ఞులు).

ఈ మత్తేభ విక్రీడితం పద్యంలో నైమిశారణ్యం లోని మునుల జీవన శైలిని, వారి నిరాడంబరతను, వారి తపశ్శక్తిని చక్కగా వర్ణించారు.

94. శా॥
ఈదృగ్భూరి మహత్వ సంపదభిరామమైక ప్రభావుల్ తపః
శ్రీ దర్పుల్ సమయత్ర యజ్ఞులు యశః శ్వేతాయత చ్ఛత్ర సం
ఛాదద్ధిగ్ద శకుల్ సదాకృత బృహత్పత్రాధ్వరుల్ సత్కథా*
వేదుల్ సంయము లొక్కనాడు గథలం బెంపొంద నాలించుచున్.*

భూరి మహత్వ సంపద =మెండుగా ఉన్న గొప్ప మహిమలు అనే సంపద;

తపః శ్రీ దర్పుల్  = తపస్సు అనే సంపదతో (శ్రీ) గర్వించినవారు (అంటే తపశ్శక్తిపై నమ్మకం ఉన్నవారు);

సమయత్రయజ్ఞులు =  త్రికాలాలను (భూత, వర్తమాన, భవిష్యత్తులను) తెలిసినవారు;

యశః శ్వేతాయత చ్ఛత్ర = వారి కీర్తి తెల్లని గొడుగులా పది దిక్కులా వ్యాపించి ఉంది.

సత్కథా వేదుల్  =   మంచి కథలను, పురాణాలను తెలిసినవారు;

సంయములు =  ఇంద్రియాలను జయించిన మునులు.

సరళ భావానువాదం:

అపారమైన మహిమలు కలిగినవారు, తపశ్శక్తినే తమ గొప్పతనంగా భావించేవారు, కాలజ్ఞానం తెలిసిన వారూ అయిన ఆ మునుల కీర్తి పది దిక్కులా వెలుగులీనుతున్నది. అటువంటి జ్ఞానులు, ఉత్తమమైన పురాణ కథలను తెలిసినవారైన ఆ మహర్షులందరూ ఒకనాడు, పుణ్యకథలను ఎంతో ఆసక్తితో చర్చించుకుంటూ, వింటున్నారు. అలా వారు సత్సంగంలో మునిగి ఉన్న సమయంలో..”

ఈ పద్యం కథలో ఒక మలుపు లాంటిది. ఇప్పటివరకు మునుల గొప్పతనాన్ని వర్ణించిన కవి, ఇప్పుడు వారు ఒకచోట చేరి కథా కాలక్షేపం చేస్తున్నారని చెబుతున్నారు. సత్సంగంలో మునులు ఖాళీగా ఉండరు, ఎప్పుడూ భగవంతుని కథలను చెప్పుకుంటూనో.. లేదా ధర్మ సూత్రాలను చర్చించుకుంటూనో  ఉంటారు. ‘ఆలించుచున్’ (వినడం) అనే పదం ద్వారా అక్కడ ఏదో ఒక విశేషమైన చర్చ జరుగుతోందని కవి సూచిస్తున్నారు.

95. కం॥
ఆతత వైదుష్య సమో
పేతున్ నిఖిలేతిహాస బృందైక వ్యా
ఖ్యాతున్ లోక త్రయ వి
ఖ్యాతున్ సూతున్ గతాభిలాఘవ్రాతున్.

సూత మహర్షి ఆగమనం:

ఆతత వైదుష్యము  =  విస్తారమైన పాండిత్యం;

నిఖిలేతిహాస బృంద  = సమస్తమైన ఇతిహాసాల (రామాయణ, భారతాల వంటివి) అనేకం;

వ్యాఖ్యాతున్   = చక్కగా వివరించి చెప్పగలవాడు

గతాభిలాఘ వ్రాతున్  =  ఎటువంటి చపలత్వం లేనివాడు లేదా స్థిరమైన మనస్సు గలవాడు.

సరళ భావానువాదం:

ఆ సమయంలో అక్కడికి సూత మహర్షి వచ్చారు. ఆయన ఎటువంటివారంటే, అపారమైన పాండిత్యం కలవారు, లోకంలోని సమస్త ఇతిహాసాలను, పురాణాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వ్యాఖ్యానించి చెప్పడంలో దిట్ట, మూడు లోకాల్లోనూ గొప్ప కీర్తి గడించినవారు, కోరికలను జయించి, మనసునిలకడ గలవారు,పరమ శాంతమూర్తిగా వెలుగొందుతున్న వారు.

పురాణాల ప్రకారం, నైమిశారణ్యంలో శౌనకాది మునులకు కథలు చెప్పేది సూత మహర్షి.  కవి ఇక్కడ ‘సూతున్’ అనే పదాన్ని ప్రయోగిస్తూ ఆయనకున్న అర్హతలను వర్ణించారు.

వ్యాఖ్యాతగా అంటే కేవలం చదవడం వేరు, దానిలోని అంతరార్థాన్ని వివరించడం (వ్యాఖ్యానం) వేరు. సూత మహర్షి ఆ విద్యలో నిష్ణాతుడని కవి చెబుతున్నారు.

జ్ఞాని అయిన వాడు నిలకడగా ఉండాలి. అందుకే ఆయనను ‘గతాభిలాఘ’ (చపలత్వం లేనివాడు) అని సంబోధించారు.
96. మ॥
కని కారుణ్యము భక్తి శ్రద్ధ యనురాగంబున్ ముదంబాశ నె
క్కొని చేతః పథమందు బెంపెసగి చిక్కుల్వార వర్షాంబుద
స్తనిత ప్రఖ్య గభీర భాషణ చయ స్వారస్య మొప్పార ని
ట్లనిరాతుండు వినంగ బన్నగము రాగాలప్తి విన్నటులన్.*

ముదంబాశ  =  సంతోషం, కోరిక (కథ వినాలనే ఆశ).

చేతః పథమందు = మనస్సు అనే మార్గంలో,

వర్షాంబుద స్తనిత ప్రఖ్య = వాన మేఘం యొక్క ఉరుము వంటి గంభీరమైన ధ్వని,

పన్నగము  = పాము ,

రాగాలప్తి  = సంగీతపు రాగ వరుస (నాదస్వరం వంటిది).

మునుల ఏకాగ్రత – సూత మహర్షి సంభాషణ

సరళ భావానువాదం:

ఆ మహర్షులు సూత మహర్షిని చూడగానే వారి మనస్సులలో ఒకేసారి కరుణ, భక్తి, శ్రద్ధ, అనురాగం, మరియు సంతోషం ఉప్పొంగాయి. వారి హృదయాలన్నీ ఆయన చెప్పబోయే కథ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి. అప్పుడు సూత మహర్షి, మేఘం యొక్క ఉరుము వలె అత్యంత గంభీరమైన, స్పష్టమైన స్వరంతో మాట్లాడటం ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతుంటే మునులందరూ ఎలా వింటున్నారంటే.. ఒక పాము నాదస్వరానికి లేదా రాగానికి ముగ్ధురాలై, లోకాన్ని మర్చిపోయి ఎలా నిశ్చలంగా వింటుందో, అంతటి ఏకాగ్రతతో మునులందరూ ఆయన మాటలను  వింటున్నారు.”

ఈ పద్యంలో రెండు ముఖ్యమైన విషయాలను కవి వర్ణించారు:

సూత మహర్షి కంఠస్వరం! ఆయన స్వరం పిల్లికూతలా కాకుండా, వాన మేఘం గర్జించినట్లు (వర్షాంబుద స్తనిత) గంభీరంగా, వినసొంపుగా ఉందట.

మునుల స్థితి ఎలా ఉందంటే సంగీతానికి పాము ఎలా వశమైపోతుందో, సూత మహర్షి చెప్పే జ్ఞానబోధకు మునులు అలా వశమైపోయారు. వారి మనస్సులో ఎటువంటి చిక్కులు (సందేహాలు) లేకుండా, ఏకాగ్రతతో వింటున్నారు.
strong>97. కం॥
ఇత్య యశుండవు లోకా
దృత్యుడ వితిహాస సువివిధషుజనతా సం
వృతుండవన్య ధర్మ
ప్రత్యర్ధివి సత్య వద్య వాక్త్వచుడవికన్.

ఇత్య యశుండవు =  సర్వదా కొనియాడదగిన కీర్తి కలిగినవాడవు,

లోకాదృత్యుడవు = లోకమంతటి చేత గౌరవించబడేవాడవు,

ఇతిహాస సువివిధ =  రకరకాల ఇతిహాసములలో, పురాణాలలో ఆరితేరినవాడవు.

సుజనతా సంవృతుండవు = ఎప్పుడూ మంచి వ్యక్తులచే (సజ్జనులచే) చుట్టుముట్టబడి ఉండేవాడవు,

అన్య ధర్మ ప్రత్యర్థివి = పరధర్మాలకు లేదా అధర్మాలకు వ్యతిరేకివి (కేవలం స్వధర్మాన్ని, సత్యధర్మాన్ని ఆచరించేవాడవు).

సత్య వద్య వాక్త్వచుడవు =  సత్యమే కవచంగా కలిగిన మాటలు కలవాడవు (నీ మాట ఎప్పుడూ సత్యమే అవుతుంది).

సూత మహర్షికి మునుల వందన సమర్పణం:

సరళ భావానువాదం:

ఓ సూత మహర్షీ! నీ కీర్తి ఎన్నటికీ చెరగనిది, లోకమంతా నిన్ను ఎంతో గౌరవిస్తుంది, నీవు సమస్త ఇతిహాసాలను పూర్తిగా చదివిన వాడవు కాబట్టే, ఎప్పుడూ- ఎడతెగక  సజ్జనులైన మునులు నీ చుట్టూ చేరి నువ్వు చెప్పే కథలు వింటూ ఉంటారు. నీవు అధర్మాన్ని ఏమాత్రం సహించని ధర్మమూర్తివి. నీ మాటల్లో ఎప్పుడూ అబద్ధం ఉండదు, సత్యమే నీ వాక్కుకు కవచం వంటిది. అటువంటి మహానుభావుడవు నీవు.”

ఈ పద్యం ద్వారా మునులు సూత మహర్షి పట్ల తమకున్న అపారమైన గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నారు.

సత్సంగం- “సుజనతా సంవృతుండవు” అనే పదం ద్వారా, జ్ఞానులు ఎప్పుడూ జ్ఞానుల మధ్యే ఉంటారని కవి గుర్తుచేశారు.

వాక్శుద్ధి: ఒక కథ చెప్పే వ్యక్తికి ఉండవలసిన అతిపెద్ద లక్షణం ‘సత్యం’. సూత మహర్షి చెప్పే ప్రతి మాట సత్య నిష్టతో కూడి ఉంటుందని ఇక్కడ చెప్పారు. సూత మహర్షిని ఒక కథ అడగడానికి ముందు చేసే ఈ ప్రశంసను చదివితే, కథ చెప్పే వ్యక్తికి ఉండవలసిన ఉదాత్తమైన లక్షణాలు అర్థమవుతాయి.
98. కం॥
పరిగృధ్యరుచ్య వైష్ణవ
చరిత శ్రవణోత్సుకాగ్ర జనజుష్యుడవు
ద్దురమతివి ప్రియం భావుక
వరేణ్యుండవు మాకు గూర్పువాడవు నెమ్మినన్.

పరిగృధ్యరుచ్య = మిక్కిలి ఇష్టమైన,

వైష్ణవ చరిత = విష్ణుమూర్తికి సంబంధించిన కథలు,

శ్రవణోత్సుకాగ్ర = వినాలనే ఉత్సాహం కలిగిన వారిలో అగ్రగణ్యుడు,

జనజుష్యుడవు =  ప్రజలందరిచే ప్రేమింపబడేవాడవు,

ఉద్దురమతివి =   గొప్ప ప్రజ్ఞ కలవాడవు,

ప్రియంభావుక వరేణ్యుండవు =  ప్రియమైన మాటలు చెప్పే వారిలో శ్రేష్ఠుడవు;

నెమ్మినన్  = ప్రేమతో,

సరళ భావానువాదం:

“ఓ సూత మహర్షీ! నీవు సామాన్యుడవు కావు. అత్యంత మనోహరమైన ఆ విష్ణుమూర్తి కథలను వినడంలో నీకంటే మిన్నయైన ఉత్సాహవంతులు ఎవరూ లేరు. నీవు అపారమైన మేధావివి. మనసుకు హాయిని గొలిపే ప్రియమైన మాటలు చెప్పడంలో నీకు నీవే సాటి. అటువంటి నీవు, మాపై ఉన్న ఆదరంతో మాకు ఒక అద్భుతమైన కథను వినిపించి మేలు చేకూర్చు.”

మునులు సూత మహర్షిని ఎందుకు కోరుకుంటున్నారంటే.. వారి అభిరుచి, అంతేకాక సూత మహర్షికి విష్ణు కథలంటే (వైష్ణవ చరిత) ప్రాణం. చెప్పేవాడికి ఆ విషయంపై ఎంత ఇష్టం ఉంటే, వినేవాడికి అంత బాగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన వాక్చాతుర్యం, ఆయన మాటలు ‘ప్రియంభావుకము’ అంటే వినేకొద్దీ ఇంకా వినాలనిపించేలా తియ్యగా ఉంటాయని కవి చెబుతున్నారు. క్లిష్టమైన విషయాలను కూడా తన బుద్ధిబలంతో, జ్ఞానంతో (ఉద్దురమతి) సులభంగా వివరించగల సామర్థ్యం ఆయనకు ఉంది.

ఈ పద్యం ద్వారా ‘సౌదామినీ పరిణయము’ ఒక వైష్ణవ భక్తి ప్రధానమైన కావ్యమని పాఠకులకు స్పష్టమవుతుంది. ఎందుకంటే మునులు తమను జ్ఞానమార్గంలో నడిపించమని ఆయనను వేడుకుంటున్నారు.
99. తే.గీ.॥
అనృత వాచంయముడవవార్య ప్రసరుడ
విద్ధ హృదయంగమాఖ్యాత కృతమఖుండ
వార్య జుష్టుండవనరుంతు డార్జవార్జి
తామలాభ్రంకష యశోభి రామకృతివి.

అనృత వాచంయముడు = అబద్ధం చెప్పని మౌని (సత్యవ్రతుడు).

అవార్య ప్రసరుడు  =  అడ్డులేని ప్రవాహం వంటి ప్రసంగం గలవాడు,

హృదయంగమాఖ్యాత = హృదయానికి హత్తుకునేలా కథలు చెప్పేవాడు.

కృతమఖుండు  = యజ్ఞయాగాదులు పూర్తి చేసిన పుణ్యాత్ముడు,

ఆర్య జుష్టుడు = పెద్దలచే, జ్ఞానులచే సేవింప బడేవాడు,

ఆర్జవార్జిత  =  నిప్పులాంటి నిజాయితీతో సంపాదించిన,

అమలాభ్రంకష యశస్సు = ఆకాశాన్ని తాకేటంతటి నిర్మలమైన కీర్తి కలవాడు.

సూత మహర్షి వైభవం:

సరళ భావానువాదం:

“ఓ సూత మహర్షీ! నీవు ఎన్నడూ అసత్యం పలకని సత్యవ్రతుడవు! నీ ప్రసంగం అడ్డులేని ప్రవాహంలా సాగుతుంది, హృదయానికి హత్తుకునేలా కథలను వివరించడంలో నీవు నిపుణుడవు , శాస్త్రోక్తంగా యజ్ఞాలను నిర్వహించిన పుణ్యమూర్తివి. ఎందరో మహానుభావులు నిన్ను గౌరవిస్తారు. నీవు నీ నిఖార్సైన నిజాయితీతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన నిర్మలమైన కీర్తిని సంపాదించుకున్నావు. అటువంటి గొప్ప వ్యక్తివి నీవు!

ఈ పద్యంలో మునులు సూత మహర్షిని మూడు రకాలుగా వర్ణించారు:

వాక్శుద్ధి- ఆయన నోట అబద్ధం రాదు (అనృత వాచంయముడు). చెప్పే కథలన్నీ సత్యప్రమాణాలు అని అర్థం.

కథా నైపుణ్యం – ఆయన కథ చెబుతుంటే అది హృదయానికి నేరుగా తగులుతుంది. (హృదయంగమ).

కీర్తి – ఆయన కీర్తి ‘అభ్రంకషము’ అంటే ఆకాశాన్ని తాకుతోందట. ఇది ఆయన తపశ్శక్తికి, పాండిత్యానికి నిదర్శనం.

ఈ పద్యం చివరలో రామకృతివి అనే పదాన్ని గమనిస్తే, ఆయన చెప్పేది ఒక పవిత్రమైన లేదా రమ్యమైన కావ్యం అని తెలుస్తున్నది.
100. కం॥
సామాన్య నిచయమోహన
భూమమ్రదిమానుషంగ పురుభూ మాధు
ర్యామేయ స్వర పూర్త్య భి
రామాజర్యస్వరజ్ఞ రత్న మవరయన్.

సామాన్య నిచయ మోహన = సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్యపరిచే,

మ్రదిమానుషంగ  =  మృదుత్వంతో కూడిన సున్నితమైన,

పురుభూ మాధుర్య  =  నిండైన తీయదనం కలిగిన.

అమేయ స్వర పూర్త్యభిరామ=  కొలవలేనంతటి లోతైన, పరిపూర్ణమైన స్వరంతో ప్రకాశించేవాడు.

అజర్య స్వరజ్ఞ రత్నము = ముసలితనం వల్ల (ముసలితనం వచ్చినా కంఠస్వరంలో మార్పు లేనివాడు) లేని స్వర విజ్ఞానంలో రత్నం వంటివాడు.

అవరయన్ =  శ్రేష్ఠుడైన వాడు.

సూత మహర్షి వాక్-మాధుర్యం:

సరళ భావానువాదం

“ఓ సూత మహర్షీ! నీవు మాటల నేర్పరివి మాత్రమే కాదు, నీ స్వరం ఒక అద్భుతం. నీ మాటలు సామాన్య ప్రజలను కూడా మంత్రముగ్ధులను చేస్తాయి. నీ కంఠస్వరం ఎంతో మృదువుగా, అమితమైన తీయనైన మాధుర్యంతో నిండి ఉంటుంది. పరిపూర్ణమైన, గంభీరమైన నీ స్వరంలో ఒక ప్రత్యేకమైన అందం (అభిరామము) కనిపిస్తుంది. శబ్ద విజ్ఞానంలో ఎప్పటికీ తరగని ప్రతిభ కలిగిన నీవు, పండితులందరిలోనూ శ్రేష్ఠుడివి.” ప్రజాకర్షణ ఎలాంటిదంటే పండితులకే కాదు, ‘సామాన్య నిచయ’ (సామాన్యులకు) కూడా అర్థమయ్యేలా, నచ్చేలా చెప్పడం గొప్ప కళ. అందుకు ఆయన స్వరం మృదుత్వంగానూ మాధుర్యంగాను ఉందట. స్వరం కరుకుగా ఉండకూడదు. వినేవారికి అది మృదువుగా, తీయగా ఉండాలి. ఆయన స్వరజ్ఞ రత్నము సంగీతంలో గానీ, ప్రవచనంలో గానీ స్వరస్థానాలు తెలిసినవాడైన రత్నం వంటివాడు. సూత మహర్షి అటువంటి నిష్ణాతుడని కవి ఉద్దేశ్యం.

(సశేషం)

Exit mobile version