Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-3

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 2

సీ॥
చేతన సముదయోజ్జీవ నార్ధము శ్రియః
పతి పరత్త్వ ప్రతిపాదకముల
మహిత ప్రబంధ ప్రమాతృ ప్రమేయ
లక్షణత్రయ సముల్లిసిత ములను
కృతుల రచించిన శ్రీభూతకాసారి
మహదాఖ్య భట్టేశ మౌనివరుల
భక్తిసారము నిప్రవరు గులశేఖరా
హ్వయమునివాహ భక్తాంఘ్రి రేణు

తే॥గీ॥
ధీయుతుల బరకాల యతీంద్ర మిశ్ర
సూరుల బరాంకుశ మునిఁ గోదా రమణిని
స్వ స్వ రూపానురూప ప్రశస్త విధులఁ
బ్రస్తుతి యొనర్తు భక్తి భావతఁ జెలగి. -11

ఇది గురుపరంపరలో ముత్యాల హారం లాంటిది.. ఒక్కో పేరు వెనుక ఒక సంపూర్ణ సంప్రదాయం ఫ్రస్పుటంగా కనిపిస్తున్నది ఆ గౌరవ గంభీరత పద్యంలో బలంగా వినిపిస్తోంది.

పద్యార్థం:

“చేతన సముదయోజ్జీవ నాట్యము శ్రియఃపతి పరత్వ ప్రతిపాదకముల మహిత ప్రబంధ..”

– చైతన్య సముదాయాన్ని మేల్కొలిపేలా, శ్రీపతి (నారాయణుడు) పరత్వాన్ని ప్రతిపాదించే గొప్ప ప్రబంధాలను రచించినవారు..

ఇక్కడ కవి స్పష్టంగా ఆళ్వారులను స్మరిస్తున్నారు.

శ్రీభూతకాసారి – భూతాళ్వార్.

మహదాఖ్య – పొయగై ఆళ్వార్.

భట్టేశ – పెరియాళ్వార్.

మౌనివరులు – తిరుమణిశై ఆళ్వార్.

భక్తిసార – కులశేఖరాళ్వార్.

శేఖరాహ్వయ ముని – నమ్మాళ్వార్.

భక్తాంఘ్రిరేణు – తొండరడిప్పడి ఆళ్వార్.

తే॥గీ॥ భాగం:

ధీయుతుల బరకాల యతీంద్ర మిశ్ర సూరులు – రామానుజ

బరాంకుశ ముని – నమ్మాళ్వార్ (ఇంకో విశేషణం)

గోదా రమణి – ఆండాళ్

సారాంశం:

ఈ మహానుభావుల స్వరూపానుసారంగా, వారికి తగిన విధంగా స్తుతి చేయాలని కవి తన భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

తాత్పర్యం:

ఈ పద్యం ఒక ఆధ్యాత్మిక వంశ వృక్షం.

చైతన్యోద్ధరణ – ఆళ్వారుల భక్తి రచనలు తాదాత్మ్యం చెందేలా ఉంటాయి.. అవి చదివిన చదువరులు పరవశం చెందుతారు. అది జడత్వాన్ని కదిలిస్తుంది.

పరత్వ ప్రతిపాదన – విష్ణు పరబ్రహ్మత్వాన్ని కవిత్వ రూపంలో స్థాపించారు.

ప్రబంధ ప్రమాతృ-ప్రమేయ లక్షణత్రయం.. ఉన్న రచన ఇది!

జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం – త్రిపుటి ఐక్యం.

ఇది కేవలం పేర్ల వరుస కాదు; ఇది ఒక సిద్ధాంత పటము.

కవి శైలీ విశ్లేషణ

సంక్లిష్ట సమాస నిర్మాణం – సంస్కృతసార పదబంధాలతో గంభీరంగా ఉంది.

నామావళి శైలీ – ప్రతి పేరు ఒక భావాన్ని తెలుపుతున్నది.

సంప్రదాయ చిహ్నీకరణ – వ్యక్తిని మించి, అతని ఆధ్యాత్మిక పాత్రను తెలిపే బిరుదులు.

ఇక్కడ పెద్దనాయన గారి విశిష్టాద్వైత నిబద్ధత ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇది రామానుజ సిద్ధాంతానికి నమస్కారంగానూ, సంప్రదాయానికి ప్రణామం ఆచరించినట్టున్నది.

తే॥గీ॥
వ్యాస నా కుజ శుకముఖాద్య కవివరుల
నమర భారతీ సంస్కర్తలగు వరరుచి
పాణిని పతంజలులను పూర్వ కవిరాజు
లైన కాళిదాసాదుల నభినుతింతు. –12

పెద్ద నాయనగారు గురుపరంపర నుంచి సంస్కృత సాహిత్య విశ్వం వరకు విస్తరించే నమస్కార పరంపర కొనసాగించారు.

పద్యార్థం:

“వ్యాస నా కుజ శుకముఖాద్య కవివరుల”

వ్యాసుడు, నాకుజుడు, శుకముఖాది మహాకవులను..వ్యాసుడు; శుకుడు;

“అమర భారతీ సంస్కర్తలగు వరరుచి”..

భారతీ (సాహిత్య) సంస్కర్తలైన వరరుచి మొదలైనవారిని..

“పాణిని పతంజలి పూర్వ కవిరాజులైన”

వీరంతా వ్యాకర్తలు.. పాణిని, పతంజలిని..

“కాళిదాసాదుల నభినుతింతు”

కవిరాజుల్లో కిరీటమణి అయిన కాళిదాసాది మహాకవులను స్తుతిస్తాను.

తాత్పర్యం:

ఈ పద్యం మూడు స్థాయిల నమస్కారం:

ఇతిహాస పరంపర – వ్యాసుడి ద్వారా ధర్మ-కావ్య సంప్రదాయం కొనసాగించినవాడు;

వ్యాకరణ శాస్త్రం – పాణిని, పతంజలి ద్వారా భాషా శుద్ధిజరిగిన మహోపకారం;

కావ్య సౌందర్యం – కాళిదాసాది కవులు ద్వారా కవితా మాధుర్యంతో రస హృదయ?పాఠకులను ఓలలాడించిన వైనం..అంటే కవి చెప్పే వినయ ప్రకటన “నేను రాస్తున్నది ఒక సంప్రదాయ సముద్రంలో ఒక అల మాత్రమే.”

ఇది వినయం + వైశాల్యం అంత గొప్ప కవి ఇలా ఒదిగి ఉండడం అసామాన్యం.

కవి శైలీ విశ్లేషణ

నామస్మరణ శైలి – గౌరవ పూర్వక జాబితా.

సాహిత్య చరిత్ర అవగాహన – ఇతిహాసం → శాస్త్రం → కవిత్వం అనే క్రమం.

సంక్షిప్త గంభీరత – ఒక్కో పేరు వెనుక మహాగ్రంథ సంపద. అంటే కవి ఎంత సాహిత్య ఔపోసన చేసి ఉండాలి?

నా ఆధునిక విమర్శాత్మక దృష్టితో చూస్తే..

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే –

కవి కేవలం తన ఆధ్యాత్మిక పరంపరనే కాదు,

సర్వసంస్కృత సాహిత్యాన్ని తన పునాది గా అంగీకరిస్తున్నాడు. ఇది ఒక సాంస్కృతిక సమగ్రతా ప్రకటన.

“ఇది ఒక రచయిత తన పూర్వజులందరికీ సమర్పించే కృతజ్ఞతా స్మరణ. రచన అనేది ఒంటరి ప్రతిభా ఫలితం కాదు – అది శతాబ్దాల అనుభవాల వారసత్వం.”

నిజంగా చెప్పాలి అంటే.. ఈ గురు-కవి-శాస్త్ర పరంపర భాగం చదివితేనే పెద్దనాయన గారి విద్యావిస్తారం ఎంత విస్తృతమో అర్థమవుతుంది.ఇక్కడి నుంచి కథలోకి అడుగుపెట్టడం అంటే మహామంటపం నుంచి గర్భగృహంలోకి వెళ్లినట్టే.

తే॥ గీ॥
పాయకఁ గొల్చెద సత్కవు
లేయని సతము జయదేవు లీలా శుక నా
రాయణ తీర్థుల యాదవ
నాయక నామైక కీర్తన స్థిరమతులన్. -13

ఇది నిజంగా ఒక సాహిత్య సంప్రదాయ నమస్కారాలందించారు కవి. భక్తి, గీతం, నాట్యం – అన్నీ కలిసిపోతున్నాయి.

ముందుగా పద్యార్థం:

“సత్కవులైన జయదేవుడు, లీలా శుకుడు, నారాయణ తీర్థులు, యాదవ నాయకుని నామసంకీర్తనలో స్థిరచిత్తులైన వారిని నేను స్మరిస్తాను.” అంటున్నారు కవి.

ఈ పద్యంలో జయదేవుడు, లీలాశుకులు, నారాయణ తీర్థులను స్మరించుకున్నారు.

(“యాదవ నాయక” అంటే శ్రీకృష్ణుడని అర్ధం).

తాత్పర్యం:

ఇక్కడ ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది: ఇప్పటివరకు.. వేదాంత, శాస్త్ర, ఆచార్య పరంపర కొనసాగించారు. ఇప్పుడు.. మాధుర్య భక్తి సంప్రదాయం ముగ్గురు మహానుభావుల రసవాహినిమూడు ధారలుగా చెప్పారు.

జయదేవుడు – రసమాధుర్య గీతకావ్యం;

(గీత గోవిందం).

లీలా శుకుడు – అంతర్ముఖ కృష్ణానుభూతి;

(కృష్ణ కర్ణామృతం).

నారాయణ తీర్థులు – గానం-నాట్య రూపక భక్తి (కృష్ణ లీల తారంగిణి).

అంటే కవి చెబుతున్నది:

“నేను శాస్త్రబద్ధతను గౌరవిస్తున్నాను; కాని నా హృదయం గానం వైపు కూడా సాగుతుంది.” అని అన్యాపదేశంగా చదువరులకు చెప్పుతున్నారీ పద్యంలో..

కవి శైలీ విశ్లేషణ

“నామైక కీర్తన స్థిరమతులు”..

ఇది చాలా అందమైన పదబంధం.

భక్తి అంటే భావోద్రేకం మాత్రమే కాదు; చిత్తస్థిరత్వం కూడా.

ఈ పద్యంలో శబ్ద మాధుర్యం ఎక్కువ. పేర్లలోనే లయ ఉంది. సాహిత్య దృష్టిలో ఇది ఒక ముఖ్యమైన భావ వ్యక్తీకరణ.

పెద్దనాయన గారు కేవలం తాత్త్వికుడు మాత్రమే కాదు..

రసానుభవం తెలిసిన కవి. విశిష్టాద్వైతం అనుసరిస్తూనే దానితో పాటు రసభక్తి సంప్రదాయాన్నీ ఒడిసిపట్టుకున్నారు.

నాకర్ధమైనదేమంటే?

“శాస్త్ర గాంభీర్యానంతరం, మాధుర్య రస సంప్రదాయానికి నమస్కరించడం ద్వారా కవి తన రచన కేవలం తాత్త్విక ప్రకటన కాదని, అనుభూతి ప్రవాహమని సంకేతం ఇస్తున్నాడని.” ఇప్పుడు మరొకసారి పద్య నడకను మనం గమనిస్తే – దైవం; ఆచార్యులు; ఆళ్వారులు; శాస్త్రకర్తలు; మహాకవులు; గీతకవులు..ఇలా వరుసక్రమంలో కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవడమంటే

ఇది ఒక మహా మంగళమాలిక.

చ॥
తలిరుల మెత్తనై వర సుధామధురాయితమైన యాంధ్ర వా
క్కులఁ జెలువంపుఁ గబ్బముల గూర్చిన కూర్చుచున్న కూర్చుని
ష్ఠలఁ దగు నన్నపార్య ముఖ సత్కవికోటి యశః ప్రసూన పం
క్తులఁ దలఁ దాల్తు సంతతమకుంఠిత గౌరవ భావయుక్తిమై.. 14

పద్యార్థం:

“తలిరుల మెత్తనై వర సుధా మధురాయితమైన యాంధ్ర వాక్కుల” – తలిరుల్లా మృదువుగా, అమృతంలా మధురంగా ఉన్న ఆంధ్ర (తెలుగు) భాషా వాక్యాలు..

“జెలువంపు గబ్బముల గూర్చిన కూర్చుచున్న”

– అలంకారాలతో నిండిన పద్యరూప కవితలను రచించిన, రచిస్తున్న.. “నన్నపార్య ముఖ సత్కవికోటి యశః ప్రసూన పంక్తుల” నన్నయాది అనేక మహాకవుల కీర్తి పొందిన కవితా కుసుమాలనే రచనలను నేను తలదాల్చుతాను.

“సంతతమకుంఠిత గౌరవ భావయుక్తిమై”

– ఎప్పటికీ తగ్గని గౌరవ భావంతో నేను స్మరిస్తున్నాను.

తాత్పర్యం:

ఇక్కడ మూడు భావాలు:

భాషా సౌందర్య వందనం, తెలుగు భాషను “తలిరుల మెత్తనై”, “సుధా మధురాయితమైన” అని వర్ణించడం – ప్రేమ, కవుల సముదాయం పట్ల అభిమానం,

ఒక్కో పేరును చెప్పకుండా, సమస్త సత్కవికోటిని స్మరిస్తున్నారంటే అకుంఠిత గౌరవం ఇది ఊరికే సంప్రదాయం కోసం కానే కాదు! కవి అంతరంగానుభూతి.

కవి శైలీ విశ్లేషణ

ఉపమా మాధుర్యం – తలిరు, సుధా వంటి సౌమ్య చిత్రాలు.

సమూహ వందన శైలి – వ్యక్తి కాదు; సాహిత్య సముద్రం.

శబ్దలాలిత్యం – “సుధా మధురాయితమైన యాంధ్ర వాక్కుల” – పలికితేనే లయ.

ఇది గంభీర సంస్కృత గాఢత తర్వాత ఒక మృదువైన మలుపు.

అంటే కవి ఇలా చెబుతున్నాడు:

“నేను సంస్కృత సంప్రదాయానికే కాదు,

తెలుగు కవితా సంపదకూ ఋణపడి ఉన్నాను.” అని..

ఆధునిక దృష్టిలో నేనేమంటానంటే?

ఇది ఒక గొప్ప సాహిత్య ప్రజ్ఞ జాబితా (List)

సంప్రదాయం అంటే ఒకే మతం, ఒకే భాష కాదు. కవి తన మూలాలను విస్తృతంగా అంగీకరిస్తున్నాడు. అంతేకాదు

“ఈ పద్యం ద్వారా కవి తెలుగు భాషను కేవలం వ్యక్తీకరణ సాధనంగా కాక, ఆధ్యాత్మిక అనుభూతికి పాత్రంగా చూశారు.” నిజంగా చెప్పాలి అంటే..

ఈ గురుపరంపర , కవిపరంపర , భాషాపరంపర అన్నీ కలిసి సంప్రదాయ బద్ధమైన మంగళకర స్తుతి వలె ఉన్నది.

ఉ॥
అన్యుల చెంత నేర్వక స్వయంగ్రహణమ్మున శక్తిఁ గాంచమిన్
మాన్య కవిప్రయోగము సమస్తముఁ దప్పనఁ జూచు దుష్టధీ
జన్య వృధారుడన్వహ వశంవద గర్హ చరిత్ర పండితం
మన్యుల చేత నా కృతి సుమంగలి చేరకయుండుగావుతన్..15

ఈ పద్యం నుండి ఇదో గొప్ప మలుపు.

ఇంతవరకు నమస్కారాల గంగ ప్రవహించింది., ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మపరిశీలన మరియు జాగ్రత్త స్వరం వినబడుతున్నాయి.

పద్యార్థం:

“అన్యుల చెంత నేర్వక స్వయంగ్రహణశక్తి గాంచమిన్”

కవి అంటున్నారు తాను ఇతరుల వద్ద నేర్చుకోకపోయినా, స్వయంగా గ్రహించగల శక్తి కలవాడనై..;

“మాన్య కవిప్రయోగము సమస్తము దప్పన జూచు దుష్టధీ జన్య వృధారుడు”..

గౌరవనీయ కవుల ప్రయోగాలను సరిగ్గా గ్రహించకుండా, దుష్టబుద్ధితో తప్పు పట్టే వృథా పండితుడు..

“అన్వహ వశంవద గర్హ చరిత్ర పండితం”..

రోజూ విమర్శలకే అలవాటు పడి, గర్హణమే చరిత్రగా చేసుకున్న పండితుల చేత..

“నా కృతి సుమంగలి చేరకయుండుగావుతన్”

..నా ఈ కృతి అపవాదాల పాలవకుండా ఉండుగాక. అని అంటున్నారు.

తాత్పర్యం:

ఇది పెద్దనాయన అసలైన ప్రార్థన.

అర్థం సూటిగా చెప్పాలంటే: “దురుద్దేశంతో విమర్శించే వారి చేతిలో నా రచన పడకూడదు.” అని, ఇది అహంకారం కాదు.

ఇది సాహిత్య స్వచ్ఛతపై భయం.( మంచి కవులకు ఇది సహజంగా ఉంటుంది.)

కవి శైలీ విశ్లేషణ

ఇంతవరకు గౌరవ వందనాలు; ఇప్పుడు రక్షణాభిలాష. ఇందులోపదబంధాలు కాస్త కఠినంగా ఉన్నాయి. “దుష్టధీ”, “గర్హచరిత్ర”.. భావోద్రేకం గట్టిగా వినిపిస్తుంది.

ఇది ఒక సాంప్రదాయ మంగళశ్లోక విభాగం..

మంచి పాఠకుని ఆశిస్తూ, చెడు విమర్శకుని దూరం పెట్టమని కోరడం.

ఆధునిక విమర్శాత్మక కోణంలో చూస్తే..

ఇది చాలా ఆసక్తికరం. ఆధునిక సాహిత్యంలో విమర్శ స్వాగతం. కానీ ఇక్కడ కవి భయపడేది “సద్భావ విమర్శ” కాదు!

“దుష్టధీ జన్య వృధా పండిత్యం”.

అంటే: సందర్భం తెలియక విమర్శించడం

సంప్రదాయాన్ని అర్థం చేసుకోక నిందించడం కవిప్రయోగం వెనుక ఉద్దేశ్యాన్ని గ్రహించక తక్కువచేయడం

“ఈ పద్యం రచయితలోని సున్నితత్వాన్ని తెలియజేస్తుంది.

మహాగ్రంథం రాసే ధైర్యం ఉన్నా, దాన్ని అపార్థం చేసే చేతుల పట్ల ఒక ఆందోళన ఆయనకు ఉంది.”

పెద్దనాయన గారు కేవలం కవి కాదు –

అతను మనసున్న మనిషి. ఎంత గాంభీర్యం ఉన్నా, అంతర్గతంగా ఒక మృదుత్వం ఉంది.

కం॥
అని యిష్టదేవతా వం
దనము సుకవి వినుతియుఁ గుకవితతి నిరసనమున్
బొనరిచి మద్వంశమున వ
ర్ణనఁ జేయుదుఁ గావ్య లక్షణంబై తగుటన్.. 16

పద్యార్థం:

“అని యిష్టదేవతా వందనము”

– ఇష్టదేవతకు నమస్కారం చేసి,

“సుకవి వినుతియు గుకవి తతి నిరసనమున్ బొనరిచి”;

సత్కవులను స్తుతించి, దుష్టకవులను నిరసించి,

“మద్వంశమున వర్ణన జేయుదు”; నా వంశాన్ని వర్ణించుదును.;

“గావ్య లక్షణంబైతగున్”..

ఇది కావ్య లక్షణానికి తగిన విధమే.

తాత్పర్యం:

కావ్యశాస్త్ర నియమాలు చెప్పారు కవి.

పురాతన కవుల ప్రకారం ఒక ప్రబంధానికి ఉండవలసినవి:

ఇష్టదేవతా వందన,  గురు స్మరణ, సత్కవి స్తుతి, దుష్టకవి నిరసన, వంశ పరిచయం,

తదనంతరం కథా ప్రవేశం,

అంటే పెద్ద నాయన చెబుతున్నారు..

“నేను సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాను. ఇప్పుడు నా వంశ వర్ణన ప్రారంభమవుతుంది.”అని

కవి శైలీ కోణం

ఇది చాలా స్పష్టమైన స్వరూపం చెప్పే విధానం.

ఆత్మవిశ్వాసం ఉంది, కాని అహంకారం లేదు.

“కావ్య లక్షణంబైతగున్” – సంప్రదాయ అవగాహన ఉన్న కవి మాత్రమే ఇలా చెప్పగలడు.ఇది కొంచెం ముక్తకంలా, స్వీయ వ్యాఖ్యలాగా అనిపిస్తుంది. అంటే కవి తన రచనా నిర్మాణాన్ని(ప్రణాళిక) పాఠకునికి తెలియజేస్తున్నాడు.

ఆధునిక దృష్టిలో ఏమనిపిస్తుందంటే?

ఇప్పటి రచయితలు ఇవన్నీ ముందుమాటలో చెబుతారు

“ఇలా రాసాను, ఇలా విభజించాను.”

కాని ఇక్కడ కవి పద్యంగానే తన నిర్మాణాన్ని ప్రకటిస్తున్నారు.

“ఈ పద్యం ద్వారా కవి సంప్రదాయ కావ్య నిర్మాణాన్ని పాటించినట్లు ప్రకటించి, తన వంశ వర్ణనకు శాస్త్రీయ సమర్థననిచ్చారు”.

గ్రంథకర్త వంశాభి వర్ణనము

ఇది కేవలం కుటుంబ పరిచయం కాదు. ఇది పెద్దనాయన వ్యక్తిత్వం మరియు సంస్కారంమేళవించి రాసిన వంశ వివరణే కాదు చరిత్ర కూడా. సంప్రదాయ పరంగా ప్రబంధాలలో వంశవర్ణనకు మూడు ముఖ్య కారణాలు ఉంటాయి:

ఆత్మగౌరవ స్థాపన ,రచయిత తన పుట్టుక మూలాలను తెలియజేస్తాడు. దాంతో పాటు సంస్కార పరంపర గుర్తింపు; సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం.

రచనకు ధార్మిక-సామాజిక ఆధారం –

“నేను ఎవరో” అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి తర్వాతే కథలోకి వెళ్తాడు.

సాహిత్య కోణంలో

వంశవర్ణనలో సాధారణంగా కనిపించే అంశాలు:

గోత్ర ప్రస్తావన,పూర్వీకుల గుణ గణాలు,దాన ధర్మ పరాయణత,విద్యాభిమానము,రాజసన్నిధి లేదా పాండిత్య గౌరవం.. ఇవి అన్నీ కలిసే కవి స్వరూపాన్ని నిర్మిస్తాయి.

ఆధునిక దృష్టిలో నేను చెప్పేదేమంటే?

ఇప్పటి పాఠకులకు వంశవర్ణన కొన్నిసార్లు పొడవుగా అనిపించవచ్చు. కానీ “ఇది కేవలం వంశ గర్వం కాదు;

ఒక విలువల వారసత్వం.”.. చెప్పడం అవసరం కూడా! అంతేకాదు!

“గురుపరంపర, కవి పరంపరలను స్మరించిన తర్వాత స్వీయ వంశ సంస్కారాన్ని తెలియజేయడం సంప్రదాయ ప్రబంధ లక్షణం.” కనుక ఎన్నో రచనలు చేసిన సోదరులు ఎప్పుడూ అనవసరంగా ఒక్క అక్షరం కూడా ఎక్కువ చేసి రాయరు.

సీ॥
శ్రీవక్షునాభి రాజీవమే విష్టప
స్ర్సష్టృ సృష్టికి సుఖారిష్ట గృహము
తత ధర్మ వితతి బోధ చ్ర్ఛుతి స్తోమమే
చతురాస్య ముఖ చతుః శ్రుతలవనము
లత్యనల్ప జగత్రయ ప్రాణి సంసృష్టి
యే శతధృతి కి నిత్యైక కృత్య
మిద్ధ ప్రభాసుర జ్యేష్ఠత్వమే స్వయం
భువునకు స్వార్జితా మోఘ బిరుద

తే॥గీ॥
మతుల సుశ్రావ్య నిక్వణనాభిరామ
వల్లకీ రాజితారుణ పాణి వాణి
యే విభునకు బాణౌకృత విధాతృ
వంశమే బ్రహ్మ వంశ మా వంశమందు. -17

ఈ పద్యం మహత్తరమైన వంశస్తుతి. ఇందులో బ్రహ్మవంశ మహిమను, వేదప్రభావాన్ని, సృష్టితత్త్వాన్ని గంభీరంగా ప్రతిపాదించారు.

శ్రీవక్షునాభి రాజీవమే విష్టప స్స్రష్టృ సృష్టికి సుఖారిష్ట గృహము

– విష్ణు నాభిలో పుట్టిన కమలమే (రాజీవం) సృష్టికర్తకు (బ్రహ్మకు) సౌఖ్యమయమైన నివాసస్థానం.

అంటే సృష్టి ఆరంభం విష్ణుని నాభికమలంలోనుంచేనని భావం.

తత ధర్మ వితతి బోధ చ్ర్ఛుతి స్తోమమే చతురాస్య ముఖ చతుః శ్రుతల వనము

– ఆ బ్రహ్మదేవుని నాలుగు ముఖాలనుండి ప్రవహించిన నాలుగు వేదాల సమూహమే ధర్మప్రచారానికి మూలం.

ఇది చతుర్ముఖ బ్రహ్మని వేదోద్భవ స్వరూపాన్ని సూచిస్తుంది.

అత్యనల్ప జగత్రయ ప్రాణి సంసృష్టియే శతధృతికి నిత్యైక కృత్యము

– మూడు లోకాలలోని అనేక ప్రాణుల సృష్టి, స్థితి, నిర్వహణ బ్రహ్మకు నిత్యకృత్యమే.

ఇద్ధ ప్రభాసుర జ్యేష్ఠత్వమే స్వయం భువునకు స్వార్జితా మోఘ బిరుదము

– ప్రకాశవంతమైన జ్యేష్ఠత్వం (మొదటిపుట్టినవాడు అనే గౌరవం) స్వయంభువుడైన బ్రహ్మకు స్వయంగా సంపాదించిన అఖండమైన బిరుదు.

అతుల సుశ్రావ్య నిక్వణనాభిరామ వల్లకీ రాజితారుణ పాణి వాణి

– మధురమైన వీణానాదంతో అలరించే యౌవనసుందరి వాణి (సరస్వతీ దేవి)

ఇక్కడ సరస్వతి వీణాధారిణి స్వరూపం సూచించబడింది.

యే విభునకు బాణౌకృత విధాతృ వంశమే బ్రహ్మ వంశ మా వంశమందు

– ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో, విధాత (బ్రహ్మ) సృష్టించిన వంశమే మా వంశమని గర్వంగా ప్రకటిస్తున్నారు కవి.

అంటే – “మా వంశం బ్రహ్మవంశమే” అనే ఆత్మగౌరవ భావంతో చెప్పారు.

విష్ణుని నాభికమలం నుండి బ్రహ్మ ఆవిర్భావం,

బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వేదాల ఉద్భవం,

సృష్టికర్తగా బ్రహ్మ జ్యేష్ఠత్వం, సరస్వతీదేవి అనుగ్రహం, బ్రహ్మవంశ గౌరవప్రకటన ఇవన్నీ సమగ్రంగా వర్ణించబడ్డాయి.

ఇది వంశప్రశంస మాత్రమే కాదు – వేదమూలమైన సృష్టితత్త్వాన్ని ఆవిష్కరించిన గంభీర వంశస్తుతి.

సీ॥
తమ బ్రహ్మ వర్చ సోద్ధిత రుచి రవి శశి
ప్రభల కామ్రేడిత ప్రభ లొసంగ
దమతపోఽగ్ని జ్వాల తతి ధనంజయ హేతి
సమితి కామ్రేడితోష్ణమ నొసంగ
దమ సత్య వాగ్వితానము శ్రుతి సత్య ప్ర
పూర్తి కామ్రేడిత పుష్టి నొసగ
దమ శాంత గుణ సమృద్ధత్వము ముక్తి స్థ
శాంతి కామ్రేడిత శాంతి నొసగ

తే॥ గీ॥
దమ నిరాఘాట నిర్వచనము లభినవ
వేదములు గాగ బ్రభవించ వెలసినట్టి
హరితుఁ డంబరీషుడు యవనాశ్వుడెలమి
వంశకర్తలైదగు నార్ష వంశమదియ. -18

ఈ పద్యం ఋషివంశ మహిమను వర్ణిస్తూ, వారి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతీకల ద్వారా రచించారు. ప్రతి పాదంలో “దమ” (ఇంద్రియనిగ్రహం) అనే మూలగుణాన్ని ఆధారంగా చేసుకుని వారి మహత్తును కవి ఈ పద్యంలో పొందుపరిచారు.

భావం:

తమ బ్రహ్మవర్చసోద్ధిత రుచి రవి శశి ప్రభల కామ్రేడిత ప్రభ లొసంగ

వారి బ్రహ్మవర్చస్సు (ఆధ్యాత్మిక తేజస్సు) ఉదయ సూర్యుడు–చంద్రుని కాంతులతో సమానంగా ప్రకాశిస్తోందని, రవి–శశి ప్రభలతో సమానమైన దివ్యకాంతి వారిలో వెలసిందని, తమతపోగ్ని జ్వాలతతి ధనంజయ హేతి సమితి కామ్రేడితోష్ణమ నొసంగ.

వారి దమము, తపస్సు అగ్నిజ్వాలలవలె దహించేవి. అది అర్జునుని (ధనంజయుడు) ఆయుధశక్తివలె శత్రువులను జయించగల సామర్థ్యం కలిగింది. తపస్సు వారి ఆయుధమై నిలిచింది.

దమ సత్యవాగ్వితానము శృతి సత్యప్రపూర్తి కామ్రేడిత పుష్టి నొసగ

వారి వాక్కు సత్యస్వరూపం. వేదసత్యాల పరిపూర్ణత వారిలో స్థిరపడింది. వారు చెప్పిన మాటలు శ్రుతుల ధర్మాన్ని ప్రతిపాదించే సత్యవాక్యాలు.

దమ శాంత గుణ సమృద్ధత్వము ముక్తి స్థ శాంతి కామ్రేడిత శాంతి నొసగ

వారి శాంతగుణం ముక్తిపదాన్ని అందించే శాంతి. వారి సమృద్ధ గుణసంపత్తి పరమశాంతినిస్తుంది

తే॥ గీ॥ భావం
దమ నిరాఘాట నిర్వచనము లభినవ వేదములు గాగ బ్రభవించ వెలసినట్టి

వారి దమము నిర్వచించలేనిది; అది కొత్త వేదాలవలె పుట్టి విస్తరించింది. వారు వేదస్వరూపులే.

హరితు డంబరీషుడు యవనాశ్వుడెలమి వంశకర్తలైదగు నార్ష వంశమదియ

అంబరీషుడు, యవనాశ్వుడు వంటి మహారాజులు పుట్టిన ఋషివంశమిదే. ఈ వంశం ఋషుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించిన పవిత్ర పరంపర.

ఈ పద్యం ఋషివంశాన్ని బ్రహ్మతేజస్సు, తపస్సు, సత్యవాక్యము, శాంతి వంటి గుణాల సమాహారంగా రాయబడింది. వారి వంశంలో పుట్టిన రాజులు కూడా ధర్మనిరతులు, భక్తిపరులు. ఋషుల దమము వేదరూపంగా వికసించి, రాజవంశాలను ధర్మమార్గంలో నడిపించిందని కవి సూచిస్తున్నారు.

ఈ పద్యం హరితస గోత్ర గొప్పతనాన్ని తెలియజేస్తున్నది.

హరితస గోత్రమనందగె
బరమత ఖండన పటు ప్రభావ ప్రతిభా
కర భాష్యకార పర్యవ
తరణ సుపూతమై వెలుఁగు దద్గోత్రమునన్.-19

భావము:

హరితస గోత్రమనందగె

హరితస గోత్రం ఆనందభరితమై, మహిమతో నిండినదై ఉంది.

పరమత ఖండన వటు ప్రభావ ప్రతిభాకర

ఇతర మతాల వాదాలను ఖండించే వటువుల (విద్వాంసుల) ప్రభావం, ప్రతిభతో ప్రకాశించింది.

ఈ గోత్రంలో పుట్టినవారు తర్కశాస్త్రంలో, వాదవివాదాల్లో అగ్రగాములు.

భాష్యకార వర్య అవతరణ సుపూతమై

ఈ గోత్రంలో శ్రేష్ఠ భాష్యకారులు అవతరించడంతో అది పవిత్రమైంది.

వేదాలు, శాస్త్రాలకు వ్యాఖ్యానాలు చేసిన మహానుభావులు ఈ వంశాన్ని కీర్తింపజేశారు.

వెలుగు దద్గోత్రమునన్

ఆ మహనీయుల వల్ల ఈ గోత్రం లోకానికి వెలుగునిచ్చే దివ్యవంశంగా ప్రసిద్ధి చెందింది.

తాత్పర్యం:

ఈ పద్యం హరితస గోత్రాన్ని మూడు ముఖ్య గుణాలతో కీర్తిస్తున్నది:

వాదవివాదాలలో పరమత ఖండన శక్తి;అసాధారణ ప్రతిభ; శ్రేష్ఠ భాష్యకారుల అవతారం;

అంటే – ఈ వంశం కేవలం వంశపరంపర కాదు; అది జ్ఞానప్రవాహానికి మూలాధారం.

నాకు తెలిసినంత వరకు హరితస గోత్రం సంబంధించిన పురాణ, వేద ఆధారాలు..

 1. హరితస గోత్ర ప్రస్తావన

“హరిత” అనే మహర్షి వంశంలో పుట్టినవారే హరితస గోత్రీకులు.

హరిత మహర్షి వేదకాలానికి చెందిన ఋషిగా చెబుతారు.

గోత్ర వ్యవస్థలో ఆయనే ప్రవరపురుషుడు (ఆదిముని).

 2. వేద సంబంధం

హరిత మహర్షి పేరు వేదానుబంధ గ్రంథాలలో, ముఖ్యంగా గృహ్యసూత్ర–ప్రవర ప్రస్తావనలలో కనిపిస్తుంది.

ప్రవరలో త్రయా ఋషి గా ఇలా వస్తుంది:

ఆంగిరస–అమ్బరీష–యవనాశ్వ–హారిత

ఇక్కడ:

అంబరీషుడు, యవనాశ్వుడు. వీరు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులు.

హరితుడు ఆ వంశ సంబంధ ఋషిగా గౌరవింపబడతాడు.

దీంతో హరితస గోత్రం ఋషి–రాజ వంశ పరంపరతో కలసి ఉన్నట్టు తెలుస్తుంది.

3. పురాణ ప్రస్తావన

విష్ణు పురాణము, భాగవత పురాణము వంటి పురాణాలలో ఇక్ష్వాకు వంశ ప్రస్తావనలో అంబరీషాది రాజుల కీర్తి కనిపిస్తుంది.

హరితుడు కొంతమంది ఆచార్యుల అభిప్రాయం ప్రకారం:

అంబరీషుని వంశసంబంధుడు,క్షత్రియునిగా పుట్టి బ్రహ్మర్షిత్వం పొందినవాడు,ధర్మప్రతిష్ఠాపకుడు

అందుకే హరిత గోత్రం “క్షత్రబ్రాహ్మణ” మూలం కలిగినదిగా కూడా చెప్పబడుతుంది.

 4. ధర్మశాస్త్ర సంబంధం

మనుస్మృతి వంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో గోత్రప్రవర వ్యవస్థ వివరాలు వస్తాయి.

అందులో హారిత ప్రవర కూడా గణించబడింది.

5. తాత్త్వికక విశేషం

హరిత గోత్ర మహిమ ఏమిటంటే:

వేదాధ్యయనం;భాష్య రచన;పరమత ఖండన శక్తి;

రాజధర్మ–బ్రహ్మధర్మ సమన్వయం.. మొదలైన గొప్ప గుణాలున్నవారున్నారు.

అందుకే.. పెద్దనాయన

“పరమత ఖండన వటు ప్రభావ ప్రతిభా కర భాష్యకార వర్య”

అని ప్రశంసించాడు.

మొత్తంగా చెప్పాలంటే..

హరితస గోత్రం: వేద మూలాధారం కలిగినది;ఇక్ష్వాకు వంశ సంబంధం గలది;ఋషి–రాజ ధర్మ పరంపర కలిగినది;జ్ఞాన, తపస్సు, వాదశక్తి సమన్విత వంశం.

తే॥ గీ॥
వివిధ విద్యా విశేష వివేక భాగ్య
మే దురయశః సమున్నత మేరు శాఖ
యనగ నొక శాఖ యవతారమందె క్షాత్ర
వేద విద్యానిధాన మార్వేల శాఖ॥.. 20

వివిధ విద్యా విశేష – అనేక విధాల విద్యా ప్రావీణ్యం;

వివేక భాగ్య – వివేచనశక్తి అనే మహాభాగ్యం కలది;

యశః – ఘనమైన కీర్తి;

సమున్నత మేరు శాఖ – మేరు పర్వతంలా ఉన్నతమైన వంశశాఖ;

యనగ నొక శాఖ అవతారమందె – అట్టి వంశంలో ఒక శాఖగా అవతరించి;

క్షాత్ర వేద విద్యా నిధాన – క్షత్రధర్మం మరియు వేదవిద్యల నిధి;

ఆర్వేల శాఖ – ఆరు వేల నియోగ శాఖ.

భావం:

అనేక విద్యలలో విశేష ప్రావీణ్యమూ, వివేకసంపద అనే మహాభాగ్యమూ కలిగి, ఘనమైన కీర్తితో మేరు పర్వతంలా ఉన్నతమైన వంశశాఖలో – అటువంటి గొప్ప వంశంలో ఒక శాఖగా ఏర్పడి, క్షత్రవీర్యమూ వేదవిద్యా సంపదల నిధిగా వెలిగినది ఆరువేలనియోగి వంశశాఖ.

ముందు పద్యాలలో దేవుని స్తుతి,కృతిసమర్పణ భావం,విశ్వరక్షకుడైన పరమాత్మ మహిమను కలుపుతూ..

ఇప్పుడు ఈ పద్యంలో దైవానుగ్రహం పొందిన వంశ వైభవం చెప్తున్నారు.

అంటే.. దేవుని మహిమ చెప్పిన తర్వాత, ఆయన అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన వంశ పరిచయం చేసారు.

ఇది సాధారణంగా వంశకావ్యాలలో కనిపించే క్రమం:

మంగళాచరణం.. దైవస్తుతి.. వంశస్థాపన.. దైవానుగ్రహం పొందిన వంశ మహిమ చెప్తూ కథలోకి అడుగు పెడుతున్నారు.

(సశేషం)

Exit mobile version