Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-14

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 13

121 – కం॥
మందురలు దేవ దేవీ
మందిరములు నాయతన సమాజమ్ము ప్రపా
బృందముప కారికాతతి
క్రందుకొనెం దత్పుర ప్రకాండమునందున్.

ఈ పద్యంలో కౌశాంబీ నగరంలోని వివిధ రకాల కట్టడాలను, ప్రజా సౌకర్యార్థం నిర్మించిన ప్రదేశాలను కవి వర్ణించారు. నగరం ఎంతటి వైభవంతో, అన్ని వసతులతో నిండి ఉందో ఈ పద్యం చెబుతోంది.

మందురలు = అశ్వశాలలు (గుఱ్ఱపు శాలలు),
దేవ దేవీ మందిరములు = దేవతల యొక్క, దేవేరుల యొక్క ఆలయాలు (గుళ్లు).
ఆయతన సమాజమ్ము = యజ్ఞయాగాదులు చేసే ప్రదేశాలు లేదా సభా భవనములు.
ప్రపా బృందము = చలివేంద్రాలు
(ప్రప అంటే చలివేంద్రం/మంచినీరు సరఫరా చేసే పందిరి).
ఉపకారికా తతి = అతిథి గృహాలు లేదా విశ్రాంతి భవనాలు,
క్రందుకొనెన్ = దట్టంగా ఉన్నాయి.
తత్పుర ప్రకాండము నందున్ = ఆ శ్రేష్ఠమైన నగరము నందు.

భావం:

ఆ గొప్పదైన కౌశాంబీ నగరంలో గుఱ్ఱపు శాలలు, ఎన్నో దేవతా ఆలయాలు, యజ్ఞశాలలు లేదా సభా భవనాలు, బాటసారుల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు మరియు అతిథుల కోసం నిర్మించిన విశ్రాంతి భవనాలు విరివిగా ఉన్నాయి. ఆ నగరం ఈ కట్టడాలన్నింటితో ఎంతో రద్దీగా, వైభవంగా కనిపిస్తున్నది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరం సకల వసతులకు నిలయం. అక్కడ గుఱ్ఱాలు ఉండే శాలలు, భక్తిని పంచే గుళ్లు, వేద విజ్ఞానాన్ని పంచే యజ్ఞశాలలు ఎన్నో ఉన్నాయి. దాహంతో వచ్చే వారికి చలివేంద్రాలు, ఊరు కాని ఊరు నుండి వచ్చే వారికి విడిది గృహాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. నగరం అంతా ఇలాంటి ఉపయోగకరమైన కట్టడాలతో కిక్కిరిసి పోయి కళకళలాడుతున్నది.

కవికి సామాజిక స్పృహ ఉందనడానికి నగర వర్ణన. ఒక నగరంలో కేవలం రాజుగారి మేడలే కాదు, ప్రజల కోసం ‘చలివేంద్రాలు’ (ప్రప), ‘అతిథి గృహాలు’ (ఉపకారిక) కూడా ఉండాలని ఈ పద్యం ద్వారా తెలుస్తోంది. ఇది ఆనాటి పాలకుల ప్రజానురంజక పరిపాలనకు నిదర్శనం. ప్రౌఢ శబ్దం – ‘మందుర’ అనే పదం గుర్రపు శాలను తెలుపుతుంది. సామాన్యంగా మనం అశ్వశాల అంటాము, కానీ కవి ఇక్కడ అరుదైన పదప్రయోగం చేశారు.

క్రందుకొను = ఈ పదం నగరం యొక్క వైశాల్యాన్ని, రద్దీని తెలుపుతున్నది. అంటే నగరం నిర్జీవంగా కాకుండా, ఎప్పుడూ జనంతోనో, జంతువులతోనో సందడిగా ఉండేదని భావం.

122 – శా॥

నైదాఘాతపతాపతప్త నగరీణస్తోమ మక్షాంతిఁ బ్రా
సాదాంతఃస్థలవాసులై పృథుల తృష్ణా శాంత్యుపాయాప్తి ను
త్సే ద ప్రాంచిత నాలికేరములకై చేజాచి లేఁగాయలన్
ప్రోదింద్రించి పగల్చిత్రావెదరు కోర్కుల్దీరఁ దన్నీరమున్.

నైదాఘాతప తాప తప్త = వేసవి కాలపు ఎండల వేడికి తపించిపోయిన (నైదాఘ అంటే వేసవి),
నగరీణ స్తోమము = నగరవాసుల సమూహం, అక్షాంతిన్ = ఎండ వేడిని భరించలేక,
ప్రాసాదాంతఃస్థల వాసులై = మేడల పై అంతస్తులలో నివసించేవారై.
పృథుల తృష్ణా శాంత్యుపాయాప్తిన్ = మిక్కుటమైన దప్పిని తీర్చుకునే ఉపాయం కోసం.
ఉత్సేద ప్రాంచిత = చాలా ఎత్తుగా పెరిగిన.
నాలికేరములకై = కొబ్బరి చెట్ల (కాయల) కోసం.
చేజాచి = చేతులు చాపి.
లే గాయలన్ ప్రోదించి =“లేత కాయలను (కొబ్బరి బొండాలను) కోసి.
పగల్చి త్రావెదరు = పగలగొట్టి తాగుతారు.
తన్నీరమున్ = ఆ కొబ్బరి నీళ్లను,

భావం:

కౌశాంబీ నగరంలో మేడలు ఎంత ఎత్తుగా ఉండేవంటే – వేసవి కాలంలో ఎండ వేడిని భరించలేని ప్రజలు తమ మేడల పై అంతస్తులలోకి వెళ్ళేవారు. అక్కడ వారికి దాహం వేస్తే, కిందకు దిగాల్సిన అవసరం లేకుండానే.. మేడ పక్కనే ఆకాశమంత ఎత్తుకు పెరిగిన కొబ్బరి చెట్ల నుండి లేత కొబ్బరి బొండాలను తమ చేతులతోనే నేరుగా కోసుకునేవారు. ఆ కాయలను పగలగొట్టి, చల్లని నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకునేవారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని భవనాలు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండేవనీ, ఎండలు ముదిరినప్పుడు ప్రజలు చల్లదనం కోసం మేడల పైభాగానికి వెళ్ళేవారనీ. అక్కడ వారికి దాహం వేస్తే, మేడ పక్కనే ఉన్న ఎత్తైన కొబ్బరి చెట్ల చివరలు వారి చేతికి అందేవి. అలా మేడ మీద నుండే చేతులు చాపి, కొబ్బరి బొండాలు కోసుకుని, వాటి నీటితో హాయిగా దాహం తీర్చుకునేవారు.

కొబ్బరి చెట్లు సాధారణంగా చాలా ఎత్తుగా ఉంటాయి. కానీ ఇక్కడ కవి “మేడ మీద ఉన్న వారికి కొబ్బరి కాయలు చేతికి అందుతున్నాయి” అని చెప్పడం ద్వారా.. ఆ నగరంలోని భవనాలు ఎంత ఎత్తుగా ఉండేవో చాలా చమత్కారంగా అతిశయోక్తి అలంకారంలో వర్ణించారు.

ఇది కేవలం భవనాల ఎత్తునే కాదు, ఆ నగర ప్రజల విలాసవంతమైన జీవనాన్ని కూడా సూచిస్తుంది. ఎండలో కిందకు దిగే శ్రమ లేకుండానే వారికి ప్రకృతి ప్రసాదించిన పానీయం అందుబాటులో ఉండేదని భావం.

‘నైదాఘాతపతాపతప్త’ వంటి పదాలు చదువుతుంటే వేసవి కాలపు తీక్షణతతో పాటు, కవి రచనలోని శబ్ద సౌందర్యం ఆహా అనిపిస్తుంది.

123 – మం॥
పురవాస్తవ్యనివసస్య రమ్య వలభీపుంజ ప్రశస్త ప్రభా
కర సాస్నిగ్ధ సుధాపరిచ్ఛద మనోజ్ఞ స్వచ్ఛభిత్తుల్ నిరం
తర గేహాంతర భాగ నిత్య వలమాన స్త్రీలకుం దర్పణా
భిరతిన్ మాన్చు లలాటసీమ మృగనాభిం దిద్దునప్పట్టునన్.

పురవాస్తవ్య నివసస్య = నగరంలో నివసించే వారి యొక్క,
రమ్య వలభీపుంజ = అందమైన మేడల సమూహము యొక్క (వలభి అంటే మేడ పైభాగం లేదా శిఖరం),
ప్రశస్త ప్రభాకర = శ్రేష్ఠమైన కాంతిని వెదజల్లే,
సాస్నిగ్ధ సుధా పరిచ్ఛద = నునుపైన సున్నపు పూతను వేసిన (సుధా అంటే సున్నం)
మనోజ్ఞ స్వచ్ఛ భిత్తుల్ = అందమైన, నిర్మలమైన గోడలు (భిత్తు అంటే గోడ).
నిరంతర గేహాంతర భాగ = ఎల్లప్పుడూ ఇళ్ల లోపలి భాగాలలో.
వలమాన స్త్రీలకున్ = తిరుగాడే స్త్రీలకు,
దర్పణాభిరతిన్ మాన్చు = అద్దాల మీద ఉన్న ఆసక్తిని పోగొడుతున్నాయి.
మృగనాభిన్ దిద్దునప్పట్టునన్ = కస్తూరి తిలకాన్ని (మృగనాభి అంటే కస్తూరి) దిద్దుకునే సమయంలో.

భావం:

కౌశాంబీ నగరంలోని మేడల గోడలు ఎంతో నునుపైన తెల్లని సున్నపు పూతతో, స్వచ్ఛంగా మెరిసిపోతూ ఉండేవి. ఆ ఇళ్లలో తిరుగాడే స్త్రీలు తమ నుదుటిపై కస్తూరి తిలకాన్ని దిద్దుకునే సమయంలో.. ప్రత్యేకంగా అద్దాల కోసం వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ గోడలే అద్దాల వలె ప్రతిబింబాన్ని చూపిస్తూ, వారి అద్దాల అవసరాన్ని తీర్చేవి. ఆ గోడలను చూసుకుంటూనే వారు అలంకరించుకునేవారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని భవనాల గోడలు అద్భుతమైన తెల్లని మెరుపుతో, నునుపుగా ఉండేవి. ఆ ఇళ్లలో ఉండే స్త్రీలు తమ నుదుట కస్తూరి బొట్టు పెట్టుకోవాలనుకున్నప్పుడు అద్దం కోసం చూడనక్కర్లేదు. ఆ గోడలే అద్దాల్లా మెరుస్తూ ఎదుటివారి రూపాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అలా ఆ మేడల గోడలే అద్దాల పనిని పూర్తి చేసేవి.

దీనిని ‘అతిశయోక్తి’ అలంకారంతో వర్ణించారు. గోడలు అద్దాల్లా పనిచేస్తున్నాయని చెప్పడం ద్వారా ఆ కాలపు నిర్మాణ కౌశలాన్ని, పరిశుభ్రతను కవి వర్ణించారు.

మృగనాభి = ఆ కాలంలో స్త్రీలు కస్తూరిని తిలకంగా వాడేవారని మనకు తెలుస్తున్నది.

సుధా పరిచ్ఛద = ‘సుధ’ అంటే సున్నం. ఇక్కడ సున్నం అంటే నునుపైన పాలరాయి వంటి మెరుపు అని భావం.

పద్యంలో కౌశాంబీ నగరంలోని భవనాల గోడల స్వచ్ఛతను, మెరుపును కవి ఎంతో గొప్పగా వర్ణించారు. ఇక్కడ ‘భిత్తులు’ (గోడలు) అద్దాల వలె పనిచేస్తున్నాయని చెప్పడం ద్వారా ఆ నగర సౌందర్యాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు.

124 – కం॥
సమధిక సత్వర లీలా
భ్రమదుత్తమ వీత్య నేక పస్ఫూర్జ దనః
ప్రమదా పౌంస్నా రావాఽ
శ్రమ హేళిపుర ప్రతోళి రాణఁ జెలంగున్.

సమధిక =మిక్కిలి అధికమైన. (ఎక్కువైన)
సత్వర లీలా = వేగవంతమైన విలాసముతో.
భ్రమత్ = తిరుగుతున్న.
ఉత్తమ వీథి = రాజవీధులు
అనేక విస్ఫూర్జత్ = అనేకములై ప్రకాశిస్తున్న.
అనః: = బండ్లు
ప్రమదా పౌంస్నా = స్త్రీల మరియు పురుషుల యొక్క.
రావ = శబ్దములు.
అశ్రమ = అలసట లేని.
హేళి = సూర్యుని వంటి ప్రకాశవంతమైన.
పుర ప్రతోళి = నగరములోని వీధులు.
రాణన్ జెలంగున్ = మనోహరముగా ఒప్పారుతున్నవి.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని రాజవీధులు ఎంతో వైభవంగా ఉన్నాయి. ఆ వీధుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే అనేక శకటాల చప్పుడు, అటు ఇటు తిరుగుతున్న స్త్రీపురుషుల మాటలు, కోలాహలం నిరంతరం వినిపిస్తూ ఉంటాయి. సూర్యకాంతిలా ప్రకాశించే ఆ వీధులు, ఆ శబ్దాలతో ఎప్పుడూ కళకళలాడుతూ నగరానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తున్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగర వీధులు ఎంతో వెడల్పుగా, పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ గుఱ్ఱపు బండ్లు, ఎడ్ల బండ్లు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. వాటి చప్పుళ్లతో పాటు, అటు ఇటు తిరుగాడే స్త్రీపురుషుల మాటల సందడి కలిసి ఆ వీధులన్నీ ఎప్పుడూ ఉత్సాహంగా, విలాసవంతంగా కనిపిస్తాయి.

ఈ పద్యంలో అనః (బండ్లు) మరియు ‘రావ’ (శబ్దాలు) అనే పదాల ద్వారా ఆనాటి నగరాలలోని జనసమ్మర్దాన్ని కవి కళ్ళకు కట్టినట్లు చూపారు.

ప్రతోళి అంటే నగరములోని పెద్ద వీధి అని అర్థం. ఆ వీధులు సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయని చెప్పడం (హేళి పుర ప్రతోళి) ద్వారా వాటి శుభ్రతను, సంపదను చెప్పారు.

పద్యం చదువుతుంటే ఆ శకటాల వేగం, జనం గుంపుల కోలాహలం ఒక లయబద్ధంగా వినిపిస్తున్నట్లు ఉంటుంది.

125 – మ॥
సృతి సందర్శన కార్య యుక్తులు వణిగ్బృందంబు దేశాంతరా
గతులా రక్షక పాళి రక్షక భటుల్ కార్య ప్రసక్తుల్ ధరా
పతి సంవీక్షితు కాములఠ్థులు ద్విజుల్ వైలాసికుల్ సాంద్రతా
స్థితి మీఱం దిరుగాడినం గనవుకస్తిన్ రథ్యలవ్వీడునన్.

సృతి సందర్శన కార్య యుక్తులు = వీధులను చూడటానికి లేదా పనుల మీద వెళ్లేవారు.
వణిగ్బృందంబు = వ్యాపారస్తుల సమూహం.
దేశాంతరాగతులు = ఇతర దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు.
రక్షక పాళి = కాపలాదారులు మరియు రక్షక భటులు
కార్య ప్రసక్తుల్ = తమ తమ పనుల్లో మునిగిపోయిన వారు.
ధరాపతి సంవీక్షితు కాములు = రాజుగారిని దర్శించుకోవాలని కోరుకునేవారు.
అర్థులు = యాచకులు లేదా సాయం కోరేవారు.
ద్విజుల్ = బ్రాహ్మణులు,
వైలాసికుల్ = విలాసవంతులు
సాంద్రతా స్థితి మీఱన్ = విపరీతమైన రద్దీతో.
రథ్యలు = రాజవీధులు,
కస్తిన్ కనవు = ఇబ్బందిని చూడవు.

భావం:

ఆ కౌశాంబీ నగర రాజవీధుల్లో రకరకాల మనుషులు తిరుగుతుంటారు, వ్యాపారస్తులు, ఇతర దేశాల నుండి వచ్చిన వారు, నగరాన్ని కాపాడే భటులు, తమ పనుల మీద వెళ్లే ఉద్యోగులు, రాజుగారిని చూడాలనుకునేవారు, పండితులు, విలాసవంతులు. ఇంతమంది జనం, వాహనాలతో ఆ వీధులు ఎంతో రద్దీగా ఉన్నప్పటికీ, ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది (కస్తి) కలగకుండా ఆ వీధులు ఎంతో ప్రశస్తంగా ఉన్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగర వీధులు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. వ్యాపారులు, పరదేశీయులు, రాజ భటులు, పండితులు, విలాస పురుషులు ఇలా అందరూ అక్కడ కనిపిస్తారు. రాజును దర్శించుకోవడానికి వచ్చే వారి సందడి సరేసరి! అంత రద్దీగా ఉన్నా, ఆ వీధులు ఎంత వెడల్పుగా, క్రమబద్ధంగా ఉన్నాయంటే.. ఎవరికీ రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందీ కలగదు.

ఈ పద్యం ద్వారా ఆ కాలపు నగరాల్లో ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్’ ఎంత బాగుండేదో కవి సూచించారు. ‘సాంద్రత మీఱినన్ – కనవు కస్తిన్’ అంటే రద్దీ ఎక్కువగా ఉన్నా చిక్కులు లేవు అని అర్థం.

ఒక నగరంలో ఉండే అన్ని వర్గాల ప్రజలను వ్యాపారులు, భటులు, పండితులు, అతిథులు ఒకే పద్యంలో (సాంద్రత) అనే పదంతో బంధించడం కవి ప్రతిభ తెలుస్తున్నది.

ప్రౌఢ పదం: ‘వైలాసికులు’అంటే జీవితాన్ని విలాసవంతంగా గడిపేవారు అని అర్థం. నగరంలో గొప్ప సంపద ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

126 – మ॥
అనుభావ్యంబును నర్థితంబునగు క్రయ్య క్రేయ వస్తూత్కరా
భినివేశాపణ సంకులోల్లిపితమై వివేతృ సుకేతృ పౌం
సన్న నికాయోత్థితవర్త కోచిత మిథః సల్లాప సంరావ భీ
షణమై భాసిలుఁ దత్పురీవిపణ హర్ష స్ఫూర్తి నశ్రాంతమున్.

అనుభావ్యంబును = అనుభవించడానికి యోగ్యమైనవి.
అర్థితంబును = కోరదగినవి.
క్రయ క్రేయ వస్తూత్కర = అమ్మేవి, కొనేవి అయిన వస్తువుల రాసులు..
అభినివేశా పణ సంకులోల్లిపితమై = ఆసక్తికరమైన అంగళ్లతో కిక్కిరిసి ఉన్నదై,
వివేతృ సుకేతృ = అమ్మేవారు (వివేతృ), మంచి కొనుగోలుదారులు (సుకేతృ) అయిన.
పౌంస్న నికాయోత్థిత = పురుషుల సమూహం నుండి పుట్టిన.
వర్త కోచిత మిథః సల్లాప సంరావ = వ్యాపారానికి తగినట్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటల ధ్వనులతో.
భీషణమై = గంభీరమైన (మామూలు ప్రజలకు అర్ధంకాని వ్యాపారభాష)
అశ్రాంతమున్ = ఎల్లప్పుడూ

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని అంగడి వీధులు ఎప్పుడూ కొనుగోలుదారులు, అమ్మేవారితో కిక్కిరిసి పోయి ఉండేవి. అక్కడ అనుభవించడానికి వీలైన, ఎవరికి కావలసిన సరకులు వారికి రాసులు పోసి వస్తువులు విక్రయానికి సిద్ధంగా ఉండేవి. ఆ వస్తువులను అమ్మేవారు, కొనేవారు ఒకరితో ఒకరు బేరసారాలు ఆడుతూ మాట్లాడుకునే మాటల శబ్దం ఆ వీధుల నిండా ప్రతిధ్వనిస్తూ, నగరానికి ఒక గొప్ప వ్యాపార వైభవాన్ని కలుగజేస్తున్నది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగర మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. అమ్మేవారు తమ వస్తువుల గొప్పదనాన్ని చెబుతుంటే, కొనేవారు బేరాలాడటం – ఈ ఇద్దరి మధ్య జరిగే సంభాషణల వల్ల ఆ వీధులన్నీ పెద్ద చప్పుడుతో సందడిగా ఉంటాయి. ఆ కోలాహలమే ఆ నగర సిరిసంపదలకు నిదర్శనం.

ఈ పద్యం చదువుతుంటే మనకు ఒక పెద్ద మార్కెట్ యార్డ్ గుర్తుకు వచ్చి ఆ సన్నివేశమంతా శబ్దచిత్రంవలె కనులముందు కనపడుతున్నది.

‘మిథః సల్లాప సంరావ’ అనే పదం ద్వారా ఆ జనాల మాటల హోరును కవి మనకు వినిపింపించారు.

‘అనుభావ్యంబును నర్థితంబునగు’ అనడం ద్వారా, ప్రజల విలాసాలకు, అవసరాలకు కావలసిన వస్తువులన్నీ అక్కడ సమృద్ధిగా ఉన్నాయని ఆ నగర ఆర్ధిక స్థితి తెలుస్తున్నది.

‘వివేతృ – సుకేతృ’ ఇవి సంస్కృత ధాతువుల నుండి వచ్చిన పదాలు. అమ్మేవాడు, కొనేవాడు అనే అర్థంలో ప్రౌఢంగా వాడారు.

127 – శా॥
నీరంధ్రోన్నత భూరుహాంతర వసన్నీడోద్భవ శ్రేణి కృ
త్స్ఫార శ్రావ్య నితాంత సమ్మధుర షడ్జగ్రామ వైశుధ్య గాం
ధార గ్రామ నిబద్ధక స్వరసము త్స్పష్టీకృతాఖండ గా
నాఽ రావాంచిత నిష్కుటప్రతతి శోభాప్తిం గనుందత్పురిన్.

నీరంధ్రోన్నత భూరుహ = సందు లేకుండా (దట్టంగా), ఎత్తుగా పెరిగిన చెట్లు,
నీడోద్భవ శ్రేణి = గూళ్లలో పుట్టిన పక్షుల గుంపులు,
స్ఫార శ్రావ్య నితాంత సమ్మధుర= విస్తారమైనవి, వినసొంపైనవి, కమ్మని గొంతుతో
షడ్జగ్రామ వైశుధ్య గాంధార గ్రామ = సంగీత శాస్త్రంలోని షడ్జమ, గాంధార గ్రామాలకు (స్వర సముదాయాలకు) చెందిన,
నిబద్ధక స్వర సముత్స్పష్టీకృత = స్పష్టంగా పలకబడే స్వరములతో కూడిన.
అఖండ గానారావ = ఎడతెగని సంగీత ధ్వనులతో,
అంచిత నిష్కుట ప్రతతి = ఒప్పారుతున్న తోటల సమూహము (నిష్కుటము అంటే ఇంటి పెరటి తోట లేదా ఉద్యానవనం).
శోభాప్తిన్ గనున్ = అందంగా కనపడుతున్నది.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని ఉద్యానవనాలు దట్టంగా, ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఉన్నాయి. ఆ చెట్ల గూళ్లలో నివసించే పక్షుల సమూహాలు చేసే ధ్వనులు ఎలా ఉన్నాయంటే ? సంగీత శాస్త్రంలో చెప్పే షడ్జమ, గాంధార గ్రామాలకు చెందిన స్వరాలను అత్యంత స్పష్టంగా, మధురంగా పాడుతున్నట్లుగా ఉన్నాయి. అటువంటి అఖండమైన పక్షుల గానంతో ఆ నగరంలోని తోటలన్నీ ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతున్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని తోటలు చాలా దట్టంగా ఉంటాయి. ఆ చెట్లపై ఉన్న పక్షులు పెట్టే కిలకిల రావాలు మామూలుగా లేవు! అవి సంగీత విద్వాంసులు పాడే షడ్జమ, గాంధార స్వరాల్లా ఎంతో స్పష్టంగా, వినసొంపుగా ఉన్నాయి. నిరంతరం వినవచ్చే ఆ పక్షుల సంగీతంతో ఆ ఉద్యానవనాలు ఒక దివ్యలోకంలా కనిపిస్తాయి.

కవులకు సంగీత శాస్త్రంపై ఉన్న పట్టు ఇక్కడ కనిపిస్తుంది. ప్రాచీన సంగీతంలో షడ్జమ, గాంధార, మధ్యమ అనే మూడు గ్రామాలు (Scales) ఉండేవి. పక్షుల కూజితాలు కూడా శాస్త్రీయ బద్ధంగా ఉన్నాయని చెప్పడం కవి ఊహాశక్తికి నిదర్శనం.

ఒక పక్క అంగడి వీధుల హోరు, మరోపక్క తోటల్లో పక్షుల మధుర గానం – నగరంలోని రెండు భిన్నమైన పార్శ్వాలను కవి సమతుల్యం చేస్తూ ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళకు కట్టించారు.

నిష్కుటము ఇది ఒక చక్కని ప్రాచీన పదం. ఇంటి ఆవరణలో ఉండే తోటను నిష్కుటము అంటారు. అంటే ప్రతి ఇంటికీ ఒక తోట ఉండేదని, నగరం అంతా పచ్చదనంతో నిండి ఉండేదని అర్థం.

128 – శా॥
అమలాంభః పరిరాజితమ్ము కలహంసానీక సందీప్త మిం
దు మణినిర్మిత కక్ష్యకా నిచయ విద్యోతమ్ము సంవేష్ఠిత
భ్రమరాంచన్న లినీ నికాయపృథు శోభా భాసరమ్మున్నత
ద్రుమ సంఘావృతమప్పురింగల సరః స్తోమంబనూనంబుగన్.

అమలాంభః పరిరాజితమ్ము= (అమల) నిర్మలమైన నీటితో, (అంభః) ప్రకాశించేవి.
కలహంసానీక సందీప్తము = రాజహంసల సమూహములతో (అనీక) ప్రకాశిస్తున్నవి.
ఇందుమణి నిర్మిత కక్ష్యకా నిచయ విద్యోతమ్ము= చంద్రకాంత మణులతో (ఇందుమణి) కట్టబడిన అరుగుల(మెట్ల) సమూహముతో మెరిసిపోయేవి.
సంవేష్ఠిత భ్రమరాంచత్ = చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలతో ఒప్పారుతున్న.
నలినీ నికాయ పృథు శోభా భాసరమ్ము = పద్మలతా సమూహముల యొక్క గొప్ప కాంతితో వెలిగిపోతున్నవి,
ఉన్నత ద్రుమ సంఘావృతము = ఎత్తైన చెట్ల సమూహములతో చుట్టూ ఆవరించబడినవి.
అప్పురిన్ గల సరః స్తోమంబు = ఆ నగరంలో ఉన్న లెక్కలేనన్ని సరస్సులు.
అనూనంబుగన్ = తక్కువ కాకుండా

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని సరస్సులు అత్యంత వైభవంగా ఉన్నాయి. వాటిలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. ఆ కోనేరుల మెట్లు మరియు అరుగులు చంద్రకాంత మణులతో కట్టబడి కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఆ నీటిలో రాజహంసలు విహరిస్తుండగా, నీటిపై వికసించిన పద్మాల చుట్టూ తుమ్మెదలు ఝుంకారాలు చేస్తున్నాయి. ఆ సరస్సుల చుట్టూ ఎత్తైన చెట్లు దట్టంగా పెరిగి, ఆ ప్రదేశానికి అపురూపమైన శోభను ఇస్తున్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని కోనేరులు చూడముచ్చటగా ఉంటాయి. స్వచ్ఛమైన నీరు, అందులో ఈదులాడే రాజహంసలు, పద్మాలపై వాలే తుమ్మెదలతో అవి కళకళలాడుతుంటాయి. విశేషం ఏమిటంటే, ఆ కోనేరుల మెట్లు చంద్రకాంత మణులతో కట్టబడ్డాయి. చుట్టూ ఎత్తైన చెట్లు నీడను ఇస్తుంటే, ఆ సరస్సులు నగరానికే ఆభరణాల్లా కనిపిస్తాయి.

ఇందుమణి (చంద్రకాంత మణి)
కవి ఇక్కడ ఇందుమణి అని వాడటం విశేషం. పురాణాల ప్రకారం చంద్రకాంత శిలలు.

129 – మం॥
అనయంబుంబనిగాఁ జలగ్రహణ కార్యమ్మూని పౌరాంగనా
జనమప్పట్టున నిర్మల స్ఫటిక పార్శ్వ స్వచ్ఛ కూపాలికిం
జని లోఁడిగ్గఁగ బైటరాగ యువతీచ్ఛాయల్ దరుల్ సోఁకి చా
లన చిత్రక్రియగాఁ దిదృక్షు నయనాహ్లాదంబుగావించెదర్.

అనయంబున్ = ఎల్లప్పుడూ,
పనిగా జలగ్రహణ కార్యము = నీటిని తెచ్చుకొనే పనిని,
పౌరాంగనా జనము = నగరంలోని స్త్రీలు,
నిర్మల స్ఫటిక పార్శ్వ స్వచ్ఛ కూపాలికిన్ =
తెల్లని స్ఫటిక శిలలతో నిర్మించిన గోడలు కలిగిన స్వచ్ఛమైన బావుల వద్దకు (కూపము అంటే బావి).
చని = వెళ్ళి.
లో దిగ్గగ – బైట రాగ: నీటి లోపలికి దిగినప్పుడు, తిరిగి బయటకు వచ్చినప్పుడు.
యువతీచ్ఛాయల్ = ఆ యువతుల నీడలు (ప్రతిబింబాలు).
దరుల్ సోకి = ఆ బావి గోడలకు సోకి.
చాలన చిత్రక్రియగా = ఒక వింతైన చిత్రలేఖనంలా (మాయాజాలంలా)
దిదృక్షు నయనాహ్లాదంబు = చూసేవారి కళ్లకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

భావం:

కౌశాంబీ నగరంలోని స్త్రీలు ప్రతిరోజూ నీటి కోసం బావుల వద్దకు వెళ్తుంటారు. ఆ బావులు సాధారణమైనవి కావు; వాటి గోడలు స్వచ్ఛమైన స్ఫటిక శిలలతో నిర్మించబడ్డాయి. ఆ స్త్రీలు నీటిలో దిగుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు.. వారి శరీరాల ప్రతిబింబాలు ఆ స్ఫటిక గోడలపై పడి, అవి ఎలా కనిపిస్తున్నాయంటే – గోడల మీద ఎవరో అందమైన బొమ్మలు గీశారా అన్నట్లుగా ఉంది. చూసేవారి కళ్లకు అది ఒక అద్భుతమైన చిత్రకళా ప్రదర్శనలా కనిపిస్తూ ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది.

సరళ భావానువాదం:

నగరంలోని బావులు స్ఫటికాల్లా మెరిసిపోయే గోడలతో ఉన్నాయి. నీటి కోసం వెళ్ళిన స్త్రీలు ఆ బావుల్లోకి దిగి వస్తుంటే, వారి నీడలు ఆ గోడలపై ప్రతిబింబిస్తాయి. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, గోడల మీద చిత్రాలు కదులుతున్నాయా అన్నట్లుగా ఉండి, చూసేవారికి కనువిందు చేస్తాయి. బావుల లోపలి గోడలు కూడా స్ఫటిక మణులతో కట్టబడ్డాయని చెప్పడం ఆ నగరం యొక్క అత్యున్నత వైభవానికి నిదర్శనం.

స్త్రీల నీడలు గోడలపై పడటాన్ని కవి ‘చిత్రక్రియ’తో పోల్చడం ప్రతిబింబాలంకారంతో చాలా ఆధునికమైన ఊహగా అనిపిస్తుంది.

దిదృక్షు అంటే ‘చూడాలని కోరిక కలిగిన వారు’ అని అర్థం. ఆ దృశ్యం అంత అందంగా ఉంటుందని కవి భావం.

130 – కం॥
వడినడక నేర్చి కడువడిఁ
దొడవుల నొడలందుఁ దొడగి తొడితొడి నడువన్
దొడఁగిన బెడిదఁపు బెడగగు
నడగొండల నెగడు వీట నడుచు నరదముల్.

వడినడక నేర్చి = వేగంగా నడవడం నేర్చుకుని,
కడువడి = మిక్కిలి వేగముతో,
తొడవులన్ = ఆభరణాలను,
ఒడలందు దొడగి = శరీరముపై ధరించి.
తొడితొడి నడువన్ = తడబాటు లేకుండా నడవగా,
బెడిదపు బెడగు = గొప్ప వైభవము
నడగొండలు = నడిచే కొండలు (రథాలను లేదా ఏనుగులను నడిచే కొండలతో పోల్చడం).
నెగడు వీట = అందమైన ఆ నగరంలో.
నడుచు నరదముల్ = నడిచే రథములు (అరదము అంటే రథము).

ఆ కౌశాంబీ నగరంలోని రథాలు సామాన్యమైనవి కావు. వాటికి కట్టిన గుర్రాలు వేగంగా పరుగెత్తడంలో ఆరితేరినవి. ఆ గుర్రాలు ఒంటినిండా ఆభరణాలు ధరించి, ఎంతో క్రమశిక్షణతో, అత్యంత వేగంగా పరుగెత్తుతుంటే.. ఆ రథాలు నడిచే కొండల్లా కనిపిస్తున్నాయి. అంతటి గంభీరమైన వేగంతో, అలంకారాలతో ప్రకాశించే రథాల రాకపోకలతో ఆ నగరం ఎంతో వైభవంగా కనబడుతున్నది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలో రథాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. రథాలకు కట్టిన గుర్రాలు రకరకాల నగలతో మెరిసిపోతూ, ఎంతో వేగంగా పరుగెత్తుతుంటాయి. అలా వేగంగా వెళ్లే ఆ రథాలు చూస్తుంటే, కొండలే కదిలి వస్తున్నాయా అన్నట్లుగా గంభీరంగా ఉంటాయి. ఆ రథాల వేగం, అలంకరణ నగరానికి ఒక కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.

శబ్దాలంకారం (వృత్త్యనుప్రాస) ఈ పద్యంలో డ అనే అక్షరం పదే పదే వాడి డ కార ప్రాస మరియు అనుసార ప్రాసలతో రథాల చప్పుడు గుఱ్ఱాలవేగం మనం చూస్తున్నట్టు రచించారు. (వడి, నడక, కడువడి, తొడవుల, ఒడలందు, నడగొండలు, అరదముల్) ఇలాంటి ప్రయోగాన్ని కవి కావాలనే చేసారు. గుర్రాల గిట్టల చప్పుడు (టాక్.. టాక్.. టాక్..) మనకు వినిపించేలా ఈ పదాలను కూర్చారు.

రథాలను కదిలే కొండలు అని పిలవడం ద్వారా ఆ రథాల పరిమాణం, వాటి దృఢత్వం, మరియు గంభీరతను రూపకాలంకారంలో కవి చక్కగా చెప్పారు.

గుఱ్ఱాల అలంకరణ వర్ణన చదివినప్పుడు ఆ కాలంలో కేవలం మనుషులే కాదు, వాహనాలకు కట్టే గుఱ్ఱాలు కూడా ఆభరణాలతో శోభిల్లేవని, నగరంలోని వాహనాల గట్టిదనం,వేగం దీని ద్వారా కవి చమత్కారం తెలుస్తున్నది.

(సశేషం)

Exit mobile version