Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-15

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 14

131 – చ॥
వమధు కిరత్కరంబు మదవాసిత దాన ఝరీ విదీప్త గం
డములు మధువ్రతావృతి కనత్పరి వర్తుల భూరి పీన కుం
భవము కులిశావదాత గరిమపు విలబ్ధ మనోజ్ఞదీర్ఘ దం
తములు వెలుంగనప్పురి మదావళముల్ రమణంజెలెంగెడిన్.

వమధు కిరత్కరంబు = తుంపరలను చిమ్ముతున్న తొండములు కలవి,
మదవాసిత దాన ఝరీ విదీప్త గండములు= మదజలపు వాసనతో కూడిన, స్రవిస్తున్న మదధారలతో మెరుస్తున్న చెక్కిళ్లు కలవి,
మధువ్రతావృతి = తుమ్మెదల సమూహముతో ఆవరించబడినవి, (మదజలపు వాసనకు తుమ్మెదలు వస్తున్నాయని భావం).
కనత్ పరివర్తుల భూరి పీన కుంభవము = ప్రకాశిస్తున్నవి, గుండ్రనివి, పెద్దవి మరియు బలిష్ఠమైనవి అయిన కుంభస్థలములు కలవి.
కులిశావదాత గరిమము = వజ్రాయుధమంతటి తెల్లదనము మరియు దృఢత్వము కల,
విలబ్ధ మనోజ్ఞ దీర్ఘ దంతములు = లభించిన అందమైన, పొడవైన దంతములతో,
మదావళముల్ = మదించిన ఏనుగులు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని ఏనుగులు అత్యంత వైభవంగా ఉన్నాయి. అవి తమ తొండములతో నీటి తుంపరలను చిమ్ముతూ క్రీడిస్తున్నాయి. వాటి చెక్కిళ్ల నుండి మదజలం ధారలుగా ప్రవహిస్తోంది; ఆ వాసనకు తుమ్మెదలు ముసురుతున్నాయి. ఆ ఏనుగుల కుంభస్థలములు (తల పైభాగం) ఎంతో బలిష్ఠంగా, గుండ్రంగా ఉన్నాయి. వజ్రాయుధమంత తెల్లగా, దృఢంగా మెరుస్తున్న వాటి పొడవైన దంతాలు చూసేవారికి ఎంతో గంభీరంగా, మనోహరంగా కనిపిస్తున్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని ఏనుగులు సామాన్యమైనవి కావు. అవి మదించి, గంభీరంగా ఉన్నాయి. వాటి చెక్కిళ్ల నుండి కారుతున్న మదజలం వాసనకు తుమ్మెదలు చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ఏనుగుల తలలు బలిష్ఠంగా ఉంటే, వాటి దంతాలు మాత్రం వజ్రంలా తెల్లగా మెరుస్తూ చాలా పొడవుగా ఉన్నాయి. ఆ గజరాజుల రాకతో నగరం శత్రువులకు భయంకరంగా, మిత్రులకు వైభవంగా కనిపిస్తున్నది.

గజలక్షణ శాస్త్రం ప్రకారం ఏనుగుకు కుంభస్థలం (తల పైభాగం) గుండ్రంగా ఉండటం, దంతాలు పొడవుగా ఉండటం శ్రేష్ఠ లక్షణాలు. కవి ఇక్కడ ఆ లక్షణాలన్నీ ఉన్న ఏనుగులను శాస్త్రీయంగా వర్ణించారు.

వమధు (తుంపర) ఏనుగులు తమ తొండంతో నీటిని పీల్చి చల్లుకోవడం ఒక అందమైన దృశ్యం. దీనిని ‘వమధు కిరత్కరంబు’ అని వర్ణించడం కవి పరిశీలనా శక్తికి నిదర్శనం.

పద్యంలో సమాసాలు ఏనుగు నడకలాగే గంభీరంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘మదవాసిత దాన ఝరీ’ వంటి పదాలు ఆ మదజలపు ప్రవాహ వేగాన్ని సూచిస్తున్నాయి. ఈ వర్ణనా పద్యాలన్నీ శబ్దగౌరవంతో అందగించాయి.

132 – మ॥
ప్లుత నిష్ణాతము రేచితప్రసిత ముల్లోలాంచిత స్కందితాఽ
ప్రతిమానంబు సుదీర్ఘ ధౌరితక నిర్వార్య ప్రవీణమ్ము వ
ల్గిత విజ్ఞానిక మత్యుదార గమనాక్షీణ ప్రతాపమ్ము వి
క్షత సౌందర్య విరాజితమ్ము నగరాజానేయ సంఘమ్మొగిన్.

ప్లుత నిష్ణాతము = ఎగిరి దూకడంలో ఆరితేరినవి,
రేచిత ప్రసితము = వేగంగా పరుగెత్తడంలో ప్రసిద్ధి చెందినవి,
ఉల్లోల అంచిత స్కందిత = గంభీరంగా, లయబద్ధంగా దూకడంలో సాటిలేనివి,
సుదీర్ఘ ధౌరితక = విరామం లేకుండా చాలా దూరం పరుగెత్తే శక్తి కలవి,
నిర్వార్య ప్రవీణమ్ము = అడ్డులేని నైపుణ్యం కలవి,
వల్గిత విజ్ఞానికము = వల్గితం అనే ప్రత్యేకమైన గుర్రపు నడకలో ప్రావీణ్యం కలవి,
అత్యుదార గమన అక్షీణ ప్రతాపమ్ము = గొప్పదైన గమనంతో, తగ్గని పరాక్రమంతో కూడినవి.
విక్షత సౌందర్య విరాజితము = ఎక్కడా లోపం లేని సంపూర్ణ సౌందర్యంతో ప్రకాశించేవి,
ఆజానేయ సంఘమ్ము = గుర్రాల గుంపు, (ఆజానేయము అంటే గుర్రం).

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని గుర్రాల సమూహము అత్యంత శ్రేష్ఠమైనది. అవి ప్లుతము, రేచితము, స్కందితము, ధౌరితకము, వల్గితము వంటి అశ్వ శాస్త్రంలో చెప్పబడిన వివిధ రకాల నడకలలో అత్యంత నిపుణత కలిగినవి. శత్రువుల చేత ఆపడానికి వీలులేని వేగం, విరామం తెలియని పరాక్రమం ఆ గుర్రాల సొంతం. ఎంతో అందంగా, దృఢంగా ఉండే ఆ అశ్వబలంతో ఆ నగరం శోభిల్లుతోంది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని గుఱ్ఱాలు ఎంతో ప్రత్యేకమైనవి. అవి గుఱ్ఱపు స్వారీలో ఉండే అన్ని రకాల నడకల్లోనూ అంటే దూకడం, పరుగెత్తడం, లయబద్ధంగా సాగడం అన్నిట్లోనూ ఆరితేరినవి. ఎక్కడా అలసట చెందని పరాక్రమం, ఎదురులేని వేగం వాటి లక్షణాలు. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆ గుఱ్ఱాలు నగర సైనిక శక్తికి నిదర్శనాలు.

ప్రాచీన భారతదేశంలో గుఱ్ఱాల నడకలను ఐదు రకాలుగా వర్గీకరించేవారు (ధౌరితక, వల్గిత, ప్లుత, రేచిత, స్కందిత). ఈ ఐదింటినీ ఒకే పద్యంలో ఇమిడ్చి, ఆ గుఱ్ఱాలు ఎంతటి ఉన్నత శ్రేణికి చెందినవో నిరూపించారు.కవికి అశ్వశాస్త్రంలోనూ పరిచయం ఉన్నట్టు తెలుస్తున్నది ఈ పద్యంలో.

ఈ పద్యం మత్తేభ వృత్తంలో ఉండి పద్యం చదువుతుంటే ఆ గుఱ్ఱాల వేగవంతమైన కదలికలు మనకు తెలుస్తున్నాయి.

‘ఆజానేయము’ అనేది గుఱ్ఱానికి ఒక అరుదైన పర్యాయ పదం. సామాన్యంగా వాడే వాజి,, హయ, తురంగ వంటి పదాలు కాకుండా ఇలాంటి ప్రౌఢ పదాలను వాడటం ఒద్దిరాజు సోదర కవుల పాండిత్యానికి గుర్తు.

133 – మ॥
రథియా యొక్కరుఁడర్యముండు గమనార్హ ప్రాధ్వయా తారకా
పథ ముత్తుంగ శతాంగ మాసతత విధ్వస్తాన్య చక్రంబు సా
రథియా తానిరథః శరీరితగెనౌసప్త సప్తుల్ వెసన్
రథమీడ్వంగ నటంచునగరార్వ శ్రేణి గర్వంబునన్.

రథి యా యొక్కరుడు = ఆ సూర్యుడి రథానికి రథి (యుద్ధం చేసేవాడు) ఒక్కడే,
అర్యముండు = సూర్యుడు,
గమనార్హ ప్రాధ్వయా = కేవలం ఒకే దారిలో (తూర్పు నుండి పడమరకు) వెళ్లగలిగే మార్గం,
తారకాపథము = ఆకాశ మార్గము,
ఉత్తుంగ శతాంగము = ఎత్తైన రథము,
అసతత విధ్వస్తాన్య చక్రంబు = ఎప్పుడూ ఇతర చక్రాలను (అంటే శత్రు సైన్యాలను) నాశనం చేయనిది (కేవలం రథం చక్రం అని కూడా అర్థం)
సారథి యా తానిరథః శరీరి= ఆ సూర్యుడి సారథి (అనూరుడు) తొడలు లేనివాడు,
సప్త సప్తుల్ = ఏడు గుఱ్ఱాలు మాత్రమే,
నగరార్వ శ్రేణి = ఆ కౌశాంబీ నగరంలోని గుఱ్రాల బారు,

భావం:

కౌశాంబీ నగరంలోని గుఱ్ఱాలు సూర్యుని రథాన్ని చూసి గర్వంగా ఇలా పరిహసిస్తున్నాయి: “ఆ సూర్యుడి రథానికి ఉండేది ఒక్కడే వీరుడు, మార్గం ఏమో కేవలం ఆకాశమే, సారథికి ఏమో కాళ్లు లేవు, లాగే గుఱ్ఱాలు కేవలం ఏడే! కానీ మా నగర రథాలు అలా కాదు – అనేక మార్గాల్లో ప్రయాణిస్తాయి, అసంఖ్యాకమైన గుఱ్ఱాలు ఉన్నాయి, మా రథికులు సమర్థులు, మా చక్రాలు శత్రువులను చీల్చి చెండాడతాయి. కాబట్టి సూర్యుని రథం కంటే మావే గొప్పవి!” అని ఆ నగర గుఱ్ఱాలు విర్రవీగుతున్నాయి.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరం లోని గుఱ్ఱాలు సూర్యుని గుఱ్ఱాల కంటే తామే గొప్పవని గర్వపడుతున్నాయి. ఎందుకంటే, సూర్యుడికి ఉన్నది ఒకే రథం, దానికి ఏడు గుఱ్ఱాలే, సారథి అనూరుడికి కాళ్లు లేవు. కానీ ఈ నగరంలో లెక్కలేనన్ని గుఱ్ఱాలు, అంగవైకల్యం లేని సారథులు, ఎటుపడితే అటు వెళ్లగలిగే సామర్థ్యం ఉన్నాయి. అందుకే ఈ నగర అశ్వబలం సూర్య మండలపు అశ్వాల కంటే మిన్న అని కవి భావం.

పురాణాల ప్రకారం సూర్యుడి రథానికి ఏడు గుఱ్ఱాలు, అనూరుడు సారథి. అనూరుడికి తొడల వరకు మాత్రమే అవయవాలు ఉంటాయి. దీనిని కవి ఇక్కడ ఆ నగర గుఱ్ఱాల గర్వానికి కారణంగా వ్యతిరేక చమత్కారంగా, రాసి చూపారు.

నగరంలోని గుఱ్ఱాలకు గర్వాన్ని ఆపాదించి, అవి సూర్యుడితోనే పోటీ పడుతున్నాయని చెప్పడం ద్వారా ఆ గుఱ్ఱాల వేగాన్ని, సంఖ్యను కవి అతిశయోక్తి అలంకారంలో అద్భుతంగా వర్ణించారు.

సూర్యుడి రథ చక్రానికి, నగర రథ చక్రానికి మధ్య ఉన్న తేడాను ‘విధ్వస్తాన్య చక్రంబు’ అనే పదం ద్వారా చెప్పడం వర్ణచిత్రం వలె చాలా బాగుంది. నగరంలోని చతురంగ బలాల వర్ణన అద్భుతంగా సాగింది.

134 – మ॥
పురుపారశ్వధికుల్ నితాంత బల దర్పుల్ ప్రాసికుల్శాక్తాకుల్
వర ధానుష్కులు ద్రౌఘణుల్ తత చమూ వ్రష్టుల్ స్వధర్మ క్రియా
భిరతుల్ కృత్స్నజితాస్త్ర శస్త్రులు ద్విషద్బృందాహవోపార్జిత
స్ఫిర దర్ప వ్రణిరాకరిష్ణులు పురిన్ వెల్గొందు వీరాగ్రణుల్.

పురుపారశ్వధికుల్ = గొడ్డలి (పరశువు) పట్టడంలో నిపుణులైన వారు,
నితాంత బల దర్పుల్ = మిక్కిలి భుజబల గర్వం కలవారు,
ప్రాసికుల్ = ఈటెలు (ప్రాసము) విసరడంలో నేర్పరులు.
శాక్తాకుల్ = శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించడంలో సమర్థులు,
వర ధానుష్కులు = శ్రేష్ఠులైన విలుకాండ్రు (ధనుర్విద్య తెలిసినవారు).
ద్రౌఘణుల్ = ముద్గరము లేదా పెద్ద సుత్తి, (ద్రుఘణము) వంటి ఆయుధాలను ధరించినవారు.
తత చమూ వ్రష్టుల్ = విస్తారమైన సైన్యమును నడిపించగల సేనాధిపతులు.
స్వధర్మ క్రియాభిరతుల్ = తమ తమ ధర్మాలను నిర్వర్తించడంలో ఆసక్తి కలవారు.
కృత్స్న జితాస్త్ర శస్త్రులు = సమస్తమైన అస్త్రాలను, శస్త్రాలను జయించినవారు (సాధన చేసినవారు).
ద్విషద్బృంద ఆహవ ఉపార్జిత స్ఫిర దర్ప వ్రణ నిరాకరిష్ణులు = శత్రువులతో జరిగిన యుద్ధాలలో తగిలిన గాయాల తాలూకు మచ్చలను తమ వీరత్వానికి ఆభరణాలని భావించేవారు.
వీరాగ్రణుల్ = శ్రేష్ఠులైన వీరులు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలో అజేయులైన వీరులు కొలువై ఉన్నారు. వారిలో గొడ్డలి పట్టే వీరులు, ఈటెలు విసిరేవారు, శక్తి , ఆయుధాలను ప్రయోగించేవారు, గొప్ప విలుకాండ్రు, మరియు గదలు (ముద్గరాలు) ధరించిన బలశాలురు ఉన్నారు. వీరంతా తమ ధర్మాన్ని తప్పనివారు మరియు యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. శత్రువులతో పోరాడేటప్పుడు తమ శరీరాలపై తగిలిన గాయాలనే గొప్ప గౌరవంగా భావించే అప్రతిహత వీరాగ్రేసరులతో ఆ నగరం వెలిగిపోతోంది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగర సైన్యం చాలా శక్తివంతమైనది. అక్కడ విలుకాండ్రు, గదలు పట్టే వీరులు, ఈటెలు విసిరే నిపుణులు ఎందరో ఉన్నారు. వారు కేవలం యుద్ధం చేయడమే కాదు, తమ విధిని అత్యంత నిష్ఠతో పాటిస్తారు. యుద్ధ రంగంలో శత్రువులను ఎదుర్కొన్నప్పుడు శరీరానికి తగిలిన గాయాలను వారు అవమానంగా కాకుండా, తమ వీరత్వానికి దక్కిన గుర్తులుగా గర్వంగా భావిస్తారు.

ఈ పద్యం ద్వారా ఆనాటి యుద్ధాలలో వాడిన రకరకాల ఆయుధాల (పరశు, ప్రాస, శక్తి, ధనుస్సు, ద్రుఘణము) పేర్లు మనకు తెలుస్తున్నాయి.

వీర రసం ఉప్పొంగే ‘వ్రణ నిరాకరిష్ణులు’ అనే పదం చాలా గొప్పది. యుద్ధంలో గాయం తగిలితే భయపడకుండా, ఆ గాయపు మచ్చనే ఒక వీరత్వపు ఆభరణంగా చూసే మనస్తత్వం ఆ సైనికులది.

‘ద్రౌఘణము’ వంటి అరుదైన పదాలను వాడటం ద్వారా కృతికర్తలకున్న ప్రాచీన యుద్ధ తంత్ర విజ్ఞానం మరియు నిఘంటువులపై తమకున్న పట్టు తెలుస్తున్నది.

ఈ పద్యంతో కౌశాంబీ నగరంలోని సైనిక సంపద వీరుల యుద్ధతంత్రంలో ఆరితేరిన రకరకాల వీరులు, వారి ఆయుధ ప్రావీణ్యం మరియు వారి ధైర్యసాహసాలను కవి ఇక్కడ ఎంతో గొప్పగా వర్ణించారు.

135 – ఉ॥
ఆ విజయానివర్తన మహాశపన ప్రభవ ప్రతిష్ఠు లు
ట్ఛావచ సాంపరాయిక రహస్య పయోనిథి పారదృశ్యులా
శా వలమాన నిస్తులు యశః పరిపూర్ణులు రాజరాజ్య ర
క్షా వశ చిత్త పత్తి రథ సాది నిషాదివరేణ్యులప్పురిన్.

ఆ విజయానివర్తన = యుద్ధం నుండి వెనుతిరగని (విజయం పొందే వరకు పోరాడే),
మహాశపన ప్రభవ ప్రతిష్ఠులు= గొప్పవైన ప్రతిజ్ఞల ద్వారా కలిగిన కీర్తి ప్రతిష్ఠలు కలవారు,
ఉచ్చావచ సాంపరాయిక రహస్య = రకరకాల యుద్ధ తంత్రాల (సాంపరాయిక అంటే యుద్ధ సంబంధిత) లోని నిగూఢ రహస్యాలను తెలిసినవారు,
పయోనిథి పారదృశ్యులు = యుద్ధ విద్యలనే సముద్రాన్ని (పయోనిథి) దాటినవారు (అంటే ఆ విద్యల్లో సంపూర్ణ జ్ఞానం కలవారు),
ఆశా వలమాన నిస్తుల యశః పరిపూర్ణులు = నలు దిక్కులా సాటిలేనికీర్తి వ్యాపించిన వారు,
రాజ రాజ్య రక్షా వశ చిత్త = రాజును, రాజ్యాన్ని రక్షించడమే ధ్యేయంగా కలిగిన మనస్సు కలవారు.
పత్తి – రథ – సాది – నిషాది వరేణ్యులు = కాల్బలము (పత్తి), రథబలము, అశ్వబలము (సాది), గజబలము (నిషాది) లలో శ్రేష్ఠులైన వారు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని చతురంగ బలాల (కాల్బలం, రథబలం, అశ్వబలం, గజబలం) వీరులు సామాన్యులు కారు. వారు యుద్ధం నుండి వెనుతిరగని ధీశాలురు. యుద్ధ తంత్రాలనే సముద్రాన్ని ఔపోసన పట్టిన మేధావులు. తమ ప్రాణాల కంటే రాజ్యాన్ని, రాజును రక్షించడమే పరమావధిగా భావించేవారు. అటువంటి అజేయులైన, కీర్తిమంతులైన వీరవరేణ్యులతో ఆ నగరం రక్షించబడుతున్నది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని సైనికులు పరాక్రమవంతులు మాత్రమే కాదు, యుద్ధ నీతి తెలిసిన విద్వాంసులు కూడా. వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు నడపడంలోనూ, నేల మీద ఉండి యుద్ధం చేయడంలోనూ వారు అత్యున్నత నైపుణ్యం కలిగినవారు. వారి కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఎప్పుడూ రాజ భక్తితో, ధైర్యంతో ఆ నగరాన్ని కాపాడుతుంటారు.

ఈ పద్యంలో కవి సైన్యంలోని నాలుగు విభాగాలను సూచించడానికి వాడిన చతురంగ బల పారిభాషిక పదాలు చాలా విశేషమైనవి!

పత్తి =కాల్బలం,
రథ = రథబలం,
సాది =గుఱ్ఱపు రౌతులు
నిషాది = ఏనుగులను నడిపించేవారు
యుద్ధ విద్య – సముద్రం..

యుద్ధ విద్యను ఒక ‘పయోనిథి’ (సముద్రం) తో పోల్చి, వీరు ఆ సముద్రాన్ని దాటిన వారని చెప్పడం వారి అపారమైన అనుభవానికి నిదర్శనం.

సైనికుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం నిబద్ధత, ‘రాజ్యాభిమానం’. దానిని కవి ‘రాజ రాజ్య రక్షా వశ చిత్త’ అని ఎంతో అందంగా వర్ణించారు.

కౌశాంబీ నగరంలోని సైనిక బలగాల వర్ణనలో కేవలం సాధారణ సైనికుల గురించి కాకుండా, యుద్ధ తంత్రాలలో ఆరితేరిన నిపుణులైన సేనాపతులు మరియు వీరుల యొక్క మానసిక పరిణతిని, వారి కీర్తిని కవి వర్ణించారు.

136 – కం॥
త్రిషవణము దేవపూజయుఁ
ద్రిషు వర్ణాధ్యయనమునునతిథి సత్క్రియయున్
ఋషి తర్పణంబు శ్రేయ
స్తృషితుల కవ్వీటి ద్విజులకిద్ధవ్రతముల్.

త్రిషవణము = (మూడు కాలాల్లో) ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసే స్నానము, సంధ్యావందనం,
దేవపూజయు = దేవతా అర్చన,
ద్రిషు వర్ణాధ్యయనమును = వేదములను (లేదా మూడు వర్ణాలకు సంబంధించిన విద్యలను) అధ్యయనం చేయడం,
అతిథి సత్క్రియయున్ = ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం,
ఋషి తర్పణంబు = పితృదేవతలకు, ఋషులకు కృతజ్ఞతగా చేసే తర్పణాలు;
శ్రేయస్తృషితులక = మోక్షాన్ని లేదా మేలును కోరుకునేవారికి,
అవ్వీటి ద్విజులకు = ఆ నగరంలోని పండితులకు.
ఇద్ధ వ్రతముల్ = ఇవి నిరంతరం ఆచరించే నియమిత వ్రతాలు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలో నివసించే పండితులు మోక్షాసక్తి కలవారు. వారు ప్రతిరోజూ మూడు కాలాల్లో స్నానమాచరిస్తూ, దేవతలను పూజిస్తూ, వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా, అతిథులను ఆదరించడం, ఋషులకు తర్పణాలు వదలడం వంటి సత్కార్యాలను ఒక వ్రతంలా నిష్ఠతో ఆచరిస్తారు. వారి ధర్మనిష్ఠ వల్ల ఆ నగరం ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్నది.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని పండితులు చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. మూడు పూటలా సంధ్యావందనం, దేవతార్చన, చదువు, అతిథి మర్యాదలు మరియు ఋషి తర్పణాలు – ఇవే వారి దైనందిన కృత్యాలు. లోకకల్యాణాన్ని కోరుతూ వారు చేసే ఈ పనులే ఆ నగరానికి రక్షణ కవచంలా ఉన్నాయి.

కవి చెప్పిన ఈ పనులు అతిథి సత్క్రియ, ఋషి తర్పణం మొదలైనవి హిందూ ధర్మంలో చెప్పబడిన ‘పంచమహాయజ్ఞాల’ను తెలుపుతున్నాయి.

ఒక నగరంలో కేవలం సైన్యం , వ్యాపారం మాత్రమే కాదు, ధర్మం మరియు విద్యను కాపాడే పండిత వర్గం కూడా బలంగా ఉందని ఆ నాటి సామాజిక స్థితిని చక్కగాతెలిపారు.

కేవలం సంపద మాత్రమే కాదు, ఆత్మోన్నతి కోసం తపించే శ్రేయస్సు కోసం తపించేవారు (తృషితులు) అని చెప్పడం ద్వారా వారి నిస్వార్థ గుణాన్ని చాటారు.

నగరంలోని అన్ని వర్గాల వారు అంటే వ్యాపారులు, సైనికులు, పక్షులు, ప్రకృతి, పండితులు అన్నిటినీ గమనిస్తే శ్రేయస్తృషితులతో నిండిన సర్వసమృద్ధమైన కౌశాంబీ నగరమని అర్థం.

అలాగే కౌశాంబీ నగరంలోని ద్విజుల; పండితుల, బ్రాహ్మణుల దైనందిన జీవనశైలిని తెలిపారు.

137 – ఉ॥
మానిత విక్షతాత్ములు సమంచిత సత్యధనుల్ విప క్త్రమ
జ్ఞానగతుల్ శ్రుతాన్వితులు సామగులిద్ధ మృజాన్వయ క్రియా
నూన మనస్వులుగ్ర తప నుత్థిత భీషయ మాణాకాంతి సం
తాన సమృద్ధులా పుర గత ద్విజు లంబుజయోని కౌశలుల్.

మానిత విక్షతాత్ములు = గౌరవించదగినవారు, మరియు నిర్మలమైన మనస్సు కలవారు, (అరిషడ్వర్గాలను జయించినవారు).
సమంచిత సత్యధనుల్ = సత్యమే ఆభరణంగా కలవారు.
విపత్క్రమ జ్ఞానగతుల్ = ఆపదల సమయాల్లో అనుసరించాల్సిన ధర్మసూక్ష్మాల జ్ఞానాన్ని తెలిసినవారు,
శ్రుతాన్వితులు = వేద విజ్ఞానం కలిగినవారు
సామగులు = సామవేదాన్ని గానం చేయడంలో నిపుణులు,
ఇద్ధ మృజాన్వయ క్రియానూన మనస్వులు = పవిత్రమైన వంశాచారాలను, నియమాలను పాటించడంలో ఏమాత్రం తక్కువకాని, (నూనము అంటే తక్కువ) మనస్సు కలవారు.
ఉగ్ర తప ఉత్థిత భీషయ మాణాకాంతి సంతాన సమృద్ధులు = కఠోరమైన తపస్సు వల్ల పుట్టిన, శత్రువులను కూడా భయపెట్టేంతటి ప్రకాశవంతమైన తేజస్సుతో నిండినవారు.
అంబుజయోని కౌశలుల్ = సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అంతటి సామర్థ్యం, నేర్పు కలిగినవారు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని పండితులు అపారమైన సత్యనిష్ఠ కలవారు. వేద విజ్ఞానంలో ఆరితేరినవారే కాకుండా, సామవేదాన్ని అత్యంత శ్రావ్యంగా గానం చేస్తారు. వారి వంశాచారాల పట్ల వారికి అమితమైన గౌరవం ఉంది. వారి కఠోర తపస్సు వల్ల ముఖంపై ఒక అద్భుతమైన తేజస్సు వెలుగుతూ ఉంటుంది. ఆ మేధోసంపత్తి, కార్యదక్షత చూస్తుంటే వారు సాక్షాత్తు బ్రహ్మదేవుని అంశతో పుట్టినవారా? అన్నట్లుగా ఉంటారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని పండితులు సత్యాన్నే దైవంగా భావిస్తారు. ఆపదలు వచ్చినప్పుడు ఏ దారిలో వెళ్లాలో చెప్పగల జ్ఞానులు, వారు నిరంతరం వేద పఠనం చేస్తూ, నియమ నిష్ఠలతో ఉంటూ తమ తపశ్శక్తితో వెలిగిపోతుంటారు. వారి తెలివితేటలు, పనితీరు చూస్తే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడినే తలపిస్తారు.

‘అంబుజయోని’ అంటే పద్మమున పుట్టినవాడు (బ్రహ్మ). పండితుల సృజనాత్మకతను, మేధస్సును బ్రహ్మదేవుని కౌశలంతో పోల్చడం వారి ఉన్నత స్థితిని సూచిస్తుంది.

వేదాలన్నింటిలో సామవేదం అత్యంత మధురమైనది. ఆ వేదాన్ని పఠించేవారు అక్కడ ఉన్నారని సామగులు అని చెప్పడం ద్వారా ఆ నగరంలోని సంగీత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కవి చెప్పారు.

ఆ బ్రాహ్మణులకు కేవలం శారీరక అందం కాదు, తపస్సు వల్ల కలిగే ‘బ్రహ్మతేజస్సు’ వారిలో ఉందని కవి వర్ణించారు. ఈ పద్యంలో కౌశాంబీ నగరంలోని ద్విజుల యొక్క తేజస్సును, వారి మేధోసంపత్తిని కవి మరింత లోతుగా వర్ణించారు. వారిని సాక్షాత్తు బ్రహ్మదేవునితో పోల్చారు.

138 – స్రగ్ధర॥
సారా శేషాస్త్ర చుంచుల్ సమర విజయ నిష్ణాత పుష్ఫోర బాహుల్
వైరివ్రాత ప్రతాపాపహరణ నిపుణుల్ బద్ధ చిత్రాంగులిత్రుల్
వీరాచార ప్రవీణుల్ విబుధ సఖులు సంవిస్తృతాతిథ్య నిష్ఠుల్
ధారాళ శ్రీయుతుల్ తన్నగర నృపులు సధ్యఙ్రతుల్ సుప్రతాపుల్.

సారా శేషాస్త్ర చుంచుల్ = సమస్తమైన శ్రేష్ఠమైన అస్త్ర శస్త్ర విద్యలలో ప్రసిద్ధి చెందినవారు,
చుంచుల్ = ప్రసిద్ధులు
సమర విజయ నిష్ణాత పుష్ఫోర బాహుల్ = యుద్ధాలలో విజయం సాధించడంలో ఆరితేరిన, వజ్రం వలె దృఢమైన రొమ్ము మరియు బాహువులు కలవారు,
వైరి వ్రాత ప్రతాప అపహరణ నిపుణుల్ = శత్రు సమూహాల యొక్క పరాక్రమాన్ని అణచివేయడంలో నేర్పరులు,
బద్ధ చిత్రాంగులిత్రుల్ = విలువిద్యలో నైపుణ్యం కోసం వేళ్లకు ధరించే తొడుగులను ఎప్పుడూ ధరించి సిద్ధంగా ఉండేవారు,
వీరాచార ప్రవీణుల్ = వీర ధర్మాలను పాటించడంలో నిపుణులు,
విబుధ సఖులు = పండితులకు, దేవతలకు మిత్రుల వంటివారు,
సంవిస్తృత అతిథ్య నిష్ఠుల్ = అతిథులను ఆదరించడంలో గొప్ప నిష్ఠ కలవారు,
ధారాళ శ్రీయుతుల్ = ఎడతెగని సంపదతో (ఐశ్వర్యంతో) తులతూగేవారు,
తన్నగర నృపులు = ఆ నగరంలోని రాజులు,
సధ్యవ్రతుల్ – సుప్రతాపుల్ = సత్యవ్రతాన్ని ఆచరించేవారు మరియు గొప్ప తేజస్సు కలవారు.

భావం:

కౌశాంబీ నగర పాలకులైన క్షత్రియులు అపారమైన పరాక్రమవంతులు. వారు సమస్త యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. శత్రువుల గర్వాన్ని అణచివేసే భుజబలం వారి సొంతం. వారు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు. కేవలం యుద్ధం మాత్రమే కాదు, పండితులను ఆదరించడం, అతిథులను గౌరవించడం, సత్యం పలకడం వంటి ధర్మాలను వారు వ్రతంలా ఆచరించేవారు. అపారమైన ఐశ్వర్యంతో, సత్యనిష్ఠతో ఆ రాజులు వెలుగుచున్నారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ రాజులు గొప్ప వీరులు. వారు యుద్ధ తంత్రాల్లో నిపుణులు, శత్రువులకు సింహస్వప్నం వంటివారు. ధనుర్విద్యలో ఆరితేరిన వారు కావడం వల్ల ఎప్పుడూ వేళ్లకు తొడుగులు ధరించి సిద్ధంగా ఉండేవారు. వారు పండితులను గౌరవిస్తూ, అతిథులను ఆదరిస్తూ, సత్య మార్గంలో నడుస్తూ అపారమైన సంపదతో రాజ్యాన్ని పాలిస్తున్నారు.

ఈ పద్యం ‘స్రగ్ధర’ అనే పెద్ద వృత్తంలో ఉంది. దీని నడక చాలా గంభీరంగా ఉంటుంది, పూర్వ కవులు యుద్ధ వర్ణనలకు లేదా వీరరస ప్రధానమైన ఘట్టాలను ఇలాంటి స్రగ్ధర పద్యాలతో వర్ణించేవారు.

బద్ధ చిత్రాంగులిత్రుల్ ఇది చాలా విశేషమైన పదం. సైనికులు బాణం వదిలేటప్పుడు వేళ్లకు గాయం కాకుండా తోలుతో చేసిన తొడుగులు వేసుకుంటారు. ఆ రాజులు ఎప్పుడూ వాటిని ధరించి ఉండేవారట – అంటే వారు నిరంతరం రాజ్యాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉండేవారని అర్థం.

ఒక పక్క పరాక్రమం (వైరి ప్రతాప అపహరణ), మరోపక్క ధర్మం (అతిథ్య నిష్ఠ) రెండూ ఉన్నప్పుడే ఒక రాజు శ్రేష్ఠుడవుతాడు. కవి ఇక్కడ ఆ సమతుల్యతను చక్కని సమాసాలతో అద్భుతంగా చూపారు. కౌశాంబీ నగరంలోని రాజుల క్షత్రియుల వైభవం, పరాక్రమం మరియు వారి వ్యక్తిత్వ వికాసాన్ని కవి అత్యంత గంభీరమైన ‘స్రగ్ధర’ వృత్తంలో వర్ణించారు.

139 – మ॥
అనృతంబాడకఁ గూర్తురర్థము ధనాదుశ్వర్య నిస్సామ్యులై
యును గర్వోన్నతిఁ గాంచరర్థికిడు నుద్యోగంబునం గ్రూర వ
ర్తనఁ చేపట్టారు దా భుజించునెడఁ గార్పాణ్యంబు
బంధింప రా
త్మను నవ్వీటఁ జెలంగు వర్తక కలామర్మజ్ఞులౌ కోమటుల్.

అనృతంబు ఆడక = అబద్ధం చెప్పకుండా,
కూర్తురు అర్థము = ధనాన్ని సంపాదిస్తారు,
ధనాదుశ్వర్య నిస్సామ్యులైయును = ధన,కనక, వస్తు, వాహనాది ఐశ్వర్యాల్లో సాటిలేని వారైనప్పటికీ,
గర్వోన్నతి గాంచరు = ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించరు,
అర్థికి ఇడు నుద్యోగంబునన్ = యాచకులకు లేదా సహాయం కోరి వచ్చేవారికి దానం చేసే విషయంలో..
క్రూర వర్త్మను = కఠినమైన మార్గంలో వెళ్ళరు. (అంటే స్వార్థంతో లేదా మోసంతో దానం చేయడం తప్పించుకునే వారు కాదు).
అవ్వీట జెలంగు = ఆ నగరంలో ప్రకాశించే,
వర్తక కలా మర్మజ్ఞులౌ కోమటుల్ = వ్యాపార మెళకువలు తెలిసిన వైశ్యులు,

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని వ్యాపారులు అబద్ధం చెప్పకుండా, నీతి మార్గంలోనే ధనాన్ని సంపాదిస్తారు. వారు అపారమైన ఐశ్వర్యవంతులైనప్పటికీ, వారిలో ఏమాత్రం అహంకారం కనిపించదు. సహాయం కోరి వచ్చిన వారికి దానం చేయడంలో వారు వెనుకాడరు. వ్యాపార రహస్యాలన్నీ తెలిసినవారైనప్పటికీ, వారు ధర్మబద్ధంగా ఉంటూ ఆ నగరానికి ఆర్థికంగా వెన్నుముకగా నిలుస్తున్నారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని కోమటులు చాలా నీతిమంతులు. వ్యాపారంలో లాభం కోసం వారు ఎప్పుడూ అబద్ధాలు ఆడరు. ఎంతటి కోటీశ్వరులైనా చాలా అణకువగా ఉంటారు. దానధర్మాలు చేయడంలో వారికి వారే సాటి. తెలివైన వ్యాపారస్తులుగా ఉంటూనే, ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటారు. ఆ నగరంలోనీతి వ్యాపారం జరిగేదన్న మాట!

“అనృతంబాడక గూర్తురర్థము” – వ్యాపారం అంటేనే లాభం కోసం అబద్ధాలు ఆడటం అనే లోకోక్తికి విరుద్ధంగా, సత్య మార్గంలో ధనం సంపాదించడం వారి గొప్పతనం.

అహంకార రాహిత్యం.. సంపద పెరిగే కొద్దీ గర్వం పెరగడం సహజం. కానీ ఆ నగర వర్తకులు “గర్వోన్నతి గాంచరు” అని చెప్పడం ద్వారా వారి సంస్కారాన్ని కవి గొప్పగా చెప్పారు.

కలా మర్మజ్ఞులు.. వీరు కేవలం వ్యాపారులే కాదు, వ్యాపారంలోని మెళకువలు, కళలు తెలిసిన వారు. అందుకే వారు సంపదను సమర్థవంతంగా సృష్టించగలుగుతున్నారు.

140 – మ॥
కృషి సంపాదిత సర్వధాన్య నికర శ్రీ పుష్కలుల్ ప్రాగ్ర్వవ
ర్ణ సముత్పన్న జనాగ్ర గణ్య పద వందారుల్ మహౌదార్య మా
నసులత్యంత బల ప్రధానులు సదా నవ్యోపకాకార వ్రతా
వనధుల్ దత్పురి నిత్య నివాసులగు భవ్యప్రాభవుల్ శూద్రజుల్.

కృషి సంపాదిత = వ్యవసాయం (కృషి) ద్వారా సంపాదించిన,
సర్వ ధాన్య నికర శ్రీ పుష్కలుల్ = అన్ని రకాల ధాన్యాల రాసులతో తులతూగేవారు.
ప్రాగ్ర్వ వర్ణ సముత్పన్న జనాగ్రగణ్య పద వందారుల్ = తమకంటే ముందున్న వర్ణాల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) పట్ల, పెద్దల పట్ల గౌరవపూర్వకమైన వందనము చేసే స్వభావం కలవారు,
మహౌదార్య మానసులు = మిక్కిలి ఉదారమైన మనస్సు కలవారు,
అత్యంత బల ప్రధానులు = శరీర దార్ఢ్యము, గొప్ప బలము కలిగినవారు,
సదా నవ్యోపకార వ్రతావనధుల్ = ఎప్పుడూ ఇతరులకు కొత్త కొత్త ఉపకారాలు చేయడమే ఒక వ్రతంగా భావించేవారు.
భవ్య ప్రాభవుల్ శూద్రజుల్ = గొప్ప వైభవం కలిగిన శూద్రులు ఆ నగరంలో నివసిస్తున్నారు.

భావం:

ఆ కౌశాంబీ నగరంలోని శూద్రులు వ్యవసాయం ద్వారా సమస్త ధాన్యాలను పండిస్తూ, నగరానికి ఆహార భద్రతను, సిరిసంపదలను చేకూరుస్తున్నారు. వారు శారీరకంగా చాలా బలవంతులు మరియు మానసికముగా అత్యంత ఉదారులు. పెద్దల పట్ల విధేయత కలిగి ఉంటూ, పరులకు ఉపకారం చేయడమే పరమావధిగా భావించే ఆత్మీయులైన జనం అక్కడ నివసిస్తున్నారు.

సరళ భావానువాదం:

కౌశాంబీ నగరంలోని వ్యవసాయదారులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు, అందుకే అక్కడ ధాన్యానికి కొరత లేదు. వారు ఎంతో బలశాలురు, అంతే ఉదార స్వభావులు. అందరినీ గౌరవిస్తూ, ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేస్తూ ఉండటమే వారి ప్రత్యేకత. అటువంటి మంచి మనసున్న ప్రజలతో ఆ నగరం కళకళలాడుతోంది.

శ్రీ పుష్కలుల్.. సంపద అంటే కేవలం బంగారం మాత్రమే కాదు, ధాన్యం కూడా సంపదే. వ్యవసాయం ద్వారా వచ్చే ‘ధన ధాన్యము’ ఆ నగరానికి అసలైన శ్రీ (సంపద) అని కవి భావం.

ఉపకార వ్రతం: ఇతరులకు సాయం చేయడాన్ని ఒక వ్రతంలా (ఒక క్రతువులా) భావించే వారి గొప్ప మనసును కవి ‘నవ్యోపకార వ్రత’అనే పదం ద్వారా గొప్పగా చెప్పారు. నగరంలోని అన్ని వర్ణాల వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, తమ విధులను తాము నిర్వహిస్తూ ఉండటం వల్ల ఆ నగరం ఆదర్శవంతంగా ఉందనడం..

కౌశాంబీ నగరంలోని శూద్రుల (కృషీవలుల) విశేషాలను కవి వర్ణించడంవల్ల సమాజానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని, ఇతర సేవా వృత్తులను వారు ఎంతటి ధర్మనిష్ఠతో, బలంతో నిర్వహించేవారో తెలుస్తున్నది.

(సశేషం)

Exit mobile version