[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]
~
సౌదామినీ పరిణయము భాగం 11
101 చ॥
తతబహుమన్య మానములు తావక పీత ధృతాశీతంభవ
స్థితములు ధ్యాతభావిత నిషేవిత శాయిత మూతనీత వ
ల్లిత సమధీతముల్ గనఁ బలింద మసాత్కృతమై వినష్టద
న్యతర ఫలాభి సంసృతము లై నిరతంబుఁ బొసంగుచుండుటన్.
తతబహుమన్య మానములు = ఎంతో గొప్పగా గౌరవించబడేవి,
తావక పీత = నీవు గ్రహించిన జ్ఞానం,
ఆశీతంభవ = ఆకలిని, సంసార తాపాలను దూరం చేసేవి,
ధ్యాత- భావిత- నిషేవిత = ధ్యానించబడినవి, భావించబడినవి మరియు సేవించబడినవి;
సమధీతముల్ = చక్కగా అభ్యసించిన విద్యలు,
తమసాత్కృతమై = అంధకారంలో కలిసిపోయి.
వినష్ట దన్యతర ఫలాభి = ఇతరమైన అల్ప ఫలితాలన్నీ నశించిపోయేవి.
సరళ భావానువాదం:
“ఓ సూత మహర్షీ! లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల విద్యలను అభ్యసిస్తారు, గొప్ప గౌరవాలను పొందుతారు. కానీ, నీవు అందించే ఈ జ్ఞానం (వైష్ణవ గాథలు) అటువంటిది కాదు. నీవు ధ్యానించినవి, నీవు సేవించినవి, నీవు చక్కగా అభ్యసించినవి అయిన ఈ పరమాత్మ కథలు.. మనుషుల ఆకలిని, సంసార బంధాలను దూరం చేసే శక్తి కలవి. లోకంలో లభించే ఇతర అల్పమైన సుఖాలు లేదా ఫలితాలన్నీ కాలక్రమేణా చీకటిలో కలిసిపోయి వ్యర్థమైపోతాయి. కానీ, నీవు చెప్పే ఈ అమృత తుల్యమైన కథలు మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని, పరమార్థాన్ని ప్రసాదిస్తాయి.”
వివరణ:
పెద్ద నాయనగారు ఈ పద్యంలో ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు. లౌకిక విద్యల తో ఆధ్యాత్మిక విద్య లను తులనాత్మకంగా చెప్పారు. మనం నేర్చుకునే ఎన్నో విద్యలు కేవలం తాత్కాలిక గౌరవాన్ని ఇస్తాయి. కానీ సూత మహర్షి వంటి జ్ఞానుల వద్ద లభించే భగవత్ సంబంధిత విద్య మాత్రమే జన్మరాహిత్యాన్ని ఇస్తుంది.
తమసాత్కృతమై వినష్ట అంటే మిగిలినవన్నీ నశిస్తాయి, కానీ ఈ హరికథా శ్రవణం మాత్రం నిలుస్తుంది. ధ్యాత, భావిత, నిషేవిత, శాయిత’ వంటి క్రియా పదాలను కలిపి దాని ద్వారా.. జ్ఞానాన్ని కేవలం చదివితే సరిపోదు, దానిని ధ్యానించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని కవి సూచించారు.
ఈ పద్యం చాలా గంభీరమైనది కూడా. దీని కింద “శాశ్వత ఫలము – హరికథ” అని సూచన చేసారు. లోతైన అర్థం కలిగి, క్లిష్టమైన సమాసాలతో రచించారు. ఆయన చెప్పే హరికథా శ్రవణం ఎంతటి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుందో వివరించారు.
102 శా॥
నీ కారుణ్య రస ప్రసారణము పొంటెన్ భవ్య గాధాలి న
స్తోకానంద మెలర్ప వీనులకు విందుం జేయుచున్ వీత శం
కాకోశ ప్రతిభా సమంచిత తదైక శ్రద్ధ పెంపొందగన్
సాకల్యంబుగ దెంపు లేక వినుచున్నారమ్ము సుమ్మిమ్ముగన్.
కారుణ్య రస ప్రసారణము = నీ కరుణ అనే రసం ప్రవహించడం వల్ల అనగా నీ దయ వల్ల,
భవ్య గాధాలి = పవిత్రమైన కథల సమూహం,
అస్తోకానందము = అమితమైన ఆనందం,
వీనులకు విందు = చెవులకు పండుగలా,
వీత శంక = అనుమానాలు లేని ,
తదైక శ్రద్ధ = దాని మీదనే లగ్నమైన ఏకాగ్రత,
సాకల్యంబుగ = సంపూర్ణంగా,
తెంపు లేక = విరామం లేకుండా.
కథాశ్రవణ దీక్ష:
సరళ భావానువాదం:
“ఓ మహర్షీ! నీ కరుణాకటాక్షం వల్ల మాకు ఈ పవిత్రమైన కథలు వినే భాగ్యం కలిగింది. నీవు చెబుతున్న ఈ గాథలు మా చెవులకు విందు చేస్తూ, మాలో అపారమైన ఆనందాన్ని నింపుతున్నాయి. ఎటువంటి సందేహాలకు తావులేకుండా, అత్యంత ప్రతిభావంతమైన నీ ప్రవచనాన్ని వినడానికి మేము తదైక శ్రద్ధతో సిద్ధంగా ఉన్నాము. ఈ అద్భుతమైన కథా ప్రవాహాన్ని ఏమాత్రం ఆపకుండా, సంపూర్ణంగా మాకు వినిపించు. మేము అంతే ఆసక్తితో వినడానికి వేచి ఉన్నాము.”
వివరణ:
ఈ పద్యంలో కథ వినేవారికి ఉండవలసిన లక్షణాలను కవి అద్భుతంగా చిత్రించారు!
వీనులకు విందు అనడం కథ అనేది భారంగా అనిపించకూడదు, అది చెవులకు విందులా (కర్ణపేయం) ఉండాలనీ, సూత మహర్షి శైలి అటువంటిదని మునులు కొనియాడుతున్నారు.
వీత శంక – మనస్సులో సందేహాలు ఉంటే జ్ఞానం తలకెక్కదు. ‘వీత శంక’ అంటే అన్ని అనుమానాలను పక్కన పెట్టి, గురువుపై నమ్మకంతో వినడం.
తెంపు లేక — కథా ప్రవాహంలో విరామం ఉండకూడదని మునుల కోరిక. అంటే వారు ఆ కథలో ఎంతగా లీనమైపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
103 చ॥
పరకథలెన్నియైన యదువర్య మహాద్భుత చర్య పాప సం
హారము భవాబ్దిపోతము సమస్త ఫలప్రదమౌట నాలకిం
తురు బుధులెప్డు దానిన వినూత్న సునూత్న లసానుషంగమౌ
హరికథ నెన్నిసార్లు ముదమారఁగ విన్నను తృప్తి గల్గునే!
పరకథలు= ఇతర కథలు (లౌకికమైనవి లేదా సామాన్యమైనవి),
యదువర్య మహాద్భుత చర్య= యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని ఆశ్చర్యకరమైన లీలలు,
పాప సంహారము=చేసిన పాపాలను నశింపజేసేది.
భవాబ్ది పోతము = సంసార సాగరాన్ని (భవాబ్ది) దాటించే ఓడ,
వినూత్న సునూత్న = ఎప్పుడూ కొత్తగా అనిపించేది (నిత్య నూతనం).
లసానుషంగము = మిక్కిలి ఆసక్తిని, అనురాగాన్ని కలిగించేది,
తృప్తి గల్గునే = ఎన్నిసార్లు విన్నా తృప్తి తీరుతుందా? (తీరదు, ఇంకా వినాలనిపిస్తుంది అని అర్థం).
సరళ భావానువాదం:
హరికథా మాధుర్యం – నిత్య నూతనం:
“లోకంలో ఎన్నో రకాల కథలు ఉండవచ్చు. కానీ, యాదవ కుల తిలకుడైన ఆ శ్రీకృష్ణుని అద్భుత లీలలు వినడం వల్ల కలిగే ప్రయోజనం అపారం. ఆ కథలు పాపాలను హరిస్తాయి, సంసారమనే సముద్రాన్ని దాటించే నావలా తోడ్పడతాయి, కోరిన కోర్కెలన్నింటినీ నెరవేరుస్తాయి. అందుకే పండితులు ఎప్పుడూ ఆ హరికథలనే వినడానికి ఇష్టపడతారు. ఆ కథలు ఎంతటివంటే.. ఎన్ని సార్లు విన్నా ప్రతిసారీ కొత్తగా, వినసొంపుగా అనిపిస్తాయే తప్ప, ‘చాలు’ అనే తృప్తి ఎప్పటికీ కలుగదు.”
వివరణ:
ఈ పద్యంలో హరికథకు ఉన్న మూడు గొప్ప లక్షణాలను కవి వివరించారు:
పాప సంహారం మరియు భవాబ్ది పోతం= ఇది వినడం కేవలం కాలక్షేపం కాదు, ఆత్మను ఉద్ధరించే మార్గం. సంసారంలో మునిగిపోకుండా కాపాడే ఓడ వంటిది.
నిత్య నూతనం = మనం ఒక సినిమాను లేదా సాధారణ కథను ఒకసారి చూస్తే రెండోసారి విసుగు కొడుతుంది. కానీ హరికథను ‘వినూత్న సునూత్న’ అన్నారు. అంటే ప్రతిసారి విన్నప్పుడు ఒక కొత్త అర్థం, ఒక కొత్త ఆనందం లభిస్తుంది.
తృప్తి = దైవ కథల విషయంలో తృప్తి కలగకపోవడమే నిజమైన భక్తి లక్షణం. “ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి” అనే తపన శ్రోతల్లో కలగడమే ఆ కథా గొప్పతనం.
104 చ॥
అదియును గాక నీవు సరసైకవచో విభవుండవున్ సుఖ
ప్రద మధురాయిత స్వర విభాసివశేష కథావిధాన కో
విదుఁడవు సర్వతోముఖ వివేక సమన్విత ధారణా బలా
భ్యుదిత నిరంత కీర్తి మహిమోరు ధురంభరణుండ వెంతయున్.
సరసైక వచో విభవుండవు = సరసమైన హృదయానికి హత్తుకునే మాటలే సంపదగా కలిగినవాడవు.
సుఖప్రద మధురాయిత స్వర = వినేవారికి సుఖాన్నిచ్చే తీయనైన కంఠస్వరం కలవాడవు.
అశేష కథావిధాన కోవిదుడవు= సమస్తమైన కథా సంప్రదాయాల్లో ఆరితేరిన పండితుడవు (కోవిదుడు).
సర్వతోముఖ వివేక = అన్ని విషయాల్లోనూ పరిపూర్ణమైన తెలివితేటలు కలవాడవు.
ధారణా బలాభ్యుది = అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగినవాడవు.
నిరంత కీర్తి మహిమోరు = అంతులేని కీర్తి, గొప్ప మహిమ కలిగిన బాధ్యతలను మోయగలవాడవు.
కథా కోవిదుడు – సూత మహర్షి
సరళ భావానువాదం:
“అంతేకాకుండా ఓ మహర్షీ! నీవు కేవలం కథలు చెప్పేవాడవు మాత్రమే కాదు! నీ మాటల్లో ఒక అద్భుతమైన రససిద్ధి ఉంది. నీ కంఠస్వరం వింటుంటేనే ఎంతో హాయిగా, మధురంగా ఉంటుంది. పురాణాలను, ఇతిహాసాలను ఏ పద్ధతిలో చెప్పాలో తెలిసిన గొప్ప నిపుణుడవు నీవు. ఎటువంటి విషయాన్నైనా లోతుగా గ్రహించగల వివేకం, విన్నదాన్ని అప్రయత్నంగా గుర్తుంచుకోగల అపారమైన జ్ఞాపకశక్తి నీ సొంతం. ఎంతో మహిమ గల ఈ కథా ప్రవచనం అనే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగల కీర్తిమంతుడవు నీవు.”
వివరణ:
ఈ పద్యంలో కథకుడికి ఉండవలసిన నాలుగు ప్రధాన గుణాలను కవి ప్రస్తావించారు:
- వాగ్మిత్వం అంటే మాట సరసంగా, రసవత్తరంగా ఉండాలి.
- స్వర మాధుర్యం అంటే వినేవారికి అలసట రాకుండా, హాయినిచ్చే స్వరం ఉండాలి.
- కోవిదత్వం అంటే కథను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే ‘కథా విధానం’ తెలిసి ఉండాలి.
- అపారమైన పురాణ వాజ్మయాన్ని గుర్తుంచుకుని, సమయానుకూలంగా చెప్పగల జ్ఞాపకశక్తి ఉండాలి.
ఈ చంపకమాల పద్యం సూత మహర్షి యొక్క పాండిత్యాన్ని, ఆయన ప్రవచనా శైలిని తెలిపే అద్భుతమైన ప్రశంసా పద్యం. మునులు ఆయనను ఎందుకు అంతగా గౌరవిస్తున్నారో, ఆయన మాటల్లో ఉండే ఆ మంత్రముగ్ధత ఏమిటో ఇందులో చాలా విడమర్చి చెప్పారు.
105 ఉ॥
ఈవు వచింప నన్య కథలే విననొంపగు నింక మాధురీ
శ్రీ విలసిల్లు వైష్ణవ చరిత్రములందున రాధికా సతీ
భావచకోర చంద్రుని భవ ప్రతిబంధ నిరోధముల్ ప్రియం
భావుకముల్ విచిత్రములు మాన్యములైన కథల్ రుచింపవే.
అన్య కథలే విననొంపగు = నువ్వు చెబితే మామూలు కథలే ఎంతో వినసొంపుగా ఉంటాయి,
మాధురీ శ్రీ విలసిల్లు =తీయదనము, అందము వెల్లివిరిసే,
రాధికా సతీ భావచకోర చంద్రుని =రాధాదేవి యొక్క మనస్సు అనే చకోర పక్షికి చంద్రుని వంటివాడు (అంటే శ్రీకృష్ణుడు),
భవ ప్రతిబంధ నిరోధముల్ = సంసార బంధాలను ( చావు పుట్టుకలను) అడ్డుకునేవి,
ప్రియంభావుకముల్ = వినేకొద్దీ ఇష్టాన్ని పెంచేవి,
మాన్యములు= అత్యంత గౌరవప్రదమైనవి.
సరళ భావానువాదం:
రాధాకృష్ణుల కథా ప్రాశస్త్యం:
“ఓ సూత మహర్షీ! నీవు ఏ కథ చెప్పినా అది ఎంతో రమ్యంగా ఉంటుంది. అటువంటిది.. అమితమైన మాధుర్యం నిండిన వైష్ణవ కథలను నీవు చెబుతుంటే ఇక చెప్పేదేముంది? ముఖ్యంగా రాధాదేవి మనస్సు అనే చకోర పక్షికి నిండు చంద్రుని వంటివాడైన ఆ శ్రీకృష్ణుని కథలు, మన సంసార బంధాలను తెంచివేసే శక్తి కలవి. ఎంతో విచిత్రమైనవి, ప్రియమైనవి మరియు గౌరవప్రదమైనవి అయిన ఆ పవిత్ర గాధలు ఎవరికి మాత్రం ఇష్టముండవు? (అంటే అందరూ ఆ కథలను వినాలని కోరుకుంటారు).”
ఈ పద్యంలో మునులు తమ అసలు కోరికను బయటపెట్టారు:
చకోర-చంద్ర న్యాయం: చకోర పక్షి వెన్నెలను తాగి జీవిస్తుందని కవిసమయం. ఇక్కడ రాధ మనస్సు చకోర పక్షి అయితే, కృష్ణుడు చంద్రుడు. అంటే రాధ హృదయం కృష్ణుని నామస్మరణ అనే వెన్నెల కోసమే పరితపిస్తుందని అర్థం.
ముక్తి మార్గం: శ్రీకృష్ణుని కథలు కేవలం వినోదం కోసం కాదు, అవి ‘భవ ప్రతిబంధ నిరోధములు’అంటే ఈ జనన మరణ చక్రం నుండి మనల్ని రక్షించేవి.
సూత మహర్షి ప్రాధాన్యత: “నువ్వు చెబితే ఏ కథైనా బాగుంటుంది, ఇక కృష్ణ కథలైతే మరీ అద్భుతంగా ఉంటాయి” అని మునులు ఆయనను ప్రోత్సహిస్తున్నారు.
ఉత్పలమాల పద్యంతో మునులు తమకు ఏ కథ వినాలనుందో స్పష్టంగా, అత్యంత మధురంగా అడిగారు. కేవలం వైష్ణవ కథలే కాకుండా, అందులోనూ రాధాకృష్ణుల ప్రణయ వైభవాన్ని, ఆ కథల విశిష్టతను ఈ పద్యంలో అద్భుతంగా పొందుపరిచారు.
106 ఉ॥
కావున మాకు నిత్తరి యఖండముదావహమైన సత్యభా
మ వరు గాధనొండు సుమ మంజు వచో విభవాప్త మాధురీ
భావతరంగ సంగత విభంగతురంగిత ఫక్కి దెల్పు మా
శావలమాన మానసవశంగత తృష్ణ శమించునట్లుగాన్.
అఖండ ముదావహము = అంతులేని సంతోషాన్ని కలిగించేది,
సత్యభామ వరుడు = సత్యభామ భర్త అయిన శ్రీకృష్ణుడు,
సుమ మంజు వచో విభవ = పువ్వుల వలె మృదువైన, అందమైన మాటల సంపదతో.
మాధురీ భావతరంగ = తీయని భావాలనే అలలు.
విభంగ తురంగిత ఫక్కి = అలల మీద అలలు లేస్తూ ఉరకలు వేసే గుర్రం వంటి నడకతో (ప్రవాహంలా),
ఆశావ లమాన మానస = ఆశతో ఊగిసలాడుతున్న మనస్సు.
తృష్ణ శమించునట్లుగా = (కథ వినాలనే) దాహం తీరే విధంగా.
సరళ భావానువాదం:
మునుల విన్నపం:
“ఓ మహర్షీ! కాబట్టి మాకు ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఆ సత్యభామా ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని కథను ఒకటి వివరించు. నీ మాటలు పువ్వులంత మృదువుగా ఉండాలి. ఆ కథా ప్రవాహం తీయని భావాలనే అలలతో, ఉరకలు వేసే గుర్రం వలె వేగంగా, రమ్యంగా సాగాలి. ఈ కథ వినాలనే కోరికతో ఉవ్విళ్ళూరుతున్న మా మనస్సుల దాహం తీరేలా ఆ పవిత్ర గాథను మాకు వినిపించు.”
ఈ పద్యంలో మునులు సూత మహర్షిని పద్యశైలి ఎలా ఉండాలో చెప్తున్నారు. కథా ప్రవాహం ఎలా ఉండాలంటే.. సముద్రపు అలల మీద గుర్రం ఉరకలు వేస్తున్నట్లు (విభంగ తురంగిత) సాగాలట. అంటే వినేవారికి ఎక్కడా విసుగు రాకుండా, ఉత్సాహంగా కథ ముందుకు సాగాలని, అలానే మాధుర్యంగా.. మాటలు పువ్వుల్లా మెత్తగా, భావాలు తేనెలా తీయగా ఉండాలని కోరుకుంటున్నారు. తృష్ణ ఎలా ఉందటా అంటే.. భగవంతుని కథల పట్ల భక్తులకు ఉండే ఆసక్తిని ‘దాహం’తో పోల్చారు. ఆ దాహం తీరాలంటే అమృతం లాంటి కృష్ణ కథే సరైనది.
ఈ పద్యంలో ‘సత్యభామ వరు గాధ’ అని ప్రస్తావించారు. అంటే ఈ కావ్యం శ్రీకృష్ణుడు, సత్యభామ మరియు సౌదామినికి సంబంధించిన వృత్తాంతం, కదా సూచి అని తెలుస్తున్నది.
107 చ॥
అనికొనియాడు మౌని నివహంబున కంజలియొగ్గి శాంతవ
ర్తనమున భయంబు బ్రేమయు స్థిర ప్రతిభాప్రభా సమాన వా
గ్వినయము పాండితీ మహిమ బిట్టొలుకన్ నిఖిలచతి హాస శో
భన తరసాహితీ బలసువర్ణ సమేతుఁడు సూతుడిట్లనెన్.
అంజలియొగ్గి = రెండు చేతులు జోడించి నమస్కరించి,
శాంతవర్తనమున = ప్రశాంతమైన ప్రవర్తనతో,
భయంబు ప్రేమయు = (పెద్దల పట్ల) భయము, భక్తితో కూడిన ప్రేమ.
వాగ్వినయము = మాటలో వినయం.
పాండితీ మహిమ బిట్టొలుకన్ = పాండిత్యం యొక్క గొప్పతనం ప్రస్ఫుటంగా కనిపించేలా,
నిఖిలేతిహాస సాహిత్య బల సువర్ణ సమేతుడు= సమస్త ఇతిహాసాల సాహిత్యం అనే బలమైన బంగారాన్ని కలిగినవాడు (అంటే అపారమైన జ్ఞానసంపద కలవాడు).
సరళ భావానువాదం:
సూతమహర్షి వినమ్రత:
“తనను అంతగా కొనియాడిన మునులందరికీ సూత మహర్షి వినయంగా చేతులు జోడించి నమస్కరించారు. ఆయన ప్రవర్తన ఎంతో ప్రశాంతంగా ఉంది. పెద్దల పట్ల ఉండవలసిన భక్తిపూర్వకమైన భయం, ప్రేమ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ, ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో వినయంతో ఆయన మాట్లాడటం ప్రారంభించారు. సమస్త ఇతిహాసాల సారమనే స్వర్ణ సంపదను తన హృదయంలో నింపుకున్న ఆ సూత మహర్షి ఇలా అన్నారు..”
ఈ పద్యం ఒక గొప్ప వ్యక్తికి ఉండవలసిన ‘వినయ సంపద’ను తెలుపుతున్నది. అంజలి ఘటించడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.తనను పొగిడిన వారు తనకంటే తక్కువ వారైనా, సమానమైన వారైనా జ్ఞాని ఎప్పుడూ వినయంతోనే ఉంటారని ‘అంజలియొగ్గి’ అనే పదం ద్వారా కవి చెప్పారు. భయం మరియు ప్రేమ: అది ధర్మం పట్ల, పెద్దల పట్ల ఉండే గౌరవప్రదమైన భయం..సాహిత్య బల సువర్ణము: సూత మహర్షి పాండిత్యాన్ని కవి ‘బంగారం’తో పోల్చారు. బంగారం ఎలాగైతే విలువైనదో, తరుగు లేనిదో, ఆయన వద్ద ఉన్న ఇతిహాస జ్ఞానం కూడా అంతటి విలువైనదని కవి భావం.
108 శా॥
కారే మీరు బహుశృతుల్ త్రిసమయ జ్ఞానాఢ్యులాసేతు నీ
హారాహార్య ధరాతలభ్రమణ కార్యాధీత ధాత్రీ జన
స్ఫారోదంతులు నిస్తృణాంతర ధరాప్రక్రాంతులుద్యత్త పః
సారో దుంభిత కామచారమహిమాఽక్షయ్యుల్ మనీషాపటుల్.
బహు శృతుల్ = అనేక శాస్త్రాలను, వేదాలను విన్నవారు (గొప్ప పండితులు),
త్రిసమయ జ్ఞానాఢ్యులు = భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానం కలిగినవారు,
ఆసేతు నీహారాహార్య = సేతువు (రామేశ్వరం), నుండి హిమాలయాల (నీహారాహార్య) వరకు,
ధరాతల భ్రమణ = భూమండలమంతా సంచరించిన వారు,
నిస్తృణాంతర = ఎటువంటి కోరికలు లేని అంతరంగం కలిగినవారు,
కామచార మహిమ = తలచిన చోటుకు వెళ్ళగల శక్తి (స్వేచ్ఛా సంచారం) కలవారు,
మనీషాపటుల్ = బుద్ధిబలంలో సమర్థులు,
సరళ భావానువాదం:
శ్రోతల యోగ్యత – సూతమహర్షి ప్రశంస:
“ఓ మహర్షులారా! మీరు సామాన్యులు కారు! మీరు అనేక శాస్త్రాలు చదివిన మేధావులు, త్రికాలజ్ఞానం కలిగిన ధన్యులు. సేతువు (కన్యాకుమారి) మొదలుకొని హిమాలయ పర్వతాల వరకు ఈ భూమండలమంతా సంచరించి, లోకరీతులను, ధర్మాలను క్షుణ్ణంగా అవగతం చేసుకున్న పుణ్యాత్ములు. కోరికలను జయించి, నిశ్చలమైన మనస్సుతో ఉన్న మీరు.. మీ తపశ్శక్తి ద్వారా అపారమైన మహిమలను, స్వేచ్ఛా సంచార శక్తిని పొందిన బుద్ధిమంతులు. అటువంటి మీరు అడిగితే నేను చెప్పకుండా ఉండగలనా?”
ఈ పద్యంలో సూత మహర్షి మునుల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రకటిస్తున్నారు. ‘ఆసేతు నీహారాహార్య’ అనే పదం ద్వారా మునులు కేవలం అడవికే పరిమితం కాకుండా, దేశమంతా తిరిగి జ్ఞానాన్ని సేకరించిన భౌగోళిక జ్ఞానం ఉన్నవారని కవి ప్రశంసిస్తున్నారు.
తపః ప్రభావం కలవారుగా మునులకు ఉండే ‘కామచార’ మహిమను (కావాలనుకున్న చోటుకు వెళ్ళే శక్తిని) ఇక్కడ చెప్పారు. ఇది వారి తపస్సు యొక్క శక్తి తెలుపుతున్నది.
వక్త-శ్రోత సంబంధం.. ఒక గొప్ప వక్త ఎప్పుడూ తన శ్రోతలను గౌరవిస్తాడు. సూత మహర్షి మునులను ‘బహుశృతులు’ (జ్ఞానులు) అని సంబోధించడం ఆయన సంస్కారానికి నిదర్శనం. దీనివల్ల కావ్యం యొక్క గౌరవం పెరుగుతుంది.
109 మ॥
తెలియంజాలనె మిమ్ము మీరలు ధరిత్రింగాంచగా సోమ సు
త్తుల నూచానకు లగ్ని చిత్తులు మహాత్ముల్ యజ్వులున్ కుండ పా
య్యులు నాదేష్టలు శ్రోత్రియుల్ స్థపతులార్యుల్ దీక్షితుల్ యాయజా
కులు షట్కర్ములు దీర్ఘ దర్శులు ముముక్షువులు జంజపూకాగ్రణుల్.
వైదిక పరిభాష లోని కొన్ని పదాలకు అర్థాలు:
సోమసుత్తులు = సోమయాగాన్ని నిర్వహించి సోమరసాన్ని పిండినవారు,
అగ్నిచిత్తులు = వేదికను నిర్మించి అగ్నిని ప్రతిష్ఠించి ఆరాధించేవారు,
యజ్వులు = యజ్ఞాలు చేసినవారు,
శ్రోత్రియులు = వేదాలను నిష్ఠతో అధ్యయనం చేసినవారు,
షట్కర్ములు = బ్రాహ్మణులకు విధింపబడిన ఆరు కర్మలను (యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహములను) ఆచరించువారు;
ముముక్షువులు = మోక్షం కోసం పరితపించేవారు,
జంజపూకాగ్రణులు = నిరంతరం జపం చేసేవారిలో శ్రేష్ఠులు.
సరళ భావానువాదం:
వైదిక ధర్మ మూర్తులు:
“ఓ మహర్షులారా! మీ గొప్పతనం నాకు తెలియదా? మీరు ఈ భూమండలంపై నడయాడే పుణ్యమూర్తులు. మీరు సోమయాగాలను చేసినవారు, అగ్నిహోత్రాన్ని ఆరాధించేవారు, వేదవేదాంగాలను అభ్యసించిన శ్రోత్రియులు. యజ్ఞయాగాదులలో నిష్ణాతులై, నిరంతరం ధర్మ కార్యాలలో నిమగ్నమై ఉంటారు. ఆరు రకాలైన వైదిక కర్మలను తప్పక ఆచరించే మీరు, భవిష్యత్తును ముందుగానే ఊహించగల దీర్ఘదర్శులు. కేవలం మోక్ష్యమే లక్ష్యంగా నిరంతరం జపతపాలు చేసుకునే మీ వంటి మహాత్ములను గురించి నాకు తెలియనిదా?”
ఈ పద్యం జంటకవులకు వైదిక ప్రక్రియల (Vedic Rituals) పట్ల ఉన్న అపారమైన అవగాహనను తెలియజేస్తున్నది.
పద ప్రయోగం: ఇందులో వాడిన పదాలు ఉదా: యాయజాకులు, జంజపూక.. అనేవి చాలా అరుదైనవి మరియు లోతైన అర్థం కలిగినవి. దాదాపు రచనల్లో కనుమరుగైనవి ఇవి మునుల యొక్క అనేక ఆచారాలను తెలుపుతాయి. మునుల విశిష్టతను తెలుపుతూ.. మునులు అంటే కేవలం గడ్డం పెంచి అడవిలో ఉండేవారు కాదు, వారు సమాజం కోసం శాస్త్రీయంగా యజ్ఞాలు చేస్తూ, నిరంతరం జపం చేస్తూ ఆధ్యాత్మిక శక్తిని పెంచేవారని కవి గుర్తుచేశారు. అంతేకాదు ఎంతో వినయం ఉన్నవారని..
“తెలియంజాలనె మిమ్ము” (మీ గురించి నాకు తెలియదా) అనడంలో సూత మహర్షికి వారి పట్ల ఉన్న అపారమైన గౌరవం కనిపిస్తున్నది.
110 శా॥
ఇట్టిండ్రైతగువారు మీరు పురు హేయీభూత వృత్తుండబు
ద్ద్యుట్టంకజ్జడి మాన్వితుండ నితి వృత్తోపజ్ఞతాభాతా
కుట్టారాంధ తమోఽతిబీకర దరీకోష్ఠ ప్రవిష్టుండ నే
నిట్టిండన్ భవదీయ సంస్తుతుల కర్హీభూత విజ్ఞుండనే.
హేయీభూత వృత్తుండ= అల్పమైన ప్రవృత్తి గలవాడను (వినయంతో చెప్పుకుంటున్న మాట),
బుద్ధ్యుట్టంకజ్జడి మాన్వితుండ = బుద్ధి మాంద్యము లేదా అజ్ఞానము అనే జబ్బుతో ఉన్నవాడను,
ఇతివృత్తోపజ్ఞతా = కథా గమనాన్ని గ్రహించే తెలివితేటలు,
కుట్టారాంధ తమోతిబీకర = చిక్కని చీకటితో నిండిన భయంకరమైన.
దరీకోష్ఠ ప్రవిష్టుండ = గుహ వంటి చీకటి గదిలో ప్రవేశించిన వాడను,
సంస్తుతుల కర్హీభూత = మీ స్తోత్రాలకు (పొగడ్తలకు) తగనివాడను.
సరళ భావానువాదం:
సూత మహర్షి వినమ్రత:
“ఓ మునులారా! మీరు ఎంతో గొప్పవారు, పైన చెప్పిన అన్ని అర్హతలు కలిగిన మహానుభావులు. కానీ నేను మాత్రం ఎంతో అల్పుడిని. నా బుద్ధి మందగించినట్లుగా ఉంది. ఒక కథను ఎలా చెప్పాలి, ఆ కథలోని లోతుపాతులు ఏమిటి అనే జ్ఞానం లేక.. గాఢాంధకారంతో నిండిన ఒక భయంకరమైన లోతైన గుహలో చిక్కుకున్న వాడిలా ఉన్నాను. అపారమైన జ్ఞానసంపద కలిగిన మీరు నన్ను ఇంతగా పొగడటం చూస్తుంటే, నేను నిజంగా మీ స్తోత్రాలకు అర్హుడనేనా? అని నాకు అనిపిస్తున్నది.”
ఈ పద్యం ఒక మహాపండితుడికి ఉండవలసిన ‘నిరహంకారా’న్ని ప్రదర్శిస్తున్నది.
జ్ఞాన గుహ అనడం సూత మహర్షి తనను తాను చీకటి గుహలో ఉన్నవాడిగా వర్ణించుకోవడం ఆయన వినయానికి పరాకాష్ఠ. ఎంతటి జ్ఞానికైనా “నాకు ఇంకా తెలియనిది చాలా ఉంది” అనే భావన ఉంటుందని కవి ఇక్కడ స్పష్టం చేశారు.
వక్త ప్రవృత్తి ఎలా ఉండాలంటే? శ్రోతలు తనను పొగిడినప్పుడు ఉప్పొంగిపోకుండా, తన పరిమితులను గుర్తించేవాడే అసలైన జ్ఞాని.
ఇందులో ‘కుట్టారాంధ తమోతిబీకర’ వంటి పద ప్రయోగాలు, సమాసాలు ఆ చీకటి యొక్క తీవ్రతను, అజ్ఞానపు లోతును అద్భుతంగా ధ్వనింపజేస్తున్నాయి.
(సశేషం)
శ్రీమతి రంగరాజు పద్మజ ప్రముఖ రచయిత్రి. కీ.శే. ఒద్దిరాజు కమలాదేవి, కీ.శే. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు వీరి తల్లిదండ్రులు. జన్మస్థలం ఇనుగుర్తి, కేసముద్రం మండలం. పద్మజ గారు సుమారు 100 కథలు, 300 కవితలు, సుమారు 100 మ్యూజింగ్స్ వ్రాశారు. మనసే కోవెల (కథాసంపుటి), చిత్రకవితలు (కవితా సంపుటి), హరిదాసి (అనుసృజన – నవల), గుండెల్లోతుల్లోంచి (కథా సంపుటి), నాటి నుండి నేటి వరకు (గ్రామ చరిత్ర), వ్యాస వితతి (వ్యాస సంపుటి), భక్తి భండారి (జీవిత చరిత్ర) వంటి పుస్తకాలు వెలువరించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి రుద్రమదేవి నవలను సరళీకృతం చేశారు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి చారిత్రక పద్యకావ్యం ‘ఖడ్గతిక్కన’ను పరిష్కృతం చేసి పాఠకులకు అందించారు. ఒద్దిరాజు సోదరుల ‘కృష్ణస్తవః, వైభవస్తవః’ కావ్యాలను, మరియు సర్వలోకేశ్వర శతకంను పరిష్కరించారు.
ఒద్దిరాజు సోదరులు, రాణి శంకరమ్మ , సమ్మక్క.. సారలమ్మ, పారిజాతాపహరణం వంటి బుర్రకథలు రచించారు.
సనాతన ధర్మం ఆవాసాలు (దేవాలయాలు), నాయన, ఇంద్రధనుస్సు (కవితా సంకలనం), వ్యాసాలు మరియు రేడియో ప్రసంగాలు అముద్రితాలు
భక్త్యామృతం, మయూఖ, తరుణి, నెచ్చెలి, నేడు, ప్రజాతంత్ర పత్రికలో వ్యాసాలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణా సారస్వత పరిషత్తు వారి వరిష్ఠ పురస్కారం, మహిళా సేవా భక్తి పురస్కారం,
వెల్లుల్లి ఫౌండేషన్ వారిచే మహిళా సాధికారత విశిష్ట పురస్కారం, తెలుగు సాహిత్య అకాడమీ మరియు అక్షరయాన్ మహిళా రచయిత్రుల సంఘం వారిచే వెంగమాంబ పురస్కారం, వరంగల్ మహానగర పాలక సంస్థ రాష్ట్ర మహిళా విభాగము వారిచే విశిష్ట మహిళా పురస్కారం వంటి పురస్కారాలు స్వీకరించారు.
రామం భజే శ్యామలమ్ వారిచే ఆర్ష ధర్మ ప్రదీపిక, మల్లినాథసూరి కళాపీఠం వారిచే వ్యాఖ్యాన సామ్రాజ్ఞి, మేకా రవీంద్ర వారిచే సహస్ర పద్యం కంఠీరవ అనే బిరుదులు పొందరు. చరవాణి: 99897 58144
